‘లేజర్‌’తో  యాంజియోప్లాస్టీ..! | What Is Laser Angioplasty Its Condition And Treatment | Sakshi
Sakshi News home page

‘లేజర్‌’తో  యాంజియోప్లాస్టీ..! గుండె జబ్బుల చికిత్సలో ఎందుకు ఉపయోగిస్తున్నారు?

Published Sun, Nov 5 2023 2:51 PM | Last Updated on Thu, Nov 9 2023 11:17 AM

What Is Laser Angioplasty Its Condition And Treatment - Sakshi

కొన్నిసార్లు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాక్స్‌) ఏర్పడ్డప్పుడు బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ వంటి అనేక ప్రక్రియలు చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ యాంజియోప్లాస్టీ ద్వారా ఇటీవల అనేకమంది గుండెజబ్బుల బాధితులను రక్షిస్తున్న సంగతులూ తెలిసినవే. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ యాంజియోప్లాస్టీ ప్రక్రియను లేజర్‌ సహాయంతో మరింత సురక్షితంగా చేయడం ద్వారా, మంచి ఫలితాలను సాధించవచ్చని తేలింది. గుండెజబ్బుల చికిత్సలో నూతన సాంకేతికతకూ, పురోగతికీ ప్రతీక అయిన ఈ సరికొత్త ‘లేజర్‌ యాంజియోప్లాస్టీ’ గురించి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. 

‘లేజర్‌ యాంజియోప్లాస్టీ’ గురించి తెలుసుకునే ముందు కరోనరీ యాంజియోప్లాస్టి అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే  నాళాల్లో అడ్డంకులున్నప్పుడు, శస్త్రచికిత్స చేయకుండానే... చేతి లేదా కాలి దగ్గరున్న రక్తనాళం నుంచి చిన్న పైపుల్ని పంపి గుండె రక్తనాళాల వరకు చేరతారు. ఇక్కడ అడ్డంకులను తొలగించడం, నాళం సన్నబడ్డ లేదా అడ్డంకి ఉన్న చోట బెలూన్‌ను ఉబ్బించి, నాళాన్ని వెడల్పు చేసి, స్టెంట్‌ వేసి, రక్తం సాఫీగా ప్రవహింపజేసే ప్రక్రియనే ‘కరోనరీ యాంజియోప్లాస్టీ’ అంటారు. 

ఈ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారంటే... 
రక్తనాళాల్లో అడ్డంకులు/బ్లాకులనేవి అక్కడ కొవ్వు పేరుకుపోవడంవల్ల ఏర్పడతాయి. యాంజియోప్లాస్టీలో... ముందుగా బ్లాక్‌ ఉన్న రక్తనాళంలోకి ఓ పైప్‌ను ప్రవేశపెడతారు. దీన్ని ‘గైడింగ్‌ క్యాథేటర్‌’ అంటారు. ఆ పైపులోంచి వెంట్రుక అంత సన్నటి తీగను... అడ్డంకిని సైతం దాటేలా... రక్తనాళం చివరివరకు పంపిస్తారు. ఈ సన్నటి తీగనే ‘గైడ్‌ వైర్‌’ అంటారు. ఒకసారి గైడ్‌ వైర్‌ అడ్డంకిని దాటి చివరి వరకు వెళ్లాక, గైడ్‌ వైర్‌ మీది నుంచి ఒక బెలూన్‌ని బ్లాక్‌ వరకు పంపిస్తారు. బ్లాక్‌ను దాటి వెళ్ళగానే, ఆ బెలూన్‌ని పెద్దగా ఉబ్బేలా చేస్తారు.

ఒకసారి బెలూన్‌ సహాయంతో, రక్తనాళాన్ని తగినంతగా వెడల్పు చేశాక...  ఆ బెలూన్ని వెనక్కి తీసుకువచ్చి, దాని స్థానంలో ఒక స్టెంట్‌ని ప్రవేశపెడతారు. స్టెంట్‌ అనేది లోహంతో తయారైన స్థూపాకారపు వల (జాలీ) వంటి పరికరం. ఇలా ఈ స్టెంట్‌ను... వేరొక బెలూన్‌ సహాయంతో బ్లాక్‌ ఉన్నచోట అమరుస్తారు. అలా అమర్చిన స్టెంట్‌ ని వేరొక బెలూన్‌తో బాగా ఎక్కువ ఒత్తిడితో రక్తనాళం గోడకు పూర్తిగా అనుకునేలా చూస్తారు. దీంతో యాంజియోప్లాస్టీ పూర్తవుతుంది. 

యాంజియోప్లాస్టీలో వచ్చే ఇబ్బందులు
కొన్నిసార్లు యాంజియోప్లాస్టీని నిర్వహించే సమయంలో గైడ్‌ వైర్‌ బ్లాక్‌ను దాటి ముందుకు వెళ్లలేకపోవచ్చు. ఒక్కో సారి... దాటి వెళ్ళినప్పటికీ, దానిమీది  నుంచి బెలూన్‌ వెళ్లలేకపోవచ్చు. కొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల... బెలూన్‌తో ఉబ్బించే ప్రక్రియ చేసినప్పటికీ... ఆ బ్లాక్‌ తొలగకపోవచ్చు. ఇంకొన్నిసార్లు రక్తనాళం అడ్డంకులలో రక్తం గడ్డకట్టడం వల్ల బెలూనింగ్‌ చేసినప్పుడు... ఆ రక్తం గడ్డలు నాళంలోనే మరోచోటికి వెళ్లి, రక్త ప్రవాహానికి అవరోధంగా మారవచ్చు. ఈ ఇబ్బందుల్ని అధిగమించటానికి ఇప్పుడు లేజర్‌ ప్రక్రియని వాడుతున్నారు. 

అసలు లేజర్‌ అంటే ఏమిటి? 
లైట్‌ యాంప్లిఫికేషన్‌ బై స్టిమ్యులేటెడ్‌ ఎమిషన్‌ ఆఫ్‌ రేడియేషన్‌’ అన్న పదాల సంక్షిప్త రూపమే ‘లేజర్‌’. దీని సాంకేతిక అంశాలు ఎలా ఉన్నా, అందరికీ తేలిగ్గా అర్థమయ్యే రీతిలో ఇలా చెప్పవచ్చు. మామూలుగా కాంతి కిరణాలు నిర్దిష్టమైన వేవ్‌లెంగ్త్‌తో ప్రసరిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ ఒక క్రమబద్ధమైన ఏకరీతితో మరింత శక్తిమంతంగా ప్రసరింపజేసినప్పుడు వెలువడే కిరణాన్ని ‘లేజర్‌’ అనవచ్చు. శక్తిమంతమైన ఈ కాంతికిరణాల్ని (లేజర్‌లను) అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. వైద్య చికిత్సల్లోనూ అనేక రకాలైన లేజర్లు వినియోగిస్తుంటారు. ఇలాంటి అనేక లేజర్లలో గుండె కోసం వాడే వాటిని ‘ఎగ్జిమర్‌ లేజర్‌’ అంటారు. 

లేజర్‌తో అడ్డంకుల తొలగింపు ఎలాగంటే...?
లేజర్‌ కిరణాలు మన కణజాలాలని తాకినప్పుడు మూడు రకాల ఫలితాలు కనిపిస్తుంటాయి. అవి... ఫొటో కెమికల్, ఫొటో థర్మల్, ఫొటో కైనెటిక్‌ ఎఫెక్ట్స్‌. ఈ ప్రభావాల సహాయంతో అక్కడ పేరుకున్న వ్యర్థ కణజాలాన్ని (దాదాపుగా) ఆవిరైపోయేలా చేయవచ్చు. రక్త
నాళంలోని అడ్డంకులనూ అదేవిధంగా ఆవిరైపోయేలా చేయడానికి లేజర్‌ సహాయం తీసుకుం టారు.  

ఏయే దశల్లో లేజర్‌ను ఎలా ఉపయోగిస్తారంటే... 

  • గైడ్‌ వైర్‌ మీదనుంచి బెలూన్‌ వెళ్లలేకపోయిన సందర్భాల్లో లేదా బెలూన్‌ ద్వారా బ్లాక్‌ను  మార్చలేకపోయినప్పుడు. ∙రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడిన బ్లాక్స్‌ ఉన్నప్పుడు, అవి మరోచోటికి చేరి మళ్లీ రక్తప్రవాహానికి అవరోధంగా మారకుండా చూడటానికి. 
  • గుండె రక్తనాళాల్లో సంపూర్ణంగా, చాలాకాలం నుంచి ఉండిపోయిన మొండి బ్లాక్‌లను తొలగించడానికి. ∙కాల్షియం అధికంగా ఉన్న గుండె రక్తనాళాల్లో బ్లాక్‌ని తొలగించడానికి. ఒకసారి వేసిన స్టెంట్లో మరోసారి అడ్డంకి బ్లాక్‌ ఏర్పడినప్పుడు రక్తనాళం మొదట్లో ఉన్న అడ్డంకులు, లేదా మరీ పొడవుగా ఉన్న అడ్డంకుల్ని  అధిగమించేందుకు.

ఇది యాంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయమా?  
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలతో  లేజర్‌ యాంజియోప్లాస్టీ అన్నది... సంప్రదాయ యాంజియోప్లాస్టీ కన్నా తక్కువ ఖర్చుతో రక్తనాళంలోని అడ్డంకుల్ని తొలగించడానికి ఉపయోగపడుతుందన్న అర్థం స్ఫురిస్తోంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. లేజర్‌ని యాంజియోప్లాస్టిలో ఒక అనుబంధ విధానంగా వాడుకోవచ్చుగానీ లేజర్‌ అనేదే ఆంజియోప్లాస్టీకి ప్రత్యామ్నాయం కాదు. బాధితులందరికీ ఈ లేజర్‌ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. లేజర్‌కు అయ్యే ఖర్చు ఎక్కువే కాబట్టి... కేసు తీవ్రతను బట్టి ఎవరికి అవసరం అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ణయించే అంశమిది. కేవలం చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది అవసరం పడవచ్చు.



 


 

--డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎస్‌. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌     
 

(చదవండి: రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement