అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్‌మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్
ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది.
ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం
అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్‌రేట్‌లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు.
అందరికీ అందుబాటు ధరల్లో..
అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి.
అనేక రకాలు..:
అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్‌తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్‌గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్‌లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి.
అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు.
అక్వేరియం ఆరోగ్యదాయిని..
అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్‌లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్‌ను పెంచడమేగాక వారికి రిలాక్స్‌నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు
ఒత్తిడిని అధిగమించాను..
బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్‌వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా
మెయింటెనెన్స్ సులభమే..
అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్‌ఫామ్‌లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment