ECMO
-
ఎక్మో ఎలాంటి సందర్భాల్లో వాడతారో తెలుసా?
ఇటీవల ఎక్మో అనే మాట చాలా సందర్భాల్లో వినిపించింది. తాజాగా ప్రముఖ సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రికి అమర్చిన ఈ వైద్య పరికరాన్ని గతంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, అంతకు మునుపు తమిళనాడు మాజీ సీఎం జయలలిత.. లాంటి చాలామంది ప్రముఖులకు వాడారు. అలా ఇటీవల చాలా సందర్భాల్లో ఎక్మో అనే మాట వినిపించింది. అసలీ ఎక్మో అంటే ఏమిటో, దాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతారనే విషయాలపై అవగాహన కోసం ఈ సంక్షిప్త కథనం. ఈసీఎంఓ అనే ఇంగ్లిష్ పొడి అక్షరాలు ‘ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్’ అనే పదాల ముందక్షరాలు. వీటన్నింటినీ కలిపి ‘ఎక్మో’ అంటారు. పేరునుబట్టే ఇది గాల్లోని ఆక్సిజన్ సమర్థంగా అందిస్తుందని తెలుస్తుంది. ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ అని కూడా చెప్పే ఈ ఉపకరణాన్ని... ఊపిరితిత్తులు తమంతట తామే శుభ్రమైన ఆక్సిజన్ తో కూడిన (ఆక్సీజనేటెడ్) రక్తాన్ని అందించలేనప్పుడు వాడుతారు. ఎలా పని చేస్తుంది? ఎక్మో రెండు రకాలు. ఒకటి ఏ–వీ ఎక్మో, మరొకటి...వి–వి ఎక్మో.. ఇందులో వీ–వీ (వీనో–వీనస్) ఎక్మోను ఊపిరితిత్తుల పనితీరు బాగాలేనప్పుడు వాడతారు. అలాగే వీ–ఏ (వీనో – ఆర్టరీ) ఎక్మోను గుండె పనితీరు బాగాలేనప్పుడు (కార్డియో పల్మునరీ సపోర్ట్‌గా)వాడుతారు. ఎక్మో పరికరంలో ఆక్సిజనేటర్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ పరికరం, అలాగే పంప్ అనేవి ముఖ్యమైన భాగాలు. మొదటగా ఒక పైప్ (డ్రైనేజ్ కాన్యులా) ద్వారా తొడలోని సిర నుంచి రక్తాన్ని తీసుకుని, అందులోంచి కార్బన్ డైయాక్సైడ్‌ను తొలగిస్తారు. తర్వాత ఆక్సిజన్‌ను రక్తంలోకి ఇంకేలా చేస్తారు. ఇలా చేశాక... ఆ శుద్ధి అయిన రక్తాన్ని మళ్లీ గుండెకు దగ్గర్లో ఉన్న సిరలోకి (వి–వి ఎక్మో) లేదా ధమనికి (వి–ఏ ఎక్మో) రిటర్న్ కాన్యులా ద్వారా పంపిస్తారు. అంతేకాదు... దానికి అమర్చి ఉన్న మానిటర్ మీద నాడి కొట్టుకునే స్పందనలూ, రక్తం ఎంత వేగంతో ప్రవహిస్తోందనే అంశాలు ఎప్పటికప్పుడు నమోదవుతూ ఉంటాయి. ఇదీ సంక్షిప్తంగా ఎక్మో పనిచేసే తీరు. నిజానికి ఇది గుండె చేసే పని కంటే ఊపిరితిత్తులు చేసే పనిని సమర్థంగా నిర్వహిస్తుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ రోగగ్రస్థమైన వారికేనా? పైన పేర్కొన్న సెలబ్రిటీ ఉదాహరణలతో ఊపిరితిత్తులు బాగా చెడిపోయి, ఆక్సిజన్ అందని స్థితికి చేరిన బాధితులకే అమర్చుతారా అనే సందేహం వస్తుంది. కానీ కేవలం అలాంటి సందర్భాల్లోనే కాదు... గుండె మార్పిడి / ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స వంటివి జరిగినప్పుడు కూడా దీన్ని అమరుస్తారు. ఉదాహరణకు గుండె / ఊపిరితిత్తులు ఏమాత్రం పనిచేయని వారిలో బయటి దాతల నుంచి గుండె / ఊపిరితిత్తులను సేకరించి, అమర్చినప్పుడు ఒక్కోసారి వాటిని దేహం ఆమోదించదు. అలాంటి సమయాల్లో... బయటి గుండె/ఊపిరితిత్తులు దేహానికి అలవాటయ్యేవరకూ ‘ఎక్మో’ సహాయం తీసుకుంటారు. ‘ఎక్మో’తో సపోర్ట్ మొదలుపెట్టాక రోగి కోలుకుంటున్న తీరు నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. రోగి స్పందన తెలియడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజులైనా వేచిచూడాల్సి ఉంటుంది. అలా చూస్తూ... ‘ఎక్మో’ సపోర్ట్‌ను నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ పోతారు. ఈ సమయంల్లో అతడి ‘వైటల్స్’... అంటే పేషెంట్ పరిస్థితిని తెలిపే కీలకమైన కొలతలైన... పల్స్, బీపీ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడల్లా పల్స్ రేటూ, బీపీ, ఆక్సిజన్, కార్మబ్ డైఆక్సైడ్ శాతం... నార్మల్‌గా ఉన్నాయా అని చూస్తారు. అవి నార్మల్‌గా ఉన్నాయంటే రోగి కోలుకుంటున్నట్లు అర్థం. అలా క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తూ గుండె, ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు రోగి కోలుకుంటున్న క్రమాన్ని చూస్తూ... ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరెవరిలో... ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి సాధారణంగా గుండె ఆగినప్పుడు సీపీఆర్ ద్వారా స్పందనలు తిరిగి వచ్చి పంపు చేసే కేపాసిటి తక్కువ ఉన్నప్పుడు ఎక్మో ద్వారా రక్త ప్రసరణ జరిగి అన్ని అవయవాలు గుండె తిరిగి సాధారణ స్థితిలో పని చేయడానికి దోహదపడుతుంది. ఎక్మోతో పాటు బాధితుడికి డయాలసిస్ కూడా చేయాల్సినప్పుడు పేషెంట్ నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి నేరుగా వెళ్లేలా కాకుండా... ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా అయ్యేలా చూస్తారు. గుండె ఆగిపోయిన సందర్భాల్లో దాని స్పందనలను పునరుద్ధరించడానికి బాధితుడి ఛాతీ మీద రెండు చేతులతోనూ నొక్కుతున్నట్లు చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేస్తూ, రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించగానే వెంటనే ఎక్మో అమరుస్తారు. సాధారణంగా గుండె ఆగిపోగానే సీపీఆర్ ఇచ్చి, ఎక్మో ద్వారా రక్తప్రసరణ నార్మల్‌గా జరుగుతుంటే దేహంలో అన్ని అవయవాలూ సజావుగా పనిచేస్తున్నట్లే అనుకోవచ్చు. అప్పుడు క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్‌ను తగ్గించుకుంటూ పోతారు. ఇలా చేసే సమయంలో ఎక్మో సపోర్ట్‌ను తగ్గిస్తున్నా... రోగిలోని వ్యవస్థలు తమంతట తాము స్వయంగా తమ విధులను నిర్వహించుకోలేని సందర్భాల్లో మాత్రమే రోగి కోలుకోవడం లేదనే నిర్ధారణకు డాక్టర్లు వస్తారు. చివరగా... ఎక్మో అమర్చడం ఓ చివరి ప్రయత్నంగా చేసే పని. దానిపై కొన్ని అపోహలున్నప్పటికీ... కొన్ని సందర్భాల్లో రోగులు పూర్తిగా కోలుకుని, వారు పూర్తిగా మళ్లీ తమ పూర్వస్థితికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. సక్కెస్ రేటు తక్కువా? సెలబ్రిటీల ఉదాహరణలతో గానీ లేదా గుండె, ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు అమర్చుతారనే సందర్భాల వల్లగానీ ‘ఎక్మో’ పరికరంపై కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. అందులో మొదటిది... దీన్ని అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధితులు కోలుకునే అవకాశాలు తక్కువనీ లేదా ‘ఎక్మో’కు సక్సెస్ రేటు తక్కువనే అపప్రధ ప్రజల్లో ఉంది. దీనికి కారణం... ఓ పేషెంట్‌కు ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది చాలా తీవ్రంగా రోగగ్రస్థమైన స్థితి. అంతటి పరిస్థితుల్లో కోలుకునే అవకాశాలు వాస్తవంగా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ... చాలా సందర్భాల్లో గుండెకు సంబంధించిన బాధితుల్లో 40 – 50 శాతం, ఊపిరతిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారిలో 60 – 70 శాతం సక్కెస్ రేటు ఉంటాయి. అంతగా రోగసిక్తమైనప్పటికీ 70 శాతం అంటే నిజానికి మంచి విజయావకాశాలు ఉన్నట్లే లెక్క. కానీ రోగి వయసు, అతడికి ఇంతకుముందే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు, ఇతర అనారోగ్యాలూ, రోగనిరోధక శక్తి, కోలుకునే సామర్థ్యం... లాంటి అనేక అంశాలు ఈ విజయావకాశాల (సక్సెస్ రేటు)ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ అపోహ. డాక్టర్ శ్రీనివాస కుమార్ రావిపాటి సీనియర్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ -
అద్భుతం: 109 రోజులు వెంటిలేటర్‌పైనే.. చివరకు
చెన్నై: ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యి.. దాదాపు 109 రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్న ఓ కోవిడ్ రోగి ఊపిరితిత్తుల మార్పిడి లేకుండానే కోలుకున్నాడు. ఈ వింత సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చెన్నై వ్యాపారవేత్త మహ్మద్ ముదిజా(56) ఏప్రిల్ చివర్లో కోవిడ్ బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అతన్ని ఎక్మో చికిత్సపై ఉంచారు. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ అవసరమైన సందర్భంలో కూడా అతడికి చికిత్స కొనసాగించారు. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ముదిజా దాదాపు నాలుగు వారాల పాటు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం చూశాడు. అయితే సెకండ్ వేవ్ ఉధృతిగా ఉన్న సమయంలో అతనికి ఆ అవయవం దొరకలేదు. ఈ క్రమంలో పూర్తిగా ధ్వంసమైన ఊపిరితిత్తులకు డాక్టర్లు ఎక్మో చికిత్స చేపట్టారు. సుమారు 62 రోజుల పాటు ఎక్మో చికిత్స జరిగింది. ఎటువంటి ట్రాన్స్‌ప్లాంటేషన్ లేకుండా.. అత్యధిక రోజులు ఎక్మో ట్రీట్మెంట్ పొందిన వ్యక్తిగా ముదిజా రికార్డుకెక్కాడు. దాదాపు 109 రోజుల తర్వాత ముదిజా ఊపిరితిత్తులు కుదుటపడ్డాయి. ప్రస్తుతం వీల్‌చైర్‌పై ఉన్నాడు ముదిజా. ఈ సందర్భంగా ముదిజా మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు రెండవ జన్మ, చికిత్స సమయంలో డాక్టర్లు చెప్పినట్లు చేశాను. నమ్మకం కోల్పోలేదు. దేవుడిపై భారం వేశాను’’ అన్నాడు. చికిత్స సమయంలో ముదిజా అమితమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించినట్లు డాక్టర్లు తెలిపారు. రెలా హాస్పిటల్లో ముదిజా ఎక్మో చికిత్స తీసుకున్నాడు. ఎక్మో ట్రీట్మెంట్కు ప్రతి నెలా 40 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు. -
అరుదైన చికిత్సతో చిన్నారికి పునర్జన్మ
రాంగోపాల్‌పేట (హైదరాబాద్): గర్భంలోని పిల్లలు అత్యంత అరుదుగా మలవిసర్జన చేస్తారు. అప్పుడు అది ఉమ్మనీరులో కలసి తిరిగి వాళ్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సరిగ్గా ఇలాంటి సమస్యకు గురైన ఓ శిశువుకు ఎక్మో చికిత్సతో పునర్జన్మనిచ్చారు కిమ్స్ వైద్యులు. ఆ వివరాలను ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ డాక్టర్ వి.నందకిశోర్ బుధవారం వెల్లడించారు. ఉప్పల్‌కు చెందిన స్రవంతికి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పాప పుట్టినప్పుడు బాగానే ఉన్నా కొద్దిసేపటికే ఊపిరి పీల్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడసాగింది. దాంతో చిన్నారిని వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్ ద్వారా గాలి అందించారు. గర్భంలో ఉండగా మల విసర్జన చేయడంతో అది ఊపిరితిత్తుల్లోకి చేరి పాపకు రక్తపోటు (పల్మనరీ హైపర్‌టెన్షన్) బాగా ఎక్కువైనట్లు గుర్తించారు. దాంతో ప్రత్యేకమైన ఔషధం, గ్యాస్ (ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్) కూడా అందించి రక్తపోటు తగ్గించారు. ఇంత చికిత్స చేసినా పాప పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఎక్మో ఆధారంగా చికిత్స చేశారు. ఈ క్రమంలో పాపకు ఐదు రోజుల పాటు ఎక్మో సాయం అవసరమైంది. ఆ తర్వాత మరో ఐదు రోజులు ఐసీయూలో ఉంచి పర్యవేక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. చిన్నారి ఇప్పుడు పాలు కూడా తాగగలుగుతోందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ నందకిశోర్ తెలిపారు. కాగా, చిన్నారికి ఎదురైన అరుదైన పరిస్థితుల్లాంటివి వచ్చినప్పుడు ఊపిరితిత్తులు చేసే పనిని ఎక్మో చేస్తుందని ఆయన చెప్పారు. అంటే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడుతుందని వివరించారు. తద్వారా ఊపిరితిత్తులు కోలుకోవడానికి సమయం, విశ్రాంతి దొరుకుతాయన్నారు. ఎక్మో సర్క్యూట్లో ఉండే కృత్రిమ ఊపిరితిత్తులకు (ఆక్సిజనేటర్) రక్త ప్రసరణ మళ్లిస్తారని చెప్పారు. గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా దెబ్బతిని, సంప్రదాయ చికిత్స పద్ధతులతో నయం కాని పరిస్థితుల్లో ఎక్మోను ప్రయోగిస్తారని పేర్కొన్నారు. అన్ని వయస్సుల వారికీ ఈ చికిత్స చేయవచ్చని చెప్పారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఎక్మో చికిత్స చేయడం కిమ్స్ ఆస్పత్రిలో ఇది రెండోసారని వెల్లడించారు. -
కరోనా: ఎక్మో చికిత్సతో పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ బారిన పడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ మహిళకు ఎక్మో చికిత్స విధానంతో పునర్జన్మనిచ్చారు యశోద ఆస్పత్రి వైద్యులు.. ప్రస్తుతం బాధితురాలు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన భారతి (58) కోవిడ్ బారిన పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను చికిత్స కోసం బంధువులు సెప్టెంబర్ 16న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమెకు శ్వాస సమస్యలు ఎదురవ్వడంతో వైద్యులు ఐసీయూకి తరలించారు. 17న ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ 80 నుంచి 90లోపు నమోదైంది. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించింది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు కూడా స్తంభించింది. చదవండి: ఆగే గుండెకు ఆయువు పోస్తుంది.. మృత్యువుతో పోరాడుతున్న ఆమెను బతికించాలంటే ఎక్మో (ఎక్స్ట్రా కార్పొరియల్ మెంబ్రైన్ ఆక్సిజనేషన్) చికిత్స విధానం ఒక్కటే పరిష్కారమని భావించారు. బంధువులూ ఎక్మోకు అంగీకరించడంతో 19న ఆ చికిత్స ప్రారంభించారు. ఇదే సమయంలో బ్రాంకోస్కోపి నిర్వహించి, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియాను తొలగించారు. తద్వారా స్తంభించిపోయిన గుండె, ఊపిరితిత్తుల పనితీరు క్రమంగా మెరుగుపడింది. సరిగ్గా పది రోజులకు ఎక్మోను తొలగించారు. ప్రస్తుతం ఆమె కోవిడ్ నుంచి బయట పడటమే కాకుండా అవయవాల పనితీరు కూడా మెరుగుపడినట్లు వైద్యులు ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీన ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి, రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో ఆమెను ఇంటికి పంపినట్లు ఆస్పత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ హరికిషన్ గోనుగుంట్ల తెలిపారు. చదవండి: ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టుపై దాడి -
ఆగే గుండెకు ఆయువు పోస్తుంది..
సాక్షి, హైదరాబాద్: ఎక్మో మెషీన్.. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రస్తుతం ఈ యంత్రం మీదే చికిత్స అందిస్తున్నారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ కేర్ ఆసుపత్రి వైద్యులు కూడా కరోనాతో సీరియస్ కండిషన్లో ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన పిల్లల డాక్టర్ దయానంద్ సాగర్‌కు ఎక్మో పద్ధతిలోనే విజయవంతంగా చికిత్స చేశారు. 2016లోనూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకూ ఇదే పద్ధతిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది.. ఇంతకీ ఏంటీ ఎక్మో? అపర సంజీవనే.. సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకు వచ్చే సమయంలో అత్యవసరంగా ఈ ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబరే ఆక్సిజనేషన్(ఎక్మో) యంత్రం మీద ఉంచి చికిత్స అందిస్తారు. కీలక ఘడియల్లో ఊపిరితిత్తుల పనిని, అవసరమైతే గుండె పనిని కూడా బయటే పూర్తిచేసి శరీరాన్ని నిలబెట్టే సంక్లిష్టమైన ప్రత్యేక చికిత్సా విధానం ఇది. వెంటిలేటర్‌తో కూడా ఉపయోగం లేని సందర్భాల్లో రోగి ప్రాణ రక్షణ కోసం ‘ఎక్మో’చికిత్సా పద్ధతి కీలకమైంది. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి కణానికీ రక్తం అవసరం. రక్తం నిరంతరాయంగా అందుతుంటేనే శరీరంలోని కణాలు, అవయవాలన్నీ సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో రక్త సరఫరా నిలిచిపోతే ఆ కణాలు చచ్చిపోతాయి. మృత్యువు ముంచుకొస్తుంది. అలాగే రక్తాన్ని శరీరమంతా సరఫరా చేసేది గుండె. ఆక్సిజనేషన్(రక్తంలోకి ఆక్సిజన్‌ను చేర్చడం) చేసేది ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులు సరిగా పనిచేయకపోతే ఆక్సిజనేషన్ జరగదు. దీంతో ప్రాణవాయువు(ఆక్సిజన్) లేని చెడు రక్తమే ఒళ్లంతా తిరుగుతుంటుంది. ఆక్సిజన్ తగినంత అందక అవయవాలన్నీ దెబ్బతినిపోతుంటాయి. అందుకే గుండె, ఊపిరితిత్తులూ రెండూ సమర్థంగా పనిచేస్తుండటం చాలా అవసరం. ‘ఎక్మో’ఏం చేస్తుందంటే? ఎవరికైనా గుండె, ఊపిరితిత్తులు రెండూ విఫలమైపోతే అప్పుడు ఎక్మో పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ యంత్రంలో రోగి శరీరంలోని రక్తనాళాల్లోకి, లేదా నేరుగా గుండెలోకి అమర్చేందుకు ప్రత్యేకమైన గొట్టాలుంటాయి. ఈ గొట్టాలను రోగి మెడ దగ్గర నుంచి గానీ, తొడ దగ్గరగానీ లోనికి పంపి రక్తనాళాల్లో అమరుస్తారు. ఈ గొట్టాలను బయట ఎక్మో యంత్రానికి అనుసంధానిస్తారు. ఇది రోగి రక్తాన్ని ఒక గొట్టం ద్వారా బయటకు తీసుకువచ్చి, యంత్రంలో ఆక్సిజనేషన్ చేసి, ప్రాణవాయువుతో కూడిన మంచి రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు అందిస్తుంది. అంటే ఊపిరితిత్తులు, గుండె ఈ రెండింటి పనినీ ఎక్మో బయట నుంచి చేస్తుందన్నమాట. గుండె, ఊపిరితిత్తుల పనిని బయటే కృత్రిమంగా చేయిస్తుండటం వల్ల వాటికి విశ్రాంతి దొరుకుతుంది. తద్వారా అవి త్వరగా కోలుకుంటాయి. అలాగే శరీరంలో అవయవాలు దెబ్బతినే ప్రమాదమూ తప్పుతుంది. ఉన్నట్టుండి గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతిన్న వాళ్లకు ఇది ప్రయోజనకరం. ఎక్మో విధానంలో రెండు మూడు వారాల పాటు చికిత్స ఇవ్వవచ్చు. ఊపిరితిత్తుల వైఫల్యం కారణంగా ఎక్మో పెట్టిన వాళ్లకు ఫలితాలు బాగుంటున్నాయి. వీరు 70–80 శాతం వరకూ కోలుకుంటున్నారు. గుండె దెబ్బతినటం వల్ల ఎక్మో పెట్టిన వాళ్లలో ఫలితాలు అంత గొప్పగా ఉండటం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంత సంక్లిష్టత.. మరికొన్ని సమస్యలు ఎక్మో చికిత్స కోసం రక్తాన్ని బయటకు తీసుకువచ్చేందుకు, మళ్లీ లోపలికి పంపేందుకు గొట్టాలను అమర్చటమే కష్టం. రక్తస్రావం అవడం, రక్తపు గడ్డలు ఏర్పడటం, రక్త నాళాలు చిట్లిపోవటం వంటి సమస్యలన్నీ ఉంటాయి. ఇన్ఫెక్షన్లు రావచ్చు. అలాగే రక్తాన్ని బయట శుద్ధి చేస్తుండే క్రమంలో కొన్నిసార్లు రక్తంలోని ప్లేట్లెట్లు, తెల్లరక్తకణాల వంటివి దెబ్బతినిపోతుంటాయి. ఇది మరో సమస్య. అయితే వైద్యులు వీటిని నిరంతరాయంగా పర్యవేక్షిస్తుంటారు. వీళ్లకు బాగా ఉపయోగం.. పుట్టుకతోనే గుండె లోపాలు లేదా పుట్టగానే శ్వాస సమస్యలతో బాధపడే చిన్నపిల్లల్లో ఎక్మో విస్తృతంగా వాడకంలో ఉంది. పెద్దల్లో కూడా ఊపిరితిత్తులు దెబ్బతిని, అవి సరిగా పని చేయని సంద ర్భాల్లో ఈ విధానాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. మరికొందరికి వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఉన్నట్టుండి గుండె కండరం విపరీతంగా వాచిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో గుండె పంపింగ్ పూర్తిగా దెబ్బతినిపోతుంది. ఇలాంటి వారికి వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గే వరకూ ‘ఎక్మో’బాగా ఉపయోగపడుతుంది. రక్తంలో ఇన్ఫెక్షన్ చేరిపోయి తీవ్రమైన ‘సెప్సిస్’ఉన్న వాళ్లకు.. రక్తంలోని విషతుల్యాల వల్ల ఒక్కోసారి గుండె పని ఆగిపోతుంది. ఇలాంటి వారికి కూడా తాత్కాలికంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. తీవ్రమైన నిమోనియా వచ్చి రెండు ఊపిరితిత్తులూ పని చేసే స్థితిలో లేనప్పుడు కూ డా ఇది ఆదుకుంటుంది. రోగి ఊపిరితిత్తులు బాగుపడుతున్న కొద్దీ, లేదా గుండె పంపింగ్ మెరుగవుతున్న కొద్దీ ఎక్మో మీద ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ వచ్చి చివరకు దీన్ని వైద్యులు పూర్తిగా తీసేస్తారు. -
టెక్కీని కాపాడింది కానీ జయను...
బెంగళూరు : కార్డియాక్ అరెస్టుకు గురై అసువులు బాసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చివరి ఘడియల్లో అందించిన ఎక్మో చికిత్స, ఓ టెక్కీ ప్రాణాలను కాపాడగలిగింది. అకస్మాత్తుగా తీవ్ర జ్వరంతో ఐసీయూ చేరిన 43 ఏళ్ల శ్రీనాథ్‌కు ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఎంతో ఆరోగ్యంగా ఉండే వ్యక్తికి ఇలా అయ్యే సరికి కుటుంబసభ్యులకు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ వెంటనే స్పందించిన డాక్టర్లు, ఇటీవలే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అందించిన ఎక్మో చికిత్సను టెక్కీకి అందించారు. దీంతో శ్రీనాథ్ గుండెను 24 గంటల లోపల తిరిగి మామూలు స్థాయికి చేరుకునేలా చేశారు. జయలలితకు, ఇప్పుడు శ్రీనాథ్‌కు అందించిన ఎక్మో చికిత్సలో ఓ యంత్ర పరికరం ద్వారా రక్తాన్ని పేమెంట్ శరీరంలోకి ప్రవహించేలా చేశారు. కార్బన్‌డయాక్సైడ్‌ను బయటికి తీస్తూ... ఆక్సిజన్‌ను ఎర్ర రక్తకణాల్లోకి పంపిస్తూ గుండెను మామూలు స్థితికి చేరుకునేలా కృషిచేశారు. కానీ ఈ చికిత్సలో టెక్కీ తిరిగి మామూలు స్థాయికి చేరుకోగా, జయలలిత ఆరోగ్య పరిస్థితి ఆ చికిత్సకు సపోర్టు చేయక ఆమె ప్రాణాలు వదిలారు. భారత్‌లో ఈ చికిత్సపై అవగాహన తక్కువ. చాలామంది పేషెంట్లు గుండె కొట్టుకోవడం ఆగిపోయి మరణిస్తున్నప్పటికీ, వారికి ఈ ట్రీట్ మెంట్ అందుబాటులో ఉండటం లేదు. విషమ పరిస్థితికి చేరుకున్న గుండెను సైతం ఈ చికిత్స ద్వారా సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు హార్ట్ అటాక్‌కు గురైనప్పుడూ ఈ చికిత్స ఎంతో ఉపయోగపడుతోంది. ఈ చికిత్స గురించి దేశంలో అవగాహన కల్పించాల్సినవసరం ఉందని కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవీ శెట్టి చెప్పారు. శ్రీనాథ్‌తో పాటు 500 మందికి పైగా పేషెంట్లకు నారాయణ హృదయాలయ ఈ ఎక్మో చికిత్సను అందించింది. ఈ చికిత్సకు మొత్తం మూడు నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుంది. ఎక్మో చికిత్స ద్వారా తనకు పునర్జన్మ కలిగినట్టు శ్రీనాథ్ పేర్కొన్నారు. ఎక్మో చికిత్సను ఎప్పుడు ఎక్కువగా వాడతారు? ఎక్మో చికిత్సను ఎక్కువగా రెండు క్లిష్టమైన పరిస్థితుల్లో వాడతారు. ఒకటి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు(జయలలితకు జరిగిన మాదిరి), న్యూమోనియా లేదా గాయాలు వంటి ఇన్ఫెక్షన్ల వల్ల ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేనప్పుడు ఈ చికిత్సను అందిస్తారు.