చెన్నై: ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యి.. దాదాపు 109 రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్న ఓ కోవిడ్ రోగి ఊపిరితిత్తుల మార్పిడి లేకుండానే కోలుకున్నాడు. ఈ వింత సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చెన్నై వ్యాపారవేత్త మహ్మద్ ముదిజా(56) ఏప్రిల్ చివర్లో కోవిడ్ బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అతన్ని ఎక్మో చికిత్సపై ఉంచారు. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ అవసరమైన సందర్భంలో కూడా అతడికి చికిత్స కొనసాగించారు. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు.
ఈ క్రమంలో ముదిజా దాదాపు నాలుగు వారాల పాటు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం చూశాడు. అయితే సెకండ్ వేవ్ ఉధృతిగా ఉన్న సమయంలో అతనికి ఆ అవయవం దొరకలేదు. ఈ క్రమంలో పూర్తిగా ధ్వంసమైన ఊపిరితిత్తులకు డాక్టర్లు ఎక్మో చికిత్స చేపట్టారు. సుమారు 62 రోజుల పాటు ఎక్మో చికిత్స జరిగింది. ఎటువంటి ట్రాన్స్‌ప్లాంటేషన్ లేకుండా.. అత్యధిక రోజులు ఎక్మో ట్రీట్మెంట్ పొందిన వ్యక్తిగా ముదిజా రికార్డుకెక్కాడు. దాదాపు 109 రోజుల తర్వాత ముదిజా ఊపిరితిత్తులు కుదుటపడ్డాయి.
ప్రస్తుతం వీల్‌చైర్‌పై ఉన్నాడు ముదిజా. ఈ సందర్భంగా ముదిజా మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు రెండవ జన్మ, చికిత్స సమయంలో డాక్టర్లు చెప్పినట్లు చేశాను. నమ్మకం కోల్పోలేదు. దేవుడిపై భారం వేశాను’’ అన్నాడు. చికిత్స సమయంలో ముదిజా అమితమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించినట్లు డాక్టర్లు తెలిపారు. రెలా హాస్పిటల్‌లో ముదిజా ఎక్మో చికిత్స తీసుకున్నాడు. ఎక్మో ట్రీట్మెంట్‌కు ప్రతి నెలా 40 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment