Lung transplantation
-
నిమ్స్‌లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను కలిగిన నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లోనే మొట్టమొదటి సారిగా నిమ్స్ సిటీ సర్జన్ డాక్టర్ ఎం.అమరేష్ రావు వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. ఏపీలోని కర్నూలుకి చెందిన డి.శేఖర్ కుమార్తె కళ్యాణి (17)కి కొంతకాలంగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. బాత్రూమ్కు కూడా ఆక్సిజన్ లేకపోతే వెళ్లలేని పరిస్థితి. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా క్షీణదశకు చేరుకోవడంతో సెప్టెంబర్11న నిమ్స్‌లో చేరింది. ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు నిర్థారించారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆపరేషన్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. కళ్యాణికి ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు నిమ్స్ వైద్యులు సమాయత్తమై ఊపిరితిత్తుల దాత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ తాడ్‌బన్‌కు చెందిన సుశీల(47) గత నెల 27న బోయినపల్లిలో రోడ్ క్రాస్ చేస్తుండగా బైక్ వచ్చి ఢీ కొట్టింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను మాదాపూర్‌లోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. జీవన్‌దాన్ కార్యక్రమంలో ఆమె అవయవాలను దానం చేసేందుకు బంధువులు ముందుకు వచ్చారు. ఈ విషయం తెలిసి జీవన్‌దాన్ కో–ఆర్డినేటర్ సుశీల అవయవాలను సేకరించారు. ఆమె ఊపిరితిత్తులను నిమ్స్ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా తరలించారు. హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఊపిరితిత్తులను మాదాపూర్ నుంచి పంజగుట్ట నిమ్స్ ఆస్పత్రికి 11 నిమిషాల్లోనే అంబులెన్స్‌లో చేర్చారు. బుధవారం ఉదయం 7.51 నిమిషాలకు అంబులెన్స్ నిమ్స్ మిలీనియం బ్లాక్‌కు చేరుకుంది. అక్కడ కళ్యాణికి ఊపిరితిత్తుల మార్పిడి చేయడానికి నిమ్స్ వైద్యులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఊపిరితిత్తుల మార్పిడిని మొదలుపెట్టి 8 గంటల పాటు శ్రమించి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం కళ్యాణి అబ్జర్వేషన్లో ఉన్నట్లు డాక్టర్ అమరేష్‌రావు తెలిపారు. -
డాక్టర్ జ్ఞానేశ్ టక్కర్: 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి సర్జరీలు
రాంగోపాల్‌పేట్/సాక్షి, హైదరాబాద్: యశోద ఆస్పత్రికి చెందిన సీనియర్ హార్ట్–లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జికల్ డైరెక్టర్ జ్ఞానేశ్ టక్కర్ 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేసి అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతితక్కువ మంది వైద్యుల్లో ఒకరిగా నిలిచారు. యూఎస్‌లో ప్రముఖ వైద్యుల్లో ఒకరిగా కొనసాగుతున్న డాక్టర్ జ్ఞానేశ్ భారత్‌కు వచ్చి తొలిసారి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. మొదటిసారిగా చిన్న గాటుతో డబుల్ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స కూడా ఆయనే చేశారు. (చదవండి: ఉన్నట్టుండి కాళ్లు చచ్చుబడ్డాయి, ఆస్పత్రికి తీసుకెళ్లగా) కాగా, అరుదైన ఘనత సాధించడంతో బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన జ్ఞానేశ్‌ను ఘనంగా సత్కరించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ‘యశోద’వైద్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కోవిడ్ సమయంలో తీవ్ర అనారోగ్యం బారిన పడిన రోగుల ప్రాణాలు కాపాడిందని తెలిపారు. ముఖ్యంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విషమ పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్‌లో వచి్చన వందకు పైగా రోగులకు అత్యాధునిక వైద్యం అందించి రక్షించినట్లు వివరించారు. చదవండి: వైద్యురాలికి ఊపిరితిత్తుల మార్పిడి.. లక్నో టు హైదరాబాద్ -
అద్భుతం: 109 రోజులు వెంటిలేటర్‌పైనే.. చివరకు
చెన్నై: ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యి.. దాదాపు 109 రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్న ఓ కోవిడ్ రోగి ఊపిరితిత్తుల మార్పిడి లేకుండానే కోలుకున్నాడు. ఈ వింత సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చెన్నై వ్యాపారవేత్త మహ్మద్ ముదిజా(56) ఏప్రిల్ చివర్లో కోవిడ్ బారిన పడ్డాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో అతన్ని ఎక్మో చికిత్సపై ఉంచారు. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ అవసరమైన సందర్భంలో కూడా అతడికి చికిత్స కొనసాగించారు. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ముదిజా దాదాపు నాలుగు వారాల పాటు లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం చూశాడు. అయితే సెకండ్ వేవ్ ఉధృతిగా ఉన్న సమయంలో అతనికి ఆ అవయవం దొరకలేదు. ఈ క్రమంలో పూర్తిగా ధ్వంసమైన ఊపిరితిత్తులకు డాక్టర్లు ఎక్మో చికిత్స చేపట్టారు. సుమారు 62 రోజుల పాటు ఎక్మో చికిత్స జరిగింది. ఎటువంటి ట్రాన్స్‌ప్లాంటేషన్ లేకుండా.. అత్యధిక రోజులు ఎక్మో ట్రీట్మెంట్ పొందిన వ్యక్తిగా ముదిజా రికార్డుకెక్కాడు. దాదాపు 109 రోజుల తర్వాత ముదిజా ఊపిరితిత్తులు కుదుటపడ్డాయి. ప్రస్తుతం వీల్‌చైర్‌పై ఉన్నాడు ముదిజా. ఈ సందర్భంగా ముదిజా మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు రెండవ జన్మ, చికిత్స సమయంలో డాక్టర్లు చెప్పినట్లు చేశాను. నమ్మకం కోల్పోలేదు. దేవుడిపై భారం వేశాను’’ అన్నాడు. చికిత్స సమయంలో ముదిజా అమితమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించినట్లు డాక్టర్లు తెలిపారు. రెలా హాస్పిటల్లో ముదిజా ఎక్మో చికిత్స తీసుకున్నాడు. ఎక్మో ట్రీట్మెంట్కు ప్రతి నెలా 40 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు. -
సీఎం జగన్ సహాయంతో ‘ఊపిరితిత్తుల మార్పిడి’ సక్సెస్
కారంచేడు: ప్రకాశం జిల్లా కారంచేడు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావుకు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. విధుల్లో ఉన్న ఆయనకు ఏప్రిల్ 24న కోవిడ్ సోకింది. దీంతో ఆయనకు విజయవాడ, హైదరాబాద్‌ల్లోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. భాస్కరరావు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోవడంతో వాటిని మార్చాలని, అందుకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యను వివరించింది. ఈ విషయాన్ని వెంటనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలియజేయడంతో సీఎం స్పందించి డబ్బుకు వెనుకాడొద్దని, భాస్కరరావు చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చినట్టుగానే డాక్టర్ భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఒక ప్రభుత్వ వైద్యుడికి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆయన ప్రాణాలను కాపాడటంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. డాక్టర్ భాస్కరరావు భార్య డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి.. సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇప్పటికే అమ్మా నాన్న పోయారు...మీరే దిక్కు: సోనూ స్పందన
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ నిమిత్తం ఒక రోగిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఆయన ట్విటర్ వివరాలను షేర్ చేశారు.బాధితుడి సోదరుడు ట్విటర్ ద్వారా చేసిన విజ్ఞప్తికి స్పందించిన సోనూ సూద్, ఆపరేషన్ ఖర్చును భరించడంతోపాటు, అతణ్ని ఆసుపత్రికి తరలించేందుకు రేపు(మంగళవారం) ఏర్పాటు చేసినట్టు సోమవారం ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రతీ భారతీయుడు ప్రార్థించాలని కూడా కోరారు. వివరాల్లోకివెళితూ.. హితేశ్ శర్మ(44) ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు. యూపీ, నోయిడాలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న ఆయన లంగ్స్ పూర్తిగా పాడై పోయాయి. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చేశారు. ఏప్రిల్ నుండి ఆసుపత్రిలో అతని చికిత్స కోసం ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టేశారు కుటుంబ సభ్యులు. 12 ఏళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్న హితేశ్‌కు కరోనా మహమ్మారితో ఇప్పటికే తన తల్లిదండ్రులు కన్నుమూసిన సంగతి తెలియదు. మరోవైపు హితేశ్‌ను బతికించుకోవాలంటే, లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్, పోస్ట్ ట్రామా ట్రీట్మెంట్, రికవరీ, హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ కలిపి సుమారు రూ .1,50,00,000 (ఒక కోటి యాభై లక్షలు) అవసరం. దీంతో ఎలాగైనా భర్తను హితేశ్‌ను రక్షించుకునేందుకు భార్య పూజ క్రౌడ్ ఫండింగ్‌కు ప్రయత్నించారు. అయినా తగినంత డొనేషన్స్ రాకపోవడంతో హితేశ్ సోదరుడు ట్విటర్ ద్వారా మరోసారి సోనూను ఆశ్రయించారు. ఇప్పటికే కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయాననీ, ఇపుడు సోదరుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పేర్కొన్నాడు. సోదరుడిని కాపాడుకోలేక పోతే తానిక అనాధగా మిగిలిపోతాను.. సాయం చేయాలని వేడుకున్నాడు. .తనకున్న ఏకైక ఆశ మీరే అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సోనూ సూద్ వేగంగా స్పందించారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా హితేశ్‌ను హైదరాబాద్‌కు తరలించనున్నామంటూ ట్వీట్ చేయడం విశేషం. Let's save your brother.🤞 Air Ambulance ready to fly tomorrow✈️ Lung transplant lined up in Hyd. ✅ We just need prayers of every Indian.🙏@YashodaHospital@SoodFoundation 🇮🇳 https://t.co/JvLNua4clS — sonu sood (@SonuSood) July 12, 2021 -
వైద్యురాలికి ఊపిరితిత్తుల మార్పిడి.. లక్నో టు హైదరాబాద్
సాక్షి, రాంగోపాల్‌పేట్: లక్నోకు చెందిన ఓ వైద్యురాలిని ఊపిరితిత్తుల మార్పిడి కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. కిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపిన మేరకు.. లక్నోలోని లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ సుమన్ అనే పీజీ రెసిడెంట్‌కు ఏప్రిల్ 14న కోవిడ్ సోకింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భిణి. ఊపిరితిత్తులు దెబ్బతిని పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి మే 1న సిజేరియన్ ద్వారా బిడ్డను కాపాడారు. అనంతరం ఆమెను ఎక్మో సపోర్ట్ మీద ఉంచారు. అయినా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఊపిరితిత్తుల మార్పిడి తప్ప గత్యంతరం లేదని వైద్యనిపుణులు చెప్పారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైద్యురాలి చికిత్స కోసం రూ.1.5 కోట్లు మంజూరు చేసింది. అనంతరం ఆమెను లైవ్ సపోర్ట్ అంబులెన్స్ ద్వారా లక్నో విమానాశ్రయానికి.. అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. -
విషాదం: ఆ పోలీసు అధికారి ఇకలేరు
చండీగఢ్: కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ..చనిపోయాక ఎక్స్‌గ్రేషియా కన్నా..బతికేందుకు అవకాశం ఇవ్వాలని, నిధులు సమకూర్చాలంటూ వేడుకున్న డీఎస్పీ లెవెల్ అధికారి ఇక లేరు. పంజాబ్‌కు చెందిన డిప్యూటీ జైలు సూపరిడెంట్ హర్జిందర్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజీవ్ కుంద్రా ఈ విషయాన్ని ధృవీకరించారు. మరోవైపు సకాలంలో చికిత్సకు తగిన నిధులు, వైద్యం అందిం ఉండి ఉంటే బతికే వాడని హర్జిందర్ సోదరుడు హర్దీప్ సింగ్ వాపోయారు. కరోనా వైరస్ కారణంగా డీఎస్పీ హర్జిందర్ సింగ్ ఆరోగ్యం గత నెలలో తీవ్రంగా దెబ్బతింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు చెడిపోవడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు ప్రకటించారు. దీనికి 70 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో తనకు సాయం చేయాల్సిందిగా హర్జిందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కోరారు. అలాగే హర్జిందర్ సింగ్ కుటుంబ సభ్యులు మే 20న లూధియానా పోలీసు కమిషనర్ రాకేశ్ అగర్వాల్‌ను కలిసి లంగ్స్ మార్పిడికి సాయం చేయాల్సిందిగా కోరారు. అయితే బాధితుడు ఒకవేళ చనిపోతే 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తామంటూ ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్ సోదరుడిని తిప్పించుకున్నారు. దీంతో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమంటూ ఐసీయూ బెడ్‌మీదనుంచే ప్రభుత్వాన్ని వేడుకున్నహర్జిందర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డీఎస్పీ వైద్యానికి సాయంచేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని స్వయంగా డీజీపీ దిన్కర్ గుప్తా ట్వీట్ చేశారు. లూథియానాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్ఫ్లాంట్ కోసం హైదరాబాద్ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ ప్రకటించారు. కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. చదవండి: వైరల్ : బతికేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం -
మళ్లీ ఊపిరి పోశారు!
సాక్షి, హైదరాబాద్: శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇ బ్బంది, ఆయాసంతో పాటు కరోనా వైరస్ బారిన పడిన ఓ యువకుడికి నగరంలోని కిమ్స్ వైద్యులు విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేశారు. ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ భాస్కర్‌రావు, హార్ట్ అండ్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ స్పెషలిస్టు డాక్టర్ సందీప్ అట్టావర్లు చికిత్సకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనా బారిన పడిన వ్యక్తికి ఒకే సమయంలో 2 ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చే యడం దేశంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు. దాతది కోల్‌కతా.. స్వీకర్తది చండీగఢ్ పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన రిజ్వాన్ (32) గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్య (సర్కోయిడోసిస్)తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అనేక ఆస్పత్రులను తిరిగాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఇటీవల ఆయన హైదరాబాద్ కిమ్స్‌లోని ప్రముఖ గుండె, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్ సందీప్ అట్టావర్‌ను సంప్రదించాడు. అయితే బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా సర్కోయిడోసిస్‌కు తోడు కరోనా కూడా సోకినట్లు తేలింది. దీంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యులు నిర్ణయించారు. అవయవ మార్పిడి చికిత్సకు రిజ్వాన్ అంగీకరించడంతో అవయవదానం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఆగస్టు 24న కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తి (52) బ్రెయిన్‌డెత్ స్థితికి చేరుకున్నాడు. అతడి అవయవాలు దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తున్న రిజ్వాన్, కిమ్స్ వైద్యులకు ఈ సమాచారం అందింది. అప్పటికే రిజ్వాన్ కోవిడ్‌ను జయించడంతో వైద్యులు చికిత్సకు సిద్ధమయ్యారు. వైద్యులు రెండు బృందాలుగా విడిపోయి.. ఆస్పత్రికి చెందిన వైద్యులు రెండు బృందాలుగా విడిపోయారు. వీరిలో ఓ వైద్య బృందం వెంటనే ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్లి దాత శరీరం నుంచి ఊపిరితిత్తులను సేకరించి, అదే రోజు అదే విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంది. ఆస్పత్రిలో ఉన్న మరో వైద్య బృందం అప్పటికే రోగి ఛాతీని ఓపెన్ చేసి ఉంచింది. డాక్టర్ సందీప్ అట్టావర్ నేతృత్వంలోని వైద్య బృందం సుమారు 10 గంటల పాటు శ్రమించి రోగికి విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు ప్రకటించారు. తనకు పునర్జన్మను ప్రసాదించిన కిమ్స్ వైద్యులకు బాధితుడు రిజ్వాన్ కృతజ్ఞతలు తెలిపాడు. -
ఆసియాలోనే తొలిసారిగా కోవిడ్ పేషెంట్‌కు..
చెన్నై: బతికి ఉన్నపుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా మనం నలుగురికీ ఉపయోగపడాలంటే అవయవ దానం చేయాలంటారు. ఆత్మీయులను శాశ్వతంగా దూరం చేసుకున్నా.. వారి అవయవాలను దానం చేయడం వల్ల ఇతరుల జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఈ మాటలను అక్షరాలా పాటించి చూపించింది ఓ మహిళ. బ్రెయిన్ డెడ్ అయిన తన భర్త అవయవాలను దానం చేసేందుకు అంగీకరించి పెద్ద మనసు చాటుకుంది. ఆమె నిర్ణయం వల్ల ఓ కోవిడ్ పేషెంట్‌కు పునర్జన్మ లభించగా.. మరో యువతికి కృత్రిమ చేతుల వాడకం నుంచి విముక్తి లభించింది. వివరాలు.. చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన 34 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యింది. (చదవండి: పది గంటలపాటు గ్లౌజులు ధరిస్తే.. ) ఈ క్రమంలో అవయవదానం గురించి అతడి భార్యకు అవగాహన కల్పించడంతో.. మృతుడి గుండె ఊపిరితిత్తులు, చేతులు, చర్మం, కాలేయం దానం చేసేందుకు గురువారం సమ్మతించింది. ఈ నేపథ్యంలో.. ఆరేళ్ల క్రితం ఓ రైలు ప్రమాదంలో చేతులు కోల్పోయిన యువతి కోసం ముంబైకి చేతులు ఎయిర్‌లిఫ్ట్ చేశారు. అదే విధంగా ఊపిరితిత్తులు పాడైపోయిన ఓ కోవిడ్ పేషెంట్ కోసం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి లంగ్స్ ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆసియాలోనే తొలిసారిగా ఓ కరోనా పేషెంట్‌కు అవయవ మార్పిడి చేసి వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు.(చదవండి: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!) ఈ విషయం గురించి ఎంజీఎం ఆస్పత్రి కార్డియాక్ సైన్సెస్ చైర్మన్, హర్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కేఆర్ బాలక్రిష్ణన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గురుగ్రామ్‌కు చెందిన ఓ 48 ఏళ్ల వ్యాపారవేత్తకు కరోనా సోకినట్లు జూన్ 8న నిర్ధారణ అయ్యింది. వైరస్ ధాటికి అప్పటికే అతడి ఊపిరి తిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆరోగ్యం విషమించడంతో ఎక్మో ట్రీట్మెంట్ కోసం అతడిని జూలైలో ఇక్కడికి ఎయిర్‌లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే వాళ్లను సంప్రదించి ఊపిరితిత్తులను సేకరించాం. ఆగష్టు 27న వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అవయవ మార్పిడి చేశారు. ప్రస్తుతం అతడు కరోనా నుంచి కోలుకున్నాడు. ఊపిరితిత్తులు బాగానే పనిచేస్తున్నాయి. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది’’అని వెల్లడించారు.( చదవండి.. కరోనా: ఆరు ఫీట్ల దూరం పాటిస్తే సరిపోదు!) బ్రెయిన్‌డెడ్‌ను ఎలా నిర్ధారిస్తారు? ప్రమాదం వల్లగాని, నివారణకాని వ్యాధి వల్లగాని అపస్మారకస్థితిలోకి చేరుకున్న మనిషికి... కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృహలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్‌గా పేర్కొంటారు. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలున్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతోపాటు సదరు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఆ తర్వాత సదరు వ్యక్తుల కుటుంబ సభ్యులు లేదా బంధువులను అవయవదానానికి ఒప్పిస్తారు. -
కరోనా రోగికి అరుదైన ఆపరేషన్
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి వైద్యుడు అరుదైన సర్జరీ చేశారు. షికాగోలో కరోనాతో బాధపడుతున్న ఓ యువతికి.. రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. భారత సంతతి డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో షికాగోలోని నార్త్ వెస్ట్రన్ మెమోరియల్ హాస్పిటల్లో ఈ శస్త్రచికిత్స జరిగింది. అమెరికాలో కరోనా పేషెంట్‌కు ఊపిరితిత్తులను మార్చడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ‘నేను చేసిన కష్టతరమైన ఆపరేషన్లలో ఇది ఒకటి. ఇది చాలా సవాలుతో కూడుకున్న కేసు. కరోనా వైరస్ సాధారణంగా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు, హృదయం, రక్త నాళాలు, నాడీ వ్యవస్థ పని తీరు దెబ్బతింటుంది’ అని తెలిపారు. కరోనా పేషంట్లకు ఇది ఒక్కటే సరైన మార్గం అని ఆయన అన్నారు. ఆపరేషన్ జరిగిన యువతి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నదని.. పూర్తి స్థాయిలో ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే ఆమెకు ఉన్న ఆప్షన్ అని, అందుకే ఆమెకు ఆ సర్జరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న పేషెంట్లకు చికిత్స ఇచ్చే ఆస్పత్రుల్లో ఈ సర్జరీపై దృష్టి పెట్టాలన్నారు.(‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!) ఊపిరితిత్తులు మార్పిడి చేయించుకున్న యువతి విషయానికి వస్తే.. వైద్యులు ఆమె పేరును బహిర్గతం చేయలేదు. 20 ఏళ్ల యువతి ఇటివలే ఉద్యోగ నిమిత్తం నార్త్ కరోలినా నుంచి షికాగోకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్ 26వ తేదీన ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. అంతకు రెండు వారాల ముందు నుంచి ఆమె అనారోగ్యంగా ఉన్నట్లు సమాచారం. తొలుత ఆమెను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆ తర్వాత నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ అందించారు. కొన్ని వారాలు గడిచినా ఆమె ఆరోగ్యంలో ఎటువంటి పురోగతిలేదు. చాలా రోజుల నుంచి అస్వస్థతతో ఉన్న కారణంగా.. ఛాతి కండరాలు బలహీనంగా మారాయి. ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు గ్రహించడంతో.. మార్పిడి చేయాలని నిర్ణయించి సర్జరీకి ఏర్పాట్లు చేశారు. సుమారు పది గంటల పాటు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. (మనసంతా కరోనా చింత) యువతి ఊపిరితిత్తులు ఎక్కువగా ఉబ్బడం వల్ల.. సర్జరీకి అనుకున్నదాని కన్నా ఎక్కువ సమయం పట్టినట్లు డాక్టర్ అంకిత్ తెలిపారు. నార్త్‌వెస్ట్రన్ మెడిసిన్ హాస్పిటల్లో ప్రతి ఏడాది 40 నుంచి 50 వరకు ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలు చేస్తుంటారని.. వాటిలో ఎక్కువ తానే చేసిన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా పరీక్షలో నెగటివ్ వచ్చిన తర్వాతనే ఆమెకు సర్జరీ చేసినట్లు చెప్పారు. మ్యాచింగ్ డోనార్‌ను గుర్తించిన కొన్ని రోజులకే శస్త్రచికిత్స చేశామన్నారు. తాను సర్జరీ చేసిన అత్యంత బలహీనమైన పేషెంట్ ఈమే అని డాక్టర్ అంకిత్ తెలిపారు. -
ఊపిరి బిగపట్టిన రోజు...
మెడికల్ మెమరీస్ ఊపిరితిత్తుల మార్పిడి చాలా అసాధారణమైన, అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ.మన దేశంలో ఇదివరకు ఇలాంటివి కేవలం రెండుసార్లే జరిగాయి. అలాంటి అరుదైన మూడో కేసు గురించి ఈ వారం... - యాసీన్ సెప్టెంబర్ 8, 2012... నిజానికి ఆ రోజు 34 ఏళ్ల అర్చనా షెగ్డే పుట్టిన రోజు కాదు. కానీ పునర్జన్మ పొందిన రోజు. అర్చన స్వస్థలం పుణే. మంచి భర్త, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, ఆనందకరమైన జీవితం. కానీ ఆ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. చుట్టూ గాలి ఉన్నా శ్వాస పీల్చుకోలేక అర్చన అల్లల్లాడేవారు. పుణేలో ఎక్కని ఆస్పత్రి గడప లేదు. ఆఖరికి ముంబైకి తీసుకెళ్తే తేలిన విషయం... ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయి. ఇంటర్‌స్టిషియల్ ఫైబ్రోసిస్! అవి ఎంతగా ఘనీభవించాయంటే... రక్తంలోకి తగిన ఆక్సిజన్‌ను పంపడానికి ఏమాత్రం స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఊపిరి అందక, రక్తంలో తగినంత ఆక్సిజన్ లేక రోగి క్రమంగా మరణానికి చేరువవుతారు. ఈ వ్యాధికి మందులేవీ పనిచేయవు. బతకాలంటే ఒక్కటే మార్గం... ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స! అర్చన కుటుంబసభ్యులు దేశమంతా గాలించి, చివరకు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను సంప్రదించారు. గోఖలే అరుదైన గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన అనుభవజ్ఞులు. అయితే, ఇక్కడ అనుభవం ఒక్కటే చాలదు, దాత కూడా కావాలి! గోఖలే సూచనల మేరకు అర్చనను హైదరాబాద్ తరలించారు. ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు అవసరమైన అన్ని పరీక్షలూ నిర్వహించారు. అమెరికాలోని హ్యూస్టన్, టెక్సాస్‌లోగల ‘డిబాకే హార్ట్ లంగ్ సెంటర్’లోని లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శస్త్రచికిత్స గురించి చర్చించారు. ‘తుదిపరీక్ష’ కోసం నిర్దిష్టమైన వ్యూహం రచించుకున్నారు. ఇక, దాత దొరకడమే తరువాయి! రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ! రోజులు గడుస్తున్నకొద్దీ రోగి పరిస్థితి దిగజారుతోంది. కుటుంబ సభ్యుల్లో ఆశ సన్నగిల్లుతోంది. సరిగ్గా అలాంటి సమయంలో, అంటే సెప్టెంబర్ 8, 2012న మెదడులో తీవ్ర రక్తస్రావంతో ఒక మహిళ బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా గోఖలే బృందానికి సమాచారం అందింది. జీవన్మృతురాలి అవయవాలు దానం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఒక ఆశారేఖ మెరిసింది. అర్చన ప్రాణరక్షణ లక్ష్యంతో గోఖలే బృందం దీక్షాకంకణం ధరించింది. యుద్ధప్రాతిపదికన 60 మంది నిష్ణాతులైన వైద్యులు, సాంకేతిక నిపుణులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, చివరికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌తో సహా అన్ని విభాగాలకూ చెందిన ఉద్యోగులంతా ఊపిరి బిగబట్టి పనిచేశారు. ఆపరేషన్ సమయంలో పేషెంట్ శారీరక నిర్మాణపరమైన అవరోధాల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఓర్పుతో, నేర్పుతో వాటిని అధిగమిస్తూ సర్జరీ కొనసాగింది. పాడైపోయిన ఊపిరితిత్తులను తొలగించి ఆ స్థానంలో కొత్తవాటిని అమర్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన క్రతువు మర్నాడు ఉదయం 10 వరకు సాగింది. ఒక అంకం సంతృప్తికరంగా పూర్తయ్యింది. అసలు సమస్య ముందుంది. కొత్తగా తనలోకి ప్రవేశించిన అవయవాన్ని ఆమె శరీరం ఆమోదిస్తుందా, లేదా? మర్నాడు ఉదయం అర్చన హాయిగా ఊపిరి తీసుకున్నారు. శస్త్రచికిత్సకు కార్యక్షేత్రమైన ‘యశోద’ బృందం కూడా ఊపిరి పీల్చుకుంది. దేశంలో మూడవదైన ఈ తరహా ఆపరేషన్... రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి శస్త్రచికిత్స కావడం మరో విశేషం! -
కృత్రిమ ‘ఊపిరితిత్తుల పరికరం’తో ఊపిరి!
చెన్నై: దేశంలోనే తొలిసారిగా ఓ రోగికి చెన్నై గ్లోబల్ హెల్త్ సిటీఆస్పత్రి వైద్యులు కృత్రిమ ఊపిరితిత్తుల పరికరాన్ని విజయవంతంగా అమర్చి తాత్కాలికంగా ఊపిరి పోశారు. బహ్ర రుున్కు చెందిన ఫాతిమా అహ్మద్(64)కు లింఫ్ యాంజియోలియో మయోమటోసిస్ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల మార్పిడి అనివార్యమైంది. అవయవ దాత అందుబాటులో లేకపోవడంతో ఊపిరితిత్తుల్లా పనిచేసే కృత్రిమ అవయవాన్ని అమర్చారు. బైపాస్ ద్వారా ఛాతిపై దీనిని అమర్చడానికి బదులుగా, ఎడమ కాలి తొడ భాగం నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన నాళానికి ఇంప్లాంట్‌లోని ఓ సన్నని పైపును, మరో తొడ భాగంలోని ప్రధాన నాళానికి ఇంకో పైపును అమర్చారు. ఊపిరితిత్తులు చేసే పనుల్ని చేసేలా ఇంప్లాంట్‌ను సిద్ధం చేశారు. దీనిని గరిష్టంగా ఆరు నెలలే ఉపయోగించాలని, ఆలోపు ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు.