
భాస్కరరావు (ఫైల్)
కారంచేడు: ప్రకాశం జిల్లా కారంచేడు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావుకు హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. విధుల్లో ఉన్న ఆయనకు ఏప్రిల్ 24న కోవిడ్ సోకింది. దీంతో ఆయనకు విజయవాడ, హైదరాబాద్‌ల్లోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. భాస్కరరావు ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోవడంతో వాటిని మార్చాలని, అందుకు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సమస్యను వివరించింది.
ఈ విషయాన్ని వెంటనే ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేయడంతో సీఎం స్పందించి డబ్బుకు వెనుకాడొద్దని, భాస్కరరావు చికిత్సకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చినట్టుగానే డాక్టర్ భాస్కరరావుకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఒక ప్రభుత్వ వైద్యుడికి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి ఆయన ప్రాణాలను కాపాడటంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. డాక్టర్ భాస్కరరావు భార్య డాక్టర్ బొమ్మినేని భాగ్యలక్ష్మి.. సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.