కరోనా రోగికి ఊపిరితిత్తుల మార్పిడి చేసిన డాక్టర్ అంకిత్ భరత్
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి వైద్యుడు అరుదైన సర్జరీ చేశారు. షికాగోలో కరోనాతో బాధపడుతున్న ఓ యువతికి.. రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేశారు. భారత సంతతి డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో షికాగోలోని నార్త్ వెస్ట్రన్ మెమోరియల్ హాస్పిటల్‌లో ఈ శస్త్రచికిత్స జరిగింది. అమెరికాలో కరోనా పేషెంట్‌కు ఊపిరితిత్తులను మార్చడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. ‘నేను చేసిన కష్టతరమైన ఆపరేషన్‌లలో ఇది ఒకటి. ఇది చాలా సవాలుతో కూడుకున్న కేసు. కరోనా వైరస్ సాధారణంగా శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా మూత్రపిండాలు, హృదయం, రక్త నాళాలు, నాడీ వ్యవస్థ పని తీరు దెబ్బతింటుంది’ అని తెలిపారు. కరోనా పేషంట్లకు ఇది ఒక్కటే సరైన మార్గం అని ఆయన అన్నారు. ఆపరేషన్ జరిగిన యువతి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నదని.. పూర్తి స్థాయిలో ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే ఆమెకు ఉన్న ఆప్షన్ అని, అందుకే ఆమెకు ఆ సర్జరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కరోనాతో బాధపడుతున్న పేషెంట్లకు చికిత్స ఇచ్చే ఆస్పత్రుల్లో ఈ సర్జరీపై దృష్టి పెట్టాలన్నారు.(‘తొలి’ పరీక్షతో తప్పుడు ఫలితాలు!)
ఊపిరితిత్తులు మార్పిడి చేయించుకున్న యువతి విషయానికి వస్తే.. వైద్యులు ఆమె పేరును బహిర్గతం చేయలేదు. 20 ఏళ్ల యువతి ఇటివలే ఉద్యోగ నిమిత్తం నార్త్ కరోలినా నుంచి షికాగోకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సోకడంతో ఏప్రిల్ 26వ తేదీన ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. అంతకు రెండు వారాల ముందు నుంచి ఆమె అనారోగ్యంగా ఉన్నట్లు సమాచారం. తొలుత ఆమెను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆ తర్వాత నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ అందించారు. కొన్ని వారాలు గడిచినా ఆమె ఆరోగ్యంలో ఎటువంటి పురోగతిలేదు. చాలా రోజుల నుంచి అస్వస్థతతో ఉన్న కారణంగా.. ఛాతి కండరాలు బలహీనంగా మారాయి. ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు గ్రహించడంతో.. మార్పిడి చేయాలని నిర్ణయించి సర్జరీకి ఏర్పాట్లు చేశారు. సుమారు పది గంటల పాటు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. (మనసంతా కరోనా చింత)
యువతి ఊపిరితిత్తులు ఎక్కువగా ఉబ్బడం వల్ల.. సర్జరీకి అనుకున్నదాని కన్నా ఎక్కువ సమయం పట్టినట్లు డాక్టర్ అంకిత్ తెలిపారు. నార్త్‌వెస్ట్రన్ మెడిసిన్ హాస్పిటల్‌లో ప్రతి ఏడాది 40 నుంచి 50 వరకు ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలు చేస్తుంటారని.. వాటిలో ఎక్కువ తానే చేసిన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా పరీక్షలో నెగటివ్ వచ్చిన తర్వాతనే ఆమెకు సర్జరీ చేసినట్లు చెప్పారు. మ్యాచింగ్ డోనార్‌ను గుర్తించిన కొన్ని రోజులకే శస్త్రచికిత్స చేశామన్నారు. తాను సర్జరీ చేసిన అత్యంత బలహీనమైన పేషెంట్ ఈమే అని డాక్టర్ అంకిత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment