ఊపిరితిత్తుల మార్పిడి తర్వాత కోలుకున్న అర్చనతో డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సారథ్యంలోని యశోద ఆసుపత్రి బృందం
మెడికల్ మెమరీస్
ఊపిరితిత్తుల మార్పిడి చాలా అసాధారణమైన, అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ.మన దేశంలో ఇదివరకు ఇలాంటివి కేవలం రెండుసార్లే జరిగాయి. అలాంటి అరుదైన మూడో కేసు గురించి ఈ వారం...
- యాసీన్
సెప్టెంబర్ 8, 2012...
నిజానికి ఆ రోజు 34 ఏళ్ల అర్చనా షెగ్డే పుట్టిన రోజు కాదు. కానీ పునర్జన్మ పొందిన రోజు. అర్చన స్వస్థలం పుణే. మంచి భర్త, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, ఆనందకరమైన జీవితం. కానీ ఆ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. చుట్టూ గాలి ఉన్నా శ్వాస పీల్చుకోలేక అర్చన అల్లల్లాడేవారు. పుణేలో ఎక్కని ఆస్పత్రి గడప లేదు. ఆఖరికి ముంబైకి తీసుకెళ్తే తేలిన విషయం... ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయి. ఇంటర్‌స్టిషియల్ ఫైబ్రోసిస్! అవి ఎంతగా ఘనీభవించాయంటే... రక్తంలోకి తగిన ఆక్సిజన్‌ను పంపడానికి ఏమాత్రం స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఊపిరి అందక, రక్తంలో తగినంత ఆక్సిజన్ లేక రోగి క్రమంగా మరణానికి చేరువవుతారు. ఈ వ్యాధికి మందులేవీ పనిచేయవు. బతకాలంటే ఒక్కటే మార్గం... ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స!
అర్చన కుటుంబసభ్యులు దేశమంతా గాలించి, చివరకు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను సంప్రదించారు. గోఖలే అరుదైన గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన అనుభవజ్ఞులు. అయితే, ఇక్కడ అనుభవం ఒక్కటే చాలదు, దాత కూడా కావాలి! గోఖలే సూచనల మేరకు అర్చనను హైదరాబాద్ తరలించారు.
ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు అవసరమైన అన్ని పరీక్షలూ నిర్వహించారు. అమెరికాలోని హ్యూస్టన్, టెక్సాస్‌లోగల ‘డిబాకే హార్ట్ లంగ్ సెంటర్’లోని లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శస్త్రచికిత్స గురించి చర్చించారు. ‘తుదిపరీక్ష’ కోసం నిర్దిష్టమైన వ్యూహం రచించుకున్నారు. ఇక, దాత దొరకడమే తరువాయి!
రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ! రోజులు గడుస్తున్నకొద్దీ రోగి పరిస్థితి దిగజారుతోంది. కుటుంబ సభ్యుల్లో ఆశ సన్నగిల్లుతోంది. సరిగ్గా అలాంటి సమయంలో, అంటే సెప్టెంబర్ 8, 2012న మెదడులో తీవ్ర రక్తస్రావంతో ఒక మహిళ బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా గోఖలే బృందానికి సమాచారం అందింది. జీవన్మృతురాలి అవయవాలు దానం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఒక ఆశారేఖ మెరిసింది.
అర్చన ప్రాణరక్షణ లక్ష్యంతో గోఖలే బృందం దీక్షాకంకణం ధరించింది. యుద్ధప్రాతిపదికన 60 మంది నిష్ణాతులైన వైద్యులు, సాంకేతిక నిపుణులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, చివరికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌తో సహా అన్ని విభాగాలకూ చెందిన ఉద్యోగులంతా ఊపిరి బిగబట్టి పనిచేశారు. ఆపరేషన్ సమయంలో పేషెంట్ శారీరక నిర్మాణపరమైన అవరోధాల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.
ఓర్పుతో, నేర్పుతో వాటిని అధిగమిస్తూ సర్జరీ కొనసాగింది. పాడైపోయిన ఊపిరితిత్తులను తొలగించి ఆ స్థానంలో కొత్తవాటిని అమర్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన క్రతువు మర్నాడు ఉదయం 10 వరకు సాగింది. ఒక అంకం సంతృప్తికరంగా పూర్తయ్యింది. అసలు సమస్య ముందుంది. కొత్తగా తనలోకి ప్రవేశించిన అవయవాన్ని ఆమె శరీరం ఆమోదిస్తుందా, లేదా?
మర్నాడు ఉదయం అర్చన హాయిగా ఊపిరి తీసుకున్నారు. శస్త్రచికిత్సకు కార్యక్షేత్రమైన ‘యశోద’ బృందం కూడా ఊపిరి పీల్చుకుంది. దేశంలో మూడవదైన ఈ తరహా ఆపరేషన్... రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి శస్త్రచికిత్స కావడం మరో విశేషం!