మెడికల్ కాలేజీలో ఎందుకు చేరావు? | why are join in medical college? | Sakshi
Sakshi News home page

మెడికల్ కాలేజీలో ఎందుకు చేరావు?

Published Sun, Apr 26 2015 1:01 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

మెడికల్ కాలేజీలో ఎందుకు చేరావు? - Sakshi

మెడికల్ కాలేజీలో ఎందుకు చేరావు?

మెడికల్ మెమరీస్
ఇక్కడ చనిపోయిన వారు బతికి ఉన్న వారికి పాఠాలు చెబుతారు
నేను 1968 సెప్టెంబర్ 13న కర్నూల్ మెడికల్ కాలేజీలో చేరాను. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడో పని చేసి చివరకు కర్నూల్లోనే స్థిరపడ్డాను. అప్పుడప్పుడూ అలా మెడికల్ కాలేజీలోకి వెళ్లి, కాసేపు తిరిగి వస్తుంటాను. అలా తిరుగుతుంటే నేనింకా 1968లోనే ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అప్పట్లోనూ ర్యాగింగ్ ఉండేది. దాన్నే ‘డకింగ్’ అని కూడా అనేవాళ్లు. ఒక సీనియర్ నన్ను పట్టుకుని ‘నువ్వెందుకు మెడికల్ కాలేజీలో చేరావు?’ అని అడిగాడు.
 
నా ముఖానికి జవాబు చెప్పేంత లావు ఆలోచన కూడానా? ఇంజనీరు అవుదామని లెక్కలు బాగా నేర్చుకున్నాను. దెయ్యాలంటే భయం. శవాలంటే వణుకు. చచ్చినా డాక్టరు కాకూడదనుకున్నాను. కానీ చచ్చినట్లు డాక్టరే అయ్యాను. కాకుండా చస్తానా? మెడికల్ కాలేజీలో చేరకపోతే ఇంట్లోవాళ్లు మక్కెలిరగ తంతామంటే ఏం చేస్తాను మరి? అయినా ‘‘ఎందుకు మెడికల్ కాలేజీలో చేరావ’నే ప్రశ్నకు నోరెళ్లబెట్టాను.
 
దీనికి జవాబు దొరక్కుండానే ఏడాది గడిచి ‘ర్యాగింగ్’ చేసే అర్హత నాకూ వచ్చింది. అయినా ఎవరినీ ర్యాగింగ్ చేయలేదు! రోజూ ఒకరిద్దరు జూనియర్లను వెంటబెట్టుకుని పెద్దపార్కుకు తీసుకెళ్లి ‘నువ్వెందుకు మెడికల్ కాలేజీకి వచ్చావ’ని అడిగేవాణ్ణి. వాళ్లు నాకంటే గొప్పగా నోరెళ్లబెట్టేవాళ్లు. ఒకరిద్దరు మాత్రం ‘సేవ చేయడానికి’ అనేవాళ్లు. కోర్సు ఆఖర్న మా సీనియర్ వేసిన ప్రశ్నకు జవాబు దొరికింది.

నా చదువు పూర్తికావడం కోసం నా తల్లిదండ్రులు అప్పట్లో రూ. 10,000 ఖర్చుపెట్టారు. కాలేజీ ఫీజు దాదాపుగా లేదు. పైగా ప్రభుత్వం ఏడాదికి రూ. 1,500 స్పెషల్ స్కాలర్‌షిప్ కూడా ఇచ్చింది. కానీ నా చదువుకోసం మా కాలేజీ రూ. 1 లక్ష ఖర్చు చేసింది. ఇప్పుడైతే ఆ మొత్తం రూ. 50 లక్షలు. ఆ డబ్బును ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వానికి జనమంతా పన్నులు కట్టి డబ్బు సమకూర్చారు. మేమేదో మిగతా జనం కంటే తెలివిగల వాళ్లమని భావించిన ప్రభుత్వం మమ్మల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దాలనుకుంది. మా కుటుంబాల కంటే సమాజమే మా కోసం పదిరెట్లు ఖర్చు చేసింది. అందుకు ప్రతిగా మా కోసం కుప్పలుగా డబ్బు పోగేసుకోడానికి మా చదువును తెగనమ్ముకోవడం న్యాయం కాదని అనిపించింది.
 
వార్డు నెం. 4లో కడుపునొప్పితో ఒక ముసలాయన పడుకుని ఉన్నాడు. చదువులేదు. పల్లెటూరి నుంచి వచ్చాడు. నా బ్యాచ్‌లోని పదిమంది తెల్లకోట్లు వేసుకుని, స్టెత్‌స్కోప్‌లు మెళ్లో వేసుకుని అతని చుట్టూ చేరాం. ‘అబ్బో... చాలామంది డాక్టర్లు వచ్చార’నుకుని, ఆ రోగి బుద్ధిగా మంచం మీద పడుకున్నాడు. మేమంతా పొట్ట నొక్కాం. గంటయ్యాక అందరమూ బయల్దేరాం. ‘సారూ! మందులు ఇవ్వరా?’ అడిగాడతను. ‘మేము కాదు. పెద్ద డాక్టర్ వస్తార’ని చెప్పామతనికి. మరో బ్యాచ్ వాళ్లు మాకు ఎదురయ్యారు. ‘4వ వార్డులో కేసుంది. చూసుకోపోండి’ అన్నాం.

ఈ పదిమంది కూడా ఆ రోగి దగ్గరకు వచ్చి ‘పడుకో’ అన్నారు. ‘‘మీరూ పొట్ట నొక్కుతారా?’’ అని అడిగాడతను. ‘‘వద్దా’’ అన్నారంతా. చేసేదేముంది అనుకుంటూ ఇక పడుకున్నాడు రోగి. అందరూ నొక్కారు. అతడికి జీర్ణాశయ క్యాన్సర్ అని తేల్చుకోగలిగాం. నెల రోజుల్నుంచి చూస్తూ ఉన్నాం. అతడికి ఆపరేషన్ జరగలేదు. మరో నెలలో ఫైనలియర్ విద్యార్థుల పరీక్షలో కేసులు ఉంచడం కోసం అతడికి సర్జరీ చేయకుండా ఆపారు. ఆ తర్వాత కూడా అతడికి ఆపరేషన్ జరగలేదు. పరీక్షలైన రెండ్రోజుల తర్వాత అతడు కనపడలేదు. కారణం వేరే చెప్పాలా... జబ్బు ముదిరి, చనిపోయాడు.
 
ఇలాంటి రోగులందరూ తమ ప్రాణాలర్పించి మరీ మాకు వైద్యం నేర్పారు. కొందమంది అనాథలుంటారు. వాళ్లు చనిపోతే నాలుగురోజులు మార్చురీలో ఉంచి, ఇక ఎవరూ రారని నిర్ధారణ అయ్యాక, ఆ శవాలను ‘అనాటమీ’ (శరీర నిర్మాణశాస్త్రం) విభాగానికి ఇస్తారు. అక్కడ ఒక పెద్ద సిమెంటు తొట్టి ఉంటుంది. అందులో నలభై, యాభై శవాలను పడుకోబెడ్తారు. గుర్రం జాషువా చెప్పినట్లుగా శ్మశానంలో అందరూ సమానమవుతారన్నట్లుగా, ఈ తొట్టిలో కూడా అందరూ సమానం. అందులోంచి ఒక్కో శవాన్ని బయటకు తీసుకొచ్చి, స్టీలు బల్లమీద పడుకోబెడ్తారు. దాన్ని కోసి శరీర నిర్మాణం నేర్చుకోడానికి బిలబిలమంటూ విద్యార్థులు వస్తారు. ‘ఇక్కడ చనిపోయిన వారు బతికి ఉన్న వారికి పాఠాలు చెబుతారు’ అని అనాటమీ విభాగ ప్రవేశద్వారం దగ్గర రాసుంటుంది.
   
పన్నులు కట్టిన జనం లక్షల డబ్బిచ్చి, రోగులు తమ శరీరాలను అప్పగించి, కొందరు అనాథ శవాలుగా మారి మాకు వైద్యం నేర్పారు. ఈ పేరూ, ఊరూ లేని మామూలు వ్యక్తులు మమ్మల్ని డాక్టర్లను చేశారు. వీళ్లకేమీ చేయక్కర్లేదా? మేమేమీ ఇవ్వక్కర్లేదా? అందుకే నేను నా శరీరాన్ని మా కాలేజీకి రాసిచ్చాను (చనిపోయాకే లెండి). నన్నూ ఆ తొట్టిలోనే పడుకోబెడ్తారు. ఆ స్టీలు బల్ల మీదే పడుకోబెడతారు. అప్పుడు నా పొట్టకోసే విద్యార్థి ‘రేయ్ చూడరా... వీడిపొట్ట ఎంత లావుందో’’ అంటాడు. అప్పుడు నేను లేచి కూర్చుని... వాడికి పాఠం చెప్పాలని ఉంది.
   
 ఏ మెడికల్ కాలేజీకి వెళ్లినా మొట్టమొదటగా నాకు గుర్తొచ్చే ప్రశ్న ‘నువ్వెందుకు మెడికల్ కాలేజీకి వచ్చావు’ అనే. ఆ ప్రశ్ననే నేనూ అందరినీ అడుగుతుంటాను. అందరి జవాబు ఎలా ఉన్నా నా జవాబు ఒక్కటే... ‘చనిపోయాక కూడా ఇతరులకు మనం  ఉపయోగపడుతూ ఉండాలి’’ అదీ జీవితమంటే. అందు కోసమే... నేను చనిపోతాను. 1968 నాటి నా సీనియర్ అడిగిన ప్రశ్నకు జవాబివ్వడం కోసం అప్పుడు కూడా మెడికల్ కాలేజీకే వస్తాను.
నిర్వహణ: యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement