yasin
-
పిడుగుపాటుకు ముగ్గురు రైతుల మృతి
జైనథ్, వాంకిడి, కోటపల్లి: రాష్ట్రంలో పిడుగు పాటుకు గురై వేర్వేరు జిల్లాల్లో ఓ మహిళ సహా ముగ్గురు రైతులు దుర్మరణం పాలైన ఘటనలు శుక్రవారం చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన రైతు షేక్ యాసిన్(41) తన భార్య అఫ్సానాతో పొలంలో పత్తికి పురు గుల మందు పిచికారీ చేస్తుండగా భారీ వర్షం మొదలైంది. దీంతో ఇంటికి వెళ్లేందుకు ఎడ్లబండిని సిద్ధం చేసేందుకు చెట్టు కిందకు వెళ్ల గా ఒక్కసారిగా పిడుగుపడటంతో యాసిన్ అక్కడికక్కడే కుప్పకూలాడు. రెండు ఎడ్లు సైతం అక్కడికక్కడే మృతి చెందాయి. కొంత దూరంలో ఉన్న అఫ్సానాకు తలకు గాయాలై స్పృహ కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుమురంభీం జిల్లా వాంకిడి మండలం వెల్గి గ్రామ పంచాయతీ పరిధిలో పత్తి చేనులో ఎరువు వేస్తు న్న క్రమంలో భారీ వర్షం రావడంతో చింత చెట్టు వద్దకు వెళ్లి పిడుగు పాటుకు గురై మన్నెగూడ గ్రామానికి చెందిన పద్మబాయి(23) మృతి చెందారు. పక్కనే ఉన్న ఆమె భర్త గేడం టుల్లికి తీవ్రగాయాలు కావడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన రైతు రావుల రవీందర్ (25) పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా పిడుగు పడి స్పృహకోల్పోయాడు. దగ్గరలోనే ఉన్న భార్య లావణ్య వెంటనే రవీందర్‌ను చెన్నూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే వారికి వివాహమైంది. -
నిర్భయంగా కూర్చునే ధీమా
ఆ చిన్ననాటి రోజులు ఎంత మంచివి! ఒంటికి వెళ్లాల్సి వస్తే ఒక వేలు.. మరో అవసరం కోసం రెండు వేళ్లూ చూపించినంత చలాకీగా హాయిగా గడిచిపోయేది జీవితం. పెరిగి పెద్దవ్వడం, పెద్దయినందుకు గుర్తుగా సంస్కారం నేర్చుకోవడం ఎంత పెద్ద పనిష్మెంట్? అది అప్పుడర్థం కాదు. అర్థమయ్యేసరికి బాల్యం ఉండదు. బాల్యం నాటి ఆ సౌఖ్యం ఉండదు. మనిషై పుట్టాక ఎన్నో కష్టాలు. మరెన్నో సమస్యలు. గోడలే లేని జలాశయానికి సంస్కారపు లాకులూ, సంకల్పపు గేట్లను అడ్డుపెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు పొత్తికడుపు వెనక అవయవాలెన్నో ముంపుగ్రామాల్లా మునిగిపోతున్న భావన. కడుపునొప్పి మూడో నెంబరు ప్రమాద సూచికను ఎగరేసిన ఫీలింగ్. ఇక సమస్య ఆ రెండోదైతే పదిమందీ పకపకలాడతారేమోనని పడే పడరాని మనోవేదన రెట్టింపవుతుంది. కాసేపట్లో తీరబోయే తాత్కాలిక సమస్యే అయినా తీరం దాటబోయే ముందు తుఫాను సృష్టించే కలవరం కలిగిస్తుంది. బరువు దించుకునేంత వరకు బండ మోస్తున్న భావన. అదే శాశ్వతమేమో అన్న యోచన. అంతులేనంత ఆందోళన. బ్రెయిన్ మీద ఒత్తిడిని ఎంతైనా భరించవచ్చు. కష్టమైనా సరే రోజులూ, నెలలు అవసరాన్ని బట్టి ఏళ్లూ పూళ్లూ ఓపిక పట్టవచ్చు. కానీ బ్లాడర్ మీద ప్రెషర్నీ, స్ఫింక్టర్ మీద స్ట్రెస్నీ భరించడం ఎంత కష్టం. ఎంతగా ఓపిక పట్టినా ఒక్కోసారి నలుగురిలో నగుబాటు! ఎంతటి ఎంబరాసింగ్ సిచ్యువేషన్!! బ్లాడర్లూ, బవెల్సూ మీద ఒత్తిడిలేని లోకం... ఆ స్ట్రెస్‌నూ, ఆ ప్రెషర్‌నూ ఎక్కడైనా నిస్సంకోచంగా దించుకునే ప్రపంచం ఎక్కడుందో... అదే నిజమైన స్వర్గం. బరువు దించుకోవడమే సమస్య. కానీ ఆ బరువు పెంచే అంశాలెన్నో! ఆ అవసరాన్ని రగిలించే అనారోగ్యాలెన్నో. ఒకరికి డయాబెటిస్... మరొకరికి స్ట్రెస్... ఒక బంగారుతల్లికి యూరినరీ ఇన్‌కాంటినెన్స్. కారణమేదైనా మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాలనిపిస్తుంటుంది. వెళ్లడం తప్పనిసరి అవుతుంది. కొలీగ్స్ ముందు లేవాల్సిరావడం ఒక అన్విల్లింగ్నెస్. లేవకపోతే మరో రకం రిలక్టెన్స్. మీటింగ్‌లో ఉన్నప్పుడు బలంగా మనల్ని పిలిచిన ఓ నేచురల్ కాల్... మనకు మనం విధించుకున్న ఆంక్షతో మెలికలు తిప్పి కలకలం పుట్టిస్తుంది. ఆ కాంక్ష తాలూకు ఆకాంక్ష మన ఆంక్షతో పెద్దశిక్షగా పరిణమించి మన సహనానికి పరీక్ష పెడుతుంది. పురుషాధిక్య సమాజంలోని పురుషుల మనసుల్లోనే ఇంతటి వేదన ఉంది. కానీ దైన్యం కట్టలు తెంచుకొన్నప్పుడు ధైర్యం పుంజుకొనేందుకు తెచ్చిపెట్టుకున్న ఓ అనధికార లైసెన్స్ ఉంది. నాకేమనే తలంపు తలెత్తుతుంది. మగాడిననే భావన తలకెక్కుతుంది. అలా వాడికి నలుగురిలోనైనా గోడవారగా తిరిగే అవకాశం ఉంది. కానీ మహిళలకో? పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే ప్రభుత్వాలు అంతకుముందే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది. గొప్ప గొప్ప వాగ్దానాలు చేసే నాయకులు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. స్వచ్ఛ భారత్‌ల కోసం సెస్‌లు విధించడం కాదు... కాళ్ల దగ్గర నీళ్లచెంబుతో బెంగపడే స్త్రీలూ, రైలు పట్టాల దగ్గర ముఖాలు దాచుకునే మహిళలూ, తుమ్మచెట్ల డొంకదారుల్లో ఎవరో వస్తున్నారంటూ ముఖం ఆ వైపుకు తిప్పుకొని లేచి నిలబడే గ్రామీణులకు నిర్భయంగా కూర్చుండే ధీమా ఇవ్వగలిగితే... వీధుల్లో ఎవరెలా తిరిగినా తమదైన ప్రైవేటు స్థలంలో కూర్చుండిపోయేలా చేయగలిగితే... అదే కోటానుకోట్ల స్వచ్ఛభారత్ ప్రాజెక్టుల సమానం. ఆనాడే స్వాస్థ్య భారత్ ప్రాజెక్టు విజయవంతం. ఆనాడే మన పురుషులైనా, మహిళలైనా ముఖం దించుకుపోకుండా, మెడలు వంచుకుపోకుండా నిటారుగా ఠీవిగా నించోగలరు. తెల్లారితే ఎలాగో అనే ఆందోళన లేకుండా కంటికి నిండైన నిద్రతో పడుకోగలరు. – యాసీన్ -
అల్లా ఆశీర్వదించిన పావురాలు
తెల్లవారుజాము నుండే చేతినిండా ఉన్న పనులతో సతమతమవుతూ, వంటిల్లు అనబడే రణరంగంలో కత్తి పీట, చాకు, అప్పడాల కర్ర, పెనం, అట్లకాడ మొదలైన ఆయుధాలతో పోరాడే సరయూ గుండెలయ, పావు తక్కువ ఎనిమిదింటికి తను ఇంటి దగ్గర ఎక్కే సిటీ బస్సులో కూర్చున్న తరువాతే నియంత్రణలోకి వచ్చేది. ఆ వంటింటి నుండి తనకు విడుదల లేదేమో అనే ఆలోచన మనస్సులో మెదలి కోపం, అసహాయతతో ఉడికిపోతూ, చెమటలు కారుస్తూ బస్సెక్కే ఆమెకు కిటికీ పక్కన సీటు దొరికితే కొద్దిగా నెమ్మదిగా అనిపిస్తుంది. నింపాదిగా ఆమె చుట్టూ ఆవరించే చల్లని గాలికి ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంటుంది. తరువాత కళ్లు తెరచి బయటి దృశ్యాల చిత్రాలను మనస్సులోకి దింపుకున్నప్పుడల్లా లోపలి ఒత్తిడి తగ్గి, మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. అప్పుడే హఠాత్తుగా ఎదురయ్యే మలుపు దగ్గర ఉన్న ఏకాకి వేపచెట్టును దాటి బస్సు తిరుగుతుంది. రైల్వే అండర్ బ్రిడ్జి దాటి దిగువలో ఉన్న బారాకొట్రి అనే రహస్యలోకానికి చేరుకుంటుంది. శాహిదా ఇంటిపనికి వచ్చేదాకా బారాకొట్రి అనే ఒక లోకం ఉన్న సంగతే తెలియదు సరయూకి. ఉదయం తొమ్మిదిగంటలకు సరిగ్గా అల్లాహో అక్బర్ అని వినిపించే సమయానికి కాకతాళీయమేమో అనిపించేటట్టు బస్సు బారాకొట్రిని చుట్టుకుని వెళ్తుంది. చాలావరకు ముస్లిములు నివసించే ఈ ప్రదేశానికి బారాకొట్రి అనే పేరు ఎందుకు వచ్చిందో అని అప్పుడప్పుడూ సరయూ అనుకుంటుంది. రోడ్డుకు దగ్గరగా ఉన్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు, స్పీకర్లు కట్టుకుని నుంచున్న మసీదు, ఉర్దూ ప్రైమరీ స్కూలు, కొన్ని గ్యారేజులు, వర్క్‌షాప్‌లు ఉన్న ఆ ప్రదేశం పాత ప్లాస్టిక్, ఇనుప సామానుల త్యాజ్యాలను పరచుకుని చెల్లాచెదురుగా ఉంటుంది. పొడుగు జుబ్బా, పొట్టి లుంగీ ధరించి తెల్లగడ్డాలలో మునిగిన ముసలివారు, నడుము నుండి జారిపోతుందా అనేట్టున్న జీన్స్‌ప్యాంట్ పైన సల్మాన్, షారూఖ్‌ల చిత్రాలున్న టీషర్ట్లు ధరించి ఛాతీ విరుచుకుని నుంచున్న నవయువకులు చాలా వరకు కనిపిస్తారు. ఎప్పుడైనా ఒకసారి బురఖాలు ధరించిన ఆడవాళ్లతో పాటు అన్ని వయసుల పిల్లలూ బిలబిలమని బస్సులోకి జొరబడతారు. రోడ్డుకు తెరచుకున్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళ వైపు సరయూ ఎప్పుడూ కుతూహలంగా చూస్తూ ఉంటుంది. ఇళ్ళ ముందు మెట్లు కాకుండా పెద్ద నాపరాయి ఏటవాలుగా కనిపిస్తుంది. ఆ రాయిని ఆనుకునే మురికి కాలువ ప్రవహిస్తుంది. కొన్నిసార్లు సర్రుమని తెరలు తొలగించి మెరుపు తీగల వలె దేవకన్యలు బయటకు తొంగిచూస్తారు. ఎప్పుడైనా ఒకసారి ఇంటిముందు పరచిన నాపరాళ్ళ మీద బట్టలు ఉతుకుతూనో, సొట్టలు పడిన అల్యూమినియం పాత్రలు తోముతూనో, చిన్న పిల్లల తలలోని పేలు తీస్తూనో కనిపించే వీరు పాతాళం నుండి పైకొచ్చిన అప్సరసల మాదిరి కళ్ళు మిరుమిట్లుగొలుపుతారు. లేత అందాలతో పాటు చెప్పలేని అంతరంగ ప్రకాశమేదో కనిపిస్తున్నట్లుంటుంది వాళ్ళలో. అకస్మాత్తుగా వారేమైనా బస్సు వైపు చూస్తే, వారినే గమనిస్తున్న సరయూ గాభరా పడుతుంది. అలా వాళ్ళ కళ్ళు కలిసినప్పటి క్షణాలలో కలిగిన భావనలను అర్థం చేసుకోలేక చూపు తిప్పేస్తుంది. ఎప్పటికైనా తను వీళ్ళతోటి తనలో కలిగే ఈ భావనలను పంచుకోవచ్చా? అలాంటి అదను ఎప్పటికైనా వస్తుందా? అనిపించి తనపైన తనకే ఆశ్చర్యం కలుగుతుంది. ముందంతా ధారవాడ నగరానికి బయట, ఎవరూ పట్టించుకోకుండా తానేమో తనదేమో అన్నట్లున్న బారాకొట్రి అనే ఈ మురికి కాలనీ నగరానికి మధ్యకు రాగానే కళ్ళకు కొట్టొచ్చినట్లు మారింది. దానిని ఆనుకునే ఉన్న గౌళిగల్లి ఇప్పుడు బసవగిరిగా గణ్య వ్యక్తులు నివసించే ప్రదేశంగా మారి అక్కడి సైట్ల విలువ ఆకాశానికి చేరుకోవడం ప్రారంభమైనాక ఇప్పుడు ఇంకా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రమక్రమంగా బారాకొట్రి రోడ్లలో మేయడానికి వెళ్తూ కనిపించే పశువులు మాయమై, వేగంగా రయ్‌మని దూసుకెళ్ళే పెద్ద పెద్ద కార్లు కనిపించసాగాయి. అలాగే కొంచెం ముందుకెళితే నిర్మలానగర్ ఉంది. తెల్లటి తెలుపురంగులతో ఆకాశంలోకి చొచ్చుకుపోయే చర్చిలు, కాన్వెంట్లు, శుభ్రంగా కనిపించే పార్కులు, ఆట మైదానాలు కనిపిస్తాయి. అలాగే ముందుకువెళితే విశ్వవిద్యాలయం మహాద్వారం ఎదురవుతుంది. విధానసభను తలపించే యూనివర్సిటీ భవనం కనిపించి బారాకొట్రి గుర్తులను చెరిపేస్తుంది. మెయిన్ బిల్డింగ్ దాటి ముందుకు వెళ్తే డిపార్ట్మెంట్ల నుండి లోపలికీ బయటికీ ఫైలులను ఛాతీకి హుత్తుకుని ఎగురుతున్నట్లు నడిచే విద్యార్థీ విద్యార్థినులు అక్కడి గాలికి సుగంధాన్నలుముతారు. వైవిధ్యాలను జీర్ణించుకున్న విశ్వవిద్యాలయమనే ప్రపంచంలోకి బారాకొట్రికి చెందిన పొగచూరిన పరదాల చాటునుండి వచ్చిన శాహిదా అడుగు పెట్టిందే ఒక ఆశ్చర్యం! లారీ డ్రైవరైన మొగుడు యాసీన్ ఒక ప్రమాదంలో ఒక చేయి పోగొట్టుకున్నాక, తనపైనే ఆధారపడిన ఇద్దరు పిల్లల సంసారాన్ని పోషించడానికి తన రెక్కలు ముక్కలు చేసుకోక తప్పింది కాదు ఆమెకు. యూనివర్సిటీలో తోటపని చేసుకుంటున్న అబ్దుల్లా ద్వారా శాహిదా అక్కడి నేల ఊడ్చడం, తుడవడం చేసే గ్యాంగ్‌లో చేరుకుంది. మొదటిసారి అంత పెద్ద బిల్డింగ్‌లోకి అడుగుపెట్టినప్పుడు శాహిదా కాళ్లు వణికాయి. కుంకుమ, విభూతి ధరించి ఇంతెత్తు నిలుచున్న బీరువాలు, కంప్యూటర్లు, లేసులతో కట్టిన లావుపాటి ఫైళ్ళు, వాటి మధ్యన మునిగిపోయిన కళ్ళద్దాల అధికారులు, సీలు సైన్ అంటూ అటూ ఇటూ పరుగులు తీసే జవాన్లు...ఇవన్నీ చూస్తూ తికమక పడిన శాహిదా కొద్దిగా నిలదొక్కుకోగలిగింది తను పనిచేసే బయోకెమిస్ట్రీ డిపార్డ్మెంట్ ల్యాబుల్లో ధ్యానాసక్తుల వలె తెల్లకోటులు వేసుకున్న విద్యార్థినుల సాహచర్యంలో. వాళ్లను చూసినప్పుడల్లా ఆమెకు తన పిల్లలు సూఫియా, శిఫా గుర్తుకు వచ్చేవారు. కొట్టుమిట్టాడే కలలు మళ్లీ చిగురించేవి. కానీ వెలుగును వెన్నంటే వచ్చే చీకటిలా కలల వెనుకే వచ్చే తన పరిస్థితి యొక్క కలవరం ఆమెను వెక్కిరించేది. చేతకాని తండ్రి వద్ద వదలి వచ్చిన తన నాలుగు సంవత్సరాల సూఫియా, రెండు సంవత్సరాల శిఫాలను తలచుకుని కన్నీరుమున్నీరయ్యేది. అందుకే పొద్దున పదిగంటల నుండి సాయంత్రం ఐదుదాకా చేసే యూనివర్సిటీ పనికి వీడ్కోలు చెప్పేసి ఇంటి పనులు వెతుక్కుంటూ స్టెల్లా ఆంటీ ఇంటికి వచ్చింది. ఆమె కష్టాలు చూడలేక స్టెల్లా ఆంటీ, ఎదురింటి రెడ్డి ఆంటీ, పక్క ఇంటి శోభా ఆంటీ వాళ్ల ఇళ్లను కూడా ఇప్పించింది. స్టెల్లా ఆంటీ వాళ్ల మేడ మీదికి అద్దెకు వచ్చిన సరయూకు శాహిదా పరిచయం ఇలా జరిగింది. ఆరోజు శాహిదా ఇంట్లోకి వచ్చి నుంచున్నప్పుడు ఒక్క క్షణం సరయూ ఆశ్చర్యంగా నిలుచుండిపోయింది. ఆరోజు ఆమె మాట్లాడిన మాటలు ఒకటో రెండో మాత్రమే. స్టెల్లా ఆంటీ పూనుకొని సరయూ ఎదుర్కొంటున్న తిరగలిలాంటి పరిస్థితులని చెప్పి శాహిదాకు ఆమె బాధ్యతలను వివరించింది. సరయూ ఇంట్లోని రొట్టెలపైన శాహిదా వ్రేళ్ళ గీతలు పడినట్లల్లా ఆమె చేతి వెచ్చదనం అనుభవానికి వస్తూ వంటింట్లోనూ వెచ్చని అనుభూతిరాసాగింది. మెడనొప్పితో బాధపడే సరయూ భుజాల పైన శాహిదా వ్రేళ్ళు ఆప్యాయంగా తడిమి నొప్పి మూలాలను వెదకసాగాయి. లోతుకు దిగినకొద్దీ ఎక్కడో పెనవేసుకున్న లతల్లాంటి ఆడబతుకుల బాధలన్నిటికి మూలం ఒకటేనేమో అనిపిస్తూ, ఇద్దరు దగ్గరవుతూ పోయారు. అప్పుడే శాహిదా తన అనాథబాల్యం గురించి చెప్పింది. పెంచుకున్నవాళ్ళు సరిగ్గా తిండి పెట్టకపోవడం దగ్గర నుంచి ఆకలి, అవమానాల వరకు... చివరికి ఆమెకన్న ఒక అంగుళం పొట్టిగా ఉన్న యాసీన్ మెడకు ఆమెను కట్టి నిట్టూర్చేవరకు అన్నీ పంచుకుంది. తరువాత యాసీన్ ప్రేమలో తాను ఒక మనిషే అనే భావన మేలుకుని ఆమె బతుకు నిజంగానే స్వప్న సదృశమయింది. మెరుపుల టిక్లీలున్న చీరతో బురఖాలో దూరి సినిమా చూసిందీ, లారీలోని ఎల్తైన సీట్లో శెహజాదీలా కూర్చుని బయటి ప్రపంచాన్ని చూసింది, ఇలాంటి మురిపాల నడుమ సూఫియా, శిఫా తన ఒడిలో పడిందీ...అన్ని సినిమా రీళ్ళలా సాగిపోయాయి. తనదీ ఒక ముచ్చటైన సంసారం, ఆ సంసారానికి దీపాలుగా పుట్టిన ఈ పాపలు అల్లా ఆశీర్వదించి పంపిన పావురాలే అనిపించేది ఆమెకి. వారిద్దరికీ తను అనుభవించిన అనాథబ్రతుకు, అవమానాలను ఏ మాత్రం తగలకుండా పెంచాలి అనే పట్టుదల కళ్ళ ముందే కూలింది విధి ఆడిన నాటకంతోనే.రోడ్డు ప్రమాదంలో ఒక చెయ్యి పోగొట్టుకున్న యాíసీన్ తన మరో చేతిని కూడా పోగొట్టుకున్నాడు. పక్షవాతం వల్ల చెయ్యి చచ్చుపడిపోయింది. అప్పుడు శాహిదా కృంగిపోయింది. ఎవరూ ఆదుకోవడానికి రాకపోవడం చూసి తనే నడుము బిగించింది. కష్టాలు ఆమెకు కొత్తకావు. కానీ కల చెదిరిపోడమే దిగ్భ్రమ. భర్తకు, పిల్లలకు స్నానాలు చేయించి, బట్టలు ఉతికి, వండి, పిల్లలను భర్తకు అప్పగించి బయటపడే శాహిదాను భయం ఆవరిస్తుంది. దేనినీ ఎత్తలేని, సరిగ్గా నడవనూలేని భర్త నిస్సహాయత, పిల్లల్లో తొంగి చూసే అనాథ భావం ఆమె మనస్సును పిండివేసేది. నెమ్మదిగా తాను తిని, తండ్రికి తినిపించే స్థాయికి చేరుకుంది సూఫియా. ‘‘మనందరిలోనూ చాలా శక్తి ఉంటుందట అక్కా... మరి అది బయటికి రావాలంటే కష్టాలు రావాలికదా... అల్లా దాన్ని పరీక్షిస్తాడట’’ అంటూ సగం నవ్వు సగం ఏడ్పులతో చెప్తూ శాహిదా కళ్లనీళ్ల పర్యంతమయ్యేది. సరయూకు కూడా కళ్లలో నీళ్లు తిరిగేవి. ‘‘ఏమైనా కానీ పిల్లలను మాత్రం బాగా చదివించు శాహిదా. డబ్బుల అవసరం వస్తే అడుగు’’ అంటూ సరయూ చూపిన అభిమానానికి హృదయం నిండిరాగా ‘‘అంత చాలు అక్కా! ఆ మాట చాలు నాకు... కావలసి వస్తే తప్పకుండా అడుగుతాను’’ అంటూ మాట మార్చేది. రంజాన్ నెలలో మాత్రం పనికి రావడం కుదరదు అని కచ్చితంగా చెప్పేది శాహిదా. ఆ నెలలో శ్రీమంతులు దాన ధర్మాలు చేస్తారు. అప్పుడు వారు యాసీన్ దీన పరిస్థితిని చూసి కొంచెం ఉదారంగా ఇచ్చేవారు.ఇవన్నీ ముందు ఆమెకు అలవాటు లేకపోయినప్పటికీ పరిస్థితులు తప్పనిసరిగా అలవాటు చేశాయి. ఒక సంవత్సరానికి సరిపడే ధాన్యాలు, దుస్తులు ఈ నెలలోనే వచ్చి పడేవి. అంతే కాక పండుగ రోజు వాళ్ల వీళ్ల ఇళ్లు శుభ్రం చేసి, వంట సాయం చేసి బక్షీసు తీసుకునేది. రంజాన్ రోజు వాళ్లు చేసే శీర్ కుర్మా మాత్రం తప్పకుండా తెచ్చేది. సరయూ కొడుకు రాఘవకు అదంటే ప్రాణం అని తెలుసు శాహిదాకు. అలాంటి ఒక రంజాన్ నెలలో సరయూ ఊరి నుండి ఆమె చెల్లెలు సుమ, గిరిజత్త వచ్చారు. వాళ్లు వచ్చేటప్పటికి శాహిదా పన్లోకి రావడం లేదు. గిరిజత్తకు శాహిదా చేసిన జొన్న రొట్టెలు, కూరలను ఎలా తినిపించడమా అనే వ్యథ కలిగింది సరయూకు. సుమా తమాషాకు ‘‘అయ్యో అక్కా! ఆమె పేరు ఏ లక్షో్మ, పార్వతి అనో చెప్పెయ్యరాదా. ఒక బింది ప్యాకెట్ శాహిదాకు ఇచ్చి మేము వెళ్లిపోయేదాకా పెట్టుకోమను.’’ అంటూ కన్నుకొట్టింది. శాహిదాకు బొట్టు పెట్టుకుని లక్ష్మిలా కనబడడాన్ని ఊహించుకున్న సరయూ కూడా నవ్వింది. ‘‘క్యాలెండర్‌లోని లక్ష్మిదేవిలా కనిపిస్తుంది శాహిదా’’ అంది. రంజాన్ రోజు సుమా సరయూ చెవిలో ‘‘ఈ రోజు మీ క్యాలెండర్ లక్ష్మి శీర్ కుర్మాతో ప్రత్యక్షమవుతుందా?’’ అంటూ హాస్యమాడింది. ‘‘ఏ లక్ష్మీనే’’ అని గిరిజత్త అడిగినదానికి ఇద్దరూ ముఖాలు చూసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు.సాయంత్రానికి శాహిదా శీర్ కుర్మాతో నిజంగానే ప్రత్యక్షమయింది. కానీ ఆ రోజు ఆమె బురఖా ధరించింది. సరయూ ఒక్క క్షణం అవాక్కయింది. ఇంతవరకు శాహిదా ఎప్పుడూ బురఖా ధరించలేదు. అలా చూస్తే వారిద్దరూ ఎప్పుడూ దేవుడి గురించి కానీ, మతం గురించి కానీ ఆచారాల గురించి కానీ మాట్లాడుకోలేదు. శాహిదా మాత్రం మామూలుగా ‘‘ఎల్లుండి నుండి పన్లోకి వస్తానక్కా! ఇది తీస్కుని డబ్బా ఖాళీ చేసిస్తే వెళ్లిపోతాను. చాలా పన్లున్నాయి. చీకటి పడుతోంది’’ అని తొందరపెట్టింది. రాఘవను ముద్దాడి ‘‘బాగా కిస్మిస్, జీడిపప్పు వేశాను. తినాలి నువ్వు సరేనా?’’ అంటూ గడప దాటింది. ‘‘ఇదేమిటి? వాళ్ల అల్లా ప్రసాదమా’’ అంటూ గిరిజత్త రాగం తీసింది. ‘‘మరి ఆ దేవుడు ఈ దేవుడు అంటూ గుళ్లు తిరుగుతావు కదా. ఈ ప్రసాదాన్ని కూడా తీసుకో మరి’’ అంటూ సుమ తమాషా చేసింది గిరిజత్తను. గిరిజత్త మొహం తిప్పేసుకుంటూ ‘‘నాకు రేపటి నుండి రొట్టె, కూర వద్దమ్మా. ఎందుకో కొద్దిగా అజీర్ణమయినట్టనిపిస్తుంది. అన్నమయితే మెత్తగా ఉంటుంది. అది చాలు’’ అంటూ లేచి లోపలికి వెళ్లింది.ఊళ్లో అంతా గిరిజత్త అంటే చాలా మంచిపేరు. మహిళా మండలి, భజన మండలి అంటూ అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటుంది. ఆ రోజు రాత్రి ఆమె సరయు–సుమలకు క్లాసు తీసుకుంది. ‘‘మనవాళ్లు ఈ మధ్య చాలా చెడిపోతున్నారు.ఆచారాలను మంటగలుపుతున్నారు. దీనివలన మన సంస్కృతి చెడిపోతోంది. అందరూ వారి వారి దారిలో సరిగ్గానే నడుస్తున్నారు. మనం మాత్రం ‘మనది’ అన్నదాన్ని కాలరాచివేస్తున్నాం. నీ భర్తను, బాబును రోజూ సంధ్యావందనం చెయ్యమను. నువ్వు కూడా ఏదైనా నోమో వ్రతమో ప్రారంభించు. మనం మాత్రమే మన సంప్రదాయాలను నిలుపుకోవాలని మొన్న స్వామీజీ కూడా చెప్పారు’’ అని మరీ మరీ చెప్పింది. మరుసటి రోజు పన్లోకి వచ్చిన శాహిదా అన్యమనస్కంగా కనిపించింది. సూఫియా, శిఫాల స్కూల్ గురించిన వివరాలడిగినప్పుడు ‘‘అక్కా! సూఫియాను గవర్నమెంట్ స్కూల్లో వేశాం కదా. శిఫానైనా మదరసాకు పంపాలనుకుంటున్నాము. మా రీతి నీతులు అన్నీ నేర్చుకోవాలి కదక్కా! మేమైతే అవేం తెలుసుకోకుండా పెరిగి కాఫిర్లమైనాము. అదైనా కురాన్, హదీస్ అన్నీ నేర్చుకోనీ అని...’’ అంటూ ఆపేసింది. నిన్ననే చాలా ఇబ్బందిగా తన గిరిజత్త నుండి విన్న ఈ ‘మనది’ అనే పదం, మనసును కలవర పెట్టినా మాటలను కొనసాగించకుండా గమ్మునయిపోయింది సరయూ.మరుసటి రోజు పన్లోకి వచ్చిన శాహిదా యాంత్రికంగా రొట్టెలు తట్టుతోంది. గ్యాస్ పొయ్యి మీద పొంగుతున్న రొట్టెను తన చేతివేళ్లతో చాకచక్యంగా తిప్పుతున్నా చూపు ఎక్కడో ఉంది. అంతలో శాహిదా సన్నగా ఏడవడం వినిపించింది. ఆ రోజు ఆదివారం కావడం వలన సరయూ ఆమెను మాటల్లోకి దింపింది. ‘‘అక్కా! ఈ మధ్య మా ఇంటాయన నా పైన చాలా అనుమాన పడుతున్నాడు. బురఖా లేకుండా బయటికి వెళ్లకూడదు అని తాకీదు చేశాడు.నేను ఎవరెవరి ఇళ్లకు పనికి వెళ్లానో వాళ్ల ఇంటి ముందు వచ్చి నిలబడుతాడు. నువ్వేం నన్ను పోషించక్కర్లా అంటూ వడ్డించిన కంచాన్ని ముక్కూ మూతీ చూడకుండా విసిరేస్తాడు. చేతులు ఎత్తడానికి చేతకాదు కదా. అందుకే కూర్చున్న చోటునుంచే కాలితో తంతాడు. అలా కొట్టినప్పుడు పడబోతే మళ్లీ తన్నులు తిన్న నేనే పట్టుకోవాలి. ఆ మనిషిని చూస్తే ఒక్కోసారి చెడ్డ కోపం వస్తుంది. ఒక్కోసారి జాలి వేస్తుంది’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆశ్చర్యమేమంటే గిరిజత్తే శాహిదాను ఓదార్చింది. ‘‘ఈ మగవాళ్లంతా ఇంతేలే. ధైర్యంగా ఉండు’’ అంటూ గిరిజత్త శాహిదా చెయ్యి పట్టుకుని చెప్పింది. ఆ రోజు లలితా సహస్ర నామాలు చదివి ముగించిన తరువాత ‘‘ఆడతనాన్నే అఖండ శక్తి కేంద్రంగా భావిద్దాం. ఆ భావనలో సరయూ, శాహిదా, స్టెల్లా వేరువేరుగా కనిపించరు కదూ’’ అన్నది సుమ. ఆమె మాటలు పుస్తకాలలో ఉపయోగించే మాటల మాదిరిగా అనిపించినా అందులోని అర్థం మనసుకు తెలిసినటై్ట సరయూ, గిరిజత్త మౌనం వహించారు.సరయూకు ట్రాన్స్ఫర్ అయి ఆమె సంసారం ధారవాడ నుండి బయలుదేరినప్పుడు శాహిదా పావురాళ్లలాంటి తన ఇద్దరు కూతుళ్లనూ తన భర్తనూ తీసుకుని వీడ్కోలు చెప్పడానికి వచ్చింది. ‘‘శాహిదా! నీ ఆరోగ్యం జాగ్రత్త. వీరిద్దరినీ బాగా చదివించు... ఏమయ్యా.. మా శాహిదాను ఇబ్బంది పెట్టవద్దు’’ అంటూ సరయూ ఏమేమో అప్పగింతలు చదివింది. ‘‘ఆయనకు చెప్పండక్కా! నాకైతే వీళ్లిద్దరినీ యూనివర్సిటీలో చదివించాలని ఉంది’’ బిడియంగా అంది శాహిదా. ‘‘దానికి నా ఓటు కూడా ఉంది’’ అంటూ శాహిదా చెయి నొక్కింది సరయూ. సరయూ మనసులో ముద్రపడిన ఈ జ్ఞాపకాలను ఏమాత్రం చెదరకుండా మళ్లీ ఆమెను మేలుకొలిపింది మొన్న ఫేస్బుక్లో ఆమె యాక్సెప్ట్ చేసిన ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వలన. శిఫా అనే ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తున్న ఆత్మవిశ్వాసమే మూర్తీభవించినట్టున్న అమ్మాయి రిక్వెస్ట్ అది. ఆ ప్రొఫైల్ చూస్తున్నప్పుడల్లా గుండె ఆత్మీయతతో కొట్టుకోసాగింది. అందులో ఐదారు గోల్డ్ మెడల్స్ ధరించిన అమ్మాయి ఫొటో, పక్కలో నించున్న శాహిదా, వెంట్రుకలు అక్కడక్కడా నెరిసినట్టు కనిపించడం తప్ప మిగతా అంతా తను అప్పుడు చూసిన శాహిదానే! ఇన్‌బాక్స్‌లో ఒక మెసేజ్ కనిపించడం ‘‘అమ్మ మిమ్మల్ని చాలా అనుకుంటుంది ఆంటీ. నేను అక్కా ఇద్దరూ యూనివర్సిటీ చదువులు ముగించాము. సూఫియా బయోకెమిస్ట్రీలో పి.హెచ్.డి చేసి ఇక్కడే యూనివర్సిటీలో పని చేస్తోంది. నాది మొన్న ఇంగ్లీష్ ఎమ్.ఏ అయింది. అమ్మ.. మిమ్మల్ని చూడాలని కలవరిస్తోంది’’ అని ముగించింది. ఇంకో ఫొటోలో సూఫియా, శిఫా ఇద్దరూ దేవకన్యల మాదిరి నుంచుని కనిపించారు. బారాకొట్రిలో నాకు కనిపించిన లేత కన్యలు కొంత గాంభీర్యాన్ని సంతరించుకున్నట్లు అనిపించింది. కానీ అప్పుడు అక్కడ కనిపించిన ఆంతర్యంలోని వెలుగు మాత్రం మాసిపోకుండా మొహాల్లో కనిపించింది. సమయాన్ని తమ రెక్కల్లో పొదువుకుని ఎగిరే అల్లా ఆశీర్వదించి పంపిన పావురాల్లాగా! కన్నడ మూలం : గీతా వసంత్ అనువాదం: చందకచర్ల రమేశ్‌బాబు -
గుండెపోటుతో ‘సాక్షి’ విలేకరి మృతి
వనపర్తి అర్బన్: వనపర్తి జిల్లా గోపాల్పేట ‘సాక్షి’ దినపత్రిక రిపోర్టర్ యాసిన్(38) హఠాన్మరణం చెందారు. యాసిన్ స్వస్థలం గోపాల్పేట మండ లం పొల్కెపాడు కాగా, వనపర్తిలోనే నివాసముంటున్నారు. బుధవారం సాయంత్రం ఆయన భార్యాపిల్లలతో కలసి అత్తగారి ఊరైన పెద్దమం దడి మండలంలోని పామిరెడ్డిపల్లెకు వెళ్లారు. గురువారం ఉదయం 5 గంటలకు ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో వారు వనపర్తి ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పొల్కెపాడుకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. యాసిన్ కు భార్యతోపాటు ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. సాక్షి ఉద్యోగులు, విలేకరులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించడంతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. ‘సాక్షి’ తరఫున తక్షణ సాయంగా రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. -
డాక్టర్ పంచతంత్రుడు...!
‘‘నాన్నా! ఏనుగులకు అంతంత ఒబెసిటీ ఉంటుంది కదా. వాటికి హార్ట్ ఎటాక్ రాదా?’’ అడిగాడు మా బుజ్జిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అంతలో వాళ్ల అమ్మ వచ్చింది. ‘‘మీరేమో వాణ్ణి డాక్టర్‌ను చేయాలంటారు. తొమ్మిదో క్లాసుకు వచ్చినా నాలెడ్జీ మాత్రం సున్న. వాడికి మొన్న బయాలజీ పరీక్షలో వచ్చిన పర్సెంటేజీ పద్నాలుగు. వాడి టీచరేమో మాటిమాటికీ పిలిచి మనల్ని తిడుతోంది. వాడు చదవడు... మీరు చదివించరు’’ అంటూ క్లాసు తీసుకుంటుంటే కాసేపు వాడికి బయాలజీ చెబుదామని నేను ట్రై చేశా. న్యూట్రిషన్ అనే లెసన్నుంచి వీడికి రకరకాల ప్రశ్నలిచ్చారు. రకరకాల టెక్నికల్ నేమ్స్‌తో ఆ లెసన్ సాగింది. ఆ పోషకాల పేర్లు గుర్తుపెట్టుకోవడం వీడికి సాధ్యపడలేదట. నాకున్న మిడిమిడి జ్ఞానం కొద్దీ వాడికేదైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటే నాకూ ఆ టెక్నికల్ టర్మ్స్ అర్థం కాలేదు. దాంతో వాడికి కాస్త రిలాక్సేçషన్ ఇద్దామని అనుకున్నా. ‘‘ఒరేయ్ ఈ తిట్ల మూడ్‌లో నువ్వు లెసన్ చదువుకోలేవు. చదివినా అర్థం కాదు. కాబట్టి కాసేపు ఈ పుస్తకం చదువుకో’’ అంటూ వాడి చేతికి పంచతంత్రం ఇచ్చా. కథల పుస్తకం కావడంతో వాడూ దాన్ని శ్రద్ధగా చదువుతూ లీనమయ్యాడు. కొద్దిగా రిఫ్రెష్ అయ్యాక... బయాలజీ కూడా చదువుకున్నాడు. ఆ మర్నాడు ఉదయం నిద్రలేవగానే నా దగ్గరికి వచ్చాడు. ‘‘పంచతంత్రం చదివాక బయాలజీ ఇంకా బాగా అర్థమైంది నాన్నా’’ అన్నాడు. ‘‘ఎలారా?’’ అడిగా. వాడు కథలు కథలుగా నాకు చెప్పిన విషయాలివి. మొదటి చాప్టర్ గ్రీన్లాభం అప్పట్లో గజేంద్రుడనే ఏనుగుల రాజు తన మందతో గడ్డి మైదానాలలో య«థేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఏనుగులు అన్ని రకాల పదార్థాలూ తినేవి. ఏదిబడితే అది నోట్లోకి కుక్కడం, మెక్కడం వల్ల వాటికి పెద్ద పెద్ద ఊబకాయాలు వచ్చాయి. ఆ ఒబేసిటీ కారణంగా హఠాత్తుగా హార్ట్ఎటాకులూ గట్రా వచ్చి చాలా ఏనుగులు హరీమనేవి. వాటి కళేబరాలు పడి ఉన్న ప్రాంతంలో అది పూర్తిగా కుళ్లి శిథిలమయ్యేవరకూ గడ్డి కూడా మొలిచేది కాదు. ఇది చూసిన హరితవర్ణిత అనే గడ్డిమొక్క తీవ్రమైన విచారంలో మునిగిపోయింది. ఒకనాడు గజేంద్రుడు అడవిలో సంచరిస్తుండగా హరితవర్ణిత ఆ ఏనుగుల రాజును తన దగ్గరికి పిలిచి ఇలా అన్నది. ‘‘ఓ ఏనుగోత్తమా! మీరు ఏది బడితే అది తిని ఎక్కడబడితే అక్కడ గుటుక్కుమంటున్నారు. దాంతో మీ కళేబరం పడి ఉన్న ప్రాంతంలో చాలాకాలం పాటు గడ్డిమొలవకుండా పోతోంది. పైగా ఇటీవల ఇక్కడ భూసారమూ బాగా తగ్గుతోంది. ఈ రెండు అంశాలూ మా మనుగడకు అడ్డమవుతున్నాయి. కాబట్టి ఓ భారీకాయమా! ఇకపై అనారోగ్యకరమైనవి తినకండి. కేవలం ఆకుపచ్చటివి మాత్రమే తినండి. అప్పుడు మీరు పుష్కలంగా పెంట వేస్తారు. దాంతో నేల సారవంతమవుతుంది. మరింత గడ్డి, పచ్చటి మొక్కలు మొలుస్తాయి. అది మీకూ మాకూ మంచిది’’ అంది. ‘‘అవును ఇది నిజం. ఇది నిజం. మమ్మల్ని తొక్కేయకుండా మాకూ ఇలా మేలు చేయండి’’ అంటూ తోటకూరడూ, పాలకూరడూ, గోరుచిక్కుడు, పచ్చఅరిటుడు అనే ఇతర మొక్కార్భకులు ప్రాధేయపడ్డాయి. అప్పట్నుంచి ఆకులు అలములు మాత్రమే తినడం మొదలుపెట్టాయి. వాటి ఒబేసిటీ ఏమాత్రం తగ్గకున్నా హార్ట్ ఎటాక్ రావడం మాత్రం ఆగిపోయింది. వాటి పెంటతో ఆ గడ్డిమొక్కలూ, ఇతర వృక్షజాతులూ ఏపుగా ఎదగడం మొదలుపెట్టాయి. ఇలా పరస్పర మైత్రితో ఇరువర్గాలూ మిత్ర లాభం పొందాయి. రెండో చాప్టర్ హెల్త్ భేదం అప్పట్లో హైదరాపురం అనే నగరంలో సైబరావనం అనే అరణ్యం ఉండేది. అక్కడ నిత్యానందం, సత్యానందం అనే ఇద్దరు వ్యక్తులు తమ తమ పనులు చేసుకుంటూ హాయిగా జీవించేవారు. అయితే వారి పనుల్లో కష్టం చాలా ఎక్కువగా ఉండేది. ఒకనాడు సిస్టముడు, ల్యాపటాపుడు అనే ఇద్దరు సేవకులు వారి దగ్గరకు వచ్చారు. ‘‘మిత్రోత్తములారా... మీరెందుకు ఇంతగా కష్టపడుతూ మీ రెక్కల్లాగే మెదడునూ ముక్కలు చేసుకుంటున్నారు. మమ్మల్ని ఉపయోగించుకుంటే మీ పనులు ఎంత సులువవుతాయో చూడండి’’ అన్నారు. అప్పట్నుంచి ఆ సేవకుల సాయంతో నిత్యానందుడూ, సత్యానందుడూ పనులు వేగంగా చేసేవారు. అయితే పనివేగం పెరగడంతో ఆవలి మెరక అనే ప్రాంతం నుంచి మరింతమంది మరిన్ని పనుల్ని వారికి అప్పగించడం మొదలుపెట్టారు. ఆవలి–మెరక అనే ఆ ప్రాంతం పేరు కాస్త పెద్దగా ఉండటంతో దాన్ని సూక్ష్మంగా ఆమెరక... ఆమెరక అని కూడా పిలిచేవాళ్లు. అక్కడి నుంచి వచ్చి పడే పనితో సైబరావనంలోని చాలామందికి పనిభారం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో మన సత్యా– నిత్యానందులకు ఇద్దరు అపరిచితులు తారసపడి ఇలా అన్నారు. ‘‘ఓ మిత్రోత్తములారా... నా పేరు శ్వేతకాష్టుడు. ఇతడి పేరు స్వప్నచిత్తుడు. మాతో స్నేహం చేయండి. నన్ను పీల్చగానే చుట్టూ పొగలు కమ్మి అవి మబ్బుల్లా ఆవరిస్తాయి. మీరు ఆ మబ్బుల్లో తేలిపోయినంతగా తేలికవుతారు. ఇక స్వప్నచిత్తుడిని గ్రోలగానే ఒళ్లంతా తేలికై హాయిగా ఉంటుంది. తర్వాత కాసేపటికి మంచి నిద్రపడుతుంది. దాంతో మంచి మంచి స్వప్నాలు వచ్చేలా చేస్తాడు కాబట్టి మావాడికి స్వప్నచిత్తుడని పేరు. అయితే కాస్తంత మత్తునిస్తాడంటూ గిట్టనివాళ్లు వాణ్ని ఆడిపోసుకుంటారు. మత్తుతో చిత్తు చేస్తాడంటూ మత్తుచిత్తుడని దూషిస్తుంటారు. కానీ మేము ఎవరినీ చిత్తుచేయము. టెన్షనుడనే ఒక అసురుడి సంతతి అన్నిచోట్లా విస్తృతంగా విస్తరిస్తోంది. వారితోనే మాకు వైరం. మేము చిత్తుచేసేది టెన్షనాసురుడి సంతతివాళ్లను మాత్రమే’’ అంటూ తమ గొప్ప చెప్పుకున్నారు. సత్యానందుడు వారిని లెక్కచేయలేదు గానీ నిత్యానందుడు వారిని ఆదరించాడు. ‘‘వారు తమ దుష్టత్వం గురించి తామే చెప్పుకుంటున్నారు. ఇంత చెప్పాక కూడా వారితో స్నేహం సరికాదు. అలాంటి వారి నుంచి దూరంగా ఉండటమే మేలు’’ అంటూ సత్యానందుడు ఒక సలహా కూడా ఇచ్చాడు. అయితే నిత్యానందుడు ఆ సలహాను లెక్కచేయలేదు. వారితో స్నేహం మొదలుపెట్టాడు. ఒకరోజు నిత్యానందుడు అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో తోటి మిత్రులు అతడిని డాక్టరుడనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. విషయం గ్రహించిన డాక్టరుడు నవ్వి ఇలా అన్నాడు. ‘‘ఓ నిత్యానందుడా... నీ తోటి మిత్రుడైన సత్యానందుడు నీలాగే పనిచేస్తున్నాడు కదా. అయినా అతడు అనారోగ్యానికి గురికాలేదు. అది ఎందుకో అర్థంచేసుకో. శ్వేతకాష్టుడు, మత్తచిత్తులతో నీ స్నేహం ఇలాగే కొనసాగితే నువ్వూ త్వరలోనే ఆ అకాలకిక్కరుడిలా ప్రాణాలు వదిలేస్తావు’’ అన్నాడు. అప్పుడు నిత్యానందం ‘‘ఎవరా కిక్కరుడూ... ఏమా కథ?’’ అని అడిగాడు. అప్పుడు డాక్టరుడు నవ్వి... ‘‘అప్పట్లో మాధవాపురానికి పడమటగా పదిక్రోసుల దూరంలో గచ్చిబౌళ్యం అనే ప్రాంతం ఉంది. అక్కడ కిక్కరుడు అనే వ్యక్తి పనిచేస్తుండేవాడు. ఒత్తిడిలో తనకు తెలియకుండానే కుర్చీలను తంతుండటం, పళ్లుకొరుక్కోవడం, జుట్టుపీక్కోవడం ఇత్యాది పనులు చేస్తుండేవాడు. టెన్షన్లో చూసుకోకుండా దేన్ని పడితే దాన్ని తన్నుతూ ఉండటం వల్ల కొందరతణ్ణి ఎగతాళిగా టెన్షన్ కిక్కరుడు అని కూడా పిలిచేవాళ్లు. నీకంటే ముందు అతడు ఈ శ్వేతకాష్టుడూ, మత్తచిత్తులతో స్నేహం చేశాడు. శ్వేతకాష్టుడు తెల్లగా నిలువెత్తు రూపంలో అందంగానూ, మత్తచిత్తుడు బంగారువర్ణంతో మిలమిలలాడుతూ ద్రవరూపంలో కనిపించేవారు. అంత అందమైన రూపురేఖలున్నాయి గానీ నిజానికి వారు దుష్టులు. తమ వద్ద రహస్యంగా ఉన్న నికోటినుడు, కొలెస్టరుడు అనే రాక్షసుల సాయంతో ఇతరులను కబళిస్తుంటారు. ఆ దుష్టజనసాన్నిహిత్యంతోనే కిక్కరుడు చనిపోయాడు. కాలం తీరకముందే పోవడం వల్ల ఆ దురదృష్టవంతుణ్ణి అందరూ ‘అకాల బకెట్ కిక్కరుడు’ అని కూడా పిలుస్తున్నారు’’ అని డాక్టరుడు కథ ముగించాడు. దాంతో ఆరోగ్యంలో భేదం తెచ్చే దుష్టసాంగత్యాలకు దూరంగా ఉండి నిత్యానందుడు నూరేళ్లు ఆరోగ్యంగా బతికాడు. సంధి... అప్పట్లో మొక్కలూ – జంతువులు పరస్పరం విపరీతమైన ద్వేషంతో రగిలిపోయేవి. కోపంతో జంతువులు మొక్కలను విచ్చలవిడిగా తినేస్తుండేవి. ప్రతీకారంతో మొక్కలు తమ వద్ద ఉన్న కంటకాలు అనే ఆయుధాలతో జంతువులను బాధించేవి. ఈ పోరు ఇరువురికీ నష్టం చేస్తుందని తెలుసుకున్న మొక్కలు ఒకరోజు జంతువులను తమ దగ్గరికి పిలిచాయి. ‘‘ఓ పిచ్చి జంతువులారా! విచ్చలవిడిగా మమ్మల్ని మేయడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం లేదు. నేడు మేము అంతరించిపోతే, రేపు ఆకలితో నకనకలాడుతూ మీరూ అంతరిస్తారు. ఒకప్పుడు మాకూ రవికిరణాలకు మధ్య తీవ్రమైన వైరం ఉండేది. వాటితో సంధి చేసుకొని మేం బాగుపడ్డాం. అదే దారిలో మీరూ–మేమూ సంధి చేసుకుందాం రండి’’ అని జంతువులకు సూచించాయి. ‘‘ఎవరా రవికిరణాలూ – ఏమా కథ’’ అడిగాయి జంతువులు. అప్పుడు రవికిరణాల వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాయి మొక్కలు. ‘‘అప్పట్లో మేం ఇలా పచ్చగా ఆకులతో ఉండేవాళ్లం కాదు. కింద ఉన్న కుళ్లు మీద పుట్టగొడుగుల్లా పెరిగేవాళ్లం. అంతరిక్షంలోని అరుణపురం అనే చోటి నుంచి రవికిరణాలు... కాంతిపుంజాలనే వాహనాలను ఎక్కి విహరించడానికి భూమ్మీదికి వచ్చేవి. మేం మా గొడుగులతో వాటిని అడ్డుకునేవాళ్లం. అవి తీక్షణత అనే ఆయుధాలను ధరించి మమ్మల్ని బాధిస్తుండేవి. ఆ ఆయుధాల తాకిడికి మేము కమిలి, ముడుచుకుపోయి మూర్ఛిల్లి మరణించేవాళ్లం. మేం మరణించాక కూడా కిరణాలు మమ్మల్ని వదిలేవి కావు. మమ్మల్ని పూర్తిగా ఎండేలా చేసేవి. ఒకనాడు మేమంతా కిరణాలతో చర్చలు జరిపాం. ‘‘అయ్యా... మీరు కారుణ్యాస్పదమైన కిరణోత్తములు. మమ్మల్ని ఎందుకిలా బాధిస్తున్నారు’’ అని అడిగాం. అప్పుడా కిరణాలు ‘ఓ మొక్కబాలకులారా! మేము అరుణపురం నుంచి ఏ గ్రహం మీదికి వెళ్లినా మాకెవరూ అడ్డురారు. కానీ భూగ్రహంలో మీరు గొడుగుల్లా విస్తరించి మమ్మల్ని అడ్డగిస్తున్నారు. మా గమ్యమైన నేలను తాకకుండా చేస్తున్నారు. అందుకే మేము మిమ్మల్ని కమిలిపోయేలా కబళిస్తున్నాం’ అన్నాయి. అప్పుడు మేమికపై వారిని పూర్తిగా అడ్డగించబోమని చెప్పాం. దాంతో ఆ రవి కిరణాలు కూడా కరుణించి ‘ఇకనుంచి మా ఎండతో మీ కండ పెరిగేలా చేస్తాం’ అని మాటిచ్చాయి. అప్పట్నుంచి మేం ఆకులను అభివృద్ధి చేసుకున్నాం. ఆకుకూ ఆకుకూ గ్యాప్ ఇస్తూ అవి గమ్యం చేరేలా చూస్తున్నాం. దాంతో కిరణాలు కూడా మాకు తమ శక్తిని ప్రసాదిస్తుంటాయి. ఆ శక్తిలోని వేడిమి సాయంతో మేం స్వయంపాకం చేసుకొని మా పాయసం మేమే వండుకు తింటుంటాం. అలా మా ఆహారం మేమే తయారు చేసుకుంటూ ఎండ సాయంతో కండపట్టడం మొదలుపెట్టాం. ఇదీ మా సంధి కథ. ఇలా సంధి చేసుకుంటే ఇరువురమూ లాభపడతాం’’ అని చెప్పాయి మొక్కలు. అంతేకాదు... జంతువుల గౌరవార్థం ఆమ్లజన్యం అనే శంఖాన్ని తీసి ‘ఇకపై దీన్ని మీరు ఊదుకోండి’ అని చెప్పాయి. అప్పుడు జంతువులు కూడా నిశ్చింతగా ఊపిరివదిలి అందులోంచి బొగ్గుపులుసు అనే రుచికరమైన పులుసు వంటకాన్ని మొక్కలకు ఇచ్చాయి. ఇచ్చి... ఇకపై మీ కిరణాహారంతో పాటు ఈ పులుసునూ కలుపుకొని ఫుల్‌మీల్స్ తినమని చెప్పాయి. ఆ ఆమ్లజన్యం శంఖాన్ని ఊదుకోవడం, ఈ బొగ్గుపులుసును జుర్రుకోవడం కష్టం కావడంతో అవి రెండూ వాయురూపంలోకి మారాయి. సంధి తర్వాత అటు మొక్కలూ, ఇటు జంతువులూ వాయురూపంలోని ఆ పదార్థాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని విందు చేసుకుంటూ ఇప్పటికీ సుఖంగా జీవిస్తున్నాయి. ‘‘ఇప్పటివరకూ బాగానే లాగించావు. సంధి తర్వాత విగ్రహం. ఇక్కడ సైన్సులోని న్యూట్రిషన్ పాఠం ఎలా చెబుతావురా? కష్టం కదా?’’ నేనడిగాను. ‘‘అందుకే నాన్నా! విగ్రహం బదులుగా ఈ చాప్టర్ పేరు ‘నిగ్రహం’ అని పెడతా’’ అన్నాడు. ‘‘నిగ్రహమా? అంటే? అందులో ఏం చెబుతావు?’’ ‘‘హెల్త్ బాగుండాలంటే ఏమేమి తినకుండా నిగ్రహం పాటించాలో ఈ చాప్టర్లో డీల్ చేస్తామన్నమాట. ఉదాహరణకు తెల్లరంగులో ఉండే శ్వేతభూతాలైన ఉప్పు, పంచదార ఇక్కడి పాత్రధారులు. ఇక అలాగే కొవ్వాసురులు, మాంసాసురులు అనే అసురుల పాత్రలు ప్రవేశపెట్టి... అవి చాలా రుచికరమైన కామరూపం ధరించి మార్కెటవనంలో, కిచెనాలయంలో, భోజనంబల్ల పరిసరాల్లో తిరుగుతూ ఆహ్వానిస్తుంటాయని చెపుతాం. వాటిని చూసి కూడా నిగ్రహించుకున్నవాడు అన్ని విధాలా బాగుపడతాడన్న విషయాన్ని ‘నిగ్రహం’ చాప్టర్లో వివరిస్తాం అన్నమాట’’ ఎక్స్ప్లెయిన్ చేశాడు మా బుజ్జిగాడు. ఒక్క విషయం నాకు నిర్ద్వంద్వంగా తెలిసిపోయింది. పంచతంత్రం కేవలం కథలు జీవితాన్ని నేర్పించడానికే పరిమితం కాదు. సరిగ్గా అన్వయించుకోవాలేగానీ... ఎవ్వరికైనా చదువు నేర్పించగలవవి. అలనాటి రాజు కొడుకులకేనా? విష్ణుశర్మ కల్లోకి వచ్చి అపరమొద్దు అయిన మా బుజ్జిగాడికి బయాలజీ, హెల్త్, న్యూట్రిషన్, మెడికల్ సైన్స్ ఇలా ఏదైనా చెబుతాడు. పంచతంత్రం శ్రద్ధగా చదివితే... రేపు మావాడు డాక్టర్ కావడం ఖాయమని నిశ్చయంగా తేలిపోయింది. – యాసీన్ -
అడవిలో హాస్పిటల్
‘కొన్ని కొన్ని జంతువులు – కొంతమంది డాక్టర్లను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాన్నా’ అన్నాడు మా బుజ్జిగాడు. నేనూ మా బుజ్జిగాడూ కలిసి డిస్కవరీ ఛానెళ్లూ, యానిమల్ ప్లానెట్లూ చూడటం నా పాలిట పెద్ద శాపమైంది. పాపం... కొన్ని జంతువులను కొంతమంది డాక్టర్లను చూపించక తప్పదంటూ వాడు తనదైన శైలిలో నా దృష్టికి తెచ్చాక... గొంతుపెగుల్చుకొని ఒక మాట మాత్రం అనగలిగాను. అదేమిటంటే... ‘ఏయే జంతువులు... ఏయే స్పెషలిస్టులను కలవాలి? అసలెందుకు కలవాలి’ అడిగా. ‘చెబుతా వినండి’అంటూ చెప్పిన విషయాలూ... కారణాలివి... ఏనుగులూ, హిప్పోలూ, రైనోలు అనునిత్యం శాకాహారం మాత్రమే తింటున్నా వాటికి విపరీతంగా ఒళ్లొచ్చింది. ఆ ఒబేసిటీ తగ్గడం ఎలాగో తెలుసుకొని, అవసరమైతే లైపోనో లేదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోడానికి అవి బేరియాట్రిక్ సర్జన్‌ను కలవాలి. ‘పాముచెవులు’ అంటూ సామెత ఉన్నప్పటికీ వాటికి చెవులు అస్సలు వినపడవట. ‘జాకబ్సన్ ఆర్గాన్’లాంటి ఇప్పుడున్న జ్ఞానేంద్రియాలకు తోడు చెవులు కూడా వినపడితే పాములు మరింత చురుగ్గా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అందుకే పాములన్నీ ఒకసారి ‘ఈఎన్టీ’ డాక్టర్లతో మెడికల్‌క్యాంపు పెట్టించుకోవడం చాలా అవసరం. తలనిండా తగినంత జుట్టు లేకపోవడంతో రాబందు బట్టతల స్పష్టంగా కనిపిస్తుంటుంది. బట్టతల కారణంగా దానికి ఓ క్రూరమైన లుక్ వచ్చింది. కాబట్టి అది తక్షణం ట్రైకాలజిస్టును కలిసి తల మీద ‘ఈకల ట్రాన్స్‌ప్లాంటేషన్’ చేయించుకుంటే మంచిది. కష్టాలూ, బాధలూ ఏవీ లేకపోయినా మొసలి కళ్లలోంచి అదేపనిగా నీళ్లు కారుతుంటాయి. ఆ కన్నీళ్ల కారణంగా ‘మొసలి కన్నీళ్లు’ అంటూ ఓ బ్యాడ్‌నేమ్ కూడా వచ్చింది. అందుకే మొసలి తక్షణం కంటి డాక్టరును కలవాలి. చెక్కర చుట్టూ చీమలూ, బెల్లం చుట్టూ ఈగలు తెగ ముసురుతుంటాయి. ఇలా స్వీట్ చాలా ఎక్కువగా తినడం వల్ల తమకు ముందుముందు మధుమేహం వస్తుందేమోనని తెలుసుకొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోడానికి అవి ఒకసారి డయాబెటాలజిస్టును కలిసి ముందస్తు పరీక్షలు చేయించుకుంటే మరీమేలు. జీర్ణశక్తి సరిగా లేకపోవడంతో ఆహారం ఒంటికి సరిగా అందక కుందేళ్లు విసర్జించిన వాటినే రెండోసారి తింటాయట. అందుకే ఈనో లాంటి యాంటసిడ్స్ తీసుకోవడంతో పాటు, మంచి జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. అందుకోసం కుందేళ్లు ఒకసారి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవడం చాలా అవసరం. హైనాలూ పొంచి తింటాయి. పైగా బోలెడంత రౌడీయిజం చేసి మరీ వేటజంతువుల నుంచి మాంసం లాక్కుంటాయి. తోడేళ్లూ అంతే. అయినప్పటికీ జిత్తులమారీ అని నక్కకే చెడ్డపేరుంది. తన బిహేవియర్‌ను ఎలా సరిదిద్దుకుంటే జిత్తులమారి అనే ఈ బ్యాడ్‌నేమ్ తొలగిపోతుందో తెలుసుకొని అనుసరించడానికి నక్క సైకియాట్రిస్టును కలవాలి. మందకొడిగా ఉండటం వల్ల తమకు కలుగుతున్న నష్టాన్ని గుర్తించి, మిగతా పాముల్లా తాము కూడా చురుగ్గా కదలడానికి ఏం చేయాలో సూచనలు తీసుకోవడం కోసం కొండచిలువలూ, అనకొండలూ లైఫ్‌స్టైల్ స్పెషలిస్టును కలవచ్చు. ఈ లోకంలో... అందునా మన దేశంలో తెల్లటి మేనిరంగుకే గౌరవం ఎక్కువ. అందుకే పక్షిలోకంలో గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం కాకి డర్మటాలజిస్టును కలిస్తే బెటర్. ‘ఫెయిర్ అండ్ లౌలీ’తో లాభం ఏమైనా ఉంటుందేమో తెలుసుకోవడంలోనూ తప్పులేదు. ఇక ఆ తొండలకైతే పొద్దస్తమానం అక్కడా ఇక్కడా బస్కీలు తీస్తూ గడపడం తప్ప మరే పనీ లేదు. ఆ ఊసరవెల్లిని చూడండి. క్షణక్షణానికి ఒంటిరంగు మార్చుకుంటూ పురుగులు పట్టుకొని తిని హాయిగా ఉంటున్నాయి. తాము బాగా ముదిరాక ఊసరవెల్లిగా మారడం కంటే ముందునుంచే రంగుమారే టెక్నిక్‌ను తెలుసుకోవడం కోసం తొండలూ ఒకసారి డర్మటాలజిస్టును కలవడం మంచిదేమో. కోయిల విషయానికి వస్తే... కేవలం వసంతకాలపు వేసవిలో మామిడి చిగుర్లు వచ్చే కాలంలోనే పాడగలుగుతోంది. మిగతా అన్ని కాలాల్లోనూ అలాగే పాడగలిగేందుకు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇందుకోసం కోయిల కూడా ఈఎన్టీ సర్జన్‌కు కలిస్తే వాటి ప్రతిభ అన్ని సీజన్లకూ విస్తరిస్తుంది. చాలా ఎత్తుగా ఉండటం వల్ల చెరువు నుంచి నీళ్లు తాగాలంటే జిరాఫీకి చాలా కష్టమవుతోంది. కాళ్లు విశాలంగా చాపుకుంటూ చాలా కష్టంగా మెడ వంచి నీళ్లు తాగాల్సి వస్తోంది. అందుకే కాస్త ఎత్తు తగ్గేలా ఆపరేషన్ ఏదైనా చేయించుకోవచ్చేమో తెలుసుకోడానికి జిరాఫీలు ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిస్తే మంచిదేమో. అదేపనిగా ఎంతసేపు నీళ్లలో ఉన్నా జలుబు చేయకుండా ఉండటానికి టిప్స్ తెలుసుకోవడం కోసం కొంగలు ఈఎన్టీ సర్జన్‌ను కలవాలి. ‘ఒరేయ్... మరి ఇన్ని తెలిసిన నువ్వు త్వరగా డాక్టర్ అయి జంతుప్రపంచానికంతా ఇతోధికంగా సేవ చేయవచ్చు కదా’ సలహా ఇచ్చాను నేను. ‘‘వద్దు నాన్నా... డాక్టర్ అయితే ఏదో ఒక స్పెషాలిటీకి మాత్రమే పరిమితం కావాలి. ఏ డాక్టరీ కూడా చదవకుండానే పెట్టుబడి పెట్టి ఒక హాస్పిటల్ పెట్టాననుకో... అందరు స్పెషలిస్టులు మన దగ్గరే... అన్ని జీవులూ మన వద్దకే’ అన్నాడు మా బుజ్జిగాడు. – యాసీన్ -
వేస్టేజ్ ఈజ్ మస్ట్!
హ్యూమర్ ఈమధ్య రాంబాబుగాడు వృథా చేయవద్దనే అంశం మీద అనర్గళంగా మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడినంత కాలం ఏం పర్లేదు. వాడి వరకు ఆచరించినా ఓకే. కానీ దాన్ని విచిత్రంగా అందరిచేతా ఆచరణలో పెట్టిస్తున్నాడంటూ వాళ్ల అమ్మగారు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా వాడు నార్మల్‌గా ఉండటమే జరగదు. తన వాదనలతో వాడు అందరినీ ఇబ్బంది పెట్టడం మామూలే. ఇందులో ప్రత్యేకంగా వాడు ఇతరులను ఇక్కట్లు పెట్టడం ఏముందని నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే...‘‘వృథా చేయకపోవడం మంచిదేగా. ఇందులో ఇబ్బందేముంది? ఏం చేస్తున్నాడు వాడు’’ అడిగాను నేను. ‘‘వృథా చేయకూడదని మాకు కూడా తెలుసు కదా నాయనా. పొద్దున్నే టిఫిన్ చేసే టైమ్‌లో ఉప్మాలో మిరపకాయలను వదిలేయకుండా తినాలంటూ వాళ్ల నాన్న చేతా, నా చేతా వాటిని తినిపిస్తున్నాడు. పిండిన నిమ్మకాయలనే మళ్లీ మళ్లీ పిండిస్తున్నాడు. అంతెందుకు... నిమ్మకాయల్లో ఉన్న గింజలను వృథా చేయకూడదంటూ... వాటిని ఏరి ప్రత్యేకంగా పెరట్లో నాటిస్తున్నాడు. అదేదో వాడు చేయవచ్చు కదా... కాదంట. ఆపిల్స్ అంటే తొక్కతో తినవచ్చు. కానీ అరటిపండ్లకు కూడా అదే న్యాయమంటే ఎలా?’’ అంటూ తన బాధ వెళ్లగక్కుకుంది ఆవిడ.‘‘నేను చూస్తా పదండి’’ అంటూ ఆమెను సమాధాన పరచి పంపించా. సరిగ్గా మధ్యానం భోజనాలప్పుడు వచ్చాడు రాంబాబు గాడు.‘‘రారా నువ్వు కూడా తిందువుగానీ’’ అంటూ పిలిచా. ఆ పిలుపే నా పాలిట శాపమవుతుందని ఆ టైమ్‌లో తెలియదు.సరిగ్గా ఆవకాయ ముక్క పెట్టించుకుని, దాన్ని తినే టైమ్‌లో హితోక్తులు మొదలు పెట్టాడు. ‘‘ఒరేయ్... టెంక ముక్కను ఉయ్యకూడదు. దాన్ని విపరీతంగా నములు. అలా నములుతూ ఉండగా కమ్మటి ఊట వస్తుంది. అలా ఊరే దాన్ని మింగు’’ అంటూ ఆదేశాలు ఇస్తున్నాడు.‘‘అలాగేలేరా... నాకు తెలియదా’’ అంటూ నములుతున్న నోటితోనే అన్నాను.‘‘కాదురా... ఇంకాసేపు నములు’’ అంటూ ఉమ్మనివ్వడం లేదు వాడు.‘‘ఒరేయ్... టెంక ముక్క అంతా టేస్ట్‌లెస్‌గా అయిపోయింది. ఇక పిప్పి తప్ప ఏమీ లేదురా. ఇంక ఉయ్యనివ్వు’’ అంటూ దీనంగా అర్థించినా వినలేదు వాడు.నోరు నొప్పి పెట్టి నొప్పి పెట్టి... ఇక తప్పక... డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి పారిపోయి బయటకు వెళ్లి ఉమ్మేయ్యాల్సి వచ్చింది. నా వరకు నాకే అంత ఇబ్బందిగా ఉంటేl... పొద్దస్తమానం ఇంట్లో వీడితోనే వేగాల్సి వచ్చే వాడి అమ్మానాన్నా ఎంత వేదన పడుతున్నారో అనిపించింది. ఇదే మాటే వాళ్ల నాన్న దగ్గర ఎత్తితే ఆయన ఇంకా ఎన్నో బాధలు చెప్పుకున్నాడు.నేను ఎక్స్పెక్ట్ చేసింది రైటే. కూరలోని కరివేపాకుల్నీ తినమంటూ ఒకటే పోరట. ‘అరే... వాటి నుంచి వచ్చే సారం ఆల్రెడీ కూరలోకి ఊరుతుంది. ఆ ఆకుల్ని తినలేమం’టూ బదులిస్తేl... ‘అలా కుదరదు. కరివేప ఆకుల్ని నమిలి తింటే క్యాన్సర్కూడా తగ్గుతుందం’టూ బలవంతంగా తినిపిస్తున్నాడట. అంతేకాదు... వాడి పిచ్చి ఎంతవరకూ వచ్చిందంటే లవంగం మొగ్గలనూ వదలకుండా బలవంతంగా నమిలేలా చేస్తున్నాట్ట. అలా చేయడం వల్ల కూరలోని రుచిపోయి నాలుక భగ్గుమంటోందన్నా వినడం లేదట. వీడి బాధ పడలేక... ఆ లవంగాలూ, దాల్చినచెక్క లాంటి వాటిని నమలకుండా బలవంతంగా మింగేయాల్సి వస్తోందట. ఇది చెప్పుకొని ఎంతో బాధపడ్డాడా పెద్దాయన.‘‘నేను వాడికి చెబుతాలెండి’’ అంటూ అప్పటికి వచ్చేశాను. సరిగ్గా మర్నాడు పొద్దున్నే వాడి దగ్గరకు బయల్దేరా.‘‘ఒరేయ్... కాసేపు ఆగు. స్నానం చేసి వస్తా’’ అంటూ టవల్ తీసుకొని బయల్దేరాడు. ‘‘ఒరేయ్ రాంబాబూ! నువ్వు నాకొక మాట ఇవ్వాల్రా’’ అన్నాను వాడితో.‘‘ఏమిట్రా’’ అడిగాడు.‘‘అయితే... ఒక్క బొట్టు కూడా కింద పడకుండా... అంతా ఒంటి మీదే పడేలా స్నానం చేయ్’’ అన్నా.‘‘అదెలా సాధ్యం?’’ అడిగాడు వాడు.‘‘అంతే... అలాగే చేయ్’’ అన్నాను మొండిగా నేను.‘‘కుదరదు’’కరాఖండిగా అన్నాడు వాడు.‘‘పారబోయడానికీ... పారేయడానికీ... పారించడం అన్న విషయాలు తెలుసుకుంటే వృథా విషయంలో వేస్ట్ ఆఫ్ టైమ్కూ రెస్ట్కూ తేడా అవగతమవుతుంది’’ అంటూ వచ్చేశా.వాడికి అర్థమైందనే అనుకుంటా. – యాసీన్ -
ఈ పిచ్చికి అదే మందు...!
హ్యూమర్ ‘‘మావాడిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. వాడిని చూస్తేనే చాలా ఆందోళనగా ఉంది. వాడికి కాస్త నువ్వైనా చెప్పురా’’ అందిరాంబాబు వాళ్ల అమ్మ నాతో. ‘‘ఏమైంది?’’ అని అడిగా. ‘‘నువ్వు వాడిని ఒకసారి కదిలించు. నీకే తెలుస్తుంది’’ అంది ఆవిడ.నాలుగైదు సార్లు పిలిచా. కానీ వాడు విన్నట్లు అనిపించలేదు. దాంతో ఏమిటిది అన్నట్లుగా రాంబాబుగాడి అమ్మగారివైపు చూశా. ‘‘నువ్వు వాడితో మాట్లాడాలనుకుంటున్నాననీ, వాడి ఎదురుగానే ఉన్నానని ఒకసారి వాడికి వాట్సాప్ పెట్టు’’ అంది.ఆ పని చేశాను. కాస్తంత పాజ్ ఇచ్చాక అది టింగుమని మోగింది. అప్పుడు తలెత్తి చూశాడు. ‘‘ఏంట్రా ఈ ధోరణి?’’ అని అడిగా. ‘‘ఏంటో మాట్లాడాలన్నావు’’ అన్నాడు వాడు.‘‘అదే ఇలా సెల్ఫోన్లో ఇంతగా మునిగిపోవడం ఏమిటి?’’ అని అడిగా. ‘‘ఇదేనా... నువ్వు ఏదైనా చెప్పదలచుకుంటే వాట్సాప్ పెట్టు లేదా మెయిల్ పంపించు’’ అంటూ మళ్లీ మొబైల్ఫోన్లో తలదూర్చాడు వాడు. ‘‘ఇదీ నాయనా వరస. ఏం మాట్లాడాలన్నా వాట్సాప్ మెసేజ్ పంపాలంటాడు. ‘ఒరేయ్ అన్నం పెట్టాను. తినడానికి లేవరా’ అంటే ఎంతకీ వినలేదు. అప్పుడు వీళ్ల నాన్నగారితో మెసేజ్ పెట్టించా. అప్పుడు కూడా లేవలేదు. పైగా ‘ఏం కూర?’ అని అడుగుతూ మళ్లీ వాళ్ల నాన్నకు మెసేజ్ పంపాడు. అప్పుడాయన కూర ఏమిటో మెసేజ్ పెట్టి, ఆ వంట గిన్నెను ఫొటో తీసి పంపారు. అప్పుడు కూడా నోట్లో నీరూరుతున్నట్లు ఒక స్మైలీ బొమ్మ పెట్టాడు. అప్పుడు వాళ్ల నాన్నగారు వాడిని ముఖం మీద గుద్దుతున్నట్లు ఒక ఫొటో పెట్టి... దాదాపుగా డైనింగ్ టేబుల్ ముందు ఎత్తి కుదేసారు. అప్పుడు గానీ తినలేదురా వాడు’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నారు రాంబాబు వాళ్ల అమ్మగారు. ఇంతలో వాడి నాన్నగారు కూడా వచ్చారు. ‘‘అదేమిటోరా. పావ్లోవ్ అనే సైంటిస్టు గారి కుక్కలాగా బిహేవ్ చేస్తున్నాడనిపిస్తోందిరావీడు’’ అంటూ వాపోయారాయన.‘‘పాల్లోవ్ కుక్క ఏమిటండీ?’’ అడిగారు వాళ్లమ్మ గారు.‘‘అప్పట్లో పావ్లోవ్ అనే సైంటిస్టు ఉండేవాడట. వాళ్ల కుక్కకు గంట మోగించి, అన్నం పెట్టేవారట. అన్నం పెట్టినప్పుడు దానికి నోట్లో నీరు ఊరాలి కదా. కానీ తన ధోరణికి అలవాటు పడి... అన్నం పెట్టకపోయినా... కేవలం గంట శబ్దం విన్నా దాని నోట్లోకి నీళ్లు వచ్చేవట’’ వివరించారు రాంబాబు వాళ్ల నాన్న. ‘‘అలా అయితే వాడిది కుక్క బతుకు అయిపోయిందా అండీ...’’ అంటూ గుడ్ల నీళ్లు కుక్కుకుంది. ‘‘వాడి నోట్లో నీరూరలేదని... నీ కళ్లలో నీరు ఊట ఎందుకు? చూద్దాం చూద్దాం’’ అంటూ సముదాయించాను నేను.రాంబాబు గాడి మీద విపరీతమైన కోపం వచ్చింది నాకు. వాడు ఇలా లోకం పట్టనట్టుగా ఉన్నందుకు కాదు. మొబైల్ తోడిదే లోకం అన్నట్టు బతుకుతున్నందుకూ కాదు. ఆ పెద్దావిడను కళ్లనీళ్లు పెట్టిస్తున్నందుకు. ‘‘నా బాధ మరొకటి కూడా ఉందిరా. వాడి పెళ్లి చేద్దామనుకుంటున్నాం కదా. రేపు వాడి పెళ్లయితే ఎలా’’ అంటూ మరి కాస్త బాధపడింది. ‘‘రాంబాబు గాడికి పెళ్లా? ఎప్పుడు? ఎవరితో?’’ అన్నాను.‘‘అదేరా... మొన్న వచ్చిన ఆ తెలివిటూరు సంబంధం గురించి’’ అంది.‘‘నిశ్చయం చేశారా? అయితే ఓకే... ఇంక మీరు చెప్పడం ఎందుకు’’ అన్నాను.‘‘ఇంకా నువ్వూ... నేనూ చెప్పేదేమిటి? ‘పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంద’ నే సామెత ఉంది కదా. అదెందుకు వచ్చిందనుకున్నావు. మన రాంబాబుగాడి లాంటి పిచ్చిమాలోకాల కోసమే’’ అన్నాను నేను నిశ్చింతగా.‘‘ఏమిటి నువ్వు చెప్పేది?’’ కాస్త అయోమయంగా చూసింది. ‘‘ఎవడి నుంచి రింగో... మరెవరి దగ్గర్నుంచి ఫోనో వస్తే ఎవ్వడూ స్పందించడు. కానీ అదే పెళ్లాం నుంచి వచ్చిందనుకో...’’ అంటుండగా... ‘‘ఆ... వస్తే?’’ ‘‘మొగుడనేవాడు చచ్చినట్టు ఫోనెత్తి తీరాల్సిందే. కాల్‌కు అటెండ్ కావాల్సిందే. లేదంటే వాడి తిక్క వాడి పెళ్లామే కుదుర్చుతుంది. కాబట్టి నువ్వేమీ బెంగ పడకు. మన వాణ్ణి ఈలోకం నుంచి బయటపడేసి తన తోడిదే లోకం అనుకునేలా చేయడానికైనా సంబంధానికి ఓకే చెప్పెయ్’’ అంటూ నిశ్చింతగా బయటకు వచ్చేశాను నేను. - యాసీన్ -
స్వామి సోడాకాయానంద!
హ్యూమర్ ‘‘ఏంట్రా విశేషాలు?’’ ఎరక్కపోయి అడిగా మా రాంబాబు గాడిని. ‘‘ఏం లేదురా మొన్న ఊరెళ్లి వచ్చా. చాలా రోజుల తర్వాత అక్కడ సోడా తాగా. నిజానికి దాన్ని సోడా అని అంటాంగానీ అది రెండు కూరగాయలకు సరిపెట్టు అయిన ఒక వెజిటెబుల్’’ అన్నాడు రాంబాబు. ‘‘అది వెజిటెబుల్ ఏమిట్రా నా తలకాయ’’ అన్నాను. ‘‘కూరగాయ లేదా కాయ గూర అనే దాంట్లో ‘కాయ’ అనే శబ్దం ఉంది చూశావా? అలాగే సోడానూ సోడాకాయ అంటారు. అలాగే దానిలోని గోలీని గోలీకాయ అంటారు. చూశావా... ఇలా రెండు కాయ శబ్దాలను తనలో దాచుకున్న దానిని వెజిటబుల్ అంటే తప్పేమిటి? కాకపోతే కాస్త సొరకాయ వంటి షేపుతో, టెంకాయ వంటి నీళ్లతో నిండి ఉండే కాయేరా ఈ సోడాకాయ’’ అన్నాడు వాడు. అక్కడితో ఆగకుండా... ‘‘మన సిటీలో కనిపించడం లేదు కానీ... మొన్న ఊరెళ్లినప్పుడు గోలీ సోడా కనిపించగానే అలా పాతజ్ఞాపకాల్లోకి వెళ్లిపోయా. అలా ఒల్డ్ మెమరీస్‌లో చాలా సేపు ఉండిపోయా. అంతేకాదు... కాసేపు కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను’’ అన్నాడు వాడు ఎమోషనల్ అయిపోతూ. ‘‘సోడా తాగావు. ఆనందించావు. కన్నీళ్లు పెట్టుకోవడం ఎందుకు?’’ అడిగా. ‘‘అరేయ్... సోడా ఎంత గొప్పది రా. నీళ్లను రీ-ఇన్ఫోర్సు చేస్తే ఉండే పవర్ సోడాలో ఉంటుంది. నాలుగైదు గ్లాసుల దాహం ఒక్కటంటే ఒక్క సోడాయే తీరుస్తుంది. ఏదైనా చెబితే ఆర్చేవారా, తీర్చేవారా అంటుంటారు చూశావా... కానీ సోడా కచ్చితంగా తీర్చేదేరా. దాహం తీర్చే పరమాద్భుతమైన వరప్రదాయని అది. చూడ్డానికి ఏదో సోడాలా అలా నిరాడంబరంగా కనిపిస్తుంది కానీ... అది నిజంగా ఫిలాసఫీని చెప్పే గురువురా’’ అన్నాడు. ‘‘కళ కళ కోసమే అన్నట్లు సోడా సోడా కోసమే. మహా అయితే తాగడం కోసమే. అంతే. నువ్వు దానికి లేనిపోని మహిమలు అంటగట్టకు, దాని మహత్యాలు చెప్పి నన్ను విసిగించకు’’ అన్నాను. ‘‘నిజం రా. సోడాలో ఒక తత్వబోధ ఉంది. ఒక పరమార్థం ఉంది. ఒక సందేశం ఉంది. అందులోని గోలీని చూశావా?’’ అన్నాడు వాడు. ‘‘చూశాను. నాకు మామూలు గోలీలాగే కనిపించింది. అందులో ఏముంది గొప్ప?’’ అడిగా. ‘‘గుండెలో పదిలంగా ఉంచుకోవాల్సిన జ్ఞానాన్ని అహంకరించుకొని తలకు ఎక్కించుకోకూడదు సోడాలోని గోలీలా. పనికిరాని గ్యాస్ అండ చూసుకొని అహంకరించి అట్టడుగు వర్గాలైన నీళ్లకు దూరంగా ఉండిపోవాలని కోరుకోకూడదు. ఏదో ఒక రోజు ఆ దురంహంకారాన్ని బలంగా నొక్కి కిందికి దించేసేలా గర్వభంగం జరుగుతుందని బోధిస్తుంటుంది రా గోలీ. ఏ గ్యాసునైతే తనకు అండ అనుకొని గోలీ గురుత్వాకర్షణ శక్తిని ఎదురు నిలిచిందో, ఏ గ్యాసునైతే నమ్ముకుని గోలీ సోడా మూతిని అంటిపెట్టుకొని ఉన్నత స్థానంలో ఉన్నానంటూ నీలిగిందో... కాస్తంత ఒత్తిడితో అదే గ్యాసు పైకి తేలిపోతుంది. తన నుంచి దూరంగా వెళ్లిపోతుంది. తాను దూరంగా ఉంచుదామనుకున్న అట్టడుగున ఉన్న ఆ నీరు తనను దాటుకుంటూ తన మీదుగానే తాగేవాడి నోట్లోకి వెళ్లిపోతాయి. అందుకే అహంకారం ఎప్పటికైనా కుయ్యిమనే శబ్దం చేస్తూ తస్సుమంటుందనే తత్వజ్ఞానం బోధిస్తుంది సోడా కాయలోని గోలీకాయ. అంతేకాదు సోడాకాయ ఆత్మజ్ఞానాన్నీ బోధిస్తుంది’’ అన్నాడు రాంబాబు. ‘‘అసలు సోడాకాయకూ, ఆత్మజ్ఞానానికీ సంబంధం ఏమిట్రా’’ అంటూ వాణ్ణి నిలదీశాను. ‘‘చెబుతా విను. నీ దేహాత్మ సోడాకాయ లాంటిది. అందులోని నీళ్లు పరమాత్మ స్వరూపం. పైన ఉండే గ్యాసు నీకు ఊపిరిని అందించే వాయువు. ఏదో ఒక రోజున నీకు ఆయువు తీరిపోక తప్పదు. ఆయువు తీరాక వాయువు కూడా ఉండదు సోడాలో! ఆరోజున నీ సోడాకాయ లాంటి నీ దేహాత్మను వీడి నీళ్లనే ఆ పరమాత్మ వెళ్లిపోతుంది. ఈ జ్ఞానం కలిగిన నాడు బయటకు వచ్చిన ఆ గ్యాసు... సోడా మూతి దగ్గర కాసేపు జ్ఞాన చక్రంలా ఆవరించుకొని ఉంటుంది. జీవితం బుద్బుద ప్రాయమైనదని ఖాళీ అయిన సోడాకాయ మళ్లీ మళ్లీ నిండుతుందనీ, నిండినది ఖాళీ అవుతుంటుందని... ఈ మహాచక్రం ఇలా సాగుతూ ఉంటుందని తత్వ బోధ చేస్తుంటుందిరా ఆ పరమ గురువైన ఆ మహా సోడాకాయానంద’’ అన్నాడు. ‘‘నువ్వు అంటే నిజమే అనిపిస్తుంది కానీ సోడాకాయ ఎందుకు రా అలా కు..య్.. మంటూ ఈల వేస్తుంది. అలా విజిల్ వేయడం తప్పు కదా’’ అన్నాను. ‘‘అది పోకిరీ విజిల్ కాదు రా... మళ్లీ మళ్లీ పుట్టే దాహార్తిని తీర్చడం కోసం నన్ను నేను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకొని పుడుతూ ఉంటా అని చెప్పేందుకు ఓ మృదుమధురమైన పాటలాంటి స్వరంరా అది. నీలాంటి అజ్ఞానులు దాన్ని విజిల్ అని పొరబడుతుంటారు’’ అంటూ నాకు జ్ఞానబోధ చేశాడు మా రాంబాబు గాడు. - యాసీన్ -
కోడి పాఠాలు... కొన్ని సత్యాలు!!
హ్యూమర్ ‘‘కోడి దాని రెక్కల కింద అలా తన తలను దాచుకుందేం నాన్నా’’ అడిగాడు ఏడేళ్ల మా బుజ్జిగాడు. ‘‘అంటే... దానికి జ్వరమొచ్చిందన్నమాట. జ్వరం తగ్గే వరకూ అది అలా తన తలను రెక్కల చాటున దాచుకుంటుందన్నమాట’’ వివరించాను. ‘‘అరె... అసలే దాని ఒళ్లు వెచ్చగా ఉంటుంది. మొన్న కోడిని కాసేపు పట్టుకుంటే తెలిసింది... దాని ఒళ్లు ఎంత వేడిగా ఉంటుందో! ఇప్పుడు దానికి జరం వచ్చిందని నువ్వు అంటున్నావు. అలాంటప్పుడు దాని తల మరింత వేడెక్కి పోతుంది కదా. ఒళ్లు అలా కాలిపోతున్నప్పుడు మళ్లీ తల అలా పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా’’ అన్నాడు వాడు. అది తల ఎలా పెట్టుకుందో తెలియదు గానీ... నాకు మాత్రం తలపట్టుకొని కూర్చోవాల్సి వచ్చింది. మా బుజ్జిగాడికి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అసలు ఈ కోళ్ల పెంపకం కార్యక్రమం పెట్టుకున్న దగ్గర్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. అవి ముఖ్యంగా మా బుజ్జిగాడి సందేహాల రూపంలో ఆ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. వాడి డౌట్ల కారణంగా నేను అడుగేసినప్పుడల్లా కోడి రెట్టలో కాలేస్తున్నట్లు ఉంది నా పరిస్థితి. ఏదో నేను మరచిపోయినా మావాడు వాటికింత మేత వేస్తాడు కదా అని లేనిపోని ఈ పెంపక కేంద్రం మొదలుపెట్టాను. నేను వాటిని పెంచుతున్నానా... మావాడి డౌట్సును పెంచుతున్నానా అన్నది అర్థం కాకుండా పోయింది. వాడు మళ్లీ తన డౌట్ గుర్తు చేస్తూ... ‘‘జరం వచ్చినప్పుడు అలా తలపెట్టుకోవద్దు అని కోడికి చెప్పు నాన్నా’’ అన్నాడు వాడు. కోడికి మన లాంగ్వేజీ అర్థం కాదన్నా వినేట్టు లేడు. ఒకవేళ మన భాష అర్థం కాదని అంటే... ‘బో... బో...బో అంటే తిండి తినమని కదా. ఇష్షు ఇష్షు అంటే దూరం పొమ్మని కదా’ అని... ‘కోడి భాష... అనువాదం... కొన్ని మెళకువలు’ అని నాకు కొత్తగా కొన్ని కోడిపదాలు నేర్పేట్టు ఉన్నాడు అనుకున్నాను. వాడి సందేహం తీర్చడం కోసం అప్పటికప్పుడు ఒక ఐడియా ఫ్రేం చేసుకున్నాను. దాన్ని అమల్లో పెట్టాను. ‘‘ఒరేయ్... మొన్న నాకు జలుబు చేసినప్పుడు వేణ్ణీళ్లలో విక్స్ వేసుకొని ఆవిరి పట్టుకున్నాను గుర్తుందా. అప్పుడు వద్దంటున్నా నా దుప్పట్లోకి నువ్వు దూరావు. అప్పుడు నాకులాగే ఇప్పుడు మన ఈ కోడికీ జలుబు చేసిందన్నమాట. పాపం... అది ఆవిరి పట్టుకోడానికి వేణ్ణీళ్లు పెట్టుకోలేదు కదా. అందుకే రెక్కల చాటున ఉన్న వేడిని తన ముక్కు రంధ్రాల్లోకి పంపించుకుంటుదన్నమాట. అలా అది తనకు తాను ఆవిరిపెట్టుకుంటోంది’’ అని వివరించాను. ‘‘ఓహో... పాపం... దాని ముక్కు తుడుచుకోవడం ఎంత కష్టం నాన్నా. అందుకే చిరాకుగా అది ఒక్కోసారి తన గోళ్లతో ముక్కును గీరుకుంటోంది. పాపం... దానికి దురద పెట్టి గీరుకుంటుందేమో అనుకున్నా. ఆహా... ఇప్పుడు అర్థమైంది. నిజానికి అది ముక్కు తుడుచుకుంటుందన్నమాట అన్నాడు వాడు. వాడితో ఎందుకొచ్చిన గొడవ అంటూ ‘ఆ... అవునవును’ అన్నాను. రెండ్రోజుల క్రితం కొన్ని డబ్బులు బ్యాంకులో వేయడానికి బయల్దేరాను. ఇంట్లో తన పనుల్లో కాళ్లకు చేతులకు అడ్డం పడుతున్నాడని వాణ్ణి నాకు అప్పగించింది మా ఆవిడ. ‘‘డిపాజిట్ ఫామ్ నింపాక ఏదో క్యూలో నించోవడమే కదా. బుజ్జిగాణ్ణి వెంట తీసుకెళ్లండి. ఇక్కడుంటే ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడు’’ అంది. ‘‘అవున్నాన్నా.. అచ్చం మన కోడిలాగే. అదీ ఎప్పుడూ ఒకటి కెలుకుతూ ఉంటుంది కదా’’ అన్నాడు వాడు. పైగా పొదిగి పిల్లలు పెట్టాక మా కోడి అంతటిది పిల్లలను వెంటేసుకొని పెరట్లో తిరుగుతూ ఉంది. మనిషినయ్యాక బిడ్డను బయట తిప్పకపోతే ఎలా అనుకొని వాణ్ణి వెంటతీసుకొని బ్యాంకుకు వెళ్లా. అక్కడికి వెళ్లాక కౌంటర్లో డిపాజిట్ డబ్బులు ఇవ్వడం కోసం క్యూలో వెయిట్ చేస్తున్నాను. ‘‘అవునూ... మొన్న ఆ అంకుల్ ఎవరో వచ్చి అడిగితే డబ్బులు లేవన్నావు. ఇప్పుడు మళ్లీ బీరువాలోంచి తీసి బ్యాంకులో వేస్తున్నావు ఎందుకు?’’ అని అడిగాడు వాడు. అలా బ్యాంకు వాళ్ల ముందు... అక్కడున్న వాళ్ల ముందు నా పరువు తీశాడు వాడు. అసలే నాది చిన్న మెదడు. పైగా అది ఫారం కోడి మెదడులా అయిపోయింది. ఏదో మొన్నంటే జలుబూ-జ్వరం అని ఒక కథ అల్లాను గానీ కాస్త క్యాషూ కామర్సూ వ్యవహారాలంటే నాకు కంగారు. అందుకే నాకు ఏం చేప్పాలో తోచలేదు. ఇంటికెళ్లాక మీ అమ్మ చెబుతుందని తప్పించుకున్నాను. కానీ ఇంట్లోకి వెళ్లాక మళ్లీ అదే ప్రశ్న వేశాడు వాడు. ఏం చెప్పాలో తెలియక సతమతమవుతుంటే మా ఆవిడ కల్పించుకుంది. ‘‘ఒరేయ్... పొదగడం అంటే మొన్న అడిగితే మీ నాన్న చెప్పలేకపోయారు కదా. చెబుతా విను. ఇప్పుడూ... కోడి గుడ్డు పెట్టగానే ఆమ్లెట్ వేసుకొని తిన్నామనుకో. అది ఏటీఎమ్ నుంచి డెరైక్ట్‌గా డబ్బులు తీసుకున్నట్లు అన్నమాట. కానీ అవే గుడ్లను కోడి కింద పెట్టేశామనుకో. మొన్న ఆ కోడి పొదగడం చూశావు కదా... అలా బ్యాంకువాళ్లు ఆ డబ్బును తమ వద్ద దాచుకుని, డబ్బు తాలూకు పిల్లలు చేసి మనకు అప్పగిస్తారన్నమాట. అచ్చం మన కోడి పిల్లల్లాగే! ఇప్పుడు నీకు అర్థమైందా పొదగడం అంటే ఏమిటో?’’ అని వివరించింది మా ఆవిడ. మా ఆవిడ తాలూకు కోచింగులోని టీచింగ్ మెలకువలు చూసి కోడి కెలికిన పెంటకుప్పలా అయిపోయింది నా మైండు. కానీ ఆమె చెప్పిన పాఠం మాత్రం బురదలో కోడి కాలి గుర్తులా నా మెదడులో అలా నిలిచిపోయింది. - యాసీన్ -
గొప్పల 'సెల్'ఫీస్...!
హ్యూమర్ ‘‘వేమన ఉన్న రోజుల్లో మేం లేము. ఆయన ఉన్న రోజుల్లో మేం గనక ఉండి ఉంటే...’’ అంటూ తన ఆవేదన వెళ్లగక్కింది సెల్‌ఫోన్. ‘‘వేమన ఉండి ఉంటే ఏమయ్యేది?’’ అడిగింది ల్యాండ్‌లైన్ హ్యాండ్ సెట్. ‘‘ఏమయ్యేది అని నెమ్మదిగా అడుగుతావేం... ‘చేతిలోన సెల్లు... చెవిలోన హెడ్ఫోను... అరచేత పట్టు ఇంటర్నెట్టు... అందులోనీ ఫేస్‌బుక్‌కు, టాపు రేపు వాట్సాప్పు... చేత సెల్లు లేని బాధ ఇంతింత గాదయా’... అంటూ మమ్మల్ని వర్ణిస్తూ పద్యాలు చెప్పే వాడు. ఇప్పుడు ప్రతివాడూ మా సర్వీస్ తీసుకునే వాడే, మమ్మల్ని తిట్టేవాడే’’ అంది సెల్‌ఫోన్. ‘‘మిమ్మల్ని తిడుతున్నారా... ఎవరూ? ఏమంటున్నారు?’’ అడిగింది హ్యాండ్సెట్. ‘‘మేము వచ్చి మానవ సంబంధాలను మంటగలిపామంట. ప్రతివాళ్లూ మాలోనికి తలదూరుస్తున్నారట. మేం కూడా యథాశక్తి వాళ్ల జీవితాల్లోకి తలదూరుస్తున్నామంట. ఒక్క మాటేమిటీ... పెళ్లిళ్లు కూడా మా ద్వారానే... విడాకులూ మా ద్వారానేనట’’... అంది సెల్‌ఫోన్ బాధగా. ‘‘అరె... ఒక రింగుల రింగుల సంకెళ్ల ద్వారా ఆ ల్యాండ్ఫోన్కి మేం బందీలమయ్యామే. కానీ మీరు అలా కాదు కదా. స్వేచ్ఛగా బహు స్వతంత్రంగా ఉన్నారని మేం మిమ్మల్ని చూస్తూ కుళ్లుకుంటూ ఉన్నామే. మీకు తిట్లు తప్పడం లేదన్నమాట’’ సానుభూతిగా అంది ల్యాండ్‌ఫోన్ హ్యాండ్ సెట్. ‘‘తిట్లా... మామూలుగా కాదు. కర్ణపిశాచి అనీ... అదనీ ఇదనీ. అరె... అందరికీ అందుబాటులోకి వచ్చి అందరూ మాలోనే ఇంతగా తలదాచుకుంటున్నారే...’’ అంటుండగా సెల్‌ఫోన్ మాటల ఫ్లోకి అడ్డుపడింది ల్యాండ్‌ఫోన్. ‘‘తల దాచుకోవడమేమిటి? అసలు తలదాచుకోవడమనే మాటకు అర్థమేమిటో తెలుసా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి’’ అంటుండగానే రోషంగా తలెత్తింది సెల్‌ఫోన్. ‘‘పెద్ద పెద్ద మాటలేమీ కాదు. ఉన్న వాస్తవమే. ఎవరినైనా పలకరించాల్సి వస్తుందనీ, ఎదుటివాళ్లతో మాట్లాడాల్సి వస్తుందని తెలియగానే మనుషులు ఏం చేస్తారో తెలుసా? మాలో తలదాచుకుంటారు. తమ మెదడు తినేసేవాళ్లు అవతలికి పోయారని తెలిసేవరకూ అలా దాచుకున్న తలను మళ్లీ ఎత్తరు. పైగా మేమిప్పుడు మనషులు దారితప్పకుండా చూసే వాళ్ల పాలిటి గైడ్లం కూడా’’ అంది గొప్పగా. ‘‘మీరేంటి గైడ్లేమిటి? ఎందుకలా మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు’’అంది హ్యాండ్సెట్ అక్కసుగా. ‘‘మేం మనుషుల పాలిటి గైడ్లం అన్న మాట అక్షరాలా నిజం. ఇప్పుడు ప్రతి కారూ... ప్రతి వాహనమూ తాము దారి తప్పకుండా ఉండటం కోసం మా సహాయం తీసుకుంటున్నారు. తాము వాహనంలో కూర్చుని ఎక్కడున్నదీ... ప్రయాణించాల్సిన రూట్ ఏదీ... ఇవన్నీ తెలిసేలా మాలోనే రూట్ మ్యాప్ అంతా సెట్ చేసుకుని, ఇప్పుడు ప్రయాణాలు చేస్తున్నారు. అంతెందుకు ఇప్పుడు ప్రయాణాలు చేసేవారికి తమ సీటు ఎంత ముఖ్యమో... వాళ్ల గైడ్‌గా మాకూ అంతే ప్రాధాన్యం. డ్రైవింగ్ సీటుకు ఎదురుగా మమ్మల్ని ఉంచేందుకు ప్రత్యేకంగా ప్రతివాహనంలోనూ మాకో స్టాండు ఏర్పాటు చేస్తున్నారు తెల్సా’’ అంది సెల్‌ఫోను. ‘‘అవును. గతంలో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మేము తమ హోదాకు చిహ్నంగా మమ్మల్ని భావించేవారు’’ అంటూ ఉండగానే సెల్‌ఫోన్ అడ్డుకుంది. ‘‘ఇప్పుడు మీరు మీ పాత గొప్పల్ని చెప్పుకుంటున్నారే... అప్పుడలా బతికాం అంటూ ఇప్పుడు మీ గత ప్రాభవం గురించి ప్రశంసించుకుంటున్నారు కదా. అలాంటిది ఇప్పుడు మాగురించి పరమ వాస్తవాలు మాట్లాడుకుంటుంటే మీరు గబుక్కున ‘పొగుడుకోవడం’ అనేశారు మేమెంత హర్టయ్యామో తెలుసా’’ అంది సెల్‌ఫోన్ నిష్ఠూరంగా. ‘‘మేం మోగితే తప్పనిసరిగా మమ్మల్ని ఎత్తుకునే వారు. కానీ మీరు మోగితే ఎదుటివాళ్ల కాల్ తాము తీసుకోనక్కర్లేదని తెలిస్తే ఠక్కున మీ పీక నొక్కేసున్నారు కదా. మాకు అలాంటి అగౌరవాలు ఉండేవి కావు తెలుసా’’ అంటూ మళ్లీ తన గొప్పతనాన్ని చాటుకుంది ల్యాండ్‌లైన్ ఫోన్. ‘‘నోర్మూసుకోండి. ఇంటర్నెట్తో అనుసంధానమై ఇంటర్నేషనల్ కాల్స్ కూడా అందిస్తున్న మేమెక్కడ. ఇప్పుడు ఇంటర్‌కమ్ స్థాయికి దిగిపోయిన మీరెక్కడ. ఏదో మా ఆవేదన వెలిబుచ్చుకోవాలనుకుంటే మధ్యన మీ బోడి గొప్పలేమిటి?’’ కోప్పడింది మొబైల్‌ఫోన్. ‘‘ఎంత అందరించిపోయినా డైనోసార్లు డైనోసార్లే... అందుకే ఎంతగా ప్రాచుర్యం పొందినా, ఎంతగా మీమీద మనషులు ఆధరపడ్డా మీరు మీరే. స్టేటస్ సింబల్‌లా మేము మేమే. తమ కుర్చీ కంటే ఎత్తై స్థానంలో పెట్టుకునే మేమెక్కడా... మగాళ్ల జేబుల్లోనూ, ఆడవాళ్ల హ్యాండ్‌బ్యాగుల్లోనూ తలదాచుకునే మీరెక్కడ’’ అంటూ ఈసడించింది ల్యాండ్‌లైన్ ఫోన్. ‘‘అంత మిడిసిపడ్డందుకే అంతరించిపోయి డైనోసార్లలా మిగిలారు’’ అంది మొబైల్. ‘‘డైనోసార్‌లో ‘సార్’ అనే మాట ఉంది. సెల్లు అనే మాట సొల్లులా ఉంది. అందుకే పరిమితంగా పనిచేసినామా కాలంలో మేమంటే ఎంతో గొప్ప. మంచి తివాచీ పరిచి మమ్మల్ని జాగ్రత్తగా పెట్టుకునేవారు. మీరు ఇన్నిన్ని పనులు చేస్తున్నా, డేటూ టైమూ క్యాలెండరూ కెమెరా ఉన్నా మీకు గౌరవం జీరో. పైగా ఏడాదికోసారి కొత్త మోడల్ రాగానే మిమ్మల్ని చెత్త అంటూ పారేస్తారు’’ అంది ల్యాండ్‌లైను ఫోన్. ‘‘చెత్త అయినా, తిట్టుకున్నా సరే... ఇప్పట్లో మేమే మనుషుల చేతి ఆభరణం. మహామహుల తల చుట్టూ చక్రం తిరుగుతున్నట్లుగా... ఫైల్ డౌన్లోడ్ అవుతున్నప్పుడు మాలోనూ అలాంటి చక్రమే తిరుగుతూ ఉంటుంది’’ అంది సెల్. ‘‘అదీ సంగతి. రహస్యం తెలిసిపోయింది. మీకు తలతిరుగుడు ఎక్కువనే సంగతి తెలిసే మనుషులు మీ సేవలు తీసుకుంటూనే మిమ్మల్ని లోకువ కడుతున్నారేమో. అందుకే చేతవెన్నముద్ద పద్యం టైప్‌లో కాకుండా వేమన మిమ్మల్ని చెప్పులో రాయి, చెవిలో జోరిగ టైప్ పద్యం చెబుతాడని మీరన్నది నిజమే’’ అంటూ ‘సెల్’విచ్చింది ల్యాండ్ఫోను. - యాసీన్ -
చెంచాతుర్యం... దాని మహత్యం!
హ్యూమర్ ‘‘ఒరేయ్... చెంచాను కాస్త చిన్న చూపు చూశారేమోనని అనిపిస్తోంది రా’’ అన్నాడు మా రాంబాబు గాడు స్పూన్‌తో అన్నం ప్లేట్లో కూర పెట్టుకుంటూ. ‘‘చెంచాకు చిన్నచూపు ఏమిట్రా?’’ అడిగాను నేను అయోమయంగా. ‘‘చెంచాగాడు అనే మాట విన్నావా?’’ అడిగాడు వాడు. ‘‘విన్నాను’’ జవాబిచ్చాను. ‘‘మరి... ఆ మాట తప్పుకదా. నమ్మకమైన సహచరుడినీ, ఎప్పుడూ వెంట వెంట ఉండే అనుచరుణ్ణీ అలా చెంచాతో పోల్చి చెంచాగాడు అని కించపరచడం సరికాదు కదా’’ అన్నాడు వాడు. దాంతో రాంబాబుగాడు చెప్పే మాట కూడా లాజికల్‌గా కరక్టే కదా అనిపించి ‘‘అవును రా’’ అన్నాను. ‘‘అంతేకాదు రా... పాశ్చాత్యులు ఏదో స్పూన్ పట్టుకు తింటుంటారనీ, మనం స్పూన్‌తో తినం అనీ అంటుంటారు గానీ... నిజానికి స్పూన్ కనిపెట్టింది కూడా మనమేరా. విదేశీయులు మన స్పూన్‌ను కిడ్నాప్ చేశారు’’ అన్నాడు వాడు. ‘‘అదేమిట్రా. మనం చేత్తోనే కదా తింటాం. వాళ్లే కదా చెంచాను మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇదెలా నిజం?’’ అడిగాను. ‘‘ఒరేయ్... ఉగ్గుపాలతో పెట్టిన విద్య అనే సామెత విన్నావ్ కదా. అంటే మనవాళ్లు పాలు పట్టడానికి ప్రత్యామ్నాయంగా ఉగ్గు కనిపెట్టారు. అలాంటప్పుడు చెంచాను మనం కనిపెట్టినట్టే కదా’’ ‘‘చెంచాకూ, ఉగ్గుకూ సంబంధం ఏమిట్రా?’’ అడిగా. ‘‘ఎందుకు లేదూ... చిన్న ఉగ్గుగిన్నెకు కాస్త పొడవైన కాడ పెట్టామనకో. అది స్పూనే అవుతుంది. అలా మనం కనిపెట్టిన చెంచాను పాశ్చాత్యులు కొట్టేసి, దానికి పేటెంట్ పట్టేశారు. ఉగ్గుపాలు పట్టడం అనే మాటను స్పూన్ ఫీడింగ్ అని వాళ్లు ట్రాన్స్‌లేటింగ్ చేసుకున్నారు. అంతేకాదు. నీలాంటి అమాయకుల చేత దాన్ని తామే కనిపెట్టినట్లుగా అనిపిస్తున్నారు. చూశావా... వాళ్ల అతితెలివితేటలూ!’’ అన్నాడు వాడు. ‘‘నిజమేరా. నువ్వు చెప్పాక తెలుస్తోంది’’ అన్నాను నేను. ‘‘ఆ... కరక్టే కదా. గంటె, గరిటె, చిల్లు గంటె, జల్లిగంటే అనే పెద్ద పెద్ద వాటికే మన వంట ప్రక్రియలో స్థానం ఉన్నప్పుడు... స్పూన్‌ను వాళ్లు కనిపెట్టడానికి ఆస్కారమే లేదు కదా. పైగా పాయసంలో గరిటలా పాడు బతుకు వద్దు అనే సామెత మనకు ఎప్పుడో ఉంది. ఎన్నో రకాల గరిటెలూ, గంటెలూ మన దగ్గర ఉన్నప్పుడు స్పూన్‌ను వాళ్లు కనిపెట్టి, దాన్ని మన దగ్గరకు వాడకంలో తెచ్చి ఉద్ధరించారనడానికి ఆస్కారమే లేదు. మనం ఈ విషయం కనిపెడతామేమోనని, అది వాళ్లదేనని చెప్పడానికి ఇంగ్లిష్‌లో కొన్ని సామెతలు కూడా సృష్టించే కుట్ర చేశారు’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటా కుట్ర?’’ అడిగా. ‘‘నోట్లో వెండి చెంచాతో పుట్టడం అన్న సామెత ఇంగ్లిష్‌లోనే ఉందనీ, దాన్ని మన వారు కాపీ కొట్టారనీ భ్రమింపజేశాడు ఇంగ్లిష్ వాడు’’ అన్నాడు వాడు కోపంగా. ‘‘నిజమేరోయ్’’ అన్నాను. ‘‘అసలు... చెంచా అన్నమాట ఎలా పుట్టిందో తెల్సా నీకు?’’ అడిగాడు. ‘‘తెలియదు రా’’ ‘‘నోట్లో చెంచా పెట్టుకొని అందులో గోలీ పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ ఆడే ఆట చూశావు కదా. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ గోలీ కిందపడిపోతుంది. అది ‘చంచలమైనది’ అంటూ చెబుతూ ముందు రెండక్షరాలనూ తీసుకొని చెంచా అనే మాటను సృష్టించారురా మన తెలుగువాళ్లు. అలా చెంచా అనే మాట పుట్టిందన్నమాట. అంతేకాదు... పొడవు, బరువు, టైమ్‌లకు ఫిజిక్స్‌లో లెంగ్త్, మాస్, టైమ్ అనే ప్రధానమైన డైమన్షన్లు ఉన్నట్లే స్పూన్కు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాల్రా! ఈ విషయం చెంచా అనే కొలతకు తగిన స్థానం కలిగించమంటూ వరల్డ్ ఫిజిక్స్ అసోసియేషన్ వారికీ, సైంటిస్టులకూ ఓ విజ్ఞాపన ఇద్దామని అనుకుంటున్నా’’ అన్నాడు వాడు. ‘‘అదెలా... లెంగ్త్, మాస్, టైమ్... ఈ మూడే కదా ప్రధానమైన అంశాలు. చెంచాకూ వాటికీ సంబంధం ఏముంది’’ అడిగా. ‘‘ఎందుకు లేదూ... పొడవు, పదార్థమూ, సమయాలలాగే చెంచా కూడా ప్రత్యేకమైన కొలతే! అందుకే ఫలానా మందు ఎంత తీసుకోవాలి అని అడిగితే ఒక టీ స్పూను తీసుకోవాలంటారు. అలాగే వంటలో ఫలానా దినుసు ఎంత వాడాలంటే ఒక టేబుల్ స్పూన్ అంటారు. మరి అలాంటప్పుడు అది కూడా ఒక యూనిట్టే కదా. ఆలోచించు’’ అన్నాడు వాడు. ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ‘‘సరే రా. నువ్వు లెటర్ రాయి. దానికి అవసరమైన స్టాంపులు నేను అంటిస్తాను’’ అన్నాను వాడితో. ‘‘నువ్వురా నాకు అసలు సిసలైన చెంచాగాడివి’’ అంటూ ప్రశంసించాడు వాడు. - యాసీన్ -
కోడి కూత... రాంబాబు మేత!
హ్యూమర్ ‘‘ఆహా... ఆ గారెలను చూశావా... వాటిని చూస్తుంటే గుండ్రటి నూనె స్విమ్మింగ్‌పూల్‌లో ఈదుతున్న గజ ఈతగాడు ఫెల్ప్స్‌కు తాతల్లా అనిపించడం లేదూ?’’ అన్నాడు మా రాంబాబు గాడు బజ్జీల బండి దగ్గర మూకుడులో వేగుతున్న గారెలను చూస్తూ. నేను జవాబిచ్చేలోగా మళ్లీ వాడే అందుకొని... ‘‘ఒలింపిక్స్‌లో మనకు పతకాలూ అవీ రాకపోతేనేం...! చూశావా..? బాగా వేగి గోల్డ్ కలర్లోకి మారిన ఆ గారెలను చూడు. వాటిని చూస్తుంటే మూకుడు నిండా కళకళలాడుతున్న బంగారు పతకాల్లాగే లేవూ?’’ అన్నాడు వాడు. ‘‘అవున్రా’’ అన్నాను నేను. వాడు పెట్టించిన గారెలు తింటూ వాడితో ఏకీభవించకపోతే బాగుండదని మొహమాటంగా ఏదో అన్నాను. ‘‘అయితే... గారెలకు వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. గారెలకు ఉన్న మంచి పేరు దెబ్బతీయడానికి ఒక వ్యవస్థే పనిచేస్తోంది రా. గారెలకు వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడుస్తోంది. గారెలకు జరుగుతున్న ఈ అన్యాయానికి కుమిలిపోతున్నానురా’’ అన్నాడు రాంబాబు. రోజూ సాయంత్రం కాగానే బజ్జీల బండి వాడి దగ్గరికి వెళ్తుంటాడు వాడు. ఇవ్వాళ నన్ను కూడా తీసుకెళ్లాడు. అక్కడ ప్లేట్లో నిండుగా గారెలు తింటూ మొదట తన్మయత్వంలో మునిగిపోయాడు. అంతలోనే తన తన్మయత్వాన్ని భగ్నం చేసుకొని అకస్మాత్తుగా ఆ మాట చెప్పేసరికి ఆశ్చర్యపోయాను. ‘‘ఎవరురా? గారెలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదెవరు?’’ అడిగాను నేను. ‘‘ఇంకెవరూ డాక్టర్లు. ఎందుకో డాక్టరంతా మూకుమ్మడిగా గారెలను వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు ఇచ్చే ప్రతి సలహాలోనూ మసలుతున్న నూనెలో వేగినవి తినవద్దని అంటూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే మొత్తం వైద్యవర్గాలన్నీ గారెలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నట్లు ఉంది’’ అన్నాడు వాడు. ‘‘పండగలు పబ్బాలు వస్తే చేసుకునే వంటకాల్లో గారెలే ముఖ్యమైనవి. డాక్టర్లు కూడా బహుశా గారెలు తింటూనే ఉంటారు. అలాంటప్పుడు వాటికి వ్యతిరేకంగా డాక్టర్లు కుట్ర పన్నుతున్నారని ఎలా అంటావు? ఒకవేళ చేసినా ఆ కుట్ర ఎందుకు నిలుస్తుంది?’’ అడిగా. ‘‘లేదురా. మనలాంటి గారె అభిమానుల మనోభావాలను డాక్టర్లు మాటిమాటికీ గాయపరుస్తున్నారు. అంతేకాదు అనేక మంది గారె కార్మికుల ఉపాధిని కూడా వాళ్లు దెబ్బతీస్తున్నారు. ఇదే డాక్టర్లు చేస్తున్న కుట్ర. వాళ్లు మాటిమాటికీ నూనెలో వేయించేవాటిని తినవద్దని చెబుతున్నారు కదా! తద్వారా పరోక్షంగా గారెలనూ తినవద్దని డాక్టర్లు చెబుతున్నట్లే కదా’’ లాజిక్ లాగాడు వాడు. ‘‘ఒరేయ్... మిరపకాయ బజ్జీలు, బోండాలూ, గారెలూ... ఇవన్నీ నూనెలో వేయించేవే. ప్రత్యేకంగా గారెల మీదే కుట్ర పన్నుతున్నారని నువ్వెలా అంటావ్’’ అడిగాను వాణ్ణి. ‘‘మిరపకాయ బజ్జీలే అనుకో. శనగపిండి వల్ల కొద్దిగా తినగానే కడుపు ఉబ్బినట్టు అవుతుంది. దాంతో ఒకటి రెండు కంటే ఎక్కువగా ఎవ్వడూ తినలేడు. ఇక బోండాలంటావా? అంతగా నైపుణ్యం లేకపోతే పైన ఒక లేయర్ వేగి ఉంటుంది. లోపల పిండి అంతా పచ్చిగానే ఉంటుంది. గారెలనుకో... బల్లపరుపుగా ఉంటాయ్ కాబట్టి అన్నివైపులా సమానంగా కాల్తాయి. అందుకే మిర్చి బజ్జీల బండి మీద ఉన్న అన్నిటికంటే గారెలే బెస్టు. బజ్జీల బండి అని పేరు మాత్రమే వాటిది. రాజ్యమంతా గారెలదే. పైగా మహాభారతంతో పోలిక మరి దేనికైనా ఉందా? బజ్జీలకుందా? బొండాలకుందా? అందుకే ఎవరెన్ని కుట్ర చేసినా సరే... గారెల మనుగడ ఖాయం. పొద్దు కుంగడానికి ఆకాశం... పిండిలో చిల్లు పొడవడానికి మనిషికి వేలు... ఈ రెండూ ఉన్నంత కాలం ఈ సమాజంలో గారెలు ఇలా విలసిల్లుతుంటాయని నా నమ్మకంరా’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘చిల్లుగారెలో పొడవడానికి వేలు ఉన్నంత కాలం గారెలు ఉంటాయన్నావు. అది ఓకే. కానీ పొద్దు పొడవడానికీ... గారెలకూ సంబంధం ఏముంది?’’ అడిగాను. ‘‘పొద్దు కుంగగానే... అనగా సాయంత్రం కాగానే ఎంత పెద్దవాడినైనా అలా బజ్జీల బండి వద్దకు నడిపిస్తుంటాయి గారెలు. పొద్దుపొడుస్తూ ఉండగా కోడికి కూయాలనిపించినట్టుగానే, రోజూ సాయంత్రం అవుతూ ఉండగా... అంటే పొద్దు గుంకుతూ ఉండగానే గారెలు తినాలపిస్తుందిరా. కాళ్లు ఆటోమేటిగ్గా మిర్చిబజ్జీల బండి వైపుకు తిరుగుతున్నాయి. దీంతో నాకు ఒక విషయం అర్థమైంది’’ అన్నాడు వాడు. ‘‘ఏమిటి?’’ ‘‘ఏం లేదురా... కోడికి కూత... నాకు మేత... ఒక నేచురల్ ఇన్స్టింక్ట్రా. కోళ్లు కూస్తున్నంత కాలం ఇలా నేను గారెలూ మేస్తూనే ఉంటా. అలా గారెలు తింటూనే కన్నుమూస్తా’’ అన్నాడు వాడు. - యాసీన్ -
యురేకా - కాకీక...!
హ్యూమర్ నేను జుట్టుకు రంగేసుకుంటూ ఉండగా కొత్త ఐడియా చెబుతానంటూ ఠక్కున ఎంట్రీ ఇచ్చాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వన్నీ చాలా విచిత్రంగా మాట్లాడుతుంటావ్రా. ఒరేయ్... మొన్నట్లా మాట్లాడకు’’ అన్నాను కాస్త కోపంగా. ‘‘మొన్న అన్న మాటలు కూడా కరక్టే కదా’’ అన్నాడు వాడు. రాంబాబుగాడు ఆరోజు చెప్పినవి ఒకసారి తలచుకున్నా. ఇంతకూ వాడన్న మాట ఏమిటో చెబుతా వినండి. ‘ఆవు... పులి’ కథ తెలుసు కదా. అందులో పులికి తాను ఆహారంగా దొరికిపోయాక ఒకసారి తన బిడ్డను కలిసి వస్తానంటుంది కదా. చివరిసారిగా దూడకు పాలు పట్టించి బుద్ధులు చెబుతుంది కదా. అలా మాటమీద నిలబడ్డ కారణం వల్ల ఆవుకు ఆ ప్రఖ్యాతి రాలేదట. ఆవుకు ప్రశస్తి కలిగిన కారణం వేరట. ‘‘ఏంట్రా ఆ కారణం?’’ ఆసక్తిని చంపుకోలేక అడిగా. నిజానికి ఆ కథ రాసిన వ్యక్తి ఒక డాక్టర్ అట. అందునా క్యాన్సర్ స్పెషలిస్టు అట. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలియజేయడం కోసమే ఈ కథ రాశాట్ట. ఆవు వెళ్లి తన బిడ్డకు పాలు పట్టించి వచ్చింది. కాబట్టి పులి-గిలీ లాంటివి ఏమీ చేయలేకపోయాయని చెప్పాడు. నిజానికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పులి రూపంలో ప్రత్యక్షమైందని కూడా వాడు వాక్రుచ్చాడు. ఆవు కాస్తా బిడ్డకు రొమ్ముపాలు పట్టించడంతో క్యాన్సర్ అనే ఆ పులి కాస్తా పిల్లిగా మారిపోయిందనీ, అది కాలుగాలినట్టుగా ఆవుచుట్టూ కాసేపు పచార్లు చేయడం తప్ప మరేమీ చేయలేకపోయిందని వాడి రహస్య పరిశోధనల్లో తేలిందట. వాడి ఆ పరిశోధన గాథను నాకు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఆ కథ రాసిన వాడు అలనాటి ఆంకాలజిస్టు అనే గుట్టు కూడా విప్పాడు. కాకపోతే పరిశోధన ఫలితంలా చెబితే అందరూ అంతగా పట్టించుకోరట. అందుకే ‘డావిన్సీ కోడ్’లా ఆ రహస్య సమాచారాన్నంతా బయటకు ఒక నీతి కథలా కనిపించేలా రాశాట్ట. అదీ వాడు చెప్పిన మాట. ‘‘మొన్నటి నా పరిశోధనల్లో కొత్త సంగతి మనం కనిపెట్టడం తప్ప మనకు డెరైక్టుగా ఉపయోగ పడేది ఏమీ లేదు. కాకపోతే ఈ దెబ్బతో మనం కోటీశ్వరులం అయిపోవచ్చు’’ అన్నాడు. కోటీశ్వరులం కావచ్చనే మాటతో నేను కాస్త టెంప్ట్ అయ్యాను. ‘‘ఏంట్రా?...’’ అడిగాను నేను రంగేసుకోవడం ఆపకుండానే. ‘‘ఇలా వారానికి ఒకసారి కష్టపడి రంగేసుకునే బదులు... కాకి ఈకలకు ఆ రంగు ఎలా వస్తుందో తెలుసుకొమ్మని మనం రహస్యంగా సైంటిస్టులకు చెప్పాల్రా. సేమ్ టు సేమ్ రంగు వెంట్రుకలకూ వచ్చేలా చూస్తే చాలు. ఇలా మాటిమాటికీ రంగేసుకోనక్కర్లేదు. ఒకసారి ఆ పదార్థం జుట్టులోకి వెళ్లేలా చేస్తే చాలు... కాకి రంగు ఎప్పటికీ మారనట్టే... జుట్టుకూ రంగు మారదు. మొన్న మన వేప చెట్టు మీద కాకి వాలగానే నా బుర్రలోకి ఈ ఐడియా వాలిందిరా. వెంటనే యురేకా-కాకీక అనుకున్నా’’ అన్నాడు వాడు. ‘‘పక్షి ఈకలు వేరు... మనుషుల జుట్టు వేరు’’ అన్నాను నేను. ‘‘ఏం కాదు... మనుషుల్లో జుట్టు, గోళ్లూ... పక్షుల్లో ఈకలూ ఒకే పదార్థంతో తయారవుతాయట. దాని పేరు కెరటిన్ అట’’ అన్నాడు వాడు. ‘‘అయితే...?’’ ‘‘ఏముందిరా... అన్నీ ఒకే రకం పదార్థంతో తయారవుతున్నప్పుడు కొంగకు మాత్రం తెల్లరంగు ఉండి కాకి ఈకల్లోకి ఆ నల్లరంగు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అదే రంగు నీ జుట్టుకూ వచ్చేలా చేసేయాలి. కాకి ఈక ఫార్ములా తెలుసుకొని ఆ పేటెంట్‌ను మన పేరు మీద రాయించుకుంటే చాలురా... ఇక మనకు డబ్బులే డబ్బులు’’ అన్నాడు వాడు. వాడిచ్చిన ఐడియాను కాస్త సీక్రెట్‌గా ఉంచాలనుకున్నాను. మనకు నమ్మకమైన సైంటిస్టుకు ఎవరికైనా చెప్పి కాస్త పరిశోధన చేయించాలనీ... సక్సెస్ అయ్యాక ఫార్ములా అమ్ముకుని ఆ సైంటిస్టూ, మేమిద్దరమూ వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా కాస్త డబ్బు చేసుకుందామనుకున్నాం. భార్య దగ్గర రహస్యాలేవీ దాచకూడదన్న ప్రిన్సిపుల్ కొద్దీ నేను ఈ ఆలోచన చెప్పగానే సదరు ఐడియా మీద చన్నీళ్లు చల్లేసిందామె. ‘‘బట్టతలల వాళ్లెవ్వరూ మీ ఐడియాను కొనరు. కాకి మీద ఇంత పరిశోధన చేసే బదులు... రాబందు బట్టతల మీద జుట్టు మొలిచే మార్గం కనిపెడితే బెటరు కదా. దాంతో మరింత డబ్బే డబ్బు కదా’’ అంది మా ఆవిడ. - యాసీన్ -
ఇడ్లీ - దోశ ఒక తులనాత్మక పరిశీలన - అవగాహన!
హ్యూమర్ ‘‘ఇడ్లీ, దోశలలో ఏది ఉత్తమమైంది స్వామీ’’ అని అడిగా మా గురువు గారిని. ‘‘నాయనా తుచ్ఛులైన వారు ఏది ఉత్తమమైనదీ అని అడుగుతారు. నువ్వు వెలిబుచ్చే ఇలాంటి పనికిమాలిన సందేహాలతో పొద్దుపుచ్చుతారు. కానీ తెలివైన వాళ్లు ఏది దొరికితే అది తినేస్తారు. అంతే తప్ప ఇలాంటి చచ్చు ప్రశ్నలు అడగరు నాయనా’’ అని సెలవిచ్చారు స్వామీజీ. అయినా నేను పట్టు వీడలేదు. ‘‘ఒకసారి ప్రశ్న కోసం పట్టుపట్టాక వదలకూడదని మీరే అన్నారు కదా స్వామీ. నా ప్రశ్న తర్క, మీమాంస శాస్త్రానికి సంబంధించిందని మీరెందుకు అనుకోకూడదు?’’ నేను మళ్లీ రెట్టించాను. ‘‘సరే విను. చిన్న గిన్నెతో పిండిని పెనం మీద వేశాక దోశ కావడానికి ఆ చిన్న గిన్నెతోనే దానిపై ఒత్తిడి పెడతారు. అది పెనం మీద పరుచుకునేలా విస్తరించడానికి దాని తలమీద రుద్దేస్తారు. కార్పొరేట్ కాలేజీ స్టూడెంట్లను రుబ్బుతుండటం సరికాదని నువ్వు నీ స్పీచుల్లో చెబుతుంటావు చూడు. వాళ్ల లాగే దోశ మీద కూడా అలా రుద్దడం సరికాదు నాయనా. అలా రుద్దినప్పుడు ఏమవుతుందో తెల్సా?’’ అడిగారు స్వామీజీ ‘‘ఏమవుతుంది స్వామీ...?’’ అడిగాను నేను. ‘‘దోశల్లా కార్పొరేట్ పిల్లల్లా ఎదగకుండా ఉండిపోతారు. కానీ ఇడ్లీ అలా కాదు. మెదడు వికాసం జరిగినట్లే ఇడ్లీ కూడా పొంగుతుంది. పిండి రేణువుకూ, పిండి రేణువుకూ మధ్య ఖాళీ స్పేస్ వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క దోశ ముక్కలను ఎప్పుడైనా సాంబారులో వేశావా? ఏదో దోశతో పాటు స్పూనుతో తాగడానికి సాంబారు సరిపోతుంది గానీ... దోశముక్కలు సాంబారు అంత తేలిగ్గా పీల్చవు. అచ్చం నీ ఉపన్యాసాల్లో మన కార్పొరేట్ విద్యాసంస్థల్లోని విద్యార్థుల్లాగే. వారూ అంత తేలిగ్గా ప్రాపంచిక విషయాలను గానీ... లోకజ్ఞానాన్నిగానీ అబ్జార్బ్ చేసుకోలేరు...’’ అంటుండగానే నేను మధ్యలోనే అడ్డుపడ్డాను. ‘‘అంటే... ఇడ్లీ పీల్చుకుంటుందా స్వామీ’’ ‘‘తప్పకుండా నాయనా... మంచి నిపుణులైన వంట చేసేవాళ్లు పిండి కలిపారనుకో. ఆ రవ్వా... ఆ మినప్పప్పు సమపాళ్లలో కలిశాయనుకో. ఇడ్లీలోని పిండికి మధ్య ఎంతెంతో పఫ్పీ స్పేస్ ఉంటుంది. ఆ మధ్యనున్న స్థలంలో సాంబారు దూరిపోతుంది. సాంబారులో నానిన ఆ ఇడ్లీ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా నాయనా’’ చెబుతున్నారు స్వామీజీ. ‘‘నిజమే కదా స్వామీ’’ బదులిచ్చాను నేను. ‘‘అంతేకాదు నాయనా... జనం పెరిగారు. జనాభా పెరిగింది. వాళ్లకు తగ్గట్లుగా ఇళ్లు కూడా కావాలి కదా’’ అన్నారు స్వామీజీ. ‘‘అవును కదా. మరి దానికీ ఇడ్లీకీ సంబంధమేమిటి స్వామీ?’’ అడిగాను. ‘‘అదే నాయనా నాలాంటి జ్ఞానులకూ, నీకూ తేడా. ఇడ్లీ పాత్రలో గతంలో రెండు అంతస్తులు మాత్రమే ఉండేవి. పాత్రపెద్దదవుతూ ఉండేదీ... దానిలోని పిండి పోసే చిప్పలు పెరిగేవి. కానీ... డూప్లెక్సు భవనంలా ఇడ్లీ ప్లేట్లు రెండే ఉండేవి. కానీ ఇప్పుడు మాడ్రన్ ఇడ్లీ పాత్రను ఎప్పుడైనా హోటల్లో చూడు. బహుళ అంతస్తుల భవనాల్లో ఒకదానిపైన ఒకటి ఉంటాయి. ర్యాకులనూ, డెస్కులనూ బయటకు లాగినట్లుగా వాటిని లాగుతుంటారు’’ అని జవాబిచ్చారు స్వామీ. ‘‘అవును స్వామీ... ఇడ్లీ పాత్రకూ, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్లకూ అంత దగ్గరి సంబంధం ఉంటుందనుకోలేదు’’ అన్నాన్నేను. ‘‘అంతేకాదు... దోశ కంటే ఇడ్లీ ఎన్ని రకాలుగా ఉత్తమమో చెబుతాను ఆగు. ఉదాహరణకు మసాలా దోశ తిన్నావనుకో. అందులో మసాలా పేరిట ఉండే పదార్థం నీకు సరిపడకపోవచ్చు. కడుపులో మంట పుట్టించవచ్చు. దోశకు అది తెచ్చిపెట్టుకున్న టేస్టు. కానీ ఇడ్లీలో అలా కాదు నాయనా... మసాలాలూ, గిసాలాలూ ఏవీ లేకుండా... కేవలం ఇడ్లీ వల్లనే ఇడ్లీకి రుచి వస్తుంది. ఏదీ తెచ్చిపెట్టుకోనిదో, ఏది స్వాభావికమైనదో ఆ టేస్టు గొప్పది నాయనా’’ అన్నారు స్వామీజీ. ‘‘అయినా అరిషడ్వర్గాలనూ జయించిన మీలాంటి స్వామీజీలు రుచుల గురించి ఇంత విపులమైన వర్ణనలేమిటి స్వామీ’’ ఆశ్చర్యంగా అడిగా. ‘‘పిచ్చివాడా... ఇడ్లీ అంటే ఏమిటి? సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం నాయనా. సాంబారు ఇడ్లీలోకి ఎలా ఇంకిపోతుందో తెలుసా? అచ్చం జీవాత్మ పరమాత్మలో లీనమైనట్లే! మాలాంటి జ్ఞానులకు ఇవన్నీ తెలుసు. కానీ తిండిబోతులైన నీలాంటి తుచ్ఛులకు అర్థమయ్యేలా చెప్పడమెలా? అయినా నువ్వే చెప్పావు కదా. తర్క మీమాంస శాస్త్రాలు నీబోటి సామాన్యులకు కూడా అర్థం కావడం కోసమే నాయనా ఈ ఉదాహరణలు’’ అని సెలవిచ్చారు స్వామీజీ. నాకు జ్ఞానోదయమైంది. అనంతాకాశం అనే సాంబారు ప్లేటులో అర్ధచంద్రుడు ఇడ్లీలా దర్శనమిచ్చాడు! - యాసీన్ -
ధర్మేచ... అర్థేచ... ఉప్మేచ!
హ్యూమర్ ‘‘ఉపమాలంకారం అంటే ఉప్మా అనే టిఫిన్‌తో మన డైనింగ్ టేబుల్ అందాలను మరింత ఇనుమడింపజేయడం అన్నమాట. అందుకే దాన్ని ఉపమాలంకారం అన్నారు’’ అంటూ ఏదో లెక్చర్ ఇస్తున్నాడు మా రాంబాబు గాడు. ‘‘నీ ముఖం ఉపమాలంకారం అనేది ఒక వ్యాకరణ ప్రక్రియ అనుకుంటా. పోలికలు అందంగా చెప్పే అనేక తరహా రకాల్లో అదీ ఒకటి అనుకుంటా. నీకు తెలియకపోతే నోర్మూసుకో... కానీ ఇలా అడ్డమైన వ్యాఖ్యానాలు చెయ్యకు’’ అంటూ మరింతగా కోప్పడ్డాను నేను. నా కోపానికి అసలు కారణం వేరే ఉంది. ఉదయం టిఫిన్‌లోకి మా ఆవిడ ఉప్మా చేయడంతో కాస్త ధుమధుమలాడుతూ బయటకు వచ్చేశా. మామూలుగా అయితే ఇడ్లీ పట్ల నాది కాస్త ఫ్రెండ్లీ ధోరణి. ఉప్మా అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ టిఫిన్లలోకెల్లా కాస్త త్వరగానూ, వీజీగానూ చేసేయవచ్చని మా ఆవిడ మాటిమాటికీ ఉప్మా చేస్తుంటుంది. ‘‘ఒరేయ్... అసలే ఇష్టమైన టిఫినూ దక్కలేదు. పైగా నీ గోల ఏమిట్రా’’ అంటూ వాడిపై మరింత విరుచుకుపడ్డాను. ఆ కోపమూ, ఈ కోపమూ కలిపి రాంబాబు గాడి మీద వెళ్లదీశాన్నేను. అంతే... వాడు ఉప్మా గురించి నాకు హితబోధ మొదలుపెట్టాడు. ‘‘ఒరేయ్ నాయనా... ఎప్పుడైనా టిఫిన్ల ప్రస్తావన వచ్చినప్పుడు ఉప్మా-పెసరట్ అద్భుతంగా ఉంటుందన్న మాట విన్నావా?’’ అడిగాడు. ‘‘విన్నాను’’ ‘‘అందుకే మరి... కేవలం ఒక్క డైనింగ్ టేబుల్‌కు మాత్రమే ఉప్మా తలమానికం కాదురా... దోసెనూ ఉప్మాతోనే అలంకరిస్తారు. అందుకే ఇలా పలహారబల్లలనూ, దోసెల్నీ... మరెన్నింటినో ఉప్మాతో అలంకరించే అవకాశం ఉంది కాబట్టే అలంకార శాస్త్రంలో ఉప్మాకు టిఫిన్లలో పెద్దపీటకు బదులు పెద్దటేబుల్ వేశార్రా. అంతేకాదు... మనం పరిశ్రమ పరిశ్రమ అంటూ అభివర్ణించుకునే సినిమా రంగం అంతా మూవీ హిట్టు కొట్టాలంటే ఉప్మా మీదే ఆధారపడి ఉంది’’ అంటూ తన జిహ్వాగ్రం మీది ఉప్మాగ్ర చర్చలతో వాతావరణాన్ని మరింతగా వేడెక్కించాడు. ‘‘ఒరేయ్... నన్ను మరీ ఇంత వేధించకు రా... ఉప్మాకూ సినిమా హిట్స్కూ సంబంధం ఏమిట్రా?’’ అడిగాన్నేను. ‘‘మొన్న బ్లాక్‌బస్టర్ అయిన మహేశ్‌బాబు పోకిరి సినిమా చూశావా? అందులో హీరోయిన్ ఎప్పుడూ బాక్స్‌లో ఉప్మా పెట్టుకు తిరుగుతుంటుంది. హీరోయిన్ తమ్ముడు కూడా ఉప్మానే బాక్స్ కట్టించుకుంటాడట. దాంతో హీరో ‘ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినే బతికేస్తున్నార్రా’’ అని సరసమాడతాడు’’ అన్నాడు రాంబాబు గాడు. ‘‘కరెక్టే రా’’ అన్నాన్నేను. ‘‘నిన్నా మొన్నా మాత్రమే కాదురా బాబూ... దాదాపు 40 ఏళ్లకు ముందు అడవి రాముడు అన్న సినిమాలో రాజబాబు అనే మహనీయ కమేడియన్ ఉప్మా తయారు చేస్తే అడవిలో పెద్దపులి తనకు నోరూరించే దుప్పులూ, జింకలూ వంటి వాటిని వేటాడటం మానేసి ఉప్మా గిన్నెను శుబ్బరంగా ఊది పారేసింది. అంటే పులికి సైతం ఇష్టమైన వంటకం ఉప్మాయే అన్నమాట. అంతెందుకు... సదరు ఉప్మా వండిన రాజబాబు సైతం ‘పులి ఉప్మా తిందేమిటి చెప్మా’ అంటూ ఆశ్చర్యపడిపోతాడు. మొన్నటి బజ్‌వర్డ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తినేసి బతికేస్తున్నార్రా అయితే ... నలభై ఏళ్లకిందట ఫేమస్ డైలాగ్ ’పులి ఉప్మా తిందేమిటి చెప్మా’. నీకో సీక్రెట్ చెప్పనా? ఏదైనా సినిమాలో ఉప్మాకు సంబంధించిన డైలాగ్ బజ్‌వర్డ్ అయ్యిందంటే ఆ సినిమా అప్పటి అడవిరాముడు లాగో, మొన్నటి పోకిరీ లాగో సూపర్, డూపర్, బంపర్ హిట్టన్నమాట’’ అంటూ వాక్రుచ్చాడు వాడు. అంతకు ముందు నేనెప్పుడూ ఎరగని సెంటిమెంట్ ఇది. ఫలానా అక్షరంతో సినిమా మొదలవ్వాలనీ, ఫలానా నటుడే తప్పనిసరిగా ఉండాలనీ... ఇలా సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువే అన్న విషయం నాకు తెలుసు. కానీ... ఇలాంటి సెంటిమెంట్ అంటూ ఒకటి ముందుకొస్తే... ఉప్మాకు ప్రాధాన్యం పెరిగి, అది ఉప్మా పెసరట్ టిఫిన్‌లో కేవలం మెగాపవర్ పెసరట్టు సరసన మాత్రమే హీరోయిన్గా కాకుండా... అనేక టిఫిన్ల సరసన ఉప్మాయే హీరోయిన్ అయి జతకడితే ఎలా అన్న ఆందోళన మొదలైంది నాకు. ‘‘ఒరేయ్... అలా అడ్డదిడ్డంగా మాట్లాడి నీ మాటలు సినిమా వాళ్లు వినకుండా చూసుకో’’ ‘‘నోనో... ఐయాం సారీ. కొన్ని సిన్మాలలో ఉప్మాకు తగినంత ప్రాధాన్యం దొరికినా... దాని పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. నిజానికి కుట్టుపిండి, రవ్వ ఉప్మా, మసాలా ఉప్మా, టమాటా బాత్ అంటూ వివిధ రకాలుగా చిన్నా చితకా వేషాలు వేస్తున్నప్పటికీ ఉప్మాకు తగినంత బ్రేక్‌థ్రూ రాలేదు రా. అందుకే నాకు గనక అవకాశం దొరికితే సినిమా ఇండస్ట్రీ వారికి ఉప్మాతో హిట్ కొట్టడం ఎలా అన్నది వివరంగా తెలియజెబుతాను. ప్రస్తుతం నా జీవితలక్ష్యం ఒకటే రా?’’ ‘‘ఏమిటది?’’ అడిగాను నేను బితుకు బితుకుమంటూ. ‘‘అన్నట్టు ఇవ్వాళ్ల టిఫిన్‌లో మీ ఆవిడ ఉప్మా చేసిందన్నావు కదా. మీ ఇంటికెళ్లి అలా కాస్త టిఫిన్ తినేసి వస్తా. నీ ఫ్యామిలీ ఏమిటీ... నా ఫ్యామిలీ ఏమిటి. వసుధైక కుటుంబం అంటారే... ఆ స్టైల్లో మనదంతా ఉపమైక కుటుంబం? అన్నట్టు నీకో మాట చెబుతా విను. ధర్మేచ... అర్థేచ... ఉప్మేచ అని ఆర్యోక్తి. కాబట్టి ఉప్మా వండినందుకు నిరసనగా భార్య మీద అలిగి బయటకు రాకూడదన్నది మంత్రాల అంతరార్థం రా బాబూ ’’ అంటూ మా ఇంటి వైపునకు కదిలాడు రాంబాబుగాడు. - యాసీన్ -
‘విగ్’ ఆఫ్ వార్...
హ్యూమర్ ప్లస్ క్యాప్, విగ్ రెంటికీ మధ్య వైరం వచ్చింది. ఆ రెండూ ఎదురూ-బొదురూ నిలబడి సంవాదం మొదలుపెట్టాయి. ‘‘సీనియారిటీనైనా గౌరవించు. నువ్వు పుట్టకముందే నేను పుట్టాను. తల గుడ్డ అన్నది ఒక గౌరవ రూపం. తమ ఆత్మాభిమానానికి అది నిదర్శనం. అంతగా ముడిచి కట్టుకోవడం కాస్త కష్టమని టోపీ రూపంలో నన్ను తొడుక్కోవడం మొదలు పెట్టారు’’ అంది క్యాప్. ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా... తల మీదకి ఎక్కామా లేదా?! యువర్ ఆనర్ అంటూ గౌరవంగా పిలిపించుకునే వారంతా నన్ను తొడగడం మొదలుపెట్టారు. కావాలంటే పాత పిక్చర్స్ చూడు. పెద్ద పెద్ద న్యాయాధిపతులంతా తమ దర్జా, హోదా చూపడం కోసం నన్ను ధరించారు. నీ లోపం గురించి నువ్వు చెప్పుకున్నావు. టోపీ అంటూ నిన్ను గురించి నువ్వు అన్న మాట అక్షరాలా సత్యం. ఎవడైనా మోసం చేసి పోతే టోపీ పెట్టారని నిన్నే ఈసడించుకుంటుంటారు’’ గొప్పలు పోయింది విగ్. ‘‘అప్పుడు జుట్టు ఉన్నా లేకున్నా తొడిగారేమో గానీ ఇప్పుడందరూ వదిలేశారు. కేవలం బట్టతల వాళ్లు మాత్రమే నిన్ను ధరిస్తున్నారు’’ అంది. ‘‘అవును. కాలు పోయిన వారికి జైపూర్ పాదంలా, గుండె కవాటం దెబ్బతిన్నవారికి కృత్రిమ వాల్వ్‌లా ఉపయోగపడుతున్నాన్నేను. నేను ఎవరికైనా జుట్టు వైకల్యం కలిగిందంటే, దాంతో వచ్చే ఆ బట్టతలనే కనిపించనివ్వను. ఒత్తుగా జుత్తు కనిపించేలా చేస్తాన్నేను.’’ అంది విగ్గు. వెంటనే క్యాప్ అందుకుంది... ‘‘నన్ను తొలగిస్తే గానీ నెత్తిమీద వెంట్రుకలు లేని విషయం కనిపించదు. పైగా చూసిన వారు నాలోపల వెంట్రుకలు ఏ రూపంలో ఉన్నాయోనంటూ ఎవరి ఊహకు తోచిన విధంగా వారు ఊహించుకోవచ్చు. ఆలోచించుకున్న వారికి ఆలోచించినంత. అంటే వాళ్ల ఊహలే హద్దు. అంటే నేను జనాల్లో అంత క్రియేటివిటీ పెంచుతానన్నమాట. అంతెందుకు.. రాత కూడా పతాక శీర్షిక రూపంలో నన్ను తొడుక్కుంటుంది. అందుకే దాన్ని ‘క్యాప్’షన్ అంటారు. ఇక ఒక రాతను నచ్చి వెంట ఉండే పాఠకులను కూడా ‘క్యాప్’టివ్ రీడర్స్ అని పిలుస్తారు. తెల్సా...కానీ నువ్వు... ఎదుటి వాళ్ల ఆలోచనలను పరిమితం చేస్తావు. వాళ్ల ఊహలకు అడ్డుపడతావు. ఒకరి ఊహలకు అడ్డుపడటానికి నీకేం హక్కుంది. పైగా నువ్వు నిజానివి కాదు... అబద్ధానివి’’ అని అరిచింది క్యాప్. ‘‘క్యాప్వైన నువ్వు చేసేదేమిటి? నువ్వు మాత్రం నిజానికి పాతరేయవా? నిజానికి నువ్వే నిజాన్ని కప్పెడతావు. పైగా నేను అబద్ధాన్ని అన్న ఆరోపణ తప్పు. నేనొక వాస్తవాన్ని. అసలు నేనే ఒక కొత్త వాస్తవాన్ని ఏర్పరుస్తాను. దాంతో నన్ను నెత్తిన పెట్టుకున్న వాడికి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాను. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే నువ్వు గొప్పా... లేక ఆత్మవిశ్వాసాన్ని పెంచే నేను గొప్పా’’ అంది విగ్గు. ‘‘ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తానంటూ విర్రవీగే నువ్వు అందరికీ అందుబాటులో ఉండవు. నువ్వు చాలా ఖరీదు. నేనేమో చాలా చవక. పైగా అందరికీ దగ్గరగా ఉంటాను. ఏ షాపులోనైనా తేలిగ్గా దొరుకుతాను. అదీ నా పాపులారిటీ’’ అంది క్యాప్. ఆ రెండూ కొట్టుకుంటున్న సమయంలో ఆ పొరుగునే ఉన్న కళ్లజోడు ఒక మాట అంది. ‘‘మీరూ మీరూ కొట్లాడుకుంటున్నారు గానీ ఇక ఇద్దరూ నోరు మూసుకోండి. నెత్తిమీదికి ఎక్కేలా పెట్టబట్టి నాకో విషయం తెలిసింది. అటు క్యాప్నూ, ఇటు విగ్నూ కలిపేసి క్యాప్ చివరన జుట్టు ఉండేలా ఒక మిక్స్డ్ రూపాన్ని తయారు చేశారు. యూ నో! అది పెట్టుకుంటే ముందు క్యాపూ, వెనక జులపాల క్రాపూ!’’ - యాసీన్ -
విలనే నా హీరో!
హ్యూమర్ హైనాలన్నా, విలన్లన్నా నాకు చిన్నప్పట్నుంచీ తెగ ఇష్టం. కాకపోతే ఈ విషయం బహిరంగంగా చెప్పుకోడానికీ, ఒప్పుకోడానికీ చాలా ఇబ్బంది. కారణం... దీన్ని లోకం ఒప్పదు. కానీ మనలోమనమైనా నిజాలు ఒప్పుకోక తప్పదు. హైనాలు పరమ నీచమైన జీవులే. జంతుప్రపంచంలో దాదాగిరి చేస్తుంటాయి. ఇతర జంతువులు న్యాయంగా వేటాడిన వాటిని పరమ జబర్దస్తీగా లాక్కుంటాయి. సాటి జీవుల పట్ల రౌడీల్లా వ్యవహరిస్తుంటాయి. ఇక విలన్లంటే సాక్షాత్తూ నరరూప హైనాలే కదా. హైనాలూ విలన్లలా నవ్వుతుంటాయట. మనిషిలాగే నవ్వు సౌండ్ వినిపించేలా చేస్తాయట. సాటి మనషేమోనని భ్రమింపజేస్తాయట. అలా వికటాట్టహాసంతో మనుషుల్ని మోసం చేస్తుంటాయట. మరిక విలన్ల గురించి కొత్తగా చెప్పేదేముంటుంది. వాళ్లు ‘హహ్హహా’ అంటూ చేసే ఆ వికటాట్ట హాసానికి విలన్నవ్వు అన్న పేరు ఎప్పట్నుంచో ఫిక్సయి ఉంది. యాంగ్రీయంగ్ మేన్ అయిన హీరో ఎప్పుడోగానీ నవ్వడేమోగానీ విలన్ మాత్రం ఒక్క చివరి సీన్లో తప్ప ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. హీరోకు చిరు దరహాసం తప్ప అట్టహాసం తెలియదు. అది విలన్లకు మాత్రమే ప్రాప్తం. హీరో ఒక లక్ష్యం కోసం సినిమా ఆద్యంతమూ తెగ కష్టాలు పడుతూ ఉంటాడు. కానీ విలన్ మాత్రం పతాక సన్నివేశంలో తప్ప నిత్యం పకపకలాడుతూ ఉంటాడు. వాడికి నవ్వడం ఎంత తేలికంటే... ఒక గుండుసున్నా గీసి, అందులో నెలవంక లాంటి గీత గీస్తే అది స్మైలీ అయినంత తేలిక. ఈ మాత్రం చిత్రం ఎవ్వడైనా గీయగలడు. అలాగే సినిమా ఆద్యంతమూ విలన్ నవ్వగలడు. వాడివన్నీ హైనా వేషాలే. వాస్తవంగా వేటాడిన జంతువు ఎలా పోతేనేం? మన హైనాకు ఆహారం దక్కుతుంది. ఇక సినిమాలోనూ ఇదే న్యాయం కొనసాగుతుంటుంది. బియాండ్ ద మూవీ ఏం జరుగుతుందో కాస్త ఊహిద్దాం. ఆఖరి సన్నివేశం తర్వాతి సీన్లు మనకు కనిపించవు గానీ కాస్త ఆలోచిస్తే వాటిని ఊహించవచ్చు. సాధారణంగా సినిమా చివరన విలన్‌కు తీవ్ర పశ్చాత్తాపం కలుగుతుంది. దాంతో శుభం కార్డుకు ముందు అతడు తన కూతుర్ని హీరోకు ఇచ్చి పెళ్లి చేస్తుంటాడు. ఆదర్శవంతుడైన కారణాన హీరో అయిన వాడు పెళ్లాన్ని బాగా చూసుకోక తప్పుతుందా? కాబట్టి విలన్ కూతుర్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాల్సిందే కదా. తన కూతురు హ్యాపీగా ఉండటం చూసి మళ్లీ సదరు విలన్ సంతోషంగా నవ్వుతూ ఉంటాడేమో కదా. కాబట్టి సాధారణంగా విలన్ అనేవాడు ఎల్లప్పుడూ సహజానంద గుణంతో నిత్యానందంగా ఉంటాడని అనుకునేందుకు పూర్తి ఆస్కారాలూ, గట్టి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మనం హీరో పక్షం వహించామనుకోండి. నిత్యం ఖేదం, ఆఖర్లోనే మోదం. ఒక్క క్లైమాక్స్ ఫైట్‌లో మాత్రమే మన హర్షాతిరేకాలు వ్యక్తం చేసుకోడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ విలన్ పక్షం వహించామనుకోండి. ఆల్వేస్ హ్యాపీ. ఇప్పుడు చెప్పండి... ఎప్పుడో ఆఖరి సన్నివేశంలో మాత్రమే మనం నవ్వడానికి పనికొచ్చే హీరో బెటరా? నిత్య వికటాట్టహాస విలన్ బెటరా? - యాసీన్ -
మీసంపెంగ వాసనలు!
హ్యూమర్ మీసాలకూ... కవులకూ ఒకింత దగ్గరి సంబంధం ఉంది. దీనికి చాలా దృష్టాంతాలూ, బోల్డన్ని తార్కాణాలూ ఉన్నాయి. దాదాపు మీసాల్లోని కేశాలెన్నో ఈ దృష్టాంతాలూ అన్నే ఉన్నాయని కవులనూ, మీసాలనూ నిశితంగా పరిశీలించిన వారు అంటుంటారు. ఉదాహరణకు తిరుపతి వెంకట కవులిద్దరూ కూడబలుక్కొని మీసాలు పెంచారు. ‘సినిమాలకు హాలీవుడ్ హీరోలెలాగో, కావ్యాల్లో కవులలాగ. వాళ్లకు మీసాలెందుకు’ అంటూ కొందరు పెద్దలు కోప్పడ్డారు. అప్పుడు సదరు జంటకవులు కాస్తా పద్యంతో బదులిచ్చారు. ‘మేమే కవీంద్రులమని తెల్పడానికి మీసాలు పెంచాం. రోషం కలిగిన వాళ్లెవరైనా మమ్మల్ని గెలిస్తే ఈ మీసాలు తీసి మీ పద సమీపాలలో ఉంచి, మొక్కుతాం. కాబట్టి దుందుడుకుగా ఇలా మీసాలు పెంచాం’ అంటూ మీసాలెందుకు పెంచుతున్నారంటూ అడిగిన వాళ్లను కవిత్వంలో నిరసించారు. ‘మీకు దిక్కున్న చోట చెప్పుకోఫోండి...’ అన్నట్టుగా పద్యంతో ఫెడీ ఫెడీమని కొట్టి చెప్పారు. కాస్త వయసు మీరాక ఈ బాడీ జాడీలోని జీవితప్పచ్చడికి మొదట ఉన్నంత టేస్టు ఉండదు. ఈ లోతైన ఫిలాసఫీని చాలా తేలిక మాటల్లో తెలిపాడు శ్రీశ్రీ. ‘మీసాలకు రంగేస్తే యౌవనం వస్తుందా... సీసా లేబుల్ మారిస్తే సారా బ్రాందీ అవుతుందా’ అన్నాడాయన. అంటే యుక్త వయసులోనూ.. ముదిమిలోనూ మీసం ఈక్వలే అయినా ఆ తర్వాతి సీక్వెల్లో అవి తెల్లబోతాయనీ... తద్వారా తదుపరి దశలో తెల్లబడి వెలవెలబోతాయనీ తేటతెల్లం చేశాడు. ఆ విషయం గుర్తెరిగిన జ్ఞాని కాబట్టే ఆయన మీసాలు పెంచలేదు. చౌడప్ప అనే మరో కవి... ‘మీసాలూ-అవి పెంచాల్సిన వారి లక్షణాలూ’ అనే అంశం మీద పద్యం రాశాడు. ‘ఇవ్వగల, ఇప్పించగల అయ్యలకే మీసాలుండాలనీ, మిగతావాళ్లకు ఉన్నా అవి పెద్ద లెక్కలోకి రావ’ని కరాఖండీగా చెప్పాడు. మీసాలు ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు అనే అంశాన్ని నిమ్మకాయ నిలబెట్టిన మీసమంత పవర్‌ఫుల్‌గా చెబుతూ... ‘ఆ మాటకొస్తే రొయ్యకు లేవా బారెడు’ అంటూ మిగతా మీసగాళ్లను అలా తీసిపడేశాడు. అత్యద్భుత కావ్యాలు రాసి... తన పద్యాలతో పండిత-పామరులతో ‘వన్స్‌మోర్’ అంటూ జేజేలు చెప్పించుకున్న జాషువా గారికి తన మీసాల పట్ల మోజు ఎక్కువ. ఒకసారి ప్రముఖ రచయిత, చిత్రకారుడూ, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సంజీవ్‌దేవ్‌గారు జాషువాను చూసి ‘ఇంతటి గుబురు మీసాలు లేకపోతే మీరు ఇంకెంత అందంగా ఉండేవారో కదా’ అన్నార్ట. వెంటనే జాషువా గారు తన వేళ్లతో ఒకసారి ఆ మీసాలను పైకి దువ్వుతూ, గట్టిగా నవ్వుతూ ‘నాలో కవిత్వం లేకపోయినా సహించగలను. కానీ మీసాలు లేకపోతే మాత్రం సహించ లేను’ అన్నార్ట. జాషువా గారు తన ఇష్టాన్ని అంత పవర్‌ఫుల్‌గా చెప్పారని అంటారు సంజీవ్‌దేవ్ గారు ‘కవి, మనీషి, జాషువాతో’ అనే తన వ్యాసంలో. జాషువా వంటి మహానుభావుడు మీసాలకు అంత ప్రాధాన్యం ఇచ్చాడంటే కవిత్వం కంటే బలమైనది ఏదో మీసాల్లో ఉండే ఉంటుందని ఆ మీస వ్యాస రత్నాకరాన్ని పరిశీలిస్తే మనకు తెలిసి వస్తుంది. అలాంటి జాషువాగారు వృద్ధాప్యంలో పక్షవాతం వచ్చి మాట్లాడలేకపోయేవారట. ఎవరైనా వచ్చి ‘కవిగారూ... ఎలా ఉన్నారు’ అని పలకరిస్తే... హుందాగా మీసం తిప్పి తాను మానసికంగా దృఢంగా ఉన్నానంటూ బదులిచ్చేవారట. అంటే సదరు పలుకుతో వచ్చే జవాబు కంటే మీసం దువ్వడం ద్వారా ఇచ్చే ఆన్సరే బలమైనదని తెలియడం లేదూ. ‘మెలిదిరిగిన మీసాలను సవరించుకుంటూ జాషువా కవిగారు కలియదిరుగుతుంటే చూస్తున్నవారికి శ్రీనాథ మహాకవి తలపునకు రాకమానడు’ అనుకుంటూ ఆయన మీసాలను తలచుకుంటూ ఉంటారు ఆయనతో కలిసి తిరిగినవారు. అంతెందుకు... ‘వియన్నా సులోచనాలూ, స్విట్జర్లాండు రిస్ట్ వాచి, ఫారెన్ డ్రస్, ఫ్రెంచి కటింగు మీసాలును, ఫారిన్ ఫ్యాషన్ లేనిచో...’ సొంత పెళ్లాలయినా మొగుణ్ణి పెద్దగా లెక్కచేయరని మృత్యుంజయ శతకం వంటి మహాద్భుత రచనలు చేసిన మాధవపెద్ది సుందరరామశాస్త్రి అనే కవిగారు మీసాల గొప్పదనాన్ని సెలవిచ్చారు. ‘మీసము పస మగ మూతికి’ అంటూ ఒక పక్క ఒక కవి అంటున్నా... ఇంకెవరో అజ్ఞాత కవి అధిక్షేపణ పూర్వకంగా పవర్‌ఫుల్‌గా తిడుతూ... ‘మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె’ అనే సామెతను పుట్టించాడు. ఇంచుమించూ ఇలాంటి అర్థమే వచ్చేలా ‘అంబలి తాగే వాడికి మీసాలెత్తే వాడు ఒకడు’ అంటూ మరొకరు కాస్త గట్టిగానే కోప్పడ్డాడు. అంటే... మన పస తెలియజేయడానికి మీసాలు పెంచవచ్చు... కావాలంటే వాటికి సంపెంగ నూనె కూడా రాసుకోవచ్చు గానీ... మొదట ఉదర పోషణ జరగాలనీ, ఆ తర్వాతే మీస పోషణకు రావాలని సామెతలు సృష్టించిన ఆయా ప్రజాకవుల భావం. ఎవరేమనుకున్నా క్యాలెండర్ అన్నాక మాసాలూ... మగాడన్నాక మీసాలూ ఉండి తీరాల్సిందేనని కొందరు పురుషపుంగవుల అభిప్రాయం. కానీ పెంపుడు జంతువుల్లాగానే వాటినీ దువ్వుడానికే తప్ప మరో ఉపయోగం లేదని క్లీన్షేవోత్తములు వాకృచ్చుతూ ఉంటారు. పోనీ మీరూ పెంచరాదా అంటే... ‘ఎందుకు పెంచం’ అంటారే తప్ప గబుక్కున పెంచలేరు. మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి అలా క్యాట్ఫిష్షుల్లా ‘మీనమీసాలు’ లెక్కబెడుతూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. - యాసీన్ -
అంతా ‘రాత’ మహత్యం!
హ్యూమర్ విధిని ఇంగ్లిష్‌లో ఫేట్ అంటుంటారు. ఫేట్ అనేదానికి ఫేస్ ఉండదు. కానీ వెక్కిరించడం దీని హాబీ. కండరాలు ఉండవు. కానీ బలమైనది. ‘విధి బలీయమైనది’ అని అందరూ అంటుంటారు. బలమైనది అనడానికి బదులు... బలీయం అనే మాటను విధికి విధిగా ఎందుకు వాడతారో పండితులకు మాత్రమే తెలుసేమో. అయితే విచిత్రం ఏమిటంటే పామరులూ అదే మాట వాడుతుంటారు. కొందరు మహనీయులుంటారు. విధిరాతతో సహా దేనినైనా వాళ్లు మార్చగలమంటారు. ఇడ్లీ రౌండ్‌గానే ఎందుకు ఉండాలని వాళ్లు ప్రశ్నిస్తారు. సంప్రదాయానికి తాము ఎదురు నిలవగల ధీరులమంటారు. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ మూసను నలు చదరాకారంగానో, త్రిభుజాకారంలోనో రూపొందిస్తారు. సమోసా షేప్‌లో ఇడ్లీని తయారు చేస్తారు. తాము దేన్నైనా మార్చగలమని ఈ కారణ జన్ములు ఇలా సెలవివ్వగానే... అలా నమ్మేస్తారు కొందరు. కానీ ఇడ్లీపాత్రను అడ్డుపెట్టి ఇడ్లీల షేపు మార్చగలరేమోగానీ దాని టేస్టు మార్చగలరా? విధీ అంతే... ఇంచుమించు ఇడ్లీతో సమానం. విధిరాత బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ చెల్లని నాణేనికి లాగానే దాని గీతలూ గజిబిజిగా ఉంటాయట. ముఖానికి రింకిల్స్ వచ్చినట్లుగానే సాధారణంగా విధిరాత అనే సదరు హ్యాండ్ రైటింగ్ ఎప్పుడూ కాస్త అర్థం కాకుండా ఉంటుందని దాని గురించి ఆందోళన పడేవాళ్లు అనే మాట. అందుకే విధిరాతనూ, బ్రహ్మరాతనూ ఒకేలా పరిగణిస్తుంటారు. అందుకేనేమో ఆ బ్రహ్మరాతను రాసే రైటర్‌ను విధాత అని కూడా అంటుంటారు. డాక్టర్ విధాతగారు సాధారణంగా మనిషి నుదురును తన ప్రిస్క్రిప్షన్ పేపర్‌లాగా ఉపయోగి స్తుంటారని బాగా చదువుకున్నవాళ్లు అంటుంటారు. అసలు విధి, బ్రహ్మ ఒకటేనని శాస్త్రాలన్నీ తెలిసినవాళ్లు అంటుంటారు. కానీ వాక్యనిర్మాణంలో విధి గురించి చెప్పేటప్పుడు ఫిమేల్గానూ, బ్రహ్మను మేల్గానూ చెబుతూ జెండర్ డిఫరెన్స్ చూపిస్తారు. విధికి ‘గేమ్స్ అండ్ స్పోర్ట్స్’ బాగా తెలుసని చాలామంది అంగీకరించే సత్యం. ఆటల్లో దానికి మక్కువ ఎక్కువట. అందుకే అది తమతో గేమ్స్ ఆడుకుంటూ ఉంటుందని వాళ్ల అభిప్రాయం. అయితే సదరు క్రీడలో విధికి నైపుణ్యం చాలా ఎక్కువ. అందుకే విధి ఆడే ఆటలో అది మాత్రమే ఎప్పుడూ గెలుస్తుంది. అందుకే సదరు స్పోర్ట్‌లో ఎప్పుడూ దానికి తలవంచాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు. అన్నట్టు... ఫైన్ ఆర్ట్స్ విభాగంలో విధికి డ్రామాలు చాలా ఇష్టమట. అయితే అది ఎప్పుడూ వింత వింత నాటకాలు ఆడుతుంటుందనేది జీవితాన్ని కాచి వడబోసిన వారి ఉవాచ. అందుకే వారు ‘విధి ఆడే వింత నాటకం’లో... అంటూ ఒక స్టాక్ డైలాగ్ చెబుతుంటారు. విధి విషయంలో వారి వారి వ్యక్తిగత అనుభవాలు అందరికీ ఉంటాయి. విధి దేవత అనే మాట లేదు గానీ... శనిదేవుడి కంటే విధికే ఎక్కువ భయపడుతుంటారు. దాని పట్ల ఇంతగా భయం ఉన్నందు వల్లనే తాము చేసే పనులకూ, బాధ్యతలనూ ‘విధులు’ అనే బహువచన రూపంలో చెబుతుంటారు. విధికి దయా దాక్షిణ్యాలు కరువు అని కాస్త భయం భయంగా చెబుతుంటారు. మనం ప్రయాణం చేయడానికి అవసరమైన రోడ్లను ఆర్ అండ్ బీ విభాగం వేసినా వేయకపోయినా విధి మాత్రం తప్పక నిర్మిస్తుందట. సదరు రహదారులలో ఎత్తుపల్లాలు చాలా ఎక్కువట. అందుకే సదరు రోడ్లపై బాగా ప్రయాణం చేసిన వారి గురించి అనుభవజ్ఞులు మాట్లాడుతూ ‘వారు ఎక్కని ఎత్తుల్లేవూ, వారు చూడని పల్లాలు లేవు’ అని అంటుంటారు. ‘తమరు ఏం ఆదేశిస్తే అదే చేస్తాను’ అనే సారాన్ని ఒకే మాటలో చెప్పడానికి ‘విధే’యుడు అనే పదాన్ని వాడతారు. పాలసీ మ్యాటర్ అనగా అది తప్పక పాటించాల్సిన రూల్ కాబట్టీ, అంత పవర్ఫుల్ కాబట్టే దాన్ని ‘విధానం’ అంటారు. విధివిధానాలు అనే మాటను ద్వంద్వసమాసంగా వాడుతుంటారు. దైవ లీలలలాగానే విధిలీలలూ ఒక పట్టాన అర్థం కావట. విధికి లక్ అనే పర్యాయపదం ఉందని చెబుతూ ఉన్నప్పటికీ... దాన్ని దురదృష్టంతోనే ఎక్కువగా ముడివేస్తుంటారు. అందుకేనేమో... శిక్షనూ, జరిమానాను వేసినప్పుడు దాన్ని పనిష్మెంట్లాగా చూపుతూ ‘విధిం’చారు అనే మాటను వాడుతుంటారు. ఇది చివరివరకూ చదివినవారు ఒక్క మాటను ఇష్టమున్నా లేకున్నా అంగీకరించి తీరాలి. సాధారణంగా విధికి మరో మాటగా వాడుతుండే ఒక మాటను స్మరించాలి. అదే ఖర్మ. తమ ఖర్మ కొద్దీ ఇలా జరిగిందనీ, ఇందుకు ఈ వ్యాసకర్త ఎంతమాత్రమూ బాధ్యడు కాదనీ విజ్ఞులైన పాఠకులు గ్రహించాలి. - యాసీన్ -
ప్రకృతి... ప్యాకింగ్!
హ్యూమర్ ప్లస్ ప్రాడక్ట్ ఎంత బాగున్నా ప్యాకింగ్ మరింత బాగుండాలి. లేకపోతే ఆ ఉత్పాదనకు తగినంత క్రేజ్ రాదు. అందుకే లోపల ఉండే అసలు వస్తువు కంటే, పైన ఉండే ప్యాకింగ్ బాగుండేలా శ్రద్ధ తీసుకుంటాయి కార్పొరేట్ కంపెనీలు. ఈ ప్యాకింగ్ గుట్టుమట్లన్నింటినీ ప్రకృతినుంచే అవి నేర్చుకున్నాయని పండిపోయిన బిజినెస్ పండితులు చెప్పే మాట. తొక్కలోది ప్యాకింగ్ ఏముందండీ... లోపలి సరుకు బాగుండాలని కొందరు అంటుంటారు. కానీ కమలాపండు చూడండి. తొక్క చాలా అందంగా ఉండేలా కమలాలను కమనీయంగా ప్యాక్ చేసి ఉంచుతుంది ప్రకృతి. అందుకే కొన్ని సార్లు ప్యాకింగ్ చూసి టెంప్ట్ అయి, పండు తింటారు కొందరు. సదరు ప్యాకింగ్‌తో మోసపోయి పళ్లుకరచుకుంటారు. పైన ప్యాకింగ్ చూస్తే పక్వానికి వచ్చినదానిలా అనిపిస్తుంది. కానీ లోపల పండు రుచిచూస్తే అది పుల్లగా ఉంటుంది. అందుకే ప్రకృతిలోనూ కొన్ని ప్యాకింగ్‌లు పైకి ఎఫెక్టివ్‌గా కనిపిస్తూ, లోపల డిఫెక్టివ్‌గా ఉండవచ్చు. ఆరెంజ్ విషయంలోనూ కమలాలాంటి అరేంజ్మెంటే జరిగిపోయింది. అదే కుటుంబానికి చెందినదే అయినా కమలాపండు కంటే బత్తాయి ప్యాకింగ్ కాస్త టైట్‌గా ఉంటుంది. కమలాలతో పోలిస్తే దీని ప్యాకింగ్ అంత తేలిగ్గా విప్పడం సాధ్యం కాదనేనేమో తినడం కంటే రసం తీసుకుని తాగేస్తూ ఉంటారు మనుషులు. ఇక అరటిపండు ప్యాకింగ్‌ను అలవోకగా విప్పేయవచ్చు కాబట్టే తోపుడుబండ్లలో వాటి అమ్మకమే ఎక్కువ. కోన్ ఐస్‌క్రీమ్‌ల విషయానికి వద్దాం. లోపల నింపిన బటర్‌స్కాచ్, వెనిల్లా వంటి ఫ్లేవర్కూ పైనున్న కరకరలాడే బిస్కెట్కోన్ ఒక ప్యాకింగ్ అనుకుందాం. ద్రాక్షపండులాగే సదరు కోన్నూ ప్యాకింగ్‌తో సహా తినేయవచ్చు. ఇలా తొక్కతో పాటూ తినేసే సౌలభ్యం విషయంలో ద్రాక్షకు ఆపిల్ జోడీగా వస్తుంది. తోడుగా ఉంటుంది. ఇక పుచ్చకాయ వంటి ప్యాకింగ్‌లను అంత తేలిగ్గా విప్పడం సాధ్యం కాదు. అందుకే ముక్కలు ముక్కలు చేసేసి, మధ్యలోని గుజ్జు తినేసి, పండుపైనున్న ప్యాకింగ్‌ను పారేస్తూ ఉంటారు. అయితే ఎర్రటి గుజ్జు ఉన్న అసలు ప్రాడక్ట్‌తో పాటు పైన ప్యాకింగ్‌లోని తెల్లభాగానికీ కాస్త మహత్యాన్ని ఇచ్చిందట ప్రకృతి. కేవలం రుచిగా ఉండే అసలుతో పాటు ప్యాకింగ్‌లోని కొసరు కూడా తింటే ఆరోగ్యం అంటుంటారు విజ్ఞులు. పనసకాయ విషయంలో ప్యాకింగ్ విప్పాలంటే దానికి కత్తిలాంటి నైపుణ్యం కూడా కావాలంటారు పెద్దలు. కొబ్బరికాయను చాలా ఎత్తుమీద ఉండేలా చూసింది కాబట్టి... గభాల్న అంతెత్తునుంచి కింద పడిపోతే కొబ్బరికి దెబ్బతగలకుండా లోపల పీచూ, టెంక వంటి వాటితో పకడ్బందీ ప్యాకింగ్ చేసింది ప్రకృతిమాత. ఇక కూరగాయల్లో బెండ, దొండ, వంకాయ వంటి వాటికి ప్యాకింగ్ ఏదీ లేకుండా అను గ్రహించిందట శాకంబరీదేవత. టొమాటోపైన పల్చటి పొర లాంటిది ఉన్నా దాన్ని గబుక్కున తొలగించడానికి అంతగా వీల్లేకుండా చేసిందట. దాంతో పాటు బీరకాయ, పొట్లకాయ వంటి కొన్ని కూరగాయలకు పైనున్న పలచటి ప్యాక్‌నూ వంటకు ఉపయోగించాల్సిందేనని కూరల అధిదేవతఅయిన శాకంబరీదేవి ఆదేశం అట. అందుకే వాటిని శుభ్రంచేయడానికి కత్తిని ఉపయోగించినా చెక్కుతీసినట్టుగా కాస్త పైపైన అటు ఇటు కదిలిస్తారు అనుభవజ్ఞులు. ప్రకృతి ప్యాకింగ్‌ను మరింత ఆకర్షణీయం చేయడానికీ కార్బైడ్లాంటివి ఉపయోగించడం అంటే... లేని లాభాలతో బ్యాలెన్స్‌షీట్లను అందంగా అలంకరించడం లాంటిదట. పండంటిబిడ్డలా ఆరోగ్యమూ పదికాలాల పాటు కళకళలాడాలంటే కార్పొరేట్ ఉత్పాదనలకూ, కార్బైడ్లకూ కాస్త దూరంగా ఉండాలన్నది పెద్దలు చెబుతున్న మాట. - యాసీన్ -
టవల్స్టార్!
హ్యూమర్ టవలు, తువాలు, తువ్వాల, తుండు గుడ్డ... పేరైదైనా గానీ దానికి మనం అన్నకున్న దానికంటే ఎక్కువ సీన్ ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువ విస్తృతి ఉంది. కాకపోతే చాలామంది దాన్ని గుర్తించరంతే! గుర్తించినవాడు సమర్థంగా వాడుకుంటాడు. ‘ఆ... ఎవరికి తెలియదులే, ఎవరు వాడుకుంటార్లే పెద్ద చెప్పొచ్చారూ’ అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఖచ్చి తంగా తెలియదు. తెలిస్తే... రజనీకాంత్‌కు ముందుగా మీరే దాన్ని గిరగిరా అనేకమైన మెలికలు తిప్పేసి భుజం మీద కప్పేసేవారు. పెదరాయుడు సినిమాకంటే ముందర దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసినా, ఆ సినిమా తర్వాతే దాంతో అన్ని గిరికీలు కొట్టించవచ్చని తెలిసింది. అసలు హీరోయిజమ్‌ను భుజం మీది కండువాతో సాధించవచ్చని తెలిశాక... దాన్ని రజనీకాంత్ కంటే సమర్థంగా ఉప యోగించిన వాళ్లు లేరు. మన సూపర్‌స్టార్ రజనీని కుర్చీ మీద కూర్చోబెట్టకుండా, నిలబెట్టి అవమానిద్దామంటే... అక్కడెక్కడో ఆకాశంలో వేలాడదీసి ఉన్న తూగుటుయ్యాలకు కండువాతో మెలికేసి, సయ్మంటూ లాగేసి, హుందాగా దాని మీద కూర్చొని... మళ్లీ రయ్‌మంటూ కాళ్లమీద కాళ్లేసుకుని తన హీరోచిత దర్జా చూపించడానికి ఉపయోగపడేది భుజం మీద టవలే. తదాదిగా ధీరోచిత ప్రద ర్శనకు టవల్‌ను ఒక టూల్లాగా సినిమా రంగాన విశేషంగా వాడుకున్నారు. అంటే భుజం మీడి కండువా తీసుకో వడం, కుర్చీ కోడుకు మెలికేసి దగ్గరికి లాక్కో వడం, కాలు మీద కాలేసుకొని కూర్చో వడం వంటి ప్రదర్శనలకు దాని సేవలు ఎంతగానో ఉపయోగించుకున్నారు. ఒక్క సినీరంగంలోనే కాదు... రాజకీయ రంగంలోనూ దాని సేవలు అందుతున్న విషయం సమకాలీనులకు తెలియనిదేమీ కాదు. ఒకప్పుడు పార్టీ మారడాన్ని చాలా ఇండికేటివ్గా మరింత సున్నితంగా చెప్పేందుకు ‘పార్టీ తీర్థం పుచ్చుకున్నారు’ లాంటి నర్మగర్భమైన మాటలు వాడేవారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ సింపుల్ మాటలు ఉపయోగించడం పరిపాటి అయ్యింది కాబట్టి పార్టీ మునుపటి తీర్థం స్వీకరించడం వంటి వాటి కంటే ‘కండువా కప్పుకున్నారు’ లాంటి మాటలే ఎక్కువగా వాడుతున్నారు. భాషాపరంగా వచ్చిన ఈ మార్పు కూడా జనాన్ని తమకు చేరువ చేస్తుందనీ నేతల విశ్వాసం. ఎంత ఆ నమ్మకం లేకపోతే ఒక బలమైన మాట స్థానంలో కండువా చేరుతుంది చెప్పండి! ఇప్పుడంటే రాజకీయ నేతలూ, దానికి కాస్త ముందు సినిమావాళ్లు తువ్వాలును, తుండుగుడ్డను తమ స్వప్ర యోజనాలకు వాడుతున్నారు గానీ... అనాది కాలంగా దాని ఉపయోగాలన్నీ మనందరికీ తెలియనివేమీ కాదు. అందుకే తుండుగుడ్డ పేరిట ఎన్నో జాతీయాలూ, సామెతలూ వెలిశాయి. ‘నడుం బిగించారు’ అనే మాటలో తువ్వాల అనే మాటే లేకపోయినా... ఏదైనా పనికి ఒడిగడుతున్నామంటే తువ్వాలనే నడుముకి బిగించామన్నది సమస్త తెలుగువాడకందారులందరికీ సుపరిచితమైన మాట. ఇక తలకు గుడ్డ కట్టుకోవడం అన్నది చాలా శ్రమతో కూడిన పనికి ముందర ఆరంభసూచికగా చేసే పని. ఇక ఊళ్లో పెద్దమనిషి డ్రెస్‌కోడ్‌లో భుజం మీద తువ్వాలు తప్పకుండా ఉంటుంది. పైగా దాని క్వాలిటీ మీదనే ఆయన ఎంత పెద్దవాడనే అంశం కూడా ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద నేతలైతే ఖద్దరు కండువాలూ, రాజకీయ వాసనలేమీ లేకుండా జస్ట్... మామూలు పెద్దవాళ్లు (అనగా పెద్దరికం మైనస్ రాజకీయాలు అన్నమాట) అయితే ఖరీదైన టర్కీటవళ్లు, ఓన్లీ పెద్దమనుషులైతే మంచి క్వాలిటీ కండువాలు, అదే శ్రామిక వర్గం అయితే ముతక తుండుగుడ్డలు భుజాల మీద ఉంటాయి. అనగా... మతం, కులం, ఇతర సూచికలతో పాటు... సామాజిక వర్గీకరణకు సైతం తుండుగుడ్డలు బాగా ఉపయోగపడతాయని సోషియాలజిస్టులు ఇంకా కనుగొనాల్సిన వాస్తవం. ఇక ఆధ్యాత్మికతకూ తుండుగుడ్డ ఒక సూచన. కావి రంగు తువ్వాల దీనికి ఒక తిరుగులేని చిహ్నం. ఆడంబరాలకూ, ఐశ్వర్యాలకూ, ఐహిక భవబంధాలకూ దూరంగా ఉన్నారని తెలపడానికీ ముతక కావిరంగు భుజంగుడ్డ ఒక తార్కాణం. సర్వసంగ పరిత్యాగ గుణంతో, ఒక రకమైన నిర్లిప్తతతో గడిపే గుణం తెలిపేందుకు ఈ భుజం గుడ్డ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తన శంకరశాస్త్రి గారి భుజాన ఇది వేసి చూపెడతాడు. పవర్‌లెస్ అని చూపించడానికి అదెంత పవర్‌ఫుల్‌గా ఉపయోగపడుతుందో నిరూపిస్తాడు. చిత్రమేమిటంటే... టవల్ అనే ఒకే ఒక అంశం... అటు ఆడంబరతకూ, ఇటు నిరాడంబరానికీ... ఈ రెండు గుణాలకూ ప్రతీక కావడం దాని గొప్పదనం. దండెం మీద వేలాడుతూ సామాన్యంగా కనిపిస్తుందని దానివైపు అసలు దృష్టే పోవడం లేదని అనుకోకండి. అటు సూపర్‌స్టార్ రజనీని అయినా, ఇటు కామన్స్టార్ శంకరశాస్త్రి గారినైనా సమదృష్టితో ఆదరించే గుణం తువ్వాలకు ఉంది. ఆ వస్త్రవిశేష నేత విజ్ఞతలో భగవంతుడికి ఉన్నంత స్థితప్రజ్ఞత ఉంది. - యాసీన్ -
బట్టతలతళతళ
జాబిల్లి రోమసంహితం అయితే బాగుంటుందా? వెండి పళ్లెంలో వెంట్రుకలొస్తే సబబుగా ఉంటుందా? ఇదే మగాడి ఆలోచన. యువకులుగా మారడానికి తమ జుట్టు కాస్తంత వెనక్కు జరిగినా వాళ్లకు బాధ ఉండదు. హెయిర్‌లైన్ వెనక్కుపోతుందన్న ఇబ్బందీ, అందానికి లోపం కలుగుతుందన్న విచారం కంటే పురుషత్వపు లక్షణాలు కనబడుతున్నాయనే ఆనందమే ఎక్కువ. తళతళలాడే చందమామ మెరుపును చూసి ఆశ్చర్యం పొందని వారెవరైనా ఉంటారా? మిలమిలలాడే బంగారం తళుకులు చూసి సంబరపడనివారెవరైనా ఉంటారా? సేమ్ బట్టతల కూడా. కానీ బట్టతల అంటే పురుషులు ఇష్టపడరని అందరూ అనుకుంటుంటారు. అది అపోహ మాత్రమే. పురుషులు దాన్ని ఇష్టపడరని అనుకోవడం జస్ట్ ఒక దురభిప్రాయం మాత్రమే. వాస్తవం వేరే. చందమామనూ, బంగారాన్నీ ఇష్టపడ్డట్టే పురుషులూ బట్టతలనూ ఇష్టపడతారు. కాకపోతే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు రెండు ఉంటాయి. మొదటిది... మనిషి అనగానే దేనినైనా పెంచుకోవాలనే తాపత్రయం అధికం. దాన్ని బాగా సాకాలనేది అతడిలో మరీ మిక్కుటమైన మక్కువ. గుబురు మీసాలూ, గడ్డాల మాటున నక్కి అంతగా కనపడదు గానీ పురుషులకు పెంపక కాంక్ష మరీ ఎక్కువ. ఈ పెంపకం సాగించాలన్న తపనతో, ఆ తీవ్రమైన ఇన్స్టింక్ట్తో కొందరు మొక్కలూ, ఇంకొందరు కుక్కలూ పెంచుతుంటారు. ఇక కోళ్లూ, బాతులు, తాబేళ్లూ... వెర్రిబాగా ముదిరితే తొండలూ కొండచిలువలూ పెంచేవారు కూడా ఉన్నారు. ఈ తీవ్రమైన కోరికవల్లే కాలం బాగా లేకపోయినా రైతులు పొలాలను సాగు చేస్తూ ఉంటారు. చెరువుల్లో చేపలు పెంచుతుంటారు. ఈ పెంచాలన్న తీవ్రమైన తపన ఉండటం వల్లనే జుట్టు పెంచడం అన్నది కూడా జరుగుతుంది. కుక్క పెంచితే ఇంటి దగ్గర అది ఎలా ఉందో తెలియని భయం ఉండొచ్చు. మొక్కకు నీళ్లు అందుతాయో లేదో అన్న ఆందోళన కలగవచ్చు. నీళ్లూ, తెగుళ్ల దిగుళ్లతో కుంగిపోవచ్చు. కానీ జుట్టు పెంచుకుంటే అది నెత్తి మీదే పదిలంగా ఉంటుంది. కావాలనుకుంటే వర్క్‌ప్లేస్‌లోనూ బాత్రూమ్లోకి వెళ్తే అద్దంలో కనిపిస్తుంది. కుక్కను చేతులతో లాగే దాన్ని దువ్వెనతో దువ్వవచ్చు. కాస్త చేయ్యి సాచితే అందుతుంది. సర్దుకుంటే ఒదుగుతుంది. కుక్కా, మొక్కా ఇంటి అందాన్ని ఇనుమడింపజేసినట్లు రోమాలూ అందానికి హామీగా ఉంటాయి. కాబట్టి పెంచుకోవాలనే కాంక్ష తప్ప... మెరిసే బట్టతలను నిరసించాలన్న భావన ఏ పురుషుడిలోనూ ఉండదు. ఇక రెండోది పురుషులకు చాలా ఇష్టమైన విషయం. ఇది ఒకింత సీక్రెట్. అయినా కాస్తంత బహిరంగంగానే మాట్లాడదాం. మగపిల్లలు టీన్స్‌లోకి రాగానే తమ ముఖం కాస్త అందవికారంగా మారుతున్నా పెద్ద లెక్కచేయరు. ఆ ఏజ్ నుంచి తాము యువకులం కాబోతున్న ఫీలింగే వాళ్లకు సంతోషంగా ఉంటుంది. యువకులుగా మారడానికి తమ జుట్టు కాస్తంత వెనక్కు జరిగినా వాళ్లకు బాధ ఉండదు. హెయిర్‌లైన్ వెనక్కుపోతుందన్న ఇబ్బందీ, అందానికి లోపం కలుగుతుందన్న విచారం కంటే పురుషత్వపు లక్షణాలు కనబడుతున్నాయనే ఆనందమే ఎక్కువ. అయితే పాపం... కొందరిలో కాస్తంత వెనక్కు జరగాల్సిన హెయిర్‌లైన్, బ్యాలెన్స్ తప్పి, గబుక్కున పడిపోయినట్లుగా వెనక్కు జారిపోతుంది. జుట్టు అంతా అంతర్జాతీయ షేర్ మార్కెట్లలాగా కుప్పకూలి కుదేలైపోతుంది. షేర్‌కు జూలు మొలవడం ఎలాగో, కిశోర బాలకులకు జుట్టు రాలడం అలాగ. అందుకే జుట్టు రాలిపోతుందన్నా లెక్క చేయరు. ఈ ఒక్క దృష్టాంతం చాలదా. వాళ్లు బట్టతలను ఇష్టపడకపోవడం ఏదీ లేదని. కాబట్టి పురుషులకు బట్టతల అంటే ఇష్టపడకపోవడం అంటూ ఏదీ ఉండదు. స్త్రీలకు బంగారం లాగే పురుషులకు బట్టతల. జాబిల్లి రోమసంహితం అయితే బాగుంటుందా? వెండి పళ్లెంలో వెంట్రుకలొస్తే సబబుగా ఉంటుందా? ఇదే మగాడి ఆలోచన. మీరు నమ్మకపోయినా పురుషులకు బట్టతల ఇష్టం ఉండదన్న విషయమంతా ఈ పాడు లోకం అల్లిన కల్పితాలే. - యాసీన్ -
మంకీ బాత్
నేడు చైనీస్ న్యూ ఇయర్ హ్యూమర్ ప్లస్ కోతి చేష్టలూ... కోతి వేషాలూ అని అందరూ మమ్మల్ని ఆక్షేపిస్తుంటారు గానీ... నిజానికి కోతులమైన మేం చాలా మంచివాళ్లం. గాంధీగారు ఎప్పుడు ఆదర్శాలు బోధించినా కోతులను దృష్టిలోపెట్టుకునే చేశారు. ఈ లోకానికి ‘చెడు వినకు, అనకు, చూడకు’అంటూ అద్భుతమైన సందేశం ఇచ్చారు. కానీ అది లోకంలోకి బలంగా వెళ్లాలంటే మా బొమ్మల మీదే ఆధారపడ్డారు. ఆయన లాగే మన దేశ ప్రధానీ అభిప్రాయపడ్డారు. అందుకే తన మనసులోని మాటను హిందీలో ‘మన్’ కీ బాత్ అంటూ ప్రవచిస్తుంటారు. కానీ మన దక్షిణాది రాష్ట్రాలకు హిందీ పెద్ద పరిచయం లేదు కదా. హిందీ కంటే ఇంగ్లిష్ ఎక్కువ అర్థం అవుతుంది కదా. అందుకే దాన్ని కోతివాక్కు అనగా ‘మంకీ’ తాలూకు మాటగా అపార్థం చేసుకుంటారు. హిందీ తెలియనందున ఇదే అపోహ బందరు మహా పట్టణం విషయంలోనూ తెలుగువారికి కలుగుతుంది. ఒకసారి బందర్గాహ్ అంటే నౌకాశ్రయమనీ, అప్పట్లో నవాబులకూ ఈ పట్టణమే రేవుపట్టణమనీ తెలిశాక... దానిపై గౌరవం కలుగుతుంది. ఇదీ మంచిదే. ఎందుకంటే ఒకసారి దురర్థం వచ్చేలా అపార్థం చేసుకున్నాక మనసులో నాటుకునే మాట బలంగా ఉంటుంది. పైగా ఈ అపార్థం కూడా ప్రతిసారీ అర్థం చేసుకునేందుకు ‘మన్’... అనగా మనసుకు ఇచ్చే ‘కీ’ లా ఉపయోగపడుతుంది. మనిషి కోతులను అపార్థం చేసుకున్నంతగా మరే జంతువునూ చేసుకోలేదు. అందుకే తన మనసు చేసే కొన్ని వాస్తవమైన చేష్టలను నాకు ఆపాదించారు. మనసులాగే దానికీ స్థిరత్వం ఉండదని తేల్చి చెప్పారు. కోతి చెట్ల కొమ్మలను బలంగా ఊపుతుంటుందనీ, ఆ కొమ్మ మీది నుంచి ఈ కొమ్మమీదికి పాకుతూ, దూకుతూ ఉంటుందని దాన్ని తత్వాన్ని ఆక్షేపిస్తూ ఉంటారు. ‘తా జెడ్డకోతి వనమెల్లా చెరిచిందం’టూ కోప్పడుతుంటారు. కానీ కొమ్మలను అలా బలంగా ఊపబట్టే వాటి గింజలు రాలి నేల మీద పడుతుంటాయి. ఆ తర్వాత కొత్తచిగుళ్లు వేసి కొత్త మొక్కలు మొలుస్తుంటాయి. అంటే ఇది వనమెల్లా చెరిచే డీఫారెస్టేషన్ ప్రక్రియ కాదు. మానవులు మంచి చేయాలనుకొనీ చేయలేనిది... మేం చెడుపు చేస్తున్నామన్న భావన కలిగిస్తూ చేస్తాం. అనగా ఇది కొండ అంచులపై అడవులను పెంచే ‘ఎఫారెస్టేషన్’ ప్రక్రియ అని తప్ప మరోటి కాదని చెబుతున్నాను. అలాగే నేను చాలా పండ్లను కొద్దిగా కోరికి చాలా వృథాగా కిందికి వదిలేస్తుంటానని చాలామంది అపార్థం చేసుకుంటారు. అది వాస్తవం కాదు. పాపం... ఎన్నో జీవులు నా అంత చిటారు కొమ్మలకు చేరలేరు. ఆ పండ్లను తెంపుకోలేరూ... మన కడుపు నింపుకోలేరు. నేను బాగున్నాయా లేదా అని శబరిలాగే శాంపిల్ చూసి, వదిలేసిన ఆ పండ్లను కొమ్మచివరి వరకూ చేరలేని ఎన్నో జీవులు తింటుంటాయి. ఆకలి తీర్చుకుంటుంటాయి. మేము కొమ్మ చివర అందని ద్రాక్షల్లా ఉండే పండ్లను నేను అనేక జీవులకు అందించినట్లే... చైనావాళ్లూ అతి ఎక్స్పెన్సివ్ వస్తువులను అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా చేయగలిగినవాళ్లూ, నా చేష్టలను అనుసరించే వారు కాబట్టే చైనీయులు సైతం నేటి నుంచి మొదలు కాబోయే వాళ్ల కొత్త ఏడాదికి నా పేరు పెట్టుకున్నారు. చివరగా మళ్లీ మనసుకూ, మర్కటానికీ ఉన్న బంధం విషయానికి వద్దాం. నేను టకటకా కొమ్మలు మారే పని చేస్తుండటంతో కోతినీ, మనస్సునూ ఏకకాలంలోనే తిడుతుంటారు. నిలకడ లేనిదంటూ నిందిస్తుంటారు. ముందే మనవి చేశాను కదా... మనకూ, మీ మనసుకూ పోలిక ఉందని. ఇది పూర్తిగా దుష్ర్పచారం. నేను రకరకాలుగా ఆలోచించబట్టే కదా... కొత్త కొత్త ఆలోచనలు వచ్చేదీ... నా ధోరణి లాంటి ఐడియాల వల్లనే కదా మీ జీవితాలే మారేది! - యాసీన్ -
ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్
హ్యూమర్ ప్లస్ ‘‘నేనొక బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాన్రా’’ అన్నాడు మా రాంబాబు గాడు. ‘‘ఏంట్రా అదీ’’ అడిగాను. ‘‘ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్’’ అని చెప్పాడు. ‘‘ఏం ఎగుమతి చేస్తావు. ఏమేమి దిగుమతి చేసుకుంటావ్’’ అని అడిగాను. చెప్పాడు. అంతేకాదు... వాడి బిజినెస్ ఐడియాకి బ్యాక్గ్రౌండునూ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నౌ ద ఫ్లాష్‌బ్యాక్ బిగిన్స్: ఒక ఆనవాలు : మా రాంబాబు గాడు చదువులో పెద్ద క్లవరేమీ కాదు. అయితే వాడికి మాసార్లూ, మాస్టార్లూ టిక్కు పెట్టి ఇచ్చిన కొన్ని ఐఎంపీ ప్రశ్న-జవాబులు మాత్రం వచ్చు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టైమ్‌లో వాడికి వచ్చిన ఆన్సర్లలో ఒకటి నాకు చూపించాడు. రానే వచ్చింది రిజల్ట్స్ టైమ్! వాడు అత్తెసరు మార్కులతో పాస్. నాకు ఫస్ట్ క్లాస్. మరో తార్కాణం : డిగ్రీ అయ్యాక గ్రూప్-ఒన్ రిటెన్ టెస్ట్ రాయడానికి హైదరాబాద్ వెళ్లాలి. ప్రయాణంలో తోడు కోసం వాడు రంగారావు గాడితోనూ అప్లై చేయించాడు. రంగా విన్నయ్యాడు. మా రాంబాబు సేఫ్‌గా రిటర్న్ అయ్యాడు. అంతేకాదు... గవర్నమెంట్ జాబ్ వచ్చిన కొన్నాళ్లకే మా రాంబాబుగాడు రహస్యంగా ప్రేమించే పిల్ల వాళ్ల నాన్న కూడా... సదరు అమ్మాయిని రంగారావుగాడికే ఇచ్చి పెళ్లి చేశాడు. దాంతో రాంబాబుగాడు రహస్యంగా దేవదాసు వేషాలు వేసుకుంటూ, మనసులోనే శాలువా కప్పుకుంటూ, ఊహల్లోనే కుయ్ కుయ్ అనే కుక్కపిల్లల ఒళ్లు నిమురుతూ, బయటకు మాత్రం రయ్ రయ్ మంటూ తిరుగుతూ ఉండేవాడు. ఇంకో దృష్టాంతం : ఏదో కొనడానికి వెళ్తూ వెళ్తూ రాంబాబు గాడు నన్ను తోడుతీసుకెళ్లాడు. షాపింగ్ అంటే బోరురా అని నేను మొత్తుకుంటున్నా వాడు విన్లేదు. తీరా వెళ్లాక అక్కడ నాకు అవసరమైందేదో కనిపించి కొన్నాను. రెండ్రోజుల తర్వాత షాపు వాళ్లు నిర్వహించిన లక్కీడిప్‌లో నాకు ఇరవైనాలుగించుల టీవీ బహుమతిగా వచ్చింది. అదే రోజు రాంబాబు గాడి టీవీ రిపేరుకు వచ్చింది. వాడి మతిపోయింది. ఈ వరస సంఘటనల తర్వాత రాంబాబు మాకో ఫిలాసఫీ బోధిస్తూ ఉండేవాడు. ‘‘ఒరేయ్... మామిడికాయ్ పచ్చడి పెట్టిన కొత్తలో ఆ ముక్క తింటే కొత్తకారం వల్ల నోరు పొక్కిపోయేది. అందుకే మా అమ్మ ఒక పని చేసేది. కాయను కడిగిచ్చేది. కడిగితే కారం పోతుంది. కానీ ఆ ముక్కలోని పులుపెక్కడికి పోతుందీ! నా దురదృష్టపు బలుపెక్కడికి పోతుంది!!’’ అంటూ నవ్వేసేవాడు. బ్యాక్ టు ఫ్యూచర్ : రాంబాబు గాడి ఫ్లాష్బ్యాక్కూ వాడి బిజినెస్ ఐడియాకూ సంబంధం ఏమిటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? తన ఫ్యూచర్ బాగుండాలనుకునేవాడు మావాడితో ఫ్రెండ్షిప్ చేయవచ్చట. అందుకు నిర్ణీత రుసుం చెల్లించాలట. అలా తమ దురదృష్టాన్ని రాంబాబుగాడికి అంటగట్టేసి, తమ అదృష్టాలకు అంటు కట్టేసుకోవచ్చట. దురదృష్ట-అదృష్టాల ఈ ఇంపోర్టు-ఎక్స్‌పోర్టు బిజినెస్‌కు... వాడో ట్యాగ్‌లైన్‌నూ రెడీ చేశాడు. అది... ‘అదృష్టం అమ్మబడునూ... దురదృష్టం కొనబడును’ అట! - యాసీన్ -
అది వృథాప్యం కాదు...!
ఫ్యామిలీ పర్వం ‘‘పాపం... పుంజును చూస్తే జాలేస్తోంది. మెడ మీది ఈకలను నిక్కబొడిచేలా లేపుతుందా? వాటిని గొంతు చుట్టూరా గుండ్రంగా చక్రంలా తిప్పుతుందా? కత్తుల్ని కాళ్లకు కట్టుకొని మరీ పోరాడుతుంటుందా? అలాంటి కత్తులే తన మెడకు చుట్టుకుంటాయని ఎరగదు పాపం. గొంతు చుట్టూరా లేచిన ఈకల్లాగే... కాసేపట్లో కీర్తిశేషురాలు కాబోయే పుంజు తలచుట్టూరా మహనీయుల ఫొటోల్లోని కాంతి వలయంలా ఒకటి తిరగబోతోందని దానికి తెలియదు. ఏమిటో చిత్రం’’ అంటూ జాలిపడ్డాను నేను. ‘‘పండగ నాటి పందెం కోడిని తలవడం సరే. పండగకు కూతురు వస్తుందన్న సంతోషం కంటే అల్లుడొస్తాడంటేనే కల్లోలంగా ఉంది నాకు’’ అంది మా ఆవిడ. ‘‘వచ్చే వాడు వస్తాడూ, పోతాడు. వాడి కోసం వృథా ఏమీ వద్దురా’’ అన్నాడు మా స్వామీ వృథానంద. ముసలోడయ్యాక మా నాన్నలో కాస్త చాదస్తం పెరిగిందంటుంటారు అందరూ. పెద్దవాడయ్యాడు కదా అని ఊరుకోడు. ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు. అందుకే మా పిల్లలూ, కాలనీ అమ్మాయిలూ, కుర్రాళ్లూ కలిసి ఆయనకు స్వామీ వృద్ధానంద అని పేరు పెట్టారు. అది కాస్తా కాలక్రమాన స్వామీ వృథానందగా మారిపోయింది. అదెలాగంటే... వస్తువులను వేస్ట్ చేయవద్దంటారు మా నాన్నగారు. ఆమ్లెట్ వేశాక మా ఆవిడ ఖాళీ గుడ్లను చెత్తకుండీలో వేస్తే... వాటిని అక్కడి నుంచి తీసి, పౌడర్ అయ్యేలా చిదిమి, గులాబీ కుండీల్లో వేసేవరకూ అదే పని మీద ఉంటారాయన. ‘‘సో... పెంకు జర్నీ చెత్తకుండీ టు గులాబీకుండీ అన్నమాట’’ అంటూ ఆయనను ఆటపట్టిస్తుంటారు మా చిన్నమ్మాయీ, కాలనీలోని ఆమె ఫ్రెండ్స్. ‘వస్తువులు సరే... ప్లేస్ కూడా వేస్ట్ చేయకండి’ అంటూ చుక్కంత జాగా కనిపించినా మొక్క నాటేస్తుంటారు మా నాన్న. గచ్చు లేని స్థలం అంగుళం అందుబాటులో లేదు. అయినా ఆరు కుండీలు దొరికితే, వాటిని అటకలెక్కించి, అందులోని తీగల్ని కిటికీల మీద పారించి నానా హంగామా చేస్తారు. ఆయనకే ఆరెకరాల భూమి దొరికితే ఎలా ఉండేదా అని జోకులేసుకుంటారు నా కూతురూ, దాని ఫ్రెండ్స్. ఆరుకుండీల ఫామ్ యజమాని అంటారు. ఇలా తమ మాటల్ని గాలిపటాల్లా ఎగరేస్తూ, సెటైర్ల లడాయి పెట్టుకుంటూ... ఒకరి మాటను మరొకరు ఖీంచ్ కాట్ పద్ధతిలో జోక్స్ కట్ చేసుకుంటారు ఆ అమ్మాయిలంతా. ‘‘నాన్నా... మరీ అంత చాదస్తంగా ఉండకు. నీ మనవరాళ్లూ, దాని ఫ్రెండ్సూ నీకు పెట్టిన పేరేమిటో తెలుసా?... స్వామీ వృథానంద అట’’ అన్నాను. దానికి ఆయన నవ్వుతూ... ‘‘నా వయసుకు వచ్చాక, నా వయసు వాళ్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘ముసలోడు నసపెడుతుంటా’డని అనడం మామూలేలేరా. చాలామందికి నాది ‘వృథాప్యం’ అనిపిస్తుంది. ఈ పిల్లలంతా కలిసి ‘స్వామీ వృద్ధానంద’ను వృథానంద చేసేశారు’’ అని నవ్వేశాడు మా నాన్న. మా నాన్నకు ఎంతో సెన్సాఫ్ హ్యూమర్, ఆయనది మోడ్రన్ ఔట్లుక్. ‘‘బిడ్డ వస్తుందన్న ఆనందం కొద్దీ... అరిసెల కోసం గరిసెలు తోడివేయకు. బొబ్బట్లు, నిప్పట్లు అంటూ ఉట్లు నేలకు దించకు. ఉన్నంతలో పెట్టు. ఉత్సవం చెయ్యి. అంతేగానీ అందలంలో అట్లపెనం పరచకు’’ అన్నారు మా నాన్న... తన కోడలిని ఉద్దేశించి. ‘‘సరేనండీ’’ అంది ఆమె వినయంగా. మళ్లీ చాటుగా నా దగ్గరికి వచ్చి... ‘‘ఇంటల్లుడొస్తుంటే వంట దగ్గర కూడా ఈ తంటా ఏమిటండీ?’’ అంది. ‘‘తినే ప్లేటులో డేగిశాలో ఉండేంత గంటె కాకుండా కాస్త పట్టుకోడానికి అనువుగా ఉండే చెంచా పెట్టమంటున్నారు మా నాన్న. అంతే’’ అన్నాన్నేను. ఈ మాటలేవీ వినపడకపోయినా ఇలాంటిదేదో సంభాషణ జరుగుతున్నట్టు కనిపెట్టారాయన. మా దగ్గరికి వస్తూ... ‘‘మీకో విషయం తెలుసా? ప్లూటో స్టేటస్ రద్దు చేశారట’’ అన్నారు. ‘‘ప్లూటో స్టేటస్ ఏమిటి మామయ్యా?’’ అంది మా ఆవిడ. ‘‘మనకు నవగ్రహాలు కదమ్మా. అందులో చివరిదైన ప్లూటోకు గ్రహానికి ఉండాల్సిన లక్షణాలేమీ లేవని గ్రహించారట సైంటిస్టులు. గ్రహాల సంఖ్య తగ్గినా జామాత మాత్రం పదో గ్రహమే. ఏ గ్రహానికి ఆగ్రహం వచ్చినా భయపడరు గానీ దశమగ్రహ జామాత అలుగుతారేమోనని పెళ్లికూతురి మాతకు తెగ బెంగ’’ అని కోడలివైపు చూస్తూ చిరునవ్వు నవ్వారు మా నాన్న. ‘‘అది కాదండీ...’’ అంటూ ఏదో చెప్పబోయింది మా ఆవిడ. ‘‘ఏం పర్లేదమ్మా... మేకులేవీ మిగలక కొత్త ఏడాదికి వచ్చిన క్యాలెండర్లూ, రాయని డైరీలూ అలా టేబుల్ మీద వేస్ట్‌గా పడి ఉన్నప్పుడు గానీ తెలియదు ఎంతెంత సంపద వేస్ట్పోతోందో అన్న విషయం. కొత్త అల్లుడనే గౌరవంతో పరబ్రహ్మస్వరూపాన్ని గౌరవించకుండా పారేయకండి’’ అన్నారాయన. ‘‘ఆయన వృథానందా కాడూ... ఆయనది వృథాప్యమూ కాదు. నా దృష్టిలో ఆయన ‘స్వామి వృద్ధి ఆనంద. సంపూర్ణ సంవృద్ధి ఆనంద ’!’’ అమిత గౌరవంగా ఆయనవైపు చూస్తూ అంది మా ఆవిడ. - యాసీన్ -
11:59:59
సందర్భం చెట్టు క్యాలెండర్ చూసుకొని చిగురేస్తుందా? పిట్ట అలారం పెట్టుకొని లేస్తుందా? జంతువులు జనవరి ఫస్ట్ విషెస్ చెప్పుకుంటాయా? పాపం... వాటి మానాన అవి పని చేస్తుంటాయి. తిథులూ, వారాలూ, వర్జ్యాలూ చూసుకోవు. రాహుకాలం, యమ గండం తెలియదు. అందుకే వాటికి దినదిన గండం. అయితే తనకు నూరేళ్లాయుష్షు అని నమ్మే మనిషి పరిస్థితి వేరు. కాలం కీళ్లు విరిచేసి... తేదీలనీ, నెలలనీ, సంవత్సరాలనీ విడ గొట్టాడు. మంచిరోజులూ, అమృత ఘడియలూ నిర్ణయించాడు. వాడెంత తెలివైనవాడంటే... కాలాన్ని ఫిస్టులో పట్టుకోగలనన్నాడు. సెకన్లు, నిమిషాలు, గంటలను మణికట్టుకు తిరిగాడు. కళ్లకు ముళ్లు గుచ్చుకుంటా యేమోనని గడియారంలో నలు చదరమైన డిజిటల్ అంకెలను పేర్చాడు. అలాగే క్యాలెండర్లో మంచిరోజులూ చెడ్డరోజులూ కూర్చాడు. తేదీలు, నెలలు, సంవత్సరాల్ని కాగితం మీద పేర్చాడు. క్యాలెండర్ అనే పేరిచ్చి, వాటితో గోడ కుర్చీ వేయించాడు. అయిపోయిన నెలలను మొదట శీర్షాసనం వేయించి, ఆ తర్వాత వెనక్కు మడిచేసి, చక్రాసన, ధనురాసన ఇత్యాది యోగాసన ప్రక్రియలు చేయి స్తుంటాడు. టేబుల్ క్యాలెండర్ పేరిట కొన్నింటితో బస్కీలు తీయిస్తుంటాడు. ఎర్ర రంగులో ఉన్న తేదీ వచ్చినప్పుడల్లా బడికి సెలవొస్తుందని చిన్నప్పట్నుంచే నేర్పడం మొదలు పెడతాడు. అది నిజమవుతుంది. క్యాలెండరేతర అంశాలపైనా దృష్టి సారిస్తుంటాడు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోడానికి కొందరు బయల్దేరతారు. మోసపోయే విద్యను పనిగట్టుకు నేర్చుకుంటారు. పాపం... చెట్టూ, పుట్టా, పిట్టా, సమస్త జంతుజాలాలకు ఈ విషయాలు తెలియవు కాబట్టి అవి క్యాలెండర్ చూసుకోవు. చెట్లు పైపైకి పెరుగుతాయి. పిట్టలు ముందుకెళ్లడానికి రెక్కల కష్టం చేస్తాయి. జంతుజాల సమస్తమూ ముందుకే నడుస్తాయి. కానీ మనిషి ఎంత తెలివైనవాడంటే... కాలం వెనక్కు నడవదని తెలిసినా, క్రీస్తు పుట్టక ముందు కాలాన్ని వెనక్కు నడిపిస్తాడు. చరిత్ర తెలి యనివాడు క్రీస్తుపూర్వానికి ముందు డేట్స్ చదువుతుంటే అది ప్రింటింగ్ మిస్టేకా అని పించేలా చేస్తాడు. ముందు కెళ్తున్న రైల్లోని సగం సీట్లు వెనక్కు తిప్పి పెట్టడం అవసరమనీ, ఆ సౌలభ్యం వల్లనే సగం మందిని కూర్చోబెట్టగలుగుతున్నా మని నమ్మబలుకుతాడు. అలా కొందరిని వెనక్కి నడి పించడానికి పూను కుంటాడు. తమకు చాలా తెలుసు అనే కొందరు మనషులకు నిజంగా ఏమీ తెలి యదు. ముఖ్య దినాలనీ, ముహార్తాలనీ కొన్ని రోజులకు సుగంధ పరిమళాలు అద్దితే... ఆ సువాసనలు పీలుస్తున్నట్లు ఊహిస్తారు. మరికొన్ని దినాలను దుర్దినాలుగా ముద్రవేస్తే అవి క్షుద్రమైనవని విశ్వసిస్తుంటారు. వాళ్లు తమకన్నీ తెలుసనే భ్రాంతిలో ఉంటారు. ఇలాంటి వాళ్లను నమ్మించడం చాలా సులువు. కొందరు మహానుభావులు ఏం చెప్పినా వీళ్లు విశ్వసిస్తుంటారు. వీళ్ల కోతలెలా ఉంటాయంటే... మొద్దు నిద్దర పోతుండే కోడికి అలారం పెట్టి పొద్దున్నే లేపడం నేర్పింది తామేనని కూస్తారు. తాము ట్రబుల్ షూటర్లమంటారు. గాలి మోటర్లలో తిరుగుతారు. అల స్వర్గపురాన్ని ఇలాతలంలో నిర్మిస్తున్నామని అరచేయి చూపుతారు. మొక్కా, గిక్కా, పంటా, పసరూ పీకేస్తారు. చెట్లూ గట్రా కొట్టేస్తారు. చదునుగా చేసేస్తారు. ‘‘చూశావా... అడ్డంగా నరికి చూస్తే మొద్దులాంటి చెట్టు లోనూ రింగులు రింగులు కనిపిస్తున్నాయి. ఏడాదికేడాదీ పెరిగే వీటినే యాన్యువల్ రింగ్స్ అంటారు. ఎంత పెద్ద వయసు చెట్టుకు అన్ని రింగులు. కాబట్టి చెట్టూ ఉంగరాలు తొడుగుతుంది’’ అని చెబుతారు. ప్రజల బంగారాన్ని కొల్లగొట్టి చేతి వేళ్లకు తొడుక్కుంటారు. వేళ్లు పదే ఉండబట్టి గానీ... మరిన్ని ఉంటే వీళ్లకు రింగులు సరిపోవు. ఊడ్చేస్తారు, ఊళ్లేలతారు. ‘ఉంగరాలు మేం తొడిగాం, నడుం మీరు కట్టండంటూ మొండేనికి మొలదారం మాత్రమే మిగులుస్తారు. ఇదేంట్రా బాబూ అంటే ‘చెట్టు మొద్దుకూ, నీ మొలకూ ఇదే అందం’ అంటూ మారేడుకు మసిపూస్తారు. నేరేడులోనిది నీలి సిరా అన్ని నమ్మిస్తారు. ఆ సిరాతో విధి రాతలోని హంస పాదులను సరిచేస్తామంటారు. అన్నీ చెప్పాక... సామాన్యులకు అన్నీ దూరం చేసి, గోచీ మాత్రం మిగుల్చుతారు. అదేమిటని అడిగితే తేలికగా ఉండటంలో హాయిని అనుభవించమని సలహా ఇస్తారు. ఏతా వాతా క్యాలెండర్ మారినప్పుడల్లా ఏదో అద్భుతం జరుగుతుందని ఎందరో అనుకుంటారు. ఇంకేదో ఒరుగుతుందని ఆశపడతారు. ఆకాశాన్ని అంబరమనే అంటారంటూ... అనగా అర్థం వస్త్రమేనంటూ వ్యాఖ్యానం చెప్పి, దాని ముక్కను చింపి ఇస్తామంటారు. దానితో కొత్త బట్టలు కుట్టిస్తామంటారు. చమ్మీ ధమ్మీలతో అధికారాలు చెలాయిస్తుంటారు. కాలాన్ని వెళ్లదీస్తుంటారు. క్యాలెండర్ పుట మారితే సరిపోతుందా... కొత్త సంవత్సరాన్ని తిరగస్తే అది ‘త్తకొంరత్సవంస’ అవుతుందేమో గానీ... చేతి గీత ఎన్నడూ మారదు కదా! విధి రాత మారాలంటే కనీసం ఇది ఎన్నికల ఏడాది... 2019 అయినా కాదు కదా! - యాసీన్ -
యసిన్ మాలిక్ 'అరెస్ట్'
-
ఒంటికి పని చెప్తే కంటి నిండా నిద్ర!
హోమియో కౌన్సెలింగ్ డయాబెటిస్ వ్యాధి హోమియో విధానంలో తగ్గుతుందా? - రవిచంద్ర, చీరాల డయాబెటిస్ రక్తంలో చక్కెరపాళ్లు అధికం కావడం వల్ల వచ్చే వ్యాధి. ఇందులో మూత్రం ఎక్కువగా రావడం, ఆకలి, దాహం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులోని కొన్ని ముఖ్యమైన రకాలుంటాయి. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడాన్ని టైప్-1 అనీ, ఉత్పత్తి చేసిన ఇన్సులిన్‌ను కణాలు సక్రమంగా వినియోగించలేకపోవడాన్ని టైప్-2 అనీ, గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్‌ను జెస్టెషనల్ డయాబెటిస్ అని అంటారు. టైప్-1 డయాబెటిస్: ఈ రకం వ్యాధి ఉన్న వారిలో క్లోమగ్రంథిలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల శరీరంలో చక్కెరపాళ్లు పెరుగుతూ ఉంటాయి. వీళ్లలో రోగనిరోధక వ్యవస్థను రక్షించే టీ-సెల్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. కానీ పుట్టినప్పుడు వాళ్లు నార్మల్‌గానే ఉండవచ్చు. రానురానూ గ్లూకోజ్ పాళ్లు పెరగడంతో పిల్లలు బలహీనపడతారు. దీన్నే ‘జువెనైల్ డయాబెటిస్’ అని కూడా అంటారు. టైప్-2 డయాబెటిస్: ఇది ఎక్కువగా నడివయసు వారిలో కనిపిస్తుంటుంది. తల్లిదండ్రుల్లో ఈ వ్యాధి ఉన్నప్పుడు పిల్లల్లోనూ ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగినప్పుడు రక్తంలో చక్కెరపాళ్లు అధికమై బయటపడవచ్చు. జెస్టెషనల్ డయాబెటిస్: గర్భధారణ సమయంలో వచ్చిన డయాబెటిస్ చాలామందిలో ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. అయితే అది మళ్లీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్తో వచ్చే దుష్ర్పభావాలు చాలా ఎక్కువే. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు రావడం, కంటిలోని సున్నితమైన రక్తనాళాలు దెబ్బతిని (డయాబెటిస్ రెటినోపతి), చూపు కోల్పోవడం కూడా జరగవచ్చు. కిడ్నీలపై (డయాబెటిస్ నెఫ్రోపతి) దుష్ర్పభావం పడటం, నరాలు దెబ్బతినడం వల్ల వేళ్ల చివర్లకు చీమలు పాకినట్లు ఉండటం, స్పర్శ తగ్గడం, అరికాళ్ల నొప్పుల వంటి సమస్యలు రావచ్చు. హోమియోలో డయాబెటిస్‌కు మంచి మందులు ఉన్నాయి. తీపిని ఇష్టపడేవారు, ఆధ్యాత్మికత ఉన్నవారికి సల్ఫర్, స్థూలకాయం ఉండి, త్వరగా కన్నీళ్లు వచ్చేవారికి కాల్కేరియా కార్బ్, తేలిగ్గా ఉద్వేగాలకు గురై, త్వరగా కోపం వచ్చేవారు, ఘాటైన మసాలా ఆహారాలను ఇష్టపడేవారికి నక్స్ వామికా వంటి ఎన్నో మంచి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. - డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఉద్యోగరీత్యా ఒత్తిళ్ల వల్ల తలనొప్పి వస్తోందని అనుకున్నాను. ఇటీవల మరిన్నిసార్లు రావడంతో డాక్టర్‌ను కలిశాను. ఆయన మైగ్రేన్‌గా గుర్తించారు. దయచేసి నాకు తగిన పరిష్కారం చూపించండి. - సుహాస్, హైదరాబాద్ అనేక రకాల తలనొప్పుల్లో మైగ్రేన్ ఒకటి. ఇది 15 శాతం మంది యువతుల్లో, 6 శాతం మంది యువకుల్లో కనిపిస్తుంది. కొందరిలో ఇది తలకు ఒకవైపునే కనిపిస్తే, మరికొందరిలో తల మొత్తంలో నొప్పి వస్తుంటుంది. కడుపులో తిప్పడం, వాంతి కావడం, శబ్దాలను - కాంతిని భరించలేకపోవడం వంటి లక్షణాలు ఈ తలనొప్పుల్లో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మైగ్రేన్ జన్యుపరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలు చాలా ఉంటాయి. వాటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అవి... నిద్ర సరిగా లేకపోవడం, ఎండలో తిరగడం, చాక్లెట్లు, ఐస్‌క్రీములు ఎక్కువగా తీసుకోవడం వంటివి నొప్పిని తక్షణం మొదలయ్యేలా చేసే ట్రిగరింగ్ ఫ్యాక్టర్లలో కొన్ని. మనలో ఏ అంశం నొప్పిని ప్రేరేపిస్తోందో కనుగొంటే... చాలావరకు మైగ్రేన్‌ను నివారించవచ్చు. దాంతోపాటు సరైన పోషకాహారం తీసుకోవడం, మంచి ఆహార అలవాట్లు పాటించండం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటివి మైగ్రేన్‌ను నివారించే కొన్ని అంశాలు. మైగ్రేన్ చికిత్సలో రెండు రకాల మందులు ఉపయోగిస్తారు. మొదటివి... తలనొప్పి వచ్చినప్పుడు తక్షణం నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మందులు. వీటిని నోటి ద్వారా ఇస్తారు. ఒకవేళ రోగికి వాంతులు అవుతుంటే ముక్కు ద్వారాగానీ లేదా ఇంజెక్షన్ ద్వారా గానీ ఈ తరహా మందులు ఇవ్వవచ్చు. ఇక రెండో రకమైనవి... మున్ముందు నొప్పి రాకుండా ఉండటం కోసం దీర్ఘకాలం వాడాల్సిన మందులు. మీరు డాక్టర్‌ను సంప్రదించి మైగ్రేన్ పునరావృతం కాకుండా కోసం వాడాల్సిన దీర్ఘకాలిక మందులను వాడితే ఇది తిరగబెట్టే అవకాశాలు తక్కువ. డాక్టర్ నీలేశ్ విజయ్ చౌధురీ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నేను కూర్చొని చేసే వృత్తిలో ఉన్నాను. రాత్రిపూట సరిగా నిద్రపట్టడం లేదు. ఒళ్లు అలిసేలా వ్యాయామం చేయమనీ, దాంతో బాగా నిద్రపడుతుందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. వ్యాయామం చేసేవాళ్లకు అంతగా నిద్రపట్టదని మరికొందరు చెబుతున్నారు. నాకు వాస్తవాలు వివరించండి. - ధన్‌రాజ్, నకిరేకల్ మీరు చెప్పిన రెండు అంశాలూ నిజమే. నిద్రకు ఉపక్రమించబోయే మూడు గంటల ముందుగా వ్యాయామం అంత సరికాదు. అలా చేస్తే నిద్రపట్టడం కష్టమే. అయితే రోజూ ఉదయంగానీ లేదా ఎక్సర్‌సైజ్‌కూ, నిద్రకూ చాలా వ్యవధి ఉండేలా గానీ వ్యాయామం చేస్తే మంచి నిద్ర పడుతుంది. ఒళ్లు అలిసేలా వ్యాయామంతో ఒళ్లెరగని నిద్రపడుతుంది. ఉదయం చేసే వ్యాయామంతో ఒత్తిడి నుంచి దూరమవుతారు. అయితే ఉదయం వేళ చేసే వ్యాయామం పగటి వెలుగులో అయితే మరింత ప్రభావపూర్వకంగా ఉంటుంది. మీరు ఉదయం వేళలో వ్యాయామం చేయలేకపోతే అది సాయంత్రం వేళ అయితే మంచిది. మీ రోజువారీ పనుల వల్ల అప్పటికి మీ శరీర ఉష్ణోగ్రత కూడా కాస్త పెరిగి ఉంటుంది. ఇక నిద్రవేళకు మన శరీర ఉష్ణోగ్రత కాస్త తగ్గుతుంటంది. కానీ వ్యాయామంతో మళ్లీ శరీరాన్ని ఉత్తేజపరచడం జరుగుతుంది. ఇక కార్డియోవాస్క్యులార్ వ్యాయామాల వల్ల గుండె స్పందనల వేగం, రేటు పెరుగుతాయి. శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. వీటన్నింటి ఉమ్మడి ప్రభావాల వల్ల నిద్ర తగ్గుతుంది. అంతేకాదు... వ్యాయామం ముగిసిన 20 నిమిషాల తర్వాతగానీ గుండె కండరాల రక్తం పంపింగ్ ప్రక్రియ సాధారణ స్థితికి రాదు. అందుకే వ్యాయామానికీ, నిద్రకూ మధ్య వ్యవధి ఉండేలా చూసుకోవాలన్న మాట. ఇక స్ట్రెచింగ్ వ్యాయామాలు, బలాన్ని పెంచుకనే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ తరహా వ్యాయామాలూ శరీరానికి మేలు చేసినా... అవేవీ కార్డియోవాస్క్యులార్ వ్యాయామాలకు సాటిరావు. యోగా ప్రధానంగా తనువునూ, మనసునూ రిలాక్స్ చేసే ప్రక్రియ. మీ ఫ్రెండ్స్‌లో కొందరు చెప్పినట్లుగా దీర్ఘకాలిక నిద్రలేమికి వ్యాయామం విరుగుడు. అందుకే మరీ తీవ్రంగా (విగరస్‌గా) కాకుండా... మరీ చేసీచెయ్యనట్లు (మైల్డ్)గా కాకుండా... మాడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. కంటినిండా నిద్రపోండి. వాకింగ్, జాగింగ్, జంపింగ్, స్విమ్మింగ్, టెన్నిస్ ఆడటం, డాన్స్ చేయడం లాంటి ఏ ప్రక్రియ అయినా వ్యాయామానికి మంచిదే. అయితే మీకు గుండెజబ్బులూ, స్థూలకాయం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే వ్యాయామాలు మొదలుపెట్టే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, మీకు తగిన వ్యాయామాలు సూచించమని అడగడం మేలు. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
మిఠాయి కొట్టున పకోడి పొట్లం!
హ్యూమర్ వస్తూ వస్తూ రైల్వేస్టేషన్లో కొన్న మామిడి తాండ్రను మా రాంబాబు చేతిలో పెట్టగానే... దాన్ని చూసి ‘‘హు...’’ అంటూ రాంబాబు గాడు విరక్తిగా పెదవి విరిచాడు. అది చూసి ఆశ్చర్యపోయాన్నేను. ‘‘మామిడి తాండ్రను చూడగానే తాండ్రపాపారాయుడిని చూసినట్లు జోష్‌లో ఊగిపోయేవాడి. ఆ రుచిని ఆస్వాదించుకుంటూ తినేవాడివి. ఇదేంట్రా ఇలా నిరుత్సాహంగా ఉండిపోయావు?’’ అడిగాను. ‘‘ఇదీ ఒక తాండ్రేనా? అలనాడు పొట్లం కడితే ఈతచాప అచ్చులు తాండ్రపై కనిపించాలి. అలాంటి అచ్చులు లేని తాండ్ర కనిపిస్తే చారల్లేని పులిలా, జూలు లేని సింహంలా బోసిగా అనిపిస్తోందిరా’’ అన్నాడు రాంబాబు. అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా వాడు కిరాణా షాప్ దగ్గర, మిఠాయి దుకాణం దగ్గర... ఇలా రెండు చోట్ల గాల్లోనే దండం పెట్టుకున్నాడు. దార్లో గుడిని చూసినప్పుడు భక్తిపూర్వకంగా పెట్టుకునే నమస్కారంతో పాటు వేళ్ల ఉంగరాలను ముద్దు పెట్టుకోవడం చూసి... ‘‘ఆ షాపుల్లో ఏవైనా నీ ఇష్టదైవాల ఫొటోలున్నాయా?’’ అని అడిగాను. ‘‘లేదురా... మిఠాయి కొట్లో వాడు పకోడీ పొట్లం కట్టే తీరు ఒక అద్భుతం రా. అసలు పకోడీ పొట్లాన్ని ఒక ఉదాహరణగా స్వీకరించి... అత్యంత సీరియస్ సబ్జెక్టు అయిన జర్నలిజం పాఠాలు బోధిస్తారు తెల్సా. మనం న్యూస్ ఇచ్చే సమయంలో వివరాలన్నీ అచ్చం తలకిందులైన పకోడీ పొట్లాంలా ఉండాలని లెసన్ చెబుతారురా. మొదట ప్రధాన వివరాలూ, ఆ తర్వాత అప్రధాన అంశాలూ పకోడీ పొట్లం చేత శీర్షాసనమేయించినట్లుగా ఉండాలంటారు. ఇలా పాఠాల్లో చోటుచేసుకున్న ఆ పొట్లం బతుకు ధన్యం కాదా? త్రిభుజాకారంలో ఉండే ఆ పొట్లంలో మన కాళ్ల పనీ... అనగా లెగ్ వర్క్, జబ్బ సత్తువలూ కనిపించాలంటూ శాస్త్రప్రమాణమైన దాఖలాను చూపుతారు. అంటే పోలిక కోసం ఎంపిక జరిగిన తీరును బట్టి అయినా పొట్లాం మీద మనందరికీ భక్తి కలగాలి కదా’’ అన్నాడు వాడు. ఆ సెటైరు నాకే అని అర్థమైంది. ఎందుకంటే నాకు పకోడీ పెద్దగా ఇష్టముండదు. అదే విషయాన్ని చెప్పా. ‘‘అసలు పకోడీ గురించి ఎవడు మాట్లాడారురా ఇక్కడ. నేను చెప్పేదంతా పొట్లాం గురించే కదా. ఒక్కో పొట్లానికి ఒక్కో నిర్దిష్టమైన విధానముందీ, దీన్ని కట్టేందుకు తగిన పద్ధతుంది. శాస్త్రబద్ధమైన ఈ పద్ధతులేవీ ఫాలో కాకుండా... ఒకప్పటి ఉదాత్తమైన పొట్లాలు కట్టే కళను ఇప్పుడు ప్లాస్టిక్‌తో అపభ్రంశం చేస్తున్నారురా ఈ షాపుల వాళ్లు. ఇందాక నేను నమస్కరించిన కిరాణ షాపులో ఇంకా శాస్త్రోక్తంగా పొట్లాలు కడుతున్నారు’’ అన్నాడు వాడు సశాస్త్రీయమైన పొట్లాల గురించి శంకరాభరణం శంకరశాస్త్రిలా బాధపడుతూ. ‘‘పొట్లాలు కట్టడంలోనూ పద్ధతా?’’ అడిగా ఆశ్చర్యంగా. ‘‘కాదా... మరి? ఆయుర్వేద మందుల్ని చిట్టి చిట్టి పొట్లాల్లా కడతారు. వాటిని నలుచదరాకారపు వైనాన్ని ఎప్పుడైనా గమనించావా? ఆ పొట్లాం కట్టిన తీరుతోనే వైద్యుడి నైపుణ్యం అర్థమవుతుంది. అన్నట్లు... మసాలాదోశను చాపచుట్టినట్లుగా రోల్ చేస్తారు. అలా చేసి, స్తూపాకారంలో పొట్లం కడతారు. బోండాలను, బజ్జీల కాగితపు పొట్లం కట్టే ముందర అరిటాకుతోనో, బాదం ఆకులతో ఫౌండేషన్ వేస్తారు. అనేక దొంతరలుగా ఉండే తందూరీ రోటీలనూ, జొన్న రొట్టెల్ని వృత్తాకారంలోనే కాగితాల్లో చుడతారు. ఇందాక మనం చూసిన ఆ కిరాణ షాపులో పప్పు పొట్లాన్ని క్యూబ్ ఆకారంలో పొట్లాం కడతారు. దాన్ని చూస్తే ఘనాఘన సుందరుణ్ణి చూసినంత ఆనందం కలుగుతుంది. ఇక బెల్లం అచ్చుల్ని పిరమిడ్ ఆకారాన్ని మధ్యకు కోసినట్లుగా తాటాకు చాపలో చుట్టిపెడతారు. అందుకే బెల్లంపై తాటాకు అచ్చుల్ని చూడకపోయినా, మామిడి తాండ్రపై ఈతచాప కదుములు కనిపించకపోయినా నాకెంతో బెంగగా ఉంటుందిరా. అంతెందుకు కాసిన్ని పూలు బయటికి కనిపించేలా పూలమాల పొట్లాంలోనూ ఓ చమత్కారం ఉంటుంది’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఒరే బాబూ... పూలూ, కిరాణా పొట్లాల్లోనూ పొట్లకాయలాంటి నిర్మాణ చమత్కృతి చూస్తున్న నిన్నేం అనాలో నాకు తోచడం లేదురా’’ అన్నాను. ‘‘నేను చెప్పేది ఇంకా అయిపోలేదు. ఇక జర్నలిజపు పాఠాలను తన ఒంటిపై అక్షరాలతో అచ్చోసుకున్న ఆ వార్తల కాగితమే, మళ్లీ పకోడీ పొట్లాలకు మూలం కావడంలోని చిత్రం చూశావా? ఎంత మాలావు ఇంగ్లిషు పేపరైనా పాత పేపర్ల వాడి నుంచి చివరకు కిరాణాషాపుకు లేదా కాకాహోటళ్లకు మళ్లుతుంది. అయితే ఇక్కడ కూడా తెలుగు పేపరు కంటే ఇంగ్లిష్ పేపరుకే ఎక్కువ ధర పలకడం చూస్తే బాధేస్తుంది. పొట్లాం దగ్గర కూడా తెలుగు పేపర్ల పట్ల ఇంకా కొనసాగుతున్న ఈ వివక్ష చూస్తే బాధేస్తోందిరా’’ అన్నాడు వాడు. ‘‘చూస్తుంటే కంగారూ సైతం తన బిడ్డను పొట్టకు పొట్లాంలా కట్టుకుంటుందని అనేలా ఉన్నావు’’ అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాన్నేను. - యాసీన్ -
కడుపునొప్పి... అది 24 గంటల నొప్పేనా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నిల్చునే సమయంలో, నడిచే సమయంలో తల తిరిగినట్లు అయి పడిపోతానేమో అని ఆందోళనగా ఉంటోంది. దీనికి కారణాలు ఏమై ఉంటాయి. హోమియోపతిలో చికిత్స ఉందా? - లక్ష్మి, ఖమ్మం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు బహుశా ‘వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలేచినప్పుడు గానీ, నడుస్తున్నప్పుడు గానీ ఉన్నట్టుండి తలతిరగడం, తద్వారా పడిపోవడం, వాంతులు కావడం వంటి లక్షణాలుంటే ఆ సమస్యను ‘వర్టిగో’ అంటారు.దాదాపు 20 శాతం నుంచి 30 శాతం వరకు ఈ సమస్య ఉంటుంది. ఇది ఏ వయసు వారిలోనైనా కనిపించవచ్చు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... పెరిఫెరల్, సెంట్రల్, ఇతర కారణాలతో వచ్చే వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో: ఈ సమస్య ఉన్నవారిలో తల తిరగడానికి కారణం మూలాలు చెవి లోపలి భాగంలో ఉంటాయి. చెవిలో వెస్టిబ్యులార్ సిస్టమ్ అనే భాగం ఉంటుంది. ఇది శరీరాన్ని అదుపు తప్పకుండా కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పెరిఫెరల్ వర్టిగో సమస్య వచ్చినప్పుడు తల తిరగడం సమస్య మొదలవుతుంది. శరీరం అదుపు తప్పడం, ముందుకు తూలడం జరగవచ్చు. బైక్ నడుపుతున్నప్పుడు ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. సెంట్రల్ వర్టిగో: కొన్నిసార్లు తలతిరగడానికి మెదడులోని సమస్యలు, నాడీమండల సమస్యలు కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల తలతిరుగుతుంటే దాన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. ఇతర కారణాలతో వచ్చే వర్టిగో: రక్తహీనత, రక్తపోటు ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం, జ్వరం, తీవ్రమైన వ్యాధుల బారిన పడిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కారణాలు: మెదడులో కణితులు, మెదడులో రక్తం గడ్డకట్టడం సర్వైకల్ స్పాండిలోసిస్, పార్కిన్సోనిజమ్, నరాల బలహీనతల వంటివి దీనికి కారణమవుతాయి చేతులు లాగడం, తిమ్మిర్లు కూడా దీనికి దోహదం చేస్తాయి. లక్షణాలు: వికారం, తలనొప్పి, చెమటలు పట్టడం, వినికిడి సమస్యలు, నిద్రలేవగానే లేదా నడుస్తున్నప్పుడు, ముందుకు వంగి పనిచేస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్లు తిరగడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. నిర్ధారణ: సీటీస్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్‌రే, ఆడియోమెట్రీ, హిమోగ్లోబిన్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేస్తారు. చికిత్స: హోమియోలో బెల్లడోనా, జెల్సీమియమ్, చైనా, కాకుసల్ ఇండికస్, కోనియమ్, బ్రయోనియా, పల్సటిల్సా, ఆర్సెనికా వంటి మందులు సమర్థంగా పనిచేస్తాయి. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. ఐదేళ్ల క్రితం రుతుక్రమం ఆగిపోయింది. అయితే రుతుక్రమం తగ్గిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని చదివాను. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎక్స్‌రే తీయించి ఆస్టిపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది. - పద్మ, కోదాడ క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా కనిపించేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటివి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ కూడా వాడాల్సిన పనిలేదు. ఇక ముందుగా మీకు స్పష్టం చేయాల్సిన విషయం ఏమిటంటే.. ఆస్టియోపోరోసిస్‌ను ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ చేయడం జరగదు. డాక్టర్లు ఆస్టియోపోరోసిస్‌ను అనుమానించినప్పుడు డెక్సా స్కాన్ (బోన్ డెన్సిటోమెట్రీ) చేయిస్తారు. ఇందులో ఎముక సాంద్రతను తెలుసుకోవచ్చు. మీరు మరోసారి మీకు దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. - డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ మా బాబు వయసు తొమ్మిదేళ్లు. ఇటీవల మా అబ్బాయికి తరచూ కడుపునొప్పి వస్తోంది. రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుంటే దానంతట అదే తగ్గిపోతుంటుంది. సాధారణ నొప్పే కదా తగ్గిపోతుందిలే అని అంతగా పట్టించుకోలేదు. నొప్పి మళ్లీ మళ్లీ వస్తోంది. మా ఊళ్లో డాక్టర్‌కు చూపిస్తే ’కొన్ని మందులు వాడితే తగ్గిపోతుంద’ని రాసిచ్చారు. మాకు తెలిసిన వారు అది ఒక్కోసారి ప్రాణాంతకమైన 24 గంటల నొప్పికి దారితీయవచ్చేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు 24 గంటల నొప్పి అంటే ఏమిటి? మా అబ్బాయికి కడుపునొప్పి ఎందుకు వస్తోంది? దయచేసి వివరాలు చెప్పండి. - ఝాన్సీ, శృంగవరపుకోట కడుపునొప్పిని చాలా కారణాలు ఉంటాయి. ప్రతి కడుపునొప్పీ అపెండిసైటిస్ (24 గంటల నొప్పి) కాదు. మీరు ముందుగా వైద్య నిపుణులను సంప్రదించి, మీ అబ్బాయికి అసలు కడుపునొప్పి ఎందుకు వస్తోందో ముందుగా నిర్ధారణ చేయాలి. దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇక మీరు పేర్కొన్న 24 గంటల నొప్పి (అపెండిసైటిస్)లో అకస్మాత్తుగా బొడ్డు చుట్టూ నొప్పి వస్తూ అది పొట్ట కింది భాగానికి వ్యాపిస్తూ ఉంటుంది. దాంతో పాటు వాంతులు కావడం, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అపెండిసైటిస్ ఉంటే వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఆలస్యం చేయడం మంచిది కాదు. కడుపులో చిన్నపేగు, పెద్దపేగు కలిసే చోట చిన్న ట్యూబ్ ఆకారంలో అపెండిసైటిస్ ఉంటుంది. అందులోకి ఏవైనా మలిన పదార్థాలు, రాళ్లు, పురుగులు చేరితే అకస్మాత్తుగా ఈ నొప్పి వస్తుంది. అపెండిసైటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కెటారల్ అపెండిసైటిస్, రెండోది అబ్స్ట్రక్టివ్ అపెండిసైటిస్. కెటారల్ అపెండిసైటిస్‌ను మందులతో నయం చేయవచ్చు. అబ్స్ట్రక్టివ్ అపెండిసైటిస్‌కు మాత్రం శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక శస్త్రచికిత్సలలో కీ-హోల్ ప్రక్రియ ద్వారా తక్కువ కోతతో శస్త్రచికిత్స చేయవచ్చు. వైద్య పరీక్షల ద్వారా అది ఏ రకం అనేది నిర్ధారణ చేశాకే అపెండిసైటిస్ శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అపెండిసైటిస్ ఉండి, చికిత్స ఆలస్యం అయితే అది పగిలి పొట్టలోకి ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే అలా బొడ్డుచుట్టూ నొప్పి వస్తూ కిందికి పాకుతుంటే అత్యవసరంగా డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతుంటారు. - డాక్టర్ టి.ఎల్.వి.డి. ప్రసాద్‌బాబు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ . మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
డిస్క్ వాపుతో రిస్క్ ఉంటుందా?
హస్తవాసి కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45. ఇటీవల రొటీన్ రక్త పరీక్షలు చేయించుకున్నాను. అందులో నా కొలెస్ట్రాల్ 350కి పైనే ఉందని అని చెప్పారు. నేను మద్యం, మాంసాహారాలకు చాలా దూరంగా ఉంటాను. అయినప్పటికీ నాలో కొలెస్ట్రాల్ ఇంత ఎక్కువగా పెరగడానికి కారణం ఏమిటి? - జీవన్, కొత్తగూడెం రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీద మాత్రమే కాదు... జన్యుపరమైన అంశాలపైన కూడా ఆధారపడుతుంది. జన్యుపరమైన అంశమే కారణమై ఉన్నవారిలో ఏలాంటి ఆహార నియమాలూ పాటించకపోతే కొలెస్ట్రాల్ మరింతగా పెరగవచ్చు. కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణాలు ఏవైనా దాని వల్ల భవిష్యత్తులో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మీరు స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ తగ్గించే మందులను డాక్టర్ సలహాపై క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. నా వయసు 35 ఏళ్లు. మా కుటుంబంలో చాలామందికి గుండె జబ్బులు ఉన్నాయి. మా నాన్నగారికి కూడా గుండెజబ్బు ఉంది. నాకు కూడా గుండెజబ్బు ఉందేమోనని అనుమానంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - కనకరత్నం, గుంటూరు మీరు చెప్పినదాన్ని బట్టి మీ కుటుంబ చరిత్రలో గుండెజబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. మీదింకా చిన్న వయసే కాబట్టి ప్రస్తుతం మీది వట్టి ఆందోళన మాత్రమే అనిపిస్తోంది. అయినా మీరు ఒకసారి దగ్గర్లో ఉన్న కార్డియాలజిస్ట్‌ను కలిసి మీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్‌తో పాటు ఈసీజీ ఎకో, టీఎమ్‌టీ టెస్టులు చేయించుకుని జబ్బు లేదని నిర్ధారణ చేసుకోండి. ఆ తర్వాత రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయండి. మంచి జీవనశైలితో జీవించండి. మీకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. - డాక్టర్ శ్రీనివాసకుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజెన్స్ హాస్పిటల్స్, శేరిలింగంపల్లి, హైదరాబాద్. ఫిజియోథెరపీ కౌన్సెలింగ్ ఎవరో అకస్మాత్తుగా ముందుకు పడిపోతుండగా, వాళ్లను పడిపోకుండా ఆపే ప్రయత్నంలో నా వీపు మధ్యభాగం బెణికింది. ఈ సంఘటన ఆర్నెల్ల కిందట జరిగింది. అప్పట్నుంచి నాకు వీపు మీద నొప్పి వస్తూ, అది మోకాలి కింది వరకూ పాకుతోంది. ఫిజియోథెరపీతో నొప్పి తగ్గింది. అయితే ఇప్పుడు గమనించిన అంశం ఏమిటంటే... నా ఎడమకాలి కంటే కుడికాలు తొందరగా అలసిపోతోంది. నేను టేబుల్ టెన్నిస్ ఆడుతుంటాను. ఈ మధ్య రెండు నిమిషాలు నిలబడితే చాలు... నొప్పి వచ్చి అది కాలి కిందవైపునకు పాకుతోంది. డాక్టర్‌ను కలిస్తే ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య వాపు వచ్చినట్లు తెలుస్తోంది, మళ్లీ ఫిజియో చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. అయినా ఈ నొప్పి నుంచి ఉపశమనం కలగడం లేదు. పైగా ఒక్కోసారి వెన్ను మధ్యన నొప్పి వస్తోంది. ఈ డిస్క్ వాపు సమస్య పూర్తిగా తగ్గుతుందా? దయచేసి వివరించండి. - సుధాకర్‌రెడ్డి, హైదరాబాద్ వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ తన స్థానం నుంచి జరిగి, అది కాలికి వెళ్లే నరాలను నొక్కుతుండటం వల్ల మీకు ఈ నొప్పి వస్తుండవచ్చు. అందువల్లనే మీకు కాలిలోకి పాకుతున్నట్లు నొప్పి వస్తోందనిపిస్తోంది. ఇలాంటి నొప్పులు మాటిమాటికీ తిరగబెడుతుంటాయి. మీరు సందేహిస్తున్నట్లుగా మీ వెన్నునొప్పికీ, కాలిలోకి పాకే నొప్పికీ సంబంధం ఉంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఫిజియోథెరపీ, కొన్ని నొప్పి నివారణ మందులు వాడటం (నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్-ఎన్ఎ స్ఏఐడీ), వేడి కాపడం పెట్టడం, టెన్స్, అల్ట్రాసౌండ్ చికిత్సలతో ఇది తగ్గవచ్చు. ఒకవేళ కొందరిలో ఈ ప్రక్రియలతో నొప్పి తగ్గకపోతే చివరి ప్రయత్నంగా సర్జరీ అవసరం కావచ్చు. కానీ చాలామందిలో సాధారణ ఫిజియోథెరపీతోనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంటుంది. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఫిజియోథెరపిస్టును కలిసి, వారు సూచించిన ఫిజియోథెరపీ ప్రక్రియలను అనుసరించండి. అలాగే కొంతకాలం పాటు మీరు బరువులు ఎత్తకపోవడం, జాగింగ్ చేయకపోవడం, అకస్మాత్తుగా పక్కలకు తిరగకపోవడం, దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. మీ వ్యాయామాల్లో భాగంగా ఈత చాలా మేలు చేస్తుంది. వాకింగ్ కూడా మంచిదే. - ఆర్. వినయ కుమార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ, కేర్ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్ ఈఎన్టి కౌన్సెలింగ్ నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా రకాల మందులు వాడాను. మార్కెట్లో దొరికే చుక్కల మందు వాడుతున్నాను. అది వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. ఆ మందుకు అలవాటు అవుతానేమో అని మానేశాను. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం తెలియజేయగలరు. - సీ.ఎస్.రావు, రావులపాలెం ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్ (పీఎన్ఎస్) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. లేదా ముక్కులో పాలిప్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయి ఉంటే అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. నాకు తరచూ జలుబు చేస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. టాబ్లెట్ వేసుకుంటే జలుబు తగ్గుతుంది. ఆ తర్వాత మళ్లీ వస్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - సుకుమార్, విజయవాడ మీరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే మీకు ‘నేసల్ అలర్జీ’ ఉండవచ్చు అనిపిస్తోంది. ముక్కు, చెవి, గొంతు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉంటాయి. దానివల్ల ఒక భాగంలో సమస్య వస్తే అది మిగతా రెండు భాగాలను కూడా సమస్యకు గురిచేస్తుంది. మీరు చెప్పినట్లుగా యాంటీ అలర్జిక్ టాబ్లెట్ వాడటం శాశ్వత పరిష్కారం కాదు. పైగా దాన్ని ఎక్కువగా వాడటం వల్ల కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. దీనికంటే ‘నేసల్ స్ప్రే’లు వాడటం కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. వాటితో సైడ్ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. మీరు ముందుగా నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సూచనల ప్రకారం చికిత్స తీసుకోవడం మంచిది. దాంతోపాటు మీకు అలర్జీ కలిగించే అంశాలను గుర్తించి వాటి నుంచి దూరంగా ఉండండి. - డాక్టర్ ఇ.సి. వినయకుమార్ హెచ్ఓడి - ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ . మా చిరునామా: వైద్యసలహా కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్- 34. ఈ మెయిల్: asksakshidoctor@gmail.com నిర్వహణ: యాసీన్ -
టెంకాయ మీది పీచు... తలకాయ మీది కుచ్చు!
హ్యూమర్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్‌ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్‌ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్‌లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్‌గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్‌గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్‌గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ ‘‘ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో కదా... ఆ చెట్టు మీది కాయనూ, ఈ నేల కింది ఉప్పునూ కలిపాడు కదా’’ అంటూ పచ్చడి తింటూ తన్మయత్వంతో పొంగిపోతూ అన్నాను నేను. చెట్టు ఒక చివరన చిటారుకొమ్మన ఉండే మామిడికాయకూ, నేలకు మరో చివరన ఉండే సముద్రంలోని ఉప్పురాయికీ సంబంధం కుదిర్చిన భగవంతుడి మీద అపారమైన గౌరవం కలిగింది నాకు. బయటికి అంటున్న ఆ మాటలు మా బుజ్జిగాడి చెవిన పడ్డాయి. అంతే... వాడు వెంటనే నా మాటలకు వంత పాడాడు. ‘‘అవున్నాన్నా.. ఆ కలయిక చాలా గొప్పది. ఆవకాయ తిని నువ్వూ, తినకుండానే అమ్మా... ఇద్దరూ ఒకేలా ఫీలవుతున్నారు’’ అన్నాడు. వాడన్న మాటతో నాకు కాస్త గర్వభంగం కలిగిన ఫీలింగ్ వచ్చింది. మా బుజ్జిగాడు కాస్త వంకర్ టింకర్గా ఆలోచిస్తుంటాడు. కానీ నేనో స్ట్రెయిట్ అండ్ గ్రేట్ థింకర్‌ను. మరి అంత మేధావినైన నేనూ, మా ఆవిడా ఒకేలా ఆలోచించడం ఏమిటి? పైగా నా తత్వమే గొప్పదని నా నమ్మకం. కడు సామాన్యురాలైన మా ఆవిడకూ నా అంతటి తాత్విక భావన ఉందంటే నాకెందుకో అంతగా రుచించలేదు. అయినా ఈ ఫీలింగ్‌ను కప్పిపెట్టుకున్నాను. కానీ నోటిని కట్టిపెట్టుకోలేక... ‘‘అమ్మకు ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందిరా’’ అని వాణ్ణి అడిగాను. ‘‘పచ్చడితో నీకు వచ్చిన ఫీలింగే అమ్మకూ వచ్చింది నాన్నా. ‘కొబ్బరి చెట్టు చివరన ఉండే కాయ మీది పీచునూ, ఈ నేల లోపల్నుంచి వచ్చే స్టీలునూ కలిపిన దేవుడెంతటి గొప్పవాడో కదా’ అంది అమ్మ. ఈ మాటల్ని అంట్లుతోముతున్న టైమ్‌లో అమ్మ అంటూ ఉంటుంది నాన్నా’’ అన్నాడు వాడు. నేను నేలను తాకే సముద్రం వరకు ఆలోచించా. కానీ మా ఆవిడ నేల లోపలికి కూడా వెళ్లింది. స్టీలు ఖనిజాన్ని తవ్వి తీసినట్లు, జ్ఞానాన్ని భూమి లోపలి పొరల్లోంచి పెకిలించి, పైకి తీసుకొచ్చింది. తద్వారా జ్ఞానాన్ని నాలా గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా, మరీ అండర్‌గ్రౌండ్ లెవెల్ నుంచి కనిపెట్టింది మా ఆవిడ. అంత ప్రాక్టికల్‌గా కనిపెట్టిన మా ఆవిడ జ్ఞానాన్ని ఒప్పుకోవాలంటే నాకు అహం అడ్డువచ్చింది. ‘‘నాలాగే ఆలోచించిందంటున్నావు నువ్వు. తనదీ అనుభవం నుంచి వచ్చిన పరిజ్ఞానమే అనుకో. కాకపోతే నా అంత కాదు. ఎందుకంటే మీ అమ్మది స్టీలు జ్ఞానం. నాలాగా ఆమెకు టేస్టు లేదు. కానీ నాది మామిడి తిన్న మధురానుభవం. గుర్తుపెట్టుకో. పీచు కంటే పికిల్ గొప్ప’’ అన్నాను. ‘‘నీకు జ్ఞానం రాకముందే అమ్మకు కలిగిన ఫీలింగే నాకూ వచ్చింది’’ అన్నాడు వాడు నా అహం మీద మరో దెబ్బ కొడుతూ. అయితే... వాడికీ జ్ఞానం వచ్చిందనగానే అమితమైన ఆనందం కలిగింది నాకు. నాకు పెద్దయ్యాక గానీ రాని నాలెడ్జీ వాడికి ఇంత చిన్నప్పుడే ఎలా వచ్చిందో అన్న ఆసక్తి కలిగింది. ఎంతైనా వాడు నా కొడుకు. నా హృదయం ఉప్పొంగింది. అలా పొంగిపోతూనే ఆరా తీశాను. ‘‘ఇంత చిన్నప్పుడే నీకు ఈ అనుభవం ఎలా కలిగిందిరా’’ ఇన్నర్‌గా ఇంటరెస్ట్ పుట్టి అడిగా. ‘‘నీకు మామిడికాయ నుంచి, అమ్మకు కొబ్బరికాయ నుంచి, నాకు తలకాయ మీద నుంచి ఈ నాలెడ్జి వచ్చింది నాన్నా! తల మీదికి చేరిందని జుట్టు విర్రవీగకూడదు. ఎందుకంటే తలమీద కుచ్చులా పెరిగినా, టెంకాయ మీద పీచులా చివరకు చేరాల్సింది నేల మీదికే’’ అన్నాడు వాడు. మా బుజ్జిగాడికి పుట్టెంటికలు తీయడం కాస్త లేటయ్యింది. దాంతో ఈమధ్యే వాడికి ఊహతెలిశాక గుండు చేయించాం. గుండు గొరుగుతున్నంత సేపూ వెంట్రుకలు మీద పడుతూ ఉన్నంతసేపూ చికాకు పడుతూనే ఉన్నాడు వాడు. అయితే నాకో విషయంలో సంతోషం కలిగింది. జుట్టు రాలిపోయాక వాడి అందం తాత్కాలికంగా దెబ్బతింది. కానీ దానివల్ల మా బుజ్జిగాడి మనసులో జ్ఞాన రోమాలు మొలిచాయని తెలిసి నా రోమాలు నిక్కబొడిచాయి. వెంట్రుకలు పీచులా రాలితేనేమి? జ్ఞానపు కుదుళ్లు వాడి తలకాయ మీదే ఉన్నాయి కదా! మరోమారు నా తండ్రి హృదయం పులకించింది. జ్ఞాన సముపార్జనకు అవకాశమిచ్చిన కొబ్బరిపీచుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. ‘‘మామిడికాయ, టెంకాయ, తలకాయ; తలపై కుచ్చూ... గిన్నెకు పీచూ. ఇంటి మూలలో చీపురుకట్టా... చెట్టు చివరన టెంకాయ కొబ్బరి మట్టా... కావేవీ జ్ఞాన సముపార్జనకు అనర్హం’’ అంటూ ప్రజలందరి గుండెలూ పీచుపీచుమనేలా ఒక చారిత్రక ప్రకటన కూడా చేసేశాను. - యాసీన్ -
మా బుజ్జిగాడూ... వాడి ఐన్‌స్టీన్ కటింగ్ !
హ్యూమర్ మా బుజ్జిగాడిని తీసుకొని హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్తుంటే ఎదురొచ్చాడు మా బ్రహ్మంగాడు. ‘‘ఏంట్రా వాడి జుట్టు అలా పెంచేశావ్. ఈ వయసులో వెంట్రుకలు చిన్నగా ఉండాలి. స్మార్ట్‌గా కనిపిస్తూనే చిన్నగా ఉండేలా కట్ చేయమని బార్బర్‌తో చెప్పు’’ అని సలహా ఇచ్చాడు వాడు. ‘‘అబ్బే లేదురా. మా బుజ్జిగాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించమంది మా ఆవిడ. అందుకోసమే ఇంత పెరిగేదాకా ఆగి, ఇప్పుడా కటింగ్ చేయించబోతున్నా’’ అన్నాన్నేను. ‘‘ఐన్‌స్టీన్ కటింగా? అదెందుకూ’’ ఆశ్చర్యపోయాడు వాడు. ఇక ఒక శ్రోత దొరికిన ఆనందంలో కారణాలు వివరించా. మా బుజ్జిగాడికి సైన్స్ బాగా రావాలని ఫిజిక్స్ సూత్రాలు చెప్పడం మొదలుపెట్టా. ఏదైనా వస్తువుకు వేడి తగిలితే అది కరుగుతుందనీ, ఘన పదార్థమైతే ద్రవంగా మారుతుందనీ వివరించా. పేరిన నెయ్యిని కరిగించడానికి వేడి చేస్తామనీ, చలికాలంలో కొబ్బరినూనె పేరుకుంటే దాన్ని రాసుకోడానికి వీలుగా మార్చడానికి ఎండలో పెడతామనీ సోదాహరణంగా చెప్పా. వాడూ ఇంటరెస్టింగ్‌గానే విన్నాడు. ఓరోజు రాత్రి వాడు అకస్మాత్తుగా ‘‘నాన్నా... వేడిచేస్తే ఘనపదార్థాలు ద్రవంగా మారతాయని నువ్వు చెప్పిన ఫిజిక్స్ సిద్ధాంతం తప్పు’’ అంటూ ఓ బాంబు పేల్చాడు. ‘‘అదెలారా? కొబ్బరినూనెనూ,పేరిన నెయ్యినీ ఎగ్జాంపుల్స్‌గా చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా ఇలా ఎర్రర్స్ మాట్లాడితే ఎలారా?’’ అని అడిగా. అప్పుడు వాడు వివరించిన విషయాలు ఇవి. ‘‘ఇప్పుడు నువ్వు చెప్పిందే నిజమని అనుకుందాం. కోడిగుడ్డు కొన్నప్పుడు దాని లోపలి సొనలు ద్రవరూపంలో ఉంటాయి. కానీ అమ్మ నీకోసం బాయిల్డ్ ఎగ్ చేయడానికి వాటిని ఉడక బెడుతుంది. అంటే కొన్ని నీళ్లు పోసి వేడి చేస్తుంది. నీ లెక్క ప్రకారం ద్రవరూపంలో ఉన్నవి, వేడి చేశాక వాయు రూపంలోకి రావాలి. కానీ ఇక్కడంతా రివర్సు. వేడిచేశాక గుడ్డులో ఉన్న ద్రవం కాస్తా ఘన రూపంలోకి మారుతుంది కదా’’ అన్నాడు వాడు. ‘‘నువ్వు మొండిగా వాదిస్తున్నావ్. గుడ్డు ఉడకబెట్టడం వేరు. ఈ ఒక్క అంశాన్నీ పట్టుకొని ఫిజిక్స్ సూత్రాలు తప్పు అనడం తప్పురా’’ అంటూ నేనేదో సర్దిచెప్పబోయా. కానీ వాడు ఒప్పుకోలేదు. ‘‘ఇదొక్కటే కాదు నాన్నా. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంతెందుకు... ఇడ్లీలు వండే సమయంలో ఇడ్లీ పాత్రలో దాదాపు ద్రవరూపంలో ఉన్న పిండిని అమ్మ ఇడ్లీ పళ్లేలలో పోస్తుంది. వాటిని ఇడ్లీపాత్రలో ఉంచి, కింద నీరుపోసి వేడిచేస్తుంది. నిజానికి నేరుగా తగిలే మంట కంటే... ఆవిరిలోనే వేడి ఎక్కువగా ఉంటుంది. అంటే నీ లెక్క ప్రకారం ఆవిరికి మరింత వేడి ఎక్కువ కాబట్టి దాదాపు ద్రవరూపంలో ఉన్న పిండి, ఈ వేడికి వాయురూపంలోకి మారాలి. కానీ మళ్లీ ఇక్కడ పిండి కాస్తా రుచికరమైన ఇడ్లీలా... అంటే ఓ ఘనపదార్థంగా, ఘనమైన వంటకంగా మారిపోతుంది. అంతేకాదు, పాలు కాచి వేడి పాలలో తోడేసి, వెంటనే ఫ్రిజ్‌లో పెడితే అది పెరుగులా అంటే ఘన పదార్థంగా మారదు. బయట ఉంచితేనే గట్టిగా పేరుకుపోయి పెరుగవుతుంది. అలా అయ్యాకే ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. కాబట్టి నువ్వు చెప్పే ఫిజిక్స్ సూత్రాలు నెయ్యికీ, కొబ్బరి నూనెకీ ఒక రకంగానూ, ఇడ్లీకీ, కోడిగుడ్డుకూ మరోరకంగానూ వర్తిస్తాయని నా మెదడు ల్యాబ్‌లో చేసిన ఆలోచనల ఎక్స్‌పెరిమెంట్స్‌లో తేలింది. పైగా అది మన కిచెన్ల్యాబ్లో ప్రూవ్ కూడా అయింది కదా నాన్నా. అలాంటప్పుడు వేడి తగిలితే ఘనపదార్థాలు కరుగుతాయనీ, ద్రవాలు వాయురూపంలోకి మారతాయని, చల్లబరిస్తే ద్రవపదార్థాలు ఘనరూపంలోకి మారతాయని నువ్వు చెప్పింది తప్పు కదా?’’ అని అడిగాడు వాడు. ‘‘మరి మీవాడి ఎక్స్పెరిమెంట్స్కూ, ఐన్‌స్టీన్ కటింగ్కీ సంబంధమేమిట్రా’’ అడిగాడు బ్రహ్మం. ‘‘ఈ సంభాషణ మొత్తం మా ఆవిడ విన్నది. ఐన్‌స్టీన్ తెలివితేటలన్నీ ఆయన విలక్షణమైన జుట్టులోనే ఉన్నాయని ఎవరో అన్నారట. అందుకే ఆమె మావాడి తెలివి తేటలకు అబ్బురపడిపోయి... వెంటనే వాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించమంది. ఇక మావాడు అన్నీ సైంటిఫిగ్గా ప్రూవ్ చేశాడు కాబట్టి, పైగా నేను మా ఆవిడ మాట కాదనను కాబట్టి మా బుజ్జిగాడికి ఐన్‌స్టీన్ కటింగ్ చేయించడానికే ఫిక్సయిపోయా’’ అంటూ కారణాన్ని వివరించా. ‘‘అవున్రా... నువ్వు చెప్పింది కరెక్టే. పైగా జుట్టు పొడవుగా ఉన్నందువల్ల దాన్ని సర్దుకోవడానికి తల ఎగరేసినప్పుడల్లా మెదడు కూడా కదలి మరింత చురుగ్గా మారవచ్చు. దాంతో మీవాడికి మరిన్ని ఐడియాలు రావచ్చు’’ అంటూ వాడు మరింత సైంటిఫిగ్గా వివరించేసరికి మా ఆవిడ నిర్ణయం సరైనదే అన్న భావన నాలో మరింత బలపడింది. - యాసీన్ -
అమ్మా... నిన్ను తలచీ!
మెడికల్ మెమరీస్ మదర్స్ డే స్పెషల్ అందరిలాగే నేనూ చిన్నప్పుడు ఆవూ, పులీ కథ చదివాను. పులికి ఎదురైన ఆవు... ‘మునుమును పుట్టిన నా ముద్దుల పట్టికి రొమ్ము పట్టించి వస్తా’నన్నది. ఏ మూడ్‌లో ఉందోగానీ పులి సరే అంది. తువ్వాయి తలలో బుద్ధిమాటలు పెట్టి, కడుపునిండా పాలు పట్టి తిరిగి వచ్చింది ఆవు. మాట చెల్లించుకున్నందుకు పులి ఆనందించి, ఆవుమాతల్లికి సలాం కొట్టిందట. అప్పట్లో అందరిలాగే ఆ కథ చదివినా, డాక్టరయ్యాక నాకు ఆవులో మా అమ్మ కనిపించింది. మా అమ్మకొచ్చిన రొమ్ముక్యాన్సర్ పులిలా అనిపించింది. మా నాన్న చలపతిరావు జనరల్ సర్జన్. అమ్మ ఉషాలక్ష్మి గైనకాలజిస్ట్. నేనెలాగైనా సర్జన్ అయిపోతానన్నది మా స్నేహితుల ఎత్తిపొడుపు. కానీ... నా ప్రతిభాపాటవాలతో నేను సర్జన్ కావాలి తప్ప... మా నాన్న ఉన్నతస్థానం వల్ల కాకూడదన్నది నా పట్టుదల. ఈ పట్టుదలే ఎం.ఎస్ (జనరల్ సర్జరీ) కస్తూర్బా మెడికల్ కాలేజీ మాంగలూర్లో ప్రథమస్థానంలో నిలిచేలా చేసింది. నాలో ఇలాంటి స్వాభిమాన భావాలు పెంపొందేలా చేసింది మా అమ్మే. నా భార్య డాక్టర్ వైజయంతి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నా నన్ను అనుసరించింది. అమ్మకు వచ్చిన రొమ్ము క్యాన్సర్ కారణంగా ఇక్కడికి వచ్చి చూస్తే... భారత్‌లోని పరిస్థితులు నన్ను నివ్వెరపరిచాయి. రొమ్ము ఆరోగ్యానికి సంబంధించిన ప్రత్యేక కేంద్రాలు లేవు. ఈ వ్యాధిపై అవగాహనా తక్కువే. స్క్రీనింగ్ చేయించుకోడానికి ముందుకు రావడానికి బిడియం. పరీక్షలంటే మొహమాటం. అందుకే ఈ పరిస్థితులను చక్కబరచి అందరిలోనూ అవగాహన కల్పించాలంటే ఏం చేయాలి? ఏ ఒక్కరికో, ఇద్దరికో ఉచిత చికిత్సల్లాంటివి చేసే బదులు... ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి... పెద్దఎత్తున ఒక సమూహానికీ, ఒక సమాజానికీ అవగాహన కల్పిస్తే అది వ్యాధి రాకముందే చేసే చికిత్సతో సమానం. అందుకే ఫౌండేషన్ స్థాపించా. దానికి అమ్మ పేరు తప్ప మరి ఇంకే పేరు సరిపోతుంది? మరే పేరు సరిపోలుతుంది? అందుకే ‘ఉషాలక్ష్మీ ఫౌండేషన్’ స్థాపించా. ఇలాంటి పాపులేషన్ బేస్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా 2013లో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతోనూ, 2014-15లలో తెలంగాణ మహిళా సమతా సొసైటీ, అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీ సహకారంతో సుమారు 3,000 మంది ఆరోగ్య కార్యకర్తల సహకారంతో 4,000 గ్రామాల్లో సుమారు లక్షా యాభైవేలకు పైగా సౌకర్యాలంతగా లేని చోట్ల ఉండే మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించేందుకు శ్రీకారం చుట్టింది ఉషాలక్ష్మీ ఫౌండేషన్. ఇలా మన దేశంలోనే ప్రప్రథమంగా పర్పస్ బిల్ట్ ఫ్రీస్టాండింగ్ కాంప్రహెన్సివ్ రొమ్ము ఆరోగ్య కేంద్రం కిమ్స్‌లో నెలకొల్పాం. నేను ఒక డాక్టర్ అయ్యాక, అమ్మ పేరిట ఫౌండేషన్ నెలకొల్పి ఈ సేవలన్నీ చేశాక... చిన్నప్పుడు చదువుకున్న ఆవు, పులీ కథ గుర్తొచ్చింది. బహుశా తన లేగదూడకు బ్రెస్ట్‌ఫీడింగ్ చేసినందుకే క్యాన్సర్‌లాంటి ఆ పులి ఆవుతల్లిని ఏమీ చేయలేకపోయిందేమో. ఆ తర్వాత ఇంకో ఆలోచనా వచ్చింది. రొమ్ముక్యాన్సర్ వచ్చిన ఆవు లాంటిదే మా అమ్మ. లేగదూడలాంటి నా దగ్గరికి వచ్చి తనను కబళించడానికి వచ్చిన పులి గురించి తెలిపింది మా అమ్మ. అంతే... మా అమ్మలాంటి ఎందరో అమ్మల్ని రక్షించడానికి నేను చదివిన చదువుకు సార్థకత కదా. అందునా నా మాతృమూర్తిని కన్న మా మాతృదేశంలోని అమ్మలను రక్షించడానికి పనికి వస్తేనే... క్యాన్సర్ పులుల్ని ఎదుర్కోడానికి పనిచేస్తేనే... నేను చదువుకుంటున్న సమయంలో ఎప్పుడూ నా సమక్షంలో ఉండిన మా అమ్మకు గౌరవమిచ్చినట్లు కదా!! అవును. ఇలా ఆలోచించాక... చిన్నప్పుడు నేను చదివిన ఆ కథకూ... ఇప్పుడు నాలుగు ప్రఖ్యాత రాయల్ కాలేజీలనుంచి పట్టా పొందిన రాయల్ సర్జన్‌గా చూస్తున్న దృష్టికీ ఎంత తేడా? ఇది అమ్మ జన్యువుల నుంచి వచ్చిన ఓ సుగుణం... విషయాలను మనదైన వైవిధ్యమైన దృష్టికోణం నుంచి చూడటం. దీనికి మించిన మరో సుగుణం... సేవాభావం. అందుకే ఆమె వల్లనే నాలోని సేవా‘లక్ష్మి’ ఓ ‘ఉష’స్సులా ఉదయించింది. థ్యాంక్యూ అమ్మా! నిర్వహణ: యాసీన్ నా ప్రతిభాపాటవాలతో నేను సర్జన్ కావాలి తప్ప... మా నాన్న ఉన్నతస్థానం వల్ల కాకూడదన్నది నా పట్టుదల. నాలో ఇలాంటి స్వాభిమాన భావాలు పెంపొందేలా చేసింది మా అమ్మే. అందుకే ఈ ఏడాది నాకు వచ్చిన ‘పద్మ’ అవార్డు మా అమ్మకు... మా అమ్మలాంటి అమ్మలందరికీ అంకితం. - డాక్టర్ రఘురామ్ -
చికిత్స చేసేదెవరూ... బతుకు చిగురింపజేసేదెవరు?
మెడికల్ మెమరీస్ ప్రతిరోజులాగే ఆ రోజు కూడా ‘ఆత్మీయతతో గుండె వైద్యం’ అనే నా నినాదాన్ని నిజం చేసే ప్రయత్నం మొదలుపెట్టాను. మందులకన్నా మమతలు మిన్న అని గట్టిగా నమ్ముతాను నేను. ఆ రోజు సన్యాసిరావుగారనే ఒకాయన గుండె పరీక్షల కోసం వచ్చారు. ఆయనను క్లినిక్ లోపలే ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్‌లకు పంపించాను. మరో ఇద్దరు, ముగ్గురు పేషెంట్లను చూసిన తర్వాత సుచిత్ర అనే పేషెంట్ వచ్చారు. ఆమె చాలా రోజుల నుంచి నా దగ్గరికి ఫాలోఅప్‌కు వస్తున్నారు. పేషెంట్లకు అభిమాన డాక్టర్లు ఉన్నట్లే డాక్టర్లకూ అభిమాన పేషెంట్లుంటారు. బలహీనంగా కనిపిస్తూ, మృదువుగా మాట్లాడే సుచిత్ర గుండె కూడా బలహీనమైనదే. అయితే ఆరోజు తన గుండెలో ఏదో బాధగా ఉందని సుచిత్ర వచ్చింది. సరిగ్గా ఆమె విషయం చెబుతుండగానే క్లినిక్ లోపలి నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. ‘‘డాక్టర్....! మన పేషెంట్ సన్యాసిరావు కొలాప్స్ అయ్యారు’’ అంటూ మా టెక్నిషియన్ అరిచాడు. ట్రెడ్మిల్ చివరిదశలో ఉండగా విపరీతమైన ఛాతీనొప్పి వచ్చి ట్రెడ్మిల్ మీదే కుప్పకూలారు. క్లినిక్‌లో నిర్వహించిన అనేక వేల పరీక్షలలో మొదటిసారిగా ఈ కాంప్లికేషన్! నా ముందున్న సుచిత్రగారిని అలాగే వదిలేసి లోపలకు పరిగెత్తాను. తీవ్రమైన గుండెపోటుతో దాదాపు అపస్మారక స్థితిలో ఉన్న సన్యాసిరావుగారిని చూస్తూనే అనేక పనులకు మా అసిస్టెంట్లను పురమాయించాను. ఒకరు కారు రెడీగా ఉంచారు. మరొకరు నరానికి సూదిని అమర్చి, మందు ఎక్కించారు. ఇంకొకరు హాస్పిటల్‌కు ఫోన్ చేసి క్యాథ్లాబ్ రెడీ చేయమని చెప్పారు. హాస్పిటల్‌కు చేరాక మూడుగంటల పాటు మృత్యువుతో ఎడతెగని పోరాటం! వెంటిలేటర్, పేస్‌మేకర్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, లెక్కలేనన్ని ఇంజెక్షన్స్!! ఎంతో ఒత్తిడి. ఎంతో పరిశ్రమ. ఎన్నో నిద్రలేని రాత్రులు. ప్రశాంతత కరవైన రోజులు. ఇంట్లోని వారందరికీ శిక్ష. వారి సహనానికి పరీక్ష! మృత్యువు ఒడిలోంచి ఒక పేషెంట్‌ను బయటకు తీసుకువచ్చి, అతడి జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నంలో... ఒక డాక్టర్ తన జీవితకాలాన్ని చాలా తగ్గించుకోవాల్సి వస్తుందేమో! అయినా అది సంతోషమే. ఒత్తిడితో మేము త్యాగం చేసే క్షణాలన్నీ... ఏళ్లుగా మారి రోగి ఆయుష్షును పొడిగిస్తుంటే అంతకంటే ఓ డాక్టర్‌కి కావాల్సిందేముంది. మరో మూడురోజులు సన్యాసిరావు కొన ఊపిరితోనే ఉన్నారు. చివరికి ఆరో రోజున సన్‌షైన్ మాదాపూర్ విభాగం నుంచి డిశ్చార్జ్ చేశాను. ఆయన ఇంటికి వెళ్లే ముందు నా చేతులు పట్టుకుని ‘స్టెంట్ అంటూ వేయించుకుంటే మీ చేతే వేయించుకుందామనుకున్నాను డాక్టర్. మీరే నా ప్రాణదాత’ అన్నారు. అప్పుడే పుట్టిన నా బిడ్డను తొలిసారి చూసిన అనుభూతి కలిగింది నాకు. అది చాలు ఈ జన్మకి. ఆ తర్వాత మళ్లీ మామూలే. మళ్లీ క్లినిక్, హాస్పిటల్. ఆ రోజు ఎమర్జెన్సీ వల్ల చూడకుండా పంపించేసిన చాలామంది పేషెంట్లు ‘‘సర్... సన్యాసిరావుగారికి ఎలా ఉంది’’ అని అడిగారు. ‘‘బాగున్నారు’’ అని జవాబిచ్చా. ‘‘నేనే బతికించాను సుమా’’ అన్న కాస్త ధీషణతో కూడిన గర్వం బహుశా అంతర్లీనంగా ఆ జవాబులో ఉందేమో! మా రిసెప్షనిస్ట్ మణిబాబు ఘంటసాల వారి భగవద్గీతను రింగ్‌టోన్‌గా వాడతాడు. ‘‘కర్మణ్యేవాధి కారస్థే మా ఫలేషు కదాచనా’’ అని వినపడుతుంటే కొంచెం చిరాకుపడ్డాను మనసులో. ‘‘మీ హస్తవాసి మంచిది’’ అని సన్యాసిరావు అన్న మాట బహుశా నిజమేనేమో! భగవంతుడు రాసిన విధిరాతను కూడా కాస్త మార్చగలిగే రాత మన చేతిలో ఉందేమోనన్న అని విద్వదహంకారంతో కూడిన కించిత్ అనుమానహంకారం... నా మనసులోనే ఏ మూలనో. పదిహేను రోజుల తర్వాత నా ఫేవరెట్ పేషెంట్ సుచిత్రగారి అమ్మాయి వాళ్ల అత్తగారిని తీసుకొని నా క్లినిక్‌కి వచ్చింది. చూపించుకుని వెళ్లేముందు అడిగింది ‘‘ఆరోజు కొలాప్స్ అయిన సన్యాసిరావు ఎలా ఉన్నారు’’ అని. ‘‘చాలా బాగున్నారమ్మా. సేవ్ అయినట్లే’’ అన్నాను. ఇంతలో అకస్మాత్తుగా గుర్తొచ్చింది. ‘‘అవునూ... సుచిత్రగారేరీ?’’ అంటూ ఆ అమ్మాయిని అడిగా. తలదించుకొని మెల్లగా జవాబు చెప్పిందావిడ. ‘‘ఆరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఛాతీలో భారంగా ఉందన్నారు మా అమ్మ. మీరు చూస్తూ చూస్తూ మధ్యలో వెళ్లిపోయారు. ఆమె ఇంకే డాక్టర్‌కూ చూపించుకోదు. మొండితనం. మీరంటే అభిమానం. ఆ రోజు రాత్రే... ’’ అంటూ వాక్యం ముంగిచకుండానే బతుకు ముగించిన తీరును నాకు వివరించింది. ఆమె కళ్లనుంచి జారిపడ్డ నీటిబొట్టును చూస్తే నా చెంప చెళ్లుమన్నట్లయ్యింది. సుచిత్రగారు అదే రోజు మరణించారట. నిస్త్రాణతతో అలాగే కూర్చుండిపోయాను నేను. ‘‘కర్మణ్యేవాధి కారస్థే...’’ మా మణిబాబు ఫోన్ మోగుతూనే ఉంది. నిర్వహణ: యాసీన్ -
మెడికల్ కాలేజీలో ఎందుకు చేరావు?
మెడికల్ మెమరీస్ ఇక్కడ చనిపోయిన వారు బతికి ఉన్న వారికి పాఠాలు చెబుతారు నేను 1968 సెప్టెంబర్ 13న కర్నూల్ మెడికల్ కాలేజీలో చేరాను. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడో పని చేసి చివరకు కర్నూల్లోనే స్థిరపడ్డాను. అప్పుడప్పుడూ అలా మెడికల్ కాలేజీలోకి వెళ్లి, కాసేపు తిరిగి వస్తుంటాను. అలా తిరుగుతుంటే నేనింకా 1968లోనే ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అప్పట్లోనూ ర్యాగింగ్ ఉండేది. దాన్నే ‘డకింగ్’ అని కూడా అనేవాళ్లు. ఒక సీనియర్ నన్ను పట్టుకుని ‘నువ్వెందుకు మెడికల్ కాలేజీలో చేరావు?’ అని అడిగాడు. నా ముఖానికి జవాబు చెప్పేంత లావు ఆలోచన కూడానా? ఇంజనీరు అవుదామని లెక్కలు బాగా నేర్చుకున్నాను. దెయ్యాలంటే భయం. శవాలంటే వణుకు. చచ్చినా డాక్టరు కాకూడదనుకున్నాను. కానీ చచ్చినట్లు డాక్టరే అయ్యాను. కాకుండా చస్తానా? మెడికల్ కాలేజీలో చేరకపోతే ఇంట్లోవాళ్లు మక్కెలిరగ తంతామంటే ఏం చేస్తాను మరి? అయినా ‘‘ఎందుకు మెడికల్ కాలేజీలో చేరావ’నే ప్రశ్నకు నోరెళ్లబెట్టాను. దీనికి జవాబు దొరక్కుండానే ఏడాది గడిచి ‘ర్యాగింగ్’ చేసే అర్హత నాకూ వచ్చింది. అయినా ఎవరినీ ర్యాగింగ్ చేయలేదు! రోజూ ఒకరిద్దరు జూనియర్లను వెంటబెట్టుకుని పెద్దపార్కుకు తీసుకెళ్లి ‘నువ్వెందుకు మెడికల్ కాలేజీకి వచ్చావ’ని అడిగేవాణ్ణి. వాళ్లు నాకంటే గొప్పగా నోరెళ్లబెట్టేవాళ్లు. ఒకరిద్దరు మాత్రం ‘సేవ చేయడానికి’ అనేవాళ్లు. కోర్సు ఆఖర్న మా సీనియర్ వేసిన ప్రశ్నకు జవాబు దొరికింది. నా చదువు పూర్తికావడం కోసం నా తల్లిదండ్రులు అప్పట్లో రూ. 10,000 ఖర్చుపెట్టారు. కాలేజీ ఫీజు దాదాపుగా లేదు. పైగా ప్రభుత్వం ఏడాదికి రూ. 1,500 స్పెషల్ స్కాలర్షిప్ కూడా ఇచ్చింది. కానీ నా చదువుకోసం మా కాలేజీ రూ. 1 లక్ష ఖర్చు చేసింది. ఇప్పుడైతే ఆ మొత్తం రూ. 50 లక్షలు. ఆ డబ్బును ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వానికి జనమంతా పన్నులు కట్టి డబ్బు సమకూర్చారు. మేమేదో మిగతా జనం కంటే తెలివిగల వాళ్లమని భావించిన ప్రభుత్వం మమ్మల్ని డాక్టర్లుగా తీర్చిదిద్దాలనుకుంది. మా కుటుంబాల కంటే సమాజమే మా కోసం పదిరెట్లు ఖర్చు చేసింది. అందుకు ప్రతిగా మా కోసం కుప్పలుగా డబ్బు పోగేసుకోడానికి మా చదువును తెగనమ్ముకోవడం న్యాయం కాదని అనిపించింది. వార్డు నెం. 4లో కడుపునొప్పితో ఒక ముసలాయన పడుకుని ఉన్నాడు. చదువులేదు. పల్లెటూరి నుంచి వచ్చాడు. నా బ్యాచ్‌లోని పదిమంది తెల్లకోట్లు వేసుకుని, స్టెత్స్కోప్లు మెళ్లో వేసుకుని అతని చుట్టూ చేరాం. ‘అబ్బో... చాలామంది డాక్టర్లు వచ్చార’నుకుని, ఆ రోగి బుద్ధిగా మంచం మీద పడుకున్నాడు. మేమంతా పొట్ట నొక్కాం. గంటయ్యాక అందరమూ బయల్దేరాం. ‘సారూ! మందులు ఇవ్వరా?’ అడిగాడతను. ‘మేము కాదు. పెద్ద డాక్టర్ వస్తార’ని చెప్పామతనికి. మరో బ్యాచ్ వాళ్లు మాకు ఎదురయ్యారు. ‘4వ వార్డులో కేసుంది. చూసుకోపోండి’ అన్నాం. ఈ పదిమంది కూడా ఆ రోగి దగ్గరకు వచ్చి ‘పడుకో’ అన్నారు. ‘‘మీరూ పొట్ట నొక్కుతారా?’’ అని అడిగాడతను. ‘‘వద్దా’’ అన్నారంతా. చేసేదేముంది అనుకుంటూ ఇక పడుకున్నాడు రోగి. అందరూ నొక్కారు. అతడికి జీర్ణాశయ క్యాన్సర్ అని తేల్చుకోగలిగాం. నెల రోజుల్నుంచి చూస్తూ ఉన్నాం. అతడికి ఆపరేషన్ జరగలేదు. మరో నెలలో ఫైనలియర్ విద్యార్థుల పరీక్షలో కేసులు ఉంచడం కోసం అతడికి సర్జరీ చేయకుండా ఆపారు. ఆ తర్వాత కూడా అతడికి ఆపరేషన్ జరగలేదు. పరీక్షలైన రెండ్రోజుల తర్వాత అతడు కనపడలేదు. కారణం వేరే చెప్పాలా... జబ్బు ముదిరి, చనిపోయాడు. ఇలాంటి రోగులందరూ తమ ప్రాణాలర్పించి మరీ మాకు వైద్యం నేర్పారు. కొందమంది అనాథలుంటారు. వాళ్లు చనిపోతే నాలుగురోజులు మార్చురీలో ఉంచి, ఇక ఎవరూ రారని నిర్ధారణ అయ్యాక, ఆ శవాలను ‘అనాటమీ’ (శరీర నిర్మాణశాస్త్రం) విభాగానికి ఇస్తారు. అక్కడ ఒక పెద్ద సిమెంటు తొట్టి ఉంటుంది. అందులో నలభై, యాభై శవాలను పడుకోబెడ్తారు. గుర్రం జాషువా చెప్పినట్లుగా శ్మశానంలో అందరూ సమానమవుతారన్నట్లుగా, ఈ తొట్టిలో కూడా అందరూ సమానం. అందులోంచి ఒక్కో శవాన్ని బయటకు తీసుకొచ్చి, స్టీలు బల్లమీద పడుకోబెడ్తారు. దాన్ని కోసి శరీర నిర్మాణం నేర్చుకోడానికి బిలబిలమంటూ విద్యార్థులు వస్తారు. ‘ఇక్కడ చనిపోయిన వారు బతికి ఉన్న వారికి పాఠాలు చెబుతారు’ అని అనాటమీ విభాగ ప్రవేశద్వారం దగ్గర రాసుంటుంది. పన్నులు కట్టిన జనం లక్షల డబ్బిచ్చి, రోగులు తమ శరీరాలను అప్పగించి, కొందరు అనాథ శవాలుగా మారి మాకు వైద్యం నేర్పారు. ఈ పేరూ, ఊరూ లేని మామూలు వ్యక్తులు మమ్మల్ని డాక్టర్లను చేశారు. వీళ్లకేమీ చేయక్కర్లేదా? మేమేమీ ఇవ్వక్కర్లేదా? అందుకే నేను నా శరీరాన్ని మా కాలేజీకి రాసిచ్చాను (చనిపోయాకే లెండి). నన్నూ ఆ తొట్టిలోనే పడుకోబెడ్తారు. ఆ స్టీలు బల్ల మీదే పడుకోబెడతారు. అప్పుడు నా పొట్టకోసే విద్యార్థి ‘రేయ్ చూడరా... వీడిపొట్ట ఎంత లావుందో’’ అంటాడు. అప్పుడు నేను లేచి కూర్చుని... వాడికి పాఠం చెప్పాలని ఉంది. ఏ మెడికల్ కాలేజీకి వెళ్లినా మొట్టమొదటగా నాకు గుర్తొచ్చే ప్రశ్న ‘నువ్వెందుకు మెడికల్ కాలేజీకి వచ్చావు’ అనే. ఆ ప్రశ్ననే నేనూ అందరినీ అడుగుతుంటాను. అందరి జవాబు ఎలా ఉన్నా నా జవాబు ఒక్కటే... ‘చనిపోయాక కూడా ఇతరులకు మనం ఉపయోగపడుతూ ఉండాలి’’ అదీ జీవితమంటే. అందు కోసమే... నేను చనిపోతాను. 1968 నాటి నా సీనియర్ అడిగిన ప్రశ్నకు జవాబివ్వడం కోసం అప్పుడు కూడా మెడికల్ కాలేజీకే వస్తాను. నిర్వహణ: యాసీన్ -
క్యాన్సర్ ‘పులి’ని మ్యావ్‌మనిపించిన..
మా బంగారు ‘కొండ’!! మెడికల్ మెమరీస్ తల్లి ఎత్తుకొని ఉన్న ఈ చిన్నారిని చూడండి. నాలుగేళ్ల ఈ బాబు పేరు పులికొండ రంగస్వామి. ఇంటిపేరు పులికొండ కదా... బహుశా ఆ స్ఫూర్తితోనేమో ‘పులి’ని చూసినట్టు భయపడే క్యాన్సర్ అనే ఓ జబ్బును తనకున్న కొండంత ధైర్యంతో ఎదుర్కొన్నాడు మన ఈ చిన్నారి. అంతేకాదు... పులి అని అందరూ అనుకునే ఆ జబ్బుతో యుద్ధం చేసి దాంతో మ్యావ్ మ్యావ్ అనిపించాడు. ఆ వైనం వినండి. మన చిన్నారి పులిపాటి రంగస్వామి నిజంగానే పులికి సాటి. జబ్బు అనే పులిస్వారీలో మేటి. క్యాన్సర్‌పై యుద్ధంలో అతడికి అతడే పోటీ. అందుకే ఈ విజయగాథ అందరూ చదవాలి. టీవీల్లో, సినిమాల్లో క్యాన్సర్ వస్తే ప్రాణాపాయం తప్పదనేది తప్పుడు మాట అని తెలుసుకోవాలి. ఆ స్ఫూర్తిని అందరికీ చాటాలి.తన తల్లిదండ్రులకు పుట్టిన నాలుగో కొడుకు రంగస్వామి. కానీ ఆ ఒక్కడే బతికి బట్టకట్టిన బిడ్డ. తొలిచూలు కొడుకు చిన్నతనంలోనే తీవ్రమైన ఇన్ఫెక్షన్తో చనిపోయాడు. రెండో కొడుకు కూడా ఇన్ఫెక్షన్తోనే మరణించాడు. ఇక ముద్దులు మూటగట్టే మూడోబిడ్డ సరిగ్గా మూడేళ్లు బతికాడు. మెదడులో గడ్డ కావడంతో మూడో ఏట మృతిచెందాడు. ఇక మిగిలింది పులిపాటి రంగస్వామి. ఇతడికీ మూడో ఏట విపరీతమైన జ్వరమూ, దగ్గు రావడం మొదలైంది. నెలరోజులు మందులు వాడినా తగ్గలేదు. టౌనుకు తీసుకెళ్లినా లాభం లేదు. పైగా ముఖం చాలా తీవ్రంగా ఉబ్బిపోయింది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ అనే ఊరికి దగ్గర్లోని ఒక మారుమూల చిన్న పల్లెలో నివసించే ఆ తల్లిదండ్రులు... కనీసం ఈ చిన్నారినైనా బతికించుకుందామని హైదరాబాద్‌కు బయల్దేరారు. నేను చికిత్స చేసే ఆసుపత్రి (రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్)కి తీసుకొచ్చారు. ఆసుపత్రికి చేరుకునే సమయానికి అతడికి ఊపిరి అందడం లేదు. ఎక్స్‌రే తీసిచూస్తే ఊపిరితిత్తులకు గాలి తీసుకుపోయే పైపులను నొక్కుతూ ఏదో పెద్ద గడ్డ! ప్రథమ చికిత్సగా ఆక్సిజన్ ఇచ్చి, యాంటీబయాటిక్స్ మొదలుపెట్టాం. ఆ తర్వాత గడ్డ నుంచి ముక్క తీసి పరీక్షకు పంపాం. అనుకున్నట్లే అదో క్యాన్సర్ గడ్డ అని తేలింది. వైద్యపరిభాషలో చెప్పాలంటే ‘లింఫోబ్లాస్టిక్ లింఫోమా’ అంటూ పిలిచే ఒక చెడ్డ గడ్డ. ఇక్కడ లింఫోమా అంటే ఏమిటో మామూలు వారికీ అర్థమయ్యేలా కాస్త చెప్పుకుందాం. మనకు రక్తనాళాలు ఉన్నట్లే... లింఫాటిక్ నాళాలూ ఉంటాయి. రక్తనాళాల్లో రక్తం ప్రవహించినట్టే... ఈ లింఫాటిక్ నాళాల్లో లింఫ్ అనే ద్రవం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ లింఫ్ నాళాలు కలిసేచోట ‘లింఫ్ నోడ్స్’ అనే కూడళ్లు ఉంటాయి. ఈ లింఫాటిక్ నాళాల్లో ప్రవహించే లింఫ్ ద్రవం... లింఫ్ గ్రంథుల్లో పుడుతుంది. ఈ ద్రవమే మనకు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంటుంది. ఈ లింఫాటిక్ సిస్టమ్‌కు వచ్చే క్యాన్సర్‌నే లింఫోమా అంటారు. ఇందులోనూ రెండు ప్రధాన రకాలుంటాయి. ఒకటి హాడ్జ్కిన్స్ లింఫోమా. రెండోది నాన్‌హాడ్జ్‌కిన్స్ లింఫోమా (ఎన్హెచ్ఎల్). ఈ నాన్‌హాడ్జ్‌కిన్స్ లింఫోమా(ఎన్హెచ్ఎల్)లోనూ మళ్లీ రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది బీ-సెల్ ఎన్హెచ్ఎల్. ఇందులో కడుపు, పేగుల్లోని లింఫ్‌నోడ్స్ ప్రధానంగా ప్రభావితమవుతాయి. దీనితో పాటు తల, మెడలోని లింఫ్నోడ్స్కూడా ప్రభావితం కావచ్చు. ఇక రెండో రకం టీ-సెల్ ఎన్హెచ్ఎల్. ఇందులో ఛాతీలోని లింఫ్‌నోడ్స్ ప్రభావితమవుతాయి. రంగస్వామికి వచ్చింది లింఫోమాలోని టీ-సెల్ రకం. కాబట్టి ఛాతీలో వ్యాధి (గడ్డ) కనిపించింది. ఇలాంటి క్యాన్సర్ గడ్డ వచ్చిన పిల్లలకు కీమోథెరపీ ఇస్తే 80 శాతం మందికి జబ్బు పూర్తిగా తగ్గుతుంది. ఆ పిల్లలు వ్యాధిని జయిస్తారు. ఇదే విషయాన్ని ఆ పిల్లాడి తల్లిదండ్రులకు చెప్పి చికిత్స మొదలుపెట్టాం. చికిత్సకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంటే వాటిని అరికట్టడానికి చేసే చికిత్సలూ చేశాం. ఈ అసలు చికిత్స, ఆ కొసరు చికిత్సలూ... వెరసి అన్ని రకాల వైద్యాలతో మా వంతు కృషి చేశాం. ఆ పిల్లాడు డాక్టర్లకు సహకరించాడు. వ్యాధిని జయించే ప్రక్రియలో మాతో పాలుపంచుకున్నాడు. పులి తలపై చికిత్సాంకుశంతో వ్యాధిని అంకురం నుంచి తొలగించాడు.రండి... మీకు తెలిసినవాళ్లకూ ఈ కథ చెప్పండి. చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్లను మొదటిదశలోనే గుర్తిస్తే అవి దాదాపుగా అన్నీ తగ్గుతాయనే సందేశాన్ని విస్తృతం చేయండి. విశ్వవ్యాప్తం చేయండి. అదే ఒక చిన్నపిల్లల క్యాన్సర్ డాక్టర్‌గా నేను చెప్పే తేనెలూరే ఊట లాంటి మాట. తియ్యనైన ఓ మంచిమాట. నిర్వహణ: యాసీన్ -
ఆ చిన్నారులు మాట్లాడిన అపురూప వేళలో...
మెడికల్ మెమరీస్: ‘‘ఈ కథ ఒక తల్లి సంకల్పాన్ని తెలియ చెబుతుంది. ఒక తండ్రి పిరికితనానికి, బాధ్యత నుంచి దూరంగా పారిపోయే మనస్తత్వానికీ అద్దం పడుతుంది. ఒక భర్తగా ‘నాతిచరామి’ అంటూ తోడుగా నిలవాల్సిన వ్యక్తి... బాధ్యతలకు భయపడి పారిపోయిన నాడు ఒక మహిళ మనోబలం ఎలా పెరుగుతుందో తెలిపి, ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం’’ అంటూ వివరిస్తున్నారు అపోలో ఆసుపత్రుల ఈఎన్టీ విభాగాధిపతి, సాహీ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఇ.సి. వినయకుమార్. ఆయన చెప్పిన వాస్తవగాథ ఇది. అది 2007 సంవత్సరం. అప్పుడే మేము సాహీ (సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్) సేవా సంస్థను స్థాపించి, పుట్టుక నుంచే వినికిడి సమస్యలతో బాధపడే చిన్నారులకోసం ‘గిఫ్ట్ యాన్ ఇయర్ ప్రాజెక్ట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆర్థిక స్థోమత అంతంతే ఉన్న కుటుంబాల్లోని చిన్నారులకు వినికిడి శక్తిని ప్రసాదించే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను మాకు చేతనైనంతగా చేస్తూ... చిన్నారులకు వినికిడి సామర్థ్యంతో పాటు మాట్లాడే శక్తిని ఇస్తున్నాం. ఆ సమయంలో ఒక తల్లి తన ఇద్దరు కవల పిల్లలు, మరో చిన్నారితో నన్ను కలిసింది. ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లల తల్లి సంతోషంగా ఉండాల్సిందిపోయి... అంత వేదన పడుతూ నా దగ్గరికి వచ్చిన కారణం నన్ను కదిలించింది. ఆ తల్లిదండ్రులది తూర్పుగోదావరి జిల్లా. తొలిచూలులో కవలలు పుట్టారు. ఇద్దరూ ముద్దులొలికే ఆడపిల్లలు. అందుకు దంపతులిద్దరూ చాలా సంతోషించారు. కానీ ఎదుగుతున్న ఆ పిల్లలు తల్లిదండ్రుల మాటలకు స్పందించడం లేదు. అందరిలా మాట్లాడటం లేదు. దగ్గర్లోని వైద్యులను సంప్రదిస్తే తెలిసిన విషయం వాళ్లను శరాఘాతంలా బాధించింది. ఆ పిల్లలిద్దరికీ వినికిడి శక్తి లేదు. అందుకే మాట్లాడలేరు. ఇంతలో వాళ్లకు మరో పాప పుట్టింది. పరీక్ష చేయిస్తే ఆ పాపకూ శాశ్వత వినికిడి లోపం ఉందని తెలిసింది. ఆ చేదువార్తలను తట్టుకోలేక ఆ తండ్రి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆ ప్రయత్నం విఫలమవడంతో చిన్నారుల బాధ్యత స్వీకరించడానికి భయపడి కుటుంబం నుంచి దూరంగా వెళ్లిపోయాడు. అసలే జీవనాధారం లేదు. పైగా భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని ఈ స్థితిలో ఏం చేయాలో పాలుపోలేదా తల్లికి. కొంతమందిని కలిస్తే మా సంస్థ అందించే సేవల గురించి తెలిసిందట. దాంతో హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలిసిందా తల్లి. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డిగారిని కలిసి, కాక్లియర్ ఇంప్లాంట్స్‌కు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి, దాన్ని ‘ఆరోగ్యశ్రీ’లో చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న సమయమది. కాకతాళీయంగా అదృష్టవశాత్తు అదే సమయంలో మా ప్రయత్నాలు ఫలించాయి. ప్రభుత్వం కాక్లియర్ ఇంప్లాంట్స్ అమర్చే శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చింది. దాంతో మా ప్రయత్నం మరింత సులభం అయ్యింది. ఆ ఇద్దరు కవలలతో పాటు మూడో చిన్నారికి కూడా ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాం. శస్త్రచికిత్స పూర్తయ్యాక వినికిడి శక్తి వచ్చింది. కానీ మన మాటలు అర్థం చేసుకుని వాళ్లూ మాట్లాడగలగాలి కదా! అందుకు అవసరమైన ‘ఆడిటరీ వర్బల్ థెరపీ’ కోసం దాదాపు ఆ తల్లీపిల్లలు ఇక్కడే (హైదరాబాద్‌లో) ఆసుపత్రికి దగ్గర్లోనే ఉండిపోయారు. ఈ థెరపీలో భాగంగా ఆ పిల్లలకు మాట్లాడటం నేర్పించే ప్రక్రియను మొదలుపెట్టాం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే... తొలిచూలులో పుట్టిన కవల పిల్లలిద్దరికీ వినికిడి లోపంతో పాటు ‘మెల్లకన్ను’ కూడా ఉంది. దాంతో చూపునకు సంబంధించిన మరికొన్ని లోపాలూ ఉన్నాయి. నా చిన్న కూతురైన డాక్టర్ రచనా వినయకుమార్ చిన్నపిల్లల కంటివైద్యనిపుణురాలు కావడం వల్ల ఆ కవలల మెల్లకన్ను లోపాన్ని శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దింది. ఈ ఆపరేషన్‌ను కూడా నా కూతురు ఉచితంగా చేసింది. ఓ తల్లీకూతుళ్ల వెతలు తీర్చడమనే క్రతువులో మా తండ్రీకూతుళ్లమిద్దరం భాగస్వాములం కావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. అంతేకాదు... ఆ ముగ్గురు బిడ్డలూ ముద్దుముద్దు పలుకులు పలుకుతుంటే ఆ తల్లి ముఖాన కనిపించిన సంతోషం మా కళ్లు చెమర్చేలా చేసింది. వైద్యవృత్తిలో ఉన్నందుకు, సమాజానికి ఇలా తోడ్పడేందుకు దేవుడు మాకిచ్చిన అవకాశమిది అని మాకనిపించింది. - నిర్వహణ: యాసీన్ -
ఆయుఃవేదవాక్కు
ఆయుర్వేదం కేవలం వైద్యశాస్త్రం మాత్రమే కాదు... ఒక సమగ్ర జీవనశైలి. మిగతా వైద్య ప్రక్రియలు చాలావరకు చికిత్సలను మాత్రమే పేర్కొంటాయి. కానీ... సమగ్ర జీవన విధానం ఎలా ఉండాలో చెబుతూ... తద్వారా వ్యాధుల నివారణకూ ప్రాధాన్యమిస్తుందీ శాస్త్రం. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తూనే దైనందిన వ్యవహారాలనూ, ఆహార విహారాలనూ, పథ్యాపథ్యాలనూ వాటి ప్రయోజనాలనూ విడమరచి వివరిస్తుందీ వేదం. ఆచరిస్తే కడవరకూ ఉక్కుపిండంలా ఉండేలా చూస్తుంది. ఉగాది మన తెలువారందరికీ సంవత్సరాది. ఈ ఏడాది ఆది నుంచీ ఆరోగ్యంగా ఉండటం మొదలుపెడితే... ఇక నిత్యం ఆరోగ్యభోగమే! ఆ వైభోగభాగ్యం కోసమే ఈ ప్రత్యేక కథనం... ఆయుర్వేదం... అంటే? ఆయుర్వేదం కేవలం ‘వైద్యగ్రంథం’ మాత్రమే కాదు. అందులో వైద్యం కూడా ఒక ప్రధాన అంతర్భాగం. ‘‘వేదం’’ అంటే జ్ఞానమని అర్థం. దీనినే శాస్త్రం అని కూడా చెప్పవచ్చు. ఆయువు అంటే జీవితం. ఆ విధంగా అది జీవితానికి సంబంధించిన ఒక సమగ్ర శాస్త్రం. భారతీయ వేదాంత విషయాలు, హైందవ వైదిక విలువలు, మన దేశ ప్రాచీన సంస్కృతి, విశ్వసృష్టికి సంబంధించిన దార్శనిక తత్త్వజ్ఞానం వంటి అంశాలను ఆయుర్వేదంలో కూలంకషంగా చర్చించారు. జీవితానికి పరమార్థం ‘మోక్షం’. దీన్ని సాధించడానికి చేసే సుదీర్ఘ ప్రయాణంలో ప్రధాన సోపానాలు మూడు. అవే ధర్మార్థకామాలు. వీటిని అధిగమించడానికి, బ్రతికినంత కాలం మనిషికి కావలసింది, ఉండవలసింది- ‘‘ఆరోగ్యం’’. అట్టి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాదుర్భవించిందే ‘‘ఆయుర్వేదం’’. కనుకనే ఆయుర్వేదం ఒక సమగ్ర జీవనవేదం. మనిషి మనుగడకు ఆధారమైన దినచర్య, ఋతుచర్య, స్వస్థవృత్తం, సద్వృత్తం వంటి వివరాలను సూచిస్తూ, జీవనశైలికి దిశానిర్దేశం చేసే సజీవనాదం. ఆహార విహారాల స్వరూప స్వభావాల్ని, ఆరోగ్యంలోనూ, ఆయుఃవృద్ధిలోనూ వాటికున్న ప్రాశస్త్యాన్ని శాస్త్రీయ దృక్కోణంలో చూపే నిలువుటద్దం. ఇది అధర్వణ వేదానికి ఉపవేదం. ఆయుర్వేదంలో అసలు సూత్రం ‘‘మిథ్యాహార విహారాభ్యాం సర్వేషామేవరోగాణాం, మూలకారణం’’ శాస్త్రోక్తమైన ఆహార, విహారాలను ఉల్లంఘించడమే సమస్త రోగాలకు మూలకారణం. ‘‘స్వశరీరస్య మేధావీ కృత్యేషు అవహితోభవేత్’’ జ్ఞానవంతుడు తన ఆరోగ్యం విషయంలో అప్రమత్తుడై ఉండాలి. శృంగారం- విశిష్టత ‘‘స్మృతి మేధా ఆయురారోగ్య పుష్టీంద్రియశోబలైః అధికా మందజరసో భవంతి స్త్రీషు సంయతాః॥ క్రమశిక్షణతో కూడిన శృంగారం వల్ల ఆయువు పెరుగుతుంది. యౌవనంతో ఉండే కాలవ్యవధి పెరుగుతుంది. అంటే దీర్ఘకాలం పాటు వయసు పైబడదు. ఫలితంగా అన్ని ఇంద్రియాలూ పుష్టిగావుండి, తెలివితేటలు పెరిగి, శక్తిమంతులై, ధీమంతులై ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఆహారం తినాలి? దేహపోషణార్థం మనం సేవించే ఏ పదార్థమైనా ‘‘అన్నమే’’. వరి, గోధుమ, బార్లీ, రాగులు వంటి ఏ ద్రవ్యంతో చేసినా లేదా వంటతో సంబంధంలేని కందమూలాలు, ఫలాలైనా; ఘనద్రవాలవంటి ఏ రూపంతో ఉన్నా; భక్ష్య, చోష్య, పాన, లేహ్య విధానాల్లో ఎలా సేవించినా అది ఆహారమే. సృష్టిలోని వివిధ పదార్ధాల్లోంచే ఆహారం లభిస్తుంది. కనుకనే పంచభూతాత్మకమైన ఆహారం పంచభూతాత్మకమైన శరీరాన్ని పోషిస్తుంది. దీనినే సుశ్రుతాచార్యులు ఈక్రింది శ్లోకంలో ఇలా వివరించారు. ‘‘పంచభూతాత్మకే దేహేతి ఆహారః పాంచభౌతికః విపక్వః పంచధా సమ్యగ్గుణాన్ స్వానభివర్ధయేత్॥ ఆహారం శరీరానికి మనసుకి శక్తినిచ్చి ఓజస్సుని వృద్ధి చేస్తుంది. ఆహార వర్గీకరణ నాలుకకు కలిగే రుచిని బట్టి, ఆహారాన్ని ఆయుర్వేదం ఆరురకాలుగా విభజించింది. ప్రధాన రసం, అనుబంధ రసం అనేవి సాంకేతిక విశ్లేషణ క్రిందకు వస్తాయి. షట్స్రాలు ఈక్రింది విధంగా ఉన్నాయి. ‘‘మధుర (తీపి), అమ్ల (పులుపు), లవణ (ఉప్పు), కటు (కారం లేక తీక్ష్ణం), తిక్త (చేదు), కషాయ (వగరు).’’ ⇒ వాటి గుణకర్మల్ని బట్టి ‘‘లఘు, గురు, శీతల, ఉష్ణ, రూక్ష (పొడిపొడిగా ఉండేవి), స్నిగ్ధ (జిగురుగా ఉండేవి)’’ మొదలగు రకాలుగా విభజించింది. ⇒ మనసు మీద చూపే ప్రభావాన్ని బట్టి, ‘‘సాత్వికాహారం, రాజసాహారం, తామసికాహారం’’గా చెప్పారు. సమీకృతాహారం (ఆయువర్ధకం): పైన పేర్కొన్న ఆరు రసాలను అలవాటు చేసుకోవడం ఉత్తమం. కొంచెం మధుర రసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారం సాత్మ్యంగా (సరిపడేదిగా), హితకరంగా (నచ్చినదిగా), లఘు, ఉష్ణ, స్నిగ్ధకరంగా ఉంటే శ్రేష్ఠం. ఇలాంటి ఆహారాన్ని ఆయుఃవర్ధకంగా చెప్పారు. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఆరు రసాలలోనూ ఉప్పు (లవణం)ని ఎక్కువ వాడవద్దని హెచ్చరించింది ఆయుర్వేదం. దాంతో బాటే పిప్పళ్లు మరియు క్షారం (ఉప్పు సాంద్రత కలిగినవి)లనూ నిషేధించింది. దాని దుర్గుణాలను కూడా చరకాచార్యులు ఈక్రింది శ్లోకంలో ఇలా చెప్పారు. ‘‘అథఖలు త్రీణి ద్రవ్యాణి నాతి ఉపయుంజీతాధికం అన్యేభ్యోద్రవ్యేభ్యః తద్యథా - పిప్పలీః, క్షారం, లవణమితి’’ ‘‘అతి లవణ సాత్మ్యాః పురుషాః తేషామపి ఖాలిత్య, ఇంద్రలుప్త, పాలిత్యాని తథా వలయశ్చాకాలే భవంతి’’ ⇒ ఉప్పును అధికంగా తీసుకునేవారికి బట్టతల, వెంట్రుకలూడటం, నెరిసిపోవడం, చర్మం ముడతలు పడటం... ఇవి తరుణ వయసులోనే సంభవిస్తాయి. ఎంత ప్రమాణం తినాలి? ‘మితం’గా తినాలి. అంటే శిశువులు, యువకులు, వృద్ధులు తమ వయసును బట్టి తగినంత తిని తదనుగుణంగా వ్యాయామం చెయ్యాలని ఆయుర్వేదం చెబుతోంది. వృత్తిని బట్టి సుకుమారులు, కాయకష్టం చేసేవారు, మానసిక శ్రమకి గురయ్యేవారు తమకు అనుగుణంగా తమ ప్రమాణాల్ని మార్చుకోవాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన పోషకాంశాలున్న ఆహారాన్ని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యాంశం ఏమిటంటే ‘అగ్ని’ (అరిగించుకునేశక్తి) బలాన్ని బట్టి ప్రతిఒక్కరూ ఆహార ప్రమాణాన్ని సరిచూసుకోవాలి. మితిమీరి తింటే అజీర్ణవ్యాధి కలుగుతుంది. ఇది ఎన్నో రకాల ఇతర వ్యాధులకు దారి తీస్తుంది. తినవలసినవి తాగవలసినవి ఇవి తినండి: ⇒ మొలకెత్తిన గింజలు (పెసలు నిత్యం లభ్యమౌతాయి) ⇒ నానబెట్టిన వేరుశనగపలుకులు ⇒ పచ్చికొబ్బరి ⇒ గ్రీన్సలాడ్లు (ఖీరా, టమాటా, కేరట్, బీట్రూట్ మొదలైనవి) తాజా ఫలాలు: బొప్పాయి, జామ, సపోటా, సీతాఫలం, అరటి, బత్తాయి, కమలా, దానిమ్మ, ద్రాక్ష మొదలైనవి. ఎండిన ఫలాలు: ఖర్జూరం, జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ మొదలైనవి. ⇒ ముడిబియ్యంతో వండిన అన్నం, గోధుమపిండి లేదా మల్టీగ్రైన్ పిండ్లతో చేసిన పుల్కాలు. ⇒ ఆకుకూరలలో తోటకూర చాలా శక్తినిస్తుంది. పాలకూర, బచ్చలికూర, మెంతికూర మొదలైనవి నిత్యం తినవచ్చు. ⇒ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా చాలా మంచివి. ⇒ శాకాహారంలోని కాయగూరలన్నీ మంచివే. ఉడికించి తినడం అలవాటు చేసుకోవాలి. చేమదుంప శక్తినిస్తుంది. ⇒ నువ్వులు (పచ్చిపప్పు), బెల్లం రోజూ 3 చెంచాలు నమిలి తినడం మంచిది. కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇవి తాగండి ⇒ రోజూ కనీసం 3-4 లీటర్ల మంచినీరు తాగటం మంచిది. (ఒకేసారి కాకుండా, నియమిత విరామాలతో తాగాలి. తినడానికి ముందుగాని, తిన్న తర్వాత గాని 45నిమిషాల పాటు నీరు తాగవద్దు) ⇒ వారానికి రెండుసార్లు కొబ్బరినీళ్ళు తాగితే మంచిది. ⇒ స్వచ్ఛమైన చెరకు రసం తాగితే మంచిది. ⇒ అప్పుడప్పుడు, ఉదయం ఒకగ్లాసు బార్లీ తాగితే మంచిది. రాగుల జావ కూడా శక్తికరం. ⇒ పండ్లరసాలు, పచ్చికూరల జ్యూస్‌లు చాలా మంచిది. ⇒ తేనె ఎంత తిన్నా చాలా మంచిది. బలకరం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం లభించే ఆహారపదార్థాలలో మంచివేవి...? తినే ఆహారం ఏదైనా ఆ భారాన్ని తట్టుకోవలసింది ‘‘మహాకోష్ఠమే’’ (అంటే నోరు మొదలుకొని మలవిసర్జన మార్గం వరకు). ఆహారాన్ని అరిగించాల్సిన బాధ్యత జీర్ణాశయానిదైతే, ఆ సారాన్ని తగు మార్పులతో మన శరీరంలోని కణాలకు అందించే బాధ్యత కాలేయానిది. దీనినే ఆయుర్వేదం ‘యకృత్’ అని చెప్పింది. ధాతు పరిణామ ప్రక్రియ దీని ధర్మం. ఇంతటి విలువైన ఈ అవయవాన్ని (యకృత్‌అంటే లివర్‌ను) కాపాడుకోవలసిన బాధ్యత మనదే. దీనిని మనం రక్షించుకుంటే చాలు... మన దేహాన్ని అది రక్షించుకుంటుంది. నేటి రోజుల్లో ఆరోగ్యానికి, ఆయువృద్ధికి...? దినచర్య: తెల్లవారుజామున నిద్రలేవాలి: సూర్యోదయానికి ఒకటిన్నర గంటల ముందు సమయాన్ని బ్రాహ్మీమూహూర్తమంటారు. ఆ సమయంలో నిద్ర నుండి మేల్కొనడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెంది, అగ్ని, క్షమత్వం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయి. ‘‘బ్రాహ్మేముహూర్తే ఉత్తిష్ఠేత్ జీర్ణాజీర్ణోనిరూపయన్ రక్షార్థమాయుషః స్వస్థో’’ (అష్టాంగ సంగ్రహం, సూత్రస్థానం) దంత ధావనం: మలవిసర్జనానంతరం దంతధావనం (పళ్లు తోముకోవడం)చేసుకోవాలి. దీనికోసం వేప, కానుగ వంటి చేదు, కారం, వగరు గల పుల్లలను మెత్తగా నమిలి ఉపయోగించుకోవాలి. చిగుర్లను గాయపర్చకుండా పళ్లు తోముకోవాలి. ఈప్రక్రియను ఆహారం తిన్న తర్వాత కూడా అమలుపరచాలి. ‘‘.....ప్రాతః భుక్త్వాచ మృద్వగ్రం కషాయ కటు తిక్తకమ్, భక్షయేత్ దంతధావనం దంతమాంసాని అబాధయన్’’ (అష్టాంగ హృదయం) వ్యాయామం: వ్యాయామం వల్ల దేహం తేలికగా, శక్తిమంతంగా తయారవుతుంది. జఠరాగ్ని వృద్ధి చెందుతుంది. కొవ్వు కరగడం వల్ల స్థూలకాయం ప్రాప్తించదు. మంచి దేహసౌష్ఠవం ప్రాప్తిస్తుంది. చిన్నపిల్లలూ, వృద్ధులు, అజీర్ణరోగులు వ్యాయామం చెయ్యరాదు. ‘‘లాఘవం, కర్మసామర్ధ్యం దీపోర్తగ్నిః మేదసఃక్షయః విభక్త ఘన గాత్రత్వం వ్యాయామాత్ ఉపజాయతే’’ ‘‘...వాతపిత్తమయీ బాలోవౄద్ధో అజీర్ణీచతంత్యజేత్.’’ యోగసాధన: యోగసాధన వల్ల (ఆసనాలూ, ప్రాణాయామం, ఆత్మజ్ఞానసముపార్జన) మనిషికి ఆరోగ్యసిద్ధి (మానసిక, శారీరక, ఆత్మానుగత) లభిస్తాయి. ‘‘యోగేన చిత్తస్యపదేన వాచాం మలం శరీరస్యతువైద్యకేన యోపా కరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి- రానతోస్మి’’ (చరక సంహిత) శరీరానికి నలుగు పెట్టుకోవడం, స్నానం : కొన్ని చూర్ణాలతో శరీరానికి చేసే మర్దనను (నలుగు పెట్టడాన్ని) ‘‘ఉద్వర్తనం’’ అంటారు. దీని వల్ల కఫం హరించుకుపోయి, స్థౌల్యం (స్థూలకాయం) తగ్గి, చర్మం ప్రకాశిస్తూ, అంగసౌష్ఠవం కలుగుతుంది. (ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేసినా ప్రయోజనకరమే) ‘‘ఉద్వర్తనం కఫహరం మేదసః ప్రవిలాయనం స్థిరీకరణం అంగానాం త్వక్ ప్రసాదకరం పరం’’ ⇒ నిత్యం స్నానం చేయడం వల్ల అగ్నిదీప్తి, శుక్రవృద్ధి, ఓజస్సు, బలం, ఆయువృద్ధి సిద్ధిస్తాయి. శరీరం మలిన రహితమవుతుంది. దురద, చెమట, కునికిపాట్లు, దప్పిక, మంట హరించుకుపోతాయి. వ్యాధిగ్రస్తునికి సైతం తాను రోగిననే భావన దూరమవుతుంది. ‘‘స్నానం దీపనం ఆయుష్యం వృష్యం ఊర్జాబలప్రదం కండూ మలశ్రమస్వేద తంద్రా తృట్ దాహ పాప్మజితం’’ నిత్యం తలకు నూనె రాసుకోవడం వల్ల: ప్రతిరోజూ తలకు నూనె రాసుకుంటే శిరశ్శూల, బట్టతల, వెంట్రుకలు నెరిసిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. కపాలానికి బలం చేకూరుతుంది. కేశ మూలములు దృఢంగా ఉంటాయి. కేశాలు నల్లగా, పొడవుగా అవుతాయి. శిరస్సునకు తైలమర్దనం చేసుకోవడం వల్ల ఇంద్రియ నైర్శల్యం, చక్కటి చర్మకాంతి, సుఖ నిద్ర కలుగుతాయి. ‘‘నిత్యం స్నేహార్ద్ర శిరసః శిరఃశూలం నజాయతే నఖాలిత్యం నపాలిత్వం నకేశాః ప్రపతంతి చ, బలం శిరః కపాలానాం విశేషేణ అభివర్ధతే దౄఢమూలాశ్చ దీర్ఘాశ్చ కౄష్ణాః కేశాభవంతి చ, ఇంద్రియాణి ప్రసీదంతి సుత్వక్ భవతి చామలమ్ నిద్రాలాభః సుఖంచ స్యాత్ మూర్ధ్ని తైల నిషేవణాత్’’ ఏయే వేళల్లో తినాలి? మధ్యాహ్నం, సాయం సంధ్యవేళల్లో తినటం ఉత్తమం. భోజనానికి, అల్పాహారానికి మధ్య కనీసం నాలుగైదు గంటల వ్యవధి ఉండాలి. ఆకలి కానప్పుడు, తిన్నది జీర్ణం కానప్పుడు మళ్లీ తినకూడదు. అదేపనిగా ఉపవాసాలూ చెయ్యకూడదు. ప్రతిరోజూ నియమిత వేళల్లోనే తినాలి. వారానికొకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది. అన్నాన్ని సేవించడం ‘అశనం’ అంటారు. పథ్యా పథ్యాల్ని గమనించి సేవించడం ‘సమశనం’ అంటారు. అతిగా తినడాన్ని ‘అధ్యశనం’గా చెప్పారు. అధిక ప్రమాణంగాని, అల్ప ప్రమాణంగాని వేళకాని వేళల్లో తింటే ‘విషమాశనం’గా వర్ణించింది ఆయుర్వేదం. వీటివల్ల అజీర్ణ వ్యాధి కలగడమే కాకుండా, అతిదారుణమైన వ్యాధులూ సంభవించవచ్చు. కాలానుగుణంగా ఆహారంలో మార్పు (రుతువులను బట్టి): శిశిరం (ఫిబ్రవరి, మార్చి)- తీపి, పులుపు, ఉప్పు రుచులు, వేడిగా, స్నిగ్ధంగా ఉండాలి వసంతం (మార్చి, ఏప్రిల్, మే): చేదు, కారం, వగరుగా ఉండేవి, పొడిపొడిగా, వేడిగా ఉండాలి గ్రీష్మ (మే, జూన్, జూలై): తీపి, చల్లవిగా ఉండే స్నిగ్ధ (జిడ్డుగా) పదార్థాలను, ద్రవాహారాన్ని సేవించాలి వర్ష (జూలై, ఆగస్టు, సెప్టెంబర్): తీపి, పులుపు, స్నిగ్ధ పదార్ధాలు, వేడివేడిగా శరత్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్): తీపి, చేదు, వగరు, రూక్ష (పొడిగా ఉన్నవి - అంటే జిడ్డులేనివి), చల్లగా ఉండాలి హేమంత (నవంబరు, డిసెంబరు, జనవరి): తీపి, పులుపు, ఉప్పు, స్నిగ్ధ, ఉష్ణ పదార్థాలు. ‘పథ్యం’ అంటే?: సరిపడేది, హితకరం అని అర్థం. దీనికి వ్యతిరేకం ‘అపథ్యం’. ఇది శరీర స్వభావాన్ని బట్టి, అగ్నిబలాన్ని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి, వాడే ఔషధాన్ని బట్టి తినగదినవి, తినకూడనివి అయిన ఆహార పదార్థాల్ని వివరించింది ఆయుర్వేదం. ఉదా: అజీర్ణంలో తేలికయైన (లఘు) ఆహారం తీసుకోవాలి. జ్వరంలో కూడా; మధుమేహవ్యాధిలో - మధుర, స్నిగ్ధ ఆహారం అపథ్యం; చేదు పదార్థాలు పథ్యం. ‘‘పథ్యాన్ని సక్రమంగా పాటిస్తే ఔషధమే అవసరముండదు. పాటించకపోతే ఔషధం పనిచేయదు’’ - అని వాగ్భటాచార్యులు నొక్కి చెప్పారు. నిషేధాలు ⇒ ప్రధానంగా కొవ్వు పదార్ధాలను విసర్జించాలి. అంటే నూనె, నెయ్యిలతో వండిన వంటకాలన్న మాట. శరీరానికి కావలసిన కొవ్వులు మనకి ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్ధాలలో (ఉదా: పాలు, పెరుగులలో) లభిస్తాయి. నువ్వులనూనె, ఆవునెయ్యి - వీటిని కొంచెం ప్రమాణంలో నెలకు రెండుసార్లు సేవిస్తే మంచిది. అవి హానికరం కావు. మనం చేసే శారీరక శ్రమ, వ్యాయామాన్ని బట్టి వీటి ప్రమాణాలను సరిచేసుకోవాలి. ⇒ ఐస్‌క్రీములు, శీతల పానీయాలు, చాక్లెట్లు, బేకరీ సరుకులు, ఫాస్ట్ఫుడ్స్ల వల్ల పోషకవిలువలు శూన్యం. ⇒ సాత్వికాహారమైన శాకాహారం అత్యుత్తమం. అలవాటుంటే మత్స్యమాంసాలను అరుదుగా మాత్రమే తినడం శ్రేయస్కరం. ⇒ రోడ్డుపక్కన లభించే పళ్లరసాలు, చెరకురసాలు సేవించడం ప్రమాదకరం. ఇన్ఫెక్షన్ల వల్ల మహాకోష్ఠం దెబ్బతింటుంది. అలాగే బజ్జీలు, దోసెల లాంటివి కూడా. నూనెలను పదేపదే మరిగించడం చాలా హానికరం. ⇒ ఆహార నియమాలను ఉల్లంఘిస్తూ, వేళాపాళా లేకుండా ఇష్టానుసారంగా తినడం వల్ల లివర్ దెబ్బ తింటుంది. నిద్ర నిద్ర: మనసు బడలికనొందగనే ఇంద్రియాలు కూడా అలసిపోయి తమతమ నిర్ణీత కర్మల నుంచి దూరమవుతాయి. దాంతో మనిషికి నిద్రవస్తుంది. ఒక్క వేసవికాలంలో తప్ప పగటి నిద్ర నిషేధం. ‘‘యదాతు మనసి క్లాన్తే కర్మాత్మానః క్లమాన్వితాః విషయోభ్యో నివర్తంతే తదా స్వపితి మానవః’’ (చరక సంహిత) మద్యనిషేధం: మద్యాన్ని తయారుచేయడం, విక్రయించడం, తాగడం, ఇతరులకు ఇవ్వడం శస్త్రనిషేధం. ‘‘సర్వధా ఈక్షేత్ న ఆదిత్యం, న భారం శిరసావహేత్ నఈక్షేత ప్రతతం సూక్ష్మదీప్తా మేధ్యాప్రియాణిచ మద్య విక్రయ సంధాన దానపానానిన ఆచరేత్’’ దీంతో పాటు సూర్యకాంతిని నేరుగా చూడవద్దు. తలపై అధికభారం మోయవద్దు. అత్యంత సూక్ష్మం, అత్యంత తీక్షణమైనవీ, మనసుకి అప్రియాలైన వస్తువులను తదేక దృష్టితో చూడకూడదు. మన ఆరోగ్యం కోసం ఆయుర్వేదం సూచించిన పైన పేర్కొన్న అన్ని నియమాలనూ క్రమం తప్పక పాటిస్తే నిండు నూరేళ్ళూ ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు. నిర్వహణ: యాసీన్ -
సాహియరింగ్ ఈజీ
వినికిడి సమస్య చాలా విచిత్రమైంది. చక్కటి చుక్కల్లా ఉండే చిన్నారులు వినికిడి, మూగ... సమస్యల బారిన పడి వికలాంగులవుతారు. ఇలాంటి సమస్య ఆడపిల్లలకు వస్తే అది మరింత వేదనకు కారణమవుతుంది. కారణం... మన సమాజంలోని వివక్ష. ఆడపిల్లలంటే చిన్నచూపు. వైద్యంలోగానీ, విద్యావకాశాల్లోగానీ... ముందుగా మగపిల్లలకే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో ఆడపిల్లలకు మూగ, చెవుడు సమస్యలు వస్తే వారు మరింతగా కుంగిపోవాల్సిన పరిస్థితి. ఇకపై అలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టింది ‘సాహీ’. ‘సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్డ్’ అనే స్వచ్ఛంద సంస్థకు సంక్షిప్త రూపమే ఈ ‘సాహి’. ఇది చేపట్టిన సరికొత్త కార్యక్రమమే ‘హియరింగ్ ఇంపెయిర్డ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్’. ఈ కార్యక్రమ వివరాలు ఇవి... - యాసీన్ పదేళ్ల కిందట 2004 నవంబర్‌లో సాహి సంస్థ ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఈ.సీ. వినయకుమార్ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. కొంతమంది ఈఎన్టీ సర్జన్లు, ఆడియాలజిస్టులు, అపోలో ఆసుపత్రుల యాజమాన్యం, సేవా దృక్పథం గల కొందరు ప్రముఖులతో ఈ సేవా సంస్థ ఆవిర్భవించింది. వినికిడి, మూగ సమస్యలను పరిష్కరిస్తూ... వారికి ఉచిత వైద్యసహాయం అందిస్తోందీ సంస్థ. అనేక సహాయ కార్యక్రమాల్లో ‘సాహి’ ‘సాహి’ ఆవిర్భవించిన నాటి నుంచి సమాజంలో... మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో వినికిడి శక్తి లేని వారిని గుర్తించి, వారికి వైద్య సహాయం అందించడంలో తోడ్పడుతూ వస్తోంది. కాక్లియర్ ఇంప్లాట్స్ అమర్చి శస్త్రచికిత్స చేయడం, చెవికి సంబంధించిన మైక్రో సర్జరీలను నిర్వహించడం, వినికిడి మిషన్లు ఉచితంగా ఇవ్వడం, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఎయిడ్ (బాహా) వంటి శస్త్రచికిత్సలను చేయడం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు కూడా వినికిడి సమస్య ఉందో లేదో తెలుసుకునే స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వంటి కార్యకలాపాలను చేపట్టారు. ఇప్పటికే ఇరురాష్ట్రాల్లోనే గాక... పాకిస్థాన్ వంటి ఇరుగుపొరుగు దేశాల నుంచి కూడా దాదాపు 2,500కు పైగా పిల్లలకు వినికిడి సమస్యను శాశ్వతంగా దూరం చేశారు ‘సాహీ’ నిర్వాహకులు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సహకారంతో అత్యంత వ్యయభరితమైన (దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది లక్షల విలువైన) కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ‘ఆరోగ్యశ్రీ’ జాబితాలో చేర్చేలా చొరవతీసుకుంది సాహి. ‘‘మొదటిసారిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ సంయుక్తరాష్ట్రంలో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీలో భాగం చేశాక... ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలూ... అప్పటి మన సంయుక్తరాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని... తమ తమ రాష్ట్రాల్లోనూ ఈ శస్త్రచికిత్సను వారి వైద్య సహాయ కార్యక్రమాల జాబితాలో చేర్చారు. మేం శస్త్రచికిత్స నిర్వహించి... వినికిడి, మాట శక్తిని ప్రసాదించిన ఒక అమ్మాయి... యువతిగా ఎదిగి, ఎన్నో విజయాలను నమోదు చేస్తూ ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెయిన్స్ పాసయ్యింది’’ అని సంతోషంగా వివరించారు ‘సాహి’ కార్యదర్శి, ఈఎన్టీ శస్త్రచికిత్సా నిపుణులు, అపోలో ఆసుపత్రుల ఈఎన్టీ విభాగాధిపతి అయిన ఈ.సీ. వినయకుమార్. సాహీ సేవల వల్ల ప్రయోజనం పొందుతున్న వారు సాధిస్తున్న విజయాలకు ఇదొక తార్కాణం. మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం... ప్రస్తుతం ‘సాహి’ని స్థాపించి దశాబ్దం గడిచిన సందర్భంగా మరో కొత్త ప్రాజెక్టును చేపట్టిందీ సంస్థ. ‘హియరింగ్ ఇంపెయిర్డ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్’ అనే పేరుతో చేపట్టిన ఈ కొత్త ప్రాజెక్టు కింద 15 ఏళ్ల లోపు అమ్మాయిలకు వినికిడి సమస్యలుంటే వారికి కాక్లియార్ ఇంప్లాంట్ పరికరాలు అమర్చడం వంటి ఉపకరణాలతో కూడిన శస్త్రచికిత్సలు చేయడం, అత్యంత సంక్లిష్టమైన మైక్రో ఇయర్ సర్జరీలు నిర్వహించడం వంటి వైద్య సహాయాలను పల్లెల్లోని ఆడపిల్లలకు అందిస్తారు. ‘‘వినికిడి లోపాలు అనేక రకాలు. అది ఏరకమైన వినికిడి సమస్య అయినప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆధునికమైన వైద్య పురోగతితో అన్నిరకాల వినికిడి సమస్యలకూ పరిష్కారాలున్నాయి. అయితే లోపించిందల్లా... ఈ సమస్యలకు వైద్యపరమైన పరిష్కారాలు ఉన్నాయనే విషయంపై అవగాహన మాత్రమే. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువ. అందుకే మేం ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టును చేపట్టాం’’ అని వివరించారు డాక్టర్ ఈ.సీ. వినయకుమార్. పైగా వినికిడి సమస్యను పిల్లల్లో ఎంత త్వరగా గుర్తించి, అది ఏరకానికి చెందినదన్న అంశాన్ని తెలుసుకుని, ఎంత త్వరగా చికిత్స అందిస్తే, అంతే త్వరగా వారికి వినికిడి సమస్య తీరుతుందీ... అందరిలాగే మాటలూ బాగా వస్తాయి. కొన్ని ఇతర దేశాల ఎన్జీవోలతో సంయుక్తంగా... సాహి చేపట్టిన ఈ ‘‘హియరింగ్ ఇంపెయిర్డ్ గర్ల్ ఛైల్డ్ ప్రాజెక్టుకు చెక్ దేశానికి (గతంలోని చెకొస్మోవేకియాలో ఒకటైన చెక్ రిపబ్లిక్) చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ‘‘పింక్ క్రోకడైల్’’ కూడా తనవంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. మన దేశపు రాక్బ్యాండ్స్లో ప్రముఖమైన ‘‘ఇండియన్ ఓషియన్’’ రాక్‌బ్యాండ్ గ్రూపు వారు ‘సాహి’ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లలకు సహాయం చేయడానికి కారణాలివే... మన సమాజంలో ఆడపిల్లలంటే ముందునుంచే కాస్త వివక్ష ఉంది. విద్యావకాశాలను కల్పించడంలో, వైద్యసహాయాలను అందించడంలో మొదటి ప్రాధాన్యాలను మగపిల్లలకే ఇస్తారు. దాంతో వినికిడి సమస్యలున్న వారు, మాటలు రాని మూగ అమ్మాయిలు వివక్ష తాలూకు వేదనను మౌనంగా అనుభవించాల్సిన పరిస్థితి. పైగా వారి వైకల్యాన్ని వెక్కిరిస్తూ సమాజపు సూటిపోటి మాటలను ఎదుర్కొనాల్సిన దుస్థితి. ఇక యుక్తవయసుకు వచ్చాక వాళ్లకు ఉపాధి కల్పనలోనూ, ఉద్యోగ విషయాల్లోనూ సమాజం వివక్ష చూపుతుంది. ఇలాంటి పిల్లల పెళ్లిళ్లు కావడం కూడా చాలా కష్టం. ఈ వైకల్యంతో పిల్లలను కన్నందుకు వాళ్ల తల్లిదండ్రులపైనా సమాజం వివక్ష చూపుతుంది. ఇలాంటి పిల్లలను పెళ్లి చేసుకోడానికి సాధారణంగా ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా... వైకల్యం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటున్నందుకు వారి తల్లిదండ్రులనుంచి పెద్ద ఎత్తున కట్నాన్ని ఆశిస్తారు. దాంతో ఆర్థికంగా కూడా ఈ పిల్లలు తల్లిదండ్రులకు భారమయ్యే అవకాశాలున్నాయి. వినికిడి సమస్యలున్న అమ్మాయిలు ఈ వెతలను అనుభవించే అవసరం లేకుండా చూసేందుకే ఈ బృహత్తరమైన ప్రాజెక్ట్‌ను చేపట్టింది సాహి. సహాయం పొందండి ఇలా... వినికిడి సమస్యలతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంతపు ఆడపిల్లలలో వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించేందుకు ‘సాహి’ నిశ్చయించుకుంది. ఈ సమస్యలతో బాధపడుతున్న పదిహేనేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులు సాహీని సంప్రదించవచ్చు. ‘సాహీ’ ఫోన్ నెంబర్లు 040-23607777 ఎక్స్టెన్షన్ 3737/ 5805. మొబైల్ నెం. 9949044276. ఈ ఫోన్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఇక ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలంటే sahiearcare2004 @gmail.com కు తమ విజ్ఞాపనలు పంపవచ్చు. సాహి వెబ్సైట్ చిరునామా: www.sahiearcare.org. -
కొండంత వ్యాధికి మెండైన చికిత్స!
మెడికల్ మెమరీస్ కొండాలు ఊరు గుంటూరు జిల్లాలోని పెదకాకాని. పేరుకు తగ్గట్టుగానే ఆయన కొండల్లాంటి బరువులను అలవోకగా మోస్తుంటాడు. తానో ముఠామేస్త్రి. పొగతాగడం వంటి దురలవాట్లేమీ లేవు. రక్తపోటూ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక జబ్బులూ లేవు. ఇంట్లోని రెండు పాడిగేదెల నుంచి రోజూ పాలు పితికేస్తాడు. జీవితంలోని ఆనందాలను పిండేస్తూ బతికేస్తాడు. కుటుంబసభ్యుల వెతలను తీర్చేస్తాడు. ఇదీ కొండాలు జీవనశైలి. ఒక రోజున 50 కిలోల బియ్యం మూట మోస్తుంటే అకస్మాత్తుగా ఛాతీలో కలుక్కుమంది. చిన్ననొప్పేకదా అని పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత తెలిసింది... కొండాలుకు వచ్చింది కొండంత కష్టమని! మూడునాలుగు రోజుల్లోనే గుండె నొప్పి హెచ్చింది. ఆయాసం పెరిగింది. గుంటూరు పెద్దాసుపత్రిలో చూపించాడు. డాక్టర్లు పరీక్ష చేసి ‘అయోర్టిక్ డిసెక్షన్’ అని నిర్ధారించారు. అంటే... గుండె నుంచి అన్ని అవయవాలకూ రక్తాన్ని సరఫరా చేసే బృహద్ధమని గోడలు చిట్లిపోయాయి. ఆ చిట్లిన చోట్ల రక్తం చేరి గడ్డకడుతుంది. దాంతో ఇతర అవయవాలకు జరగాల్సిన రక్తసరఫరాకు అడ్డుకట్ట పడుతుంది. ఫలితంగా ఆయా అవయవాలు చచ్చుబడిపోయే ప్రమాదముంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ‘ప్రాణాంతకమైన వ్యాధి’. కొండాలు వ్యాధి తీవ్రత పెరుగుతూ పోతోంది. బాధ తగ్గడం కోసం ఎక్కని మెట్టూ లేదు. మొక్కని చెట్టూ లేదు. ఎవరూ భరోసా ఇవ్వడం లేదు. ఎక్కడా థిలాసా కలగడం లేదు. విజయవాడ వెళ్లి సంప్రదిస్తే ‘ఈ చికిత్సకు ఆపరేషన్ ఒక్కటే మార్గం. కానీ భారతదేశంలోనే ఈ తరహా ఆపరేషన్లు చాలా అరుదు. అది కూడా చాలా ఖరీదు’ అన్నారు డాక్టర్లు. మరో పదిరోజులు గడిచాక అయోర్టిక్ డిసెక్షన్ తీవ్రత మరింత పెరిగింది. ఎడమ మూత్రపిండానికి రక్తప్రసరణ ఆగిపోయింది. ఎడమకాలికీ రక్తప్రవాహం నిలిచిపోయింది. పరిస్థితి కిడ్నీ ఫెయిల్యూర్ వరకూ రావడంతో కొండాలు ఆయుష్షు ఇక రోజులేనని తేల్చేశారు అక్కడి డాక్టర్లు. ఈలోగా కొండాలు తమకు దగ్గరి బంధువైన డాక్టర్ సుజాతను కలిశాడు. సుజాత గన్నవరం దగ్గరి పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్. ఆమె తండ్రికి గతంలో నేను యాంజియోప్లాస్టీ చేశాను. నామీది గురితో ఒకసారి నన్ను సంప్రదించమని చెప్పిందామె. ఐదేళ్ల క్రితం అంటే... 2010లో కొండాలు నన్ను కలిసేనాటికి ఆ వ్యాధి ఎంతగా ముదరిందంటే శస్త్రచికిత్సతో దాన్ని తగ్గించడం ఇక అసాధ్యం అని తేలిపోయింది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలేమిటని వెతకడం మొదలుపెట్టాను. 2010కి ముందు కొందరిలో ఈ వ్యాధిని స్టెంట్ వేసి తగ్గించిన దాఖలాల గురించి నేను పరిశోధన పేపర్లలో చూసి ఉండటంతో ఆ దిశగా ఓ ప్రయత్నం చేద్దామని అనుకున్నా. కానీ అయోర్టిక్ డిసెక్షన్ కేసుల్లో బృహద్ధమనికి స్టెంట్ వేసి నయం చేయవచ్చని పుస్తకాల్లో చదివానే తప్ప ఆ తరహా చికిత్స ఎప్పుడూ చేయలేదు. పైగా ఎడమ మూత్రపిండానికీ, కాలికీ రక్తప్రసరణ ఆగడంతో కేసు మరీ సంక్లిష్టమైంది. అయినా ఒక ప్రయత్నం చేసి చూద్దామనే నా సంకల్పం. కొన్ని సందేహాలు వస్తే బెంగళూరులోని సీనియర్ వైద్యుల సలహాలు తీసుకున్నాం. మర్నాడు స్టెంట్ అమరిక ఆపరేషన్‌కు సర్వవిధాలా సన్నద్ధమయ్యాం. ఈ ప్రయత్నంలో నా సహచరవైద్యుడూ చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ వెంగళరెడ్డి సహకారం మరువలేనిది. ముందుగా కుడికాలి రక్తనాళం ద్వారా బృహద్ధమని వరకూ చేరదామని ప్రణాళిక వేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అక్కడివరకూ చేరలేకపోయాం. వెంటనే చేతి ధమని (రేడియల్ ఆర్టరీ) ద్వారా మళ్లీ ప్రయత్నించాం. ఈసారి సరైన చోటికే చేరాం. బృహద్ధమనిలో అవసరమైన ప్రదేశంలో స్టెంట్ వేశాం. ఆపరేషన్ విజయవంతమైంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడంతో కేవలం 60 నిమిషాల్లో ఆపరేషన్ పూర్తయ్యింది. కొండాలు గుండెలోని అడ్డుతో పాటూ... మా గుండెల్లోని బరువూ తొలగిపోయింది. మూడు నెలల తర్వాత సీటీ స్కాన్ తీసి చూస్తే కిడ్నీకీ, కాలికీ రక్తప్రసరణ పూర్తిగా పునరుద్ధితమైంది. ఆపరేషన్ అయ్యాక ఐదు రోజుల తర్వాత సురక్షితంగా ఇంటికి వెళ్లిన కొండాలు ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఒకసారి సాధారణ చెకప్ కోసం నా దగ్గరికి వచ్చాడు. కొండాలు మాట ఎలా ఉన్నా అత్యంత అరుదైన వ్యాధికి, అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను అత్యంత సులువు చేసి, ఆయన్ని బతికించినందుకు నాకు కొండంత ఆనందం! నిర్వహణ: యాసీన్ కొండాలు వ్యాధి తీవ్రత పెరుగుతూ పోతోంది. బాధ తగ్గడం కోసం ఎక్కని మెట్టూ లేదు. మొక్కని చెట్టూ లేదు. ఎవరూ భరోసా ఇవ్వడం లేదు. -
మృత్యువు ముంగిట్లోంచి కాలేజీ గేట్లోకి...
మెడికల్ మెమరీస్ ఆరోజు తన పనులన్నీ వేగంగా ముగించుకొని సాయంత్రం ఆరింటికల్లా ఆసుపత్రి నుంచి బయటపడ్డారు డాక్టర్ ప్రసాద్‌బాబు. మరో గంటలో ఆయన విమానాశ్రయంలో ఉండాలి. మర్నాడు బెంగళూరులో జరుగుతున్న వైద్యుల కాన్ఫరెన్స్‌కు హాజరు కావాలి. ఆరోజే శ్యామ్(పేరు మార్చాం) ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన మొదటిరోజు. కాలేజీ నుంచి ఇంటికి చేరాల్సిన కుర్రాడు క్యాజువాలిటీలో చేరాడు! అతడి బైకును ఏదో వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగులో పడి ఉన్న శ్యామ్‌ను కొందరు దగ్గరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం పెద్దాసుపత్రికి తరలించాలని సూచించడంతో శ్యామ్‌ను ‘యశోద’కు తెచ్చారు. ఎడతెరిపి లేకుండా రక్తస్రావం జరుగుతోంది. బతుకుతాడనే ఆశ లేదు. విమానాశ్రయంలో ఉన్న ప్రసాద్‌బాబుకు కబురు వెళ్లింది. ఇంకొన్ని క్షణాల్లో విమానంలో ఉండాల్సిన ఆయన, కొద్దిసేపటికి శ్యామ్ పక్కన ఉన్నారు. స్కానింగ్ రిపోర్టులను పరిశీలించారు. కాలేయంలో ఒక రక్తనాళం చిట్లి రక్తం కారుతోంది. కటివలయంలోని ఎముకల్లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఎడమకాలి తొడలో రక్తనాళం దెబ్బతింది. ముందు రక్తం ఎక్కించడం ప్రారంభించారు డాక్టర్లు. న్యూరోసర్జన్ వచ్చి తలకు గాయాలేమైనా ఉన్నాయా అని పరిశీలించారు. బలమైన గాయాలేమీ తగల్లేదు. కాకపోతే డాక్టర్ల ప్రయత్నాలకు రోగి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో తక్షణం ఏమీ చెప్పలేని పరిస్థితి. శ్యామ్ మంచి అథ్లెట్. ఫుట్‌బాల్ ప్లేయర్. అప్పటికే అక్కడవున్న తల్లిదండ్రులు కొడుకును అలా అచేతనంగా చూడలేకపోతున్నారు. వివిధ వైద్యప్రక్రియల్లో నైపుణ్యం ఉన్న 20 మంది సూపర్ స్పెషలిస్టుల బృందం రంగంలోకి దిగింది. రక్తస్రావాన్ని నిలువరించేందుకు అత్యంత అరుదుగా ఉపయోగించే ఇంజెక్షన్లను అప్పటికే రెండింటిని వాడారు. కాసేపటికి రక్తస్రావం ఆగడంతో బీపీ ఆనవాళ్లు కనిపించడం మొదలయ్యాయి. దాంతో మరింతగా పురోగమించారు డాక్టర్లు. రోగి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ సర్జరీ చేసి కాలేయంలో, తొడలో దెబ్బతిన్న రక్తనాళాలను సరిచేయడం అసాధ్యం. ఇక ప్రత్యామ్నాయం కేవలం ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రో సర్జరీ. ప్రసాద్‌బాబు వెంటనే శ్యామ్‌ను వెంటిలేటర్‌పైనే ఉంచి ఐసీయూ నుంచి క్యాథ్‌ల్యాబ్‌కు తరలించారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు సహాయంతో కాలేయంలోని రక్తనాళాన్ని పూడ్చగలిగారు. ఇప్పుడు మరో సవాలు. తొడలో చిట్లిన రక్తనాళాన్ని పూడ్చేందుకు ప్రత్యేకమైన కవర్డ్ స్టెంట్ అమర్చడమే ఏకైక మార్గం. అవి అందుబాటులో లేవు. అన్ని చోట్లా వాకబు చేస్తే, కేవలం ఒకరి దగ్గర, అదీ ఒక్కటంటే ఒక్కటే ఉందని తెలిసింది. అప్పటికే అర్ధరాత్రి దాటింది. ఆ వేళలో ఆ డీలర్‌ను నిద్రలేపి, షాప్‌ను తెరిపించి, స్టెంట్ తెచ్చేందుకు అంబులెన్స్ ఆగమేఘాల మీద వెళ్లింది. వచ్చిన పదిహేను నిమిషాల్లో స్టెంట్ అమరిక విజయవంతంగా పూర్తయ్యింది. తెల్లవారుజామున శ్యామ్ పరిస్థితిలో ఆశాజనకమైన పురోగతి కనిపించింది. ఈలోపు డాక్టర్ల బృందం ఓపెన్ సర్జరీకి రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా కాలేయంలో దెబ్బతిన్న రక్తనాళాన్ని సంపూర్ణంగా మరమ్మతు చేశారు. పనిలోపనిగా పగిలిన మూత్రాశయాన్నీ సర్జరీ ద్వారా రిపేరు చేశారు. రెండు రోజుల తర్వాత శ్యామ్ మెల్లగా కళ్లు తెరిచాడు. ప్రసాద్‌బాబు బృందం హాయిగా నిట్టూర్చింది. ఏడు రోజుల తర్వాత వెంటిలేటర్ తొలగించారు. ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు. ప్రాణమైతే దక్కింది. కానీ శ్యామ్ మంచి ప్లేయర్. అతడు మునుపటిలా ఆడగలడా? కనీసం నడవగలడా? ఈ దశలో ఆర్థోపెడిక్ సర్జన్లు రంగంలోకి దిగారు. కటివలయానికి మల్టిపుల్ ఫ్రాక్చర్లు అయిన చోట వాటిని కలుపుతూ శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత రీహ్యాబిలిటేషన్ చికిత్సలూ, ఫిజియో ప్రక్రియలూ మొదలయ్యాయి. తన విల్పవర్తో తిరిగి కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాడు శ్యామ్. మళ్లీ ఇవాళ్టికి వస్తే... ‘ఇది టీమ్ విజయం. ఆరోజున 20 మంది డాక్టర్లూ, 100 మందికి పైగా పారామెడికల్ సిబ్బందీ అవిశ్రాంతంగా కష్టపడ్డాం. అతడికి కొత్త జీవితం అందించగలిగాం’. తన జీవితంలోని అత్యంత సంక్లిష్టమైన కేసును గుర్తుతెచ్చుకుంటూ డాక్టర్ ప్రసాద్‌బాబు చెప్పే మాట ఇది. - యాసీన్ -
మనసంతా... బేబీ శాంటా
మెడికల్ మెమరీస్ మామూలుగానైతే బర్త్‌డే బాయ్‌కు కదా ఎవరైనా కానుకలిస్తారు! కానీ ఇక్కడ రెండేళ్ల పిల్లాడు ఇచ్చిన అపురూప కానుకల కథ ఇది. కథలా అనిపించే వాస్తవ గాథ ఇది! ఆరోజు ఆరింటికే లేచింది మాధవి. అవాళ్ల తమ నోములపంట అరుణ్ బర్త్‌డే. ఇది రెండో పుట్టినరోజు. మొదటి జన్మదినం రోజు భర్త దూరంగా భారత్-చైనా సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్నాడు. అందుకే జరపలేదు. ఈసారి భర్త మనీష్ ఉన్నాడు. పైగా ఈ వేడుక కోసమే హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరంలోని చిన్న ఊరి నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని బొండిలా అనే ఊరికి వచ్చారు మాధవి తల్లిదండ్రులు. అది నవంబర్ మాసం. కిటికీలోంచి చల్లగా వీస్తోంది కొండగాలి. టీ కాచుకొని, ఆ తెమ్మెరలను చాయ్‌తో పాటూ ఆస్వాదిస్తోంది మాధవి. ఇంతలో భర్త మనీష్, రెండేళ్ల అరుణ్ కిచెన్‌లోకి ఒకేసారి వచ్చి మాధవి కళ్లుమూశారు. నవ్వుతూ పేర్లు చెప్పింది మాధవి. ఓ పక్క మనీష్, మరో పక్క మాధవి... ఇద్దరూ అరుణ్‌కు ముద్దులతో బర్త్‌డే విషెస్ కూడా చెప్పారు. సాయంత్రం త్వరగా వచ్చేస్తానంటూ వెళ్లాడు మనీష్. అమ్మమ్మ, తాతయ్య తెచ్చిన ఆటబొమ్మతో బాల్కనీలో ఆడుకుంటున్నాడు అరుణ్. ఇల్లంతా కలియ దిరిగి వంట మొదలు పెట్టింది మాధవి. కిటికీలోంచి చూస్తే బాల్కనీలోని పిల్లాడు కనిపించలేదు. ‘అమ్మా, నాన్నా లేచి ఉంటారు. అరుణ్‌ను ఆడిస్తూ ఉండి ఉంటారు’ అనుకుంది. అరగంటైంది. అమ్మానాన్నల గదివైపు చూసింది. వాళ్లింకా నిద్రపోతున్నారు. గబగబా బాల్కనీలోకి వచ్చింది. గుండె గతుక్కుమంటుండగా కిందికి చూస్తే రక్తపుమడుగులో అరుణ్! కెవ్వుమన్న కేక ఈశాన్యపర్వతాలను తాకి ప్రతిధ్వనించింది. ఉలిక్కిపడి లేచిన తాతయ్య, అమ్మమ్మ పరుగున వెళ్లారు. బాల్కనీ నుంచి పడిపోయినట్టున్నాడు! తలకు గాయం. కొడుకును పొదువుకొని, దగ్గర్లోని ఆసుపత్రికి పరుగెత్తింది మాధవి. ఒళ్లింకా వెచ్చగానే ఉండటం, గుండె స్పందనలు కనిపిస్తూ ఉండటంతో డాక్టర్లు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. కానీ తలకు బలమైన గాయం. ఒళ్లంతా మల్టిపుల్ ఫ్రాక్చర్స్. ఎనిమిది గంటల సుదీర్ఘ ప్రయాస తర్వాత విధి ముందు విధి లేక డాక్టర్లు తలవంచారు. ఆసుపత్రికి చెందిన ట్రాన్స్‌ప్లాంట్ కో-ఆర్డినేటర్ మాధవీ-మనీష్ వద్దకు వచ్చాడు. జరిగిన విషాదానికి సానుభూతి తెలిపాడు. విధి నిర్వహణలో భాగంగా భారమైన హృదయంతోనే ఆ రెండేళ్ల బాలుడి అవయవాలు దానం చేస్తారా అని మెల్లిగా అడిగాడు. అరుణ్ తల్లిదండ్రులు డీప్ షాక్‌లో ఉన్నారు. కాసేపటి తర్వాత... అవయవ దానానికి వాళ్లు అంగీకరించారు. అరుణ్ నిర్జీవ శరీరంలో గుండె స్పందనలను గ్రాఫ్‌లో చివరిసారిగా చూసి మళ్లీ భోరుమంది మాధవి. కానీ ఎవరి శరీరంలోనో ఆ గుండె అలా స్పందిస్తూ... ఆ గ్రాఫ్ అలాగే కొనసాగుతూ ఉంటుందని హామీ ఇచ్చాడా కో-ఆర్డినేటర్. అంతేకాదు, అరుణ్ ఊపిరితిత్తులు మరొకరికి హాయి శ్వాసనిస్తాయి. అతడి కళ్లు మరిద్దరి రేయి చీకటిని దూరం చేస్తాయి. అతడి ప్యాంక్రియాస్... నిత్యం ఇంజెక్షన్ సూదితో ఒంటిని పొడుచుకునే ఓ శరీరానికి సాంత్వన ఇస్తాయి అని ఓదార్చాడు. ఈ సంఘటనకు సాక్షి డాక్టర్ సహారియా. ఒక రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ఒకవేళ ఇదే కేసులో మూత్రపిండాన్ని గనక మరొకరికి తానే అమర్చాల్సి వస్తే? అప్పుడు ఆయన తనకు తాను వేసుకున్న ప్రశ్న: ‘‘నా రెండు కనుల చివర కన్నీళ్ల జల్లులు. ఆ కంట కారేది అరుణ్ పట్ల విలాప విషణ్ణ విషాదాశ్రువులా? లేక, మరో రెండేళ్ల చిన్నారికి కొత్త జీవితం ప్రసాదిస్తున్నందుకు స్రవిస్తున్న ఆనందబాష్ప కణాలా?’’ - యాసీన్ -
ఊపిరి బిగపట్టిన రోజు...
మెడికల్ మెమరీస్ ఊపిరితిత్తుల మార్పిడి చాలా అసాధారణమైన, అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ.మన దేశంలో ఇదివరకు ఇలాంటివి కేవలం రెండుసార్లే జరిగాయి. అలాంటి అరుదైన మూడో కేసు గురించి ఈ వారం... - యాసీన్ సెప్టెంబర్ 8, 2012... నిజానికి ఆ రోజు 34 ఏళ్ల అర్చనా షెగ్డే పుట్టిన రోజు కాదు. కానీ పునర్జన్మ పొందిన రోజు. అర్చన స్వస్థలం పుణే. మంచి భర్త, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, ఆనందకరమైన జీవితం. కానీ ఆ జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. చుట్టూ గాలి ఉన్నా శ్వాస పీల్చుకోలేక అర్చన అల్లల్లాడేవారు. పుణేలో ఎక్కని ఆస్పత్రి గడప లేదు. ఆఖరికి ముంబైకి తీసుకెళ్తే తేలిన విషయం... ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయి. ఇంటర్‌స్టిషియల్ ఫైబ్రోసిస్! అవి ఎంతగా ఘనీభవించాయంటే... రక్తంలోకి తగిన ఆక్సిజన్‌ను పంపడానికి ఏమాత్రం స్పందించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఊపిరి అందక, రక్తంలో తగినంత ఆక్సిజన్ లేక రోగి క్రమంగా మరణానికి చేరువవుతారు. ఈ వ్యాధికి మందులేవీ పనిచేయవు. బతకాలంటే ఒక్కటే మార్గం... ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స! అర్చన కుటుంబసభ్యులు దేశమంతా గాలించి, చివరకు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను సంప్రదించారు. గోఖలే అరుదైన గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన అనుభవజ్ఞులు. అయితే, ఇక్కడ అనుభవం ఒక్కటే చాలదు, దాత కూడా కావాలి! గోఖలే సూచనల మేరకు అర్చనను హైదరాబాద్ తరలించారు. ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు అవసరమైన అన్ని పరీక్షలూ నిర్వహించారు. అమెరికాలోని హ్యూస్టన్, టెక్సాస్‌లోగల ‘డిబాకే హార్ట్ లంగ్ సెంటర్’లోని లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శస్త్రచికిత్స గురించి చర్చించారు. ‘తుదిపరీక్ష’ కోసం నిర్దిష్టమైన వ్యూహం రచించుకున్నారు. ఇక, దాత దొరకడమే తరువాయి! రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ! రోజులు గడుస్తున్నకొద్దీ రోగి పరిస్థితి దిగజారుతోంది. కుటుంబ సభ్యుల్లో ఆశ సన్నగిల్లుతోంది. సరిగ్గా అలాంటి సమయంలో, అంటే సెప్టెంబర్ 8, 2012న మెదడులో తీవ్ర రక్తస్రావంతో ఒక మహిళ బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా గోఖలే బృందానికి సమాచారం అందింది. జీవన్మృతురాలి అవయవాలు దానం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఒక ఆశారేఖ మెరిసింది. అర్చన ప్రాణరక్షణ లక్ష్యంతో గోఖలే బృందం దీక్షాకంకణం ధరించింది. యుద్ధప్రాతిపదికన 60 మంది నిష్ణాతులైన వైద్యులు, సాంకేతిక నిపుణులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, చివరికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌తో సహా అన్ని విభాగాలకూ చెందిన ఉద్యోగులంతా ఊపిరి బిగబట్టి పనిచేశారు. ఆపరేషన్ సమయంలో పేషెంట్ శారీరక నిర్మాణపరమైన అవరోధాల వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఓర్పుతో, నేర్పుతో వాటిని అధిగమిస్తూ సర్జరీ కొనసాగింది. పాడైపోయిన ఊపిరితిత్తులను తొలగించి ఆ స్థానంలో కొత్తవాటిని అమర్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన క్రతువు మర్నాడు ఉదయం 10 వరకు సాగింది. ఒక అంకం సంతృప్తికరంగా పూర్తయ్యింది. అసలు సమస్య ముందుంది. కొత్తగా తనలోకి ప్రవేశించిన అవయవాన్ని ఆమె శరీరం ఆమోదిస్తుందా, లేదా? మర్నాడు ఉదయం అర్చన హాయిగా ఊపిరి తీసుకున్నారు. శస్త్రచికిత్సకు కార్యక్షేత్రమైన ‘యశోద’ బృందం కూడా ఊపిరి పీల్చుకుంది. దేశంలో మూడవదైన ఈ తరహా ఆపరేషన్... రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన తొలి శస్త్రచికిత్స కావడం మరో విశేషం! -
మతసామరస్య అంబాసిడర్
కాకి అంత బద్నామ్ అయిన పక్షి మరోటి లేదు. కానీ దానంతటి ఉదాత్తమైన జీవి కూడా ఇంకోటి లేదని నా అభిప్రాయం. ‘ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలకూడదం’టూ పలుకుబళ్లు గలవాళ్లు సామెతలు సృష్టించి విరోధాలకూ, వివాదాలకూ, శత్రుత్వాల సూచనలకూ గల నుడి‘కారాల’ ఘాటును అమాయకమైన కాకులకు ఆపాదించారు. కానీ హైదరాబాద్ నగరం మాత్రం కాకిని నెత్తిన పెట్టుకుంది. నగరంలో ప్రధానమైన అన్ని వర్గాల వారికీ అత్యంత ప్రియమైన పక్షి కాకి. ‘పితరుడని తలపోసి పిండాలను కాకులకు పెడతారా’ అంటూ ప్రజాకవి వేమన గద్దించినా సరే... మనం నివాళులర్పిస్తూ చనిపోయినవారికి తినిపించాలనుకున్న భోజ్యాలూ, ఖాద్యాలూ, అన్నాల వంటి వాటికి పిండాలని పేరు పెట్టి, వాయసానికి వాయనాలందించి, వాటిని అవి ముట్టితే చాలు... సాక్షాత్తూ పెద్దలకే వాటిని రుచి చూపించినట్లు భావిస్తారు ఒక వర్గానికి చెందిన ప్రజలు. మరి ఇంకో వర్గానికి చెందినవారు కూడా కాకిని సేమ్ టు సేమ్ గాకపోయినా దాదాపు అదే లైన్స్‌లో గౌరవిస్తుంటారు. తమ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోయినా, చిన్న పిల్లలకు జబ్బు చేసినా, వాళ్లు మంకుపట్టు పట్టి చికాకు పెడుతున్నా వాటిని వదిలించేది వాయసమేనంటూ మన డాక్టర్ కాకి సహాయం తీసుకుంటుంటారు. చార్మినార్ పక్కనే ఉన్న చౌక్‌లో కాకుల్ని అమ్ముతుంటారు. ఇలా జబ్బు చేసినవాళ్లూ, చిన్నపిల్లల మితిమీరిన మంకుపట్టును భరించేలేనివాళ్లూ, తమ పిల్లాడికి దిష్టిఘాతం ముష్టిఘాతమంత పవర్‌ఫుల్‌గా తగిలిందేమోనంటూ ఆందోళనపడేవాళ్లంతా ఈ కాకుల్ని కొనుక్కుంటారు. పిల్లాడి చేతిని కాకికి తాకించి లేదా ఆ కాకిని దిష్టితీసినట్లుగా పిల్లాడిపైనుంచి తిప్పేసి మళ్లీ స్వేచ్ఛగా గాల్లోకి వదిలేస్తుంటారు. దాంతో ఆ అనారోగ్యం, ఆ మంకుపట్లు, ఆ దిష్టిఘాతాలన్నీ వయా కాకిద్వారం ద్వారా గాల్లో కలిసిపోతాయని మరోవర్గం వారి బలమైన నమ్మకం. నల్లటి దాని వర్ణంతో మొబైల్ దిష్టి చుక్కలా అది ఎగురుతూ అన్ని అనారోగ్యాలనూ ఆవలకు తోలేస్తుందని ఈ వర్గం వారి విశ్వాసం. ఇలా నగరంలోని రెండు ప్రధాన వర్గాల మధ్యా వైషమ్యాలవీ ఉన్నాయంటూ పొడుగు పొడుగు నిట్టూర్పులు విడుస్తూ, భారంగా డైలాగులు చెబుతూ జాతీయ సమగ్రతా, మతసహనం, ఇరుమతాల మధ్య సయోధ్యకు కృషి అంటూ చాలా సంస్థలు మీటింగులు పెట్టి మరీ ఊకదంపుడుగా ఉపన్యాసాలెన్నో ఇస్తుంటాయి. కానీ.. మా కాకిమాత మాత్రం సెలైంట్‌గా సామరస్యం కోసం ఇరువర్గాల కోసం ఒకే లైన్లో తన వంతు కృషి చేస్తోంది. ఎందరెందరో ఫిల్మ్ స్టార్లూ, స్పోర్ట్ స్టార్లూ, క్రికెట్టూ, టెన్నిస్సూ గిన్నీస్సూ ఇత్యాది ప్లేయర్లూ కోట్లకొద్దీ రూపాయలు తీసుకుని బ్రాండ్ అంబాసిడర్ పనులు చేస్తుంటారేమోగానీ... పైసా పారితోషికం తీసుకోకుండా హైదరాబాద్‌లో మతసామరస్యపు బ్రాండ్ అంబాసిడర్ విధులు నిర్వహిస్తున్న ఏకైక పక్షి... మా కాకి మాతల్లి. - యాసీన్ -
ఖలేజా ఆపరేషన్
శస్త్రచికిత్స జరిగిన నాలుగు వారాల తర్వాత లక్ష్మయ్యతో గ్లోబల్ హాస్పిటల్ కాలేయ శస్త్రచికిత్స విభాగపు అధిపతి, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ టామ్ చెరియన్ కాలేయంలోని ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే, ఆ వచ్చిన మేరకు తొలగిస్తే మిగతా భాగం మామూలుగానే పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఇటు ఎడమవైపు తమ్మెకూ, అటు కుడివైపు నాళంమీదా క్యాన్సర్ వ్యాపించింది. మెడికల్ వండర్ ఒక రోజు లక్ష్మయ్య హాస్పిటల్‌కు వెళ్లాడు. వయసు 60 ఏళ్లు. మహబూబ్‌నగర్ జిల్లా. ఆయన కళ్లు పచ్చగా ఉన్నాయి. జ్వరం ఉంది. రెండు నెలలలో నాలుగైదు కిలోల బరువు తగ్గాడు. అంతకుమించి వేరే లక్షణాలేమీ లేవు. ఆయన పొగతాగడు. మద్యం అలవాటు లేదు. పొట్ట పలుచగా ఉంది. పై నుంచి చూస్తే అంతా మామూలే. కానీ, సీటీ స్కాన్ తీస్తే... ఆశ్చర్యం... ఆయన ‘హైలార్ కొలాంజియో కార్సినోమా’ లేదా ‘బైల్ డక్ట్ మ్యాలిగ్నెన్సీ’ వ్యాధితో బాధపడుతున్నాడు. అది తీవ్రమైనదిగా పరిగణించే క్యాన్సర్లలో ఒకటి! కాలేయానికి రెండు తమ్మెలుంటాయి. ఎడమ వైపు తమ్మె నుంచి రక్తం తీసుకుపోవడానికి ‘లెఫ్ట్ పోర్టల్ వీన్’ రక్తనాళం ఉంటుంది. కుడి తమ్మెకు రక్తం అందించేందుకు ‘రైట్ హెపాటిక్ ఆర్టరీ’ రక్తనాళం ఉంటుంది. కాలేయం చూడటానికి ఎర్రగా ఎందుకు కనిపిస్తుందో తెలుసా? అది శరీరంలోని అతి పెద్ద గ్రంథి. కీలకమైన కార్యాలు నెరవేరుస్తుంటుంది. అత్యంత ప్రాధాన్యంతో దానికి ఎక్కువమొత్తంలో రక్తసరఫరా అవుతుంటుంది. అందువల్లే ఎర్రగా కనిపిస్తుంది. అది కూడా అంతే తీవ్రంగా పనిచేస్తూ... కొన ఊపిరి దొరికే వరకూ లక్షణాలను కనిపించనివ్వదు. అందుకే తీవ్రమైన క్యాన్సర్‌కు గురైనా లక్ష్మయ్యలో లక్షణాలేవీ బయటపడలేదు. కాలేయంలోని ఏదైనా భాగానికి క్యాన్సర్ వస్తే, ఆ వచ్చిన మేరకు తొలగిస్తే మిగతా భాగం మామూలుగానే పెరుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి అదికాదు. ఇటు ఎడమవైపు తమ్మెకూ, అటు కుడివైపు నాళంమీదా క్యాన్సర్ వ్యాపించింది. కొంతమేర తొలగించే అవకాశం ఇక్కడ లేదు. కానీ కాలేయం లేదంటే ప్రాణమే లేదని అర్థం. మరి పూర్తిగా తొలగించాలంటే కాలేయాన్ని ఇచ్చే దాత ఉండాలి. దాత దొరకడం, ఆయన ఇచ్చిన కాలేయం సరిపోలడం, దీనికి పెద్దమొత్తంలో అయ్యే ఖర్చు... అన్నీ సవాళ్లే! ఏం చేద్దామిప్పుడు? డాక్టర్ల బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ టామ్ చెరియన్ ఒక ప్రణాళిక రచించారు. దీని ప్రకారం, ఎడమవైపు రోగగ్రస్థమైన కాలేయపు తమ్మెను తొలగించాలి. అయితే, కుడిైవైపున రోగగ్రస్థం కాని తమ్మెను అలాగే ఉంచాలి. కానీ పాడైన రక్తనాళాలను మాత్రం తొలగించాలి. మరి ఆ భాగానికి రక్తసరఫరా కావాలి కదా! అందుకోసం ఇతర ప్రాంతాలనుంచి ఆరోగ్యకరమైన రక్తనాళాలను తెచ్చి, తొలగించినవాటి స్థానంలో అమర్చాలి. మరి రక్తనాళాలు దొరకవు కదా! అంటే, కుడివైపు తమ్మెకు పాత రక్తనాళాలతోనే మంచి రక్తం అందాలి. సంక్లిష్ట ఆపరేషన్ అనుకున్నంత సులభం కాదు. అయినా సాధ్యంచేశారు. ఎడమవైపున ఎనిమిది సెంటీమీటర్ల కాలేయపు తమ్మెను తొలగించారు. ఇటు రోగగ్రస్థమైన రక్తనాళాలనూ తొలగించారు. అటు వైపున ఆరోగ్యకరమైన రక్తనాళాలున్నాయి కదా! వాటిని తొలగించకుండా ఉంచిన ‘ఆరోగ్యకరమైన కాలేయపు తమ్మె’కు రక్తం అందేలా అనుసంధానించారు. ఇంతటి సంక్లిష్టమైన ఆపరేషన్‌కు తొమ్మిది గంటలు పట్టింది. రోగిని ఐసీయూలో ఉంచి జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. తొలిదశలో కొద్దిరోజులు రక్తసరఫరాను యంత్రాల సహాయంతో చేశారు. ఆ తర్వాత అతడికి అమర్చిన వైద్య పరికరాలను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ వచ్చారు. ఎట్టకేలకు కాలేయం ఇచ్చే దాత లేకుండానే, కొత్త కాలేయం అమర్చకుండానే, కొత్తదాన్ని అమర్చినంత పనిచేశారు. ఇక్కడ ఒక అంశం స్పష్టం చేయాలి. వైద్యుల నైపుణ్యం, సృజనతో కాలేయ మార్పిడి చేయకుండానే, చేసినప్పటి సాఫల్యాన్ని సాధించారన్నమాట! మనం భిన్న అర్థంలో వాడే ఖలేజా అనే మాటకు కాలేయం అని కూడా అర్థం. అలా ఇది ఖలేజా ఉన్న వైద్యుల వాస్తవగాథ! - యాసీన్ -
అమ్మ కడుపే ఆపరేషన్ టేబుల్!
మెడికల్ వండర్ కాబోయే ఆ తల్లి గుండె గతుక్కుమంది. కడుపులో ఉన్న చిన్నారి గుండె బాగాలేదని తెలిసింది. శిరీష కడుపులోని నలుసు వయసు 23 వారాలే! అయితే, శిరీషకు అప్పటికే ఓ గైనిక్ సమస్య వచ్చింది. అబార్షన్ జరగకుండా గర్భాన్ని నిలపడానికి శస్త్రచికిత్స జరిగింది. గండం గడిచిందనుకుంటే మళ్లీ పిండానికి గుండెజబ్బు! పాతికేళ్ల శిరీష రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ గ్రామంలో సైన్స్ టీచర్. గర్భవతి కాబట్టి రొటీన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుంది. ‘ఆయోర్టిక్’ కవాటంలో లోపం వల్ల పిండం గుండె ఎడమవైపు కింది గదిలోని రక్తం పంప్ కావడం లేదని తేలింది. సమస్య అక్కడితో ఆగిపోలేదు. మైట్రల్ వాల్వ్ కూడా లీకవుతోంది. వీటివల్ల గుండె ఎడమవైపున ఉండే గదులు కుంచించుకుపోతున్నాయి. బిడ్డ హృదయం విశాలం చేయమంటున్న తల్లి వేదన డాక్టర్ల హృదయాలను కదిలించింది. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి హృద్రోగ నిపుణులు సోమరాజు, చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల స్పెషలిస్ట్ కె.నాగేశ్వరరావు ప్రత్యేక ఆపరేషన్‌కు సంకల్పించారు. చిన్న కత్తెర్లు కావాలి కడుపులో ఉండగానే చిన్నారికి చికిత్స చేద్దామన్నది డాక్టర్ల ఆలోచన. శస్త్రచికిత్సకు మామూలుగా వాడే ఉపకరణాలు సరిపోవు. చిన్నారి పిండానికి గాటు పెట్టేంత చిన్ని చిన్ని కత్తెర్లు కావాలి. అంత చిన్న గుండెలోకి ప్రవేశపెట్టేంత అతి సన్నటి నాళాలు తేవాలి. అక్కడికి వెళ్లాక అడ్డంకులను వెడల్పు చేసే ప్రత్యేక బెలూన్లు సమకూర్చుకోవాలి. ఇవి ప్రత్యేకంగా రూపొందించుకోవడం ఒక ఎత్తై, ఆర్థిక వనరులను సమీకరించుకోవడం మరో సవాలు. వాటన్నింటినీ కలగలుపుకొని తమ నైపుణ్యాలను అత్యంత శిఖరాగ్ర స్థాయిలో ప్రదర్శించడం మరో ఎత్తు! డాక్టర్లకు ఆపరేషన్ థియేటర్లో సహాయం చేయడానికి అవసరమైన సిబ్బందికి అదనపు శిక్షణ అవసరం. తొలి ప్రయత్నం విఫలం ఆపరేషన్ చేస్తున్న నాగేశ్వరరావుకు బాసటగా డాక్టర్లు మాల్జినీ, కామశ్రీ, సాయిలీల, జగదీశ్, టీవీఎస్ గోపాలు, విద్యాసాగర్, కమల, ఇతర సాంకేతిక సిబ్బందితో పాటు మరో పన్నెండు మంది డాక్టర్ల బృందమూ ముందుకొచ్చింది. పిండం 26 వారాల వయసున్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. పిండం అనుకూల దిశలో తిరిగి లేనందువల్ల ఆ ప్రయత్నం విఫలమైంది. కాబోయే తల్లిదండ్రులు నిరాశపడ్డా, డాక్టర్ల సంకల్పం సడలలేదు. వారం తర్వాత శిరీషను మళ్లీ ఆసుపత్రికి పిలిపించారు. ఈ సారి వ్యూహం మార్చారు. తొలుత తల్లికి మత్తు ఇచ్చారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా... అమ్మ కడుపుకోతను ఆపడానికి అవసరమైన కోతను మొదట పెట్టారు. తర్వాత పిండాన్ని చేరారు. బిడ్డ కదులుతూ ఉంటుంది కాబట్టి అనుకూల దిశకు రాగానే ఆగేందుకు దాని తొడకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. ‘ఫీటల్ అనస్థీషియా’తో కదలికలు ఆగగానే డాక్టర్ల చేతుల కదలికలు మొదలయ్యాయి. ఒక సూది ద్వారా ఒక నాళం తల్లి కడుపు నుంచి బిడ్డ ఛాతీకీ, ఆ ఛాతీలోని గుండె ఎడమవైపు కింది గదికీ చేరింది. నాళం చివరి బెలూన్ ఉబ్బింది. గది తలుపును తెరిచినట్లుగా బెలూన్ ఆయోర్టిక్ వాల్వ్‌ను తెరిచింది. అడ్డంకిని తొలగించింది. ఆపరేషన్ సక్సెస్! రెండ్రోజుల తర్వాత, పిండం గుండె స్పందనల తీరును ఫీటల్ హార్ట్ స్కాన్‌తో తెలుసుకున్నారు. అంతా సవ్యం. తల్లీ బిడ్డా క్షేమం. దేశంలోనే ఈ తరహా శస్త్రచికిత్సల్లో ఇది మొదటిది. అమ్మ కడుపులోనే ఆపరేషన్ చేయించుకున్న ఆ బిడ్డ తన తొమ్మిది నెలల గడువు ముగించుకుని, భూమ్మీదకు వచ్చి, డాక్టర్ అంకుల్స్‌కు థాంక్స్ చెప్పడానికి ఎదురుచూస్తూ ఉంది! - యాసీన్ -
మనది హెల్దీరాబాద్!
-యాసీన్ హైదరాబాద్‌ను హెల్త్ సిటీ అని ఇప్పుడంటున్నారుగానీ... అలనాడెప్పుడో నగర పాలకులు దీన్ని హెల్త్ సిటీ చేసే పాలసీ పెట్టుకున్నారేమో అని నా అనుమానం. అందుకే మహా ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారితో పాటు అనేక మంది డాక్టర్లనూ సంప్రదించి సిటీలోని అనేక ఏరియాలకు పోషకాహారాలకు సంబంధించిన పేర్లు పెట్టారేమోనని నా అభిప్రాయం. ఉదాహరణకు చిక్కడపల్లి తీసుకోండి. దాని అసలు పేరు చిక్కుడు ప్లస్ పల్లీలట. పల్లీలంటే మనం తినే వేరుశెనగలు కాదు. బిన్నిస్ పల్లీ, గోకరకాయ లాంటి బీన్స్ జాతి పల్లీలన్నమాట. అందుకే చిక్కుళ్లూ... పల్లీజాతి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదనే స్ఫూర్తిని నింపడానికి సదరు లొకాలిటీకి చిక్కుడుపల్లీ అనే పేరు పెడితే కాలక్రమాన అదే చిక్కడ్పల్లీ అయ్యిందని అనేక మంది స్థానికుల ఉవాచ. ఇక నేరేడ్మెట్ విషయానికి వద్దాం. భవిష్యత్తులో మన సిటీ డయాబెటిస్ క్యాపిటల్ అవుతుందని ముందే ఊహించారో ఏమోగానీ... ‘అతిమూత్ర వ్యాధికి నేరేడు’ అని క్లాస్ రూమ్ పాఠాలు వీధులకూ చేరాలని ఆ ఏరియాకు ‘నేరేడ్మెట్’ అని పేరు పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఏమిటంటే... నేరేడు పండ్లు ఎక్కువగా తింటే డయాబెటిస్ దరిచేరదని. కానీ... మన నగరవాసులు నేరేడు పండ్లను మరచిపోయి... బతుకు మెట్లను వేగంగా ఎక్కాలన్న ఉద్దేశంతో సెకండ్ హాఫ్‌నే పట్టుకున్నారు. ఈలోపు డయాబెటిస్ నగరంలో తిష్టవేసేసి ప్రపంచంలోనే హైదరాబాద్‌ను స్వీటెస్ట్ క్యాపిటల్‌గా మార్చేసింది. ఇక మరో దృష్టాంతానికి వద్దాం. నిజానికి అందంగా కనిపించే ఆపిల్ కంటే జాంపండ్లలోనే పోషకాలూ, విటమిన్లూ ఎక్కువ అనే ఉద్దేశంతో... జనాలు వాటిని విస్తృతంగా తినాలని ‘జాంబాగ్’ అనే మరో ఏరియాకు పేరు పెట్టి జామపండ్లను తగురీతిన సత్కరించారు. జామ ఆరోగ్యం కోసం తింటారో తినరో అని డౌటొచ్చి... ఉప్పుగూడ అనే మరో ప్రాంతానికి ఉప్పు పేరు పెట్టేసి... జాంపండు ముక్కలకు ఉప్పు రాసుకుని తినే అలవాటును మన సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా చేసేశారు. అందుకే మన సిటీలోని తోపుడు బండ్ల మీద జాంపండ్లూ... ప్లస్ ఉప్పూకారం కనిపిస్తుంటాయి. అలాగే సితాఫల్‌మండీ ఏరియాలో సీతాఫలాలను పెద్ద ఎత్తున కుప్పలుబోసి మోతీదర్వాజా దగ్గర ముత్యాల కుప్పలకు దీటుగా అమ్మేవారట. ఇక ముషీరాబాద్‌లో నిన్నటి వరకూ రాజాడీలక్స్ అనీ, అంతకుముందు రహత్మహల్ అని పిలిచే సాయిరాజా సినిమాహాల్ వెనక ఉన్న భాగాన్ని అంగూర్బాగ్ అని పిలిచే వారట. అంతెందుకు మాంసాహారం కంటే శాకాహారం మంచిదనే ఉద్దేశంతోనే గడ్డీగాదం తింటే దీర్ఘాయుష్షు అనే కాన్సెప్టుతోనే గడ్డి అన్నారం అని పేరు పెట్టి ఆ పేరుకు న్యాయం జరిగేలా అక్కడ అన్నిరకాల పండ్లూ ఫలాలూ అమ్ముతుంటారని నా ఉద్దేశం. వీటన్నింటిని బట్టీ నాకు అనిపిస్తోందేమిటంటే... మహానుభావుడైన మహా ఇంజనీరు విశ్వేశ్వరయ్యగారి జ్ఞాపకార్థం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అనే ఒకే ఒక కట్టడానికి విశ్వేశ్వరయ్య భవన్ అని పేరు పెట్టారుగానీ... సమస్త డాక్టర్ల గౌరవార్థం ‘హాకీమ్’ (వైద్యుడు) పేట అని ఒక పేట పేటనే నిర్మించారు. కానీ అప్పట్లో వీధుల పేర్లను గౌరవిస్తూ తిండి తినేవారు కాబట్టి హకీమ్పేటలోని వైద్యులకేమీ పనిలేక గాలి పనులైన గాలిమోటర్లు నడిపించడం, విమానాలెగరేయడం చేశారు, చేస్తున్నారు. ఆ తర్వాత నగరవాసులకు వీధిపేర్లను బట్టి ఆరోగ్య అలవాట్లు తప్పిపోయాయి కాబట్టి... సమస్త కార్పొరేటు ఆసుపత్రులకు మన హైదరాబాదే కేంద్రం అయ్యిందనిపిస్తోంది. -
స్వైన్కృత అనారోగ్యం!!
స్వైన్‌ఫ్లూ వ్యాధిని సంక్రమింపజేసే వైరస్కూ, పందులలోని శ్వాసకోశ వ్యాధిని తెచ్చిపెట్టే వైరస్‌కు పోలికలు ఉన్నాయి కాబట్టి దీన్ని స్వైన్‌ఫ్లూ అన్నారు.ఇదీ సాధారణ ఫ్లూ లాంటిదే. కాకపోతే ఇది కాస్త తీవ్రమైనది కావడంతో డయాబెటిస్, హైబీపీ, ఆస్తమా, సీఓపీడీ వంటి మరికొన్ని వ్యాధులతో బాధపడుతూ రోగ నిరోధకత తగ్గినవారిలో మరింత తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు రుమాలు/ టిష్యూపేపర్ అడ్డుపెట్టుకోవడం, చేతులు అడ్డుపెట్టుకుని తుమ్మడం, దగ్గడం వంటివి చేశాక చేతులు శుభ్రంగా కడుక్కోవడం, లిఫ్ట్ వంటి క్లోజ్డ్ ప్రాంతాల్లో దగ్గు, తుమ్ములను ఆపుకోవడం, పరిశుభ్రతను పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని చాలా తేలిగ్గా నివారించవచ్చు. వీటిని పాటించకపోతే అది మన స్వయంకృతాపరాధమై అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. అలా స్వైన్‌ఫ్లూ బారిన పడకుండా ఉండటంతో పాటు దాని గురించి సమగ్ర అవగాహన కోసమే ఈ కథనం. ఎందుకీ పేరు... ఏమిటా కథ? స్వైన్ అంటే పంది. ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెంజా విభాగానికి చెందిన వైరస్‌లతో వ్యాపించే జలుబు. తొలుత ఈ వైరస్‌ను పరిశీలించినప్పుడు అది పంది శ్వాసకోశవ్యాధికి కారణమయ్యే ఒక వైరస్‌లోని జన్యువులతో పోలి ఉంది. అందుకే దీనికి హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అనే పేర్లు పెట్టారు. ఇన్ఫ్లుయెంజాకు కారణమయ్యే అనేక వైరస్లలో ఒకటి జన్యుమార్పులకు లోనైంది. సాధారణంగా వైరస్లు అన్నీ ఇలా తమ జన్యుస్వరూపాలను మార్చుకుంటుంటాయి. పందుల్లో ఉండే ఈ వైరస్ తన యాంటిజెనిక్ స్వరూపాన్ని మార్చుకొని మనుషుల్లోకి వ్యాప్తిచెందడం వల్ల స్వైన్ ఫ్లూగా పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగాయి. ఫ్లూను సంక్రమింపజేసే వైరస్లలో అనేక రకాలు ఉంటాయి. అందులో ‘ఇన్ఫ్లుయెంజీ ఏ’, ‘ఇన్ఫ్లుయెంజా బీ’, ‘ఇన్ఫ్లుయెంజా సీ’ అనేవి ముఖ్యమైనవి. స్వైన్‌ఫ్లూ వైరస్ అన్నది ఇన్ఫ్లుయెంజా ఏ రకానికి చెందిన వైరస్‌తో దగ్గరి పోలికలు కలిగి ఉంది. ఈ వైరస్‌లోని జీన్స్ ఉత్తర అమెరికా ఖండానికి చెందిన పందుల్లోని వైరస్తోనూ, యూరప్‌కు చెందిన పందుల్లోని వైరస్లతోనూ, ఆసియా దేశాల్లోని మరికొన్ని పక్షుల్లోని వైరస్లతోనూ, మనుషుల్లో వచ్చే ఇన్ఫ్లుయెంజా వైరస్లతోనూ... ఇలా నాలుగు రకాల వైరస్లు కలగలసినట్లుగా ఉండటంతో సైంటిస్టులు దీన్ని ‘క్వాడ్రపుల్ రీ అసార్టెంట్’ వైరస్‌గా పిలుస్తారు. అంటే నాలుగు రకాల వైరస్లు రూపు మార్చుకుని ఏర్పడ్డ కొత్త (మ్యూటెంట్) రూపం అన్నమాట. అందుకే పేరుకు స్వైన్ ఫ్లూ అయినా పందుల వల్ల ఇది సంక్రమించదు. కేవలం మనుషుల నుంచి మనుషులకే సంక్రమిస్తుంటుంది. వ్యావహారిక భాషలో స్వైన్‌ఫ్లూ అని పిలుస్తున్నా వైద్యులు మాత్రం దీన్ని తమ పరిభాషలో ‘హెచ్1ఎన్1 ఫ్లూ’ అని అంటారు. ఈ సమయంలోనే ఎందుకు? సాధారణంగా చలికాలం జలుబు వైరస్లు సంక్రమించడానికి అవకాశాలు ఎక్కువ. అదే కోవకు చెందినది కావడంతో ఈ ‘హెచ్1ఎన్1’ ఫ్లూ సైతం చలికాలంలోనే ఎక్కువగా వ్యాపిస్తోంది. గతంలోనూ చలికాలంలోనే ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ వైరస్ ప్రస్తుతం ఈ చలికాలంలో మనదేశాన్ని గడగడలాడిస్తోంది. చలి వాతావరణం దీనికి అనుకూలం (హై విరులెంట్) కావడంతో ఇది ఈ సీజన్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. ఎలా వ్యాపిస్తుంది...? ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే ఫ్లూ. వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు గాల్లోకి వ్యాపించిన ఈ వైరస్... ఆరోగ్యవంతుడైన వ్యక్తికి చేరితే అతడూ ఈ వ్యాధి బారిన పడతాడు. ఒక్కోసారి వ్యాధిగ్రస్తుల ముక్కు స్రావాలు తమ చేతికి అంటిన వారు... అదే చేత్తో తలుపు గొళ్లెం తాకి వెళ్లాక... దాన్ని మరొకరు తాకితే... వారికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వైరస్ దాదాపు 2 -8 గంటల వరకు జీవించి ఉండి, వ్యాధిని వ్యాప్తి చేసేంత క్రియాశీలంగా ఉంటుంది. ఉదాహరణకు వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడు ఆ తుంపర్లు టేబుల్ మీద పడి, అక్కడ ఆరోగ్యవంతులెవరైనా చేతులు పెట్టి... వాటిని తమ ముక్కు, కళ్లు, నోటికి అంటించుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. తుమ్మే సమయంలో వ్యాధిగ్రస్తులు తమ చేతులు అడ్డుపెట్టుకుని, ఆ తర్వాత అదే చేత్తో వేరేవారికి షేక్‌హ్యాండ్ ఇస్తే... వైరస్ ఆరోగ్యవంతునికి వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తులు లిఫ్ట్ వంటి క్లోజ్డ్ ప్రదేశాల్లోనూ, క్రౌడెడ్ప్రదేశాల్లో ఉన్నప్పుడూ, పబ్లిక్ ప్లేసెస్‌లో ఒకే బాత్రూమ్ తలుపును, కొళాయినాబ్ను వ్యాధిగ్రస్తులు తాకిన తర్వాత... ఆరోగ్యవంతులు అదే తలుపు హ్యాండిల్గాని, కొళాయి నాబ్‌ను తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిర్ధారణ... అది సాధారణ ఫ్లూనా లేక స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1)నా అన్న విషయం నిర్ధారణ చేసుకోడానికి రోగి గొంతు నుంచి, ముక్కు నుంచి స్రావాలను సేకరించి, వాటిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు పంపుతారు, అక్కడ పీసీఆర్ అనే పరీక్ష నిర్వహించి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అయితే ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండానే లక్షణాలను బట్టే చికిత్స ప్రారంభిస్తారు. పరీక్షలో అది స్వైన్‌ఫ్లూ అని నిర్ధారణ అయితే వ్యాధి ఏ దేశంలో వ్యాపించినా, చికిత్సను అందించడానికి అంతర్జాతీయ సంస్థలు తమ వైద్యబృందాలతో ముందుకు వస్తాయి. లక్షణాలివే... సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే ఈ వ్యాధిలోనూ కనిపిస్తాయి. అంటే... జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు-ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలకు తోడు వాంతులు, విరేచనాలు కూడా కనిపించినప్పుడు వైద్యులు దాన్ని స్వైన్‌ఫ్లూగా అనుమానిస్తారు. ఈ వ్యాధి సోకినప్పుడు పిల్లల్లో, పెద్దల్లో కనిపించే లక్షణాలు కాస్తంత వేరుగా ఉంటాయి. అవి... పిల్లల్లో... వేగంగా శ్వాసతీసుకోవడం, శ్వాసప్రక్రియలో ఇబ్బంది. కొందరిలో చర్మం నీలం రంగుకు మారడం. ఎక్కువగా నీళ్లు గానీ, ద్రవపదార్థాలుగానీ తాగకపోవడం. ► త్వరగా నిద్రలేవలేకపోవడం... ఎదుటివారితో సరిగా సంభాషించకపోవడం. ► కోపం, చిరాకు వంటి భావోద్వేగాలకు త్వరగా గురికావడం. ► ఫ్లూ వల్ల వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన త్వరగా తగ్గకపోవడం. ► కొందరిలో జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు (ర్యాష్) కనిపించడం. పెద్దల్లో... శ్వాసకియలో ఇబ్బంది, విపరీతమైన ఆయాసం. ఛాతీలోపల లేదా పొట్టలో నొక్కేస్తున్నట్లుగా నొప్పిరావడం. అకస్మాత్తుగా నీరసపడిపోవడం అయోమయం ఒక్కోసారి ఆగకుండా అదేపనిగా వాంతులు ఫ్లూ కారణంగా వచ్చిన జ్వరం తగ్గినా... దగ్గు ఒక పట్టాన తగ్గకపోవడం. హైరిస్క్ వ్యక్తులు... 65 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లోనూ ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. ఇక డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్న టీనేజర్స్, హెచ్ఐవీ వంటి వ్యాధులుండేవారు హైరిస్క్ గ్రూప్‌కి చెందినవారు. వీరికి వచ్చే ఇతర వ్యాధులు... స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటివాళ్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ-రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తికిగానీ స్వైన్ ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. నివారణ ఇలా... ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్నందున చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. పైగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే గుణమున్న ఈ వైరస్‌తో వ్యవహరించడం అన్నది అటు రోగుల తోటివారికీ, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికీ రిస్క్ కాబట్టి నివారణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ► దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. ఒకవేళ చేతి రుమాలు అందుబాటులో లేకపోతే... పొడవు చేతుల చొక్కా వేసుకొని, దాని మోచేతి మడతలో దగ్గడం, తుమ్మడం చేయడం వల్ల వైరస్ అక్కడికే పరిమితమవుతుంది. ► ఒకవేళ ఖాళీ చేతులు అడ్డు పెట్టుకొని దగ్గడమో, తుమ్మడమో చేస్తే ఆ తర్వాత ఆ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో చాలాసేపు రుద్దుతూ కడుక్కోవాలి. ► ఒకవేళ రుద్ది కడుక్కునేందుకు సబ్బు లేదా నీరు అందుబాటులో లేకపోతే... ఆల్కహాల్ బేస్డ్ యాంటీ బ్యాక్టీరియల్ హ్యాండ్ రబ్స్తో చేతులను శుభ్రంగా రుద్దుకోవాలి. ► దగ్గు, తుమ్ము సమయంలో రుమాలును లేదా టిష్యూ పేపర్‌ను ఉపయోగించవచ్చు. అయితే ఆ రుమాలునుగానీ/టిష్యూ పేపర్నుగానీ వేరొకరు ఉపయోగించకుండా, జాగ్రత్తగా ఎవరూ అంటుకోని ప్రదేశంలో దాన్ని పడేయాలి. ► జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తులనుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు కూడా తమ లక్షణాలు తగ్గిన 24 గంటల వరకు అందరి నుంచి దూరంగా ఉండటం మంచిది. జలుబు లక్షణాలు కనిపించినా... అది తగ్గేవరకు పదిమంది మసిలే ప్రదేశాలకూ, ఆఫీసుకు వెళ్లడం సరికాదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతో నివారణ సులభం మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మిగతా వ్యాధులతో పాటు స్వైన్‌ఫ్లూ నుంచి కూడా రక్షణ పొందవచ్చు. ఉదాహరణకు... మనం పనిచేసే డెస్క్, టేబుల్ ఉపరితలాన్ని, మన ఇంటి గచ్చును, కిచెన్, బాత్రూమ్ గచ్చులను క్లోరిన్, ఆల్కహాల్స్, పెరాక్సిజెన్, డిటెర్జెంట్స్, అయిడోఫార్స్, క్వాటెర్నరీ అమోనియం, ఫీనాలిక్ కాంపౌండ్స్ వంటి డిస్-ఇన్ఫెక్టెంట్లతో శుభ్రపరచుకోవాలి. అందుబాటులో వ్యాక్సిన్... మునుపు ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు వ్యాక్సిన్ లేదు. కానీ తదుపరి పరిశోధనలతో స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ రూపొందింది. ప్రస్తుతం అందుబాటులో ఉంది. స్వైన్ ఫ్లూ వచ్చేందుకు ఆస్కారం ఉన్న హైరిస్క్ గ్రూపునకు చెందిన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని - సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ), అడ్వయిజరీ కమిటీ ఆన్ ఇమ్యూనైజేషన్ ప్రాక్టిసెస్ (ఏసీఐపీ) వంటి సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సిఫార్సుల మేరకు పదేళ్లు దాటిన వారంతా ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. 6 నెలల నుంచి తొమ్మిదేళ్ల వయసున్న వారు రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండుడోసులకు మధ్య కనీసం నాలుగువారాల వ్యవధి ఉండాలన్నది ఎఫ్‌డీఏ సిఫార్సు. చికిత్స... ఫ్లూకు సంబంధించిన లక్షణాలు కనిపించగానే దాన్ని స్వైన్‌ఫ్లూగా అనుమానించి ఇష్టం వచ్చినట్లుగా యాంటీవైరల్ మందులు, ఇందుకోసం ఉద్దేశించిన ఒసెల్టామివిర్ (టామీఫ్లూ) లేదా జనామివిర్ అనే మందు ఉపయోగించడం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే విచక్షణరహితంగా టామిఫ్లూ వంటి మందులు వాడటం వల్ల అంత ప్రయోజనం లేదు. నిర్దిష్టంగా టామిఫ్లూ మందునే ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్లు తమ విచక్షణతో ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. ఆసుపత్రిలో చేరిన వారికీ, ఒకవేళ ఆ మందులు ఇవ్వకపోతే పరిస్థితి దిగజారిపోయే ప్రమాదం ఉన్నవారికి మాత్రమే డాక్టర్లు ఆ మందులను ఇస్తారు. అలాంటి అవసరం ఉన్నవారికి ఒసెల్టామివిర్ (టామిఫ్లూ), జనామివిర్ లాంటి మందులను కాప్సూల్స్ రూపంలో 5 రోజుల కోర్సుగా ఇస్తారు. పిల్లలకు ఇదే మందును చాక్లెట్సిరప్తో కలిపి ఇస్తారు. ఇక కొందరిలో రెలెంజా వంటి పీల్చే యాంటీవైరల్ మందునూ ఇస్తారు. అయితే శ్వాససంబంధిత వ్యాధులు ఉన్నవారికి, గుండెజబ్బులు ఉన్నవారికి మాత్రం ఈ రెలెంజా వంటి పీల్చే మందులను ఇవ్వరు. ఎందుకంటే... అలాంటి వారికి పీల్చే మందు అయిన రెలెంజా ఇచ్చినప్పుడు మగతగా ఉండటం, ముఖం ఎముకల్లో ఉండే ఖాళీ ప్రదేశాలైన సైనస్లలో ఇన్ఫెక్షన్స్ రావడం (సైనుసైటిస్), ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బడ వేయడం, దగ్గురావడం, కొందరిలో వికారం, వాంతులు, తలనొప్పి వంటి సైడ్ఎఫెక్ట్స్ కనిపించవచ్చు. గర్భిణులకు చికిత్స... వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే గర్భిణులకూ యాంటీరిట్రోవైరల్ మందులు ఇస్తారు. దీనివల్ల కడుపులో ఉన్న పుట్టబోయే బిడ్డపై దుష్ర్పభావాలు కలిగినట్లు ఎలాంటి దాఖలాలూ లేవు.అయితే లక్షణాల తీవ్రత ఎక్కువగా లేకుండా, ఇంటిదగ్గరే వైద్యచికిత్స తీసుకుంటున్నవారు మాత్రం సాధారణ యాంటీబయాటిక్స్‌ను వాడుకోవచ్చు. వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉన్న కొంతమందికి వైరస్ సోకినప్పటికీ... కొద్దిపాటి లక్షణాలు కనిపించి, ఎలాంటి మందులు వాడకపోయినా అది తగ్గిపోయే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ సీజన్లో వ్యాధి సాధారణ జలుబులాగే అనిపించినప్పటికీ, డాక్టర్ సలహా మేరకు మందులు వాడటమే మంచిది. చివరగా: సాధారణ జలుబు లక్షణాలే కలిగి ఉండే కొందరిలో అసాధారణమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ప్రభావం స్వైన్‌ఫ్లూ వైరస్‌కు ఉంది కాబట్టి... చికిత్స వరకూ తెచ్చుకోకుండా ముందునుంచే నివారణ చర్యలు చేపట్టడం అటు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు ఇటు వ్యాప్తినీ నివారిస్తుందని గుర్తుంచుకోండి. - నిర్వహణ: యాసీన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్ హైదరాబాద్. -
గుండెపోటే గురుదేవుడు! ఆయిల్ ట్యాంకరే అవధూత!!
నవ్వింత ఈమధ్య మా రాంబాబు గాడిలో స్థితప్రజ్ఞత మరీ ఎక్కువైపోయింది. ఏం చెప్పినా అందులోంచి తాత్వికతను తవ్వి తీస్తున్నాడు. మొన్న నేనూ వాడూ ఆఫీసులోకి ప్రవేశించాక ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలో లిఫ్ట్ మిస్సయ్యింది. సినిమాకు వెళ్లాక మన ముందు వాడికి టికెట్టు దక్కి, మనకు చిక్కనప్పటి బాధ ఆవరించి... నిరాశతో ‘అబ్బా’ అన్నాను. ‘‘హు... జీవితంలోనే లిఫ్ట్ దొరకలేదు. ఆఫ్టరాల్ ఈ లిఫ్ట్ మిస్సయితే బాధేముందిలేరా’’ అన్నాడు వాడు. ‘‘ఇందాకే కదరా, బస్సు మిస్సయితే ఎవరో బైకువాడు లిఫ్ట్ ఇచ్చాడు అన్నావ్’’ అని అడిగా. ‘‘కానీ బస్సులో నా స్వీట్హార్ట్ వెళ్తోంది కదా. బైకు లిఫ్టు దొరికిందని ఆనందించనా, బస్సు మిస్సయిందని విచారించనా?’’ ఊరెళ్దామని ఓరోజు రాత్రి ఎనిమిదింటికి వెళ్లాల్సిన రైలును పట్టుకోడానికి బయల్దేరాం మేం. కానీ నిమిషమున్నర వ్యవధిలో రైలు కాస్తా పాముల వాడి చేతుల్లోంచి పారిపోయే పాములా జారిపోయింది. పారిపోవడంతో సరిపెట్టిందా... చివరి బోగీ వెనక నల్లటి బ్యాక్‌గ్రౌండ్ మీద ‘ఎక్స్’ అనే అక్షరంతో వెక్కిరించింది. ‘ఆన్సర్‌షీటు మీద నీ జవాబు తప్పురా అనే మార్కే సదరు ఎక్స్’ - అంటాడు వాడు. ఎందుకైనా మంచిదని వాణ్ణి ఊరడిద్దామని ‘‘పోతే పోనీలేరా... ఇంకో రైల్లో వెళదాం లే’’ అన్నాను. ‘‘తప్పిపోయిన రైలుకు రిజర్వేషనైన టికెటుంటుంది. అయినా మిస్సవ్వక తప్పదు. ఇప్పుడెక్కాల్సిన రైలుకు రిజర్వేషనుండదు. అయినా ఎక్కక తప్పదు. అదేరా జీవితం’’ అన్నాడు వాడు. నిజమేననిపించింది. ‘‘నా బాధల్లా రైలు మిస్సయినందుకు కాదురా. మన చేతిలో టికెటు ఉన్నా, అధికారికంగా రిజర్వేషన్ చేయించుకుని సుఖంగా వెళ్లాల్సిన బెర్త్ అక్కడే ఉన్నా... దాని మీద ఎవడో తాను ఊహించని విధంగా, హాయిగా ప్రయాణిస్తుంటాడు. అధికారికంగా మనకు దఖలు పడాల్సిన సుఖాన్ని ఇంకెవడో అయాచితంగా అనుభవిస్తాడు. ఇదే జీవితం’’ అన్నాడు వాడు. అక్కసు లేదా అసూయ అనండి, మానవసహజమైన వాడి వైఖరికీ, ప్రవర్తనకూ సాటి మనిషిగా పూర్తిగా మద్దతుపలికాన్నేను. ఈమధ్యే రాంబాబు గాడికి మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లడం కుదరలేదు. వాడు కాస్త కోలుకున్నాక క్రమం తప్పక మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు వాడితో జాయిన్ కావడం మొదలు పెట్టాను. ఈ క్రమంలో అప్పుట్లో మిస్ అయిన పరామర్శనూ, ఓదార్పునూ, ధైర్యాన్నీ ఒకే డోసులో ఇద్దామని- ‘‘పోన్లేరా... మైల్డ్ స్ట్రోకే కదా. మొదటి స్ట్రోకు వచ్చాక అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే దాదాపు నలభై ఏళ్లు బతికారు ఏఎన్నార్. మామూలువాళ్ల కంటే ఇలా స్ట్రోక్ వచ్చాక జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నవాళ్లే సుదీర్ఘకాలం జీవించార్రా’’ అంటూ మంచి ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే మామూలు వాళ్లైనా సరే అర్జెంటుగా గుండెపోటు తెచ్చుకోవడం చాలా అవసరం, అదెంతో మంచిది అన్నంత ఇన్స్పైరింగ్గా ఓ లెక్చర్ ఇచ్చా. రోడ్డు మీద మేము వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఓ ఆయిల్ ట్యాంకర్ వెళ్తూ కనిపించింది. దాన్ని చూడగానే మళ్లీ మా రాంబాబుగాడిలో తాత్వికత నిద్రలేచింది. ‘‘హు... ఈ గుండే... దానితో నడిచే ఈ జీవితమూ ఆయిల్ ట్యాంకర్ వంటివేరా’’ అన్నాడు వాడు. నేను బిత్తరపోతూ అదేంట్రా అన్నాను. ‘‘చూశావా విచిత్రం... ఆయిల్ ట్యాంకర్ నిండా అనేక గ్యాలన్ల ఇంధనం ఉంటుంది. కానీ ఆ వాహనానికి గుండె కాయలాంటి చిన్న ట్యాంకర్లో ఉండే పెట్రోలు నిండుకుంటే అంతటి ఆయిల్ ట్యాంకరూ ఆగిపోతుంది. అలాగని నేరుగా ట్యాంకరులోని ఇంధనాన్ని వాహనానికి ఉన్న ట్యాంకులో పోసుకోడానికి వీలు కాదు. మన గుండె కూడా అంతేగదరా. దాని నాలుగ్గోడల నిండా ఎప్పుడూ రక్తం ఉండనే ఉంటుంది. అలాంటి గుండె కూడా మెదడుకు తన ఆధార్ కార్డూ, తన రేషన్ కార్డూ గట్రా చూపించి తన కోటా రక్తాన్ని మాత్రమే తాను వాడుకోవాలి. అన్ని అవయవాలకూ రక్తం సరఫరా చేసే దానికే రక్తం అందకపోతే, ఎంతటి మనిషైనా అంతటితో పోవాల్సిందే కదా. ఇది కూడా టికెట్టుండీ రెలైక్కలేకపోవడం, మన స్వీట్ హార్ట్ బస్సులో ఉండీ, బస్సెక్కలేకపోవడం లాంటిదే కదరా. జ్ఞానాన్ని నేర్చుకోవాలనే గుణం ఉండాలిగానీ... గుండెపోటూ గురువవుతుంది, ఆయిల్ ట్యాంకరూ అవధూత అవుతుంది. మిస్సయిన బస్సూ మహాతత్వ సారాన్ని బోధిస్తుంది’’ అంటూ పెద్ద పెద్ద మహాయోగులూ, యోగగురువులూ ఇచ్చేలాంటి స్పీచ్ ఇచ్చాడు వాడు. - యాసీన్ -
మా రాంబాబు గాడూ, పులీ... సేమ్ టు సేమ్!
నవ్వింత: ఈ మధ్య మా రాంబాబు గాడి ఆరోగ్యం పాడైంది. అప్పట్నుంచి వాడి మాటలన్నీ చిత్రంగా ఉంటున్నాయి. వాడు చెప్పేవన్నీ పరమ సత్యాలే. దాంతో వినేవారికి ఒకింత ఇబ్బందిగానూ, మరీ మాట్లాడితే వెటకారంగానూ అనిపిస్తున్నాయి. ఒక రోజున వాడూ, నేనూ రోడ్డు మీద పోతున్నాం. దార్లో నాకు తెలిసిన మిత్రుడొకడు కనిపించి నన్ను విష్ చేశాడు. ఏదో లోకం పోకడ కొద్దీ నేను వెంటనే మా రాంబాబుగాణ్ణి వాడికి పరిచయం చేశా. అంతే! వాళ్ల మధ్య జరిగిన సంభాషణ నా మిత్రుణ్ణే కాదు, పరిచయం చేసిన పాపానికి నన్నూ బోల్డంత ఇబ్బంది పెట్టింది. ‘‘ఏం సార్... ఎలా ఉన్నారు?’’ అంటూ ముఖమంతా నవ్వులమయం చేసుకుని స్నేహాన్ని పెంచుకునే దృష్టితో దగ్గరితనాన్ని ప్రదర్శిస్తూ మా రాంబాబుగాణ్ణి అడిగాడు నా మిత్రుడు. ‘‘ఏదో జస్ట్ యావరేజిగా ఉన్నాలెండి’’ అన్నాడు వాడు. ‘‘మీరేం చేస్తున్నారు సార్’’ మళ్లీ అడిగాడు నా స్నేహితుడు. ‘‘ఒళ్లు చేస్తున్నాను’’ అని జవాబిచ్చాడు రాంబాబు. దాంతో మా స్నేహితుడు దెబ్బతిన్నట్టు నా వైపు చూశాడు. అతణ్ణి పక్కకు తీసుకెళ్లి... ‘‘ఈమధ్య రాంబాబు ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడేవో మందులు వాడితే వాటి సైడ్‌ఎఫెక్ట్‌గా లావెక్కాడు. వాడిదంతా ఏదీ దాచుకోకుండా ఫ్రాంక్‌గా చెప్పే తత్వం కాబట్టి నువ్వేమీ అనుకోకు’’ అంటూ సర్దిచెప్పి పంపించా. మరో రోజున మా రాంబాబు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ మా ఇంటి వైపు వస్తుంటే, ‘‘ఎక్కణ్ణించి వస్తున్నావురా’’ అన్నా. వాడు గాఢంగా నిట్టూర్చి... ‘‘హు... అద్దం బద్దలైంది. మూడు ముళ్ల బంధం పటాపంచలైంది. అందుకే మెకానిక్ దగ్గరికి వెళ్లి వస్తున్నా’’ అంటూ అర్జంటుగా వెళ్లిపోయాడు. వెంటనే నా గుండెల్లో రాయి పడింది. ‘వీడేమైనా ఇంట్లో వాళ్లావిడతో గొడవపడ్డాడా? అయినా గొడవ మరీ ముదిరితే సరిదిద్దుకోదలచుకుంటే సైకాలజిస్టు దగ్గరికెళ్లాలి, విడిపోదలచుకుంటే లాయర్ దగ్గరికెళ్లాలి. అంతేగానీ ఇలా మెకానిక్ దగ్గరికెళ్లడం ఏమిటి?’ అంటూ వెంటనే వాళ్లావిడకు ఫోన్ చేసి అడిగా... ‘‘ఈ మూడుముళ్లేమిటీ... చెల్లాచెదురేమిటీ?’’ అని. ‘‘ఏం చెప్పమంటారు అన్నయ్యా! ఇంట్లో బుజ్జిగాడు బంతాట ఆడుతుంటే అది వెళ్లి గోడగడియారానికి తగిలింది. దాని చిన్నముల్లూ, పెద్దముల్లూ, సెకన్లముల్లూ ఊడిపడ్డాయి. వాటిని బాగు చేయించడానికి వెళ్లొస్తానని బయల్దేరారు. బహుశా అదే విషయం మీకు చెప్పి ఉంటారు’’ అంది వాళ్లావిడ. అప్పటికిగాని నా ఆందోళన తగ్గలేదు. అంతటితో ఆగలేదు వాళ్లావిడ. ‘‘ఈమధ్య ఆయన మాటలన్నీ చిత్రంగా ఉంటున్నాయి అన్నయ్యా. మొన్న ఉప్మా చేశా. చట్నీ, పచ్చడీ రెండూ ముందు పెట్టి... ‘దేంతో తింటారండీ అన్నా. దేంతో తింటాం? చేత్తో లేదంటే స్పూన్‌తో’ అన్నారు. ఇంకోరోజు ‘పళ్లు రాలాయి. బుర్ర కుదురుగా ఉండటం లేదు. తల చెదిరిపోతోంది’ అన్నారు. మొదట ఆయన పళ్లకు ఏమైందో, ఆ మాట అన్నందుకు డెంటిస్టు దగ్గరికెళ్లాలా, న్యూరాలజిస్టును సంప్రదించాలా అని సందేహపడే లోపే... ఆయన చేతిలో ఉన్న దువ్వెనను చూస్తే తెలిసింది. రాలిన పళ్లు దువ్వెనవని’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది రాంబాబు వాళ్లావిడ. ఎలాగైనా వాడిని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంది వాళ్లావిడ. ‘‘డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒళ్లు చేస్తున్నా కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డైటింగ్ చేద్దాం ఈసారి’’ అన్నది వాడి డైలాగట. ఇవన్నీ నా ముందు చెప్పుకుని బాధ పడి ‘‘ఏదైనా మంత్రం వేసో, తంత్రం చేసో, మాయతోనో ఆయనను మీరే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలన్నయ్యా’’ అంది. ఇక నాకు తప్పలేదు. మా ఫ్యామిలీ ఫిజీషియన్ గారికి మావాడి విషయాలూ, వాడి లక్షణాలూ ముందే వివరించి ఉంచా. దేవుడి మీద భారం వేసి ఒక్క ప్లాన్ వేశా. హోమియో వైద్యం తరహాలో మనం కూడా వాడి రూట్లోనే వెళ్తే ప్లాన్ వర్కవుట్ అవుతుందనిపించింది. అందుకోసం వాడికి నేను చెప్పిన మాటలివి. ‘‘ఒరేయ్ రాంబాబూ... నాకు తెలిసినంతవరకూ నువ్వూ, పులీ... సేమ్ టు సేమ్ రా. నీకెప్పుడూ ‘పులి తేన్పులు’ వస్తుంటాయి కదా. కాకపోతే పులి పొట్ట ఎప్పుడూ సాఫ్ట్‌గా ఉండి, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఈమధ్య నీ పొట్ట కాస్త పెరుగుతూ ఉంది. అదొక్కటే తేడా. మరి నువ్వూ ఎప్పుడూ పులిలా ఉండాలంటే కాస్త ఈ పొట్ట తగ్గేలా చూసుకోవాలి కదా’’ అన్నా. అంతే వాడు వెంటనే డాక్టర్ దగ్గరికి బయల్దేరాడు. - యాసీన్ -
డబుల్ జ్యువెల్!
యాసీన్ సింగిల్ చాయ్‌నైనా డబుల్‌స్ట్రాంగ్‌గా తాగుతారు మన హైదరాబాద్ సిటీ పీపుల్. డబుల్ స్ట్రాంగ్ చాయ్‌లో డబుల్ రోటీ అనే పేరున్న రోటీని అద్దుకుని తింటారు. వాస్తవానికి అది కేవలం బన్. కానీ డబుల్ అంటే గానీ... లేదా డబుల్ ఉంటే గానీ మనకు ఆనదు కాబట్టి దానికి డబుల్ రోటీ పేరు పెట్టారు మన సిటీ‘జెమ్స్’! దీన్నిబట్టి తెలిసేదేమిటి? మన హైదరాబాదీలకు సింగిల్ సరిపోదు. డోసు డబులైతేనే పీసు నచ్చుతుంది. బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్లినవాడు... పెట్టింది తిని బుద్ధిగా వచ్చేస్తాడా? కుదర్దు. ఆర్డర్ ఇచ్చేటప్పుడే... ‘ఏక్ బిర్యానీ... విత్ డబుల్ మసాలా అండ్ డబుల్ గోష్’ అంటూ గొంతులో కమాండ్ నింపుకొని తన డిమాండ్ చెబుతాడు. అలాగే సగటు నగర ప్రయాణికులు మొన్నమొన్నటి వరకూ డబుల్ డెక్కర్ ఎక్కేవారు. కానీ అంతస్తుల తేడా వస్తుందనీ, అందరూ సమానమనే సామ్యవాద స్ఫూర్తి దెబ్బతింటోందని, ఈ మధ్య పై అంతస్తును కిందికి దింపేసి, వెస్టిబ్యూల్తో రెండు బస్సులనూ కలిపేసి ఇలా పొడుగ్గా ఉండే డబుల్ బస్‌లలో ప్రయాణం చేస్తున్నారు. అంతేనా... పీక్ టైమ్స్ అని పిలిచే ఏ ఉదయమైనా, ఏ సాయంత్రమైనా సరే... ఒక్క బస్సులోనే రెండు బస్సుల జనాలు కూరి కూరి నింపినట్లుగా నిండి ఉంటారు. అనగా ప్రయాణీకులూ డబుల్ ఉంటారన్నమాట. దాంతో జనాల మధ్య దూరాలూ, అంతరాలూ తగ్గి, ప్రేమలూ డబుల్ అవుతాయి. ఒక కాలు పట్టే స్థలంలో ఆ కాలు మీదికి మరో కాలు ఎక్కి డబులవుతుంది. ఇలా ఈ రద్దీలో ఒకవేళ ఎవరో ఎవరిదో కాలు తొక్కినందువల్ల తిట్టుకున్నా అదీ ప్రేమకొద్దే అనుకోవాలి. అదీ ‘డబుల్’ కాన్సెప్ట్ పట్ల సిటీ పీపుల్‌కు ఉన్న ప్రేమ. ఇంతటితోనే ఆగిందా... నగరం చుట్టూ ఎన్నో చెరువులున్నా, అఫీషియల్‌గా ‘సాగర్’ అన్న పేర్లున్న సరస్సులూ డబులే! ఒకటి హుస్సేన్‌సాగర్, రెండోది హిమాయత్‌సాగర్. నగరంలో ఒకే ఒక్క చార్మినార్ ఉండటం నామోషీ అనిపించిందో ఏమిటో గానీ... ఇంజనీర్లు హైటెక్స్‌కు పోయే ఎంట్రెన్స్ మార్గాన్ని మోడ్రన్ చార్మినార్ షేపులో కట్టి దాన్నీ ‘డబుల్’ చేశారు. ఇక ముగ్గురు ప్రయాణం చేసే మామూలు ఆటోలు మనకు ఆనలేదు. అందుకే మామూలు ఆటోల కంటే రెట్టింపు మంది పట్టేలా సెవెన్ సీటర్ ఆటోలని కొత్తవి ప్రవేశపెట్టి ‘డబుల్’ కాన్సెప్టును మరింత పరిపుష్టం చేశారు. అంతెందుకు హైదరాబాద్ అన్న ఒక్క నగరం మనకు సరిపోలేదు. అందుకే సికింద్రాబాదునూ నిర్మించి జంటనగరాలన్నారు. అందరూ ఇంగ్లిష్‌లో వీటిని ట్విన్ సిటీస్ అంటారు. కానీ... ట్విన్స్ అంటే కవలలు అని అర్థం. నిజానికి హైదరాబాద్ ఎప్పుడో నాలుగొందల ఏళ్ల క్రితం పుట్టింది. సికింద్రాబాద్ ఆ తర్వాత చాలా కాలానికి పుట్టింది కాబట్టి వీటిని ట్విన్స్ అనగా కవల నగరాలు అనడం కంటే తెలుగులో చక్కగా జంటనగరాలు అనే అర్థం వచ్చేలా ‘డబుల్ సిటీస్’ అనడమే కరక్టేమో! ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటే దిల్‌కు జిల్లుగా ఉంటుంది. ఒకే టికెట్‌పై రెండు సినిమాలు చూస్తే థ్రిల్లుగా ఉంటుంది. అందుకే హైదరాబాద్, సికింద్రాబాద్‌లలోని మనం ఏ సిటీలో నివసించినా మనకు మరో సిటీ అదనం! అదే మన జంటనగరాల గొప్పదనం!! -
సినీమృగాయణం!
నేడు జంతు హక్కుల దినోత్సవం ఆ రోజు అడవిలో జంతువులన్నీ చేరి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాయి. ‘‘సినిమా సక్సెస్ కావాలంటే నేనో, నా గురించి పాటో ఉండి తీరాల్సిందే’’ అంది కోడి. ‘‘అదెలా?’’ అడిగింది బాతు. ‘‘ఓసోసీ పిల్లకోడి పెట్టా... అనీ, బంగారు కోడి పెట్ట వచ్చెనమ్మా... అనే పాటల వల్లనే ఆ సినిమాలు హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్ కొద్దే మగధీరలో కోడి పాట మళ్లీ పెట్టారు. దీన్నిబట్టి కోళ్లు అంటేనే బ్లాక్‌బస్టర్ ఫార్ములా అని తెలీడం లేదూ!’’ అంది కోడి. ‘‘చాల్లే ఊరుకో... బంగారూ బాతుగుడ్డూ... అంటూ మా జాతిని తలుచుకోబట్టే వేటగాడు హిట్టయ్యింది. ఫో... ఫో... నీ బోడి గొప్పలూ, నువ్వూనూ’’ అంటూ ఈసడించింది బాతు. ‘‘మీ ఇద్దరూ తప్పే... ఓసోసీ పిల్లకోడి పెట్టా... అన్న పల్లవిలో వెంటనే ‘నా వయ్యారీ పావురాయి పిఠ్ఠా’ అంటారు ఎన్టీఆర్. అంటే కోడి ఫోర్సు సరిపోక పావురాళ్లను వాడుకున్నారన్నమాట’’ అంటూ తన గొప్ప చెప్పుకుంటూ వాదనకు దిగింది పావురాయి పిట్ట. ఈలోపు సరసరా పాక్కుంటూ వచ్చింది నాగుపాము. ‘‘సినిమా బ్లాక్‌బస్టర్ కావాలంటే నాగుపాము ఉండి తీరాల్సిందే. ‘నోము’ లాంటి అలనాటి చిత్రాల నుంచి ‘నగీనా’ లాంటి సినిమాల వరకూ అన్నింట్లో నేనుండాల్సిందే. అనకొండ అనీ... అది మాకు దూరబ్బంధువులే! సాక్షాత్తూ హాలీవుడ్ వాళ్లూ మా రిలేటివ్ అయిన దాన్ని పెట్టి సినిమాలు తీస్తుంటారు తెల్సా’’ అంటూ కస్సు ‘బుస్సు’మంది పాము. ‘‘విలన్ అబద్ధాలకు నీ రెండు నాల్కలను ఉదాహరణగా చూపిస్తారు. ఫో... ఫో... నీ గొప్పలూ నువ్వూనూ’’ అంటూ విసుక్కున్నాయి పిట్టలు. ‘‘అలనాటి రాజుల సినిమాల నుంచి ఇవ్వాళ్టి మగధీర వరకూ హార్స్ ఉందంటే సినిమాలో ఫోర్స్ ఉన్నట్లే’’ అన్నాయి గుర్రాలు. ఇంతలో గాండ్రిస్తూ సీన్లోకి ఎంటరైంది పులి. ‘‘ఆగండాగండి. ఎంత పెద్ద హీరో అయినా నాతో పోల్చుకోవాల్సిందే. ‘పులితో ఫొటో దిగాలనుకున్నావనుకో కాస్త రిస్కయినా పర్లేదు గానీ... చనువిచ్చింది కదా అని పులితో ఆడుకున్నావనుకో...’ అంటూ నాతో గేమ్సాడితే జరిగే పరిణామాలను చెప్పకనే చెబుతాడు హీరో’’ అంటూ తన గొప్పల్ని చెప్పింది పులి. ‘‘ఆపండెహె మీ గోల. మీ అందరికంటే నేనే గొప్ప. మాతో పోల్చుకుంటూ హీరో ఏమంటాడో తెల్సా... ‘అడవిలో సింహం... ఇక్కడ నేనూ సేమ్ టు సేమ్ రా. అది గెడ్డం చేసుకోదు... నేను గెడ్డం చేసుకుంటానంతే’ అంటాడు. దీన్నిబట్టి తెలిసేదేమిటి? సింహం ప్రస్తావన ఉంటేనే సినిమాకు సింహబలమొస్తుందన్నమాట’’ గొప్పలు పోయింది సింహం. ఈలోపు బొద్దింక గొంతు సవరించుకుంది. అంతే... అక్కడున్న జంతువులన్నీ ఒక్కసారిగా నవ్వాయి. ‘‘నీకు ఇక్కడ మాట్లాడే సీన్ లేదు. ఫో’’ అంటూ కసురుకున్నాయి జంతువులు. ‘‘మీరంతా మీ ఇండివిడ్యువల్ గొప్పలు చెప్పుకొన్నారు. నేనలా కాదు... ప్రేమే నా మార్గం. సీన్లో నేను కనబడీ కనబడగానే హీరోయిన్ ఎగిరి హీరో అక్కున చేరి ముద్దుముద్దుగా...‘బొద్దింక... అదంటే నాకు భయం’ అంటుంది. అంతే...! అప్పటివరకూ హీరో హీరోయిన్ల మధ్య సెలైంట్‌గా లేటెంట్గా ఉన్న ప్రేమ కాస్తా పెల్లుబికి డ్యుయెట్‌లా పారుతుంది. ఇలా పాట పెట్టడానికి డెరైక్టర్‌కి అవకాశం ఇచ్చేది ఎవరో తెల్సా? నేనే’’ అంటూ మీసాలు తిప్పింది బొద్దింక. ఆ మాటకొస్తే... తన టైటిల్ తోనే తనపై ఫుల్ లెంత్ సినిమా తీశారని ఈగా, ఐశ్వర్యా రాయ్ మెప్పు కోసం సాక్షాత్తూ రోబోయే తమను పట్టుకోడానికి అవస్తలు పడ్డాడని దోమలు సైతం సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాయి. ‘‘ఇలా ఎవరి గొప్పలు వాళ్లమే చెప్పుకుంటూ పోతే ఎలా? మన గొప్పను సినీరంగమూ గుర్తించాలి కదా. అందుకు ఏం చేయాలో నక్కను అడుగుదాం. అందరిలోకీ తెలివైనది అదేకదా’’ అని ఒక నిర్ణయానికి వచ్చాయి జంతువులన్నీ. సరే అని నక్క తన సలహా ఇలా చెప్పింది... ‘‘మొన్న హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిశ్రమలోని పెద్ద సార్లూ, పెద్ద స్టార్లూ, చిన్న నటులంతా ‘మేము సైతం’ అంటూ సహాయం చేశారు కదా. మరి వాళ్ల సినిమాల హిట్ల కోసం మనం సైతం కష్టపడుతున్నాం కదా. కాబట్టి జంతుహక్కుల కోసం వాళ్లు ఏదైనా చేస్తారేమో చూద్దామా? ఎందరు స్టార్లు... సినిమాల్లో తమకు అండగా ఉండే ఈ జంతువుల సంక్షేమం కోసం పాటుపడతారో లేక సామాన్య జనాలే జంతువులకు సాయం చేసి నిజజీవితంలో రియల్ హీరోలవుతారో చూద్దాం! అంటూ ఓ ఊళ వేసింది నక్క. - యాసీన్ -
మా బుజ్జిగాడి సబ్జెక్టు డౌట్సూ... నా మతికి పట్టిన గతి!
నవ్వింత మా బుజ్జిగాడు ఒకరోజు అకస్మాత్తుగా... ‘‘నాన్నా, నాగుపాముకు గాగుల్స్ అంటే చాలా ఇష్టం కదా’’ అని అడిగాడు. కాసేపు నా మతి (అలా షికారుకు) పోయి, మళ్లీ తిరిగి మెదడులోకి తిరిగి వచ్చాక వాణ్ణి అడిగా... ‘‘నాగుపాముకూ, గాగుల్స్కూ సంబంధం ఏమిట్రా?’’ అని. ‘‘అదే నాన్నా... మాకు సైన్స్ క్లాస్‌లో చెప్పారు. నాగుపాము పడగ మీద స్పెక్టకిల్స్ ఉంటాయట. ఆ కళ్లజోడు గుర్తు కూడా పర్మెనెంటుగా ఉంటుందట. అంటే కళ్లజోడు జారిపోకుండా ఉంటానికేమో కదా నాన్నా’’ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్... అవి కళ్లజోడు వంటి ముద్ర మాత్రమే. అంతేగానీ, ఏ రేబాన్ గ్లాసులో, పోలీస్ బ్రాండ్ స్పెట్సో కావు. ఇలాంటి అరకొర నాలెడ్జ్‌తో బుర్ర చెడగొట్టుకోకు. నా బుర్రతిరిగేలా చేయకు’’ అని వాడికి వార్నింగ్ ఇచ్చా. సైన్స్ క్లాస్ గోల అలా ముగిసిందా! మళ్లీ సోషల్ క్లాస్‌లో జరిగిన మరో సంఘటనతో నా ఒంట్లోంచి నేనే బయటకు దూకి... కాసేపటిగ్గానీ మళ్లీ నా దేహంలోకి దూరలేకపోయా. ‘‘నాన్నా... శనిగ్రహం చుట్టూ అలా రింగులు ఎందుకుంటాయో, మిగతా గ్రహాలకు ఎందుకుండవో నాకు తెలిసిపోయింది’’ అన్నాడు. ‘‘ఎందుకురా?’’ అడిగాను ఆసక్తిగా. ‘‘ఎందుకంటే... శనిగ్రహం తాలూకు దుష్టగ్రహ ప్రభావం తనమీదే పడకుండా అలా రింగులుంటాయి’’ అన్నాడు వాడు. ‘‘మోకాలికీ బోడిగుండుకూ ముడెయ్యకు. శనిగ్రహం చుట్టూ రింగులుంటే దాని ప్రభావం దాని మీద పడకుండా ఉండటమేంటి?’’ అడిగాన్నేనను. ‘‘మొన్న మన ఇంటికి వచ్చిన అంకుల్గారూ... అన్ని వేళ్లకూ రింగ్స్ పెట్టుకున్నారు కదా. ‘అన్ని రింగ్స్ ఎందుకూ’ అని నువ్వు అడిగితే... కొన్ని గ్రహాల దుష్టప్రభావం తన మీద పడకుండా ఉండటానికీ, తనకు అంతా మంచి జరిగేందుకూ అని జవాబిచ్చారు కదా. ఇక శనిగ్రహం మాట అంటావా! ‘శనిలా పట్టుకున్నావు, శనిగాడు’ లాంటి పదాలతో పాపం ఆ గ్రహంపై అందరూ ఆగ్రహిస్తూ, దాన్ని ఆడిపోసుకుంటుంటారు కదా నాన్నా. అందుకే తన చెడు తనకే తగలకుండా ఆ ఒక్క గ్రహానికే రింగులుంటాయని నాకు అర్థమైపోయిందిలే’’ అన్నాడు.ఈసారి నేను నా మతి పోగొట్టుకున్న మాట వాస్తవమే గానీ... అలా పోయిన సదరు మతిని వెతికి మళ్లీ మైండ్‌లో సెట్ చేసుకోడానికి నాకు చాలా టైమే పట్టింది. ‘‘నాన్నా... దున్నపోతు మీద వర్షం పడితే, ఎంత తడిసినా దానికి ఏమీ కాదట కదా. మా తెలుగు క్లాస్‌లో మా సార్ ఈ సామెత చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్నా. దున్నపోతు మీద ఎంత వర్షం కురిసినా దానికి ఏమీ కాదెందుకో తెలిసింది. ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ అన్న సామెత ఎందుకు పుట్టిందో కూడా అర్థమైంది’’ అన్నాడు వాడు. చిన్నప్పట్నుంచీ చదువుకునే తెలుగే కదా. ఈ క్లాసుతో ప్రమాదమేమీ ఉండదులే అనుకున్నా. అయినా ఆసక్తిని చంపుకోలేక అడిగితే, ‘‘ఎందుకంటే... దున్నపోతుకు ఏ జలుబో గిలుబో చేసిందనుకో. దానికి విక్సో, జండూబామో, టైగర్బామో రాసేవాళ్లు ఎవరుంటారు నాన్నా? అందుకే దేవుడలా ఏర్పాటు చేశాడన్నమాట’’ అని జవాబిచ్చాడు. మా బుజ్జిగాడు లెక్కల్లో కాస్త పూర్. అవేవో చెబుదామని పూనుకుని, కూడికలయ్యాక, తీసివేతలు చెబుతున్నా. ‘‘నీ దగ్గర వంద రూపాయలున్నాయనుకో. అందులో ఇరవై పెట్టి లాలీపాప్‌లు కొనుక్కుని మిగతా డబ్బులు జేబులో వేసుకున్నావనుకో. నీ జేబులో ఉన్న డబ్బులెన్నీ?’’ అన్నా. వాడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించాడు. ఆ భంగిమ నాకు నచ్చింది. ఎవరైనా ఏదైనా ఆలోచిస్తున్నారంటే... సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా. ‘‘అదీ... అదీ... అలా ఆలోచించాలి. చెప్పు... ఇప్పుడు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో దాచకుండా చెప్పు’’ అంటూ ప్రోత్సహించా. ‘‘కంగారూకు సంచి ఎందుకుంటుందో నాకిప్పుడు తెలిసింది’’ అన్నాడు. ‘‘సడన్‌గా లెక్కల నుంచి మళ్లీ బయాలజీకి వెళ్లావెందుకు రా’’ అన్నాను విసుగ్గా, ఒకింత ఆందోళనగా. ‘‘ఎందుకంటే... అది లాలీపాప్ కొనుక్కున్న తర్వాత మిగిలిన డబ్బుల్ని దాచుకోడానికి దేవుడు దానికి ముందే ఒక జేబు కుట్టేశాడు నాన్నా. మనలా షర్టూ, ప్యాంట్లకు జేబులు కుట్టుకోవాల్సిన అవసరం దానికి లేదు’’ అన్నాడు వాడు. ఈ సారి నా మతి మళ్లీ పోయింది. కానీ షికారుకు కాదు. అది పారిపోయింది. అలా పోయిన నా మతి ఇప్పట్లో దొరుకుతుందో, లేదో?! - యాసీన్ -
ఎముక క్యాన్సర్లు అస్థికకు అనర్థం
శరీరం లోపల మనకు ఎముక లేకపోతే... అసలు మనకు రూపమే ఉండదు. ఎముకల సముదాయంతో అస్థిపంజరం మనకో అస్థిత్వాన్ని ఇస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆకృతికి మూలం అస్థిసముదాయమే. శరీరంలోని భాగమే కాబట్టి అన్ని అవయవాల్లాగే దానికీ క్యాన్సర్ల వంటి జబ్బులు వస్తాయి. కాకపోతే నేరుగా ఎముకకే క్యాన్సర్ రావడం కాస్తంత అరుదు. కానీ ఇతర క్యాన్సర్లు ఎముకలకు పాకడం సాధారణం. ఎముకలకు వచ్చే క్యాన్సర్లు, వాటి లక్షణాలు, ఇటీవల ఈ రంగంలోనూ వచ్చిన ఆధునిక చికిత్సల వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. రకాలు... బయటకు కనిపించే శరీరాకృతిని అలా నిలబెట్టి ఉంచడానికి తోడ్పడేవి ఎముకలే. వీటిలో మూడు రకాల కణాలు ఉంటాయి. మొదటివి ఆస్టియోబ్లాస్ట్స్ (ఎముక పెరిగే సమయంలో దీని నుంచే కొత్త కణాలు పుడుతుంటాయి); రెండోవి ఆస్టియోసైట్స్ (అంటే ఇవి ప్రధాన ఎముక కణాలన్నమాట), మూడో రకం కణాలను ఆస్టియోక్లాస్ట్స్ అంటారు. అంటే ఎముక కణాల జీవితం పూర్తయ్యాక వాటిని శిథిలం చేసే కణాలివి. ఎముక క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు మనం క్యాన్సర్ గురించీ కాస్త తెలుసుకోవాలి. ఏ అవయవంలోని కణాలైనా ఒక నిర్దిష్ట క్రమంలో కాకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా హానికరమైన రీతిలో పెరగడమే క్యాన్సర్. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. శరీరంలోని ఏ భాగంలో క్యాన్సర్ మొదలైతే... దాన్ని ఆ అవయవ క్యాన్సర్‌గా చెబుతారు. ఉదాహరణకు ఊపిరితిత్తులకు క్యాన్సర్ వస్తే దాన్ని లంగ్ క్యాన్సర్ అంటారు. ఏ భాగానికి ముందుగా క్యాన్సర్ వచ్చిందో దాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటారు. ఇక క్యాన్సర్ అన్నది ఆ భాగానికే పరిమితం కాకుండా అలా ఎటుపడితే అటు పెరిగిపోతుందన్న విషయం కూడా తెలిసిందే. ఇలా ఒక క్యాన్సర్ పెరగడాన్ని మెటస్టాసిస్ అంటారు. క్యాన్సర్ అన్నది తొలుత ఎముకలోనే మొదలైతే దాన్ని ‘ప్రైమరీ బోన్ క్యాన్సర్’ అంటారు. ఒకవేళ శరీరంలోని వేరే ఏదైనా భాగానికి క్యాన్సర్ వచ్చి అది పాకే (మెటాస్టాటైజ్) క్రమంలో ఎముకకు చేరితే దాన్ని సెకండరీ బోన్ క్యాన్సర్ అంటారు. మామూలుగా ఈ క్యాన్సర్ ఏ ఎముకకైనా రావచ్చు. కానీ చిన్న ఎముకలతో పోలిస్తే పొడుగ్గా పెరిగేందుకు అవకాశం ఉన్న కాళ్లు, చేతుల ఎముకలకు రావడం ఒకింత ఎక్కువ. సాధారణంగా నేరుగా ఎముకకు క్యాన్సర్ రావడం అరుదే అయినప్పటికీ... రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వచ్చి... ఆ కణుతులు పెరుగుతూ ఎముకలకు పాకి... నిర్దిష్టమైన ఆకృతిలో సాఫీగా ఉండే ఎముకలపై సైతం కణుతులుగా ఏర్పడతాయి. ఇవి గాక... శరీరంలోని మృదు కణజాలమైన చర్మం, కండరాలు, నరాలూ-రక్తనాళాల సముదాయం, కొవ్వు కణాలు, ఎముకలోనే ఉండే మృదువైన కణజాలపు పొర సైనోవియమ్ వంటి వాటికి వచ్చే క్యాన్సర్లు మరో రకం. లక్షణాలు ఎముకలో నొప్పి: ఎముకని ఏదైనా భాగంలో కణితి పెరగగానే కనిపించే మొదటి లక్షణం నొప్పి. తొలుత ఈ నొప్పి రోజులోని ఏదో ఒక సమయంలో వస్తుంటుంది. క్యాన్సర్ పెరుగుతున్న కొద్దీ నొప్పి వచ్చే వ్యవధి కూడా పెరుగుతుంది. అయితే ప్రతి నొప్పినీ క్యాన్సర్‌గా భావించనవసరం లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి సాధారణ జబ్బుల్లోనూ ఎముకలూ, కీళ్లలో నొప్పులు వస్తాయి. ఇదే సమయంలో మరో విషయమూ గుర్తుంచుకోవాలి. ఒక్కోసారి ఎముకలకు వచ్చే కణుతులను ఆటల్లో తగిలిన గాయాలుగా పొరబడే అవకాశమూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా పరీక్ష చేయించుకుని, క్యాన్సర్ కాదని నిర్ధారణ అయితే నిశ్చింతగా ఉండాలి. వాపు : ఎముకలో నొప్పి వచ్చే చోట, వాపు కూడా కనిపించవచ్చు. ఎముక విరగడం : సాధారణంగా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందిన ప్రాంతంలో ఎముక బలహీనంగా మారుతుంది. అందుకే అక్కడ అది తేలిగ్గా విరుగుతుంది. శరీర కదలికలు తగ్గడం : సాధారణంగా ఎముక క్యాన్సర్‌లో కణితి కీళ్ల వద్ద వస్తే మామూలు కదలికలు సైతం తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. కాబట్టి శరీర కదలికలు తగ్గుతాయి. ఇతర లక్షణాలు: ఎముకల్లో నొప్పితో పాటు బరువు తగ్గడం వంటి అవాంఛిత పరిణామాలూ, నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకితే సదరు అవయవానికి చెందిన లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఎముక మృదుకణజాల క్యాన్సర్లలో : ఎముకలోని మృదు కణజాలానికి క్యాన్సర్ వ్యాపించినప్పుడు తొలి దశల్లో లక్షణాలు అంతగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఎముక మృదుకణజాలానికి సాగేగుణం (ఎలాస్టిసిటీ) ఎక్కువ. మనం దాన్ని కనుగొనే సమయానికి దాని పరిమాణం చాలా పెద్దగా పెరిగిపోయి ఉంటుంది. అందుకే ఈ తరహా క్యాన్సర్లలో మొదటి లక్షణం... నొప్పి లేని గడ్డ. ఈ గడ్డ పెరుగుతూ పోతున్నకొద్దీ నరాలనూ, కండరాలనూ నొక్కుతూ వాటిపై ఒత్తిడి పెంచుతుంది. దాంతో నొప్పి కలుగుతుంది. ప్రైమరీ బోన్ క్యాన్సర్ క్యాన్సర్ ముందుగా ఎముకలోనే పుట్టడాన్ని ప్రైమరీ క్యాన్సర్ అంటారన్నది తెలిసిందే. ఈ తరహా క్యాన్సర్‌ను ‘సార్కోమా’ అంటారు. ఇందులోని మరికొన్ని రకాలివి... ఆస్టియోసార్కోమా: ఎముకలోనే పుడుతుంది కాబట్టి దీన్ని ‘ఆస్టియోజెనిక్ సార్కోమా’ అని కూడా అంటారు. ఎముక క్యాన్సర్లలో ఇది అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ప్రధానంగా భుజాలు, కాళ్లు, పృష్టభాగం (పెల్విస్) ప్రాంతపు ఎముకల్లో 10 నుంచి 30 ఏళ్ల వారికి వచ్చే అవకాశాలు ఎక్కువ. కాండ్రోసార్కోమా : ఎముకల చివర్లో మృదువైన అస్థికణజాలం ఉంటుంది. దీన్నే కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్‌లో వచ్చే క్యాన్సర్‌ను కాండ్రోసార్కోమా అంటారు. సాధారణంగా ఇది 20 ఏళ్లలోపు వారికి చాలా అరుదు. అయితే వయసుతో పాటు ఎదుగుతున్న క్రమంలో ఇది వచ్చే అవకాశాలు ఒకింత ఎక్కువ. ఎవింగ్స్ సార్కోమా : ఇది ఎముకల్లోనూ మొదలుకావచ్చు లేదా కండరాల్లోనూ ఆవిర్భవించవచ్చు. పిల్లలు, టీనేజర్లలో ఎక్కువగా కనిపించే సాధారణ క్యాన్సర్లలో దీనిని మూడో స్థానం. ఫైబ్రోసార్కోమా అండ్ మ్యాలిగ్నెంట్ ఫైబ్రస్ హిస్టియోసైటోమా : ఈ రెండు రకాల క్యాన్సర్లూ వృద్ధుల ఎముకల చివర్లలో ఉండే మృదుకణజాలంలో మొదలవుతాయి. ప్రధానంగా భుజాలు, కాళ్లు, దవడ ఎముకల్లో ఈ తరహా క్యాన్సర్ల మొదలవుతాయి. జెయింట్ సెల్ ట్యూమర్ ఆఫ్ బోన్: ఈ తరహా క్యాన్సర్లలో నిరపాయకరమైనవీ ఉంటాయి. హాని చేసేవీ ఉంటాయి. అయితే అపాయం కలిగించని తరహావే ఎక్కువ. సాధారణంగా యుక్తవయస్కులు, మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. చాలావరకు పాకకుండా స్థిరంగా ఉంటాయి. శస్త్రచికిత్స తర్వాత మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. కాడోమా: సాధారణంగా 30 ఏళ్లు దాటినవారిలో ఇది వెన్నెముకకుగానీ లేదా పుర్రె కింది భాగపు ఎముకలకు గాని వచ్చే క్యాన్సర్. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఇది వచ్చే అవకాశాలు రెండు రెట్లు ఎక్కువ. చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కానీ విస్తరించవు. అయితే శస్త్రచికిత్స తర్వాత మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ. అప్పుడవి ఊపిరితిత్తులకూ, కాలేయానికీ, లింఫ్‌నోడ్స్‌కూ వ్యాపిస్తాయి. ఎముక క్యాన్సర్... దశలు ఎముక క్యాన్సర్‌ను అక్కడి నుంచి చిన్న ముక్క తీసి (బయాప్సీ), పరీక్షించి నిర్ధారణ చేస్తారు. అది ఏ మేరకు పాకింది, ఎంత విస్తరించిందన్న అంశాల ఆధారంగా క్యాన్సర్ ఏ దశలో ఉందన్నది నిర్ధారణ చేస్తారు. బయాప్సీ ద్వారా క్యాన్సర్ దశలో ఉందన్న విషయాన్ని నిర్ణయించడం పైనే చికిత్స ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎముకకు క్యాన్సర్ అని, అది ఏ దశలో ఉందన్నది నిర్ధారణ అయితే ఇతర ఆర్థోపెడిక్ సర్జన్లతోనూ సంప్రదించి, రోగిని బతికించడానికి సదరు అవయవాన్ని ఏ మేరకు తొలగించాలన్న విషయాన్నీ నిర్ధారణ చేస్తారు. సాధారణంగా ఎముక క్యాన్సర్ ఏ దశలో ఉందనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి అమెరికన్ జాయింట్ కమిషన్ ఆన్ క్యాన్సర్ (ఏజేసీసీ) రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తున్నారు. ఇందులో ట్యూమర్ (టీ), లింఫ్ నోడ్ (ఎన్), మెటాస్టాసిస్ (ఎమ్) అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని బట్టి క్యాన్సర్ ఏ దశ (గ్రేడ్)లో ఉందో తెలుసుకుంటారు. అందుకే ఈ దశను ‘జీ’ (గ్రేడ్) అనే ఇంగ్లిష్ అక్షరం ద్వారా సూచిస్తారు. జీ1, జీ2 అనే దశలో తక్కువ తీవ్రమైనవిగానూ, జీ3, జీ4 దశలో చాలా తీవ్రమైనవిగానూ నిర్ణయిస్తారు. వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్స ప్రక్రియలు మారుతుంటాయి. సెకండరీ బోన్ క్యాన్సర్ ఇక ఈ తరహా క్యాన్సర్లు శరీరంలోని ఏ భాగంలోనైనా ఆవిర్భవించి, ఎముకకు పాకితే దాన్ని సెకండరీ క్యాన్సర్‌గా చెప్పుకోవచ్చు. రక్తప్రవాహంతో గానీ, లింఫ్ ప్రవాహంతోగానీ క్యాన్సర్ కణాలు ఎముకకు పాకి అక్కడ పెరుగుతాయి. ఈ తరహా క్యాన్సర్ల సాధారణంగా శరీరం మధ్యభాగంలో ఉండే ఎముకలు అంటే పృష్ఠభాగం (పెల్విస్)లోగానీ వెన్నెముక (స్పైన్)లోగాని కనిపిస్తాయి. చికిత్స ప్రక్రియలు ఎముక క్యాన్సర్‌కు ఇప్పటివరకూ అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయ చికిత్స ప్రక్రియలు... శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఫ్రాక్షనేటెడ్ డోస్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ. శస్త్రచికిత్స : ఇక ఎముకల మృదు కణజాలానికి క్యాన్సర్ వస్తే అనుసరించే ప్రక్రియల్లో శస్త్రచికిత్స చాలా సాధారణం. ఈ శస్త్రచికిత్సల్లోనూ తొలిదశలో క్యాన్సర్‌ను గుర్తించినా లేదా చుట్టూ ఉన్న మృదుకణజాలానికే క్యాన్సర్ పరిమితమైనా... శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరించినప్పటికీ, వ్యాధి సోకిన అవయవాన్ని సాధ్యమైనంత వరకు తొలగించకుండా రక్షించడానికే ప్రయత్నిస్తారు. ఒకవేళ క్యాన్సర్ ముదిరిపోయిన దశలో ఉంటే అప్పుడు కూడా అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితుల్లోనూ... కేవలం ఎముకను మాత్రమే తొలగించి, దాని స్థానంలో లోహంతో తయారు చేసిన, కొత్తదైన కృత్రిమ ఎముకను అమర్చి అవయవం ఎప్పటిలాగే ఉంచేలా చూస్తారు. ఒకవేళ క్యాన్సర్ గనక లింఫ్నోడ్స్కు చేరితే... (లింఫ్‌నోడ్స్... అన్ని అవయవాలకూ క్యాన్సర్‌ను చేర్చే గేట్ వే లాంటివి కాబట్టి) వాటిని పూర్తిగా తొలగిస్తారు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ కణజాలాన్ని తొలగించాక... ఆ అవయవం మునుపటి ఆకృతి కోల్పోతే... అది ముందులాగే ఉండేలా చూసేందుకు ‘రీ-కన్స్ట్రక్టివ్ సర్జరీ లేదా రీప్లేస్మెంట్ సర్జరీ’ని నిర్వహిస్తారు. ఇక క్యాన్సర్ కారణంగా ఎముకలకు తీవ్రమైన నొప్పి వస్తే... చివరి ఉపశమనంగా నిర్వహించే శస్త్రచికిత్సను ‘ప్యాలియేటివ్ సర్జరీ’ అంటారు. ఇందులో ఏ రకమైన శస్త్రచికిత్సను ఎంపిక చేయాలన్న అంశం... వ్యాధి ఏ దశలో ఉంది, ఎముకలోని ఏ ప్రాంతంలో ఉంది, ఆ క్యాన్సర్ గడ్డ సైజ్ ఎంత, రోగి తాలూకు ఇతర ఆరోగ్యపరిస్థితులేమిటి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీనితో పాటు అవసరాన్ని బట్టి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాలి. సర్జరీ అవసరం లేకుండా చేసే చికిత్సలు: క్యాన్సర్ గడ్డ ఏ రకానికి చెందినది, అది ఏ ప్రాంతంలో ఉంది అన్న అంశం ఆధారంగా చేయాల్సిన చికిత్స-ప్రణాళికను నిర్ణయిస్తారన్నది తెలిసిందే. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేని సందర్భాల్లో క్యాన్సర్ కణాలను నాశనం చేసే బీమ్రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ వంటి మార్గాలు అనుసరిస్తారు. అయితే క్యాన్సర్ ఉన్న ప్రాంతం, గ్రేడ్, రోగి వయసు, ఆరోగ్యపరిస్థితి వంటి అనేక అంశాల ఆధారంగా శస్త్రచికిత్స, కీమో, రేడియేషన్ థెరపీలను సంయుక్తంగా ఉపయోగించుకుంటారు. అవయవాన్ని కాపాడటమే ప్రధాన లక్ష్యం... ఎల్ఎస్ఎస్ కాలి ఎముక లేదా చేతి ఎముక ఇలా ఏ ఎముకకు క్యాన్సర్ సోకినా... డాక్టర్ల ప్రధాన లక్ష్యం సాధ్యమైనంత వరకు ఆ అవయవాన్ని కోల్పోకుండా కాపాడటమే. శస్త్రచికిత్స ప్రక్రియను ఎంపిక చేసుకున్నప్పటికీ ఇందుకోసమే డాక్టర్లు శ్రమిస్తారు. డాక్టర్ల ఈ ఉద్దేశాన్నే వైద్యపరిభాషలో ‘లింబ్ సాల్వేజ్ సర్జరీ’ (ఎల్.ఎస్.ఎస్.)అంటారు. ఇందులో రెండు అంచెలుంటాయి. మొదటి అంచెలో ఆరోగ్యకరమైన భాగాన్ని వీలైనంతగా రక్షించుకుంటూ... క్యాన్సర్‌కు గురైన భాగాన్ని పూర్తిగా తొలగించడం. రెండో అంచెలో... ఇలా తొలగింపు తర్వాత కోల్పోయిన భాగాన్ని పునర్నిర్మించడం. ఈ పునర్నిర్మాణం కోసం రకరకాల మార్గాలు అవలంబిస్తారు. ఉదాహరణకు... కోల్పోయిన ఎముక స్థానంలో లోహంతో చేసిన అలాంటి ఆకృతినే అమర్చుతారు. ఇలా కృత్రిమంగా అమర్చే లోహభాగాన్ని ‘ప్రోస్థెసిస్’ అంటారు. ఒక్కోసారి మొత్తం ఎముకే... లోహంతో తయారు చేసి తొలగించిన ఎముక స్థానంలో దీన్ని అమరుస్తారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే ఎముక మార్పిడి (బోన్ ట్రాన్స్‌ప్లాంట్) చికిత్స అన్నమాట. ఇలా చేయడానికి అనుగుణంగా ఇప్పుడు సర్జన్సకు రకరకాల లోహాలు అంటే... మృదులాస్థి కోసం మృదువైన లోహాలతో తయారైనవీ (వీటిని సాఫ్ట్ టిష్యూ అల్లోగ్రాఫ్ట్ప్ అంటారు); గట్టి ఎముకల కోసం గట్టి లోహాలతో రూపొందించనవీ... రోగి ఎముక పరిమాణం ఎంతుందో అంతే సైజ్‌లో ఉన్నవీ లభ్యమవుతున్నాయి. వయసుతో పాటూ ఎదిగే కృత్రిమ ఎముకలు... ఇప్పుడు వైద్యవిజ్ఞానశాస్త్రంలో ఈ శస్త్రచికిత్స ప్రక్రియల పురోగతి ఎంతగా ఉందంటే... ఎదిగే వయసులో ఉన్న ఒక అబ్బాయికి ఎముక క్యాన్సర్ సోకి... ఎముకను తొలగించాల్సి వస్తే... అతడిది పెరిగే వయసు కాబట్టి... పెరుగుతున్న కొద్దీ లోహపు ఎముక కూడా పెరిగేలా వ్యాప్తిచెందే కృత్రిమ ఎముకలూ ఉన్నాయి. రోగి అవయవాన్ని రక్షించడం కోసమే ఈ తరహా ఉపకరణాలను రూపొందించారన్నమాట. శస్త్రచికిత్సల్లో మరో రెండు ప్రక్రియలు... ఆర్థ్రోడెసిస్: ఈ ప్రక్రియలో రోగి నుంచే తీసుకున్న ఎముకను గానీ... లేదా ఎముకల బ్యాంకులో అతడికి సరిపడే ఎముకనుగానీ స్వీకరించి ఎముక మార్పిడి చికిత్స చేస్తారు. ఆర్థ్రోడెసిస్ ప్రక్రియను అనుసరిస్తే... కీలు వద్ద కూడా ఎముక వంగదు. ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. కానీ రోగి అవయవాన్ని కోల్పోకుండా ఉండే సౌలభ్యం మాత్రం ఉంటుంది. ఆర్థ్రోప్లాస్టీ : ఇందులో రోగి నుంచి తొలగించిన ఎముక పరిణామం, అతడిలో సరిగ్గా ఇమిడిపోగల తత్వం వంటి సౌకర్యాలు ఉంటాయి. ప్రతికూలతలూ ఉండవచ్చు... అయితే ఆర్థ్రోడెసిస్ లేదా ఆర్థ్రోప్లాస్టీ... ఇలా ప్రక్రియ ఏదైనప్పటికీ కృత్రిమ ఎముక మార్పిడి చికిత్స తర్వాత ఎముక అరగడం, ప్రమాదాల వంటివి జరిగినప్పుడు ఎముక విరగడం వంటి ప్రతికూలతలూ ఉంటాయి. ఇక కృత్రిమ ఎముకల అమరిక అన్నది రోగులందరికీ సాధ్యం కాకపోవచ్చు. పరిస్థితులను బట్టి అనుకూలతలు లేకపోతే కొందరిలో అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితీ ఉండవచ్చు. ఇవన్నీ రోగి పరిస్థితిని బట్టి చికిత్స చేసే డాక్టర్ల బృందం సంయుక్తంగా తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎముక మార్పిడి విషయంలో ఎముకలను ఇతర వ్యక్తుల నుంచి సేకరించి ఉంచిన ‘బోన్ బ్యాంకు’ నుంచి స్వీకరించి, దాన్ని రోగి శరీరంలో అమర్చితే రోగి దేహం దాన్ని ఆమోదించకపోవడం వంటి ప్రతికూలతలూ ఉంటాయి. అరుగుదల రేటూ ఎక్కువే. కానీ లోహపు ప్రోస్థసిస్ వంటివి అమరిస్తే మాత్రం ఇలాంటి కాంప్లికేషన్లకు అవకాశం తక్కువ. ఇన్ని సౌకర్యాలూ, ఆధునిక పరిజ్ఞానం, వయసు ఎదిగే కొద్దీ పెరిగే కృత్రిమ ఎముకల అందుబాటు వంటి ఎన్నెన్నో మార్గాలు ఉన్నప్పటికీ డాక్టర్ ప్రధాన ధ్యేయం రోగి ప్రాణాలను రక్షించడమే. ఆ తర్వాతే సాధ్యమైనంత వరకు మిగతా అంశాలను పరిగణనలోకి తీసుకుని, రోగి మునపటి సౌకర్యాలను వీలైనంతగా పొందేలా డాక్టర్లు చూస్తారు. దీనితో పాటు రోగికి అవసరమైన ఆహారం (న్యూట్రిషన్), నొప్పి తగ్గించడం (పెయిన్ మేనేజ్మెంట్), కదలికలను మునుపటిలా చేసే స్వాభావిక చికిత్స (నేచురోపతి మెడిసిన్), ఫిజియోథెరపీ, ఆధ్యాత్మిక అంశాల బోధన వంటి అనేక విషయాలతో రోగికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. - నిర్వహణ: యాసీన్ -
మా బుజ్జిగాడూ... దేవుడు మెచ్చే నా అబద్ధాలు!!
మా బుజ్జిగాడి సబ్జెక్టుల్లోని ఈవీఎస్ (ఎన్విరాన్మెంటల్ స్టడీస్) నా కొంపముంచడానికే ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మనం అనుకోనిది జరగడమే కదా దైవలీల. సరిగ్గా వాడి కంప్లయింట్ కూడా దైవలీల గురించే. దేవుడి వరస ఏమీ బాగాలేదన్నది వాడి వాదన. ఇంతకీ వాడు చెప్పినదేంటంటే... ‘‘నాన్నా... సీతాకోకచిలుకలకు బుజ్జిబుజ్జి సీతాకోకచిలుకలు పుట్టవటకదా? ఇవ్వాళ్ల మాకు సైన్సుపాఠంలో చెప్పారు. అవి గుడ్లు పెట్టాక మనం చూడ్డానికి అసహ్యంగా కనిపిస్తూ ఉండే, లార్వాలు అని పిలిచే గొంగళిపురుగులు పుడతాయటకదా? దోమల విషయంలో కూడా అంతేనట. వాటి లార్వాలూ అసహ్యంగా ముడుచుకుంటూ నీళ్లలో ఈదుతూ ఉంటాయట. దేవుడి పనితీరు అంతా అస్తవ్యస్తంగా ఉంది నాన్నా ’’ అన్నాడు వాడు. ‘‘అవి గొంగళిపురుగులైతే నీకొచ్చిన నష్టం ఏముందిరా. ఆ తర్వాత ప్యూపా దశ దాటాక అవే మళ్లీ సీతాకోకచిలుకలైపోతాయి కదా?’’ అన్నాన్నేను. ‘‘ఇప్పుడూ... మన గేదెకు పుట్టిన చిన్ని దూడ, మన ఆవుకు పుట్టిన తువ్వాయీ... వాటిని చూడు... ఎలా చలాగ్గా, చురుగ్గా గంతులేస్తూ తిరుగుతూ ఉంటాయో?! వాటి తల్లులు కూడా దూకుతూ ఉండే ఆ చిన్నారి కూనల్ని నాకుతూ మురిసిపోతూ ఉంటాయి. అంతెందుకు, నేను చూడటానికి ఇష్టపడని హైనాల చిన్నారి కూనలూ చిన్నప్పుడు అందంగా ఉంటాయి. అలాంటి అదృష్టం తల్లి సీతాకోకచిలుకలకు వద్దా? అవేం పాపం చేశాయి? వాటి పిల్లల్ని ముద్దు చేసుకోవద్దా? దేవుడి పద్ధతేమీ బాగా లేదు’’అంటూ భగవంతుణ్ణి కాస్త కోప్పడ్డాడు. అంతేకాదు, ఒకింత అలిగి... ‘‘ఇందుకు నిరసనగా... ఓ రెండ్రోజుల పాటు నేను దేవుడికి దణ్ణం పెట్టను ఫో’’ అన్నాడు. ‘‘దేవుడేం చేసినా తప్పకుండా దానికో పర్పస్ ఉంటుంది నాన్నా’’ అంటూ సముదాయించబోయాన్నేను. ‘‘ఏముంటుంది? గతేడాది నువ్వు చెప్పినట్టు కాకులకు మ్యాథ్స్ రాదంటే అందులో ఓ అర్థం ఉంది. కోకిల తన గుడ్లను కాకి గూడులో పెడుతుంది కాబట్టి... వాటిని లెక్కించగలిగితే కోకిల బిడ్డలను కాకి పెంచదు కాబట్టి... కాకులెంత తెలివైనవైనా దేవుడు వాటికి మ్యాథ్స్ రాకుండా చేశాడు. లాస్టియర్ ఈవీఎస్లోని ‘బిజీమంత్’ లెసన్ చెబుతూ నువ్వు చెప్పిన మాటే ఇది. కానీ సీతాకోకచిలుకలకు డెరైక్ట్‌గా చిన్ని చిన్ని - బుజ్జి బుజ్జి సీతాకోకచిలుకలు పుడితే అవి మరింకెంత అందంగా ఉండేవో కదా? అలాగే, చిన్నారి దోమకూనల్ని చూసి ఎన్ని ముద్దులు పెట్టేవో కదా ఆ తల్లిదోమలు?’’ అంటూ ఎంతో బాధపడ్డాడు వాడు. వాణ్ణి ఎలా సమాధానపరచాలో అర్థం కాలేదు నాకు. ఏదో రకంగా ఓదార్చకపోతే వాడు అన్నం కూడా తినడు. అందుకే లాస్టియర్ కాకి మ్యాథ్య్‌లో పూర్ అన్న లాజిక్ లాగానే ఈసారి కూడా ఏదో ఐడియా వేద్దామని అనుకున్నా. ముందు ఏమీ తోచలేదు గానీ తర్వాత గబుక్కున ఓ ఐడియా వచ్చింది. నేను చెప్పేవి కాస్త అబద్ధాలైనా పెద్దయ్యాక సత్యం వాడే తెలుసుకుంటాడనుకున్నా. అదీగాక... ఆపద వేళల్లో బొంకడం తప్పుకాదనే సూత్రం ఆధారంగా ఆ అబద్ధాలు చెప్పేశా. అవేమిటో మీరూ వినండి. ‘‘అది కాదురా... ఇప్పుడూ మనుషుల బిడ్డలు పుట్టగానే ఎప్పుడైనా చూశావా? ఆ చిన్నారుల చుట్టూ గట్టిగా బట్టలు కప్పుతారు కదా! అలాగే చిన్ని చిన్ని బిడ్డలకు ఒళ్లంతా పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు తొడుగుతారు. ఎందుకంటే వాళ్ల సున్నితమైన శరీరం బయటి వాతావరణానికి తట్టుకోలేదు కదా. ఈ సీజన్లో నువ్వు అమ్మను రగ్గు కప్పమని అడుగుతావు చూడు, అలాగన్నమాట. మరి సీతాకోకచిలుక పిల్లలు రగ్గు కప్పుకోలేవు కదా? పైగా ఇప్పుడు చలికాలం. అందుకే వాటికి చలేయకుండా దేవుడు అలా నేచురల్‌గా గొంగళి కప్పేశాడన్నమాట’’ అన్నా. ‘‘మరి దోమల పిల్లల్ని తల్లి కూడా ముద్దు పెట్టుకోకుండా నీళ్లలో ఎందుకు వదిలేశాడు?’’ అంటూ మరో పాయింట్ లాగాడు. బుర్రగోక్కుని... మరోసారి నా అతితెలివి ఉపయోగించి ఆన్సర్ చెప్పా. ‘‘ఎందుకంటే... తల్లి దోమలు తమ పిల్లల్ని ముద్దుపెట్టుకోబోతే పొరబాటున అవి మన రక్తం తాగడానికి ఉపయోగించే ఇంజెక్షన్ లాంటి సూది ఆ చిన్నారి దోమ పిల్లలకు గుచ్చుకుంటుందేమోనని దేవుడి భయం. అందుకే అవి తల్లికి దూరంగా ఉండేలా ఏర్పాటు చేశాడు. అందుకోసమే దోమ లార్వాలను దేవుడు నీళ్ల తొట్టెల్లో పెరిగేలా చేస్తాడన్నమాట. పైగా నీకు స్విమ్మింగ్ పూల్‌లో ఈదడం ఇష్టం కదా. అలాగే వాటికీ అదే ఇష్టమన్నమాట. ఈ రెండు ప్రయోజనాలూ నెరవేరతాయని దేవుడలా చేశాడన్నమాట’’ అంటూ జవాబు చెప్పా. అప్పుడుగానీ వాడు అన్నం తినడానికి కూర్చోలేదు! ఆ తర్వాత నాతో అలాంటి అబద్ధాలాడించినందుకు నేను కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ‘హా... భగవంతుడా’ అంటూ ఓ నిట్టూర్పు విడిచా! - యాసీన్ -
హెచ్ఐవీ చాపకింది నీరులా... రక్షణ పొందడమిలా!
హెచ్ఐవీ వైరస్ రక్తం నుంచి వేరుచేస్తే చాలా త్వరగా చనిపోతుంది. నేరుగా హాని చేయదు. కానీ చాపకింది నీరులా ఎంతో హాని చేస్తుంది. అది మన రోగ నిరోధకశక్తిని నిర్వీర్యం చేస్తుంది. దాంతో అంతకు మునుపు మనం హాని చేయగలదని భావించని చిన్న చిన్న ఇన్ఫెక్షన్లే పెనుముప్పుగా తయారవుతాయి. మనకు సోకి కూడా ఏమీ చేయకుండా వాటంతట అవే తగ్గిపోయే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లూ, ఇతర సూక్ష్మజీవుల వల్ల సంక్రమించే జబ్బులూ ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తాయి. అంతకుమునుపు అస్సలు హాని చేయకుండా, హెచ్ఐవీ కారణంగా రోగనిరోధకశక్తి దెబ్బతినడం వల్ల ఇవి ముప్పుగా పరిణమిస్తాయి కాబట్టి వీటిని హెచ్ఐవీకి సంబంధించిన అవకాశవాద ఇన్ఫెక్షన్స్గా పేర్కొంటారు. వైద్య పరిభాషలో వీటినే ‘ఆపర్చ్యయనిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఇన్ హెచ్ఐవీ’గా అభివర్ణిస్తారు. డిసెంబరు 1న ఎయిడ్స్ డే సందర్భంగా... హెచ్ఐవీని ఆసరా చేసుకుని విజృంభించే ఈ తరహా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొంది, సాధారణ జీవితం గడపడం ఎలాగో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. హెచ్ఐవీ రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు సోకేదెప్పుడు...? మనలో రోగనిరోధక శక్తిని కలిగించే కణాలు చాలా ఉంటాయి. అందులో ‘టీ’ సెల్స్ ముఖ్యమైనవి. వీటినే సీడీ4 కణాలు అని కూడా పిలుస్తారు. సాధారణంగా హెచ్ఐవీ సోకినవారు కూడా మామూలు వ్యక్తుల్లాగే సాధారణ జీవితం గడుపుతారు. అయితే హెచ్ఐవీ వైరస్ ఈ రోగనిరోధక కణాలను క్రమంగా దెబ్బ తీస్తూపోయి వాటి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ‘టీ’సెల్స్ సంఖ్య (సీడీ4 కణాల కౌంట్) ప్రతి మైక్రోలీటర్కూ 200 కంటే తగ్గితే (200 సెల్స్/మైక్రోఎల్) అప్పుడు ఆ రోగికి ‘ఎయిడ్స్’ సోకినట్లుగా నిర్ధారణ చేస్తారు. ఈ స్థితిలో రోగికి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సంక్రమిస్తాయి. అయితే ఆ దశలోనూ కొన్ని రకాల యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్ మందులతో చికిత్స చేస్తూ రోగిని మామూలు వ్యక్తిలాగే పూర్తి జీవిత కాలం బతికేలా చూడవచ్చు. అందుకే అనేక వ్యాధుల్లాగే ఎయిడ్స్ పూర్తిగా తగ్గకపోయినా... ఈ రోజుల్లో ఎయిడ్స్ కూడా డయాబెటిస్ వంటి ఇతర వ్యాధుల్లాగే వైద్యంతో అదుపులో ఉండే వ్యాధి (మెడికల్లీ మేనేజబుల్ డిసీజ్). సాటి వ్యక్తులంతా అపోహాలు తొలగించుకొని వీళ్ల పట్ల వివక్ష చూపకపోతే చాలు... ఈ రోగులు సైతం పూర్తి జీవితకాలం సాధారణంగానే బతకగలరు. ఎంతెంత కౌంట్‌కు... ఏయే తరహా జబ్బులకు చికిత్స... హెచ్ఐవీ సోకిన వారు ఎవరైనా వారి ‘టీ’సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉంటే వారి రోగనిరోధకశక్తి మామూలుగానే ఉంటుంది. అయితే అంతకంటే తగ్గితే మాత్రం ఏమేరకు కౌంట్ తగ్గిందో దాన్ని బట్టి సంక్రమించగల వ్యాధులకు తగిన నివారణచర్యలు / నివారణ చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. అది... * టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉంటే న్యూమోసిస్టిక్ నిమోనియా వ్యాధిని నివారించే చర్యలు తీసుకోవాలి. టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తగ్గి... ఆ తర్వాత చేయించిన రక్తపరీక్షలో టాక్సోప్లాస్మా అనే ఏకకణజీవి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్కు పాజిటివ్ అని తేలితే, ఆ సాంక్రమికవ్యాధి పెచ్చుమీరకుండా ఉండేందుకు చికిత్స తీసుకోవాలి. * టీ సెల్ కౌంట్ 50 /మైక్రోలీటర్ కంటే తగ్గితే మైకోబ్యాక్టీరియా ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ) అనే తరహా బ్యాక్టీరియల్ ఇన్షెక్షన్లను నివారించేందుకు అవసరమైన మందులు తీసుకోవాలి. వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇక్కడ పేర్కొన్న చాలా వ్యాక్సిన్ల వల్ల కొద్దిపాటి మంట/నొప్పి ఉంటుంది. అది కేవలం ఒక్క రోజులో తగ్గుతుంది. ఆపర్చ్యునిస్టిక్ ఇన్ఫెక్షన్లు... ప్రొఫిలాక్టిక్ చికిత్సలు హెచ్ఐవీ రోగిలో ‘టీ’ సెల్స్ తగ్గి, రకరకాల ఇన్ఫెక్షన్లు సోకేందుకు అవకాశం ఉందని నిర్దిష్టంగా తెలిసినప్పుడు, అవి రాకుండానే ముందుగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే వ్యాధి రాకుండా తీసుకునే చికిత్సను ‘ప్రొఫిలాక్సిస్’ చికిత్స అంటారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు తగ్గిన కౌంటును అనుసరించి, ఆయా దశల్లో రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రొఫిలాక్టిక్ చికిత్సలు తీసుకుంటే వారు సైతం నార్మల్‌గా ఉంటారు. ఈలోపు రోగనిరోధక శక్తి పెరిగే మందులూ వాడుతుంటారు కాబట్టి ఈ యాంటీబయాటిక్ తరహా ప్రొఫిలాక్టిక్ మందులను సీడీ4 సెల్ కౌంట్ మెరుగుపడే వరకూ వాడవచ్చు. హెచ్ఐవీ రోగులకు... వ్యాక్సిన్లు ఉపయోగపడతాయా? ప్రస్తుతం మార్కెట్లో రకరకాల వ్యాధులను నివారించే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామందిలో ఒక సందేహం ఉంది. ఇవి మామూలు వ్యక్తులకు ఎలాగూ ఉపయోగపడతాయి. అయితే హెచ్ఐవీ రోగులకూ ఇవి అదే తరహాలో ఉపయోగపడతాయా అనే సంశయం చాలా మందికి ఉంటుంది. సాధారణ ప్రజల్లో వ్యాధిని నివారించే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో... హెచ్ఐవీ రోగులకూ ఆయా వ్యాక్సిన్లు అదే తరహాలో ఉపయోగపడతాయి. నిజానికి మామూలు వ్యక్తుల కంటే హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులకు రకరకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ఇవి మరింత ఉపయోగకరం. అయితే హెచ్ఐవీ ఉన్నవారికి కొన్ని రకాల వ్యాక్సిన్లే సురక్షితం. అంటే ఉదాహరణకు వ్యాక్సిన్ల తయారీ రెండు రకాలుగా జరుగుతుంది. సాధారణంగా ఒక తరహా వ్యాక్సిన్ తయారీలో చనిపోయిన వైరస్‌ను ఉపయోగిస్తారు. ఈ తరహా వ్యాక్సిన్‌ను ‘ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. ఇక మరికొన్ని రకాల వ్యాక్సిన్లలో జీవించి ఉన్న వైరసే అయినప్పటికీ బాగా బలహీనపరచినదాన్ని, నిష్క్రియతో ఉండేదాన్ని ఉపయోగిస్తారు. ఈ తరహాగా రూపొందించిన వైరస్‌ను ‘లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్’ అంటారు. సాధారణంగా ఎయిడ్స్ రోగులకు ఇచ్చే వ్యాక్సిన్ల విషయంలో లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్ల కంటే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు ఉపయోగించడం మేలు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు హెచ్ఐవీ ఉన్న రోగులకు చికెన్‌పాక్స్‌ను నివారించేందుకు లైవ్ అటెన్యుయేటెడ్ వ్యాక్సిన్‌నూ ఉపయోగించవచ్చు. హెచ్ఐవీ రోగులు ప్రయాణం చేయదలిస్తే...? హెచ్ఐవీ రోగులు ఒకవేళ ప్రయాణం చేయదలిస్తే, వారు ఏ ప్రాంతానికి వెళ్లదలిచారో తమ డాక్టర్‌తో సంప్రదించాలి. అక్కడి స్థానిక పరిస్థితులు, అక్కడి స్థానిక వ్యాధులకు అనుగుణంగా అవసరమైన ముందుజాగ్రత్తలు, నివారణ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొన్ని రకాల ట్రావెల్ వ్యాక్సిన్లు హెచ్ఐవీ రోగులకు సురక్షితమే అయినా మరికొన్ని సురక్షితం కావు. అందుకే ప్రయాణానికి ముందు డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. పరిస్థితులను బట్టి అదనంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు మెనింగోకోకల్ వ్యాక్సిన్ : మెనింగోకోకస్ అనే సూక్ష్మక్రిమి మెదడు చుట్టూ ఉండే పొరల వాపు వచ్చేలా చేసి, మెనింజైటిస్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. హెచ్ఐవీ ఉన్నవారిలో... కాలేజీలలోని డార్మెటరీలలో నివసించేవారు, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు వెళ్లాల్సిన వారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. మెనింజైటిస్ విస్తృతంగా ఉన్న ప్రాంతానికి వెళ్లేవారు, లేదా అకస్మాత్తుగా ఈ వ్యాధి విజృంభించినప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ : హెపటైటిస్ ఏ వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కలుషితమైన నీటి వల్ల ఈ వైరస్ సోకుతుంది. మాదకద్రవ్యాలను రక్తనాళం (ఐవీ) ద్వారా లోపలికి తీసుకునే వారు, ఇంతకుమునుపే కాలేయ వ్యాధులు ఉన్నవారు, రక్తస్రావం విపరీతంగా జరిగే హీమోఫీలియా వంటి బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు, ప్రపంచ పర్యటనలకు వెళ్లేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. లైవ్ వ్యాక్సిన్లలో ఏవి తీసుకోవాలి? హెచ్ఐవీ రోగులు కొన్ని లైవ్ వ్యాక్సిన్లను సైతం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిని వారు తమ టీసెల్ (సీడీ4) కౌంట్ 200 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అవి.. వారిసెల్లా వ్యాక్సిన్ : రెండు మోతాదుల్లో తీసుకోవాల్సి ఈ వ్యాక్సిన్ చికెన్పాక్స్నుంచి రక్షణ ఇస్తుంది. జోస్టర్ వ్యాక్సిన్ : ఒక మోతాదులో తీసుకోవాల్సిన ఇది షింగిల్స్ అనే వ్యాధి నుంచి రక్షణ ఇస్తుంది. ఇది చికెన్‌పాక్స్‌కు సంబంధించిన వ్యాధి. ఇందులో చర్మంపై తీవ్రమైన నొప్పితో కూడిన కదుముల వంటి ర్యాష్ కనిపిస్తుంది. గర్భధారణను కోరుకుంటే...? హెచ్ఐవీ ఉన్న మహిళలు గర్భాన్ని ధరించాలని కోరుకుంటే తప్పనిసరిగా తమ డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భధారణకు ముందుగా విధిగా తీసుకోవాల్సిన కొన్ని రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఏయే ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్లు, ఎంతెంత వ్యవధి తర్వాత? హెచ్ఐవీ రోగులు వాడాల్సిన వ్యాక్సిన్లు... ఫ్లూ వ్యాక్సిన్ : జ్వరం, చలి, కండరాల నొప్పులు, దగ్గు, బొంగురుగొంతు లక్షణాలతో ఫ్లూ బయటపడుతుంది. దీన్ని ‘ఫ్లూ షాట్’ లేదా ‘ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్’ అంటారు. దీన్ని ప్రతి ఏడాదీ ఒక డోసు తీసుకోవాలి. న్యూమోకోకల్ వ్యాక్సిన్: న్యూమోకోకస్ అనేది ఊపిరితిత్తులు, చెవులు, రక్తం లేదా మెదడు చుట్టూ ఉన్న కణజాలాన్ని దెబ్బతీసే సూక్ష్మక్రిమి. దీన్ని నివారించే వ్యాక్సిన్‌ను న్యూమోనియా వ్యాక్సిన్ అని కూడా అంటారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. హెచ్ఐవీ ఉన్నవారు ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని 19 నుంచి 64 ఏళ్ల మధ్యన వాడుతుండాలి. ఇక వారికి 65 ఏళ్లు నిండాక కూడా ఈ రెండింట్లో ఒకదాన్ని వాడాలి. అయితే గత ఐదేళ్లలో వాడని రకాన్నే ఈసారి వాడాలి. డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్ వ్యాక్సిన్ : డిఫ్తీరియా రోగులకు గొంతు వెనక నల్లటి పొర ఏర్పడుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో అవాంతరాలు సృష్టిస్తుంది. టెటనస్ వ్యాధి కండరాల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. పెర్టుసిస్ను కోరింత దగ్గు అని కూడా అంటారు. దీని వల్ల రోగులకు తీవ్రమైన దగ్గు వస్తుంది. ఈ మూడు జబ్బులనూ నివారించే ఒకే వ్యాక్సిన్‌ను హెచ్ఐవీ రోగులు ఒకే మోతాదు (ఒక షాట్‌గా) తీసుకోవాలి. ఇలా ఈ మూడు వ్యాక్సిన్లు కలిపిన ఒకే షాట్‌ను ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వ్యాక్సిన్ : ఈ వైరస్ మర్మావయవాల వద్ద పులిపిరుల వంటి వాటికీ, కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. హెచ్ఐవీ ఉన్నవారు ఈ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్: హెపటైటిస్-బి వైరస్ కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో తీసుకోవాలి. వచ్చేందుకు అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లు... చికిత్సలు న్యూమోసిస్టిస్ న్యూమోసిస్టిస్ కేరినై న్యుమోనియా (పీసీపీ) అనే ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకే అవకావం ఉంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో అత్యధికుల్లో మరణానికి దారితీసే న్యూమోనియా రకాల్లో ఇదొకటి. యాంటీబయాటిక్స్‌తో చికిత్స ద్వారా ఈ పీసీపీని నివారించవచ్చు. నోటిలో థ్రష్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి, టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ ఉన్నవారికి ఈ వ్యాధి చికిత్స అవసరం. అయితే ఒకవేళ హెచ్ఐవీ ఉన్నందున యాంటీ రిట్రోవైరల్ మందులు (ఏఆర్వీ) వాడుతూ... వాళ్ల టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే ఎక్కువ ఉంటే వారు ఆరు నెలల పాటు పీసీపీకి చికిత్స తీసుకొని ఆ తర్వాత దాన్ని ఆపేయవచ్చు. కానీ టీసెల్ కౌంట్ అంతకంటే తక్కువ ఉంటే మాత్రం జీవితాంతం ‘పీసీపీ’కీ చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. టోక్సోప్లాస్మా పెద్దగా బాహ్యలక్షణాలేవీ కనిపించకుండా సంక్రమించే వ్యాధుల్లో టోక్సోప్లాస్మోసిస్ ఒకటి. అయితే టోక్సోప్లాస్మా ఇన్ఫెక్షన్కు కారణమైన ఏకకణజీవి... కొందరు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల మెదడుకు ఇన్ఫెక్షన్ కలిగేలా చేసి, మృత్యువుకు సైతం దారితీయవచ్చు. ఒక వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయితే, అతడి రక్తంలో టోక్సోప్లాస్మా పరాన్నజీవి అప్పటికే ఉందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయడం కోసం వెంటనే రక్తపరీక్ష నిర్వహించాలి. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడిలో టీసెల్స్ కౌంట్ 100/మైక్రోలీటర్ ఉంటే టోక్సోప్లాస్మా నివారణ చికిత్స ప్రారంభించాలి. అయితే న్యుమోసిస్టిక్ కేరినై న్యూమోనియా (పీసీపీ) చికిత్స కోసం వాడే కొన్ని మందులు టోక్సోప్లాస్మానూ నివారిస్తాయి. ఒకవేళ రక్తపరీక్షలో ఆ రోగికి అంతకుమునుపు టోక్సోప్లాస్మా లేదని తెలిస్తే అతడు ఆ వ్యాధికి ఎక్స్పోజ్ కాకుండా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇందులో భాగంగా అతడు పచ్చి మాంసం లేదా ఉడికీ ఉడకని మాంసానికి దూరంగా ఉండాలి. పిల్లి విసర్జనకు, మట్టికి దూరంగా ఉండాలి. దీంతో పాటు టోక్సోప్లాస్మా నివారణకు మరికొన్ని చర్యలు/జాగ్రత్తలు చేపట్టాలి. అవి... * వేటమాంసం, బీఫ్ అండ్ పోర్క్ రంగు పింక్ కలర్లో ఉందంటే అది ఉడకనట్టు లెక్క. అలాంటి మాంసాన్ని ఎయిడ్స్ రోగి తినకూడదు. * పిల్లి విసర్జనను శుభ్రపరచదలచుకుంటే చేతులకు గ్లౌవ్స్ ధరించాలి. ఆ తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. * తోట పని చేసిన తర్వాత చేతులను చాలా శుభ్రంగా కడుక్కోవాలి. * పచ్చిగా తినే పండ్లు, కూరగాయలను చాలా శుభ్రంగా కడిగాకే తినాలి. * మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ-మ్యాక్) * హెచ్ఐవీ రోగుల్లో టీ సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్స్ కంటే తక్కువ ఉన్నవారికి వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్లలో ఇదొకటి. మ్యాక్‌కు గురైన రోగుల్లో అత్యధిక జ్వరం, తీవ్రమైన కడుపునొప్పి, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని వాతావరణాల్లోనూ మ్యాక్ కనిపిస్తుంది. కొన్ని వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకున్నంత మాత్రాన దీన్ని నివారించలేము. అయితే ‘టీ’సెల్ కౌంట్ 50/మైక్రోలీటర్ కంటే తక్కువగా ఉన్నవారిలో కొన్ని రకాల ప్రివెంటివ్ యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఆ తర్వాత టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్‌కు చేరగానే ఈ చికిత్సను ఆపేయవచ్చు. ఈ చికిత్స కనీసం మూడు నెలలు కొనసాగాల్సి ఉంటుంది. క్యాండిడా (ఈస్ట్) క్యాండిడా అనే ఈ ఇన్ఫెక్షన్ హెచ్ఐవీ ఉన్న రోగుల్లో సాధారణంగా నోరు, యోని ప్రాంతాల్లో రావచ్చు. ఈస్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ చర్మంలోని ముడుత పడే ప్రాంతాల్లో పెరగవచ్చు. మలద్వారం చుట్టూ కూడా రావచ్చు. అయితే తరచూ పునరావృతమవుతుంటే తప్ప దీనికి నివారణ చికిత్సలు చేయరు. ఇదొక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా పక్షులు ఎక్కువగా ఉండే చోట్ల నేలలో ఇది పెరుగుతుంది. దీని వల్ల క్రిప్టోకాక్సోసిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రిప్టోకోకల్ మెనింజైటిస్ అనే మెదడు ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఇది టీసెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న వారిలో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఎయిడ్స్ రోగుల్లో కనిపించే అత్యధిక ఇన్ఫెక్షన్లలో దీనికి నాలుగో స్థానం. అయితే యాంటీ రిట్రోవైరల్ మందుల ఉపయోగం తర్వాత ఇది కనిపించే ఫ్రీక్వెన్సీ కొంత తగ్గినప్పటికీ, ఎయిడ్స్ మందులు వాడని వారిలో ఇప్పటికీ ఇది ఎక్కువగానే కనిపిస్తుంటుంది. మందులు వాడినప్పటికీ దీని నివారణ విషయంలో పెద్ద తేడా ఏమీ లేనందువల్ల సాధారణంగా దీనికి ఎలాంటి మందులనూ సిఫార్సు చేయరు. సైటోమెగాలోవైరస్ ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఈ సైటోమెగాలో వైరస్ (సీఎమ్‌వీ) సోకిన కొద్దిమందిలో తేలికపాటి జ్వరం, ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. అయితే చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఎయిడ్స్ రోగుల్లో ఈ వైరస్ ఉంటే అది వారి కళ్లు, జీర్ణవ్యవస్థ, మెదడు, వెన్నుపూస వంటి భాగాలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. కంటిలో రెటీనాను దెబ్బతీసే ఈ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ వల్ల రోగికి కనిపించే దృశ్యం అస్పష్టంగా మారి క్రమంగా చూపుపోవడం జరగవచ్చు. హెచ్ఐవీకి గురికాకమునుపే ఈ సీఎమ్వీకి గురైన కేసులు చాలా ఎక్కువే ఉంటాయి. ఇలా గతంలోనే సీఎమ్వీకి గురైన వారికి హెచ్ఐవీ సోకినట్లు నిర్ధారణ అయితే వారి టీ సెల్ కౌంట్ 200/మైక్రోలీటర్ కంటే తగ్గితే... కంటికి సంబంధించిన లక్షణాలు కనింపించినా, కనిపించకపోయినా తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించాలి. అయితే సీఎమ్‌వీ నివారణకు మందులు వాడినా పెద్ద ఫలితాలేమీ కనిపించకపోవడంతో దీని నివారణకు సాధారణంగా మందులూ సూచించరు. కాకపోతే... సీఎమ్‌వీ రెటినైటిస్ తొలిదశలోనే ఉన్నప్పుడు (అంటే చూపు అస్పష్టంగా మారడం, కంటి ముందు నల్లమచ్చలు కనిపించడం, మిరుమిట్లు గొలుపుతున్నట్లు, తేలుతున్నట్లు మెరుపులు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు) తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి తక్షణం చికిత్స తీసుకోవాలి. తొలిదశలో చికిత్స తీసుకుంటే దాని ప్రభావం, ఫలితం తప్పక కనిపిస్తాయి. క్రిప్టోస్పోరీడియోసిస్ ఇది కలుషితమైన నీటిని తాగేవారిలో, అలాంటి నీటిలో ఈదే వారిలో కనిపించే పరాన్నజీవి. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి మలం నుంచి ఇది నీటిలోకి చేరి... ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ క్రిమి కలిగించే ఇన్ఫెక్షన్ను ‘క్రిప్టోస్పోరీడియోసిస్’ అంటారు. హెచ్ఐవీ ఉన్న రోగులకు ఈ ఇన్ఫెక్షన్ సోకితే అది వారికి నీళ్లవిరోచనాలను కలిగిస్తుంది. మామూలు వారికీ ఇది సోకే అవకాశం ఉన్నప్పటికీ... టీ సెల్ కౌంట్ 100/మైక్రోలీటర్ కంటే తక్కువ ఉన్న హెచ్ఐవీ రోగులకు ఇది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పునరావృతమవుతూ ఉంటుంది. దీని రిస్క్ నుంచి తప్పించుకోడానికి రోగులు తమ చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా డయాపర్స్ను మార్చాక, తోటపనిలో భాగంగా మట్టిని ముట్టుకున్న తర్వాత, పెంపుడు జంతువులను ముట్టుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అప్పటికే ఈ ఇన్ఫెక్షన్ నుంచి బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. ఒక్కోసారి మున్సిపల్ నీటిపంపిణీ వ్యవస్థలోని నీరు కలుషితం కావడం వల్ల ఇది ఒక్కసారిగా కనిపించే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో నీటిని కాచి, వడపోసి తాగడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిప్టోస్పోరీడియోసిస్కు నిర్దిష్టమైన చికిత్స ఏదీ లేదు. అయితే మైకోబ్యాక్టీరియమ్ ఏవియమ్ కాంప్లెక్స్ (ఎమ్ఏసీ-మ్యాక్)కు ఇచ్చే చికిత్సే క్రిప్టోస్పోరీడియోసిస్కూ ఉపయోగపడుతుంది. నిర్వహణ: యాసీన్ -
ఢిల్లీకి రాజైనా... ఉల్లికి దాసుడే!
నవ్వింత ‘‘థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును ఎలా కనిపెట్టాడో తెలుసా?’’ అకస్మాత్తుగా అడిగాడు మా రాంబాబు. ‘‘చక్కగా ధాబాలో కూర్చుని ఈ ఉల్లిగడ్డను నంజుకుంటూ పరోఠా తినాల్సిన సమయంలో మాట్లాడాల్సిన టాపికా ఇది?’’ అంటూ కాస్త చిరాకు పడ్డాన్నేను. ‘‘ఈ టైమ్‌లోనే ఎందుకంటే... పరోఠాతో పాటు ఇచ్చిన ఈ చిన్న చిన్న చిన్నుల్లి ముక్కల్ని చూశాక ఉల్లి షేపు గుర్తొచ్చింది. దాని షేపు గుర్తురాగానే ఎడిసన్గారికి కూడా ఎలక్ట్రిక్ బల్బు రూపు స్ఫురించి ఉంటుంది. దాంతో బహుశా మనవాడు అచ్చం ఉల్లిగడ్డ షేపులోనే కరెంటు బల్బుకు రూపకల్పన చేసి ఉంటాడనిపించి అలా మాట్లాడానన్నమాట. ఒక్క పరోఠాతో అనేమిటీ... ఉల్లి దోశ తోడ ఉల్లమ్ము రంజిల్లు / ఉల్లి లేక గారెకు రుచియె లేదు / తల్లి కంటే ఉల్లికి ప్రాధాన్యమందుకే / విశ్వదాభిరామ వినురవేమా! అన్నార్రా అందుకే’’ అన్నాడు రాంబాబు. ‘‘ఒరేయ్... ఈ సైన్సు విషయాలూ, ఆ తిండి పద్యాలూ ఆపేసి, హ్యాపీగా సినిమా కబుర్లు చెప్పుకుంటే సరదాగా ఉంటుందీ, తిండితో పాటూ కబుర్లలోనూ మసాలాకు మసాలా’’ అన్నాన్నేను. ‘‘అలాగే... నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ మాటకొస్తే సినిమాలకు మాత్రం... ఉల్లి చేసిన సాయం అంతా ఇంతా ఉందా? హీరో తల్లి కంటతడి పెట్టుకుంటూ ఉండి, తీరా హీరోగారు అది చూసి ఎక్కడ మనసు కష్టపెట్టుకుంటాడో అని సాకును ఉల్లిపాయ మీదకు తోసేసిన సినిమాలు ఎన్ని లేవు? అంతెందుకు... ఓ సినిమాలోనైతే... పెళ్లి చేసి పంపిస్తే తన చెల్లి ఉల్లిపాయ కోసి, కళ్లు మండేలా చేసుకుంటుందని అసలామెకు పెళ్లే చేయనంటాడు ఓ హీరో. సినిమా హీరోల తల్లి పాత్రలను దృష్టిలో పెట్టుకునే మూవీ కథ ముందుకు సాగడానికి ‘తల్లి చేసే మేలు కంటే ఉల్లి చేసే మేలే గొప్ప’ అన్న సామెత పుట్టిందేమోరా. అంతెందుకు మరో హిట్ సినిమాలో వంటింట్లో నుంచి మసాలా వాసనలు రావడం లేదు కాబట్టి హీరోయిన్ వంట చేస్తోందో లేదో అని విందుకు వచ్చిన వాళ్లు భయపడుతుంటే... హీరో వచ్చేసి ఉల్లిని సగానికి కోసి దానిపై దోమల మందు స్ప్రే చేస్తాడు. దాంతో ఘుమఘుమలాడే మసాలా వాసనలు వస్తున్నట్లు ఫీలై అతిథులు తెగ సంతృప్తిపడతారు. అదీ ఉల్లి గొప్పదనం. వంటలోనే కాదు... సినిమాలో మసాలాకూ ఉల్లి కావాల్సిందేరా’’ అన్నాడు రాంబాబు. ‘‘ఒరేయ్ రాంబాబూ... ఎలా తిప్పి చెప్పినా మళ్లీ ఆవు కథకే వచ్చినట్లుగా ఈ ఉల్లి లొల్లి ఏమిట్రా బాబూ? వదిలేయ్... ఇంకో టాపిక్ ఏదైనా మాట్లాడు. సరదాగా హీరోలనూ, వాళ్ల తల్లులనూ, అతగాడి చెల్లెళ్లనూ వదిలేసి... హాట్‌హాట్‌గా హీరోయిన్ల గురించి మాట్లాడు. వినడానికి ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది’’ అన్నాను మళ్లీ. ‘‘అలాగేరా... నువ్వు చెప్పినట్టే హీరోయిన్స్ గురించే మాట్లాడుకుందాం. హీరోయిన్ను కళ్లప్పగించి చూసేలా చేయాలంటే, ఆడియన్స్ అందరికీ ఆమె గ్లామరస్‌గా కనిపించాలంటే ‘ఉల్లిపొర’లాంటి చీర కట్టాల్సిందే. ఆ తర్వాత ఆ చీరలో తనను వానలో తడపాల్సిందేరా. నిజానికి సమస్త తెలుగు ప్రజలందరూ పల్చటి చీరకు ఉపమానంగా ఉల్లినీ, దాని పైపొరనీ వాడారంటే... దానిపై సినిమావాళ్లతో పాటు అందరికీ ఎంత గౌరవం ఉందో చూశావా?’’ అన్నాడు రాంబాబుగాడు. ఎలాగైనా సరే... వాడు మాట్లాడే టాపిక్ మారుద్దామని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నా. అందుకే ఉల్లితో ఎలాంటి సంబంధం లేని అంశాన్ని డిస్కషన్‌కు తెద్దామనే కృతనిశ్చయంతో ‘‘ఒరేయ్... బంగారం ధర క్రమంగా తగ్గుతోందటరా! ముప్ఫయి రెండు వేలు, ముప్ఫయిమూడు వేల నుంచి దాదాపు పాతికవేలకు వచ్చేసిందట తెలుసా? మీ ఆవిడకు బంగారం కొనాలనుకుంటున్నావ్ కదా. ఇదే మంచి అవకాశం. కొనకపోయావా?’’ అంటూ వాణ్ణి టోటల్‌గా మరోవైపునకు లాక్కుపోయినట్లుగా ఫీలయ్యా. ‘‘బంగారం అంటే గుర్తొచ్చిందీ... అదంటే ఆడవాళ్లకు బలే మోజురా. అందుకే కూరలు వండేటప్పుడూ, తాలింపులు వేసేప్పుడూ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు రంగుకు వచ్చేవరకూ వేయిస్తారు. అదేమిటోగానీ... బంగారం రంగు వచ్చేవరకు వేయిస్తేనే వంటకం రుచిగా ఉంటుంది. అంతకంటే మాడితే కూర టేస్టు పోతుంది. ఇలా ఉల్లికీ... వంటనూనెలలో అది బంగారు రంగు పుంజుకోడానికీ... రుచికీ ఉన్న సంబంధమేమిటో తెలియడం లేదురా. ఉల్లీ... చిల్లీ ఈ రెండూ లేకపోతే వంటే లేదురా’’ అంటూ బంగారం మార్కెట్ నుంచి తిరిగి తిరిగి మళ్లీ ఉల్లిదగ్గరికే వచ్చాడు వాడు. ‘‘ఒరేయ్... నేనో కొత్త సామెత సృష్టిద్దామనుకుంటున్నానురా. నువ్వు పొరబాటున ఢిల్లీకి రాజువైనా తల్లికి కొడుకువు అవునో కాదోగానీ, ఉల్లికి మాత్రం దాసుడివేరా’’ అన్నాన్నేను కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా. అన్నట్టు ఈ కన్నీళ్లకు కారణం ఉల్లి మాత్రం కాదు! - యాసీన్ -
ఈటింగ్ డిజార్డర్స్ తిండి తిప్పలు!
తినడం కూడా కొన్ని వ్యాధుల లక్షణమే అంటే అది విచిత్రంగా ఉండవచ్చు. కానీ అది వాస్తవం. తీవ్రమైన భావోద్వేగాలు, కోపం, ప్రవర్తనలో మార్పులు, వ్యాకులత, యాంగ్జైటీ వంటి అనేక సమస్యల వల్ల మనం తినే తీరులో మార్పులు వచ్చి... సదరు వ్యాధికి ఒక లక్షణంగా ప్రకటితమవుతాయి. కొన్నిసార్లు అవి భౌతికంగా మార్పులు మాత్రమే కాదు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మహిళలూ, పురుషులూ... ప్రత్యేకంగా కౌమార వయసులోకి వచ్చే టీనేజీ పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ భోజనరుగ్మతలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ఈటింగ్ డిజార్డర్స్కు కారణాలు ఆహార రుగ్మతలకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రవర్తనపూర్వకమైనవి, జీవసంబంధమైనవి, ఉద్వేగాలకు, సంబంధించినవి, మానసికమైనవి, వ్యక్తిగతబంధాలకు సంబంధించినవి, సామాజిక అంశాలు... ఇలా రకరకాల కారణాలు ఆహారసంబంధ రుగ్మతలకు దారితీస్తాయి. ఇందులో చాలావరకు మానసికమైనవి. అవి క్రమంగా శారీరక ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతూ న్యూనతను కలిగిస్తాయి. 1. అనొరెక్సియా నర్వోజా సాధారణంగా పిల్లలు టీనేజీలోకి వస్తుండగానే తమ అందంపైనా, లుక్స్పైనా దృష్టి ఎక్కువగా ఉంటుంది. తాము లావెక్కి అసహ్యంగా కనిపిస్తున్నామేమో అన్న సందేహం వారిని పట్టి పీడిస్తుంటుంది. ఏమాత్రం ఎక్కువగా తిన్నా బరువు పెరిగి అందం దెబ్బతింటుందేమో అన్న సంశయంతో వారు కావాలనే తినడం మానేస్తుంటారు. దాంతో ఉండాల్సిన దాని కంటే మరీ ఎక్కువగా బరువు తగ్గి ఎముకలపోగులా మిగిలిపోతారు. కావాలన్నా తినలేని ఈ రుగ్మత పేరే ‘అనొరెక్సియా నర్వోజా’ బాల్యం నుంచి కౌమార దశలోకి ప్రవేశించేవారిలో ముఖ్యంగా అమ్మాయిల్లో కనిపించే ఈ జాడ్యం 5 శాతం నుంచి 20 శాతం మందిలో ప్రాణాంతకంగా మారుతుంది. ఇటీవల టీవీల్లో, సినిమాల్లో, ర్యాంప్షోలలో, ఇతర ప్రసారమాధ్యాలలో కనిపించే మోడల్స్‌ను అనుసరిస్తూ అలా సన్నగా ఉండటమే అందం అనే భావనలో జీరోసైజ్ అంటూ ఈ వ్యాధికి గురయ్యేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే దీన్ని ‘ఫ్యాషన్ డిజార్డర్’ అని కూడా వ్యవహరిస్తుంటారు. లక్షణాలు ♦ వారి శరీర పోషణకూ, జీవక్రియలకూ అవసరమైనదాని కంటే చాలా తక్కువగా తినడం ♦ తినే సందర్భం వస్తే అక్కడి నుంచి తప్పించుకోవడం ♦ తమ శరీరంపై ఎక్కువ స్పృహ కలిగి ఆత్మన్యూనతతో వ్యవహరించడం ♦ తమ పరిస్థితి తమకు తెలుస్తున్నా దాన్ని గుర్తించేందుకు సంసిద్ధంగా లేకపోవడం. హెచ్చరిక సూచనలు (వార్నింగ్ సిగ్నల్స్) ♦ గణనీయంగా బరువు తగ్గిపోవడం ♦ ఎప్పుడూ బరువు తగ్గడం గురించి, క్యాలరీలను తక్కువ చేసుకోవడం గురించి, కొవ్వు కరిగించుకోవడం, డైటింగ్ గురించే ప్రస్తావిస్తుండటం. ♦ చాలా రుచికరమైన ఆహారం ముందుంచినా తినడానికి తిరస్కరించడం ♦ నేనేమైనా లావుగా కనిపిస్తున్నానా అంటూ వాకబు చేస్తుండటం. ♦ తినడం తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు వెతుక్కుంటూ ఉండటం. ♦ తాము బరువు పెరగడం లేదని తెలిసినా, ఎక్కడ బరువు పెరుగుతామో అన్న ఆందోళనతో క్యాలరీస్‌ను దహించాలంటూ కఠినమైన వ్యాయామాలకు పాల్పడటం. ♦ స్నేహితులనుంచి క్రమంగా దూరం కావడం. అనొరెక్సియాతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ♦ శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయి. దాంతో శరీరం తనలోని శక్తిని ఆదా చేసుకోవడానికి సాధారణంగా జరగాల్సిన జీవక్రియలన్నింటినీ మందకొడిగా జరిగేలా చూస్తుంది. ఈ ‘మందకొడి’ ప్రక్రియ వల్ల తీవ్రస్థాయిలో వైద్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు... ♦ గుండె స్పందనల వేగం మందగిస్తుంది. రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా గుండె కండరాల పనితీరులో కూడా మార్పు వస్తుంది. ఇది క్రమంగా హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. ♦ ఎముకల సాంద్రత మందగిస్తుంది. దాంతో ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఎముకలు పెళుసుగా మారి తేలిగ్గా విరిగిపోవచ్చు. ♦ కండరాలు బలహీనంగా మారవచ్చు. సన్నబడిపోవచ్చు. ♦ తీవ్రమైన డీ-హైడ్రేషన్‌కు దారితీయవచ్చు. దానివల్ల మూత్రపిండాలు దెబ్బతినవచ్చు. ♦ నీరసం, నిస్సత్తువతోపాటు ఒక్కోసారి స్పృహతప్పడం జరగవచ్చు. ♦ వెంట్రుకల కింద ఉండే ‘ల్యానుగో’ అనే ఒక పొర మందంగా మారుతుంది. శరీరం తన వేడిని కోల్పోకుండా ఉండేందుకు ఈ పరిణామం సంభవిస్తుంది. 2. బులీమియా నర్వోజా బులీమియా నర్వోజా అనే వ్యాధి చాలా తీవ్రమైనది. ఈ రుగ్మతలో... బింజ్ఈటింగ్ అని పిలిచే అదేపనిగా తినే అలవాటుతో పాటూ... తింటే బరువు పెరిగిపోతామేమో అనే అనొరెక్సియా లక్షణాలూ కలగలసి ఉంటాయి. బులీమియా నర్వోజా వ్యాధి ఒక్కోసారి డిప్రెషన్ లక్షణాలతో కలగలసి ఉంటుంది. ఒక్కోసారి ఇది మరణానికి సైతం దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు ♦ భోజనంపై అమిత ఇష్టం వల్ల రుచికరమైన పదార్థాలపై మోజు కారణంగా మొదట ఆహారాన్ని తినేస్తారు. ఆ తర్వాత తాము తిన్న పదార్థాల వల్ల అపరిమితంగా బరువు పెరిగిపోతామేమో అన్న ఆందోళనతో ప్రయత్నపూర్వకంగా వాంతి చేసుకుంటారు. ♦ తినే విషయంలో స్వీయనియంత్రణ చేసుకోలేరు. తిన్న తర్వాత తమంతట తామే బరువు పెంచుకుంటున్నామేమో అంటూ తీవ్ర అపరాధ భావనకు లోనవుతారు. ♦ శరీరాకృతిపై అవసరమైన దాని కంటే ఎక్కువగా దృష్టిసారించి ఆత్మన్యూనతకు లోనవుతారు. ♦ బులీమియా నర్వోజా వ్యాధిని ఎంత త్వరగా నిర్ధారణ చేయగలిగితే... దీని నుంచి బయటపడే అవకాశాలు అంత ఎక్కువ. హెచ్చరిక సూచనలు (వార్నింగ్ సిగ్నల్స్) ♦ చాలా తక్కువ సమయంలో ఎక్కువగా తినేస్తారు. ఆతృతగా తినేస్తుంటారు. ♦ జిహ్వచాపల్యాన్ని తట్టుకోలేక తినేశామనీ... కానీ తాము తిన్నది తమకు అవసరం లేనిదన్న భావనతో దాన్ని ఎలాగైనా వదులుకోవాలనే కోరికతో తరచూ బాత్రూమ్కు వెళ్లి ఎవరూ చూడకుండా వాంతి చేసుకుంటారు. ♦ కొందరు తాము తిన్నదాన్ని వదులుకోడానికి వాంతి చేసుకోడానికి బదులు విరేచనం చేసుకోవాలనే ఉద్దేశంతో అవసరానికి మించి విరేచనకారి (లాక్సెటివ్స్), అతిగా మూత్రం వచ్చే మందులు (డై-యూరెటిక్స్) వాడతారు. ♦ క్యాలరీలను కరిగించుకోవాలంటూ కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. ♦ రోగుల్లో అసాధారణరీతిలో చెంపలు, దవడల వాపు కనిపిస్తుంది. ♦ వేళ్లను నోటిలోకి జొనిపి వాంతి చేసుకుంటుంటారు కాబట్టి వేళ్ల కణుపులు (నకుల్స్) పళ్లతో ఒరిపిడికి గురై చర్మం మందంగా మారుతుంది. ♦ తరచూ వాంతుల వల్ల పళ్లరంగు మారుతుంది. ♦ స్నేహితుల నుంచి దూరంగా ఉంటారు. ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. బులీమియాతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ♦ అదేపనిగా ఎక్కువగా తినేయడం, ఆ తర్వాత మళ్లీ వాంతి చేసుకోవడం వెంటవెంటనే జరుగుతుండటం వల్ల జీర్ణక్రియలోని క్రమబద్ధతపై ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ సైకిల్ దెబ్బతింటుంది. ♦ డీ-హైడ్రేషన్ వల్ల శరీరంలో పొటాషియమ్, సోడియమ్ పాళ్లు తగ్గుతాయి. ♦ గుండె స్పందనలు లయ తప్పుతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాపాయం కలిగించవచ్చు. ♦ ప్రయత్నపూర్వకంగా మాటిమాటికీ చేసుకునే వాంతుల వల్ల కడుపులో మంట వస్తుంది. ♦ కడుపులో ఉండే యాసిడ్ వాంతి వల్ల బయటకు వచ్చి, పళ్లపై ప్రభావం చూపడం వల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ♦ విరేచనకారి మందులను విచక్షణరహితంగా వాడటం వల్ల విసర్జన అలవాట్లలో మార్పు, దీర్ఘకాలిక మలబద్దకం వంటి అనర్థాలు వస్తాయి. 3. బింజ్ ఈటింగ్ డిజార్డర్ (బీఈడీ) ఈ రుగ్మత ఉన్న రోగులు ఏ ఆహారాన్ని అయినా అదేపనిగా తినేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లుగా తింటూ ఉంటారు. దీన్నే ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అంటారు. ఇది డిప్రెషన్ వ్యాధితో పాటు కలగలిసి ఉంటుంది. వీరిలో జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తక్కువ. లక్షణాలు ♦ ఎప్పుడూ తినాలనిపించే తమ కోరికను నియంత్రించుకోలేరు. ♦ అలా తింటూ ఉండటమూ, దాన్ని మిగతావాళ్లు గమనిస్తూ ఉన్నారన్న విషయం వాళ్లలో అపరాధభావనను కలిగిస్తుంది. ♦ అదేపనిగా తినడం తమకే నచ్చక ఆత్మన్యూనతకు గురవుతుంటారు. బింజ్ ఈటింగ్ వల్ల కలిగే ఆరోగ్య అనర్థాలు ♦ బింజ్ ఈటింగ్ వల్ల కనిపించే తక్షణ అనర్థం బరువు అమితంగా పెరిగిపోవడం. రోగికి స్థూలకాయం రావడం. దాంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. ఉదాహరణకు... ♦ రక్తపోటు విపరీతంగా పెరగడం ♦ కొలెస్ట్రాల్ పాళ్లు పెరిగిపోవడం ♦ డయాబెటిస్ గాల్‌బ్లాడర్‌కు సంబంధించిన వ్యాధులు ♦ కండరాలూ, ఎముకల రుగ్మతలు గుండెజబ్బులు 4. డయాబులీమియా ఇది సాధారణంగా టైప్-1 డయాబెటిస్తో కలిసి ఉండే తిండి సంబంధమైన రుగ్మత. డయాబులీమియా వ్యాధిగ్రస్తులు తమ బరువు తగ్గాలనే ఉద్దేశంతో కావాలనే ఇన్సులిన్ పాళ్లను తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో డయాబెటిస్, బులీమియా... ఈ రెండు వ్యాధులూ ఉంటాయి కాబట్టి ‘డ్యుయల్ డయాగ్నోసిస్ డిజార్డర్’గా పేర్కొంటారు. ఈ వ్యాధి ఉన్నప్పుడు ఇన్సులిన్ ఉపయోగించే తీరును దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఇది ఇతర రుగ్మతలకూ దారితీసే అవకాశమూ ఉంది. 5. ఆర్థోరెక్సియా నర్వోజా ఇది సరైన ఆహారం తీసుకోవాలనే తపన నుంచి ఆవిర్భవించే రుగ్మత. ఆర్థోరెక్సియా నర్వోజాకూ... అనొరెక్సియా, బులీమియాలకూ ఓ తేడా ఉంది. అనొరెక్సియా, బులీమియాలో అందాలకూ, లుక్స్కూ ప్రాధాన్యమిస్తారు. కానీ ఆర్థోరెక్సియా నర్వోజా రోగులకు అన్నీ ఆరోగ్య సంబంధమైన సందేహాలే! తాము తిన్నది సరైన ఆహారమేనా, అది సమతులాహారమేనా అనే సందేహాలు రోగిని పట్టి పీడిస్తుంటాయి. తాము ఆరోగ్యకరమైన పరిణామంలోనే తింటున్నామా లేక ఎక్కువగానో, తక్కువగానో తింటున్నామా అనే సంశయాలు వస్తుంటాయి. దీంతో వారు తిండి విషయంలో చాలా కఠినమైన నియమాలు పెట్టుకుని ఆచరిస్తుంటారు. ప్రతిదీ తినేప్పుడు దాని ఆరోగ్యవిలువలూ, పోషకాలూ వంటి లెక్కలేసుకుని తింటుంటారు. ఫలానా పదార్థం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా దానినుంచి దూరంగా ఉంటారు. తమ జిహ్వచాపల్యాన్ని కఠినంగా నియంత్రించుకుంటూ తమను తాము శిక్షించుకుంటుంటారు. నూనెలు ఎక్కువ తీసుకుంటే కొవ్వు పేరుకుంటుందేమోననే సందేహంతో వాటిని తగ్గించి... కొవ్వుల్లో కరిగే విటమిన్ల లోపాలు తెచ్చుకుంటారు. ఉప్పు ఆరోగ్యానికి అనర్థమంటూ బాగా తగ్గించుకుని హైపోనేట్రీమియా లాంటి జబ్బులతో ఆసుపత్రుల పాలవుతుంటారు. ఇటీవల ఆరోగ్య స్పృహ మరీ ఎక్కువగా పెరగడంతో వచ్చిన అనర్థమిది. ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో మంచి నియమాలు పాటించడంలో తప్పులేదు. కానీ అదేపనిగా ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ ఒకరకమైన నిస్పృహకూ, న్యూనతకూ గురయి ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకోవడం సరికాదు. కాబట్టి ఆరోగ్యస్పృహనూ మరీ పెచ్చుమీరిపోనివ్వకుండా ఉండాలి. ఆర్థోరెక్సియాను అధిగమించడానికి మార్గాలు : ♦ ఎప్పుడైనా, ఏదో ఒక సమయంలో వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తే దాని గురించి అతిగా ఆలోచించకూడదు. ఎప్పుడో ఒకసారి జరిగే ఉల్లంఘన వెంటనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలేమీ చూపదు. ♦ ఎప్పుడైనా రుచికరమైన ఆహారాన్ని జిహ్వను సంతృప్తి పరచడానికి తినడం వల్ల వెంటనే ఆరోగ్యమేమీ దెబ్బతినదు. దాని గురించి అతిగా ఆలోచించకుండా వెంటనే ఆ విషయాన్ని మరచిపోవాలి. చేసిన పొరబాటు కంటే పొరబాటును మాటిమాటికీ తలచుకోవడమే ఎక్కువ కీడు చేస్తుంది. ♦ అపరాధ భావనతో కుంగిపోతూ ఒంటరిగా ఉండకూడదు. అందరితో కలిసి ఆనందంగా ఉండాలి. చికిత్సలు... ♦ ఆహార రుగ్మతలకు చికిత్స దీర్ఘకాలం పాటు బహుముఖంగా జరగాల్సి ఉంటుంది. ఇందులో మానసిక చికిత్స, సైకలాజికల్ కౌన్సెలింగ్, కొన్ని రకాల మందులు, న్యూట్రిషన్ లోపాలు కలుగుతాయి కాబట్టి వాటిని భర్తీ చేసే విధంగా పోషకాహారాలు... ఇలా అనేక అంశాలతో ఈ చికిత్స జరగాల్సి ఉంటుంది. ఈ ఆహారరుగ్మతలకు చికిత్స నిర్దిష్టంగా ఉండక, సమస్యను బట్టి ఉంటుంది. ♦ కొన్ని సందర్భాల్లో మానసిక, వ్యక్తుల మధ్య బాంధవ్యసంబంధాల (ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్), సాంస్కృతిక అంశాల ఆధారంగా కూడా ఆహారరుగ్మతలు రావచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో వాటిని పరిగణనలోకి తీసుకుని చికిత్స-ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ♦ ఆహారం అన్నది మనకు ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతిని కలిగించడానికి అని గుర్తించి దాన్ని ఆస్వాదిస్తూ భుజించాలి. అంతే తప్ప కేవలం క్రమబద్ధమైన జీవితంలోని ఒక అనివార్య అంశంగా మాత్రమే భావించకూడదు. ♦ ఆహారరుగ్మతల విషయంలో సమస్యలు ఎదురైతే సరైన అర్హతలు ఉన్న సైకియాట్రిస్ట్, ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్, మెడికల్ డాక్టర్, కొన్ని సందర్భాల్లో సామాజికవేత్తల వంటి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. అంతేగాని చెప్పుడు మాటలు వినడం, తగిన విద్యార్హతలు లేని వారి సలహాలతో జీవితాన్ని మరింత దుర్భరం చేసుకోకూడదు. - నిర్వహణ: యాసీన్ -
చైల్డ్ ప్రాడిజీ ప్రయత్నాలూ... నా వైల్డ్ ట్రాజెడీ అనుభవాలూ!!
నవ్వింత అప్పుడప్పుడూ బాలమేధావుల గురించి న్యూస్పేపర్లలో వచ్చినప్పుడు నాక్కాస్త అసూయగా ఉంటుంది. వెంటనే మా బుజ్జిగాడూ చైల్డ్ ప్రాడిజీ అయిపోయుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నా ఈ ప్రయత్నంలో భాగంగా దేశాలూ రాజధానులూ లేదా పెద్ద పెద్ద పదాల సెల్పింగులు చెబుదామనుకుంటే అవన్నీ ఇప్పటికే అందరూ చేసేశారు. అందుకే వాణ్ణి మాస్టర్ ఆఫ్ ఆల్ చేద్దామని నిర్ణయించుకున్నా. పురాణాలూ, నీతిపద్యాలూ, జనరల్ నాలెడ్జీ, న్యూస్‌పేపర్ రీడింగూ... గోనెసంచిలో సరుకులు కూరికూరి నింపినట్లుగా అన్నింటినీ ఏకకాలంలో వాడి బుర్ర అనే బస్తాలోకి నింపాలని నిర్ణయించుకున్నా. పొద్దున్నే కాసేపు న్యూస్ పేపర్ చదివి వినిపించాక... సబ్జెక్టు మార్చి పురాణాల్లోని హిరణ్యాక్షుడి వృత్తాంతం చెప్పా. వాడి మాటలతో నా బుర్ర తిరిగిపోయింది. ‘‘అన్నట్టు నాన్నా... నువ్వు చెప్పినట్టుగా భూమిని చాపచుట్టినట్టు చుట్టేసిన హిరణ్యాక్షుడి వృత్తాంతంలో హిరణ్యాక్షుడు భూకబ్జాకు పాల్పడ్డాడన్నమాట. ల్యాండ్ మాఫియాకు ఆద్యుడు అతడేనేమో. అందరి భూముల్నీ లాక్కున్నాడంటే తొలి ల్యాండ్‌గ్రాబింగ్ కేసు కూడా అతడిదేనేమో!? అందుకే భగవంతుడు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి అందరికీ భూమిని సమానంగా పంచి, సత్యయుగంలో సామ్యవాదాన్ని నెలకొల్పి ఉంటాడు కదా’’ అన్నాడు. నేనేదో విడివిడిగా వార్తల్నీ, పురాణాల్నీ, సివిక్సూ గట్రా బోధిస్తే... వాడు అన్నింటినీ కలగలిపి సొంతం వ్యాఖ్యానాలు చెప్పడంతో నాకు మాటపడిపోయింది. ఈ న్యూస్‌పేపర్లు అచ్చిరాలేదని టీవీ చూపిద్దామని నిర్ణయించుకున్నా. పెద్ద పెద్ద కట్టడాలైన మలేషియాలోని పెట్రొనాస్ టవర్స్ చూపించా. ‘‘చూశావా... పెట్రోనాస్ టవర్స్ రాత్రిపూట పెట్రొమాక్స్ లైట్ల కాంతిలా ఎలా వెలుగుతున్నాయో. టోక్యో స్కై స్క్రేపర్సూ, టొరంటో టవర్సూ చూడు’’ అన్నా. వెంటనే వాడు ఛానెల్ మార్చేసి... నాకు యానిమల్ ప్లానెట్ చూపిస్తూ... ‘‘నువ్వే ఇది చూడు. అంత చిన్న తేనెటీగ... తన మల్టీస్టోరీడ్ బిల్డింగును అలా తల్లకిందులుగా కట్టుకుంటూ తన తేనెపట్టు నిడివి పెంచుకుంటూ పోతుంటే... భూమిపై ఒకదాని మీద మరో అంతస్తు కట్టుకుంటూ పోవడంలో విచిత్రం ఏముంది’’ అంటూ చప్పరించాడు. ‘‘అయినా నిట్టనిలువుగా కట్టడం గొప్పా... తలకిందులుగా నిర్మించడం గొప్పా?’’ అన్నాడు. ఈసారి, అల్లసాని వారి ప్రబంధాల్లో అల్లిక జిగిబిగి బాగుంటుంది కాబట్టి టంగ్ట్విస్టర్స్లాంటి పద్యాలుండే ప్రవరుడి వృత్తాంతం చెప్పా. ‘‘కటకచరత్కరేణు కరకంపిత సాలమున్, శీతశైలమున్’’ పద్యం చెబుతూ, హిమాలయాల్లో ఏనుగులు చెట్లను కదలిస్తున్నాయన్న అర్థం ఎలా ఉన్నా... ‘‘కటకచరత్కరేణు కరకంపిత - విపరీతంగా చలిపెడుతుంటే ఆ వణుకు వల్ల రెండు పలువరసలూ కటకటా కొట్టుకుంటున్న సౌండు వినిపిస్తోంది చూడు’’ అని పరవశంగా అన్నాను. ‘‘అవున్నాన్నా... ప్రవరుడు లేపనం పూసుకుని హిమాలయాలకు వెళ్లాలని ముందే డిసైడ్ చేసుకున్నాడు కదా. అలాంటప్పుడు అక్కడ విపరీతంగా చలేస్తుందనీ, మంచు తాలూకు తడికి లేపనం కడుక్కుపోయే ప్రమాదం ఉందనీ ఎందుకు ఊహించలేదు? ఒక ఉలెన్ దుస్తుల్తో ఒంటిని నిండా కప్పి ఉంటే లేపనం అంత త్వరగా కడుక్కుపోయేది కాదు కదా. దారితప్పిపోకుండా హ్యాపీగా తిరిగి వచ్చేవాడు కదా’’ అన్నాడు. ఆ దెబ్బతో ప్రబంధాలు వదిలేసి కనీసం నీతి పద్యాలైనా చెబుదామని అనుకున్నా. వేమన, సుమతీ శతకాలైతే తేలిగ్గా ఉంటాయని, భాస్కర శతకం ఎంచుకున్నా. ‘‘ఒరేయ్... పండితులైన వారికి తగిన గుర్తింపు లేకపోయినా వారి పాండిత్యానికి తక్షణం వచ్చే ఢోకా ఏమీలేదు. ఎలాగంటే... కోతులు చెట్టు కొనకొమ్మన ఉంటే... కింద గండభేరుండాలూ, సింహాలూ ఉంటాయంటాడ్రా కవీ... ఈ పద్యంలో’’ అన్నా. ‘‘అన్నట్టు నాన్నా... సింహాలు భూమ్మీద తిరుగుతుండటం ఓకే... మరి గండభేరుండాలూ పైన ఎగరకుండా భూమ్మీదే తిరుగుతుంటాయని చెప్పడం వింతగా లేదూ’’ అన్నాడు. అంతే... నా కళ్లు బైర్లుగమ్మాయి. ‘‘అంతటి మహాకవీ అవాస్తవం రాశాడంటే నమ్మలేం నాన్నా. ఎంత ఎగిరినా... ఆహారం కోసం కిందికి దిగాల్సిందే కదా. ఆ సంగతి రాసుంటాడు భాస్కర శతకకారుడు’’ అంటూ తన సందేహాన్ని వాడే తీర్చుకుని, నా సందేహాన్నీ తీర్చాడు. ఎవడికి ఉండే తెలివి వాడికి ఉంటుంది. పనిగట్టుకుని బాలమేధావుల్ని చేద్దామనుకుంటే పరిస్థితి ఇలాగే తగలడుతుందని బోధపడిన తత్వంతో వాడి మానాన వాణ్ణి ఎదగనిద్దామని నిశ్చయించుకున్నా. - యాసీన్ -
రాంబాబుగాడు... వాడి వ్యక్తిత్వ వికాస పాఠాలు!
నవ్వింత ఈమధ్య మా రాంబాబు గాడు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎక్కువగా చదువుతున్నాడు. ‘విజయానికి ఆరు మెట్లు’ చదివాడట. అయితే మెట్ల సంఖ్య ఎక్కువగా ఉందనీ, మరింత షార్ట్ కట్లో ఎవరైనా విజయానికి దారులు సూచిస్తే బాగుండేదనీ వెతుకుతున్నాడు. ‘విజయానికి రెండు మెట్లు’ అనో, ‘విజయానికి మెట్లు లేవ్!’ అనో ఇంకెవరైనా రాశారేమోనని కనుక్కుంటున్నాడు కానీ... ఇప్పటివరకు ఉన్న మెట్ల సంఖ్యలో అదే లీస్టు అని తెలిశాక నిరాశ-నిస్పృహలకు లోనయ్యాడు మనవాడు. ‘‘ఒరేయ్... పుస్తకాలు చదివితే వ్యక్తిత్వం వికసించదు. అదే జరిగితే ఒక లక్షమంది ఒకే పుస్తకాన్ని చదివి, తమ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకుంటే... అందరి తత్వం ఒకేలా మారిపోయేది కదా! కానీ అలా కుదురుతుందా? ఆలోచించు. ఎంత చదివినా, ఏం చేసినా ఎవడి వ్యక్తిత్వం వాడిదే. సొంత ఆలోచనతో ఆయా సందర్భాల్లో ఏది మంచిదో నీ కామన్ సెన్స్‌తో నీకు నువ్వే నిర్ణయించుకోవాల్సిందే తప్ప... నీకు జీవితంలో ఎదురు కాబోయే సంఘటలను ఎవరో ఊహించి ముందుగానే రాయలేరు. సో... వికాసాన్ని చదువుతో సాధించలేం కాబట్టి విచక్షణతో మసలుకో. వివేచనతో బతుకుపో’’ అని చెప్పి చూశా. కానీ వాడు అస్సలు ఒప్పుకోలేదు. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్న గురజాడ వారి సూక్తిని అనుసరించి ప్రస్తుతానికి వాడి పైత్యానికి వాణ్ణే వదిలేశా. అనగనగా ఓ సింహం వ్యక్తిత్వ వికాస పుస్తకాలను బాగా ఒంటబట్టించుకుందట. అది తన జూలును క్లీన్‌గా షేవ్ చేయించుకునీ, తన గోళ్లను నీట్‌గా ట్రిమ్ చేయించుకునీ... ‘తరతరాలుగా, యుగయుగాలుగా నేను నీ కుంభస్థలాన్ని బద్దలు కొట్టడమే చేస్తున్నా. ఇకపై అలాంటి దుర్మార్గాలు చేయబోన’ంటూ స్నేహపూర్వకంగా ఓ ఏనుగును పలకరిస్తూ దాని తలపెకైక్కి... ‘‘మన స్నేహానికి గుర్తుగా నీకు ‘పంజా మసాజ్’ చేస్తా’’నందట. ఒళ్లు మండిన ఏనుగు ఆ సింహాన్ని పట్టి, తొండంతో చుట్టి దూరంగా విసిరిపారేసిందట. దాంతో కుయ్యోమంటూ ఆ సింహం ‘‘స్టీఫెన్ పాలకోవా రచించిన ‘ద సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ యానిమల్స్’ లాంటి పుస్తకాలు నేనొక్కదాన్నే చదివితే కుదరదు. సదరు వ్యక్తిత్వ వికాస పాఠాలను ఏనుగు కూడా చదివినప్పుడే వాటికి సార్థకత’’ అని నిట్టూర్చిందట. సింహం గర్జించాలి, పులి గాండ్రించాలి. అప్పుడే వాటి వ్యక్తిత్వం వాటిదిలాగే ఉంటుంది. గర్జించాల్సిన, గాండ్రించాల్సిన జంతువులు కుయ్యోమొర్రోమంటే అడవిలో ఆర్డర్ తప్పుతుందని రాంబాబుగాడికి వివరించా. వాడిపై నా మాటల ప్రభావం కొద్దిగా పడినట్టే అనిపించింది. ఓరోజు మా రాంబాబుగాడింట్లో దొంగ దూరాడు. అర్ధరాత్రి వ్యక్తిత్వ వికాస పుస్తకం చదువుకుంటున్న రాంబాబు దొంగను సాదరంగా ఆహ్వానించాడు. దొంగతనం ఎంత తప్పో సోదాహరణంగా వివరించబోయాడు కానీ... అదంతా సోదిలా అనిపించడంతో సదరు దొంగ రాంబాబు బుర్రపై రామకీర్తనలతో సహా అనేక పాటలను ఏకకాలంలో పలికించి, చేతికందిన వస్తువుల్ని చక్కా పట్టుకుపోయాడు. ‘‘దొంగను చూడగానే పోలీసులకు ఫోన్ చేయాలి, లేదా అరుస్తూ, ఇరుగుపొరుగింటి వాళ్లను పిలుస్తూ హడావుడి చేసి వాణ్ణి పట్టుకునే మార్గం చూడాలిగానీ... ఎవడైనా దొంగకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతారా...?’’అని నేను కోప్పడబోతే... సదరు దొంగ సరిగా ప్రవర్తించకపోవడానికి కారణం వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చదవకపోవడమేననీ, అదేగానీ వాడు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చదివి ఉంటే తప్పక తన ఉపదేశాలు విని బాగుపడేవాడని బాధపడ్డాడు మా రాంబాబు. ఓరోజున మా రాంబాబు ‘హౌ టు విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్’ అనే డేల్ కార్నెగీ పుస్తకాన్ని తదేక దీక్షతో చదువుతూ ఉండగా నేను వాడింటికి వెళ్లా. ‘‘ఒరేయ్ రాంబాబూ! ఫ్రెండ్స్‌ను గెలవడం ఏమిట్రా? స్నేహితుడంటే వాడేమైనా నీ ప్రత్యర్థా, పగవాడా, పొరుగింటి తగాదాకోరా? నీ ఫ్రెండ్ అంటే నీలోని బలహీనతలనూ, బలాలనూ సమానంగా స్వీకరించి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా అన్నింటినీ స్వీకరించేవాడు. నీకు మానసికమైన తోడు. అలాంటి నీ స్నేహితులను ఓడించాల్సిన లేదా గెలవాల్సిన అవసరం ఎందుకొస్తుంది. కాస్త ఆలోచించు’’ అంటూ కౌన్సెలింగ్ చేశా. అలాగే పతంజలి రాసిన ‘‘గెలుపుసరే బతకడం ఎలా?’’ పుస్తకంతో పాటూ, మరికొన్ని రావిశాస్త్రిగారి పుస్తకాల్నీ ఇచ్చా. వ్యక్తిత్వ వికాసం అంటే లోకజ్ఞానం కలిగి ఉండటమని, వ్యక్తిత్వవికాసం పేరిట అందరూ యూనిఫామ్ వేసుకున్నట్లు మూసగా ఉండటం లోపమే కదా! కాబట్టి ఆ పేరుతో లోపజ్ఞానం కలిగి ఉండటం కాదని చెప్పా. ఇలా మా రాంబాబుగాడి రెట‘మత మార్పిడి’ కోసం నా వంతు ప్రయత్నం చేస్తూ ఒక బృహద్కృత్యానికి పూనుకున్నా. చూద్దాం ఏమంటాడో వాడు. - యాసీన్ -
యానల్ ఫిషర్ చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ!
చెప్పుకోలేని చోట బాధ... పంచుకోలేని వ్యధ... వ్యక్తం చేయాలంటే సిగ్గు, బిడియం, మొహమాటం.చూపించుకోవాలంటే ఇబ్బంది. ఈ మాటలకు నిజమైన నిర్వచనం... యానల్ ఫిషర్. మల విసర్జన ద్వారం వద్ద ఏర్పడే తిన్నటి పగులును ‘యానల్ ఫిషర్ లేదా ఫిషర్ ఇన్ ఏనో’ అంటారు. ప్రతి 350 మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి సాధారణంగా స్త్రీ, పురుషులిరువురిలోనూ కనిపిస్తుంది. ప్రధానంగా 15 నుంచి 40 ఏళ్ల వారిలో ఎక్కువగా వస్తుంటుంది. విపరీతమైన నొప్పితో బాధిస్తూ, తొలిదశలో చికిత్స తీసుకోకపోతే మరింత లోపలికి చీరుకుపోయి వేధిస్తూ ఉండే ‘యానల్ ఫిషర్’ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం. యానల్ ఫిషర్ అంటే... మలద్వారం వద్ద చిన్న పగులులా కనిపించే ఇది తొలి దశలో మలద్వారం అంచునుంచి చిన్న చిరుగులా ఉంటుంది. అంటే తొలిదశలో ఇది కేవలం చర్మం పైపొరకు (ఎపిథీలియమ్కు) మాత్రమే పరిమితమవుతుందన్నమాట. ఆ దశలో ఎలాంటి చికిత్సా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే అక్కడి మృదువైన లోపలి పొరల్లోనూ (మ్యూకస్ మెంబ్రేన్లలో) పగుళ్లు ఏర్పడి చీరుకుపోయే ప్రమాదం ఉంది. ఫిషర్‌లలో రకాలు... ఫిషర్ ఏర్పడిన వ్యవధిని బట్టి దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అప్పటికప్పుడు కనిపించే అక్యూట్ ఫిషర్. రెండోది దీర్ఘకాలం పాటు కొనసాగుతూ బాధించే క్రానిక్ ఫిషర్. ఆక్యూట్ ఫిషర్ : ఇందులో తొలుత మలద్వారం బయటి చర్మం చీరుకుపోయినట్లుగా అవుతుంది. ఆ తర్వాత అక్కడి మెత్తటి కణజాలం పొరల (మ్యూకోజా)లో కూడా పగుళ్లు ఏర్పడినట్లు అవుతుంది. ఒకవేళ ఈ ఫిషర్‌కు తగిన చికిత్స తీసుకోకుండా అలాగే వదిలేసి, అలా చాలాకాలం పాటు ఉంటే అదే దీర్ఘకాలం కొనసాగే ఫిషర్ (క్రానిక్ ఫిషర్)గా రూపొందవచ్చు. క్రానిక్ ఫిషర్ : ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగే క్రానిక్ ఫిషర్ నిర్దిష్టమైన లక్షణాలను కనబరుస్తుంది. ఉదాహరణకు మలద్వారాన్ని గట్టిగా పట్టేసినట్లుగా ఉంచి, బలంగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు చీరుకుపోయినట్లుగా కనిపిస్తుంటాయి. ఫిషర్ చివరల్లో మలద్వారం వద్ద చీరుకుపోయిన చోట కండ పెరిగినట్లుగా ఉండి, దాని చివరభాగం బయటకు తోసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఫిషర్ రాకుండా నివారణ ఇలా... ఫిషర్ నొప్పితో బాటు సామాజికంగా చాలా ఇబ్బందిని కలిగించే సమస్య. అందుకే వచ్చాక దీనికి చికిత్స చేయించుకోవడం కంటే అసలు రాకుండానే నివారించుకోవడం మేలు. పైగా ఫిషర్‌ను నివారించుకోవడం చాలా సులువు కూడా. నివారణ మార్గాలేమిటంటే... * మనం తీసుకునే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండే ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవడం, రోజులో ఎక్కువసార్లు మంచినీళ్లు తాగుతూ ఉండాలి. * మలం గట్టిగా మారడానికి తోడ్పడే ఆహారపదార్థాలైన మసాలాలూ, మాంసాహారం, పచ్చళ్ల మోతాదును గణనీయంగా తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలతో ఫిషర్‌ను సమర్థంగా నివారించుకోవచ్చు. * మాటిమాటికీ నీళ్ల విరేచనాలు అవుతున్నవారు, ఇలా తరచూ ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. * మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసుకోవడం, పొడిగా ఉంచుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) విధానాలను పాటించాలి. మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్‌తో శుభ్రపరచుకునే వారు చాలా మృదువైన వాటిని ఉపయోగించడం మేలు. * ఒకవేళ అప్పటికే చిన్నపాటి ఫిషర్ ఉన్నవారు మలవిసర్జన సాఫీగా జరిగేలా అక్కడ ఒరిపిడిని తగ్గించే ల్యూబ్రికేటింగ్ ఆయింట్మెంట్స్ వాడాలి. చికిత్స ఆక్యూట్ ఫిషర్‌ను కనుగొన్నప్పుడు చేసే చికిత్సలో నేరుగా ఫిషర్‌కు చికిత్స చేయడం కాకుండా... దాదాపు 80 శాతం పైగా సందర్భాల్లో ఫిషర్ ఏర్పడటానికి కారణమైన అంశాలను నివారించడానికి చికిత్స చేస్తుండటం సాధారణంగా జరుగుతుంటుంది. ఇందులో భాగంగా మలబద్దకాన్ని నివారించే మందులు ఇవ్వడం, మలాన్ని మృదువుగా మార్చే ఔషధాలు వాడటం, మలవిసర్జన సమయంలో కలిగే నొప్పిని నివారించే మందులు ఇవ్వడం వంటివి చేస్తారు. మలవిసర్జన సాఫీగా జరిగేలా పేగు కదలికలు (బవెల్ మూవ్మెంట్స్) క్రమబద్ధంగా జరిగేలా చూస్తారు. ఇక మొదటిదశ చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్)గా మలం మృదువుగా మారేలా స్టూల్‌సాఫ్టెనర్స్ ఇస్తారు. మలవిసర్జన తర్వాత తగినంత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలని సూచించి, అక్కడ నొప్పిని తగ్గించడం, స్ఫింక్టర్ గట్టిగా బిగుసుకుపోవడాన్ని (స్ఫింక్టర్ స్పాజమ్) నిరోధించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా ఫిషర్‌కు మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్)ను నిర్లక్ష్యం చేస్తే సాధారణంగా 30% నుంచి 70% కేసుల్లో అది మళ్లీ తిరగబెడుతుంటుంది. కేవలం పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధి తిరగబెట్టడాన్ని 15% నుంచి 20%కి తగ్గించవచ్చు. ఇక రెండోదశ చికిత్సగా (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) మలద్వారం లోపలికి 0.4% నైట్రోగ్లిజరిన్ వంటి మందులతో పాటు గ్లిజెరాల్ ట్రైనైట్రేట్ ఆయింట్మెంట్ వంటివి స్ఫింక్టర్ లోపల పూతమందుగా వాడాల్సి ఉంటుంది. నిఫైడిపైన్ ఆయింట్మెంట్, డిల్షియాజెమ్ ఆయింట్మెంట్ వంటి పూతమందులు కూడా బాగా పనిచేస్తాయి. శస్త్రచికిత్స ప్రక్రియలు ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి... స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి. ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది. లక్షణాలు మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలా వచ్చిన నొప్పి ఆ తర్వాత కొద్ది గంటల సేపు బాధిస్తుంటుంది. మలవిసర్జనకు వెళ్లిన ప్రతిసారీ నొప్పి తిరగబెడుతుంటుంది. దీంతో మలవిసర్జనకు వెళ్లాలంటేనే రోగి తీవ్రమైన ఆందోళనకు గురవుతుంటాడు. మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతుంటాడు. ఫలితంగా మలబద్దకం ఏర్పడి, మలవిసర్జన క్రమం (సైకిల్) దెబ్బతినవచ్చు. పైగా మలవిసర్జనకు వెళ్లడానికి విముఖత చూపుతూ... మాటిమాటికీ ఆపుకోవడం వల్ల మలం మరింత గట్టిగా మారి, మలవిసర్జన మరింత బాధాకరంగా పరిణమిస్తుంది. చాలా మంది రోగుల్లో మల విసర్జన జరిగినప్పుడు రక్తస్రావం కావడం లేదా ప్రక్షాళన సమయంలో రక్తం చేతికి లేదా టాయిలెట్ పేపర్‌కు అంటడం జరుగుతుంది. అయితే ఫిషర్ విషయంలో ఎక్కువ రక్తస్రావం జరగదు. కాస్తంత రక్తం మాత్రమే కనిపించి, మలద్వార ప్రాంతంలో దురదగా (ప్రూరిటస్ యానీ) అనిపించవచ్చు. ఇక మరికొందరిలో మలద్వారం వద్ద దుర్వాసనతో కూడిన స్రావాలూ కనిపించవచ్చు. కొంతమందిలో మూత్రవిసర్జన కూడా నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి అసలు మూత్రవిసర్జన జరగడమూ కష్టం కావచ్చు. నిర్ధారణ రోగితో మాట్లాడి అతడి వ్యాధి చరిత్రను క్షుణ్ణంగా తెలుసుకోవడం, మలవిసర్జన ద్వారం ప్రాంతాన్ని జాగ్రత్తగానూ, సున్నితంగానూ పరిశీలించడం ద్వారా ఫిషర్‌ను నిర్ధారణ చేయవచ్చు. ఒక్కోసారి పరీక్ష చేయడానికి రోగిని ఆ ప్రాంతంలో చూసినా కూడా ఫిషర్ కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతంలో పూతమందు రూపంలో లభ్యమయ్యే నొప్పి, స్పర్శ తెలియనివ్వని స్థానిక మత్తుమందు (టాపికల్ అనస్థీషియా)చ్చి పరిశీలించడం అవసరం కావచ్చు. ఇక మలద్వారం నుంచి రక్తస్రావం అయ్యేవారిలో... ఆ ప్రాంతంలో గొట్టంతో పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. సాధారణంగా రోగి 50 ఏళ్లలోపు వారైతే, ఈ తరహా పరీక్ష అవసరమవుతుంది. ఇక కొందరిలో 50 ఏళ్లు దాటాక మలద్వార క్యాన్సర్ ఉన్న కుటుంబ చరిత్ర ఉన్నవారైతే వారిలో పెద్దపేగునంతా పరిశీలించడానికి డాక్టర్లు కొలనోస్కోపీ పరీక్షను సిఫార్సు చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ నేరుగా కాకుండా కొంతకాలం మందులు ఇచ్చి చూసి, మెరుగుదల కనిపించే తీరును బట్టి పై పరీక్షలను చేయాల్సి ఉంటుంది. ఇక కొందరిలో మలద్వారం స్ఫింక్టర్ మూసుకుపోయేందుకు కలిగే ఒత్తిడి ఎంత ఉందో పరిశీలించేందుకు యానోరెక్టల్ మ్యానోమెట్రీ అనే పరీక్షనూ నిర్వహించవచ్చు. కారణాలు నిజానికి ఇలా మలద్వారం చీరుకుపోయి ఫిషర్ ఏర్పడటానికి ఇతమిత్థమైన కారణాలు ఇంకా తెలియదు. కానీ మలవిసర్జన సమయంలో చీలికను ఒరుసుకుంటూ మలం బయటికి రావడం వల్ల, తీవ్రమైన నొప్పి వల్ల దీని ఉనికి తెలుస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఆకుపచ్చటి ఆకుకూరలు, తాజాపండ్ల వంటి పీచును కలిగి ఉండే పదార్థాలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఫిషర్ ఏర్పడుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ధారణ అయ్యింది. కొన్ని సందర్భాల్లో మలద్వారం వద్ద ఉండే కండరాలు గట్టిగానూ, మందంగానూ మారడం వల్ల మలవిసర్జన సాఫీగా సాగక బలంగా ఒరుసుకుపోతూ జరుగుతుంది. దీనివల్ల అక్కడ చీలిక ఏర్పడటం, చిరిగినట్లు కావడం వల్ల కూడా ఫిషర్ రావచ్చు. కొంతమందిలో మలబద్దకం వల్ల ముక్కి ముక్కి మల విసర్జన చేయాల్సి వస్తుంటుంది. మలం చాలా గట్టిగా మారడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా మలం గట్టిగా ఉండటం కారణంగా మల విసర్జన సమయంలో ఆ ప్రాంతం చీరుకుపోవచ్చు. ఇక మరికొందరిలో దీర్ఘకాలం పాటు నీళ్లవిరేచనాలు అవుతుండటం వల్ల... దీర్ఘకాలం ఆ ప్రాంతం తడిగానూ, తేమగానూ ఉండటం వల్ల కూడా ఆ ప్రాంతానికి రక్తసరఫరా తగ్గి ఫిషర్ ఏర్పడవచ్చు. మల విసర్జన తర్వాత ఇక అక్కడి నుంచి మలం లీక్ కాకుండా ఉండేందుకు మలద్వారాన్ని చాలా గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్ కండరాలు ఉంటాయి. అందువల్లనే మనకు మల విసర్జన తర్వాత మళ్లీ ఇంకొక సారి మల విసర్జనకు వెళ్లే వరకు ఎలాంటి మలమూ లీక్ కాదు. అయితే ఏదైనా కారణం వల్ల మలద్వార ప్రాంతంలో శస్త్రచికిత్స జరిగితే స్ఫింక్టర్‌కు గాయం కావచ్చు లేదా మలద్వారం ఉండాల్సిన రీతిలో కాకుండా సన్నబడిపోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని స్టెనోసిస్ అంటారు. ఇలాంటిది జరిగినప్పుడు ఆ సన్నబడ్డ ద్వారం నుంచి మలం బయటకు రావాలంటే చాలా బలంగా ఒత్తిడి కలిగించాల్సి వస్తుంటుంది. ఈ కారణంగా మలద్వారం చీరుకుపోయి ఫిషర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. * కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక టీబీ, ల్యూకేమియా, క్యాన్సర్లు, ఎయిడ్స్ వంటి జబ్బులు దీర్ఘకాలంలో మలవిసర్జన ప్రాంతంలో ఇన్ఫ్లమేషన్ కలిగించడం, అది క్రమంగా ఫిషర్‌కు దారితీయడం కూడా జరగవచ్చు. * సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు (ఎస్టీడీలు) సోకినప్పుడు అవి క్రమంగా ముదిరి దీర్ఘకాలంలో ఫిషర్‌కు దారితీయవచ్చు. ఉదాహరణకు సిఫిలిస్, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్, క్లమీడియా వంటి వ్యాధులు మలవిసర్జన ద్వారానికీ విస్తరించడం వల్ల అక్కడ పగుళ్లు రావడం, చీరుకుపోవడం జరిగి ఫిషర్ ఏర్పడవచ్చు. * ఇక మహిళల్లో ప్రసవం సమయంలోనూ మలద్వారం చీరుకుపోయి ఫిషర్ రావచ్చు. * కొందరిలో క్రోన్స్ డిసీజ్, మాటిమాటికీ మలవిసర్జనకు వెళ్లాల్సి వచ్చే అల్సరేటివ్ కొలైటిస్, మలవిసర్జన తర్వాత మలద్వార ప్రాంతాన్ని శుభ్రంగానూ, పొడిగానూ ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విధానాలు పాటించకపోవడం (పూర్ టాయిలెటింగ్ హ్యాబిట్స్) కూడా ఫిషర్‌కు దారితీయవచ్చు. శస్త్రచికిత్స ప్రక్రియలు ఆక్యూట్ ఫిషర్‌కు మందులను 3 నుంచి 4 వారాల పాటు వాడినా గుణం కనిపించని సందర్భాల్లోనూ లేదా యానల్ ఫిషర్ దీర్ఘకాలిక ఫిషర్ (క్రానిక్)గా రూపొందిన సమయాల్లోనూ శస్త్రచికిత్సను నిర్వహించాల్సి రావచ్చు. శస్త్రచికిత్స విధానాలివి... స్ఫింక్టర్ డయలేషన్ : ఈ శస్త్రచికిత్సను శరీరమంతటికీ మత్తు మందు (జనరల్ అనస్థీషియా) ఇచ్చి నిర్వహిస్తారు. ఇందులో మలద్వారాన్ని గట్టిగా మూసుకుపోయేలా చేసే స్ఫింక్టర్‌ను వెడల్పు చేస్తారు. అయితే సాధారణంగా ఈ ప్రక్రియను చాలామంది డాక్టర్లు అంతగా సిఫార్సు చేయరు. ఎందుకంటే ఈ తరహా శస్త్రచికిత్స తర్వాత చాలామంది మలనియంత్రణపై అదుపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించాలంటే సర్జన్ మంచి నిపుణులై ఉండాలి. ల్యాటరల్ ఇంటర్నల్ స్ఫింక్టరెక్టమీ : ఈ శస్త్రచికిత్స ప్రక్రియను కూడా సాధారణంగా పూర్తి మత్తు (జనరల్ అనస్థీషియా) లేదా వెన్నెముకకు మత్తుమందు (స్పైనల్ అనస్థీషియా) ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఇందులో స్ఫింక్టర్‌లో గట్టిబారిన కండరప్రాంతాన్ని (హైపర్‌ట్రొఫాయిడ్ ఇంటర్నల్ స్ఫింక్టర్) జాగ్రత్తగా ఒలిచినట్లుగా చేసి తొలగిస్తారు. దాంతో స్ఫింక్టర్ కండరం తన బిగుతును కోల్పోయి మునుపటిలా మృదువుగా మారుతుంది. ఫలితంగా మలవిసర్జన సమయంలో ఒరిపిడి తగ్గి, క్రమంగా మలద్వారం వద్ద ఉన్న పగులు/చిరుగు క్రమంగా తగ్గిపోతుంది. శస్త్రచికిత్స వల్ల కలిగే దుష్పరిణామాలు ఫిషర్‌కు శస్త్రచికిత్స వల్ల కలిగే మేళ్లతో పాటు కొన్ని దుష్పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిషర్‌కు శస్త్రచికిత్స చేశాక, అది నిర్వహించిన ప్రాంతం గాలిసోకని విధంగా, అవయవాల ముడుతల్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం కూడా కావచ్చు. ఫిషర్ క్రమంగా లోపలివైపునకు సాగుతూ పేగుల్లో పొడుగాటి పైపులా పాకే ‘ఫిస్టులా’ అనే కండిషన్కూ దారితీయవచ్చు. ఇక అన్నింటికంటే ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే... శస్త్రచికిత్స తర్వాత కొందరిలో మలాన్ని లోపలే పట్టి ఉంచేలా చేసే నియంత్రణ శక్తి కోల్పోయి... అక్కడి నుంచి కొద్దికొద్దిగా మలం బయటకు వస్తూ ఉండవచ్చు. దీన్నే ‘ఇన్‌కాంటినెన్స్’ అంటారు. శస్త్రచికిత్స తర్వాత ఈ ఇన్‌కాంటినెన్స్ వస్తే అది మరింత ఇబ్బందికరం కాబట్టి ఇలాంటి శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు అత్యంత నిపుణులైన సర్జన్ల ఆధ్వర్యంలోనే ఈ తరహా శస్త్రచికిత్సలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సర్జరీ విషయంలో మరో హెచ్చరిక... సాధారణంగా ఫిషర్ సమస్యను తగ్గించడానికి చేసే సర్జరీ విజయవంతమైతే పరవాలేదు. కానీ ఇక్కడ ఒక అంశాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో చేసే శస్త్రచికిత్స తర్వాత కూడా ఒక శాతం నుంచి ఆరు శాతం కేసుల్లో ఫిషర్ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గమనంలో ఉంచుకుని మానసికంగా సిద్ధపడే శస్త్రచికిత్సకు ముందుకెళ్లాలి. ఫిషర్ సమస్య వ్యక్తిగతంగా, సామాజికంగా ఇలా అన్నిరకాలుగా ఇబ్బందికరం. పైగా పూర్తిగా తగ్గించాలని చేసే శస్త్రచికిత్సతోనూ కొన్ని దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకుంటే... దీనికి చికిత్స కంటే నివారణ చాలా సులభం కాబట్టీ అంటే... కేవలం వేళకు భోజనం చేయడం వంటి మంచి ఆహారపు అలవాట్లు, పీచు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు, నీళ్లు ఎక్కువగా తాగడం, మలద్వారం వద్ద వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) పాటించడం వంటి సాధారణ జాగ్రత్తలతోనే దీని నివారణ జరిగిపోతుంది కాబట్టి వాటిని ఫిషర్ ఉన్నా లేకున్నా అందరూ ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల అసలు ఫిషర్ రాకుండానే నివారించుకోవచ్చునని గుర్తుంచుకోండి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
ఆ పాస్కల్‌ది ఏం గొప్ప... మన జంతికల్‌దే ఘనత!
నవ్వింత: నలుడు, భీముడు ఇద్దరూ మంచి సైంటిస్టులన్నది మా రాంబాబుగాడి మాట. ‘‘అదేంట్రా అలా అంటావ్? ఒకరు గొప్ప చక్రవర్తీ, మరొకరు మంచి పోరాటయోధుడూ అయితే’’ అన్నాన్నేను. అందుకు వాడు చెప్పిన మాటల సారాంశమిది. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొనకముందే... అలాంటి చాలా పరిశోధనలను మన పూర్వీకులు వంటిల్లు అనే ల్యాబ్‌లో నిర్వహించారన్నది రాంబాబుగాడి థియరీ. అయితే ఆ ఆవిరి శక్తిని మనవాళ్లు గొట్టాల్లోకీ, చక్రాల్లోకీ ఎక్కించకుండా... కేవలం ఇడ్లీల్లోకి ఎక్కించారన్నది వాడి హైపోథెసిస్. పవర్‌ను ఇడ్లీల్లో నిక్షిప్తం చేసి, దాన్ని శరీర అవసరాలకు వాడుకున్నారన్నది వాడి అబ్జర్వేషన్. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికే మనవాళ్లకు ఆవిరి శక్తి తెలిసినా, దాన్ని శారీరక అవసరాలకు మాత్రమే వాడుకుంటూ ఉండటం వల్ల జేమ్స్ వాట్‌కు ఆ అదృష్టం దక్కిందంటాడు వాడు. అయితే, శారీరక స్థాయి నుంచి సమాజానికి విస్తరించిన చిరు ఘనత మాత్రమే జేమ్స్వాట్దని చెబుతాడు. దీనిపై ఎవరైనా విభేదిస్తే... మూతపెట్టిన గిన్నెనుంచి ఆవిరులు ఎగజిమ్మినట్లుగా వాడు కస్సుబుస్సుమంటూ శరీరంలోంచి వేడిపొగలు వెలువరిస్తాడు. అనాదిగా మన సమాజంలో ఇడ్లీల తయారీ అన్నది క్రీస్తుపూర్వం నుంచీ ఉందన్న విషయాన్ని మన పొరుగువారైన తమిళులు ఎలాగూ చెబుతారు. చెప్పడం ఏమిటి, సాధికారంగా రుజువులూ ఇస్తారు. కాబట్టి ఈ తార్కాణంలోని తార్కికత ఆధారంగా దేహాత్మకమైన ఆవిరి శక్తులను యాంత్రికం చేసే అవకాశాన్ని వాట్గారికే వాటంగా వదిలేశామన్నది వాడి వాదన. అందుకే రైల్వేఇంజన్లో బొగ్గు వేయగానే ఖయ్యని కూత కూసి శక్తిపుంజుకుని బయల్దేరినట్టే , ఖాయిలా పడ్డవాడు ఇడ్లీతో పథ్యం ప్రారంభించగానే ఎవరిదైనా సరే... చెడిపోయిన ఆరోగ్యం కాస్తా బాగుపడుతూ పట్టాలపైకి వచ్చేస్తుందన్నది రాంబాబుగాడి శాస్త్రోక్తమైన వాదన. ప్రధానమైన మన పరిశోధనలకు కాకుండా, ఆనుషంగిమైన జేమ్స్వాట్గారి అనుబంధ అంశాలకు సైన్స్‌పరమైన గుర్తింపు రావడం సరికాదన్నది వాడి మేలి పలుకు. వంటిల్లు అనే ఈ ల్యాబ్‌లో మన పూర్వీకులు అనేక సైన్సు పరిశోధనలు చేశారని వాడు ఇప్పటికీ మా అందరికీ ఏదో ఒక ఐటమ్ తయారు చూస్తూ, వడ్డిస్తూ చెబుతుంటాడు. అయితే, తిండి అనే దాన్ని, అది తినే అవకాశాలనూ వదిలిపెట్టకూడదనే థియరీ మాకూ తెలిసినందున మేం కూడా యథాశక్తి వాడి వాదనలు నమ్మినట్లు నటిస్తూ, ఒక్కోసారి ఎదిరిస్తూ, కుదరనప్పుడు మౌనంగా ఉండిపోతూ, చాలా కొద్దిసార్లు కుములిపోతూ ఉండిపోతాం. అవకాశాన్ని బట్టి సావకాశంగా రుచులను ఆస్వాదిస్తూ ఉంటాం. జిహ్వచాపల్యం కోసం ఈ మాత్రం రిస్క్ అయినా తీసుకోకపోతే ఇక జీవితంలో థ్రిల్లేముంది! ఇక, వాన చినుకులు పైనుంచి పడ్డప్పుడు చిన్న చినుకులైతే పూర్తిగా గోళాకారంగా... అదే చినుకు సైజు కాస్త పెరిగితే... ఉల్లిగడ్డలాంటి ఆకృతిని పొందుతుందన్నది కూడా మన వాళ్లు ఎప్పుడో వంట సమయంలో నిరూపించారన్నది రాంబాబు గాడి మరో వాదన. కాస్త ఎక్కువ పైనుంచి పిండిని జారవిడవగానే... సర్ఫేస్టెన్షన్ థియరీ ఆధారంగా ‘బోండాలు’ గోళాకృతిని పొందుతాయనీ.. కాస్త సైజ్ పెరిగితే పైన ఉల్లిగడ్డ చివరిలాగా చిన్న పిలక ఆవిర్భవించినా, కింద మాత్రం గోళాకృతిని కలిగి ఉంటాయన్నది వాడు చెప్పే మాట. అలాగే... నూనె ఉపరితలానికి దగ్గర్నుంచి జారవిడుస్తుండటం వల్ల పకోడీలు గోళాకృతిని పొందక దేనికదే స్వతంత్ర ఆకృతితో ఉంటాయట! ఇక జంతికల తయారీ కోసం రెండు స్తూపాకార ఉపకరణాలను కనిపెట్టి, వాటిని ఒకదానిలోకి మరొకటి దూర్చి, పీడనమూ, ఒత్తిడీ అనే అంశాల ఆధారంగా పిండిని ధారాపాతంగా చిల్లుల నుంచి పడేలా చేస్తామట. మన కిచెన్ల్యాబ్కు తగినట్లుగా ఉపకరణాలను గాజుకుప్పెల్లా కాకుండా, లోహపాత్రల్లా తయారు చేశామట. ఈ పీడనం, ఒత్తిడి వంటి సైన్సు సూత్రాలను పాస్కల్ కనిపెట్టాడంటారుగానీ, పాస్కల్కంటే ముందే ఆ గొట్టాల్ని ‘జంతికల్’అనే వ్యక్తి కనిపెట్టాడనీ, ఆయన సూత్రం ఆధారంగా చేస్తాం కాబట్టి వాటిని ‘జంతికలు’ అంటున్నామనీ వాడు అంటాడు. మనలో తిండి ప్రియత్వం ఎక్కువైపోయి... పరిశోధకుడిని మరచిపోయే తత్వం కారణంగా వాటికి కారప్పూస అంటూ మరో పేరు పెట్టడంవల్ల ‘జంతికల్’కు పాస్కల్ అంత కీర్తి రాలేదట. తిండిని కేవలం ఒక దినచర్యగా మాత్రమే పాటిస్తున్న తుచ్ఛులైన మ్లేచ్ఛులైన పాశ్చాత్యులు... మనలా ఆస్వాదించడానికి బదులు వర్గీకరణలూ, శాస్త్రీకరణల పేరుతో సూత్రాల్ని వంటింటి గడప దాటించారని అంటుంటాడు వాడు. నలుడూ, భీముడూ వంటివాళ్లు గొప్ప పోరాటయోధులని అంటారుగానీ వాళ్లు ఆ నాటి సైంటిస్టులన్నది చివరగా మా రాంబాబుగాడు తేల్చిన విషయం! - యాసీన్ -
గల్లీలు కావవి... అందమైన మెహందీ రేఖలు!
అమ్మాయిలు పెట్టుకునే గోరింటాకుకూ... అందమైన హైదరాబాద్‌కూ ఓ అపురూపమైన సంబంధం ఉంది. అదెలాగంటే..! అందరూ ఓల్డ్ సిటీని ఇరుకిరుకు గల్లీల నిలయంగా చెబుతుంటారు గానీ.. నాకెందుకో ఆ నాటికి అలా ఇళ్లు కట్టుకోవడం కరెక్టే అనిపిస్తుంటుంది. ఇరుకిరుకు గల్లీలను చూసి వాళ్లేదో నాగరికత తెలియక అలా చేశారనుకోవడానికి వీల్లేదు. గల్లీ ఇరుకైందంటే అర్థం... అప్పటి మనుషుల మనసులు చాలా విశాలంగా ఉన్నాయని. ఇదేంట్రా బాబూ... ఈ వాదనేమిటీ అనే సందేహం వద్దు. ఇలా ఇరుకిరుకుగా ఇళ్లు కట్టుకున్నారంటే మనుషులు చాలా దగ్గర దగ్గరగా ఉండటాన్ని కోరుకున్నారని దానర్థం. ఎంత ఇరుకుగా ఉంటే అంత దగ్గరగా ఉండాలని కోరుకున్నారన్నమాట. అంటే పూలదండలో పువ్వు పువ్వుకూ మధ్య స్థలం ఎంత తక్కువగా ఉంటే హారం అంత ఒత్తుగా ఉంటుందన్నట్టు. హారం ఎంత ఒత్తుగా ఉంటే దాని విలువ అంత ఎక్కువన్న మాట. దూరం దూరంగా అల్లిన హారాన్ని మగువలు కోరుకుంటారా? ధర ఎక్కువ పెట్టి కొంటారా? దీన్ని బట్టి తెలిసేదేమిటి? ఇళ్లెంతగా దగ్గర దగ్గరగా ఉంటే వాళ్లంతటి ఒత్తై సామాజిక జీవనాన్ని కోరుకున్నట్లన్నమాట. ఒక్క పూలమాలతోనే ఉదాహరణే ఎందుకు? అమ్మాయిలు పెట్టుకునే మెహందీ అనండి లేదా గోరింటాకు అనండి. దీన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అరచేతి మీద కోన్‌తో గీసే ఆ సన్నటి గీతల మధ్య చాలా చాలా దూరం ఉందనుకోండి. ఆ డిజైన్ బోసిగా ఉండదూ! అదే అందమైన తీగలు చుట్టలు చుట్టుకున్నట్లుగా, చేయి తిరిగిన కళాకారుడు అలవోకగా మెలికలు తిప్పుతూ గీసిన గీతలు ఒత్తుగా ఉంటేనే చేతిలోని ఆ చిత్రాకృతికి అందం, చందం. మీరు గమనించి చూశారో లేదో... ఈ మెలికల డిజైన్లు కేవలం అరచేతి వరకే పరిమితం కావు. అచ్చం హైదరాబాద్ శివార్లను దాటి ఒకవైపు సదాశివపేట్ వరకూ, మరోవైపు చౌటుప్పల్ వరకూ, ఇంకోవైపు చేవెళ్ల వరకూ పాకేసినట్లుగా.. ఆ డిజైన్లు కూడా అరచేతిని దాటేసి దాదాపు మోచేయి వరకూ పాకేస్తాయి. ఏం చేస్తాం. మెహందీ వేసుకోవాలన్న కోరిక ఎంత బలమైనదో... హైదరాబాద్‌నే నివాసం చేసుకుని ఆవాసం ఉండిపోవాలన్న కోరికా అంతగా తీవ్రమైనది. అందుకే ఈ పాకులాట.ఇక ఒక్కోసారి చేతికి ఒత్తుగా గోరింటాకు పూసినా సరే... చేతి ముడతల్లోని గీతల్లో రంగు అంటక అక్కడ ఖాళీ కనిపించినట్లుగా ఉంటుంది కదా... మూసీ పారే చోట అచ్చం అలాగే రంగు విడిపోయి కనిపిస్తుంది. వెరసి.. మెహందీ అంత అందమైనదీ... మెత్తనైనదిలా కనిపించే ఒత్తైదీ, చిక్కనైనది... బహు చక్కనైనది, అరచేతిన ఇమడకుండా హద్దులకు అందకుండా విస్తరించేది... స్వర్గం మన అరచేతికి అందేంత దూరంలో ఉందంటే అది హైదరాబాదే! యాసీన్ -
మా రాంబాబు గాడి ‘భశుం’ కాపురం!
నవ్వింత మా రాంబాబుగాడికి కాస్త స్టైల్‌గా, హీరోలా, షాన్ ఔర్ షౌకత్‌తో జీవించాలని కోరిక. అదేం చిత్రమోగానీ... వాడేదైనా సినిమాటిగ్గా చేయబోతే చాలు... అది డ్రమటిగ్గా ఫెయిలవుతుంటుంది. బాపూగారి ఫేమస్ కార్టూన్ ఒకటుంది. ‘భశుం’ కార్డ్ పడ్డ తర్వాత ‘ఇంత అవక తవక కంగాళీ చిత్రం చూళ్లేదండీ’ అనుకుంటూ ప్రేక్షకులు హాల్లోంచి బయటకొస్తూ ఉంటారు. ఆ ‘భశుం’ కార్డు పడటానికి ముందు జరిగిందంతా మా రాంబాబుగాడి సినిమాయేనని వాడి అనుమానం. భావుకుల భాషలో చెప్పాలంటే... ఒక ఆహ్లాద భానూదయ తొలికాంతుల వేళ. చలిగిలిగింతలు పెట్టే లేత పవనాల హేల. ధారగా కురుస్తున్న తుషారబిందువుల మాల! అయితే... మా రాంబాబుగాడి భాషలో క్రూడ్‌గా చెప్పాలంటే మంచు కురుస్తూ, చలి గజ్జున వణికిస్తున్న సమయంలో ఆ మంచుగాల్లో లారీల పొగ కాలుష్యం కాస్తా కాక్‌టెయిల్‌లా కలసిన టైము. నెత్తి మీద ముసుగేసుకున్నట్లుగా ఉండే ట్రాక్ సూట్‌తో (పై ముసుగును హుడ్ అంటారట) సినిమా హీరోలా జాగింగ్‌కు బయల్దేరాడు మన రాంబాబు. తల చుట్టూ ఉన్న హుడ్డులోని గుడ్లు తేలేశాడు. ఆరోగ్యం మాట ఎలా ఉన్నా అలర్జీతో ఆయాసంలో మునిగి ఆసుపత్రిలో తేలాడు. ప్రతివాడూ ప్రత్యూష పవనాలు బాగుంటాయంటాడు. కానీ ఇదేంట్రా... మనకు ఆ అందాలేమీ కనపడలేదు సరికదా... అనారోగ్యం మిగిలి, మందులు మింగాల్సి వచ్చింది అంటూ బాధపడ్డాడు. వాడి జాతకమే అంత. పరుగులోనే కాదు... పాణిగ్రహణంలోనూ అదే జరిగింది. పేరులోనే ‘గ్రహణం’ అనే మాట ఉన్న తర్వాత అలా జరగకుండా ఎలా ఉంటుంది? అందునా రాంబాబుకీ?! ఈ లోకంలో ఎవడైనా సరే... తన ప్రియురాలిని ప్రేమిస్తే... అదృష్టవంతుడైతే ఓకే అంటుంది. కాకపోతే కుదర్దు అనేస్తుంది. అదేమిటోగానీ... మన రాంబాబుగాడు ఎలాంటి ప్రపోజలూ పంపకముందే ఓ అమ్మాయి అతడి దగ్గరకు వచ్చి... ‘‘సారీ రాంబాబూ... కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను నిన్ను ప్రేమించడం కుదర్దు. నా అశక్తతకు నన్ను మన్నించు’’ అనేసింది. అప్పట్నుంచి మనవాడికి అమ్మాయిలంటే చెడ్డ మంట. నేను ప్రపోజ్ చేస్తే నువ్వీమాట అనడం ఓ పద్ధతి. కానీ అలాంటిదేమీ లేకుండానే ఇదేమిటంటూ మండిపడ్డాడు మనవాడు. ఇది జరిగాక ఓ ముగ్గురు నలుగురు అమ్మాయిలు మనవాడికి తమ ప్రేమ ప్రపోజల్స్ పంపారు. కానీ అమ్మాయిలంటే ఉన్న మంట కొద్దీ మనవాడు వాళ్లందర్నీ కసికసిగా రిజెక్ట్ చేసేశాడు. ఈ లోపుగా మరో అమ్మాయి (ఈమె ఐదోది) నుంచి కూడా లవ్ ప్రపోజల్ వచ్చింది. అదేం మూడ్‌లో ఉన్నాడోగానీ... ఈసారి ఓకే చెప్పాడు. మనవాడు ఓకే చెప్పినప్పట్నుంచీ ఆ అమ్మాయి అన్యమనస్కంగా మారిపోయింది. చిరాకూ పరాకులతో చిర్రుబుర్రులాడింది. ఈ అల్లకల్లోలాల మధ్యనే వాళ్ల పెళ్లయిపోయింది. పెళ్లయితే అయ్యింది గానీ... దంపతుల మధ్య రోజూ గిల్లికజ్జాలే. ఏదో ఒక విషయంపై అగ్గిఫైరింగులే. ప్రేమపెళ్లే కదా ఇలా ఎందుకు జరుగుతోందని బంధువర్గమంతా ఆశ్చర్యపడ్డారు. ఎట్టకేలకు చాలా అనునయించి విషయం రాబట్టాడు మన రాంబాబు. సదరు ప్రేమిక చెప్పిన జవాబేమిటంటే... ‘‘ఆ రోజుల్లో మీరు రిజెక్ట్ చేసిన నలుగురు అమ్మాయిలకూ మంచి సంబంధాలు వచ్చాయి. ఒకరికి ఐఏఎస్ సెలక్టయినవాడితో పెళ్లి కాగా... మరొక అమ్మాయికి ఫారిన్ సంబంధం కుదిరింది. ఇంకో అమ్మాయికి ఐఆర్ఎస్తో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్మెంట్లో రాష్ట్రస్థాయి అధికారి! దాంతో మన వీధిలోని అమ్మాయిల్లో ఒక రూమర్ పాకింది. మీకు ప్రపోజ్ చేసి, మీతో రిజెక్ట్ చేయించుకుంటే చాలు... ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుందనే గుసగుసలు బయల్దేరాయి. ఈ సెంటిమెంట్ టాక్‌తో నేనూ ప్రభావితమై... ఎలాగూ రిజెక్ట్ చేయకపోతారా అని మీకు ప్రపోజ్ చేశాను. మీరు అవునన్నారు కాబట్టి నేను కాదనలేను. నేనే ప్రపోజ్ చేసినా, మీ మీద మనసు లేదు కాబట్టి అవుననలేను. అందుకే మన కాపురం ఇలా ఏడ్చింది’’ అంటూ విషయం బయట పెట్టింది. ఎంత సినిమాటిగ్గా జీవించాలనుకుంటాడో అంత డ్రమటిగ్గా మారిపోవడం వాడి జీవిత ప్రత్యేకత. ఈలోపు రాంబాబు గాడికీ కాస్త గౌరవప్రదమైన ఉద్యోగమే వచ్చి, దాంట్లో చేరిపోయాడు. అది జరిగాక కాస్త కౌన్సెలింగ్ ఇవ్వడంలో దిట్టలైన కొందరు మహిళామణులు బయల్దేరి... ‘రాంబాబు గాడికి ప్రపోజ్ చేస్తే, మంచి సంబంధం కుదురుతుందనే సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. నీ అదృష్టం బాగుంది కాబట్టే వాడికి మంచి జాబ్ వచ్చింది. లేదంటే వాడిలాంటి రెటమతం గాడికి అలాంటి ఉద్యోగమా?’’ అంటూ వాడి భార్యామణిని అందరూ సమాధానపరచారు. దాంతో తన రాతా బాగుండబట్టే రాంబాబుకు జాబు దక్కిందనీ, దాంతో తన అదృష్టమూ చక్కబడిందనే తృప్తితో కలహం సద్దుమణిగించి, కాపురం మొదలుపెట్టింది వాడి సతీమణి. ఇవన్నీ వాడికీ తెలుసుకాబట్టే... ఎప్పుడైనా పెళ్లాంతో కాస్త గొడవ మొదలవ్వగానే... ‘భశుం’ అంటూ బయటికి జారిపోయి, సద్దుమణిగాక ఇంట్లోకి దూరిపోయి... ఇలా ఇంట్లోకీ, బయటకీ షటిల్ సర్వీసు చేస్తుంటాడు. - యాసీన్ -
ఢాంలెస్‌తో టపాస్
ఆస్తమాతో దీపావళి చేసుకోవడం ఎంత కష్టం. కాలుష్యం వల్ల నగరం మొత్తం తాను అనుభవిస్తున్న క్షోభ మనిషికీ అనుభవంలోకి రావాలని బహుశా ప్రకృతి ‘ఆస్తమా’ అనే జబ్బును సృష్టించి జనాల మీదికి వదిలిందేమో! ఉరి బాధను ఊరికే కాసేపని కాకుండా... ఆస్తమా ఉన్నవారికి అస్తమానం ఆ బాధ గంటలూ, రోజులూ అనుభవంలోకి వచ్చేలా చేసే జబ్బు అది. దానికి కారణం... మనం వెలువరిచే పొగ, కాలుష్యం! అలాగని ఆస్తమాతో దీపావళి చేసుకోకపోవడమూ ఎంత కష్టం! అందుకే ఉత్సవాన్ని ఊరితో అనువర్తించుకుని ఆవిష్కరించుకుంటే ఉరిబాధ నుంచి కాసేపు ఊరట! అందుకోసమే పండుగనాటి సాయంత్రం పూట బాణసంచాను మన షహర్‌కు ఆపాదించి ఆ బహార్‌లో విహరించి, ఆనందించడం మొదలుపెట్టా. అంతేకాదు... ఇలా స్మోక్లెస్, సౌండ్‌లెస్ దీపావళిని ఆలోచనలతో జరుపుకోవడం ఎలాగో మా బుజ్జిగాడికీ చెప్పడం ప్రారంభించా. ట్యాంక్‌బండ్ ఈ చివర్నుంచి ఆ చివరి వరకూ రోడ్డు తారాజువ్వ ప్రయాణమార్గంలా సూటిగా ఉందనిపించింది. ఇక రింగురోడ్డు అచ్చం భూచక్రం వెలువరించి ఏర్పాటు చేసిన కాంతివలయంలా ఉంది. మెహిదీపట్నం వద్ద మొదలై... శంషాబాద్ వరకు ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవే అచ్చం... చీపురుపుల్ల రాకెట్‌ను ఏటవాలుగా వదిలితే... ఇక్కడ మొదలై... విమానాలు దిగే చోట... రాకెట్ కూడా దిగినట్లనిపించింది. ‘మరి చిచ్చుబుడ్డి లేదా నాన్నా’ అడిగాడు మా బుజ్జిగాడు. ‘ఎందుకు లేదూ...! బిర్లా మందిర్ ఉన్న నౌబత్పహాడ్ అచ్చం చిచ్చుబుడ్డి షేప్లోనే ఉంటుంది. దాని చివర తెల్లటి కాంతుల వెలుగులు విరజిమ్ముతూ ‘బిర్లామందిర్’ ఒకపక్కా.... మరో వైపు నుంచి చూస్తే విజ్ఞాన కాంతులు ఎగజిమ్ముతూ ‘ప్లానెటోరియం’ మరో పక్క. ఏదైనా వాహనం మీద ఆ గుట్ట పక్కనుంచీ ప్రయాణం చేస్తూ ఉంటే... ఆ మందిరమూ, ఈ భవనమూ సదరు నౌబత్పహాడ్ అనే చిచ్చుబుడ్డి శిఖరంపై మారిమారి దివ్వెలు వెలువరిస్తూ కనిపిస్తుంటే... మనసులో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక వెలుగురవ్వలు రాలుతున్నట్లుంటుంది. ఇక ఊరి మధ్యనున్న హస్సేన్‌సాగర్ అంటావా... మంటలేవైనా అకస్మాత్తుగా వెలువడితే ఆర్పడానికి ముంగిట్లో పెట్టిన నీళ్ల బక్కెట్లా ఉంటుంది. ‘‘అన్నీ బాగున్నాయ్ నాన్నా. కానీ బాంబులు లేవా? ఢామ్మంటూ శబ్దాలు వద్దా’’ ‘‘వద్దు... ఆనాడు గోకుల్ చాట్‌లో మొదలైన ఆ పేలుళ్లు... నిన్నటి దిల్సుఖ్నగర్ బాంబులతో ఆఖరైతే ఇక అంతేచాలు. జంతువుల గుండెలు గుబగుబలాడించడంతో పాటు... గుండెలవిసిపోయేలా మనుషులనూ గుండెలు బాదుకునేలా చేసే బాంబులు వద్దే వద్దు. ఈ విషయాన్ని బాంబులు పేల్చేవాళ్లూ గ్రహిస్తే ఇక నగరంలో పూలపూల దీపావళే తప్ప పేలుళ్ల దీపావళి ఉండదు. టపాసు ‘టప్’ అని సున్నితంగా పాస్ కావాలి తప్ప... ఢామ్మంటూ గుండెల్నీ, చెవుల్నీ బద్దలు కొట్టకూడదు. ఇది నగరవాసులంతా గ్రహించిన నాడు నగరవాసులందరూ కలిసి నగరం నగరాన్నే ‘ఆస్తమా’ నుంచి రక్షించినంత గొప్ప. ఆనాడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నంత ఘనత. అందుకే పండుగ ఎంత ‘ఢామ్’లెస్‌గా జరిగితే... టపాస్ ఎగ్జామ్స్‌లో పాస్ కావడమే కాదు... అందులో టాపర్సూ మనమే. మన పర్సులోని కాపర్సూ, కరెన్సీ సేఫే’’ అంటూ పెన్సిల్ కడ్డీలాంటి విషయాన్ని స్ట్రెయిట్గానే ఉపదేశించా మా బుజ్జిగాడికి. అన్నట్టూ... ఇంతకీ ఈ రోజు మీరు జరుపుకొనేది ఢాంలెస్ దీపావళేనా? - యాసీన్ -
పొంగేషు పూరీ... గుటకేషు గప్‌చుప్!
నవ్వింత: మా రాంబాబుగాడు దేన్నైనా బలంగా నమ్మాడంటే చాలు... దాన్ని నిరూపించడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. అలాంటి వాడు అకస్మాత్తుగా పూరీల మీద పడ్డాడు. వాడు పడితే పడ్డాడు కానీ... మమ్మల్నందర్నీ పడేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడొచ్చింది ఇబ్బంది. పొద్దున్నే పూరీలు వండే ఇల్లు పూరిల్లట. చక్కటి పూరింట్లో దొరికే పూరీలూ, రుచికరమైన ఆలూఖుర్మా, రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కర్పూరతాంబూలం, రకరకాల పూరీ కూరల రుచులను ఎంచే సరసులూ ఉంటే కవిత్వం ఆటోమేటిగ్గా వస్తుందంటాడు మా అల్లసాని రాంబాబు. వాడి వాదన ఎంతవరకూ వెళ్లిదంటే... ఏదైనా పద్యం తాలూకు చివరిపాదం చెప్పి మొదటి మూడు లైన్లూ నింపడాన్ని పూరించడం అని ఎందుకు అంటారంటే... పూరీలు తినడం వల్ల జ్ఞానం బాగా పెరిగి, తక్షణం ఆ లైన్లను నింపగలుగుతారట! ‘‘ఇది కరెక్ట్ కాదేమోరా?’ అంటే... ‘‘మరి వడ్డెర చండీదాస్ అనుక్షణికం నవల్లో ‘స్నానించడం’ అని రాస్తే దానికి ‘స్నానం చేయడం’ అని అర్థం ఉన్నప్పుడు సిమిలర్‌గా ఇదెందుకు కాకూడదు?’’ అని ఎదురుప్రశ్న వేశాడు. ‘‘ఒరే... మిద్దె ఉన్న ఇల్లు మిద్దె ఇల్లు, గడ్డితో కప్పువేసే చిన్న గుడిసె పూరిల్లు. అది గుడిసె కాబట్టి పూరి గుడిసె అని కూడ అంటార్రా’’ అంటే వినడే! ఒకవేళ గుడిసెలో పూరీలు చేస్తే దాన్ని పూరి గుడిసె అంటారని వాడు ఒక్కసారి కమిటయ్యాడట. ఇక వాడి మాట వాడే వినడట. ఈ డైలాగ్ కూడా పేరులో పూరీ ఉన్న ఫిల్మ్ డెరైక్టర్ కమ్ రైటర్ పూరీ జగన్నాథ్దట. ‘అలాంటప్పుడు మీ మాట ఎందుకు వినాల’న్నది వాడి వాదన. పూరీల రుచిని ఒకపట్టాన వదులుకోలేని ఎందరో జిహ్వాగ్రేసరులంతా దాన్ని మరవలేక భేల్‌పూరీ, సేవ్పూరీ, పానీపూరీ అంటూ మరెన్నో విధాలుగా తింటుంటారట. పానీపూరీని ఇతరులతో షేర్ చేసుకోడానికి వీల్లేనందువల్ల, ఒక్కరే గప్‌చుప్‌గా గుటుక్కుమనిపిస్తారు కాబట్టే దాన్ని ముద్దుగా ‘గప్‌చుప్’ అని కూడా అంటారట. అక్కడితో ఆగకుండా ఫక్తు సంస్కృత సూక్తుల తరహాలో అనేక కొటేషన్లూ చెప్పాడు. ‘‘పొంగేషు పూరీ, మింగేషు మిర్చీ, గుటకేషు గప్‌చుప్, బొక్కేషు బోండా, భోజ్యేషు బజ్జీ, కొరికేషు కోవా, నమిలేషు కిళ్లీ’’ అని... ‘‘వీటన్నింటిలోనూ పూరీలను ముందుగా ఎందుకు పెట్టాననుకుంటున్నావ్? చపాతీ పెనానికి అతక్కుపోతుంది. అదేగానీ... పూరీ మూకుడులో వేయగానే పొంగుకుంటూ పైకి తేలుతుంది. ‘మునిగి మునకలేయకు, అతికి పెనానికి కరుచుకోకు, ముడుచుకోకు, విచ్చుకో... నాలా పైకి తేలు’ అంటూ ఎందరికో స్ఫూర్తినీ, సందేశాన్నీ ఇస్తుంది పూరీ. అందుకే నా శ్లోకంలో ముందుగా దానిపేరే రాశా’’ అన్నాడు వాడు. ‘‘వదిలెయ్ రా... పొడగకపోయినా రుచిలో మార్పేమీ రాదు కదా’’ అన్నా. ‘‘అలాగని గొప్పగొప్పవాళ్లు దాన్ని వదిలేయలేదు కదా. నిజానికి వాళ్లు పూరీని తమ పేరులో పెట్టుకోవడం వల్లే న్యూమరాలజీ ప్రకారం సక్సెసయ్యారట తెలుసా?’’ అన్నాడు. ‘‘ఎవర్రావాళ్లూ?’’ అడిగా. ‘‘ఓంపూరీ, అమ్రీష్‌పూరీ, పద్మినీ కొల్హాపూరీ లాంటి గ్రేట్ నటులూ, హస్రత్ జైపూరీ లాంటి మహాకవులూ... వీళ్లంతా నిత్యం పూరీని స్మరిస్తూ తమ పేరులో దాన్ని భాగం చేసుకున్నవాళ్లే’’ ‘‘వాళ్ల పేరులో ఉన్నది పూరీ కాదురా... పురి... పురి...’’ అని ఆ మాట సాగకుండా పురిపెట్టి వాడు చక్కగా ఉచ్చరించేలా పురిగొల్పడానికి ప్రయత్నించా. ‘‘కొంతమందికి దీర్ఘాలు తీస్తూ మాట్లాడటం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్లూ పూరీతో పాటూ, అక్కడి దీర్ఘాన్ని మింగేశారు. చాలామంది తెలుగు వాళ్లు ఆ పేర్లను పిలిచేప్పుడు ‘పూరీ’ అంటూనే పిలుస్తారు. ఉచ్చారణే నాకు ప్రామాణికం’’ అంటూ మొండికేశాడు. అక్కడితో ఆగకుండా కవిత్వానికీ, పూరీకీ మళ్లీ మరో లింకు పెట్టాడు. అదేంట్రా అంటే... ‘‘ఒకాయన భోజుడి నుంచి ఏదైనా బహుమతి పొందాలని వచ్చాట్ట. భోజరాజు ముఖం చూస్తే చాలు కవిత్వం అలా పొంగుకొచ్చేస్తుందట కదా. అలా కార్యార్థియై వచ్చిన ఆయన భోజుడి ముఖం చూడగానే కవిత్వం మరచి, బాగా ఆకలేసి పలారం అడిగాట్ట. ‘‘టిపినీ దేహి రాజేంద్ర... పూరీ కూర్మా సమన్వితం’’ అని కోరాడట. భోజుడి లెవల్‌కు సింపుల్‌గా పూరీ మాత్రమే అడగటమేమిటీ, రాజుగారు ఇవ్వడమేమిటీ అని అతడి బంగారు పాలనలో ఉన్న ప్రజలంతా కలిసి తాము మాట్లాడుకునే భాషకు భోజ-పూరీ అని పేరుపెట్టుకున్నారట. అందుకే ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల ప్రాంతాల్లోనూ, బీహార్ పశ్చిమ ఏరియాల్లోనూ, గయానా, సురినమ్, ఫిజీ, మారిషస్... దేశాల్లోనూ భోజ్‌పురి భాష మాట్లాడతారట. ఎందుకనీ...భోజుడి పట్ల గౌరవం, పూరీల పట్ల విపరీతమైన ప్రేమ’’ అన్నాడు వాడు. మనమెంత చెప్పినా వీడింతే అనుకొని పూరీలు తినడం పూర్తయ్యాక.. ‘పుర్రెకో వెర్రీ... జిహ్వకో పూరీ’ అంటూ నిట్టూరుస్తూ బయల్దేరాం. - యాసీన్ -
ఈ బైతూ...ఆ బైకూ ఒకటేనా...?!
నవ్వింత: మా బుజ్జిగాడు గొప్ప ఇంజనీరైనా కావచ్చు, లేదా ముఖం చూసీ, చూడకుండానే ఎదుటివాడి జాతకాలు చెప్పేసే మహా ఫ్యూచరాలజిస్టు అయిన కావచ్చునని నా నమ్మకం. ఇదేంట్రా పొంతన లేని రెండింటికి ముడిపెడతాడు అని మీకు అనిపించవచ్చేమోగానీ... దిగులుతో కూడిన ‘నా అనుభవాలూ... పరాభవాలూ’ చెబితే నేనన్నదే నిజమని మీరూ అంగీకరిస్తారు. మావాడు మరీ చిన్నవాడిగా ఉన్నప్పుడు మాటలు కూడా సరిగా రాని రోజుల్లో నా టూవీలర్ మీద తిప్పమంటూ గొడవ చేసేవాడు. దాన్ని బైక్ అంటారని ఓ రోజు చెప్పా. ఆ మాట గుర్తు పెట్టుకొని... నేనెత్తుకుని ఉన్నప్పుడు నా చేతుల్లో ఉన్నవాడు కాస్తా దానివైపు ఒరుగుతూ వాడు దాన్ని చూపిస్తూ... ‘బైతూ...’ ‘బైతూ...’ ‘బైతు పో ఆం (పోదాం)’ అంటూ ఉండేవాడు. వాడంటున్న ముద్దు మాటలను వింటూ... ‘అబ్బ మీది మరీ నలభై గడప కూడా లేని పక్కా పల్లె అనీ... మీరు మరీ మొరటు పల్లెటూరి బైతు అని వాడెలా తెలుసుకున్నాడండీ’ అంటూ ముద్దు ముద్దుగా మురిసిపోతూ మురిపెంగా అంది మా ఆవిడ నా ముఖం నల్లగా మారిపోతూ ఉండగా. మరి కొన్నేళ్ల తర్వాత ఓరోజు పొద్దున్నే వాణ్ని స్కూల్‌కు దిగబెట్టడానికి నా టూవీలర్ తీశా. పెట్రోలు తక్కువగా ఉందని ట్యాంకు నిండా పెట్రోలు కొట్టించా. ఆ తర్వాత కిక్కు రాడ్డును ఒక తన్ను తన్నా. కానీ బండి స్టార్ట్ అవ్వలేదు. కొట్టీ కొట్టీ చెమటలు గక్కుతూ నేను అలసిపోయినా అది మాత్రం మొండికేసింది. ‘‘ఇప్పుడే పెట్రోలు ఫుల్లుగా కొట్టించాను. అయినా స్టార్ట్ కావడం లేదేంటీ’’ అంటూ చిరాగ్గా అన్నాన్నేను. వెంటనే మా బుజ్జిగాడు, ‘‘నాన్నా... నువ్వు కూడా కడుపునిండా అన్నం తిన్న తర్వాత ఒక్కోసారి కడుపు బరువైందని బద్ధకంగా పడుకుంటావు కదా, సావాసదోషంతో నీ బైకు పరిస్థితి కూడా అదేనేమో’’ అన్నాడు. అలాంటిదే మరో సంఘటన. ఓరోజున మా క్లోజ్ఫ్రెండొకడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు. కాసేపు మాటా మంతీ అయ్యాక ఇంట్లో చెప్పిన విషయాలను నేనంతగా పట్టించుకోవడం లేదనీ, ఒక పట్టాన స్పందించడం లేదనీ మా ఆవిడ చేసిన ఫిర్యాదులు వింటూ... ‘నిన్ను తన్నినా నీకు బుద్ధిరాదురా’ అన్నాడు కాస్త చనువుగా కోప్పడుతూ. మా బుజ్జిగాడు అందుకుంటూ, ‘అంకుల్... అచ్చం మా బైకు లాగానే మా నాన్న కూడా’ అన్నాడు నా బండి కిక్రాడ్ను చూపుతూ. నాకు పరమ బద్ధకమనీ, ఏపనీ ఒక పట్టాన తెమలనివ్వననీ కోప్పడుతూ ఉంటుంది మా ఆవిడ. ఓ రోజున అదే విషయాన్ని గట్టిగా చెబుతూ, ‘ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ పొండి. చాపకిందికి నీరొచ్చే వరకూ మీకు విషయం తెలిసిరాదు’ అంది. కొన్నాళ్ల తర్వాత ఒక రోజు మా ఆవిణ్ణీ, బుజ్జిగాణ్ణీ టూ వీలర్ మీద తీసుకెళ్తుండగా సరిగ్గా నా సీటుకింద పూర్తిగా తడిసిపోయి, నా ప్యాంటు ముద్దముద్దయ్యింది. మావాడు అందుకున్నాడు, ‘‘నాన్నా, సీటు చిరిగిపోయి, స్పాంజీ బయటకు వచ్చినా రెగ్జిన్ మార్పించలేదు. నీ బద్ధకం వల్ల జరిగే నష్టం తెలియాలంటే చాపకిందికి నీళ్లే రానక్కర్లేదు. సీటు కిందికీ నీళ్లొచ్చినా చాలు’’ అని బుద్ధి చెప్పాడు. ఓ రోజున నా బండి ఆగిపోతే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లా. దాన్ని పరీక్షించి ప్లగ్ చూసి... ‘‘స్పార్క్ రావడం లేదండీ. ప్చ్... స్పార్క్ లేదు’’ అన్నాడు. మావాడు ఆ మాట గట్టిగా పట్టుకుని, ‘‘మొన్న మీ పెద్ద బాస్ కూడా ‘నీలో స్పార్క్ లేదయ్యా’ అని తిట్టారన్నావు కదా! మెకానిక్ అంకుల్ చెబుతున్నదాన్ని బట్టి ఆ మాట నిజమేనని తేలిపోయింది కదా నాన్నా. ప్చ్... స్పార్కు లేకుండా ఎలా బతుకుతావో ఏమో’’ అని నామీద జాలిపడ్డాడు. ఇంతకూ... మా బుజ్జిగాడు నన్ను మా మోటర్‌సైకిల్‌తో పోలుస్తూ భవిష్యత్తులో మంచి ఇంజనీరు అవుతాడా? లేక ఇలా దాన్ని ఓ ఉదాహరణగా చూపుతూ నా జాతకం రచించేసి మాంఛి ఫ్యూచరాలజిస్టూ, నాస్ట్రడామస్సూ అవుతాడా అన్న సందేహం మాత్రం ఇప్పటికీ తీరలేదు. ‘నాన్నా... బండి రిపేరుకొస్తే నువ్వు దాన్ని బాగు చేయించడం మానేసి... అసలది అలా ఎందుకైందా అని ఆలోచిస్తుంటావు. నేను కనీసం ఇంజనీరునో, ఫ్యూచరాలజిస్టునో అవుతానేమో గానీ నువ్వు మాత్రం నేను చిన్నప్పుడు నోరు తిరగక పలికినట్టు మన బైకుకూ బైతుకూ తేడా లేకుండా బతుకుతావు జాగ్రత్త’’ అంటూ బెంగ పెరిగిపోతుండగా నాకు వార్నింగిచ్చాడు. - యాసీన్ -
‘అట్లా’లజిస్ట్ డాక్టర్ రాంబాబు!
నవ్వింత: డాక్టర్ కావాలన్నది మా రాంబాబు గాడి కోరిక. అయితే, మినపట్లలాంటి హెవీ ఫుడ్డు తినేసి, బద్ధకంగా పడుకునేవాడు. అలా మెడిసిన్‌లో చేరలేకపోయాడు. అత్తెసరు మార్కులతో పీజీ గట్టెక్కించాక, డాక్టరేటైనా తెచ్చుకుందామనుకున్నాడు.‘తెలుగు సాహిత్యానికి అట్ల సేవ- తులనాత్మక పరిశీలన’ వాడి టాపిక్కు. ‘‘ఇదేం టాపిక్కురా?’’ అన్నందుకు లెక్చర్ మొదలెట్టాడు. ‘‘అట్టు గురించి వాళ్లూ వీళ్లూ చెప్పడం ఎందుకు? శ్రీశ్రీ, ఆరుద్ర, వరద రాజేశ్వరరావు అట్ల మీద టన్నులకొద్దీ అభిమానాన్ని వెల్లడించారు. ఆరుద్రగారి కుటుంబం ఉన్న వీధి నుంచి అబ్బూరి రామకృష్ణారావు మాష్టారు వాల్తేరుకు మకాం మార్చినా... వరద రాజేశ్వరరావు రోజూ పొద్దున్నే జట్కా బండి కట్టుకుని మరీ ఆరుద్రవాళ్ల వీధికి విచ్చేసి వాళ్ల బాబాయి (ఆరుద్ర తండ్రిగారి రెండో తమ్ముడు భాగవతుల నారాయణరావు)ని తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయేవారట. నలభై ఏళ్ల తర్వాత మళ్లీ వరద రాజేశ్వరరావును హైదరాబాద్‌లో ఆరుద్ర కలిసినప్పుడు తెలిసిందట... వాళ్లు విశాఖపట్నంలోని పప్పుల వీధి మెయిన్‌రోడ్డుకు వెళ్లి ఉల్లికారంతో పెసరట్లు తినేవారని. అక్కడ మూడు రకాల అట్లు వేసేవారట. పెసరట్టు పిండి కొంతా, పుల్లట్ల పిండి కొంతా కలిపి మరో ప్రత్యేకమైన అట్టు వేసేవారు. ఆ రుచిని మరవలేక వరదగారూ, అబ్బూరి ఛాయాదేవిగారూ బాగా ప్రాక్టీస్ చేసి ఉల్లికారాన్ని శ్రీశ్రీకీ, ఆరుద్రకూ పెడితే, వాళ్లు కడుపునిండా తినేసి, పద్యాలు రాసేవారట’’ అన్నాడు రాంబాబు. ‘‘నిజమా?’’ అని అడిగాన్నేను. ‘‘ఇంకా అయిపోలేదు ఆగు... శ్రీశ్రీగారైతే ‘ఈ విశాలవిశ్వంలో నే కోరేడిదేమున్నది ఒక ‘దోసె’డు తీరుబాటు, ఒక పిడికెడు సానుభూతిని’ అంటూ ‘కరుణకు మా బతుకు’ కవిత్వం రాశార్ట. ఇక ఆ రోజుల్లో ఛాయాదేవి గారి ‘కవిత’ పత్రికకు పద్యాలు రాయాడానికి ముందుగా విధిగా పెసరట్టూ, ఉల్లికారం తిన్నాననీ, ఆ తర్వాతే తాను రాసి తొలిసారి ‘కవిత’లో ప్రచురితమైన భాగాలనే... ‘సినీవాలి’లో చేర్చుకున్నాననీ అన్నారు ఆరుద్ర. అంతేనా... ‘హైదరాబాద్‌లోని వరద రాజేశ్వరరావు ఇల్లు ప్రతి రోజూ పొద్దుటే విశాఖపట్నంలోని పప్పుల వీధి పెసరట్ దుకాణం అవతారం దాల్చేది’ అంటూ విశాఖకూ, హైదరాబాద్‌కూ ఉన్న సంబంధం అట్ల సంబంధమేనని తేల్చేశారు ఆరుద్ర. ఈ మాటల్ని బట్టి నీకు తెలిసేదేమిటీ? పద్యాలు రాయడానికి ముందు పెసరట్లు తినాలని’’ అన్నాడు రాంబాబు. ‘‘ఏదో మహానుభావులు తమ టేస్టుల గురించి చెబితే వాళ్ల సాహిత్యానికి మూలం అట్లే అని తేల్చేస్తే ఎలారా?’’‘‘కాస్త చెప్పడమేంట్రా... ‘వరద జ్ఞాపకాల వరద’ వ్యాసంలో సాహిత్యచర్చ ఎంత ఉందో... అట్ల గురించిన చర్చా అంతే ఉంది.’’ ‘‘ఆ ముగ్గురూ ఇష్టపడ్డారని, సాహిత్యానికి అట్లు సేవ చేశాయంటే ఎలారా?’’ అన్నాన్నేను. ‘‘శ్రీశ్రీకి యోగ్యతాపత్రం ఇవ్వగలిగిన చలం సైతం నూరేళ్ల కిందటే ‘అట్లపిండి’ కథ రాశారు. ‘సదరు అట్లపిండి గిన్నెను ఇంట్లో ఉంచితే నూరు ఖూనీలు జరిగాయేమోనని పొరుగువాళ్లు అనుమానించారట. అట్ల గిన్నెను శ్మశానంలో నిలువులోతున గుంటతవ్వి పాతిపెడితే దెయ్యాలన్నీ ఊరిమీద పడ్డాయంటూ జిల్లా కలెక్టరుకూ, ఛైర్మన్‌కూ అర్జీలు వెళ్లాయట...’ ఆ కథ అందరినీ అట్లు తిన్నట్లుగా కడుపుబ్బా నవ్వించేసింది. అట్లపిండిని ఫ్రిజ్జులో దాచుకునే నాకు... ఎప్పుడు దాని తలుపు తెరిచినా చలంగారు అందులోనే కొలువున్నట్టు అనిపిస్తుంటారు’’ అన్నాడు. ‘‘నలుగురైదుగురు పెద్దవాళ్లు అట్లగురించి మాట్లాడితే సాహిత్యమంతా అట్లమయమేనని ఎలా అంటావురా?’’ ‘‘చిన్న పిల్లలు పాడుకునే ‘చెమ్మచెక్కా... చారడేసి మొగ్గా... అట్లు పోయంగా’లోనూ అట్ల ప్రస్తావన ఉంది. ఇక ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్... ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ మన సంస్కృతిలోనూ అట్ల పండగలు ఉన్నాయి. అట్లతద్ది చేసుకునే అమ్మాయిలకు ఆరు అట్లు చెందాలనీ, ముద్దపప్పుల్లాంటి మగవారికి మూడే అట్లనే విధంగా వ్యాఖ్యానించుకుంటే ఫెమినిస్టు భావాలూ మనకు గోచరిస్తాయి. ఆ మాటకొస్తే కాళ్లకూరి వారు సంస్కరణోద్యమంలో భాగంగా రాసిన చింతామణిలోనూ సుబ్బిశెట్టి చేత అట్లు పోయిస్తారు. ‘శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఎట్లాంటిదో... తన చేతిలో అట్ల పళ్లెం అసుమంటిది’ అనిపించారంటే ఇకనైనా అట్ల గొప్పదనం గురించి నువ్వు ఒకప్పుకోక తప్పదురా’’ అన్నాడు. ‘‘సాహిత్యంలో అట్లు ఇంతగా ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాన్రా’’ అన్నాను. ‘‘అట్ల పట్ల అపార గౌరవంతోనే జంధ్యాలగారు పేరుకు అది ‘వివాహభోజనంబు’ అయినా ‘అట్టు... మినపట్టు, పెసరట్టు, మసాలా అట్టూ...’’ అంటూ అన్ని పేర్లనూ సుత్తి వీరభద్రరావుతో చెప్పించి అట్టును సముచితంగా సత్కరించారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏదో ఒకరోజున నా పరిశోధనకు గుర్తింపు లభించిన నాడు ఆ న్యూస్ అట్టుడికినట్టు వ్యాపిస్తుంది చూడూ’’ అంటూ పెనంపై అట్టు తిరగేసినట్టుగా గబుక్కున వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు రాంబాబు. - యాసీన్ -
కోఠీలో పారి... ప్రతి ఊర్లోనూ ఊరి
..ప్రవహించి అంతరించిన... సరస్వతీ నది! గంగా, యమునా, సరస్వతి భారతదేశ సంస్కృతిని ఇనుమడింపజేసే నదులని ప్రస్తుతిస్తాం. గంగా, యమునా మనకు కనిపించే నదులు. కానీ సరస్వతి అక్కడెక్కడో అలహాబాద్‌లో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అందరూ అంటుంటారు. కానీ.. అది అలహాబాద్‌లో లేదనీ.. హైదరాబాద్‌లో ఉందని నా బలమైన నమ్మకం. అలా నమ్మకపోతే.. ఇది చదివాక మీరే నమ్మి తీరుతారు. అవును.. సరస్వతి నది ఇప్పుడు అంతరించిన అంతర్వాహినే. కానీ కొన్నేళ్ల క్రితం కోఠీ ఉమెన్స్ కాలేజీ పక్క నుంచి ప్రవహించిన జీవనది. చదువరులకు ఓ సజీవ పెన్నిధి. పుష్కరాల నాటి స్నాన ఘట్టాల్లా సదరు సరస్వతీ నది ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ చిన్న చిన్న కొట్లు. వరస పుస్తకాల కొట్లు! ప్రతి కొట్టు ఎదురుగా కొట్టుకుంటున్నట్టుగా పఠితలూ, కొనుగోలుదారులు. గాంధీ జ్ఞానమందిరానికి ఎదురుగా ఉన్న ఆ కొట్లన్నింటిలోనూ ఎన్నో విజ్ఞాన తరంగాలు. భవిష్యత్ కలలను నెరవేర్చేందుకు ఉపకరించే పుస్తకాల పుటల రూపంలో అలరారే అలలు. కుంభ మేళా నాడు ఎక్కడెక్కడి సాధు పుంగవులంతా గంగకు చేరినట్టు... ఎన్నెన్నో పోటీ పరీక్షల సీజన్లలో దాదాపు ఇరు రాష్ట్రాల ఊళ్ల నుంచి సదరు సరస్వతీ నదీస్నానం కోసం ఇక్కడి సరస్వతమ్మ స్నాన ఘట్టాల్లోకి చేరి పుస్తకాలు కొనేవారూ, చదువుకొనేవారు. అది ఉమెన్స్ కాలేజీ కాబట్టి ఒక ఒడ్డున కనుల పంట. మరో ఒడ్డున విజ్ఞాన అలల పంట. మీ కంట ఏ పంట నాటితే... మీ మనసులో సదరు మొలకల సందడి. ఆ మొలకలు ఎదిగితే మీరు కోరిన దిగుబడి. ఇప్పుడంటే అంతరించిది కానీ... ఈ సరస్వతీ నది ఆ రోజుల్లో ఎందరికో ఎంతో మేలు చేసింది. సదరు సరస్వతీ తీరంలో లక్ష్మి కోసం బెంగక్కర్లేదు. మీ దగ్గర కొనడానికి డబ్బుల్లేవా? పుస్తకాలను కిరాయికే ఇచ్చేవారు. మీరు చదివాక మళ్లీ తీసుకు పోయి ఇస్తే... కొంత మినహాయించుకుని మీ డబ్బు మీకు వాపస్. చేతిలో పుస్తకం ఉంటే జేబులో డబ్బున్నట్టే. ఆ శంభు దేవుడికి సేవ చేశాక సువర్ణముఖీ తీరాన ఇసుక పట్టుకుంటే చాలు బంగారమయ్యేదట. మీకు దక్కే బంగారమంతా మీరు చేసిన సేవకు అనులోమానుపాతంగా ఉంటుందట. అందుకే ‘చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ’ అన్నది అక్కడి సామెత. అలాగే... ఈ సరస్వతీ తీరంలోనూ ‘చదువుకున్నవాడికి చదువుకున్నంత’ అన్నది ఇక్కడి వాడుక. కోఠీ తీరాన ఘనాపాటీలెందరో ఈ సరస్వతీ కటాక్ష వీక్షణాది దీవెనలతో అంతరించిన ఈ అంతర్వాహినిలో మునకలేశారు. ఇక్కడ తరంగిణులపై ఓలలాడిన ఎందరో ఈ అలల మీది నుంచే అందలాలెక్కారు. చదువు వంకన నదిలోకి దిగి చదివి గట్టెక్కలేని మరెందరో అంతరించిన ఈ నదిలో మునిగి తాము కోరిన వైపునకు కాక మరో అవతలి ఒడ్డుకు కొట్టుకుపోయారు. ఒక తరం పోటీ పరీక్షలకు చదివినవారంతా ఈ నది ఒడ్డున మూగినవాళ్లే. నది ఎప్పటికీ అంతరించదు. మళ్లీ తనను తాను ఆవిష్కరించుకుంటూనే ఉంటుంది. కాస్త దారి మార్చుకుంటుంది. ఇవ్వాళ కోఠీ ఉమెన్స్ కాలేజీ ప్రహరీ ఒడ్డున అంతరించిన ఈ నది... ఆ పక్కనే అవతలి వైపున అక్కడా ఇక్కడా కాస్త చెలమలుగా ఊరుతూ పుస్తక ప్రియులతో చెలిమి చేస్తోందట. ఒక్కమాట.. ఎన్నెన్నో కాలుష్యాలతో ముసిముసిగా ‘మూసీ’ ప్రవహిస్తున్నా.. ఆ నది నీళ్లు ఇవ్వాళ చాలామందికి పెద్దగా పనికి రావడం లేదేమోగానీ... పూర్తిగా అంతరించిపోతేనేం! సదరు సరస్వతీ నదిని ఒక తరం వారందరూ గుర్తు పెట్టుకునేవారే! అందలాలకెక్కి ఉన్నవారు ఎప్పటికీ రుణం తీర్చుకోలేనివారే! ఇది కీడులో జరిగిన మేలే కదా!! - యాసీన్ -
దేవుడు కరెంటు బిల్లు కడతాడా?
నవ్వింత మా బుజ్జిగాడి ఇంటెలిజెన్స్ కాస్త తగ్గితే బాగుండని అనిపిస్తోంది నాకు. వాడి తెలివితేటలు కాస్తా అతి తెలివిలోకి దిగకుండా చూడమంటూ ఆ యొక్క భగవంతుడికి స్పెషల్ ప్రార్థన చేసుకోవాల్సిన అగత్యం దాపురించింది. ఇలా ఎవడైనా అనుకుంటాడా అని మీరు హాస్యర్యపోతున్నారా? మీరు నిలకడగా నా దైన్యవాదాలు వింటే మీకు ధన్యవాదాలు చెప్పుకుందామని ఉంది. మా ఇంటికి ఓ వసతి ఉంది. కరెంట్ లేనప్పుడు కాసేపు ఆరుబయట ఆకాశంలో చుక్కలు చూస్తూ పడుకోవచ్చు. అలాంటి ఒక రోజున మా బుజ్జిగాడూ నేనూ మంచంపై పడుకుని ఉండగా వాడు ఆకాశంలోని నక్షత్రాలను చూశాడు. ‘‘మొన్న దేవుడెక్కడుంటాడు అని అడిగితే ఆకాశంలో అంటూ పైకి చూపించావు కదా నాన్నా. ఇప్పుడు రాత్రి అయ్యింది కాబట్టి దేవుడు తన ఇంట్లో లైట్లు వేసుకున్నాడు కదా’’ అన్నాడు వాడు నింగిలో మెరుస్తున్న నక్షత్రాలను చూపుతూ. వెంటనే నక్షత్రాలూ, పాలపుంతలూ, విశ్వనిర్మాణం... వీటన్నింటి గురించీ చెబితే వాడికేం అర్థమవుతుందనే ఉద్దేశంతో ‘‘అవున్నాన్నా’’ అన్నాన్నేను. అంతే... అదే నా పాలిట శాపం అవుతుందని ఆ క్షణంలో అనుకోలేదు. వెంటనే అనుబంధ ప్రశ్నల వెల్లువ మొదలైంది. ‘‘అన్నట్టు నాన్నా... వాళ్లింట్లో కూడా అప్పుడప్పుడూ కరెంట్ పోతే చీకట్లో దేవుడికి చాలా ఇబ్బంది కదా నాన్నా. దేవుడు అప్పుడేం చేస్తాడో?’’ అన్నాడు వాడు. అయితే మావాడి దగ్గర ఉన్న సుగుణం ఏమిటంటే... నేనేం జవాబు చెప్పాలో అని సతమతమయ్యే సమయంలో చాలాసార్లు వాడే సమాధానం కూడా వెతుక్కుంటూ ఉంటాడు. ‘‘ఇప్పుడూ... కొన్ని చుక్కలు బ్రైట్‌గా ఉన్నాయి. అవన్నీ కరెంట్ మీద నడిచే బల్బులు కావచ్చు. మిగతావి డల్‌గా మిణుకు మిణుకుమంటున్నాయి చూడూ... అవి దేవుడి ఇంట్లో ఎమర్జెన్సీ లైట్లు కావచ్చు నాన్నా. దేవుడి ఇంట్లో నిత్యకళ్యాణం పచ్చతోరణం అంటూ మొన్న ఒకసారి అన్నావు కదా. అందుకే దేవుడు ఆకాశం నిండా రోజూ మిర్చిబల్బులూ అలంకరించుకుంటాడనుకుంటా. అక్కడ చూడు కొద్దిగా లైటు కాస్త సాగినట్లుగా ఒక గీతలాగా కనపడుతోంది. అంటే అది దేవుడు వేసిన టార్చిలైటంటావా?’’ అంటూ మళ్లీ అడిగాడు. ‘‘దేవుడికి టార్చిలైట్లూ... సెర్చిలైట్లూ అక్కర్లేదురా. అన్ని లైట్ల వెలుగుకూ ఆయనే మూలం. అన్నింటినీ ఆయనే సృష్టించగలడు’’ అన్నాన్నేను. ‘‘మరి అలాంటప్పుడు దేవుడి ఇంట్లో పవర్‌కట్ ఉండదన్నమాట. అయితే ఇందాక కాసేపు ఆకాశంలో లైట్లన్నీ కనపడకుండా పోయాయి కదా. అంటే అప్పుడు దేవుడి ఇంట్లో కరెంట్ పోయి ఉంటుందంటావా?’’ అని అడిగాడు వాడు. ‘‘అప్పుడూ... దేవుడింట్లో కరెంట్ పోలేదు నాన్నా. మనకు డేై టెమ్లో మబ్బులు కనిపిస్తుంటాయే... అవి రాత్రి కూడా ఉంటాయన్నమాట. అవి అడ్డం రావడం వల్ల ఆ టైమ్‌లో అవి మనకు కనిపించలేదంతే’’ అని జవాబిచ్చాన్నేను. ‘‘అలాగైతే నాన్నా... దేవుడికి కరెంట్ బిల్లు చాలా ఎక్కువే వస్తుంది కదా. ఆ కరెంటు బిల్లు ఏ అడ్రస్‌కు వెళుతుందో? మరి దేవుడింటికి వచ్చే కరెంటు బిల్లు ఎవరికి కడతాడు?’’ అడిగాడు. వాడి ప్రశ్నలకు జవాబిచ్చే ఓపిక లేక.. ‘‘ఒరే దేవుడికి కరెంటు బిల్లేమిట్రా? సకల ప్రపంచానికీ ఆయనే బాస్. ఆయన సర్యాంతర్యామి. అంటే అంతటా వ్యాపించి ఉంటాడన్నమాట. కాబట్టి అన్నిచోట్లా ఉండే ఆయన... ఎవరికీ ఏమీ జవాబుదారీ కాదు. ఎవరికీ పైసా ఇవ్వక్కర్లేదు’’ విసిగిపోయి కాస్త గసిరినట్లుగా అన్నా. అంతే... మళ్లీ ప్రశ్న మొదలు. ‘‘ఇవ్వాళ్లేమో సర్వాంతర్యామి, అన్ని చోట్లా ఉంటాడంటున్నావ్. రోజూ ఒక మంచి పద్యం చదవమని ఏదో ఒకటి చెబుతుంటావ్. అలా మొన్న పోతనగారి పోయమ్ చదివించావ్ కదా. ఆ పద్యంలో ‘అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం టవర్స్ దాపల, నియర్ మందారాగార్డెన్స్...’ అంటూ పోతన గారు దేవుడి పోస్టల్ అడ్రస్ ఓ క్రమపద్ధతిలో సిస్టమ్యాటిగ్గా రాయలా? అందులో పిన్‌కోడు మాత్రం ఇవ్వలేదంతే. నువ్వే మొన్న చెప్పావ్ కదా... సీఎమ్, పీఎమ్ రాష్ట్రమంతటికీ, దేశమంతటికీ నాయకులైనా ఏదో ఒక చోట వాళ్ల క్యాంపాఫీసు ఉంటుందని. క్యాంపాఫీసుకు కరెంటు బిల్లులు వాళ్లు కడతారా లేదా? అలాగే దేవుడూ కట్టాలా వద్దా?’’ అంటూ నన్ను నిలదీశాడు వాడు. పుట్టుకతోనే ఈ లోకంలోని సమస్తమైన పిల్లలందరూ అమితమైన తెలివితేటలతో పుడతారు. మనమే క్రమక్రమంగా లౌక్యం నేర్పుతూ వాళ్ల ఇంటెలిజెన్స్‌ను ఇంకిపోయేలా చేస్తూ ఉంటాం. మా బుజ్జిగాడెప్పుడు లౌక్యం కాస్త నేర్చుకుని, వాడి అతి తెలివితేటల్ని కుదించుకుంటాడో అనుకుంటూ దిగులుపడుతూ ఉన్నా. మీరైనా నాలుక్కూకలేసి వాడిక్కాస్త బుద్ధి చెప్పండి. - యాసీన్ కవ్వింత ఆ మాత్రం తెలుసు కస్టమర్: ఏమండీ, ఒక కిలో బంగారం ఇవ్వండి. సేటు: బాబూ కిలో బంగారం ఎంతో తెలుసా? కస్టమర్: ఆ మాత్రం తెలియదేంటీ, వెయ్యి గ్రాములు. నేను చేసేదదే ఇల్లాలు: ఏమేవ్, పోయేటప్పుడు ఇల్లూడ్చి పోవే అని ఎన్ని సార్లు చెప్పినా వినవే! పని మనిషి (మనసులో): నేను చాలాసార్లు ఊడ్చుకెళ్లా మీకు తెలియలేదు గానీ. ఆ పని చెయ్యి రాము: నేనో పెద్ద వజ్రాల దొంగనని పేరు సంపాదించాలంటే ఏం చెయ్యాలిరా? సోము: ఆ... కోహినూరు వజ్రం అని ఒకటుంది. దాన్ని దొంగిలిస్తే సరి. కొత్త కదా భర్త: ఏరా బంగారం.. వంట అయ్యిందా ఆకలేస్తోంది? కొత్త భార్య: ఉండండి, వండుతుంటే కరెంట్ పోయింది. భర్త: కరెంటు పోతేనేం, మనకు కుక్కర్ లేదు కదా. కొత్త భార్య: అన్నం ఎలా వండాలో టీవీలో చూసి చేస్తున్నానండీ. భర్త: !!! ఇంతకీ మీకొచ్చా? మాస్టారు: ఒరే టింకూ 1+1 ఎంత? టింకు: రెండు సార్. మాస్టారు: 2+2 ఎంత? టింకు: నాలుగు సార్ మాస్టారు: 4+4 ఎంత చెప్పు? టింకు: ఏంటి సార్... మీకు లెక్కలు రావా? అన్నీ నన్నే అడుగుతున్నారు!! - దూనబోయిన మల్లికార్జున, అయినాపురం, తూ.గో.జిల్లా -
రింఝిం రింఝిం హైదరబాద్...!
ఇస్కీ ఆబాదీకీ.. జిందాబాద్!! హైదరాబాద్‌ను అందరూ కాంక్రిట్ జంగిల్ అంటూ ఆడిపోసుకుంటారు. కానీ... అదేమీ ప్రతికూల కామెంట్ కానే కాదు. అవును... జంగిల్ అంటే అడవి. అడవులను సంరక్షించుకోవాలి, పెంచుకోవాలి అనే మాటే నిజమైతే మన కాంక్రీట్ జంగిల్ కూడా చాలా విశిష్టమైనదే. దాన్లోనూ ఒక సౌందర్యముందీ, సంస్కృతి ఉంది. అందుకే అడవిని రక్షించుకున్నంత పదిలంగా హైదరాబాద్‌నూ కనిపెట్టుకోవాలీ, కాపాడుకోవాలి. జంగిల్లో కొన్ని పెద్ద పెద్ద వృక్షాలుంటాయి. అలాంటివే ఇక్కడి భవనాలు. దేవదారు వృక్షాల్లా ఆకాశ హర్మ్యాలు. ఆ వృక్షరాజాలను అల్లుకునే మరికొన్ని తీగల్లాంటివే కాస్త చిన్న భవనాలు. ఆ భవనాల పక్కనే వెలిసే చాయ్ దుకాణాలూ, చిల్లర కొట్లు, సిగరెట్లూ, గిగరెట్లూ అమ్మే పాన్‌డబ్బాలు. నిజం... హైదరాబాద్ కాంక్రీటు అడవే. జనవనమే. వనజీవనమే. ‘క్యామియా’... కైసేహో... హాయ్బాస్... హౌఆర్యూ...’ పలకరింపులన్నీ పిట్టల కిచకిచలూ, జంతుజాలాల అరుపులూ... ‘క్యాబే... క్యూ’ రే... జారే... హౌలే’ లాంటివి రఫ్గాళ్ల రోరింగ్లూ, హౌలాల హౌలింగ్లూ!! మరి అడవి అన్నప్పుడు ఒక ఎర జంతువూ, దాన్ని వేటాడే వేట జంతువూ ఉండాలా వద్దా...? ఆ దృశ్యం చూస్తున్నప్పుడు ఏ డిస్కవరీ చానెల్‌లోనో, ఏ యానిమల్ ప్లానెట్లోనో ఎరజంతువును ఓ క్రూరమృగం వెంటాడుతూ, వేటాడుతూ చూసేవారందరిలో ఉత్కంఠత ఉండేలా, ఉద్విగ్నత నిండేలా, ఊపిరిబిగబట్టి చూసేలా చిత్తరువులా చేసేలా కళ్లప్పగించేస్తాం. హైదరాబాద్‌లో ఇలాంటి దృశ్యం ఎలా సాధ్యమంటారా...? జాగ్రత్తగా చూడండి. రన్నింగ్బస్ను వెంటాడుతున్న యూత్ అచ్చం జీన్స్ తొడిగిన చిరుతల్లా లేరూ! వాళ్లబారిన పడే ఆ బస్సు జీబ్రాలగానో, వెర్రిముఖం వైల్డర్బీస్ట్ లాగానో కనిపించడం లేదూ!! ఎట్టకేలకు వాళ్లకు బస్సు ఫుట్‌బోర్డు చిక్కేలా, బస్సుచక్రం మడ్గార్డును తొక్కేలా ఒకవైపునకు పూర్తిగా వాలిపోయి, సోలిపోయి కనిపిస్తుంటే... అచ్చం చురుకైన చిరుతలకు చిక్కిపోయి, సొక్కిపోయి, పక్కకొరుగుతున్న పెద్ద వేటజంతువులా అనిపించకమానదు. ఇక బస్సు ఆగినప్పుడు చుట్టూ ముట్టేసే జనాన్ని చూడండి. కీటక కళేబరాన్ని చుట్టుముట్టిన చీమల్లా అనిపిస్తుందా దృశ్యం. ఏం చూసినా అడవి కళే. ఎలా వీక్షించినా వనోత్సాహమే. డబుల్‌డెక్కర్ అనే బస్సు ఈ కాంక్రీట్ జంగిల్లో అంతరించిపోయింది గానీ... ఒకవేళ ఉంటేనా... ఆ రోజుల్లో అది మోడ్రన్ డ్రెస్సుల సీటీ ప్రిడేటర్స్- సింహాల ప్రైడ్కు చిక్కిన ఏనుగులా కనిపించేదది! ఇలా అడవిలో ఆవిష్కృతమయ్యే అంతరించిపోయే జంతువుల జాబితాలోకి వచ్చేసింది ఒకనాడు గర్వంగా చక్కర్లు కొట్టిన డబుల్‌డెక్కర్. కాబట్టి.. అవును ఇది కాంక్రీట్ జంగిలే. కాకపోతే అందమైన చెట్లలాంటి భవనాల అడవి. పూలపూల మొక్కల్లాంటి రెండూమూడంతస్తుల డాబాల వనం. దాన్నిండా జంతుజాలంలా కిటకిటలాడే జనం. ఎస్... వి ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాద్! రింఝిం రింఝిం హైదరబాద్...! ఇస్కీ ఆబాదీకీ జిందాబాద్!! - యాసీన్ -
పొట్ట పట్టా పొందితే వాడిక పొట్టభద్రుడే!
నవ్వింత మా రాంబాబు పరమ రెటమతస్తుడని తెలుసు. వాడిలోని పిడివాది ఇంత ఉద్ధృతంగా ఉంటాడన్న విషయం, వాడికి ఓ సలహా ఇచ్చేదాకా నాకు తెలియరాలేదు. ‘‘ఒరే రాంబాబూ... పొట్ట కాస్త ముందుకొస్తున్నట్టుంది. కాస్త ఏ వాకింగో, ఎక్సర్సైజో చేయ్‌రా బాబూ’’ అన్నా. అంతే! నన్ను సెక్షన్ నుంచి క్యాంటిన్‌కు తీసుకెళ్లి, చూపించాడు విశ్వరూపం. ‘‘అన్నానికి, దేహానికి జరిగిన ఓ సమరంలో/ అరగడానికీ పెరగడానికీ మధ్యన సంగ్రామంలో/ బెల్టు కట్టుకీ కట్టుబడనిదీ పొట్ట / బస్కీలకూ మెల్టుకానిదీ పొట్ట/ ఇది ఆ దైవమే ఇచ్చిన పొట్టా... అది పెరిగితే తప్పా... తప్పా... తప్పా... నో... నెవర్ ’’ అంటూ సాక్షాత్తూ గ్యాస్ట్రిక్ చౌదరి అవతారం ఎత్తేశాడు. ‘‘ఒరే... ఒరే... తెలీక సలహా ఇచ్చా. వదిలెయ్...’’ అని ప్రాధేయపడితే ఉగ్రావతారం విరమించినా శాంతావతారంలోకి వచ్చే ముందు మరికాసేపు ఆవేశపడ్డాడు. ‘‘ఒరేయ్... పొట్ట కాస్త పెరగ్గానే ప్రతివాడూ సలహాలిచ్చేవాడే. అసలు పొట్టా... దాని మహత్యమేమిటో తెల్సా?’’ ‘‘తర్వాత చెబుదువుగానీ’’ అంటూ తప్పించుకోడానికి చూశాగానీ... నేనే తెచ్చుకున్న తంటా కాబట్టి వీలు కాలేదు. ‘‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అనే వాడుక మాట విన్నావా? పోనీ వాడికి డొక్కశుద్ధి ఉందండీ అనే నానుడి? మన పూర్వపు రోజుల్లో పొట్ట విజ్ఞానానికి చిహ్నంగా ఉండేదని తెలియడం లేదూ! క్రమంగా అక్షరాలూ, విజ్ఞానం మెదడులో ఉంటాయని ఆధునిక విజ్ఞానశాస్త్రం తేల్చింది కాబట్టి క్రమంగా జ్ఞానానికి పొట్టే కేంద్రమన్న పాత సిద్ధాంతం కొట్టుకుపోయి బ్రెయిన్ సెంట్రిక్ సిద్ధాంతం వచ్చింది. భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లలా నేనూ ఇప్పటికీ పొట్టే జ్ఞానానికి కేంద్రమనీ, దాన్ని నింపుకోవడం వల్లనే జ్ఞానం వృద్ధి అవుతుందనీ నమ్ముతున్నా.’’ అన్నాడు. ‘‘సరే సరే... ఇకపై నేనూ నమ్మడానికి ప్రయత్నిస్తాన్లే’’ అంటూ వాడిని శాంతపరచడానికి మళ్లీ విఫలయత్నం చేశా. ‘‘పెరిగిన పొట్ట ఒక విజ్ఞానభాండాగారమే కాదు... అది ఒక కళారూపం’’ ‘‘పొట్ట కళారూపం ఏమిట్రా? నీకు మతిగానీ పోయిందా?’’ ‘‘పొట్టపెరిగిన వాణ్ణి ఎప్పుడైనా చూశావా? అంతకుముందు వాడెప్పుడూ తన పొట్టను తానే గమనించడు. కానీ పొట్టంటూ పెరిగాక వాడిలోని ఘటవాద్యకారుడు బయటికి వచ్చేస్తాడు. వేళ్లతో, చేతులతో దానిపై దరువేస్తూ అప్పటివరకూ తనలో నిశ్శబ్దంగా నిబిడీకృతమై ఉన్న అంతర్గత కళాకారుణ్ని బయటకు తీస్తాడు. అలాంటి పొట్ట మీద అనవసరంగా కామెంట్లు చేసి కళాకారుడు పుట్టకముందే వాడిలోని ప్రతిభను దయచేసి తొక్కేయకండ్రా. ప్లీజ్’’ అన్నాడు. ‘‘నీ పొట్టలాగే నీకు మరీ జ్ఞానం కూడా పెరిగి అది వెర్రితలలు వేస్తోంది’’ అంటూ కాస్త కేకలేయబోయా. ‘‘డొక్క చించి డోలు కట్టడం అన్న వాడుక ఎప్పుడైనా విన్నావా, లేదా? అంటే ఏమిటీ? డొక్కలో ఘటవాద్యం, డోలూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డొక్కకూ, డోలుకూ సంబంధం ఉంది కాబట్టే ఆ సామెత పుట్టింది. ఇన్ని తార్కాణాలూ, దృష్టాంతాలూ ఉన్నా అజ్ఞానులు నమ్మర్రా. అంతెందుకు ఎవడైనా బాగుపడటానికి కారణం వాడి పొట్టే’’ ‘‘బాగుపడటానికీ పొట్టకూ సంబంధం ఏమిట్రా రాంబాబూ?’’ ‘‘ఎవడైనా బాగుపడాలనుకుంటే వాడు పొట్టచేతపట్టుకుని పోయి, పొట్ట తిప్పలు పడి పొట్టపోసుకుంటాడు. ఇలాంటివాడే జీవితంలో పైకొస్తాడు. బాగుపడేవాళ్ల పొట్ట కొట్టకండ్రా ప్లీజ్’’ అన్నాడు మళ్లీ ఆవేశం పెంచుకుంటూ. ‘‘ఒరే నువ్వొక్కడివే పొట్టను ఇలా వెనకేసుకొస్తున్నావ్. ఆరోగ్యానికి పొట్ట అంత మంచిది కాదు తెల్సా?’’ ‘‘నాకు చెప్పకు. పొట్ట ఉంటే టక్కు బాగా కుదుర్తుందని చిరుపొట్టకోసం చాలామంది యూత్ ఏవేవో ప్రయాసలు పడతారు. నువ్వెప్పుడైనా పొట్టగలవాడు మోటార్‌సైకిల్ నడుపుతుంటే చూశావా? బండి పెట్రోల్ ట్యాంకు మీద ఓ కుండను జాగ్రత్తగా పెట్టుకుని, కాళ్లూ చేతుల మధ్య దాన్ని దొర్లిపోకుండా ఉంచుకున్నట్లుగా వెళ్తుంటారా పొట్టగలవాళ్లూ! అంతెందుకు వయసు పెరుగున్నకొద్దీ ఏ చదువూ, ఏ డిగ్రీలూ లేకుండానే లోకమనే ఈ విశ్వవిద్యాలయంలో ఒక పరిణతి చెందిన డిగ్రీ ఇచ్చి ఒకణ్ణి పొట్టభద్రుణ్ణి చేస్తుందిరా ఈ జీవితం. కాబట్టి దాన్ని కించపరచకు. వాకింగులంటూ, వ్యాయామాలంటూ సలహాలిచ్చి ఎవ్వడి పొట్టనూ పొట్టనబెట్టుకోకు’’ అంటూ వార్నింగిచ్చాడు మా రాంబాబుగాడు. రాంబాబు ధోరణేమిటి ఇలా పెడసరంగా ఉంది చెప్మా అంటూ కాస్త వాకబు చేశాక విషయం తెలిసింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గలేదట వాడికి. అందుకే ఇలా సమర్థింపుల్లోకి దిగాడట. కొంతమంది అంతే... ఏదైనా వదిలించుకోవడం కుదరకపోతే అదే ఎస్సెట్టంటూ ఎదురుదాడికి దిగుతారు. బట్టతల తప్పదని తెలిశాక దాన్ని సమర్థిస్తూ మాట్లాడినట్టు. వాడూ ఇదే బాపతు. ఏం చేస్తాం. ఎంతైనా మా ఫ్రెండు కదా. వాడి గురించి ఎవడికైనా చెబుదామని అనిపించినా... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సెలైంటయిపోయా. - యాసీన్ -
మీసాల పిల్లి గడ్డం పెంచదెందుకు!
నవ్వింత ‘‘మరి నాన్నా... పిల్లి అసలు గడ్డం పెంచనే పెంచదు కదా. మరి చాలామంది మనుషులు గదమ వరకే గడ్డాన్ని పెంచి దాన్ని పిల్లి గడ్డం అంటారెందుకు?’’ మా వాడి ప్రశ్న. మళ్లీ నాకేం చెప్పాలో తోచలేదు. ‘పిల్లులు పిల్లలు పెట్టును’ అన్నాడు శ్రీశ్రీ. అదేంటా మాట? మిగతా ప్రాణులేవీ పెట్టనట్టు. కానీ మా బుజ్జిగాడు ఇంచుమించూ శ్రీశ్రీ అంత తెలివైనవాడేమోనని నా డౌటు. ఒకరోజున వాడడిగిన ఓ ప్రశ్న, దానికి అనుబంధంగా సాగిన ప్రశ్నోత్తరాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చా. ఇంతకీ ఆ ప్రశ్నేమిటంటే... ‘‘నాన్నా... పిల్లులు మీసాలు పెంచుతాయి కదా, మరి గడ్డం ఎందుకు పెంచవు’’ అని. ఆ మాట ‘పిల్లులు గడ్డము పెంచవు’ అన్నట్లుగా అనిపించింది. ఒక్కక్షణం పాటు ఏం చెప్పాలో తోచలేదు. వెంటనే రోజూ మా ఇంటికి వచ్చి పాలు తాగే పిల్లి గుర్తొచ్చింది. ‘‘పిల్లి పాలు తాగుతున్నప్పుడు చూశావు కదా! మీసాలు పాల లెవల్‌కు పైనే ఉంటాయి. కానీ అదే పిల్లికి గడ్డం ఉండింటే అది పాలలో మునిగి తడిసిపోయేది కదా. అలా తన ఆహారం కలుషితం కాకుండా ఉండటానికి పిల్లులు గడ్డాలు పెంచవన్నమాట’’ అని జవాబిచ్చాను. అంతటితో ఆగిపోలేదు నేను. చిన్నప్పుడు మా అమ్మ నాకు చెప్పిన కథలు వాడికీ చెప్పాలని అనిపించింది. ‘‘పిల్లీ... పులీ ఈ రెండూ మేనమామ, మేనత్త పిల్లలంట. పిల్లి అన్ని విషయాల్లోనూ పులికి గురువంట. పులికి అది అన్నీ నేర్పింది గానీ చెట్టెక్కడం నేర్పలేదట. దాంతో పులికి విపరీతంగా కోపం వచ్చి, దాన్ని కొట్టిందట. అందుకే పిల్లి ఎప్పుడు, ఎక్కడ మలవిసర్జన చేసినా పులికి తన అడ్రసు తెలియకుండా ఉండేందుకు మలాన్ని కప్పిపెడుతూ ఉంటుందట’’ అని కథ చెప్పాను. ‘‘పిల్లీ, పులీ... రెండూ కజిన్స్ కదా. మరి అలాంటప్పుడు చిరుతపులి కూడా కజినే కావాలి కదా. అవి చెట్లు బాగానే ఎక్కుతాయి కదా. మరి వాటికి నేర్పి, పులికి నేర్పకపోవడం పక్షపాతమే కదా’’ అంటూ న్యాయమడిగాడు వాడు. ఏదో కథల పరంపర అలా కొనసాగుతూ ఉంటుందనీ, ఈ వారసత్వ సంపదతో వాడు పరిపుష్టమవుతాడనీ ఆశపడ్డాను కానీ వాడు అనుబంధ ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెడతాడనుకోలేదు. ‘‘ఇప్పుడు నాకొకటి అనిపిస్తోంది నాన్నా. పిల్లి అలా పులికి భయపడటానికి నువ్వు చెప్పిన కారణం కరెక్టుగా లేదు. నా ఊహ ప్రకారం... సింహానికి గడ్డం పెంచుకొమ్మని పిల్లే దానికి సలహా ఇచ్చి ఉంటుంది. దాంతో అది జూలు విపరీతంగా పెంచుకుంది. పిల్లి మాత్రం ‘అడ్డముగ పెరిగిన గడ్డము గ్లామరుకడ్డము’ అంటూ తను క్లీన్‌షేవ్‌తో ఉంది. అలా జూలూ, జులపాలూ ఉంచుకుని గ్రూమింగ్ చేసుకునే అవకాశం తనకు ఇవ్వకపోవడంతో అపార్థం చేసుకుని సింహమే పిల్లిని కొట్టి ఉంటుంది’’ అంటూ పిల్లి దెబ్బలు తినడానికి సహేతుక కారణాల అన్వేషణ కొనసాగించాడు వాడు. అంతలోనే మళ్లీ ఓ ప్రశ్న అడిగాడు. ‘‘మరి నాన్నా... పిల్లి అసలు గడ్డం పెంచనే పెంచదు కదా. మరి చాలామంది మనుషులు గదమ వరకే గడ్డాన్ని పెంచి దాన్ని పిల్లి గడ్డం అంటారెందుకు?’’ మళ్లీ నాకేం చెప్పాలో తోచలేదు. ‘‘మనుషులు తమ అజ్ఞానంతో లేని క్వాలిటీలను తమకు తోచినట్లుగా ఇతరులకు ఆపాదిస్తుంటార్రా. దాంట్లో ఒకటే ఈ పిల్లి గడ్డం, పిల్లినడక. ర్యాంప్‌వాక్‌లో స్టైలిష్ ఆడాళ్లంతా పిల్లినడక నడుస్తారు. అదే స్టైలు పొంగిపొరలి అది మూతి చుట్టూ వెంట్రుకల రూపంలో పెరిగేలా మగాళ్లు పిల్లి గడ్డం పెంచుతారు. దాన్నే ఫ్రెంచ్‌కట్ అంటార్రా’’ ‘‘పిల్లి అసలు తాను పెంచనే పెంచని గడ్డాన్ని - ఫ్రెంచ్ వాళ్లు తమదని ఎందుకు చెప్పుకున్నారు నాన్నా?’’ అంటూ మరో ప్రశ్న సంధించాడు మావాడు. ఆన్సర్ కోసం తడుముకుంటూ ఉంటే మళ్లీ వాడే ఏదో ఊహించి చెప్పాడు. ‘‘మన దేశం నుంచి ఏదో ఒకటి లాక్కోడం మిగతాదేశాల వాళ్లకు ఇష్టమైన పని కదా నాన్నా. మా హిస్టరీ లెసన్‌లో ఉంది. ఇంగ్లాండూ, ఫ్రెంచ్ వాళ్లు మన దేశాన్ని ఆక్రమించుకోడానికి వచ్చి వాళ్లలో వాళ్లు యుద్థాలు చేసుకుంటూ, మనవి ఎప్పుడూ ఏవో ఒకటి లాక్కుంటూ ఉండేవాళ్లట. ఇంగ్లాడు వాడు నెమలి సింహాసనాన్ని లాక్కున్నాడు కదా. దానికి పోటీగా ఫ్రెంచువాడూ ఏదైనా లాక్కుందామనుకున్నాడు కాబోలు. అందుకే అప్పట్లో ఫ్రెంచివాడు ఇంగ్లాండు వాళ్ల నెమలికి పోటీగా మన పిల్లిని పట్టుకుని దాని పేరిట ఉన్న ఫ్యాషన్‌ను తన సొంతమని చెప్పుకున్నాడు. అందుకే పిల్లికి గడ్డం లేకపోయినా దేవతావస్త్రాల్లా ‘ఫ్రెంచ్ కట్’ అనే మాట మాత్రం మిగిలిపోయుంటుంది నాన్నా’’ అన్నాడు. ఈ లాజిక్లను రచనల్లో పెడితే వీడు కూడా రేపు దాదాపుగా శ్రీశ్రీకి ఇంచుమించూ అటుఇటుగా తయారవుతాడేమోనని అనుకుంటూ గడ్డం గోక్కుంటూ ఒక ఆందోళనానందం ప్రవాహంలో మునిగిపోయాన్నేను. ఆందోళనెందుకంటే ఎంత నా కొడుకైనా సరే వాడు శ్రీశ్రీని మించకూడదు కదా... అందుకు! - యాసీన్ -
భావి సంస్కర్తతో నట్టింట్లోంచి పందిట్లోకి!
‘‘త్వరగా ఆం తినెయ్... లేదంటే బూచాడు వస్తాడు’’ అంటోంది మా ఆవిడ మా బుజ్జిగాడికి అన్నం తినిపిస్తూ. రాత్రివేళల్లో బూచిగాడొస్తున్నాడగానే గబగబా తినేసి, త్వరగా పక్క ఎక్కేస్తుంటాడు వాడు. ఒక ఆనవాయితీగా అనేక తరాల నుంచి వస్తున్న ఈ టెక్నిక్‌ను మా ఆవిడా వాడుతుండటాన్ని గమనించిన నేను సంప్రదాయానికి గల బలాన్ని చూసి ఆశ్చర్యపోయా. అయితే అంతకంటే ఆశ్చర్యపోయే ప్రశ్నొకటి వేశాడు మా బుజ్జిగాడు. ‘‘నానా... ఎప్పులూ బూచాడులే బయంకరంగా ఉంతాలా? బూచిది అంత బయంకరంగా ఉండదా? ‘అదుగో... బూచిది వస్తోం’దంటూ అమ్మ ఎప్పుడూ బయం పెట్టదెందుకు?’’ అని అడిగాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక అప్పటికి కలవర పడ్డా... బూచిదానికీ పిల్లల్ని భయపెట్టే శక్తి ఉంటుంది. ఆం తినిపించేటప్పుడు బయపెట్టడంలో దానికీ తగిన స్థానమివ్వాలి. బూచిదానికీ పిల్లల్ని పక్కతడిపేలా చేయగల శక్తి ఉంటుంది. దానికీ తగిన ప్రోత్సాహమివ్వాలి. బూచిదానికీ తగిన ప్రాచుర్యమివ్వాలి అని భవిష్యత్తులో ఆడబూచీల పక్షం వహించి పోరాడేబోయే ఓ చిన్నారి చలంగారు మా ఇంట పారాడుతున్నారంటూ చాలా సంతోషించా. తర్వాతి రోజుల్లో మా బుజ్జిగాడు కథలు చెబితేనే నిద్రపోనంతగా కాస్త పెద్దాడయ్యాడు. చిన్నప్పటి బూచిగాడి ప్రభావమో ఏమోగానీ... దెయ్యాల కథలు వింటేనే వెంటనే నిద్రపోయేవాడు. ఆ బలహీనత ఎరిగి వాణ్ణి త్వరగా నిద్రపుచ్చాలని నేనూ అవే కథలు చెబుతుండేవాణ్ణి. ఓరోజు నేను జవాబు చెప్పలేనివిధంగా మరో ప్రశ్న వేశాడు వాడు. ‘‘నానా... దెయ్యాలెప్పుడూ తెల్లచీరలే ఎందుకు కడతాయి? రంగు చీరలు కూడా కట్టొచ్చు కదా. వాటికి ఇష్టం ఉండవా? అయినా ఆడబూచీ దెయ్యాలు రంగులను ఇష్టపడకుండా ఎందుకుంటాయి?’’ అన్నది వాడి సందేహం. అప్పటికి ఏం చెప్పాలో నాకేమీ తోచలేదు. కానీ... ‘‘దెయ్యాలన్నీ చిమ్మచీకట్లో తిరుగుతుంటాయి కద నాన్నా... డార్క్ రంగు చీరలు కట్టుకుంటే ఆ చీకట్లో కళ్లు సరిగ్గా కనపడక, ఒకదానికొకటి గుద్దుకుంటాయేమోనని అలా తెల్లచీరలు కట్టుకుంటాయన్నమాట’’ అని సమాధానమిచ్చా. ఆ జవాబుకు సంతృప్తి పడలేదు వాడు. ‘‘బ్రైటు కలర్సూ, లైటు కలర్సూ, లైటులో బ్రైటు కలర్సూ కట్టుకోవచ్చు కదా’’ అని మళ్లీ అడిగాడు. మళ్లీ ఏం సమాధానం చెప్పాలో తెలియకపోయినా బుడిబుడి నడకలతో నడయాడుతూ భవిష్యత్తులో ఆడదెయ్యాల పాలిట అపర సంఘసంస్కర్తగా మారబోయే వీరేశలింగం-2 మా ఇంట్లో జన్మించినందుకు ఆనందించా. వీడి శ్రేయోదృష్టి వల్ల దెయ్యాల సమాజంలోనూ దెయ్యాలు తెల్లచీరలకు బదులు రంగు చీరలు కట్టే రోజు వస్తుందని, క్రమంగా అవి పంజాబీ డ్రెస్సులూ, చుడీదార్లూ వంటి మోడ్రన్ డ్రస్సుల దిశగా కూడా పరిణమిస్తాయనీ ఆనందించా. ఏ సంస్కరణ అయినా ఇంటితోనే మొదలవ్వాలనే ఓ ఇంగ్లిష్ సామెతను అనుసరించి... ఆడ బుచీల పట్ల, మహిళా దెయ్యాల పట్ల వాడికి గల ఉద్ధరణ శక్తిని మరింత ఉత్సాహపరిచేందుకు కొంత సానుకూలతతో మాట్లాడా. కానీ అదే నా కొంపకు చేటు తెస్తుందని నాకు తెలియదు. పిల్లల్లోని పాజిటివ్ అంశాలను ప్రోత్సహించాలన్న నా దృక్పథం తప్పనీ, దానివల్లనే వాడు దెయ్యాలు చేసే అన్ని చిలిపి పనులకూ అలవాటు పడ్డాడనీ మా ఆవిడ అభియోగం. ఈ విషయమై మా ఆవిడ ఎంత పెద్ద క్లాసు తీసుకుందంటే... వాడు సంఘసంస్కర్తగా మారాక సంస్కరించాల్సిన మొదటి వ్యక్తి మా ఆవిడే అన్నంత భయంకరంగా ఉందా క్లాసు! ఇప్పుడు నా ప్రోత్సాహం వల్ల వాడు చేసిన పనులన్నింటినీ మీకు చూపించేందుకు మిమ్మల్ని ఆహ్వానిద్దామంటే మేం తలదాచుకునేందుకు ఇప్పుడు ఇల్లు లేదు. జస్ట్... పందిరే. ‘ఈ అల్లరేమిట్రా?’’ అని అడిగితే ‘‘శుభకార్యాలకు పందిరి ప్రశస్తం. అది ఆనవాయితీ కూడా’’ అన్నాడు వాడు. ప్రస్తుతం నా చిరునామా: పందిరి నెంబర్ పదహారు తాలూకు రెండో గుంజ, బిసైడ్ గతంలో 9-6-3బి-596/25 నెంబరు గల మాజీ ఇల్లు, శ్రీకర్నగర్ కాలనీ, జిందాబాద్, హైదరాబాద్. మరి ఇల్లు పీకి పందిరేసినా మాజీ ఇల్లయినా ఉండాలికదా... ఏకంగా పదహారో పందిరికి ఎలా షిఫ్టయ్యారూ? అన్నది మీ డౌటా? చెబుతా వినండి. మరేం లేదు. ఇంటి ఓనర్లు వరసగా ఖాళీ చేయిస్తూ పోగా ప్రస్తుతం మేముంటున్న పందిరి నెంబరు పదహారు అయ్యిందన్న మాట! - యాసీన్ -
డేంజరస్ హెపటైటిస్...
‘‘పునరాలోచించండి...’’ ఇదీ ఈ ఏడాది ప్రపంచ హెపటైటిస్ డే థీమ్‌గా నిర్ణయించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) దాని అనుబంధంగా ఆరోగ్య రంగంలో పనిచేసే అనేక రంగాలకు చెందిన నిపుణులు. హెపటైటిస్ గురించి పునరాలోచించాలంటూ వీళ్లంతా అన్ని దేశాల ప్రభుత్వాలనూ, విధాన నిర్ణేతలనూ, ఆరోగ్య కార్యకర్తలనూ, చికిత్సారంగ నిపుణులనూ ఎందుకు కోరుతున్నారు? ఎందుకంటే... హెపటైటిస్ చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ప్రాణం తీసుకోగలదు. ప్రపంచ జనాభాలో చాలామంది హెపటైటిస్‌తో బాధపడుతున్నప్పటికీ, అది తమకు ఉన్నట్లే తెలియదు. అందుకే ఈ థీమ్ అవసరం ఏర్పడింది. హెపటైటిస్పై సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం... హెపటైటిస్ అంటే... నిజానికి హెపటైటిస్ అనేది ఒక జబ్బు కాదు. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్ ఏ; బి; సి; డి; ఈ అనే ఐదు రకాల హెపటైటిస్‌లు కోట్లాది మంది ప్రజల్లో వ్యాపించి ఉన్నాయి. పై ఇన్ఫెక్షన్లలో దేనికైనా గురైన వారికి దీర్ఘకాలంలో క్రమంగా కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్ వ్యాధితో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటీ యాభై లక్షల మంది మరణిస్తున్నారు. హెపటైటిస్ అన్న పదం గ్రీకు నుంచి వచ్చింది. ఈ పదంలోని మొదటిభాగం ‘హెపార్ స్టెమ్ ఆఫ్ హిప్యాట్’... అంటే కాలేయం అనీ, ‘ఐటిస్’ అంటే ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) అని అర్థం. A- హెపటైటిస్ చాలా సందర్భాల్లో ఈ వ్యాధి ఉన్నవారికి (ముఖ్యంగా యుక్తవయస్కుల్లో) బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. కొందరిలో లక్షణాలు కనిపించవచ్చు. ఇలా వ్యాధి సోకిన నాటి నుంచి లక్షణాలు బయటకు కనిపించడానికి రెండు నుంచి ఆరు వారాలు పట్టవచ్చు. ఇక లక్షణాలు కనిపించేవారిలో వికారం, వాంతులు, కామెర్లతో ఇది బయటపడుతుంది. ఇది సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధి కాదు. చాలామందిలో దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇది సంభవించిన ఒక శాతం మందిలో ఇది మరణానికి దారితీస్తుంది. వ్యాప్తి ఇలా: ఇది కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాప్తిచెందుతుంది. మలవ్యర్థాలు తాగు నీటితో కలవడం వల్ల కలుషితమైనా లేదా ఆ నీటితో పదార్థాలు తయారు చేయడం వల్ల ఇది వ్యాప్తిచెందుతుంది. అంటే సురక్షితం కాని నీరు, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. తీవ్రత: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కోటీ నలభై లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. లక్షణాలు: హెపటైటిస్- ఏ తీవ్రత స్వల్పం మొదలుకొని తీవ్రం వరకు ఉండవచ్చు. ఈ వైరస్ ఉన్నవారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, కడుపులో ఇబ్బంది, మూత్రం పచ్చగా రావడం, కామెర్లు (చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుగా మారడం) కనిపించవచ్చు. అందరిలోనూ అన్ని లక్షణాలూ ఉండకపోవచ్చు. నిర్ధారణ: హెపటైటిస్- ఏ ను కేవలం బయటి లక్షణాల ఆధారంగా నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ వైరస్‌ను నిర్ధారణ చేసే ప్రత్యేక రక్తపరీక్ష ఆధారంగా యాంటీబాడీస్‌తో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. దీనితో పాటు రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) అనే మరో అదనపు పరీక్ష కూడా ఈ వైరస్ నిర్ధారణ కోసం చేసేదే. ప్రత్యేకమైన ల్యాబ్‌లలో ఈ పరీక్ష ద్వారా ఈ వైరస్ తాలూకు ఆర్ఎన్ఏను గుర్తించడం ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. చికిత్స: ఈ వ్యాధి చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే కాలేయానికి భారం పడని విధంగా తేలికపాటి ఆహారం, లక్షణాలను బట్టి చేసే చికిత్సలు (సింప్టమాటిక్ ట్రీట్మెంట్స్) చేస్తే చాలు. లక్షణాలు తగ్గడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఒక్కోసారి వారాలు మొదలుకొని నెలలు కూడా పట్టవచ్చు. నివారణ: సురక్షితమైన, పరిశుభ్రమైన నీరు తాగడం / వాడటం ఆరుబయట మల విసర్జన లాంటి అలవాట్లు మానుకుని, మలం బయటకు కనిపించని విధంగా కట్టించిన టాయెలెట్లలోనే మలవిసర్జన చేయడం (దీని వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు తగ్గుతాయి). వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం (అంటే భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత పరిశుభ్రంగా కాళ్లూ,చేతులు కడుక్కోవడం వంటివి). వ్యాక్సిన్: హెపటైటిస్-ఏ కు చాలారకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్ ఏదైనప్పటికీ అవన్నీ ఈ వ్యాధి నుంచి రక్షణ కల్పించే విధానం మాత్రం ఒకటే. అయితే ఏడాది లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి లేదు. కేవలం ఒక్క మోతాదు వ్యాక్సిన్‌తో నెల రోజుల్లోనే ఈ వ్యాధి పట్ల నూరు శాతం భద్రత ఒనగూరుతుంది. B- హెపటైటిస్ ఇది హైపటైటిస్లోని అన్ని వైరస్లలోనూ అత్యంత ప్రమాదకరమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి ఏటా రెండు బిలియన్ ప్రజల్లో వారికి తెలియకుండానే ఈ వైరస్ ఉంది. 35 కోట్ల మందిలో ఇది దీర్ఘకాలిక వ్యాధి (క్రానిక్)గా మారి వేధిస్తోంది. వ్యాప్తి ఇలా: ఇది ఎంత చురుకైనదంటే... సూదిపోటు ద్వారా వ్యాపించడం అనే ఒక్క అంశంలోనే హెచ్ఐవీతో పోలిస్తే దాదాపు 50 నుంచి 100 రెట్లు వేగంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ప్రతి ఏటా దాదాపు 7,80,000 మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు. ఇది ప్రధానంగా మూడు రకాలుగా వ్యాపిస్తుంది. గర్భవతి వ్యాధిగ్రస్తురాలైతే... తల్లి నుంచి బిడ్డకూ సోకుతుంది. లేదా మరీ నెలల పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంది సెక్స్ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది ఇక ఒకరు వాడిన ఇంజెక్షన్ సూది మరొకరు వాడటం వల్ల ఇది వ్యాపిస్తుంది. అలాగే సరైన పరిశుభ్రత పాటించకుండా వేసుకునే పచ్చబొట్టు పరికరాల వల్ల కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఎంత ప్రమాదకరమైనదంటే.. : హెచ్ఐవీ వైరస్‌ను మానవ శరీరం నుంచి వేరు చేయగానే కొద్ది క్షణాల్లోనే అది మరణిస్తుంది. కానీ హెపటైటిస్-బి వైరస్ వ్యక్తి శరీరం బయటకు వచ్చాక కూడా కనీసం ఏడురోజుల పాటు సజీవంగా ఉండగలదు. అందుకే దీని వ్యాప్తి చాలా వేగవంతం, తీవ్రం. వ్యాక్సిన్ వేయని వ్యక్తిని రక్తమార్పిడి వల్లనో, సెక్స్ వల్లనో లేదా సూదిపోటు వల్లనో వ్యాపించడం జరిగితే అది అతి వేగంగా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించాక దాదాపు 30 నుంచి 180 రోజుల్లో లక్షణాలు బయట పడతాయి. అంటే సగటున 75 రోజుల్లో బయటపడవచ్చు. లక్షణాలు: వ్యాధి సోకిన కొందరిలో బయటకు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. అయితే కొందరిలో మాత్రం కామెర్లు, మూత్రం చాలా పచ్చగా రావడం, తీవ్రమైన అలసట, నీరసం, వికారం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వైరస్ దీర్ఘకాలంగా కాలేయంపై ప్రభావం చూపితే అది సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌గా పరిణమించవచ్చు. అయితే అదృష్టవశాత్తు 90 శాతం మంది యువకుల్లో ఇది ఆర్నెల్లలో దానంతట అదే తగ్గిపోవచ్చు కూడా. నిర్ధారణ: చాలా సాధారణ రక్త పరీక్షతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఇదే పరీక్షతో రక్తంలో వైరస్ తీవ్రతనూ తెలుసుకరోవచ్చు. చికిత్స: దీనికి నిర్దిష్ట చికిత్స లేదు. కేవలం సమతుల ఆహారం ఇస్తూ రోగిని సౌకర్యవంతంగా ఉంచడం, తరచూ ఎదురయ్యే లక్షణాలను తగ్గించే మందులు ఇవ్వడం (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) మాత్రమే ఈ వ్యాధి ఉన్నవారికి చేయగల చికిత్స. ఈ వ్యాధి ఉన్న రోగుల్లో కాలేయంపై దాని ప్రభావ తీవ్రతను బట్టి ఇంటర్ఫెరాన్, యాంటీవైరల్ ఏజెంట్స్ వంటి మందులు ఇస్తారు. ఒకవేళ దీని కారణంగా కాలేయ క్యాన్సర్ వస్తే... దాన్ని చాలా త్వరితంగా గుర్తించినప్పుడు క్యాన్సర్‌కు గురైన భాగం వరకు తొలగించవచ్చు. నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు ఈ వ్యాక్సి పిల్లలకు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేస్తోంది. ఇక చిన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వని 18 ఏళ్ల లోపు వారికి (ఆ ప్రాంతంలో హెపటైటిస్-బి వ్యాప్తిని గుర్తిస్తే) వ్యాక్సిన్ ఇప్పించుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. దీనితోపాటు రిస్క్ గ్రూప్‌లో ఉన్నవారు అంటే... చికిత్సారంగంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, డయాలసిస్ పేషెంట్స్, ఇంజెక్షన్స్ చేయించుకునే వారు, సెక్స్వర్కర్స్, ఒకరి కంటే ఎక్కువగా సెక్స్ భాగస్వాములు ఉన్నవారు, దూరప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. C - హెపటైటిస్ ఇది చాలామందిలో, చాలావరకు దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫెక్షన్. కానీ కొద్దిమందిలో ఇది స్వల్పకాలిక ఇన్ఫెక్షన్గా కూడా ఉండవచ్చు. ఇది సోకిన వారిలో 15% నుంచి 45% మందిలో ఆర్నెల్లలో వ్యాధి దానంతట అదే ఆకస్మికంగా తగ్గిపోతుంది. మిగతా 55% నుంచి 85% మందిలో అది దీర్ఘకాలిక హెపటైటిస్- సి ఇన్ఫెక్షన్గా పరిణమిస్తుంది. అయితే ఈ వ్యాధి వల్ల లివర్ సిర్రోసిస్ వచ్చేందుకు చాలా ఎక్కువ కాలం పడుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న 15% నుంచి 30% మందిలో ఇది సిర్రోసిస్‌గా పరిణమించడానికి 20 ఏళ్లు కూడా పడుతుంది. వ్యాప్తి ఇలా: ఇది సరిగా స్టెరిలైజ్ చేయకుండా వాడే వైద్య పరికరాలతో ముఖ్యంగా ఒకరు వాడిన ఇంజెక్షన్ సూదులను మరొకరు వాడటం వల్ల వ్యాప్తి చెందుతుంది. సెక్స్ వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది. గర్భవతికి ఇది ఉంటే బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉంది. లక్షణాలు: వైరస్ సోకాక లక్షణాలు బయటపడటానికి రెండు వారాల నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. 80 శాతం మందిలో ఏ లక్షణాలూ కనిపించకపోవచ్చు. కానీ కొందరిలో జ్వరం, నీరసం/అలసట, ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, కడుపునొప్పి, మూత్రం పచ్చగా రావడం, మలం నల్లరంగులో ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ: లక్షణాలు బయటకు కనిపించని కారణంగా సోకిన తర్వాత తొలి దశల్లోనే దీన్ని గుర్తించడం అరుదుగా జరుగుతుంది. అందుకే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా పరిణమించినవారిలో అది కాలేయాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేశాకే బయటపడుతుంది. దీని నిర్ధారణ ప్రక్రియల్లో భాగంగా రక్తపరీక్షతో సీరలాజికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్‌ను గుర్తించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. ఒకవేళ ఈ పరీక్షలో ఫలితం పాజిటివ్ అని వస్తే అప్పుడు మరో వైద్య పరీక్ష చేస్తారు. ఇందులో హెచ్‌సీవీ ఆర్ఎన్ఏ ను గుర్తించడానికి ఒక న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష చేస్తారు. ఇది పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్ష. ఇది చేయాల్సిన అవసరం ఏమిటంటే... దాదాపు 15 శాతం నుంచి 45 శాతం మందిలో ఈ వ్యాధి సోకి దానంతట అదే పూర్తిగా తగ్గిపోతుంది. ఇలాంటి వారికి యాంటీ హెచ్‌సీవీ యాంటీబాడీస్ పరీక్ష చేస్తే అది పాజిటివ్ అని వస్తుంది. కాబట్టి అసలు వ్యాధి ఉందా లేదా అని తెలుసుకునేందుకు ఆర్ఎన్ఏ ని గుర్తించే న్యూక్లిక్ యాసిడ్ పరీక్ష అవసరం. ఇక రోగికి హెపటైటిస్-సి ఉన్నట్లు నిర్ధారణ అయితే అది కాలేయాన్ని ఏ మేరకు ప్రభావితం చేసింది (ఫైబ్రోసిస్ / సిర్రోసిస్) అన్న అంశాన్ని తెలుసుకునే పరీక్ష చేస్తారు. ఇందుకోసం కొందరిలో బయాప్సీ లేదా మరికొందరిలో ఇతర మార్గాలను అనుసరిస్తారు. దీనితో పాటు కొన్ని ల్యాబ్ పరీక్షలూ అవసరమే. ఎందుకంటే వైరల్లోడ్ ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు ఈ వైరస్‌లోనే ఆరు రకాల జీనోటైప్లు ఉంటాయి. ఒక జీనోటైప్ వైరస్‌కు ఇచ్చే చికిత్స మరో జీనోటైప్కు పనిచేయదు. కాబట్టి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే అది నిర్దిష్టంగా ఏ జీనోటైప్ అన్నది తెలుసుకోవడం చికిత్స కోసం చాలా అవసరం. దీని ఆధారంగానే చేయాల్సిన చికిత్సనూ, వ్యాధిని అదుపులో ఉంచేందుకు చేపట్టాల్సిన చర్యలనూ నిర్ణయిస్తారు. నివారణ: ఇప్పటివరకూ హెపటైటిస్-సి కి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి వ్యాపించే మార్గాలను తెలుసుకుని, వాటినుంచి దూరంగా ఉండటమే మంచి నివారణ చర్య. కొన్ని సమర్థమైన నివారణ చర్యలివే.... చేతులు శుభ్రంగా ఉంచుకోవడం; చికిత్సారంగంలో ఉన్నవారు సర్జికల్ గ్లౌజ్ వంటివి వాడటం, గ్లౌజ్ వేసుకునే ముందర చేతులు శుభ్రంగా కడుక్కుని తుడుచుకోవడం. చికిత్సరంగంలో ఉపయోగించిన వ్యర్థాలను సమర్థంగా పారేయడం (సేఫ్ డిస్పోజింగ్) అన్ని ఉపకరణాలను శుభ్రంగా ఉంచుకోవడం స్టెరిలైజ్ చేసుకోవడం వంటివి నివారణ చర్యల్లో కొన్ని. D- హెపటైటిస్ ఇది వర్తులాకరంలో ఉన్న చాలా చిన్న ఆర్ఎన్ఏ కలిగి ఉండే వైరస్. దీన్ని ఒక పూర్తిస్థాయి వైరస్‌గా కాకుండా ఒక ఉప-వైరస్‌లాగే పరిగణిస్తారు. ఎందుకంటే హెపటైటిస్-బి అండ లేకుండా ఇది స్వతంత్రంగా వ్యాప్తిచెందలేదు. కాబట్టి ఇది హెపటైటిస్-బితో పాటూ రావచ్చూ (కో-ఇన్ఫెక్షన్)... లేదా హెపటైటిస్-బి వచ్చాక ఆ తర్వాతా రావచ్చు (సూపర్ ఇన్ఫెక్షన్). అది కో-ఇన్ఫెక్షన్ అయినప్పటికీ లేదా సూపర్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ ఒకవేళ ఇది వస్తే మాత్రం కేవలం హెపటైటిస్-బి ఉన్నప్పటి కంటే కాలేయం పై తీవ్రత అధికంగా ఉంటుంది. అంటే లివర్ ఫెయిల్యూర్ చాలా వేగంగా జరగడం లేదా సిర్రోసిస్ కండిషన్/కాలేయ క్యాన్సర్ రావడం వంటివి చాలా త్వరితంగా రావడం జరగవచ్చు. కేవలం హెపటైటిస్-బి మాత్రమే ఉన్నవారితో పోలిస్తే దాంతోపాటు హెపటైటిస్-డి కూడా ఉన్నప్పుడు రోగి మరణాల రేటు ఎక్కువ. (దాదాపు 20 శాతం ఎక్కువ). వ్యాప్తి ఇలా: హెపటైటిస్-బి వ్యాపించే అన్ని మార్గాల్లోనూ ఇది కూడా వ్యాపిస్తుంది. కాబట్టి హెపటైటిస్-బి వ్యాప్తిని నిరోధించే మార్గాలే ఈవ్యాధి నివారణకూ తోడ్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా కోటీ యాభై లక్షల మందిలో ఇది హెపటైటిస్-బి వైరస్‌తో పాటూ ఉంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో దీని ఉనికి అంతగా లేనప్పటికీ, డ్రగ్స్ వాడే వారిలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తుంటుంది. చికిత్స / నివారణ: హెపటైటిస్-బి వ్యాక్సిన్ కూడా దీని బారి నుంచి రక్షణ కలిగిస్తుంది. ఎందుకంటే అది హెపటైటిస్-బి సోకితేనే వస్తుంది కాబట్టి ఈ తరహా రక్షణ లభిస్తుందన్నమాట. ఇక హైపటైటిస్-బి నివారణ కోసం అవలంబించాల్సిన అన్ని జాగ్రత్తలనూ దీని వ్యాప్తి నివారణకూ అవలంబించాలి. E- హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్ హెపటైటిస్-ఈ అనే వైరస్ వల్ల సోకుతుంది. ఇది కూడా కలుషితమైన నీరు, ఆహారం వల్ల వ్యాప్తి చెందుతుంది. చాలావరకు ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. సాధారణంగా నాలుగు నుంచి ఆరువారాల్లో పూర్తిగా తగ్గుతుంది. అయితే చాలా అరుదుగా కొందరిలో లివర్ ఫెయిల్యూర్ పరిస్థితి ఏర్పడి అది మృత్యువుకు దారితీయవచ్చు. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది కొత్తరోగులు దీని బారిన పడుతున్నారు. వ్యాప్తి ఇలా: సాధారణంగా మలంతో కలుషితమైన నీరు మంచినీటితో కలవడం వల్లనే ఇది వ్యాపిస్తుంది. కాబట్టి కలుషితమైన ఆహారం, నీటిని పూర్తిగా నివారించాలి. కేవలం సురక్షితమైన నీటినే తాగాలి/ఉపయోగించాలి. అలాగే రక్తమార్పిడి, రక్తంతో సంబంధం ఉన్న చర్యల వల్ల కూడా వ్యాప్తిచెందుతుంది. ఇక గర్భవతికి ఇన్ఫెక్షన్ ఉంటే తల్లి నుంచి బిడ్డకు సోకుతుంది. ప్రధానంగా ఇది కలుషితమైన నీటి వల్లనే వస్తుంది కాబట్టి సురక్షితం కాని నీళ్లు తాగడం, ఉడికించని ఆహారం పదార్థాలు తీసుకోవడం అంత మంచిది కాదు. లక్షణాలు: హెపటైటిస్‌కు ఉండే అన్ని సాధారణ లక్షణాలూ దీనిలోనూ ఉంటాయి. అంటే... కామెర్లు (చర్మం, కళ్లలోని తెలుపు భాగం పచ్చగా మారడం, మూత్రం పచ్చగా రావడం, మలం తెల్లగా ఉండటం) ఆకలి పూర్తిగా లేకపోవడం (అనొరెక్సియా), కాలేయవాపు (హెపటోమెగాలీ), పొత్తికడుపులో నొప్పి, పొత్తికడుపు భాగాన్ని ముట్టుకుంటే కూడా నొప్పి (టెండర్నెస్) వికారం/వాంతులు జ్వరం. ప్రభావం: హెపటైటిస్-ఈ వల్ల కలిగే లక్షణాలు సాధారణంగా వారం లేదా రెండు వారాల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ చాలా అరుదుగా ఫల్మినెంట్ హెపటైటిస్ (అంటే కాలేయం పూర్తిగా వైఫల్యం కావడం) వంటి కండిషన్ ఏర్పడి మరణానికి దారితీయవచ్చు. గర్భిణుల్లో ఈ వైరస్ ప్రభావం వల్ల కలిగే దుష్ఫలితాలు ఎక్కువ. సాధారణంగా ఈ వైరస్ సోకిన గర్భిణుల్లో 20 శాతం మంది మూడో త్రైమాసికంలో దీని వల్లనే మరణించిన దాఖలాలు ఉన్నాయి. చికిత్స: హెపటైటిస్-ఈ వ్యాధి చాలా వరకు దానంతట అదే తగ్గుతుంది. సమతుల ఆహారం ఇవ్వడం, లక్షణాలను బట్టి మందులు ఇవ్వడం (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్) మాత్రమే చేస్తారు. అయితే ఈ లక్షణాలు ఉన్న గర్భిణులను మాత్రం ఫల్మినెంట్ హెపటైటిస్ బారి నుంచి రక్షించడానికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తారు. ప్రస్తుతానికి హెపటైటిస్-ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఆధారంగా చాలా త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
జుట్టూ... టెంక మీద పీచు... ఏమిటీ లంకె?
నవ్వింత: పొద్దున్నే మా బుజ్జిగాణ్ణి స్కూలుకు తయారు చేస్తూ వాడి తలకు కొబ్బరినూనె రాస్తుంటే వాడు నన్ను ఓ ప్రశ్న అడిగాడు. ‘‘నానా... తలకు కొబ్బరినూనే ఎందుకు రాస్తారు? మిగతా నూనెలు ఎందుకు రాయరు?’’ అని వాడి సందేహం. నేను జవాబిచ్చేలోపే మళ్లీ వాడే సమాధానం కూడా చెప్పాడు. ‘‘నానా... జాగ్రత్తగా చూడు. పీచు ఊడదీసిన కొబ్బరి టెంక అచ్చం గుండులాగే ఉంటుంది. అలాగే దాని మీద పీచు అచ్చం చిందరవందరగా ఉన్నప్పటి నా జుత్తులాగే ఉంటుంది. కాబట్టి కొబ్బరిలో పీచును పెంచే గుణమేదో ఉండొచ్చు. పీచులాగే మన జుట్టూ దట్టంగా గట్టిగా రావాలనే ఉద్దేశంతోనే కొబ్బరినూనే తలకు రాస్తారేమో నానా’’ అన్నాడు. కాస్తంత ఆలోచిస్తే వాడి లాజిక్ కూడా కరక్టేనేమో అనిపించింది. అయితే ఈలోపే మళ్లీ మరో ప్రశ్న వేశాడు వాడు. ‘‘అవునూ... పిసికి తినే రసాల మామిడి టెంక మీద కూడా పీచుంటుంది కదా. మరి మామిడికి సంబంధించినదేదీ తలకు రాయరెందుకు?’’ అంటూ మరో సంశయం వ్యక్తం చేశాడు వాడు. నేను బుర్రగోక్కుంటుండగానే మళ్లీ వాడే సమాధానం చెప్పాడు. ‘‘బహుశా... మామిడిలో రసాల రకాన్ని తిన్న తర్వాత కనిపించే పీచు ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశావా? అచ్చం బట్టతల మీద అక్కడక్కడా వేలాడే కాసిన్ని పోచల్లాగే ఉంటుంది. అందుకే మామిడి రసాలో లేదా అందులోంచి తీసిన ప్రోడక్టునో రాస్తే జుట్టు ఒత్తుగా రాదని కావచ్చు. ఒకవేళ అది బంగినపల్లి వెరైటీ మామిడి అయితే అసలు పీచే ఉండదు కదా. అందుకే కొబ్బరితోనూ, మామిడితోనూ... ఈ రెండింటితోనూ పచ్చడి చేసినా కొబ్బరినూనె తీసి ఎగస్ట్రాగా తలకు రాసుకుంటారన్నమాట’’ అంటూ వాడే వివరించాడు. ఏదేమైనా వాడి ఆలోచన ధోరణికీ, లాజిక్ పవర్‌కూ కాస్తంత ఆశ్చర్యపోయా. మహా రచయిత పతంజలి చెప్పినట్టు వాడి తలలో జ్ఞానమన్నది. కొబ్బరిబొండాంలో నీళ్లూరినట్టుగా ఊరుతోంది. కానీ అది కొబ్బరిబొచ్చెలో ఉన్నట్లు పదిలంగా ఉండాలన్నది నా కోరిక. కానీ అదే జ్ఞానం నూనెలో వేసిన పూరీలో ప్యాక్ చేసిన గ్యాస్‌లా ఉండొద్దన్నది నా అభిలాష. అదే విషయాన్ని తల దువ్వుతూ మావాడికి కాస్త తేలిక పదాలతో చెప్పా. ‘‘నానా... జ్ఞానమంటే కొబ్బరిబొండాంలో ఊరిన నీళ్లలాగో... నూనెలో వేసిన పూరీలో ఉబ్బిన గ్యాసులాగో పదిలంగా ఉండటం కాదు. నువ్వు అభిమానించే రచయిత చెప్పినట్టు అది అలా పదిలంగా ఉన్నా ప్రయోజనం లేదు నాన్నా’’ అన్నాడు. ‘‘మరేమిట్రా? వేలెడంత లేవు. నీకు జ్ఞానం, దాని ప్రయోజనం అన్నీ తెలుసా?’’ అంటూ మరోసారి ఆశ్చర్యపోతూ అడిగా. ‘‘ఎందుకు తెలియదూ... ఇప్పటి వరకూ నేనే కారణాలు ఆలోచించి, నేనే సమాధానాలూ వెతుక్కోలేదూ. అలాగే జ్ఞానం కొబ్బరిబొండాంలో నీళ్లలా ఒక ఊటలా ఊరుతుందని నువ్వు చెప్పగానే దాని ప్రయోజనం ఏమిటో నాకు అర్థమైపోయింది’’ అన్నాడు వాడు. ఇంతటి తాత్విక విషయాలపై నాకే ఒక అవగాహన రావడం లేదు. అలాంటిది పెద్ద పెద్ద విషయాలను చాలా తేలిగ్గా పరిష్కరిస్తున్న వాడి లాజిక్కు పట్ల నాకు అబ్బురం కలిగింది. కాస్తంత అహం అడ్డు వచ్చినా తెగించి అడిగా మరి జ్ఞాన ప్రయోజనం ఏమిట్రా అని. ‘‘నానా... జ్ఞానం కొబ్బరికాయలో నీళ్లలా ఊరితే దాన్ని స్ట్రాతో తాగేయాలి. పూరీలో గ్యాసులా ప్యాకయితే ఆ ఉబ్బు ఎప్పుడూ పదిలంగా ఉండాలని కోరుకోకూడదు. ఇలా జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేసేస్తూ ఉండాలి. వేలితో జ్ఞానం ప్యాక్‌ను పొడిచేసి అటు పూరీనీ, ఇటు కొబ్బరికాయలోని కొబ్బరితో పచ్చడి చేసేసుకుని ఆ పచ్చడినీ... ఈ రెండింటినీ కలుపుకుని తినడమే అసలైన జ్ఞానం. అదే ఇప్పుడు అమ్మ నాతో ప్రాక్టికల్‌గా చేయించబోయే పని’’ అంటూ కొబ్బరి చెట్నీతో పూరీ తినేసి బ్యాగు వీపున వేసుకుని స్కూల్‌కు బయల్దేరాడు. ఆ టైమ్‌లో వాణ్ని చూస్తే వాడి తల మీద జుట్టంతా కొబ్బరిమట్టల్లా, వాడి మాటలన్నీ మామిడిముక్కల్లా అనిపించాయి. వాడి ఆలోచనల పట్ల నాలో గర్వం నూనెలో వేసిన పూరీలోని గాలిలా పొంగింది. కానీ... నా దిష్టే తగులుతుందేమోనని సదరు పూరీని వేలితో పొడిచేసుకుని, పూరీల, కొబ్బరి పచ్చళ్ల ప్రయోజనాన్ని తెలుసుకుని, ఈ రెంటినీ కలుపుకుని గబుక్కున నోట్లో పెట్టుకున్నా. - యాసీన్ -
ఇది వదలని ‘బొమ్మా’ళీయం!
సరదాగా... ‘‘బొమ్మనూ చేసీ... పిల్లలనిచ్చీ... చిలిపిగా చూసేవు వేడుకా... పిల్లలతోటీ... వారిమాటలతోటి... గారడీ చూపేవు వేడుకా...’’ అంటూ అప్పటికి ఐదోసారి విరక్తిగా పాడుకున్నాను. అందుకు కారణం మా బుజ్జిగాడు. ‘‘నాన్నా నువ్వు నన్ను ఆ రెస్టారెంట్‌కు తీసుకెళ్లగానే డాలీమీల్స్ ఇప్పించాలి. సరేనా’’ అంటూ అల్టిమేటమ్ ఇచ్చాడు మా బుజ్జిగాడు. సదరు డాలీమీల్స్ ఎంతమాత్రమూ రుచిగా ఉండదు. కాకపోతే దాంతో పాటూ ఒక బొమ్మను ఇస్తారు. కాబట్టి అది డాలీమీల్స్ అనే పేరిట ప్రఖ్యాతినొందింది. ఏదైనా మంచి రుచికరమైన పదార్థాలూ, ఆత్మకింపైన భోజనం తిందామన్నది నా కోరిక. కానీ వాడి బోడి బొమ్మ కోసం రుచీపచీలేని ఐటమ్ తీసుకోడానికి నాకు మనస్కరించదు. ఈలోపు వాడిలో టాయేచ్ఛ మరింత హెచ్చింది. ‘వదల బొమ్మాళీ నిన్నొదల’ అంటూ నన్ను మరో రూపంలో వెంటాడింది. ‘‘సరే... అయితే ఆ చిర్చిరే లేదా డర్డరే పాకెట్ తీస్కో’’ అంటూ నాకు మరో ఛాయిస్ ఇచ్చాడు. ఆ చిర్చిరే పాకెట్ కొనాలంటే నాకు పరమ చిరాకు. డర్డరే కూడా దాదాపు అంతే. పేరుకు తగ్గట్టు మహాభయం. వాటిల్లో ఒకదాంట్లో మహా అయితే నాలుగు పాప్‌కార్న్ ముక్కలో, ఇంకోదాంట్లో ఐదు చిప్సో... గిప్సో ఉంటాయి. వాటితోపాటు ఉచితంగా ఓ బొమ్మ. అందుకే వాడి ఆ డిమాండు. ఈ రెండు డిమాండ్లకూ నేను లొంగలేదు. పైగా అదేదో సినిమాలోలా వాడికో వార్నింగ్ ఇచ్చాను. ‘‘ఒరేయ్... మనం రెస్టారెంట్‌కు వెళ్లి మాంఛి రుచికరమైన నాన్‌వెజ్ భోజనం తింటాం. ఎందుకంటే నేను పులిని. నాముందు నీ ‘బొమ్మ’డిమాండ్లు పెట్టకు. నీకు నేను ‘టాయి’లాలు ఇచ్చేది లేదు. పులితో గేమ్స్ ఆడకు. పులికీ నాకూ ఎన్నో సిమిలారిటీస్. పులికీ తేన్పులొస్తాయి. నాకూ పులితేన్పులొస్తాయి. కాకపోతే ఒక్కటే తేడా. దానికి పొట్ట గట్టిగా రాయిలా మారదు... నాకు మారుతుందంతే. పొట్టమాత్రమే కాదు... నా సంకల్పమూ రాయిలాంటిదే. అందుకే రాయ్ లాంటి నా పట్టుదల ముందు నీ టాయ్‌కు ఆస్కారం లేదు... హ హ హా’’ అంటూ నా నవ్వులో కాస్త విలనీ కూడా చూపాను. ఆ తర్వాత వాడెంత పిలిచినా, బతిమాలినా, వెంటాడినా లొంగకూడదంటూ నిశ్చయించుకుని మౌనంగా ఉండిపోయా. ‘‘నాన్నా...’’ నో ఆన్సర్. ‘‘ఇప్పించవా’’ జవాబు శూన్యం. ‘‘అంతేనా?’’ రాయిలా గట్టిదీ, కుండలా పొంగినదీ అయిన నా రాతిపొట్ట లాంటి నా పట్టుదలా.... మజాకా? వాడేదో జనాంతికంగా మాట్లాడుతున్నట్లుగా... వాడిలో వాడే ఏదో గొణుక్కుంటున్నాడు. నాకంతా వినపడుతూనే ఉంది గానీ, ఏదీ విననట్లుగా యాక్షన్ చేస్తున్నాను. కానీ నాకు ఆ తర్వాత తెలిసింది. అది వాడి ఎత్తుగడలో భాగమని. ఇంతకీ వాడు మాట్లాడిందేమిటంటే... ‘‘అమ్మా... బంగారం విలువ ఎక్కువా? ప్లాటినందా? ఎందుకంటే మా స్కూల్లో కొంతమంది పిల్లలు బంగారం కంటే ప్లాటినమే విలువైందంటున్నారు’’ అడిగాడు వాడు. ‘‘అవున్రా. నిజమే. బంగారం కంటే ప్లాటినం విలువే ఎక్కువ’’ క్లారిఫై చేసింది మా ఆవిడ. ‘‘అప్పుడూ... నాన్న మనతో చాలాసేపట్నుంచి మాట్లాట్టం లేదు కదా... రోజూ మనం వినే పాటను నాన్న కోసం వేరేలా పాడితే బెటరేమో?’’ అన్నాడు వాడు. నేనేమీ మాట్లాడలేదు. కానీ మనసులో మాత్రం ఆ పాటేమిటో అని బోలెడంత ఆసక్తి. ‘‘ఏంట్రా ఆ పాట?’’ అడిగింది మా ఆవిడ. ‘‘నాన్న ఎంతకూ నాతో మాట్లాడం లేదమ్మా అందుకే ఇలా పాడుతున్నా... పలూకే ప్లాటీనామాయేనా... ఓ మౌన నాన్నా... పలూకే ప్లాటీనామాయేనా పలూకే ప్లాటీనామాయే - పిలచీనా పలుకవేమీ... పలికీ నాతో ఓ మాటా పలుకూ - బొమ్మా ఇప్పించూ స్వామీ’’ అంటూ నా పేరడీ డైలాగ్‌కు తగినట్టుగా ఓ పేరడీ పాట విడిచాడు. అంతే... ఊగిపోయే తండ్రిపేగుతో వాడికి డాలీమీల్సు తినిపించక తప్పలేదు నాకు. అంతే కాదు... దాంతో పాటూ నేను అమితంగా ద్వేషించేదే అయినా డర్డరే పాకెట్ కూడాఒకటి ఇప్పించా. ‘‘జన్మనిచ్చితిరా... అనుభవించితిరా...’’ అన్న పాట అప్పటికి ఐదోసారో, ఆరోసారో ఏడుస్తూ పాడక తప్పలేదు నాకు. - యాసీన్ -
కాయల్లోన నిమ్మకాయ వేరయా...!
‘‘నాకెందుకో క్షుద్రదేవతలక్కూడా నిమ్మకాయలు ఇష్టమేమో అనిపిస్తోందిరా’’ అన్నాడు మా రాంబాబు. వాడు బిర్యానీ పార్టీ ఇస్తానన్నప్పట్నుంచే నాకెందుకో గుండె పీచుపీచుమంటోంది. అయినా బగారా పట్ల నాకున్న మక్కువ కొద్దీ రిస్క్ తీసుకున్నా. రిజల్ట్ కనిపించడం మొదలైపోయింది. అయినా అడిగా, ‘‘క్షుద్రదేవతలకూ నిమ్మకాయలతో సంబంధం ఏమిట్రా?’’ అని. ‘‘గమనించావా? క్షుద్రదేవతోపాసన చేశాక నైవేద్యాన్ని కూడలిలో పెడుతుంటారు. వాటితో పాటు నిమ్మకాయలు కోసి ఉంచుతుంటారు. దీన్ని బట్టి తెలిసేదేమిటి? క్షుద్రదేవతలు తమ నైవేద్యాలను తింటూ రుచి కోసం నిమ్మకాయలు పిండుకుంటారన్న మాట’’ ‘‘దెయ్యాల కథలు మళ్లీ మళ్లీ చెప్పకు. బోరుకొడుతుంది’’ అన్నాన్నేను. ‘‘ఛ...ఛ... మొన్న దెయ్యాలగురించి చెప్పినందుకే నన్ను చాటుగా నరరూపదెయ్యం అంటున్నారట. నేను చెప్పేదల్లా ఒకటే. క్షుద్రదేవతలకూ మనుషులకూ అనుసంధానమైనదీ... నిమ్మకాయ. ఇలా రెండు వర్గాలను ఏకకాలంలో మెప్పించిందంటే నిమ్మకాయ గొప్పదనే కదా అర్థం’’ ‘‘నీ పిచ్చిగాకపోతే రోజూ వాడే నిమ్మకాయకు గొప్పదనమేమిట్రా?’’ ‘‘మామూలు కాయలెన్నున్నా నిమ్మకాయ గొప్పదనం నిమ్మకాయదేరా! భూదేవికి లాగే దానికి ఓర్పు చాలా ఎక్కువ’’ ‘‘నిమ్మకాయకు ఓర్పేమిట్రా నా ముఖం!’’ ‘‘నువ్వు కొత్తకారు కొంటావా. వెంటనే పెట్రోలు పోయించడమైనా ఆలస్యం చేస్తావేమోగానీ... ముందుగా రెండుమూడు నిమ్మకాయలు కలిపి కారు ముందు కట్టేస్తావు. ఎందుకనీ... నీ కారుపైన పడే చెడు దృష్టినంతా అవి స్వీకరించాలని. అంతటితో ఆగుతావా? నాలుగు చక్రాల కిందా నాలుగు నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తావు. నీ కారు నిక్షేపంగా ఉండాలనే నీ స్వార్థానికీ, నరదిష్టికి నీకారు బేకారు కాకూడదనే నీ నమ్మకానికీ నిశ్శబ్దంగా నలిగిపోతుంటాయిరా నిమ్మకాయలు. అంతే కాదు... వాటిని అడ్డంగా కోసేస్తున్నా, పీకపట్టుకు పిసికేస్తున్నా, ఒళ్లంతా పిండేస్తున్నా రసభరితమైన రుచితో మాంసాహారివైతే నీ బగారాబిర్యానీలనూ, శాకాహారివైతే నీ నిమ్మకాయపులిహోరలనూ మరింత టేస్టీగా చేసే త్యాగబుద్ధి నిమ్మదేరా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేసే నిమ్మకాయకిదే నా నివాళి’’ అంటూ కాస్త నిమ్మకాయ పిండిన ఉల్లిపాయను బగారా రైస్ ముద్దతో పాటూ నోట్లో పెట్టుకుంటూ ఆవేశపడ్డాడు మా రాంబాబుగాడు. ‘‘నువ్వు చెబుతుంటే నిజమేననిపిస్తోందిరా. నిజంగా నిమ్మ చాలా ఘనమైనదే’’. వాడు మరింత రెచ్చిపోకుండా అక్కడితో ఆగిపోయేందుకు పోన్లే అంటూ సపోర్టుగా ఓ మాట అన్నా. అంతే... వాడు మళ్లీ రెచ్చిపోయాడు. ‘‘ఘన అన్న పదం తప్పురా... గజ అన్న పదం వాడాలి. ఎందుకంటే... ‘గజదొంగ’లాగే ‘గజనిమ్మ’ అనే మాటే తెలుగులో ఉంది. పోన్లే నువ్విప్పుడు ఘననిమ్మ అంటూ కొత్త పదం కాయిన్ చేసినా నేనేం బాధపడను. ఎందుకంటే ఎటు చూసినా ఒకటేలా చదవగలిగే ‘వికటకవి’ అన్నమాట అంటుంటే అందులో కాస్త చిలిపిదనమే ధ్వనిస్తుంటుంది. కానీ నిమ్మగింజను పట్టుకుని ‘జంబీరబీజం’ అని అంటే అందులో పదాల గంభీరనైజమే ధ్వనిస్తుంటుంది’’ అన్నాడు వాడు. ‘‘అరే... నువ్వు నిమ్మకాయను పట్టుకుని అలా పొగిడేయకు. నిమ్మకాయ కొందరికి నెమ్ముకాయరా. అది వాడగానే వాళ్లకు జలుబు చేస్తుంది కాబట్టే నేను దాన్ని నెమ్ముకాయ అంటా’’ కాస్త తెగించి కాస్త విమర్శ కోసం ఓ మాట అన్నా. ‘‘హుం... నీకేమి తెలుసురా నిమ్మకాయ సైన్సు విజ్ఞానం! అందులో ఉండే సి విటమిన్ నిజానికి జలుబునూ, నెమ్మునూ, దమ్మునూ తగ్గిస్తుందట. అంతటి దమ్మున్నకాయ అది. అందరి దిష్టి తీసీ, తీసీ దానికి దిష్టి తగలడం వల్లనేమో దానికీ అపకీర్తి వచ్చింది. కానీ నిజానికి ‘ఎ నిమ్మకాయ ఎవ్రీడే... కీప్స్ ద జలుబు అవే’ తెల్సా. అంతెందుకు నిమ్మకాయ మగతనానికి గుర్తురా బాబూ’’ ‘‘నిమ్మకాయకూ, మగతనానికీ సంబంధమేంట్రా. ఇదేదో కొత్త విషయం చెబుతున్నావు’’ అంటూ ఆశ్చర్యపడ్డా. ‘‘అంతేరా... ఎవడైనా తమ మగతనానికి చిహ్నమైన మీసాల గురించి మాట్లాడాల్సి వస్తే... వాటిమీద నిమ్మకాయలనే పెట్టాలంటారుగానీ... లోకంలో మరెన్నో కాయలున్నా వాటి గురించి మాట్లాడరెందుకు? క్షుద్రదేవతలకూ మనుషులకూ అనుసంధానమైనదిలాగే.. మీసాలకూ, మగతనపు పవరుకూ అనుసంధానమైనదీ నిమ్మకాయ. అందుకోసమేనేమో... ఒకసారి వీణావాద్యంలో తన నైపుణ్యాన్ని చాటిచెప్పేందుకు వాసా అప్పయ్యగారనే విద్వాంసులు మీసాలమీదేం ఖర్మ ఏకంగా నెత్తి మీది జుత్తుమీదే నిమ్మకాయ నిలబెట్టి వీణవాయించారట. నువ్వు నా మాటెందుకు నమ్ముతావుగానీ... ఇది తనికెళ్ల భరణిగారు చెప్పిన విషయం తెల్సా’’ అంటూ తన మాటకు తిరుగులేని సాక్ష్యాన్ని తోడు తెచ్చుకున్నాడు. ఇంకా మాట్లాడితే ఇంకేమేం అంటాడో అని... వాడు కాస్త ‘నిమ్మ’ళించడానికి నేనిక నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయా. - యాసీన్