‘ఉప్పో’ద్ఘాతం...! | Uppo' dghatam ...! | Sakshi
Sakshi News home page

‘ఉప్పో’ద్ఘాతం...!

Published Sun, May 11 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

‘ఉప్పో’ద్ఘాతం...!

‘ఉప్పో’ద్ఘాతం...!

 నవ్వింత:

 ‘‘నాన్నా... ఉప్పు అమృతానికి చెల్లెలు కదా. అది చాలా గ్రేట్ కదా’’ అన్నాడు మా బుజ్జిగాడు. వాడన్న మాటతో నేను కాస్త ఉప్పందుకుని ఇక విజృంభించా. ‘‘నిజమేరా... ఉప్పు ఒక్క అమృతానికే కాదు... విషానికీ చెల్లి. సముద్రాన్ని చిలికినప్పుడే కదా... అమృతం, హాలాహలం వరసగా పుట్టింది. ఇక ఉప్పు కూడా సముద్రం నుంచే పుడుతుంది కాబట్టి అది రెంటికీ చెల్లెలన్న మాట’’ అంటూ రెచ్చిపోయా. దీనికో కారణం ఉంది. గత ఇరవై రోజులుగా ప్రయత్నిస్తున్నా మా బుజ్జిగాడి చేత పదో ఎక్కం కూడా చదివించలేకపోయా. దాంతో ఈ ఉప్పు ఆధారంగానైనా కాసేపు వాడికి తెలుగు సబ్జెక్టు చెబుదామన్నది నా కోరిక. ‘‘అదెలా? పాల సముద్రం చిలికితేనే కదా... అమృతం, విషం పుట్టింది. మరి ఉప్పు వచ్చేది నీళ్ల సముద్రం నుంచి కదా’’ అంటూ అడిగాడు వాడు.
 
 ‘‘కరెక్టే... తల్లులు వేరైనా వీళ్లంతా ఒక్క తండ్రికే పుట్టారన్నమాట. అటు అమృతానికీ, విషానికీ ఇటు ఉప్పుకూ కూడా తండ్రి సముద్రుడే. కాబట్టే... ఉప్పు చిటికెడంత వేస్తే వంట కాస్తా అమృతమవుతుంది. అదే కాస్త ఎక్కువైతే విషంలా, ఉప్పుకశంలా మారుతుందన్నమాట. ఉప్పు గొప్పదనం గుర్తించాడు కాబట్టే వేమన పద్యాల్లో మనమంతా ఉప్పు కప్పురంబు పద్యాన్నే మొదట చదువుతామన్నమాట...’’ అంటూ చాకచక్యంగా తెలుగుపాఠం చెప్పడం మొదలుపెట్టా. ‘‘ఉప్పు బీపీని పెంచేస్తుందనీ, దాంతో ఆరోగ్యం దెబ్బతింటుందని డాక్టర్ నీతో చెప్పారు కదా. అన్నట్టు మా సోషల్ పుస్తకంలో సముద్రానికి ఆటూపోటూ వస్తాయని రాసుంది. ఇప్పుడు తెలిసింది... ఆటూ, పోటూ ఎందుకు వస్తాయో?’’
 
 సడెన్‌గా వాడు తెలుగుపాఠం నుంచి వైద్యవిద్యకీ... అక్కడ్నుంచి మళ్లీ నేరుగా తన సోషల్ స్టడీస్‌లోకి జంప్ చేసేటప్పటికి నేను అయోమయంలో పడిపోయా!  ‘‘సముద్రంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే సముద్రుడికి కూడా బీపీ పెరుగుతుందన్నమాట. ఉప్పుతో నీకు రక్తపోటు పెరిగినట్టే, సముద్రానికీ పోటు పెరుగుతుందన్నమాట’’ అన్నాడు వాడు. ఎలాగూ వాడు సోషల్ లోకి దూకాడు కదాని... నేనూ ఆ సబ్జెక్టులోకి దిగక తప్పలేదు. ‘‘అవున్రా... కొందరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలు, బీపీ లేకున్నా వాళ్లను చూసిన ఆందోళనతో అది పెరిగేస్తుందట. దీన్నే వైట్ కోట్ సిండ్రోమ్ అంటారట. ఇక పౌర్ణమి రోజున చంద్రుడు వైట్ కోట్ వేసుకున్నట్టుగా వెండిరంగులో ఎదురుగా కనిపిస్తుంటాడు కదా. అందుకే ఆ రోజున సముద్రానికి పోటు ఎక్కువన్నమాట. అంటే... ఇది సముద్రుడికి వచ్చే వైట్ కోట్ సిండ్రోమ్ లాంటిదన్న మాట’’ అంటూ ఇటు సోషల్ స్టడీస్‌లోని జాగ్రఫీనీ, అటు  మెడిసిన్‌నూ మిక్స్ చేసి కొట్టా. ‘‘అవున్నాన్నా... ఎంతైనా ఉప్పు గ్రేటే. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా గాంధీ గారు కూడా ఉప్పు సత్యాగ్రహం చేశారట. దాంతో తెల్లదొరలు బెదిరిపోయార్ట’’ అన్నాడు వాడు మళ్లీ జాగ్రఫీ నుంచి హిస్టరీలోకి దూకేస్తూ.
 
 ‘‘అవున్రా... ఉప్పులో బీపీ పెంచే గుణం ఉండటం వల్ల గాంధీగారు స్వాతంత్య్రం కోసం ఉప్పును ఎంచుకున్నారు. అలా ఆయన ఉప్పు తయారు చేయగానే తెల్లదొరలకు బీపీ పెరిగిపోయిందన్నమాట. దాంతో ఇండియా మన ఆరోగ్యానికి మంచిది కాదులే అని దేశం వదిలిపోయారన్నమాట’’ అన్నాన్నేను. మావాడికి ఏకకాలంలో తెలుగు, మెడిసిన్, జాగ్రఫీ, హిస్టరీ బోధిస్తున్నాననే గర్వం నాలో పెరిగిపోయింది.

 ‘‘అవును నాన్నా... ఉప్పు గ్రేటే. మా ఆటల్లో కూడా ఉప్పుబస్తా అంటూ పిల్లల్ని వీపున మోసుకుపోతాం’’ అన్నాడు వాడు. హమ్మయ్య... పనిలో పనిగా ఇతర సబ్జెక్టులతో పాటు ఉప్పు దయ వల్ల ఇక మేం పీఈటీ పీరియడ్‌ను కూడా కవర్ చేశామన్న తృప్తి కూడా నాలో కలిగింది.
 
ఈలోపు మా ఆవిడ ‘‘రాత్రి ఎంత పొద్దుపోయిందో చూడండి... భోజనం చేస్తూ మాట్లాడుకోండి’’ అంటూ మా ఇద్దర్నీ అదిలించింది. ఈలోపు పనిలో పనిగా కంచాల్లో భోజనం వడ్డించి తెచ్చింది. ఇక పెరుగులోకి వచ్చాక కాస్తంత ఉప్పు వేసుకుందామంటే ససేమిరా అంటూ అస్సలు కుదరనివ్వలేదు మా ఆవిడ. ఈసారి ఆమె ఉప్పు వేయనందుకు నాలో బీపీ పెరిగిపోయింది. ఛీ... మా బుడ్డోడికి తెలియకుండా ఏకకాలంలో ఎన్నో సబ్టెక్టులు బోధించినందుకైనా రుచి కోసం పెరుగులో కాస్త ఉప్పు వేయవచ్చు కదా అనిపించింది. కానీ నా ఆలోచనలు గ్రహించినట్లుగా చివరగా ఒక్కమాట అంది.
 
 ‘‘మీ ఉప్పు తిన్న విశ్వాసంతోనే మీకు ఉప్పు వేయడం లేదండీ’’ అంది తన మంగళసూత్రాలు తీసి జాగ్రత్తగా కళ్లకద్దుకుంటూ, మా జీవనపాత్రలో సెంటిమెంట్ అనే ఉప్పును చిటికెడంత చిమ్ముతూ.అన్నట్టు పెరుగులో ఉప్పువేయకుండా మా ఆవిడ నన్ను శిక్షించిందా? నా ఆరోగ్యం కోసం జాగ్రత్త పడుతూ నన్ను రక్షించిందా అన్నది నాకింకా తెలియరాలేదుగానీ... ఉక్రోశంతోనో, ఆక్రోశంతోనో చెంపల మీద నా కన్నీళ్లు నాకే ఉప్పగా తగిలాయి. ఆమె అలా పుస్తెలు తడుముకోగానే ఇక నేనేమాత్రం తడుముకోకుండా ఓ ఉప్పాడ చీర కొందామని నిర్ణయించుకున్నా. నేను ఇప్పటివరకూ మా బుడ్డోడికి తెలియకుండానే ఎన్నో సబ్జెక్టులు చెబుతున్నానన్న గర్వం నాకు ఏదైనా ఉంటే... మా ఆవిడ సెంటిమెంటల్ సబ్జెక్టుతో అది కాస్తా ఉప్పేసి కడిగినట్లుగా ‘ఉఫ్ఫ్’మంటూ పటాపంచల్ అయిపోయింది. ఏం చేస్తాం! అది టీచింగైనా, టీజింగైనా ఆడవాళ్లదే గ్రేట్‌నెస్ కదా!
 - యాసీన్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement