వాగ్గేయకార వైభవం
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు.
అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో!
మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు.
తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా.
అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట.
ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ!
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment