మహారాష్ట్రలో ఏక్‌నాథ్ అనే భక్తుడుండేవాడు. ఓసారి గొప్ప పుణ్యక్షేత్రమైన కాశీ వెళ్లాడు. గంగానదిలో స్నానం చేసి అన్నపూర్ణ, విశ్వేశ్వరులను సందర్శించాడు. పవిత్ర గంగాజలాన్ని తీసుకుని రామేశ్వరం వెళ్లి అక్కడి సముద్రలో కలపడం నాటి ఆచారం. అంచేత రెండు బిందెలను గంగాజలంతో నింపి కావడిలో పెట్టుకుని తన శిష్యగణంతో రామేశ్వరం బయలుదేరాడు. అప్పటిలో ప్రయాణ సాధనాలు లేనందున కాలినడకనే వెళ్లేవారు. అలా వెళ్తుండగా ఓ గాడిద కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యం కంటపడి అక్కడ ఆగిపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గాడిదకు తీరని దాహం వేసి ఉంటుందని గ్రహించిన ఏక్‌నాథ్ మనస్సు చలించిపోయింది. వెంటనే కావడిలో ఉన్న బిందెడు నీటిని దాని నోటిలో పోసి, దాని మీద కాసిని నీళ్లు చిలకరించాడు. కాసేపటికి లె ప్పరిల్లిన ఆ గాడిద కళ్లు తెరిచి కృతజ్ఞతాపూర్వకమైన చూపు చూస్తూ లేచి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ ఉదంతాన్ని తేరిపార చూసిన అతని శిష్యులు ‘‘స్వామీ! రామేశ్వరం తీసుకుని వెళ్తున్న పవిత్రమైన గంగాజలాన్ని గాడిద నోటిలో పోసి వృథా చేశారే! కాశీ వెళ్లిన ఫలితం కాస్తా బూడిదలో పోసిన పన్నీరైనట్లే కదా. ఇప్పుడు రామేశ్వరం వెళ్లి ఏంటి ప్రయోజనం?’’ అని అడిగారు.
అందుకు ఏకనాథుడు స్పందిస్తూ ‘‘దేవుడు సమస్త జీవులలో ఉన్నాడు. ఏ జీవిని నిర్లక్ష్యం చేసినా దేవుణ్ణి బాధించినట్లే. అంచేత మనం ఏ జీవి ప్రాణ సంకట స్థితిలో ఉన్నా నిర్లిప్తత కూడదు. గంగాజలంతో ఓ జీవిని రక్షించగలిగానన్న సంతోషం నాకు రామేశ్వరం వెళ్లినంత సంతృప్తినిచ్చింది. ఆత్మసంతృప్తి కన్నా ఆనందం ఇంకేముంటుంది?’’ అన్నాడు. శిష్యులు ఏక్‌నాథుడికి తడికళ్లతో నమస్కరించారు.– వాండ్రంగి కొండలరావు
Comments
Please login to add a commentAdd a comment