
వారణాసి: హిందువులు కాని వారు గంగా నది ఘాట్లకు, నది ఒడ్డున ఉండే గుడులకు దూరంగా ఉండాలని హెచ్చరించే పోస్టర్లు కాశీ పుర వీధుల్లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని తొలగించిన పోలీసులు ఇవి ఎలా వచ్చాయన్న అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. జాతీయవాద సంస్థలు వీటి వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘గంగా ఘాట్లు, కాశీ దేవాలయాలు సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి, విశ్వాసానికి, నమ్మకానికి చిహ్నాలు, వీటిపై నమ్మకమున్నవారికి స్వాగతం, లేదన్న వారు ఇది పిక్నిక్ స్పాట్ కాదని గుర్తుపెట్టుకోండి’ అని ఈ పోస్టర్లలో రాశారు.
వీటిపై హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం అనే శీర్షికనుంచారు. ఇది విజ్ఞప్తి కాదు, హెచ్చరిక అనే బెదిరింపులు కూడా వీటిపై ఉన్నాయి. ఈ పోస్టర్ల ఫొటోలు, వీడియోలను వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దర్శనమిచ్చాయి. భేల్‌పూర్ పోలీసులు వీటిపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియోల్లో, ఫొటోల్లోని కొందరిని గుర్తించామన్నారు. హిందూయేతరులు ఘాట్ల పవిత్రతను దెబ్బతీస్తారని, అందుకే వీరికి ఈ వార్నింగ్ ఇచ్చారని బజరంగ్‌దళ్ నేత నిఖిల్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు. వీరంతా ఘాట్లలో మద్యం తాగడం, మాంసం తినటం చేస్తారని ఆరోపించారు. ఇటీవలే కొందరు బాలికలు ఘాట్లలో బీర్లు తాగుతున్న ఫొటోలు బయటపడ్డాయని, ఇలాంటి వారు తమకు పట్టుబడితే పోలీసులకు అప్పజెబుతామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment