the Ganges
-
ఏది గొప్పది... స్వర్గమా! కాశీనా!!!
ముత్తుస్వామి దీక్షితార్ గొప్ప వాగ్గేయకారులు. పుస్తకం పట్టి శాస్త్రాధ్యయనం చేయక పోయినా గంగానదీతీరాన గురు శుశ్రూష చేస్తూ చాలా ధర్మసూక్ష్మాలను తెలుసుకున్నారు. తదనంతర కాలంలో ఆయన గంగాదేవి గొప్పదనాన్ని కీర్తిస్తూ చేసిన కీర్తనలో ఆయన విషయగాఢత మనకు బోధపడుతుంది. ‘‘...అక్రూర పూజితే అఖిల జనానందే/సకలతీర్థమూలే...’’ అన్నారు. అన్ని తీర్థాలూ గంగానదిలోనే ఉన్నాయన్నారు. ఎందుకలా...!!! తీర్థయాత్ర చేసివచ్చాం అంటారు గానీ భగవత్ దర్శన యాత్ర చేసివచ్చాం అనరు. తీర్థయాత్ర అంటే.. మజ్జనం అంటే.. స్నానం. తీర్థంలో స్నానం చేస్తారు. వేదాలకు భాష్యం చెబుతూ పెద్దలు ఒక మాటన్నారు. అంగీరసాది మహర్షులు ఊర్థ్వలోకాలకు వెడుతూ... వెళ్ళేముందు తమ తమ నియమాలను, తపోదీక్షను, తపఃఫలితాన్ని నీటిలో కొన్నిచోట్ల నిక్షేపించి వెళ్ళారు. అవి ఎక్కడ నిక్షేపింపబడ్డాయో అవి తీర్థములు. అటువంటి తీర్థాల్లోకెల్లా గొప్ప తీర్థమేది... అంటే మణికర్ణిక. అది ఎక్కడుంది... గంగానదిలో! మణికర్ణికా వైభవం అంతా ఇంతా కాదు. ‘మణికర్ణికాష్టకమ్’ అని శంకరాచార్యులవారు ఒక అష్టకం చేశారు. ఆయన ఒక నదిని గురించి చెప్పడమే చాలా గొప్ప. సాధారణంగా ఆయన క్షేత్ర ప్రసక్తి తీసుకురారు. అటువంటిది గంగాష్టకమ్, నర్మదాష్టకమ్, యమునాష్టకమ్ చేశారు. ఒక్క మణికర్ణిక మీద ఒక అష్టకమ్ చేశారు. తీర్థం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన ఒక శ్లోకంలో అద్భుతమైన వర్ణన చేశారు. ‘‘కాశీ ధన్యతమా విముక్తనగరీ సాలంకృతా గంగయా/ తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ / స్వర్లోకస్తులితః సహైవ విబుధైః కాశ్యా సమం బ్రహ్మణా/ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’. కాశీ చాలా చాలా గొప్ప నగరం. అసలు కాశీ ఒకసారి వెడితే చాలు.. అనుకుంటాం. కాశీ అంటేనే ప్రకాశం. కాశీ విముక్తనగరి. అంత గొప్పది కాశీ .... ఆ కాశీకి మళ్ళీ అలంకారం గంగానది. తత్రేయం మణికర్ణికా. అక్కడ మణికర్ణికా తీర్థం కూడా ఉంది. దీనికున్న గొప్పదనం ఏమిటంటే – ‘‘మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః/ స్వీయైరబ్ధ శతైశ్చతుర్ముఖధరో వేదార్థ దీక్షాగురుః/యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత/స్త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివమ్’’... మధ్యాహ్నం 12 గంటలవేళ మణికర్ణికాతీర్థంలో స్నానం చేస్తున్న వారికోసం శివకేశవ రూపాల్లో పరబ్రహ్మం పోట్లాడుకుంటుందట... నే తీసుకువెడతా అంటే నే తీసుకువెడతా అని.. ‘నీయందు ఎవరయినా స్నానం చేస్తే వారికి మోక్షం ఇస్తాను’ అని ముక్తిదేవత ఒక సేవకురాలిలాగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటుందట. ఇంతమంది దేవతలతో కూడుకున్న స్వర్గలోకం గొప్పదా? కాశీపట్టణం గొప్పదా ? అని ఒకప్పుడు బ్రహ్మగారికి సందేహం వచ్చిందట. పెద్ద త్రాసు సృష్టించి ఒక పళ్ళెంలో స్వర్గలోకాన్ని మరో పళ్ళెంలో కాశీపట్టణాన్ని, గంగానదిని, మణికర్ణికా తీర్థాన్ని ఉంచాడట...‘‘ కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుత్వం గతః’’ కాశీ బరువుకు అది ఉంచిన పళ్ళెం కిందికి దిగితే.. స్వర్గలోకం ఉన్న పళ్ళెం పైకి తేలిపోయిందట. అటువంటి కాశీ పట్టణం ఉన్న ఈ దేశం గొప్పది, ఇక్కడ పుట్టడం కూడా గొప్ప అదృష్టం కదూ! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నదుల ప్రక్షాళన తప్పదు
దేశంలో పవిత్రమైనవిగా భావిస్తూ వచ్చిన నదులు, వాటి ఉపనదులన్నీ ఇప్పుడు కలుషితమైపోయాయి. గంగానది నీటిలో ఆక్సిజన్ నిల్వ లుండేవని, ఆ నీరు తాగినా, స్నానమాడినా కొన్ని రోగాలను నియం త్రిస్తున్నవని, పరిశోధకులు చెప్పిన మాట ప్రస్తుతం అభాసగా మారిం ది. గంగనీళ్లు తాగినా, వాటితో స్నానం చేసినా అనేక చర్మవ్యాధులు స్వయానా ఆహ్వానించుకుంటున్న వారవుతున్నారని, సంబంధిత శాస్త్రజ్ఞులు చెప్పేమాట. ఇటీవల సుప్రీంకోర్టు, కేంద్రప్ర భుత్వాన్ని హెచ్చరించినప్పటికీ గంగ ప్రక్షాళన ముందడు గు వేయటంలేదు. చితాభస్మం, ఆస్తికలు, పవిత్ర నదుల్లో కలపటం అనాది నుంచి హిందువులు పాటించే ఆచారం. గంగానదిలో పడి చనిపోతే ఆత్మ సరాసరి స్వర్గానికి పోతుందని నమ్మకం. దేశంలోని నదులన్నీ కలుషితమయ్యాయి. జల కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు పర్చాలి. నదీ పరివాహ ప్రాంతాల్లో చితాభస్మం, ఆస్తికలు లాంటి వ్యర్థాలు కలి పితే శిక్షార్హులని ప్రకటించాలి. 21వ శతాబ్దిలో నీరు మరో పెట్రోలియం గా మారుతుందని అభిజ్ఞుల హెచ్చరిక. 2019 నాటికే భారత ప్రజలు మంచినీరు లేక లక్షలాదిగా మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి. ఏవై శెట్టి సీనియర్ పౌరులు, పత్తిపాడు, గుంటూరు -
మన ఆధ్యాత్మిక రాజధాని
కాశీకి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి రైలులో వెళితే (హైదరాబాద్-కాశీకి రైలు మార్గం 1,230 కి.మీ.)ఒకటిన్నరరోజులో చేరుకోవచ్చు. అదే విమానంలో అయితే 3-4 గంటల్లో వెళ్లిపోవచ్చు. రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో కాశీకి వెళ్లి రావడం అంటే పొరుగూరు వెళ్లి వచ్చినంత సులువు. కాని ఒకప్పుడు.. అంటే రెండుమూడు వందల ఏళ్ల క్రితం... కాలినడకన ప్రయాణం కాశీకి పోవటం అంటే కాటికిపోవటంతో సమానమే అనేవారు. అంటే ఆ రోజుల్లో భద్రతలేని కారణంగా కాశీ వెళ్లినవారు క్షేమంగా ఇంటికి చేరేవారు కారు. కానీ, కాశీ పుణ్యరాశి. వరుణ-అసి నదుల సంగమస్థలి. భారతీయులకు అత్యంత పవిత్ర తీర్థస్థానం. కాబట్టి కాశీ వెళ్లి తీరాల్సిందే! కాని వాహనసదుపాయం లేని రోజులవి. కాలినడకనే ప్రయాణం. కొండకోనలు, నదీప్రవాహాలు, దుర్భేద్యమైన అడవులు, క్రూరమృగాలు, దారిదోపిడీలు... అన్నింటినీ దాటుకొని కాశీ చేరేసరికి ఎన్నో గండాలు. అన్నదాన సత్రాలలో భోజనాలు.. లేదంటే ఉపవాసాలు... అడవుల గుండా ప్రయాణించేటప్పుడు కాయగసరే మహాప్రసాదాలు. అందుకే జీవితంలో అన్ని బాధ్యత లూ తీరిన 60 ఏళ్లకు పైబడినవారే కాశీ ప్రయాణమయ్యేవారు. 1800 ప్రాంతంలో! ఏనుగుల వీరాస్వామయ్య, ఆయన బంధుగణం, పరిజను లు సుమారు వందమందితో కలిసి మద్రాసు నుండి బయలుదేరి తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాద్, నాగపూర్, ప్రయాగల మీదుగా కాశీ వెళ్లారు. అప్పటికి రోడ్లు కూడా సరిగా లేవు. ప్రయాణం ఎక్కువగా పల్లకీలు మోసే బోయీల ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. యాత్రాఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోకుండా 40 బిందెల గంగాజలాన్ని 10 గుర్రాల మీద చెన్నైకి పంపించే ఏర్పాటు చేయించాడట. 15 నెలలు సాగిన ఆ ప్రయాణపు రోజులను ‘కాశీయాత్రా చరిత్ర’గా గ్రంథస్థం చేశారు. ఆ తరువాతి సంగతులకొస్తే- ఇప్పటికి సరిగ్గా వందేళ క్రితం రచయిత చెళ్లపిళ్లవెంకటశాస్త్రీ కాశీ వెళ్లిన తన అనుభవాలను పుస్తకంగా తీసుకొచ్చారు. ఐతే ఈయన కాలానికి పరిస్థితులలో మార్పులు వచ్చాయి. బ్రిటీషువారి హయంలో రైలు-పడవలు వంటి ప్రయాణ సాధనాలు ఉన్నాయి. గంగానదికి వరదలు వస్తే బల్లకట్టువేసి బండ్లు దాటించేవారనీ, ఎద్దు లు నడవకపోతే బండివాడే కాడి భుజానికి ఎత్తుకునేవాడ నీ, మిగతావారు కాలినడకన సాగేవారని.. తెలియజేశారు. తిరిగొస్తే పండగే! కాశీ వెళ్లిన వారు తిరిగి ఊరు చేరుకున్నారంటే.. వారిని సాక్షాత్తు భగవత్స్వరూపులుగా భావించేవారు. మేళతాళాలతో ఎదురెళ్లి, ఇంటికి తీసుకెళ్లి, పెద్ద పండగ చేసుకునేవారు. వెళ్లిన వారు తమ ప్రయాణపు అనుభవాలను చెబుతుంటే ఆ అనుభూతిలో తామూ ప్రయాణించేవారు. ఆ రోజుల్లో కాశీ చేరాలనే సంకల్పం రైలు, విమాన ప్రయాణాలను మించిన ధైర్యాన్ని కలిగించేది. ఇప్పటికీ కొంతమంది కాలినడకన కాశీ చేరేవారున్నారు. అయితే నేడు వారి ప్రయాణానికి భరోసానిచ్చే అనేక మార్గాలున్నాయి. - నిర్మలారెడ్డి