శివప్రీతికర క్షేత్రం... ముక్తిధామం | Kashi Vishwanath JyotirLinga Temple | Sakshi
Sakshi News home page

శివప్రీతికర క్షేత్రం... ముక్తిధామం

Published Sun, Nov 17 2013 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

Kashi Vishwanath JyotirLinga Temple

ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రంగా విఖ్యాతిగాంచిన కాశీక్షేత్ర మహిమ, విశ్వనాథలింగ విశిష్టత విశేషమైనవి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ నిరంతరం శవదహనం జరుగుతూనే ఉంటుంది. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి మహాశ్మశానమని పేరు వచ్చింది. గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీనగరంతో సమానమైన మహానగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదని పురాణాలు చెబుతున్నాయి.

పురాతన శైవాధామాలలో ఒకటైన కాశీ సకల పాతక నాశినిగా, జ్ఞానప్రదాయినిగా, ముక్తిదాయినిగా పేరు గాంచింది. పావన గంగానదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శివపురి, ముక్తిభూమి, తపఃస్థలి, అవిముక్త్, వారణాసి తదితర పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ దివ్య ఈ క్షేత్రం గురించి కాశీఖండంలో ప్రముఖంగా ప్రస్తావించారు. గంగానదీమతల్లి ధనుస్సు ఆకారంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోనే ‘వరుణ’, ‘అసి’ నదులు గంగలో కలుస్తాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి వారణాసి అని పేరొచ్చింది. ఇక్కడ మూడువేల సంవత్సరాల క్రితం ‘కాశీ’ జాతివారు నివసించేవారు.

అందువల్ల దీనికి కాశీ అని పేరొచ్చింది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీనగరం నిర్మించబడిందని పురాణ కథనం. పురాతన కాలంలోని ఆలయాన్ని శివభక్తురాలైన అహల్యాబాయి హొల్కర్ 1777లో తిరిగి నిర్మించగా, పంజాబ్ కేసరి మహరాజా రణ్‌జీత్ సింగ్ ఈ ఆలయంపై బంగారు రేకును తాపడం చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కాశీక్షేత్రంలో కొలువైన కాశీవిశ్వనాథ లింగదర్శనం సర్వపాపహరణం. శివకైవల్య ప్రాప్తికి మూలం.

గర్భాలయంలో కొలువైన విశ్వేశ్వరలింగం పరిమాణంలో చిన్నదైనప్పటికీ, ఫలితాన్నివ్వడంలో మాత్రం పెద్దది. ఈ పవిత్రక్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. సనాతన బ్రహ్మ మొదట నిర్గుణం నుంచి సగుణ శివరూపధారణ చేశాడు. తిరిగి శివశక్తి రూపంలో స్త్రీ పురుష భేదంతో రెండు రూపాల ధారణ చేశాడు. ప్రకృతి పురుషుడు (శక్తి- శివుడు) ఇద్దరినీ శివుడు ఉత్తమ సృష్టి సాధనకై తపస్సు చేయమని ఆదేశించాడు. తపస్సుకై ఉత్తమ స్థానం ఎంపిక చేశాడు.

అప్పుడు నిర్గుణ శివుడు తన నుంచి సమస్త తేజస్సును ప్రోదిచేసి అత్యంత శోభాయమానమైన పంచకోశ నగరాన్ని నిర్మించాడు. అక్కడ స్థితుడైన విష్ణువు ఎంతోకాలం నుంచి శివునికై తపస్సు చేశాడు. అతని శ్రమ ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి విస్మయం చెందిన విష్ణువు తల ఆడించగా ఆయన చెవి నుంచి ఒక మణి కింద పడింది. అప్పటినుంచి ఆ స్థానం మణికర్ణికగా పేరుగాంచింది.

మణికర్ణిక ఐదుక్రోసుల విస్తారం గల సంపూర్ణ జలరాశిని శివుడు తన త్రిశూలంతో బంధించాడు. దానిలో విష్ణువు సతీసమేతంగా నిదురించాడు. శివుని ఆజ్ఞమేరకు విష్ణువు నాభినుంచి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ ద్వారా అద్భుత సృష్టి జరిగింది.  బ్రహ్మ, విష్ణు పరమేశ్వరుల ద్వారా శాసించబడే ఈ నగరంలో దేవతలు కూడా శివకేశవుల దర్శనం కోరుకుంటారు. మోక్షప్రదాయిని అయిన ఈ క్షేత్రంలో చేసిన ఏ సత్కార్యమైనా సహస్ర కల్పాలలో కూడా క్షయం కాదు.
 
బనారస్ అనే పేరు ఎందుకంటే..? బనారి నామధేయుడైన ఒక రాజు ఈ తీర్థస్థానపు వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు. అందువల్ల ఆయన పేరుమీదుగా కాశీని బనారస్ అని కూడా పిలుస్తారు. బనారస్‌లో పదిహేనువందల దివ్య ఆలయాలున్నాయి. కాశీలోని గంగాజలాన్ని రామేశ్వర క్షేత్రాన ఉన్న రామేశ్వర లింగానికి అభిషేక జలంగా వినియోగిస్తారు. కాశీనగరంలో కాలభైరవుడు శునకవాహనుడై గస్తీ తిరుగుతుంటాడని ప్రతీతి.

ఈ నగరం బ్రహ్మ సృష్టి కాకపోవడం వల్ల బ్రహ్మ ప్రళయానికి ఇది నశించదు. అలాగే గంగానదీ తీరాన కాశీక్షేత్రాన 64 స్నానఘట్టాలున్నాయి. ఇవి ఎంతో ప్రసిద్ధి చెందాయి. అసీఘాట్, దశాశ్వమేద ఘాట్, వర్ణ సంగమ, పంచగంగ, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లు ముఖ్యమైనవి. ఈ దివ్యక్షేత్రాన 59 శివలింగాలు, 12 సూర్యనారాయణమూర్తులు, 56 వినాయకులు, 8 భైరవులు, 9 దుర్గామాతలు, 13 నరసింహులు, 16 కేశవాలయాలున్నాయి. వీటిలో బిందుమాధవుడు, డుండి విఘ్నేశ్వరుడు, దండి పాణేశ్వరుడి ఆలయాలు ముఖ్యమైనవి.

కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగాలలో హరిశ్చంద్రాది మహారాజులతోపాటు రామాయణ భారత భాగవత ప్రాశస్త్యం గల అపురూప క్షేత్రమిది. మోక్షపురాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో అమ్మవారు విశాలాక్షి అక్షత్రయంలో ఒకటి , అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. మాతా అన్నపూర్ణేశ్వరాలయం కూడా ఈ క్షేత్రంలోనే ఉంది. కాశీపుణ్యక్షేత్రం విశ్వేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలోని అతి పవిత్రమైన స్థానాలు. కాశీక్షేత్రంలో మరణం, అంతిమ సంస్కారం ముక్తిమార్గాలుగా భావిస్తారు. కాశీక్షేత్ర సందర్శనం, కాశీవిశ్వనాథుని దర్శనం పూర్వజన్మల పుణ్యపలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు అంటుంటారు.  
 
 - దాసరి దుర్గాప్రసాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement