మా బుజ్జిగాడూ... దేవుడు మెచ్చే నా అబద్ధాలు!! | Our bujjigadu ... God love all my lies !! | Sakshi
Sakshi News home page

మా బుజ్జిగాడూ... దేవుడు మెచ్చే నా అబద్ధాలు!!

Published Sun, Nov 30 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

మా బుజ్జిగాడూ... దేవుడు మెచ్చే నా అబద్ధాలు!!

మా బుజ్జిగాడూ... దేవుడు మెచ్చే నా అబద్ధాలు!!

మా బుజ్జిగాడి సబ్జెక్టుల్లోని ఈవీఎస్ (ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్) నా కొంపముంచడానికే ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మనం అనుకోనిది జరగడమే కదా దైవలీల. సరిగ్గా వాడి కంప్లయింట్ కూడా దైవలీల గురించే. దేవుడి వరస ఏమీ బాగాలేదన్నది వాడి వాదన. ఇంతకీ వాడు చెప్పినదేంటంటే...
 
‘‘నాన్నా... సీతాకోకచిలుకలకు బుజ్జిబుజ్జి సీతాకోకచిలుకలు పుట్టవటకదా? ఇవ్వాళ్ల మాకు సైన్సుపాఠంలో చెప్పారు. అవి గుడ్లు పెట్టాక మనం చూడ్డానికి అసహ్యంగా కనిపిస్తూ ఉండే, లార్వాలు అని పిలిచే గొంగళిపురుగులు పుడతాయటకదా? దోమల విషయంలో కూడా అంతేనట. వాటి లార్వాలూ అసహ్యంగా ముడుచుకుంటూ నీళ్లలో ఈదుతూ ఉంటాయట. దేవుడి పనితీరు అంతా అస్తవ్యస్తంగా ఉంది నాన్నా ’’ అన్నాడు వాడు.

 ‘‘అవి గొంగళిపురుగులైతే నీకొచ్చిన నష్టం ఏముందిరా. ఆ తర్వాత ప్యూపా దశ దాటాక అవే మళ్లీ సీతాకోకచిలుకలైపోతాయి కదా?’’ అన్నాన్నేను.
 ‘‘ఇప్పుడూ... మన గేదెకు పుట్టిన చిన్ని దూడ, మన ఆవుకు పుట్టిన తువ్వాయీ... వాటిని చూడు... ఎలా చలాగ్గా, చురుగ్గా గంతులేస్తూ తిరుగుతూ ఉంటాయో?! వాటి తల్లులు కూడా దూకుతూ ఉండే ఆ చిన్నారి కూనల్ని నాకుతూ మురిసిపోతూ ఉంటాయి. అంతెందుకు, నేను చూడటానికి ఇష్టపడని హైనాల చిన్నారి కూనలూ చిన్నప్పుడు అందంగా ఉంటాయి. అలాంటి అదృష్టం తల్లి సీతాకోకచిలుకలకు వద్దా? అవేం పాపం చేశాయి? వాటి పిల్లల్ని ముద్దు చేసుకోవద్దా? దేవుడి పద్ధతేమీ బాగా లేదు’’అంటూ భగవంతుణ్ణి కాస్త కోప్పడ్డాడు. అంతేకాదు, ఒకింత అలిగి... ‘‘ఇందుకు నిరసనగా... ఓ రెండ్రోజుల పాటు నేను దేవుడికి దణ్ణం పెట్టను ఫో’’ అన్నాడు.
 ‘‘దేవుడేం చేసినా తప్పకుండా దానికో పర్పస్ ఉంటుంది నాన్నా’’ అంటూ సముదాయించబోయాన్నేను.
 ‘‘ఏముంటుంది? గతేడాది నువ్వు చెప్పినట్టు కాకులకు మ్యాథ్స్ రాదంటే అందులో ఓ అర్థం ఉంది. కోకిల తన గుడ్లను కాకి గూడులో పెడుతుంది కాబట్టి... వాటిని లెక్కించగలిగితే కోకిల బిడ్డలను కాకి పెంచదు కాబట్టి... కాకులెంత తెలివైనవైనా దేవుడు వాటికి మ్యాథ్స్ రాకుండా చేశాడు. లాస్టియర్ ఈవీఎస్‌లోని ‘బిజీమంత్’ లెసన్ చెబుతూ నువ్వు చెప్పిన మాటే ఇది. కానీ సీతాకోకచిలుకలకు డెరైక్ట్‌గా చిన్ని చిన్ని - బుజ్జి బుజ్జి సీతాకోకచిలుకలు పుడితే అవి మరింకెంత అందంగా ఉండేవో కదా? అలాగే, చిన్నారి దోమకూనల్ని చూసి ఎన్ని ముద్దులు పెట్టేవో కదా ఆ తల్లిదోమలు?’’ అంటూ ఎంతో బాధపడ్డాడు వాడు.
 వాణ్ణి ఎలా సమాధానపరచాలో అర్థం కాలేదు నాకు. ఏదో రకంగా ఓదార్చకపోతే వాడు అన్నం కూడా తినడు. అందుకే లాస్టియర్ కాకి మ్యాథ్య్‌లో పూర్ అన్న లాజిక్ లాగానే ఈసారి కూడా ఏదో ఐడియా వేద్దామని అనుకున్నా. ముందు ఏమీ తోచలేదు గానీ తర్వాత గబుక్కున ఓ ఐడియా వచ్చింది. నేను చెప్పేవి కాస్త అబద్ధాలైనా పెద్దయ్యాక సత్యం వాడే తెలుసుకుంటాడనుకున్నా. అదీగాక... ఆపద వేళల్లో బొంకడం తప్పుకాదనే సూత్రం ఆధారంగా ఆ అబద్ధాలు చెప్పేశా. అవేమిటో మీరూ వినండి.
 ‘‘అది కాదురా... ఇప్పుడూ మనుషుల బిడ్డలు పుట్టగానే ఎప్పుడైనా చూశావా? ఆ చిన్నారుల చుట్టూ గట్టిగా బట్టలు కప్పుతారు కదా! అలాగే చిన్ని చిన్ని బిడ్డలకు ఒళ్లంతా పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు తొడుగుతారు. ఎందుకంటే వాళ్ల సున్నితమైన శరీరం బయటి వాతావరణానికి తట్టుకోలేదు కదా. ఈ సీజన్‌లో నువ్వు అమ్మను రగ్గు కప్పమని అడుగుతావు చూడు, అలాగన్నమాట. మరి సీతాకోకచిలుక పిల్లలు రగ్గు కప్పుకోలేవు కదా? పైగా ఇప్పుడు చలికాలం. అందుకే వాటికి చలేయకుండా దేవుడు అలా నేచురల్‌గా గొంగళి కప్పేశాడన్నమాట’’ అన్నా.
 ‘‘మరి దోమల పిల్లల్ని తల్లి కూడా ముద్దు పెట్టుకోకుండా నీళ్లలో ఎందుకు వదిలేశాడు?’’ అంటూ మరో పాయింట్ లాగాడు.
 బుర్రగోక్కుని... మరోసారి నా అతితెలివి ఉపయోగించి ఆన్సర్ చెప్పా.
 ‘‘ఎందుకంటే... తల్లి దోమలు తమ పిల్లల్ని ముద్దుపెట్టుకోబోతే పొరబాటున అవి మన రక్తం తాగడానికి ఉపయోగించే ఇంజెక్షన్ లాంటి సూది ఆ చిన్నారి దోమ పిల్లలకు గుచ్చుకుంటుందేమోనని దేవుడి భయం. అందుకే అవి తల్లికి దూరంగా ఉండేలా ఏర్పాటు చేశాడు. అందుకోసమే దోమ లార్వాలను దేవుడు నీళ్ల తొట్టెల్లో పెరిగేలా చేస్తాడన్నమాట. పైగా నీకు స్విమ్మింగ్ పూల్లో ఈదడం ఇష్టం కదా. అలాగే వాటికీ అదే ఇష్టమన్నమాట. ఈ రెండు ప్రయోజనాలూ నెరవేరతాయని దేవుడలా చేశాడన్నమాట’’ అంటూ జవాబు చెప్పా. అప్పుడుగానీ వాడు అన్నం తినడానికి కూర్చోలేదు! ఆ తర్వాత నాతో అలాంటి అబద్ధాలాడించినందుకు నేను కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ‘హా... భగవంతుడా’ అంటూ ఓ నిట్టూర్పు విడిచా!  
 
- యాసీన్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement