దేవుడు కరెంటు బిల్లు కడతాడా?
నవ్వింత
మా బుజ్జిగాడి ఇంటెలిజెన్స్ కాస్త తగ్గితే బాగుండని అనిపిస్తోంది నాకు. వాడి తెలివితేటలు కాస్తా అతి తెలివిలోకి దిగకుండా చూడమంటూ ఆ యొక్క భగవంతుడికి స్పెషల్ ప్రార్థన చేసుకోవాల్సిన అగత్యం దాపురించింది. ఇలా ఎవడైనా అనుకుంటాడా అని మీరు హాస్యర్యపోతున్నారా? మీరు నిలకడగా నా దైన్యవాదాలు వింటే మీకు ధన్యవాదాలు చెప్పుకుందామని ఉంది.
మా ఇంటికి ఓ వసతి ఉంది. కరెంట్ లేనప్పుడు కాసేపు ఆరుబయట ఆకాశంలో చుక్కలు చూస్తూ పడుకోవచ్చు. అలాంటి ఒక రోజున మా బుజ్జిగాడూ నేనూ మంచంపై పడుకుని ఉండగా వాడు ఆకాశంలోని నక్షత్రాలను చూశాడు.
‘‘మొన్న దేవుడెక్కడుంటాడు అని అడిగితే ఆకాశంలో అంటూ పైకి చూపించావు కదా నాన్నా. ఇప్పుడు రాత్రి అయ్యింది కాబట్టి దేవుడు తన ఇంట్లో లైట్లు వేసుకున్నాడు కదా’’ అన్నాడు వాడు నింగిలో మెరుస్తున్న నక్షత్రాలను చూపుతూ.
వెంటనే నక్షత్రాలూ, పాలపుంతలూ, విశ్వనిర్మాణం... వీటన్నింటి గురించీ చెబితే వాడికేం అర్థమవుతుందనే ఉద్దేశంతో ‘‘అవున్నాన్నా’’ అన్నాన్నేను. అంతే... అదే నా పాలిట శాపం అవుతుందని ఆ క్షణంలో అనుకోలేదు. వెంటనే అనుబంధ ప్రశ్నల వెల్లువ మొదలైంది.
‘‘అన్నట్టు నాన్నా... వాళ్లింట్లో కూడా అప్పుడప్పుడూ కరెంట్ పోతే చీకట్లో దేవుడికి చాలా ఇబ్బంది కదా నాన్నా. దేవుడు అప్పుడేం చేస్తాడో?’’ అన్నాడు వాడు. అయితే మావాడి దగ్గర ఉన్న సుగుణం ఏమిటంటే... నేనేం జవాబు చెప్పాలో అని సతమతమయ్యే సమయంలో చాలాసార్లు వాడే సమాధానం కూడా వెతుక్కుంటూ ఉంటాడు.
‘‘ఇప్పుడూ... కొన్ని చుక్కలు బ్రైట్‌గా ఉన్నాయి. అవన్నీ కరెంట్ మీద నడిచే బల్బులు కావచ్చు. మిగతావి డల్‌గా మిణుకు మిణుకుమంటున్నాయి చూడూ... అవి దేవుడి ఇంట్లో ఎమర్జెన్సీ లైట్లు కావచ్చు నాన్నా. దేవుడి ఇంట్లో నిత్యకళ్యాణం పచ్చతోరణం అంటూ మొన్న ఒకసారి అన్నావు కదా. అందుకే దేవుడు ఆకాశం నిండా రోజూ మిర్చిబల్బులూ అలంకరించుకుంటాడనుకుంటా. అక్కడ చూడు కొద్దిగా లైటు కాస్త సాగినట్లుగా ఒక గీతలాగా కనపడుతోంది. అంటే అది దేవుడు వేసిన టార్చిలైటంటావా?’’ అంటూ మళ్లీ అడిగాడు.
‘‘దేవుడికి టార్చిలైట్లూ... సెర్చిలైట్లూ అక్కర్లేదురా. అన్ని లైట్ల వెలుగుకూ ఆయనే మూలం. అన్నింటినీ ఆయనే సృష్టించగలడు’’ అన్నాన్నేను.
‘‘మరి అలాంటప్పుడు దేవుడి ఇంట్లో పవర్‌కట్ ఉండదన్నమాట. అయితే ఇందాక కాసేపు ఆకాశంలో లైట్లన్నీ కనపడకుండా పోయాయి కదా. అంటే అప్పుడు దేవుడి ఇంట్లో కరెంట్ పోయి ఉంటుందంటావా?’’ అని అడిగాడు వాడు.
‘‘అప్పుడూ... దేవుడింట్లో కరెంట్ పోలేదు నాన్నా. మనకు డేై టెమ్‌లో మబ్బులు కనిపిస్తుంటాయే... అవి రాత్రి కూడా ఉంటాయన్నమాట. అవి అడ్డం రావడం వల్ల ఆ టైమ్‌లో అవి మనకు కనిపించలేదంతే’’ అని జవాబిచ్చాన్నేను.
‘‘అలాగైతే నాన్నా... దేవుడికి కరెంట్ బిల్లు చాలా ఎక్కువే వస్తుంది కదా. ఆ కరెంటు బిల్లు ఏ అడ్రస్‌కు వెళుతుందో? మరి దేవుడింటికి వచ్చే కరెంటు బిల్లు ఎవరికి కడతాడు?’’ అడిగాడు.
వాడి ప్రశ్నలకు జవాబిచ్చే ఓపిక లేక.. ‘‘ఒరే దేవుడికి కరెంటు బిల్లేమిట్రా? సకల ప్రపంచానికీ ఆయనే బాస్. ఆయన సర్యాంతర్యామి. అంటే అంతటా వ్యాపించి ఉంటాడన్నమాట. కాబట్టి అన్నిచోట్లా ఉండే ఆయన... ఎవరికీ ఏమీ జవాబుదారీ కాదు. ఎవరికీ పైసా ఇవ్వక్కర్లేదు’’ విసిగిపోయి కాస్త గసిరినట్లుగా అన్నా. అంతే... మళ్లీ ప్రశ్న మొదలు.
‘‘ఇవ్వాళ్లేమో సర్వాంతర్యామి, అన్ని చోట్లా ఉంటాడంటున్నావ్. రోజూ ఒక మంచి పద్యం చదవమని ఏదో ఒకటి చెబుతుంటావ్. అలా మొన్న పోతనగారి పోయమ్ చదివించావ్ కదా. ఆ పద్యంలో ‘అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధం టవర్స్ దాపల, నియర్ మందారాగార్డెన్స్...’ అంటూ పోతన గారు దేవుడి పోస్టల్ అడ్రస్ ఓ క్రమపద్ధతిలో సిస్టమ్యాటిగ్గా రాయలా? అందులో పిన్‌కోడు మాత్రం ఇవ్వలేదంతే. నువ్వే మొన్న చెప్పావ్ కదా... సీఎమ్, పీఎమ్ రాష్ట్రమంతటికీ, దేశమంతటికీ నాయకులైనా ఏదో ఒక చోట వాళ్ల క్యాంపాఫీసు ఉంటుందని. క్యాంపాఫీసుకు కరెంటు బిల్లులు వాళ్లు కడతారా లేదా? అలాగే దేవుడూ కట్టాలా వద్దా?’’ అంటూ నన్ను నిలదీశాడు వాడు.
పుట్టుకతోనే ఈ లోకంలోని సమస్తమైన పిల్లలందరూ అమితమైన తెలివితేటలతో పుడతారు. మనమే క్రమక్రమంగా లౌక్యం నేర్పుతూ వాళ్ల ఇంటెలిజెన్స్‌ను ఇంకిపోయేలా చేస్తూ ఉంటాం. మా బుజ్జిగాడెప్పుడు లౌక్యం కాస్త నేర్చుకుని, వాడి అతి తెలివితేటల్ని కుదించుకుంటాడో అనుకుంటూ దిగులుపడుతూ ఉన్నా. మీరైనా నాలుక్కూకలేసి వాడిక్కాస్త బుద్ధి చెప్పండి.
- యాసీన్
కవ్వింత
ఆ మాత్రం తెలుసు
కస్టమర్: ఏమండీ, ఒక కిలో బంగారం ఇవ్వండి.
సేటు: బాబూ కిలో బంగారం ఎంతో తెలుసా?
కస్టమర్: ఆ మాత్రం తెలియదేంటీ, వెయ్యి గ్రాములు.
నేను చేసేదదే
ఇల్లాలు: ఏమేవ్, పోయేటప్పుడు ఇల్లూడ్చి పోవే అని ఎన్ని సార్లు చెప్పినా వినవే!
పని మనిషి (మనసులో): నేను చాలాసార్లు ఊడ్చుకెళ్లా మీకు తెలియలేదు గానీ.
ఆ పని చెయ్యి
రాము: నేనో పెద్ద వజ్రాల దొంగనని పేరు సంపాదించాలంటే ఏం చెయ్యాలిరా?
సోము: ఆ... కోహినూరు వజ్రం అని ఒకటుంది. దాన్ని దొంగిలిస్తే సరి.
కొత్త కదా
భర్త: ఏరా బంగారం.. వంట అయ్యిందా ఆకలేస్తోంది?
కొత్త భార్య: ఉండండి, వండుతుంటే కరెంట్ పోయింది.
భర్త: కరెంటు పోతేనేం, మనకు కుక్కర్ లేదు కదా.
కొత్త భార్య: అన్నం ఎలా వండాలో టీవీలో చూసి చేస్తున్నానండీ.
భర్త: !!!
ఇంతకీ మీకొచ్చా?
మాస్టారు: ఒరే టింకూ 1+1 ఎంత?
టింకు: రెండు సార్.
మాస్టారు: 2+2 ఎంత?
టింకు: నాలుగు సార్
మాస్టారు: 4+4 ఎంత చెప్పు?
టింకు: ఏంటి సార్... మీకు లెక్కలు రావా? అన్నీ నన్నే అడుగుతున్నారు!!
- దూనబోయిన మల్లికార్జున, అయినాపురం, తూ.గో.జిల్లా