మీసాల పిల్లి గడ్డం పెంచదెందుకు! | What is the justification behind french beard | Sakshi
Sakshi News home page

మీసాల పిల్లి గడ్డం పెంచదెందుకు!

Published Sat, Aug 2 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

మీసాల పిల్లి గడ్డం పెంచదెందుకు!

మీసాల పిల్లి గడ్డం పెంచదెందుకు!

నవ్వింత

 ‘‘మరి నాన్నా... పిల్లి అసలు గడ్డం పెంచనే పెంచదు కదా. మరి చాలామంది మనుషులు గదమ వరకే గడ్డాన్ని పెంచి దాన్ని పిల్లి గడ్డం అంటారెందుకు?’’
 మా వాడి ప్రశ్న.
 మళ్లీ నాకేం చెప్పాలో తోచలేదు.
 ‘పిల్లులు పిల్లలు పెట్టును’ అన్నాడు శ్రీశ్రీ. అదేంటా మాట? మిగతా ప్రాణులేవీ పెట్టనట్టు. కానీ మా బుజ్జిగాడు ఇంచుమించూ  శ్రీశ్రీ అంత తెలివైనవాడేమోనని నా డౌటు. ఒకరోజున వాడడిగిన ఓ  ప్రశ్న, దానికి అనుబంధంగా సాగిన ప్రశ్నోత్తరాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చా. ఇంతకీ ఆ ప్రశ్నేమిటంటే...
 ‘‘నాన్నా... పిల్లులు మీసాలు పెంచుతాయి కదా, మరి గడ్డం ఎందుకు పెంచవు’’ అని. ఆ మాట ‘పిల్లులు గడ్డము పెంచవు’ అన్నట్లుగా అనిపించింది.
 ఒక్కక్షణం పాటు ఏం చెప్పాలో తోచలేదు. వెంటనే రోజూ మా ఇంటికి వచ్చి పాలు తాగే పిల్లి గుర్తొచ్చింది.
 ‘‘పిల్లి పాలు తాగుతున్నప్పుడు చూశావు కదా! మీసాలు పాల లెవల్‌కు పైనే ఉంటాయి. కానీ అదే పిల్లికి గడ్డం ఉండింటే అది పాలలో మునిగి తడిసిపోయేది కదా. అలా తన ఆహారం కలుషితం కాకుండా ఉండటానికి పిల్లులు గడ్డాలు పెంచవన్నమాట’’ అని జవాబిచ్చాను.
 అంతటితో ఆగిపోలేదు నేను. చిన్నప్పుడు మా అమ్మ నాకు చెప్పిన కథలు వాడికీ చెప్పాలని అనిపించింది.
 ‘‘పిల్లీ... పులీ ఈ రెండూ మేనమామ, మేనత్త పిల్లలంట. పిల్లి అన్ని విషయాల్లోనూ పులికి గురువంట. పులికి అది అన్నీ నేర్పింది గానీ చెట్టెక్కడం నేర్పలేదట. దాంతో పులికి విపరీతంగా కోపం వచ్చి, దాన్ని కొట్టిందట. అందుకే పిల్లి ఎప్పుడు, ఎక్కడ మలవిసర్జన చేసినా పులికి తన అడ్రసు తెలియకుండా ఉండేందుకు మలాన్ని కప్పిపెడుతూ ఉంటుందట’’ అని కథ చెప్పాను.
 ‘‘పిల్లీ, పులీ... రెండూ కజిన్స్ కదా. మరి అలాంటప్పుడు చిరుతపులి కూడా కజినే కావాలి కదా. అవి చెట్లు బాగానే ఎక్కుతాయి కదా. మరి వాటికి నేర్పి, పులికి నేర్పకపోవడం పక్షపాతమే కదా’’ అంటూ న్యాయమడిగాడు వాడు.
 ఏదో కథల పరంపర అలా కొనసాగుతూ ఉంటుందనీ, ఈ వారసత్వ సంపదతో వాడు పరిపుష్టమవుతాడనీ ఆశపడ్డాను కానీ వాడు అనుబంధ ప్రశ్నలతో నన్ను ఇబ్బంది పెడతాడనుకోలేదు.
 ‘‘ఇప్పుడు నాకొకటి అనిపిస్తోంది నాన్నా. పిల్లి అలా పులికి భయపడటానికి నువ్వు చెప్పిన కారణం కరెక్టుగా లేదు. నా ఊహ ప్రకారం... సింహానికి గడ్డం పెంచుకొమ్మని పిల్లే దానికి సలహా ఇచ్చి ఉంటుంది. దాంతో అది జూలు విపరీతంగా పెంచుకుంది.
 
 పిల్లి మాత్రం ‘అడ్డముగ పెరిగిన గడ్డము గ్లామరుకడ్డము’ అంటూ తను క్లీన్‌షేవ్‌తో ఉంది. అలా జూలూ, జులపాలూ ఉంచుకుని గ్రూమింగ్ చేసుకునే అవకాశం తనకు ఇవ్వకపోవడంతో అపార్థం చేసుకుని సింహమే పిల్లిని కొట్టి ఉంటుంది’’ అంటూ  పిల్లి దెబ్బలు తినడానికి సహేతుక కారణాల అన్వేషణ కొనసాగించాడు వాడు. అంతలోనే మళ్లీ ఓ ప్రశ్న అడిగాడు.
 ‘‘మరి నాన్నా... పిల్లి అసలు గడ్డం పెంచనే పెంచదు కదా. మరి చాలామంది మనుషులు గదమ వరకే గడ్డాన్ని పెంచి దాన్ని పిల్లి గడ్డం అంటారెందుకు?’’
 మళ్లీ నాకేం చెప్పాలో తోచలేదు.
 ‘‘మనుషులు తమ అజ్ఞానంతో లేని క్వాలిటీలను తమకు తోచినట్లుగా ఇతరులకు ఆపాదిస్తుంటార్రా. దాంట్లో ఒకటే ఈ పిల్లి గడ్డం, పిల్లినడక. ర్యాంప్‌వాక్‌లో స్టైలిష్ ఆడాళ్లంతా పిల్లినడక నడుస్తారు. అదే స్టైలు పొంగిపొరలి అది మూతి చుట్టూ వెంట్రుకల రూపంలో పెరిగేలా మగాళ్లు పిల్లి గడ్డం పెంచుతారు. దాన్నే ఫ్రెంచ్‌కట్ అంటార్రా’’
 ‘‘పిల్లి అసలు తాను పెంచనే పెంచని గడ్డాన్ని - ఫ్రెంచ్ వాళ్లు తమదని ఎందుకు  చెప్పుకున్నారు నాన్నా?’’ అంటూ మరో ప్రశ్న సంధించాడు మావాడు.
 ఆన్సర్ కోసం తడుముకుంటూ ఉంటే మళ్లీ వాడే ఏదో ఊహించి చెప్పాడు.
 ‘‘మన దేశం నుంచి ఏదో ఒకటి లాక్కోడం మిగతాదేశాల వాళ్లకు ఇష్టమైన పని కదా నాన్నా. మా హిస్టరీ లెసన్‌లో ఉంది. ఇంగ్లాండూ, ఫ్రెంచ్ వాళ్లు మన దేశాన్ని ఆక్రమించుకోడానికి వచ్చి వాళ్లలో వాళ్లు యుద్థాలు చేసుకుంటూ, మనవి ఎప్పుడూ  ఏవో ఒకటి లాక్కుంటూ ఉండేవాళ్లట. ఇంగ్లాడు వాడు నెమలి సింహాసనాన్ని  లాక్కున్నాడు కదా.

దానికి పోటీగా ఫ్రెంచువాడూ ఏదైనా లాక్కుందామనుకున్నాడు కాబోలు. అందుకే అప్పట్లో ఫ్రెంచివాడు ఇంగ్లాండు వాళ్ల నెమలికి పోటీగా మన పిల్లిని పట్టుకుని దాని పేరిట ఉన్న ఫ్యాషన్‌ను తన సొంతమని చెప్పుకున్నాడు. అందుకే పిల్లికి గడ్డం లేకపోయినా దేవతావస్త్రాల్లా ‘ఫ్రెంచ్ కట్’ అనే మాట మాత్రం మిగిలిపోయుంటుంది నాన్నా’’ అన్నాడు. ఈ లాజిక్‌లను రచనల్లో పెడితే వీడు కూడా రేపు దాదాపుగా శ్రీశ్రీకి ఇంచుమించూ అటుఇటుగా తయారవుతాడేమోనని అనుకుంటూ గడ్డం గోక్కుంటూ ఒక ఆందోళనానందం ప్రవాహంలో మునిగిపోయాన్నేను. ఆందోళనెందుకంటే ఎంత నా కొడుకైనా సరే వాడు శ్రీశ్రీని మించకూడదు కదా... అందుకు!
 - యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement