పొట్ట పట్టా పొందితే వాడిక పొట్టభద్రుడే!
నవ్వింత
మా రాంబాబు పరమ రెటమతస్తుడని తెలుసు. వాడిలోని పిడివాది ఇంత ఉద్ధృతంగా ఉంటాడన్న విషయం, వాడికి ఓ సలహా ఇచ్చేదాకా నాకు తెలియరాలేదు.
‘‘ఒరే రాంబాబూ... పొట్ట కాస్త ముందుకొస్తున్నట్టుంది. కాస్త ఏ వాకింగో, ఎక్సర్‌సైజో చేయ్‌రా బాబూ’’ అన్నా. అంతే! నన్ను సెక్షన్ నుంచి క్యాంటిన్‌కు తీసుకెళ్లి, చూపించాడు విశ్వరూపం.
‘‘అన్నానికి, దేహానికి జరిగిన ఓ సమరంలో/ అరగడానికీ పెరగడానికీ మధ్యన సంగ్రామంలో/ బెల్టు కట్టుకీ కట్టుబడనిదీ పొట్ట / బస్కీలకూ మెల్టుకానిదీ పొట్ట/ ఇది ఆ దైవమే ఇచ్చిన పొట్టా... అది పెరిగితే తప్పా... తప్పా... తప్పా... నో... నెవర్ ’’ అంటూ సాక్షాత్తూ గ్యాస్ట్రిక్ చౌదరి అవతారం ఎత్తేశాడు.
‘‘ఒరే... ఒరే... తెలీక సలహా ఇచ్చా. వదిలెయ్...’’ అని ప్రాధేయపడితే ఉగ్రావతారం విరమించినా శాంతావతారంలోకి వచ్చే ముందు మరికాసేపు ఆవేశపడ్డాడు.
‘‘ఒరేయ్... పొట్ట కాస్త పెరగ్గానే ప్రతివాడూ సలహాలిచ్చేవాడే. అసలు పొట్టా... దాని మహత్యమేమిటో తెల్సా?’’
‘‘తర్వాత చెబుదువుగానీ’’ అంటూ తప్పించుకోడానికి చూశాగానీ... నేనే తెచ్చుకున్న తంటా కాబట్టి వీలు కాలేదు.
‘‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అనే వాడుక మాట విన్నావా? పోనీ వాడికి డొక్కశుద్ధి ఉందండీ అనే నానుడి? మన పూర్వపు రోజుల్లో పొట్ట విజ్ఞానానికి చిహ్నంగా ఉండేదని తెలియడం లేదూ! క్రమంగా అక్షరాలూ, విజ్ఞానం మెదడులో ఉంటాయని ఆధునిక విజ్ఞానశాస్త్రం తేల్చింది కాబట్టి క్రమంగా జ్ఞానానికి పొట్టే కేంద్రమన్న పాత సిద్ధాంతం కొట్టుకుపోయి బ్రెయిన్ సెంట్రిక్ సిద్ధాంతం వచ్చింది. భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మే వాళ్లలా నేనూ ఇప్పటికీ పొట్టే జ్ఞానానికి కేంద్రమనీ, దాన్ని నింపుకోవడం వల్లనే జ్ఞానం వృద్ధి అవుతుందనీ నమ్ముతున్నా.’’ అన్నాడు.
‘‘సరే సరే... ఇకపై నేనూ నమ్మడానికి ప్రయత్నిస్తాన్లే’’ అంటూ వాడిని శాంతపరచడానికి మళ్లీ విఫలయత్నం చేశా.
‘‘పెరిగిన పొట్ట ఒక విజ్ఞానభాండాగారమే కాదు... అది ఒక కళారూపం’’
‘‘పొట్ట కళారూపం ఏమిట్రా? నీకు మతిగానీ పోయిందా?’’
‘‘పొట్టపెరిగిన వాణ్ణి ఎప్పుడైనా చూశావా? అంతకుముందు వాడెప్పుడూ తన పొట్టను తానే గమనించడు. కానీ పొట్టంటూ పెరిగాక వాడిలోని ఘటవాద్యకారుడు బయటికి వచ్చేస్తాడు. వేళ్లతో, చేతులతో దానిపై దరువేస్తూ అప్పటివరకూ తనలో నిశ్శబ్దంగా నిబిడీకృతమై ఉన్న అంతర్గత కళాకారుణ్ని బయటకు తీస్తాడు. అలాంటి పొట్ట మీద అనవసరంగా కామెంట్లు చేసి కళాకారుడు పుట్టకముందే వాడిలోని ప్రతిభను దయచేసి తొక్కేయకండ్రా. ప్లీజ్’’ అన్నాడు.
‘‘నీ పొట్టలాగే నీకు మరీ జ్ఞానం కూడా పెరిగి అది వెర్రితలలు వేస్తోంది’’ అంటూ కాస్త కేకలేయబోయా.
‘‘డొక్క చించి డోలు కట్టడం అన్న వాడుక ఎప్పుడైనా విన్నావా, లేదా? అంటే ఏమిటీ? డొక్కలో ఘటవాద్యం, డోలూ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డొక్కకూ, డోలుకూ సంబంధం ఉంది కాబట్టే ఆ సామెత పుట్టింది. ఇన్ని తార్కాణాలూ, దృష్టాంతాలూ ఉన్నా అజ్ఞానులు నమ్మర్రా. అంతెందుకు ఎవడైనా బాగుపడటానికి కారణం వాడి పొట్టే’’
‘‘బాగుపడటానికీ పొట్టకూ సంబంధం ఏమిట్రా రాంబాబూ?’’
‘‘ఎవడైనా బాగుపడాలనుకుంటే వాడు పొట్టచేతపట్టుకుని పోయి, పొట్ట తిప్పలు పడి పొట్టపోసుకుంటాడు. ఇలాంటివాడే జీవితంలో పైకొస్తాడు. బాగుపడేవాళ్ల పొట్ట కొట్టకండ్రా ప్లీజ్’’ అన్నాడు మళ్లీ ఆవేశం పెంచుకుంటూ.
‘‘ఒరే నువ్వొక్కడివే పొట్టను ఇలా వెనకేసుకొస్తున్నావ్. ఆరోగ్యానికి పొట్ట అంత మంచిది కాదు తెల్సా?’’
‘‘నాకు చెప్పకు. పొట్ట ఉంటే టక్కు బాగా కుదుర్తుందని చిరుపొట్టకోసం చాలామంది యూత్ ఏవేవో ప్రయాసలు పడతారు. నువ్వెప్పుడైనా పొట్టగలవాడు మోటార్‌సైకిల్ నడుపుతుంటే చూశావా? బండి పెట్రోల్ ట్యాంకు మీద ఓ కుండను జాగ్రత్తగా పెట్టుకుని, కాళ్లూ చేతుల మధ్య దాన్ని దొర్లిపోకుండా ఉంచుకున్నట్లుగా వెళ్తుంటారా పొట్టగలవాళ్లూ! అంతెందుకు వయసు పెరుగున్నకొద్దీ ఏ చదువూ, ఏ డిగ్రీలూ లేకుండానే లోకమనే ఈ విశ్వవిద్యాలయంలో ఒక పరిణతి చెందిన డిగ్రీ ఇచ్చి ఒకణ్ణి పొట్టభద్రుణ్ణి చేస్తుందిరా ఈ జీవితం. కాబట్టి దాన్ని కించపరచకు. వాకింగులంటూ, వ్యాయామాలంటూ సలహాలిచ్చి ఎవ్వడి పొట్టనూ పొట్టనబెట్టుకోకు’’ అంటూ వార్నింగిచ్చాడు మా రాంబాబుగాడు.
రాంబాబు ధోరణేమిటి ఇలా పెడసరంగా ఉంది చెప్మా అంటూ కాస్త వాకబు చేశాక విషయం తెలిసింది. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గలేదట వాడికి. అందుకే ఇలా సమర్థింపుల్లోకి దిగాడట. కొంతమంది అంతే... ఏదైనా వదిలించుకోవడం కుదరకపోతే అదే ఎస్సెట్టంటూ ఎదురుదాడికి దిగుతారు. బట్టతల తప్పదని తెలిశాక దాన్ని సమర్థిస్తూ మాట్లాడినట్టు. వాడూ ఇదే బాపతు. ఏం చేస్తాం. ఎంతైనా మా ఫ్రెండు కదా. వాడి గురించి ఎవడికైనా చెబుదామని అనిపించినా... కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని సెలైంటయిపోయా.
- యాసీన్