మా రాంబాబు గాడూ, పులీ... సేమ్ టు సేమ్! | Our rambabu become tiger, same to same | Sakshi
Sakshi News home page

మా రాంబాబు గాడూ, పులీ... సేమ్ టు సేమ్!

Published Sun, Dec 21 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

మా రాంబాబు గాడూ, పులీ... సేమ్ టు సేమ్!

మా రాంబాబు గాడూ, పులీ... సేమ్ టు సేమ్!

నవ్వింత: ఈ మధ్య మా రాంబాబు గాడి ఆరోగ్యం పాడైంది. అప్పట్నుంచి వాడి మాటలన్నీ చిత్రంగా ఉంటున్నాయి. వాడు చెప్పేవన్నీ పరమ సత్యాలే. దాంతో వినేవారికి ఒకింత ఇబ్బందిగానూ, మరీ మాట్లాడితే వెటకారంగానూ అనిపిస్తున్నాయి. ఒక రోజున వాడూ, నేనూ రోడ్డు మీద పోతున్నాం. దార్లో నాకు తెలిసిన మిత్రుడొకడు కనిపించి నన్ను విష్ చేశాడు. ఏదో లోకం పోకడ కొద్దీ నేను వెంటనే మా రాంబాబుగాణ్ణి వాడికి పరిచయం చేశా. అంతే! వాళ్ల మధ్య జరిగిన సంభాషణ నా మిత్రుణ్ణే కాదు, పరిచయం చేసిన పాపానికి నన్నూ బోల్డంత ఇబ్బంది పెట్టింది. ‘‘ఏం సార్... ఎలా ఉన్నారు?’’ అంటూ ముఖమంతా నవ్వులమయం చేసుకుని స్నేహాన్ని పెంచుకునే దృష్టితో దగ్గరితనాన్ని ప్రదర్శిస్తూ మా రాంబాబుగాణ్ణి అడిగాడు నా మిత్రుడు.

 ‘‘ఏదో జస్ట్ యావరేజిగా ఉన్నాలెండి’’ అన్నాడు వాడు. ‘‘మీరేం చేస్తున్నారు సార్’’ మళ్లీ అడిగాడు నా స్నేహితుడు. ‘‘ఒళ్లు చేస్తున్నాను’’ అని జవాబిచ్చాడు రాంబాబు. దాంతో మా స్నేహితుడు  దెబ్బతిన్నట్టు నా వైపు చూశాడు. అతణ్ణి పక్కకు తీసుకెళ్లి... ‘‘ఈమధ్య రాంబాబు ఆరోగ్యం దెబ్బతింది. అప్పుడేవో మందులు వాడితే వాటి సైడ్‌ఎఫెక్ట్‌గా లావెక్కాడు. వాడిదంతా ఏదీ దాచుకోకుండా ఫ్రాంక్‌గా చెప్పే తత్వం కాబట్టి నువ్వేమీ అనుకోకు’’ అంటూ సర్దిచెప్పి పంపించా.
   
 మరో రోజున మా రాంబాబు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ మా ఇంటి వైపు వస్తుంటే, ‘‘ఎక్కణ్ణించి వస్తున్నావురా’’ అన్నా. వాడు గాఢంగా నిట్టూర్చి... ‘‘హు... అద్దం బద్దలైంది. మూడు ముళ్ల బంధం పటాపంచలైంది. అందుకే మెకానిక్ దగ్గరికి వెళ్లి వస్తున్నా’’ అంటూ అర్జంటుగా వెళ్లిపోయాడు. వెంటనే నా గుండెల్లో రాయి పడింది. ‘వీడేమైనా ఇంట్లో వాళ్లావిడతో గొడవపడ్డాడా? అయినా గొడవ మరీ ముదిరితే సరిదిద్దుకోదలచుకుంటే సైకాలజిస్టు దగ్గరికెళ్లాలి, విడిపోదలచుకుంటే లాయర్ దగ్గరికెళ్లాలి. అంతేగానీ ఇలా మెకానిక్ దగ్గరికెళ్లడం ఏమిటి?’ అంటూ వెంటనే వాళ్లావిడకు ఫోన్ చేసి అడిగా... ‘‘ఈ మూడుముళ్లేమిటీ... చెల్లాచెదురేమిటీ?’’ అని.
 
 ‘‘ఏం చెప్పమంటారు అన్నయ్యా! ఇంట్లో బుజ్జిగాడు బంతాట ఆడుతుంటే అది వెళ్లి గోడగడియారానికి తగిలింది. దాని చిన్నముల్లూ, పెద్దముల్లూ, సెకన్లముల్లూ ఊడిపడ్డాయి. వాటిని బాగు చేయించడానికి వెళ్లొస్తానని బయల్దేరారు. బహుశా అదే విషయం మీకు చెప్పి ఉంటారు’’ అంది వాళ్లావిడ. అప్పటికిగాని నా ఆందోళన తగ్గలేదు. అంతటితో ఆగలేదు వాళ్లావిడ. ‘‘ఈమధ్య ఆయన మాటలన్నీ చిత్రంగా ఉంటున్నాయి అన్నయ్యా. మొన్న ఉప్మా చేశా. చట్నీ, పచ్చడీ రెండూ ముందు పెట్టి... ‘దేంతో తింటారండీ అన్నా. దేంతో తింటాం? చేత్తో లేదంటే స్పూన్‌తో’ అన్నారు. ఇంకోరోజు ‘పళ్లు రాలాయి. బుర్ర కుదురుగా ఉండటం లేదు. తల చెదిరిపోతోంది’ అన్నారు. మొదట ఆయన పళ్లకు ఏమైందో, ఆ మాట అన్నందుకు డెంటిస్టు దగ్గరికెళ్లాలా, న్యూరాలజిస్టును సంప్రదించాలా అని సందేహపడే లోపే... ఆయన చేతిలో ఉన్న దువ్వెనను చూస్తే తెలిసింది. రాలిన పళ్లు దువ్వెనవని’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది రాంబాబు వాళ్లావిడ.
   
 ఎలాగైనా వాడిని ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంది వాళ్లావిడ. ‘‘డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒళ్లు చేస్తున్నా కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా డైటింగ్ చేద్దాం ఈసారి’’ అన్నది వాడి డైలాగట. ఇవన్నీ నా ముందు చెప్పుకుని బాధ పడి ‘‘ఏదైనా మంత్రం వేసో, తంత్రం చేసో, మాయతోనో ఆయనను మీరే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలన్నయ్యా’’ అంది. ఇక నాకు తప్పలేదు. మా ఫ్యామిలీ ఫిజీషియన్ గారికి మావాడి విషయాలూ, వాడి లక్షణాలూ ముందే వివరించి ఉంచా. దేవుడి మీద భారం వేసి ఒక్క ప్లాన్ వేశా. హోమియో వైద్యం తరహాలో మనం కూడా వాడి రూట్లోనే వెళ్తే ప్లాన్ వర్కవుట్ అవుతుందనిపించింది. అందుకోసం వాడికి నేను చెప్పిన మాటలివి.
 
 ‘‘ఒరేయ్ రాంబాబూ... నాకు తెలిసినంతవరకూ నువ్వూ, పులీ... సేమ్ టు సేమ్ రా. నీకెప్పుడూ ‘పులి తేన్పులు’ వస్తుంటాయి కదా. కాకపోతే పులి పొట్ట ఎప్పుడూ సాఫ్ట్‌గా ఉండి, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ ఈమధ్య నీ పొట్ట కాస్త పెరుగుతూ ఉంది. అదొక్కటే తేడా. మరి నువ్వూ ఎప్పుడూ పులిలా ఉండాలంటే కాస్త ఈ పొట్ట తగ్గేలా చూసుకోవాలి కదా’’ అన్నా. అంతే వాడు వెంటనే డాక్టర్ దగ్గరికి బయల్దేరాడు.
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement