ఢిల్లీకి రాజైనా... ఉల్లికి దాసుడే! | Onion farmers in tears as traders boycott auction | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి రాజైనా... ఉల్లికి దాసుడే!

Published Sun, Nov 23 2014 1:14 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM

ఢిల్లీకి రాజైనా... ఉల్లికి దాసుడే! - Sakshi

ఢిల్లీకి రాజైనా... ఉల్లికి దాసుడే!

నవ్వింత
 ‘‘థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బును ఎలా కనిపెట్టాడో తెలుసా?’’ అకస్మాత్తుగా అడిగాడు మా రాంబాబు.
 ‘‘చక్కగా ధాబాలో కూర్చుని ఈ ఉల్లిగడ్డను నంజుకుంటూ పరోఠా తినాల్సిన సమయంలో మాట్లాడాల్సిన టాపికా ఇది?’’ అంటూ కాస్త చిరాకు పడ్డాన్నేను.
 ‘‘ఈ టైమ్‌లోనే ఎందుకంటే... పరోఠాతో పాటు ఇచ్చిన ఈ చిన్న చిన్న చిన్నుల్లి ముక్కల్ని చూశాక ఉల్లి షేపు గుర్తొచ్చింది. దాని షేపు గుర్తురాగానే ఎడిసన్‌గారికి కూడా ఎలక్ట్రిక్ బల్బు రూపు స్ఫురించి ఉంటుంది. దాంతో బహుశా మనవాడు అచ్చం ఉల్లిగడ్డ షేపులోనే కరెంటు బల్బుకు రూపకల్పన చేసి ఉంటాడనిపించి అలా మాట్లాడానన్నమాట. ఒక్క పరోఠాతో అనేమిటీ... ఉల్లి దోశ తోడ ఉల్లమ్ము రంజిల్లు / ఉల్లి లేక గారెకు రుచియె లేదు / తల్లి కంటే ఉల్లికి ప్రాధాన్యమందుకే / విశ్వదాభిరామ వినురవేమా! అన్నార్రా అందుకే’’ అన్నాడు రాంబాబు.
‘‘ఒరేయ్... ఈ సైన్సు విషయాలూ, ఆ తిండి పద్యాలూ ఆపేసి, హ్యాపీగా సినిమా కబుర్లు చెప్పుకుంటే సరదాగా ఉంటుందీ, తిండితో పాటూ కబుర్లలోనూ మసాలాకు మసాలా’’ అన్నాన్నేను.
 
‘‘అలాగే... నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ మాటకొస్తే సినిమాలకు మాత్రం... ఉల్లి చేసిన సాయం అంతా ఇంతా ఉందా? హీరో తల్లి కంటతడి పెట్టుకుంటూ ఉండి, తీరా హీరోగారు అది చూసి ఎక్కడ మనసు కష్టపెట్టుకుంటాడో అని సాకును ఉల్లిపాయ మీదకు తోసేసిన సినిమాలు ఎన్ని లేవు? అంతెందుకు... ఓ సినిమాలోనైతే... పెళ్లి చేసి పంపిస్తే తన చెల్లి ఉల్లిపాయ కోసి, కళ్లు మండేలా చేసుకుంటుందని అసలామెకు పెళ్లే చేయనంటాడు ఓ హీరో.  

సినిమా హీరోల తల్లి పాత్రలను దృష్టిలో పెట్టుకునే మూవీ కథ ముందుకు సాగడానికి ‘తల్లి చేసే మేలు కంటే ఉల్లి చేసే మేలే గొప్ప’ అన్న సామెత పుట్టిందేమోరా. అంతెందుకు మరో హిట్ సినిమాలో వంటింట్లో నుంచి మసాలా వాసనలు రావడం లేదు కాబట్టి హీరోయిన్ వంట చేస్తోందో లేదో అని విందుకు వచ్చిన వాళ్లు భయపడుతుంటే... హీరో వచ్చేసి ఉల్లిని సగానికి కోసి దానిపై దోమల మందు స్ప్రే చేస్తాడు. దాంతో ఘుమఘుమలాడే మసాలా వాసనలు వస్తున్నట్లు ఫీలై అతిథులు తెగ సంతృప్తిపడతారు. అదీ ఉల్లి గొప్పదనం. వంటలోనే కాదు... సినిమాలో మసాలాకూ ఉల్లి కావాల్సిందేరా’’ అన్నాడు రాంబాబు.
 
‘‘ఒరేయ్ రాంబాబూ... ఎలా తిప్పి చెప్పినా మళ్లీ ఆవు కథకే వచ్చినట్లుగా ఈ ఉల్లి లొల్లి ఏమిట్రా బాబూ? వదిలేయ్... ఇంకో టాపిక్ ఏదైనా మాట్లాడు. సరదాగా హీరోలనూ, వాళ్ల తల్లులనూ, అతగాడి చెల్లెళ్లనూ వదిలేసి... హాట్‌హాట్‌గా హీరోయిన్ల గురించి మాట్లాడు. వినడానికి ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది’’ అన్నాను మళ్లీ.
 ‘‘అలాగేరా... నువ్వు చెప్పినట్టే హీరోయిన్స్ గురించే మాట్లాడుకుందాం. హీరోయిన్‌ను కళ్లప్పగించి చూసేలా చేయాలంటే, ఆడియన్స్ అందరికీ ఆమె గ్లామరస్‌గా కనిపించాలంటే ‘ఉల్లిపొర’లాంటి చీర కట్టాల్సిందే. ఆ తర్వాత ఆ చీరలో తనను వానలో తడపాల్సిందేరా. నిజానికి సమస్త తెలుగు ప్రజలందరూ పల్చటి  చీరకు ఉపమానంగా ఉల్లినీ, దాని పైపొరనీ వాడారంటే... దానిపై సినిమావాళ్లతో పాటు అందరికీ ఎంత గౌరవం ఉందో చూశావా?’’ అన్నాడు రాంబాబుగాడు.
 
ఎలాగైనా సరే... వాడు మాట్లాడే టాపిక్ మారుద్దామని మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నా. అందుకే ఉల్లితో ఎలాంటి సంబంధం లేని అంశాన్ని డిస్కషన్‌కు తెద్దామనే కృతనిశ్చయంతో ‘‘ఒరేయ్... బంగారం ధర క్రమంగా తగ్గుతోందటరా! ముప్ఫయి రెండు వేలు, ముప్ఫయిమూడు వేల నుంచి దాదాపు పాతికవేలకు వచ్చేసిందట తెలుసా? మీ ఆవిడకు బంగారం కొనాలనుకుంటున్నావ్ కదా. ఇదే మంచి అవకాశం. కొనకపోయావా?’’ అంటూ వాణ్ణి టోటల్‌గా మరోవైపునకు లాక్కుపోయినట్లుగా ఫీలయ్యా.
 ‘‘బంగారం అంటే గుర్తొచ్చిందీ... అదంటే ఆడవాళ్లకు బలే మోజురా. అందుకే కూరలు వండేటప్పుడూ, తాలింపులు వేసేప్పుడూ ఉల్లిపాయ ముక్కల్ని బంగారు రంగుకు వచ్చేవరకూ వేయిస్తారు. అదేమిటోగానీ... బంగారం రంగు వచ్చేవరకు వేయిస్తేనే వంటకం రుచిగా ఉంటుంది. అంతకంటే మాడితే కూర టేస్టు పోతుంది.

ఇలా ఉల్లికీ... వంటనూనెలలో అది బంగారు రంగు పుంజుకోడానికీ... రుచికీ ఉన్న సంబంధమేమిటో తెలియడం లేదురా. ఉల్లీ... చిల్లీ ఈ రెండూ లేకపోతే వంటే లేదురా’’ అంటూ బంగారం మార్కెట్ నుంచి తిరిగి తిరిగి మళ్లీ ఉల్లిదగ్గరికే వచ్చాడు వాడు.
 ‘‘ఒరేయ్... నేనో కొత్త సామెత సృష్టిద్దామనుకుంటున్నానురా. నువ్వు పొరబాటున ఢిల్లీకి రాజువైనా తల్లికి కొడుకువు అవునో కాదోగానీ, ఉల్లికి మాత్రం దాసుడివేరా’’ అన్నాన్నేను కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా. అన్నట్టు ఈ కన్నీళ్లకు కారణం ఉల్లి మాత్రం కాదు!
 - యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement