గుండెపోటే గురుదేవుడు! ఆయిల్ ట్యాంకరే అవధూత!! | Gurudevudu heart attacks! Oil tank avadhuta !! | Sakshi
Sakshi News home page

గుండెపోటే గురుదేవుడు! ఆయిల్ ట్యాంకరే అవధూత!!

Published Sun, Dec 28 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

గుండెపోటే గురుదేవుడు! ఆయిల్ ట్యాంకరే అవధూత!!

గుండెపోటే గురుదేవుడు! ఆయిల్ ట్యాంకరే అవధూత!!

నవ్వింత
ఈమధ్య మా రాంబాబు గాడిలో స్థితప్రజ్ఞత మరీ ఎక్కువైపోయింది. ఏం చెప్పినా అందులోంచి తాత్వికతను తవ్వి తీస్తున్నాడు.
 మొన్న నేనూ వాడూ ఆఫీసులోకి ప్రవేశించాక ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలో లిఫ్ట్ మిస్సయ్యింది. సినిమాకు వెళ్లాక మన ముందు వాడికి టికెట్టు దక్కి, మనకు చిక్కనప్పటి బాధ ఆవరించి... నిరాశతో ‘అబ్బా’ అన్నాను. ‘‘హు... జీవితంలోనే లిఫ్ట్ దొరకలేదు. ఆఫ్టరాల్ ఈ లిఫ్ట్ మిస్సయితే బాధేముందిలేరా’’ అన్నాడు వాడు. ‘‘ఇందాకే కదరా, బస్సు మిస్సయితే ఎవరో బైకువాడు లిఫ్ట్ ఇచ్చాడు అన్నావ్’’ అని అడిగా.
 ‘‘కానీ బస్సులో నా స్వీట్‌హార్ట్ వెళ్తోంది కదా. బైకు లిఫ్టు దొరికిందని ఆనందించనా, బస్సు మిస్సయిందని విచారించనా?’’
    
ఊరెళ్దామని ఓరోజు రాత్రి ఎనిమిదింటికి వెళ్లాల్సిన రైలును పట్టుకోడానికి బయల్దేరాం మేం. కానీ నిమిషమున్నర వ్యవధిలో రైలు కాస్తా పాముల వాడి చేతుల్లోంచి పారిపోయే పాములా జారిపోయింది. పారిపోవడంతో సరిపెట్టిందా... చివరి బోగీ వెనక నల్లటి బ్యాక్‌గ్రౌండ్ మీద ‘ఎక్స్’ అనే అక్షరంతో వెక్కిరించింది. ‘ఆన్సర్‌షీటు మీద నీ జవాబు తప్పురా అనే మార్కే సదరు ఎక్స్’ - అంటాడు వాడు. ఎందుకైనా మంచిదని వాణ్ణి ఊరడిద్దామని ‘‘పోతే పోనీలేరా... ఇంకో రైల్లో వెళదాం లే’’ అన్నాను. ‘‘తప్పిపోయిన రైలుకు రిజర్వేషనైన టికెటుంటుంది. అయినా మిస్సవ్వక తప్పదు. ఇప్పుడెక్కాల్సిన రైలుకు రిజర్వేషనుండదు. అయినా ఎక్కక తప్పదు.

అదేరా జీవితం’’  అన్నాడు వాడు. నిజమేననిపించింది. ‘‘నా బాధల్లా రైలు మిస్సయినందుకు కాదురా. మన చేతిలో టికెటు ఉన్నా, అధికారికంగా రిజర్వేషన్ చేయించుకుని సుఖంగా వెళ్లాల్సిన బెర్త్ అక్కడే ఉన్నా... దాని మీద ఎవడో తాను ఊహించని విధంగా, హాయిగా ప్రయాణిస్తుంటాడు. అధికారికంగా మనకు దఖలు పడాల్సిన సుఖాన్ని ఇంకెవడో అయాచితంగా అనుభవిస్తాడు. ఇదే జీవితం’’ అన్నాడు వాడు. అక్కసు లేదా అసూయ అనండి, మానవసహజమైన వాడి వైఖరికీ, ప్రవర్తనకూ సాటి మనిషిగా పూర్తిగా మద్దతుపలికాన్నేను.
    
ఈమధ్యే రాంబాబు గాడికి మొదటిసారి హార్ట్‌ఎటాక్ వచ్చింది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పరామర్శకు వెళ్లడం కుదరలేదు. వాడు కాస్త కోలుకున్నాక క్రమం తప్పక మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు వాడితో జాయిన్ కావడం మొదలు పెట్టాను. ఈ క్రమంలో అప్పుట్లో మిస్ అయిన పరామర్శనూ, ఓదార్పునూ, ధైర్యాన్నీ ఒకే డోసులో ఇద్దామని-
 ‘‘పోన్లేరా... మైల్డ్ స్ట్రోకే కదా. మొదటి స్ట్రోకు వచ్చాక అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే దాదాపు నలభై ఏళ్లు బతికారు ఏఎన్నార్. మామూలువాళ్ల కంటే ఇలా స్ట్రోక్ వచ్చాక జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నవాళ్లే సుదీర్ఘకాలం జీవించార్రా’’ అంటూ మంచి ఆరోగ్యకరమైన జీవితం కావాలంటే మామూలు వాళ్లైనా సరే అర్జెంటుగా గుండెపోటు తెచ్చుకోవడం చాలా అవసరం, అదెంతో మంచిది అన్నంత ఇన్‌స్పైరింగ్‌గా ఓ లెక్చర్ ఇచ్చా.
 రోడ్డు మీద మేము వాకింగ్ చేస్తున్న సమయంలోనే ఓ ఆయిల్ ట్యాంకర్ వెళ్తూ కనిపించింది. దాన్ని చూడగానే మళ్లీ మా రాంబాబుగాడిలో తాత్వికత నిద్రలేచింది.
 
‘‘హు... ఈ గుండే... దానితో నడిచే ఈ జీవితమూ ఆయిల్ ట్యాంకర్ వంటివేరా’’ అన్నాడు వాడు. నేను బిత్తరపోతూ అదేంట్రా అన్నాను.
 ‘‘చూశావా విచిత్రం... ఆయిల్ ట్యాంకర్ నిండా అనేక గ్యాలన్ల ఇంధనం ఉంటుంది. కానీ ఆ వాహనానికి గుండె కాయలాంటి చిన్న ట్యాంకర్‌లో ఉండే పెట్రోలు నిండుకుంటే అంతటి ఆయిల్ ట్యాంకరూ ఆగిపోతుంది. అలాగని నేరుగా ట్యాంకరులోని ఇంధనాన్ని వాహనానికి ఉన్న ట్యాంకులో పోసుకోడానికి వీలు కాదు. మన గుండె కూడా అంతేగదరా. దాని నాలుగ్గోడల నిండా ఎప్పుడూ రక్తం ఉండనే ఉంటుంది. అలాంటి గుండె కూడా మెదడుకు తన ఆధార్ కార్డూ, తన రేషన్ కార్డూ గట్రా చూపించి తన కోటా రక్తాన్ని మాత్రమే తాను వాడుకోవాలి. అన్ని అవయవాలకూ రక్తం సరఫరా చేసే దానికే రక్తం అందకపోతే, ఎంతటి  మనిషైనా అంతటితో పోవాల్సిందే కదా. ఇది కూడా టికెట్టుండీ రెలైక్కలేకపోవడం, మన స్వీట్ హార్ట్ బస్సులో ఉండీ, బస్సెక్కలేకపోవడం లాంటిదే కదరా. జ్ఞానాన్ని నేర్చుకోవాలనే గుణం ఉండాలిగానీ... గుండెపోటూ గురువవుతుంది, ఆయిల్ ట్యాంకరూ అవధూత అవుతుంది. మిస్సయిన బస్సూ మహాతత్వ సారాన్ని బోధిస్తుంది’’ అంటూ పెద్ద పెద్ద మహాయోగులూ, యోగగురువులూ ఇచ్చేలాంటి స్పీచ్ ఇచ్చాడు వాడు.
 - యాసీన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement