మా బుజ్జిగాడి సబ్జెక్టు డౌట్సూ... నా మతికి పట్టిన గతి! | The rest of the money to the buyer Lollipop | Sakshi
Sakshi News home page

మా బుజ్జిగాడి సబ్జెక్టు డౌట్సూ... నా మతికి పట్టిన గతి!

Published Sun, Dec 7 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

మా బుజ్జిగాడి సబ్జెక్టు డౌట్సూ... నా మతికి పట్టిన గతి!

మా బుజ్జిగాడి సబ్జెక్టు డౌట్సూ... నా మతికి పట్టిన గతి!

నవ్వింత
మా బుజ్జిగాడు ఒకరోజు అకస్మాత్తుగా... ‘‘నాన్నా, నాగుపాముకు గాగుల్స్ అంటే చాలా ఇష్టం కదా’’ అని అడిగాడు. కాసేపు నా మతి (అలా షికారుకు) పోయి, మళ్లీ తిరిగి మెదడులోకి తిరిగి వచ్చాక వాణ్ణి అడిగా... ‘‘నాగుపాముకూ, గాగుల్స్‌కూ సంబంధం ఏమిట్రా?’’ అని.
 ‘‘అదే నాన్నా... మాకు సైన్స్ క్లాస్‌లో చెప్పారు. నాగుపాము పడగ మీద స్పెక్టకిల్స్ ఉంటాయట. ఆ కళ్లజోడు గుర్తు కూడా పర్మెనెంటుగా ఉంటుందట. అంటే కళ్లజోడు జారిపోకుండా ఉంటానికేమో కదా నాన్నా’’ అన్నాడు వాడు.
 ‘‘ఒరేయ్... అవి కళ్లజోడు వంటి ముద్ర మాత్రమే. అంతేగానీ, ఏ రేబాన్ గ్లాసులో, పోలీస్ బ్రాండ్ స్పెట్సో కావు. ఇలాంటి అరకొర నాలెడ్జ్‌తో బుర్ర చెడగొట్టుకోకు. నా బుర్రతిరిగేలా చేయకు’’ అని వాడికి వార్నింగ్ ఇచ్చా.
   
సైన్స్ క్లాస్ గోల అలా ముగిసిందా! మళ్లీ సోషల్ క్లాస్‌లో జరిగిన మరో సంఘటనతో నా ఒంట్లోంచి నేనే బయటకు దూకి... కాసేపటిగ్గానీ మళ్లీ నా దేహంలోకి దూరలేకపోయా.
 ‘‘నాన్నా... శనిగ్రహం చుట్టూ అలా రింగులు ఎందుకుంటాయో, మిగతా గ్రహాలకు ఎందుకుండవో నాకు తెలిసిపోయింది’’ అన్నాడు.
 ‘‘ఎందుకురా?’’ అడిగాను ఆసక్తిగా.
 ‘‘ఎందుకంటే... శనిగ్రహం తాలూకు దుష్టగ్రహ ప్రభావం తనమీదే పడకుండా  అలా రింగులుంటాయి’’ అన్నాడు వాడు.
 ‘‘మోకాలికీ బోడిగుండుకూ ముడెయ్యకు. శనిగ్రహం చుట్టూ రింగులుంటే దాని ప్రభావం దాని మీద పడకుండా ఉండటమేంటి?’’ అడిగాన్నేనను.
 
‘‘మొన్న మన ఇంటికి వచ్చిన అంకుల్‌గారూ... అన్ని వేళ్లకూ రింగ్స్ పెట్టుకున్నారు కదా. ‘అన్ని రింగ్స్ ఎందుకూ’ అని నువ్వు అడిగితే... కొన్ని గ్రహాల దుష్టప్రభావం తన మీద పడకుండా ఉండటానికీ, తనకు అంతా మంచి జరిగేందుకూ అని జవాబిచ్చారు కదా. ఇక శనిగ్రహం మాట అంటావా! ‘శనిలా పట్టుకున్నావు, శనిగాడు’ లాంటి పదాలతో పాపం ఆ గ్రహంపై అందరూ ఆగ్రహిస్తూ, దాన్ని ఆడిపోసుకుంటుంటారు కదా నాన్నా.

అందుకే తన చెడు తనకే తగలకుండా ఆ ఒక్క గ్రహానికే రింగులుంటాయని నాకు అర్థమైపోయిందిలే’’ అన్నాడు.ఈసారి నేను నా మతి పోగొట్టుకున్న మాట వాస్తవమే గానీ... అలా పోయిన సదరు మతిని వెతికి మళ్లీ మైండ్‌లో సెట్ చేసుకోడానికి నాకు చాలా టైమే పట్టింది.
   
‘‘నాన్నా... దున్నపోతు మీద వర్షం పడితే, ఎంత తడిసినా దానికి ఏమీ కాదట కదా. మా తెలుగు క్లాస్‌లో మా సార్ ఈ సామెత చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్నా. దున్నపోతు మీద ఎంత వర్షం కురిసినా దానికి ఏమీ కాదెందుకో తెలిసింది. ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ అన్న సామెత ఎందుకు పుట్టిందో కూడా అర్థమైంది’’ అన్నాడు వాడు. చిన్నప్పట్నుంచీ చదువుకునే తెలుగే కదా. ఈ క్లాసుతో ప్రమాదమేమీ ఉండదులే అనుకున్నా. అయినా ఆసక్తిని చంపుకోలేక అడిగితే, ‘‘ఎందుకంటే... దున్నపోతుకు ఏ జలుబో గిలుబో చేసిందనుకో. దానికి విక్సో, జండూబామో, టైగర్‌బామో రాసేవాళ్లు ఎవరుంటారు నాన్నా? అందుకే దేవుడలా ఏర్పాటు చేశాడన్నమాట’’ అని జవాబిచ్చాడు.
   
మా బుజ్జిగాడు లెక్కల్లో కాస్త పూర్. అవేవో చెబుదామని పూనుకుని, కూడికలయ్యాక, తీసివేతలు చెబుతున్నా.
 ‘‘నీ దగ్గర వంద రూపాయలున్నాయనుకో. అందులో ఇరవై పెట్టి లాలీపాప్‌లు కొనుక్కుని మిగతా డబ్బులు జేబులో వేసుకున్నావనుకో. నీ జేబులో ఉన్న డబ్బులెన్నీ?’’ అన్నా.
 వాడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించాడు. ఆ భంగిమ నాకు నచ్చింది. ఎవరైనా ఏదైనా ఆలోచిస్తున్నారంటే... సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా. ‘‘అదీ... అదీ... అలా ఆలోచించాలి. చెప్పు... ఇప్పుడు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో దాచకుండా చెప్పు’’ అంటూ ప్రోత్సహించా.
 
‘‘కంగారూకు సంచి ఎందుకుంటుందో నాకిప్పుడు తెలిసింది’’ అన్నాడు.
 ‘‘సడన్‌గా లెక్కల నుంచి మళ్లీ బయాలజీకి వెళ్లావెందుకు రా’’ అన్నాను విసుగ్గా, ఒకింత ఆందోళనగా.
 ‘‘ఎందుకంటే... అది లాలీపాప్ కొనుక్కున్న తర్వాత మిగిలిన డబ్బుల్ని దాచుకోడానికి దేవుడు దానికి ముందే ఒక జేబు కుట్టేశాడు నాన్నా. మనలా షర్టూ, ప్యాంట్లకు జేబులు కుట్టుకోవాల్సిన అవసరం దానికి లేదు’’ అన్నాడు వాడు.
 ఈ సారి నా మతి మళ్లీ పోయింది. కానీ షికారుకు కాదు. అది పారిపోయింది. అలా పోయిన నా మతి ఇప్పట్లో దొరుకుతుందో, లేదో?!
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement