Bujjigadu
-
హీరోయిన్ సంజనకు సీమంతం చేసిన స్నేహితులు
బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ సంజనా గల్రానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమాలు సహా పలు విషయాలను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న సంజన త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ సందర్భంగా అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సౌత్ ఇండియన్ స్టైల్లో సీమంతం జరుపుకుంది. చదవండి: బన్నీకి ఫేవరెట్ అదే.. సీక్రెట్ రివీల్ చేసిన స్నేహారెడ్డి దీనికి సంబంధించిన ఫోటోలను సంజన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది. 'కొన్నిసార్లు కుటుంబం కంటే కొంతమంది స్నేహితులే నయమనిస్తుంది. ఎంతో ప్రేమగా నా సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్ నా సీమంతం చేశారు. 9వ నెలలోకి ప్రేవేశిస్తున్నా. ఇంకో నెల రోజుల్లో నా బిడ్డను చూస్తాను. నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు ధన్యవాదాలు' అంటూ పేర్కొంది. కాగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఈ బ్యూటీ మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన చిరకాల మిత్రుడు, ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో రహస్య వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Sanjjanaa Galrani / sanjana (@sanjjanaagalrani) -
ప్రభాస్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు: హీరోయిన్
Sanjana Galrani About Prabhas: బుజ్జిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా క్లాస్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమా విజయవంతం అయినా సంజనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ పరిశ్రమకు పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవలె డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే. శాండల్‌వుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన ఈ కేసుతో సంజన పేరు ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది.ఇక ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంజన.. ఇటీవలె నటిగానూ ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. ఓ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సంజన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది. 'అరెస్ట్ అయి జైళ్లో ఉన్నప్పుడు ప్రతీరోజు జీసెస్, అల్లా, శివయ్యలను ప్రార్థించేదాన్ని. అంతేకాకుండా ప్రతీరోజు యోగా చేసేదాన్ని. వీటివల్లే ఇంత త్వరగా కంబ్యాక్ చేయగలిగాను. ఆ నెగిటివిటి నుంచి బయటపడగలిగాను' అని తెలిపింది. ఇక బుజ్జిగాడు సినిమా గురించి మాట్లాడుతూ..ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'ప్రభాస్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.ఆయన చాలా డెడికేటెడ్ యాక్టర్. రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఎంతో కష్టపడేవాడు. బుజ్జిగాడు షూటింగ్ సమయంలో ప్రభాస్ చాలా సన్నగా కనిపిస్తారు. క్యారెక్టర్ కోసం ప్రతిరోజు ఆయన కేవలం పెసరెట్టు మాత్రమే తినేవారు. ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారన్నది ప్రభాస్ ఫిజిక్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్‌తో పనిచేసినందుకు సంతోషంగా భావిస్తున్నా' అని సంజన తెలిపింది. -
మా బుజ్జిగాడి సబ్జెక్టు డౌట్సూ... నా మతికి పట్టిన గతి!
నవ్వింత మా బుజ్జిగాడు ఒకరోజు అకస్మాత్తుగా... ‘‘నాన్నా, నాగుపాముకు గాగుల్స్ అంటే చాలా ఇష్టం కదా’’ అని అడిగాడు. కాసేపు నా మతి (అలా షికారుకు) పోయి, మళ్లీ తిరిగి మెదడులోకి తిరిగి వచ్చాక వాణ్ణి అడిగా... ‘‘నాగుపాముకూ, గాగుల్స్కూ సంబంధం ఏమిట్రా?’’ అని. ‘‘అదే నాన్నా... మాకు సైన్స్ క్లాస్‌లో చెప్పారు. నాగుపాము పడగ మీద స్పెక్టకిల్స్ ఉంటాయట. ఆ కళ్లజోడు గుర్తు కూడా పర్మెనెంటుగా ఉంటుందట. అంటే కళ్లజోడు జారిపోకుండా ఉంటానికేమో కదా నాన్నా’’ అన్నాడు వాడు. ‘‘ఒరేయ్... అవి కళ్లజోడు వంటి ముద్ర మాత్రమే. అంతేగానీ, ఏ రేబాన్ గ్లాసులో, పోలీస్ బ్రాండ్ స్పెట్సో కావు. ఇలాంటి అరకొర నాలెడ్జ్‌తో బుర్ర చెడగొట్టుకోకు. నా బుర్రతిరిగేలా చేయకు’’ అని వాడికి వార్నింగ్ ఇచ్చా. సైన్స్ క్లాస్ గోల అలా ముగిసిందా! మళ్లీ సోషల్ క్లాస్‌లో జరిగిన మరో సంఘటనతో నా ఒంట్లోంచి నేనే బయటకు దూకి... కాసేపటిగ్గానీ మళ్లీ నా దేహంలోకి దూరలేకపోయా. ‘‘నాన్నా... శనిగ్రహం చుట్టూ అలా రింగులు ఎందుకుంటాయో, మిగతా గ్రహాలకు ఎందుకుండవో నాకు తెలిసిపోయింది’’ అన్నాడు. ‘‘ఎందుకురా?’’ అడిగాను ఆసక్తిగా. ‘‘ఎందుకంటే... శనిగ్రహం తాలూకు దుష్టగ్రహ ప్రభావం తనమీదే పడకుండా అలా రింగులుంటాయి’’ అన్నాడు వాడు. ‘‘మోకాలికీ బోడిగుండుకూ ముడెయ్యకు. శనిగ్రహం చుట్టూ రింగులుంటే దాని ప్రభావం దాని మీద పడకుండా ఉండటమేంటి?’’ అడిగాన్నేనను. ‘‘మొన్న మన ఇంటికి వచ్చిన అంకుల్గారూ... అన్ని వేళ్లకూ రింగ్స్ పెట్టుకున్నారు కదా. ‘అన్ని రింగ్స్ ఎందుకూ’ అని నువ్వు అడిగితే... కొన్ని గ్రహాల దుష్టప్రభావం తన మీద పడకుండా ఉండటానికీ, తనకు అంతా మంచి జరిగేందుకూ అని జవాబిచ్చారు కదా. ఇక శనిగ్రహం మాట అంటావా! ‘శనిలా పట్టుకున్నావు, శనిగాడు’ లాంటి పదాలతో పాపం ఆ గ్రహంపై అందరూ ఆగ్రహిస్తూ, దాన్ని ఆడిపోసుకుంటుంటారు కదా నాన్నా. అందుకే తన చెడు తనకే తగలకుండా ఆ ఒక్క గ్రహానికే రింగులుంటాయని నాకు అర్థమైపోయిందిలే’’ అన్నాడు.ఈసారి నేను నా మతి పోగొట్టుకున్న మాట వాస్తవమే గానీ... అలా పోయిన సదరు మతిని వెతికి మళ్లీ మైండ్‌లో సెట్ చేసుకోడానికి నాకు చాలా టైమే పట్టింది. ‘‘నాన్నా... దున్నపోతు మీద వర్షం పడితే, ఎంత తడిసినా దానికి ఏమీ కాదట కదా. మా తెలుగు క్లాస్‌లో మా సార్ ఈ సామెత చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది నాన్నా. దున్నపోతు మీద ఎంత వర్షం కురిసినా దానికి ఏమీ కాదెందుకో తెలిసింది. ‘దున్నపోతు మీద వర్షం కురిసినట్టు’ అన్న సామెత ఎందుకు పుట్టిందో కూడా అర్థమైంది’’ అన్నాడు వాడు. చిన్నప్పట్నుంచీ చదువుకునే తెలుగే కదా. ఈ క్లాసుతో ప్రమాదమేమీ ఉండదులే అనుకున్నా. అయినా ఆసక్తిని చంపుకోలేక అడిగితే, ‘‘ఎందుకంటే... దున్నపోతుకు ఏ జలుబో గిలుబో చేసిందనుకో. దానికి విక్సో, జండూబామో, టైగర్బామో రాసేవాళ్లు ఎవరుంటారు నాన్నా? అందుకే దేవుడలా ఏర్పాటు చేశాడన్నమాట’’ అని జవాబిచ్చాడు. మా బుజ్జిగాడు లెక్కల్లో కాస్త పూర్. అవేవో చెబుదామని పూనుకుని, కూడికలయ్యాక, తీసివేతలు చెబుతున్నా. ‘‘నీ దగ్గర వంద రూపాయలున్నాయనుకో. అందులో ఇరవై పెట్టి లాలీపాప్‌లు కొనుక్కుని మిగతా డబ్బులు జేబులో వేసుకున్నావనుకో. నీ జేబులో ఉన్న డబ్బులెన్నీ?’’ అన్నా. వాడు ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించాడు. ఆ భంగిమ నాకు నచ్చింది. ఎవరైనా ఏదైనా ఆలోచిస్తున్నారంటే... సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్టే కదా. ‘‘అదీ... అదీ... అలా ఆలోచించాలి. చెప్పు... ఇప్పుడు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావో దాచకుండా చెప్పు’’ అంటూ ప్రోత్సహించా. ‘‘కంగారూకు సంచి ఎందుకుంటుందో నాకిప్పుడు తెలిసింది’’ అన్నాడు. ‘‘సడన్‌గా లెక్కల నుంచి మళ్లీ బయాలజీకి వెళ్లావెందుకు రా’’ అన్నాను విసుగ్గా, ఒకింత ఆందోళనగా. ‘‘ఎందుకంటే... అది లాలీపాప్ కొనుక్కున్న తర్వాత మిగిలిన డబ్బుల్ని దాచుకోడానికి దేవుడు దానికి ముందే ఒక జేబు కుట్టేశాడు నాన్నా. మనలా షర్టూ, ప్యాంట్లకు జేబులు కుట్టుకోవాల్సిన అవసరం దానికి లేదు’’ అన్నాడు వాడు. ఈ సారి నా మతి మళ్లీ పోయింది. కానీ షికారుకు కాదు. అది పారిపోయింది. అలా పోయిన నా మతి ఇప్పట్లో దొరుకుతుందో, లేదో?! - యాసీన్ -
చైల్డ్ ప్రాడిజీ ప్రయత్నాలూ... నా వైల్డ్ ట్రాజెడీ అనుభవాలూ!!
నవ్వింత అప్పుడప్పుడూ బాలమేధావుల గురించి న్యూస్పేపర్లలో వచ్చినప్పుడు నాక్కాస్త అసూయగా ఉంటుంది. వెంటనే మా బుజ్జిగాడూ చైల్డ్ ప్రాడిజీ అయిపోయుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నా ఈ ప్రయత్నంలో భాగంగా దేశాలూ రాజధానులూ లేదా పెద్ద పెద్ద పదాల సెల్పింగులు చెబుదామనుకుంటే అవన్నీ ఇప్పటికే అందరూ చేసేశారు. అందుకే వాణ్ణి మాస్టర్ ఆఫ్ ఆల్ చేద్దామని నిర్ణయించుకున్నా. పురాణాలూ, నీతిపద్యాలూ, జనరల్ నాలెడ్జీ, న్యూస్‌పేపర్ రీడింగూ... గోనెసంచిలో సరుకులు కూరికూరి నింపినట్లుగా అన్నింటినీ ఏకకాలంలో వాడి బుర్ర అనే బస్తాలోకి నింపాలని నిర్ణయించుకున్నా. పొద్దున్నే కాసేపు న్యూస్ పేపర్ చదివి వినిపించాక... సబ్జెక్టు మార్చి పురాణాల్లోని హిరణ్యాక్షుడి వృత్తాంతం చెప్పా. వాడి మాటలతో నా బుర్ర తిరిగిపోయింది. ‘‘అన్నట్టు నాన్నా... నువ్వు చెప్పినట్టుగా భూమిని చాపచుట్టినట్టు చుట్టేసిన హిరణ్యాక్షుడి వృత్తాంతంలో హిరణ్యాక్షుడు భూకబ్జాకు పాల్పడ్డాడన్నమాట. ల్యాండ్ మాఫియాకు ఆద్యుడు అతడేనేమో. అందరి భూముల్నీ లాక్కున్నాడంటే తొలి ల్యాండ్‌గ్రాబింగ్ కేసు కూడా అతడిదేనేమో!? అందుకే భగవంతుడు వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి అందరికీ భూమిని సమానంగా పంచి, సత్యయుగంలో సామ్యవాదాన్ని నెలకొల్పి ఉంటాడు కదా’’ అన్నాడు. నేనేదో విడివిడిగా వార్తల్నీ, పురాణాల్నీ, సివిక్సూ గట్రా బోధిస్తే... వాడు అన్నింటినీ కలగలిపి సొంతం వ్యాఖ్యానాలు చెప్పడంతో నాకు మాటపడిపోయింది. ఈ న్యూస్‌పేపర్లు అచ్చిరాలేదని టీవీ చూపిద్దామని నిర్ణయించుకున్నా. పెద్ద పెద్ద కట్టడాలైన మలేషియాలోని పెట్రొనాస్ టవర్స్ చూపించా. ‘‘చూశావా... పెట్రోనాస్ టవర్స్ రాత్రిపూట పెట్రొమాక్స్ లైట్ల కాంతిలా ఎలా వెలుగుతున్నాయో. టోక్యో స్కై స్క్రేపర్సూ, టొరంటో టవర్సూ చూడు’’ అన్నా. వెంటనే వాడు ఛానెల్ మార్చేసి... నాకు యానిమల్ ప్లానెట్ చూపిస్తూ... ‘‘నువ్వే ఇది చూడు. అంత చిన్న తేనెటీగ... తన మల్టీస్టోరీడ్ బిల్డింగును అలా తల్లకిందులుగా కట్టుకుంటూ తన తేనెపట్టు నిడివి పెంచుకుంటూ పోతుంటే... భూమిపై ఒకదాని మీద మరో అంతస్తు కట్టుకుంటూ పోవడంలో విచిత్రం ఏముంది’’ అంటూ చప్పరించాడు. ‘‘అయినా నిట్టనిలువుగా కట్టడం గొప్పా... తలకిందులుగా నిర్మించడం గొప్పా?’’ అన్నాడు. ఈసారి, అల్లసాని వారి ప్రబంధాల్లో అల్లిక జిగిబిగి బాగుంటుంది కాబట్టి టంగ్ట్విస్టర్స్లాంటి పద్యాలుండే ప్రవరుడి వృత్తాంతం చెప్పా. ‘‘కటకచరత్కరేణు కరకంపిత సాలమున్, శీతశైలమున్’’ పద్యం చెబుతూ, హిమాలయాల్లో ఏనుగులు చెట్లను కదలిస్తున్నాయన్న అర్థం ఎలా ఉన్నా... ‘‘కటకచరత్కరేణు కరకంపిత - విపరీతంగా చలిపెడుతుంటే ఆ వణుకు వల్ల రెండు పలువరసలూ కటకటా కొట్టుకుంటున్న సౌండు వినిపిస్తోంది చూడు’’ అని పరవశంగా అన్నాను. ‘‘అవున్నాన్నా... ప్రవరుడు లేపనం పూసుకుని హిమాలయాలకు వెళ్లాలని ముందే డిసైడ్ చేసుకున్నాడు కదా. అలాంటప్పుడు అక్కడ విపరీతంగా చలేస్తుందనీ, మంచు తాలూకు తడికి లేపనం కడుక్కుపోయే ప్రమాదం ఉందనీ ఎందుకు ఊహించలేదు? ఒక ఉలెన్ దుస్తుల్తో ఒంటిని నిండా కప్పి ఉంటే లేపనం అంత త్వరగా కడుక్కుపోయేది కాదు కదా. దారితప్పిపోకుండా హ్యాపీగా తిరిగి వచ్చేవాడు కదా’’ అన్నాడు. ఆ దెబ్బతో ప్రబంధాలు వదిలేసి కనీసం నీతి పద్యాలైనా చెబుదామని అనుకున్నా. వేమన, సుమతీ శతకాలైతే తేలిగ్గా ఉంటాయని, భాస్కర శతకం ఎంచుకున్నా. ‘‘ఒరేయ్... పండితులైన వారికి తగిన గుర్తింపు లేకపోయినా వారి పాండిత్యానికి తక్షణం వచ్చే ఢోకా ఏమీలేదు. ఎలాగంటే... కోతులు చెట్టు కొనకొమ్మన ఉంటే... కింద గండభేరుండాలూ, సింహాలూ ఉంటాయంటాడ్రా కవీ... ఈ పద్యంలో’’ అన్నా. ‘‘అన్నట్టు నాన్నా... సింహాలు భూమ్మీద తిరుగుతుండటం ఓకే... మరి గండభేరుండాలూ పైన ఎగరకుండా భూమ్మీదే తిరుగుతుంటాయని చెప్పడం వింతగా లేదూ’’ అన్నాడు. అంతే... నా కళ్లు బైర్లుగమ్మాయి. ‘‘అంతటి మహాకవీ అవాస్తవం రాశాడంటే నమ్మలేం నాన్నా. ఎంత ఎగిరినా... ఆహారం కోసం కిందికి దిగాల్సిందే కదా. ఆ సంగతి రాసుంటాడు భాస్కర శతకకారుడు’’ అంటూ తన సందేహాన్ని వాడే తీర్చుకుని, నా సందేహాన్నీ తీర్చాడు. ఎవడికి ఉండే తెలివి వాడికి ఉంటుంది. పనిగట్టుకుని బాలమేధావుల్ని చేద్దామనుకుంటే పరిస్థితి ఇలాగే తగలడుతుందని బోధపడిన తత్వంతో వాడి మానాన వాణ్ణి ఎదగనిద్దామని నిశ్చయించుకున్నా. - యాసీన్ -
పడగనీడ పట్టు... నక్కతోక తొక్కు!
నవ్వింత: ఎప్పుడైనా సరే... పిల్లలు... పెద్దలు చెప్పే కథలు వింటూ పెరగాలనేది నా ఉద్దేశం. నా ధోరణి మా బుజ్జిగాడికి చాదస్తంగా అనిపించినా సరే... నేను మాత్రం వాడికి నిద్రపోయే ముందు ఏవో కథలు చెబుతూనే ఉంటా. అందులో భాగంగానే ఓ మహానుభావుడి గురించి చెబుతూ... ‘ఆయన చిన్నప్పుడు పాకుతూ పారాడుతూ ఎండలోకి వెళ్లి ఆడుకుంటూ ఉన్నాట్ట. అంతలో ఎండ వేడికి తట్టుకోలేక క్యారుక్యారుమని ఏడుస్తూ ఉండగా అటు వైపుగా వెళ్తున్న ఓ నాగుపాము తన పడగ పట్టి నీడనిచ్చిందట’ అని చెప్పా. ఈ దృశ్యం చూసిన అక్కడి వాళ్లు - ‘భవిష్యత్తులో ఆ పిల్లాడు ఓ మహానుభావుడవుతాడు’ అంటూ నిర్ధారణ చేశారంటూ చెప్పా. ఈ మాట చెబుతూ ఉండగానే మా బుజ్జిగాడు వేయనే వేశాడు ఒక ప్రశ్న: ‘‘నాన్నా... నాగుపాము పడగపడితే వాళ్లు గొప్పాళ్లు అవుతారా?’’ అంటూ. ‘‘అవున్రా. ఎవరో మహర్జాతకులకు గానీ అలా జరగదు. మన కథల్లో అలా పాము పడగ నీడ పట్టినవాళ్లందరూ చాలా గొప్పవాళ్లయ్యారు’’ అన్నా. తీరిక దొరికినప్పుడల్లా నేనూ మా బుజ్జిగాడితో కలిసి టీవీ చూస్తుంటా. ఆ టైమ్‌లో వాడు చూసే కార్టూన్ ఛానెళ్లకు తాత్కాలికంగా బ్రేక్ ఇప్పించి ఏ యానిమల్ ప్లానెటో, ఏ డిస్కవరీ ఛానెలో కలిసి చూస్తుంటాం. ఇలాంటి షో చూస్తున్న ఓ క్షణాన మావాడు అడిగిన ఓ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది. ‘‘నాన్నా... ఈ పాముల్ని ఇలా చులాగ్గా పట్టేసే ఈ బ్రాడీబార్లూ, ఈ ఆస్టిన్ స్టీవెన్స్లూ... వాటిని ఇలా పట్టి కాసేపు వివరించి అలా వదిలేస్తుంటారు. మరికొందరైతే... విషానికి విరుగుడు తయారు చేసే కంపెనీలకు ఇచ్చేస్తుంటారు. మన బేర్‌గ్రిల్స్‌కు బుద్ధిలేదు నాన్నా... అతగాడైతే... ఎప్పుడెప్పుడు పాము కనిపిస్తుందా... ఎప్పుడెప్పుడు దాన్ని తినేద్దామా అని చూస్తుంటాడు. నాకో ఆలోచన వచ్చింది నాన్నా. ఇలా విషానికి విరుగుడు తయారు చేసే యాంటీవీనమ్ కంపెనీలు... కేవలం ఆ ఒక్క పనే కాకుండా మరో పని కూడా చేయవచ్చు కదా’’ అన్నాడు. ‘‘ఏంట్రా అదీ?’’ అడిగాను ఆసక్తిగా. ‘‘ఏం లేదు... వాళ్లు రోజూ ఉదయం పూటా, సాయంత్రం పూటా కాసేపు నాగుపాముల్ని బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలకు పడగ పట్టిస్తే బాగుంటుంది. డబ్బులిచ్చి మోటారు సైకిల్ చక్రాలకు గాలి పట్టించుకున్నట్లుగానే... తమ పిల్లలందరూ భవిష్యత్తులో గొప్పవాళ్లైపోవాలనుకునేవారు పడగ నీడ పట్టించుకుంటారు కదా. అలా ఐదు నిమిషాలకు యాభై, పదినిమిషాలకు వందా రేటు పెట్టొచ్చు. ఏకంగా అరగంటసేపు పట్టించుకుంటే కొంత డిస్కౌంటు కూడా ఇవ్వచ్చు’’ అన్నాడు వాడు. ‘‘బానే ఉంది కానీ... ఈ ఉదయం, సాయంత్రం గొడవేమిట్రా? ఆ టైమ్‌లో ఎందుకు పట్టాలి పడగ?’’ అని అడిగా. ‘‘ఉదయం, సాయంత్రం ఎండ ఏటవాలుగా పడుతుంది కదా నాన్నా. పామును దూరంగా ఉంచే పడగ నీడ సరిగ్గా పాపాయి తల మీద పడేలా పామును అడ్జెస్ట్ చేయవచ్చు. దాంతో పిల్లాడూ సేఫ్... మన బిజినెస్సూ సేఫ్’’ అంటూ ఓ ఐడియా ఇచ్చాడు. వాడి ఆ ఆలోచనకే అద్దిరిపోతుండగా మరో ఐడియా కూడా ఇచ్చాడు. ‘‘నాన్నా... ఈ డిస్కవరీ ఛానెల్ వాళ్లతో కలిసి మాట్లాడి, మనం ఓ నక్కల కంపెనీ పెడదాం. అందులో కొన్ని నక్కల్ని మనం ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటామన్నమాట. ఈ ఐఐటీ పరీక్షలకూ, ఈ ఎంసెట్ ఎగ్జామ్స్కూ వెళ్లబోయే ముందు రోజు మనం ‘నక్క తోక తొక్కు... ఐఐటీ మెట్లు ఎక్కు’ అంటూ ఓ ఆఫర్ ఇస్తామన్నమాట. మరి ఇంతమంది తొక్కితే నక్క తోకకు గాయం అవుతుంది కదా. అందుకే నక్కను కేజ్‌లోనే ఉంచి తోక మాత్రమే బయట ఉండేలా చూస్తాం. కాకపోతే తోక సేఫ్‌గా ఉండేలా నేల మీద ఓ గ్రూవ్ తవ్విస్తాం. తోక ఆ గ్రూవ్లో ఉంటుంది. ఆ గ్రూవ్ మీద పాదం పెడితే నక్క తోక పైభాగం పాదానికి టచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా నక్క తోక తొక్కి వచ్చిన వాళ్లలో కొంతమందికి ఆ ఐఐటీలూ, ఈ ఎంసెట్లూ వచ్చినా... చుక్కా రామయ్య గారికంటే మనకే పేరు ఎక్కువొస్తుంది. ఎలావుంది నా ఐడియా?’’ అన్నాడు వాడు. భవిష్యత్తులో వాడు ఏ టాటానో, అంబానీయో అవుతాడేమో అనే ఆలోచనలో అవాక్కుడనై అచేతనావస్థలో ఉన్నా. ఇంతలో నాకూ ఓ ఆలోచన వచ్చింది. దాంతో వాణ్ణి ఓ ప్రశ్న అడిగా. ‘‘ఒరేయ్... మనమే ఈ బిజినెస్ పెడుతున్నప్పుడూ... కాసేపూ నీకూ పడగ పట్టిస్తే పోలా. భవిష్యత్తులో నువ్వూ గొప్పవాడివి కావచ్చు కదా’’ అన్నాను. ‘‘వద్దు నాన్నా... అప్పుడు నేను గొప్పవాడినైపోతే... మనం ఇలా బిజినెస్ చేయ్యలేం కదా. అప్పుడు మరింత మందిని గొప్పవాళ్లను చేసే ఛాన్స్ పోతుంది కదా. అందుకే దానికంటే ఇదే బెటర్’’ అన్నాడు వాడు. - యాసీన్