పడగనీడ పట్టు... నక్కతోక తొక్కు! | Children have to listen more good words from elders | Sakshi
Sakshi News home page

పడగనీడ పట్టు... నక్కతోక తొక్కు!

Published Sun, Aug 17 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

పడగనీడ పట్టు... నక్కతోక తొక్కు!

పడగనీడ పట్టు... నక్కతోక తొక్కు!

నవ్వింత: ఎప్పుడైనా సరే... పిల్లలు... పెద్దలు చెప్పే కథలు వింటూ పెరగాలనేది నా ఉద్దేశం. నా ధోరణి మా బుజ్జిగాడికి చాదస్తంగా అనిపించినా సరే... నేను మాత్రం వాడికి నిద్రపోయే ముందు ఏవో కథలు చెబుతూనే ఉంటా. అందులో భాగంగానే ఓ మహానుభావుడి గురించి చెబుతూ... ‘ఆయన చిన్నప్పుడు పాకుతూ పారాడుతూ  ఎండలోకి వెళ్లి ఆడుకుంటూ ఉన్నాట్ట. అంతలో ఎండ వేడికి తట్టుకోలేక క్యారుక్యారుమని ఏడుస్తూ ఉండగా అటు వైపుగా వెళ్తున్న ఓ నాగుపాము తన పడగ  పట్టి నీడనిచ్చిందట’ అని చెప్పా. ఈ దృశ్యం చూసిన అక్కడి వాళ్లు - ‘భవిష్యత్తులో ఆ పిల్లాడు ఓ మహానుభావుడవుతాడు’ అంటూ నిర్ధారణ చేశారంటూ చెప్పా. ఈ మాట చెబుతూ ఉండగానే మా బుజ్జిగాడు వేయనే వేశాడు ఒక ప్రశ్న: ‘‘నాన్నా... నాగుపాము పడగపడితే వాళ్లు గొప్పాళ్లు అవుతారా?’’ అంటూ. ‘‘అవున్రా. ఎవరో మహర్జాతకులకు గానీ అలా జరగదు. మన కథల్లో అలా పాము పడగ నీడ పట్టినవాళ్లందరూ చాలా గొప్పవాళ్లయ్యారు’’ అన్నా.
 
తీరిక దొరికినప్పుడల్లా నేనూ మా బుజ్జిగాడితో కలిసి టీవీ చూస్తుంటా. ఆ టైమ్‌లో వాడు చూసే కార్టూన్ ఛానెళ్లకు తాత్కాలికంగా బ్రేక్ ఇప్పించి ఏ యానిమల్ ప్లానెటో, ఏ డిస్కవరీ ఛానెలో కలిసి చూస్తుంటాం. ఇలాంటి షో చూస్తున్న ఓ క్షణాన మావాడు అడిగిన ఓ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది. ‘‘నాన్నా... ఈ పాముల్ని ఇలా చులాగ్గా పట్టేసే ఈ బ్రాడీబార్‌లూ, ఈ ఆస్టిన్ స్టీవెన్స్‌లూ... వాటిని ఇలా పట్టి కాసేపు వివరించి అలా వదిలేస్తుంటారు. మరికొందరైతే... విషానికి విరుగుడు తయారు చేసే కంపెనీలకు ఇచ్చేస్తుంటారు. మన బేర్‌గ్రిల్స్‌కు బుద్ధిలేదు నాన్నా... అతగాడైతే... ఎప్పుడెప్పుడు పాము కనిపిస్తుందా... ఎప్పుడెప్పుడు దాన్ని తినేద్దామా అని చూస్తుంటాడు. నాకో ఆలోచన వచ్చింది నాన్నా. ఇలా విషానికి విరుగుడు తయారు చేసే యాంటీవీనమ్ కంపెనీలు... కేవలం ఆ ఒక్క పనే కాకుండా మరో పని కూడా చేయవచ్చు కదా’’ అన్నాడు.
 
 ‘‘ఏంట్రా అదీ?’’ అడిగాను ఆసక్తిగా.  ‘‘ఏం లేదు... వాళ్లు రోజూ ఉదయం పూటా, సాయంత్రం పూటా కాసేపు నాగుపాముల్ని బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలకు పడగ పట్టిస్తే బాగుంటుంది. డబ్బులిచ్చి మోటారు సైకిల్ చక్రాలకు గాలి పట్టించుకున్నట్లుగానే... తమ పిల్లలందరూ భవిష్యత్తులో గొప్పవాళ్లైపోవాలనుకునేవారు పడగ నీడ పట్టించుకుంటారు కదా. అలా ఐదు నిమిషాలకు యాభై, పదినిమిషాలకు వందా రేటు పెట్టొచ్చు. ఏకంగా అరగంటసేపు పట్టించుకుంటే కొంత డిస్కౌంటు కూడా ఇవ్వచ్చు’’ అన్నాడు వాడు. ‘‘బానే ఉంది కానీ... ఈ ఉదయం, సాయంత్రం గొడవేమిట్రా? ఆ టైమ్‌లో ఎందుకు పట్టాలి పడగ?’’ అని అడిగా.
 
 ‘‘ఉదయం, సాయంత్రం ఎండ ఏటవాలుగా పడుతుంది కదా నాన్నా. పామును దూరంగా ఉంచే పడగ నీడ సరిగ్గా పాపాయి తల మీద పడేలా పామును అడ్జెస్ట్ చేయవచ్చు. దాంతో పిల్లాడూ సేఫ్... మన బిజినెస్సూ సేఫ్’’ అంటూ ఓ ఐడియా ఇచ్చాడు. వాడి ఆ ఆలోచనకే అద్దిరిపోతుండగా మరో ఐడియా కూడా ఇచ్చాడు. ‘‘నాన్నా... ఈ డిస్కవరీ ఛానెల్ వాళ్లతో కలిసి మాట్లాడి, మనం ఓ నక్కల కంపెనీ  పెడదాం. అందులో కొన్ని నక్కల్ని మనం ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటామన్నమాట. ఈ ఐఐటీ పరీక్షలకూ, ఈ ఎంసెట్ ఎగ్జామ్స్‌కూ వెళ్లబోయే ముందు రోజు మనం ‘నక్క తోక తొక్కు... ఐఐటీ మెట్లు ఎక్కు’ అంటూ ఓ ఆఫర్ ఇస్తామన్నమాట. మరి ఇంతమంది తొక్కితే నక్క తోకకు గాయం అవుతుంది కదా. అందుకే నక్కను కేజ్‌లోనే ఉంచి తోక మాత్రమే  బయట ఉండేలా చూస్తాం. కాకపోతే తోక సేఫ్‌గా ఉండేలా నేల మీద ఓ గ్రూవ్ తవ్విస్తాం. తోక ఆ గ్రూవ్‌లో ఉంటుంది.
 
 ఆ గ్రూవ్ మీద పాదం పెడితే నక్క తోక పైభాగం పాదానికి టచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా నక్క తోక తొక్కి వచ్చిన వాళ్లలో కొంతమందికి ఆ ఐఐటీలూ, ఈ ఎంసెట్లూ వచ్చినా... చుక్కా రామయ్య గారికంటే మనకే పేరు ఎక్కువొస్తుంది. ఎలావుంది నా ఐడియా?’’ అన్నాడు వాడు. భవిష్యత్తులో వాడు ఏ టాటానో, అంబానీయో అవుతాడేమో అనే ఆలోచనలో అవాక్కుడనై అచేతనావస్థలో ఉన్నా. ఇంతలో నాకూ ఓ ఆలోచన వచ్చింది. దాంతో వాణ్ణి ఓ ప్రశ్న అడిగా. ‘‘ఒరేయ్... మనమే ఈ బిజినెస్ పెడుతున్నప్పుడూ... కాసేపూ నీకూ పడగ పట్టిస్తే పోలా. భవిష్యత్తులో నువ్వూ గొప్పవాడివి కావచ్చు కదా’’ అన్నాను. ‘‘వద్దు నాన్నా... అప్పుడు నేను గొప్పవాడినైపోతే... మనం ఇలా బిజినెస్ చేయ్యలేం కదా. అప్పుడు మరింత మందిని గొప్పవాళ్లను చేసే ఛాన్స్ పోతుంది కదా. అందుకే దానికంటే ఇదే బెటర్’’ అన్నాడు వాడు.
 - యాసీన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement