చుక్ షుమర్‌పై జోకులు పేల్చిన ట్రంప్
న్యూయార్క్: అమెరికా సెనేట్ మెజారిటీ నేత చుక్ షుమర్‌తోపాటు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోకులు పేల్చారు. గురువారం న్యూయార్క్‌లో జరిగిన అల్ స్మిత్ మెమోరియల్ డిన్నర్‌కు హాజరైన ట్రంప్..కమలా హ్యారిస్ నెగ్గకుంటే మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం మీకే వస్తుందంటూ షుమర్‌ను ఆటపట్టించారు.
పలువురు ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు వచ్చి సరదాగా పట్టించుకుంటారు. ఇలా అందే విరాళాలు కేథలిక్ చారిటీలకు వెళ్తుంటాయి. అయితే, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమలా హారిస్ రాలేదు. బదులుగా చుక్ షుమర్ వచ్చారు. వేదికపై ట్రంప్‌కు సమీపంలోనే ఆయన కూడా ఉన్నారు. ‘షుమర్ చాలా డల్‌గా కనిపిస్తున్నారు. మరో కోణం కూడా చూడాలి. వాళ్ల పార్టీ చాలా చురుగ్గా తయారైంది. కమల అవకాశం కోల్పోతే, మొదటి అధ్యక్షురాలయ్యే అవకాశం మీకే వచ్చే అవకాశముంది’అని షుమర్‌నుద్దేశించి ట్రంప్ బిగ్గరగా అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది.
ఈసారి కమలా హారిస్ లక్ష్యంగా ట్రంప్.. ‘నా ప్రత్యర్థి ఈ కార్యక్రమానికి రావల్సిన అవసరం లేదని భావించినట్లున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తీవ్రంగా అవమానించారు. గతంలో 1984లో వాల్టర్ మొండెల్ మాత్రమే ఇలా చేశారు. అప్పట్లో ఆయన రొనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయారు’అంటూ వ్యాఖ్యానించారు.దీనిపై అనంతరం కమల తనదైన శైలిలో స్పందించారు. ‘సహాయకుడు రాసిచ్చిన జోకుల్ని చదివేందుకే అవస్థలు పడ్డ ట్రంప్.. టెలీ ప్రాంప్టర్‌ను లోపలికి అనుమతించలేదంటూ ప్రశ్నించారు. తను అనుకుంటున్న జోకులకు ప్రేక్షకులు నవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ జోకులు ఎవరికైనా అర్థమవుతాయా? ట్రంప్ మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాదు’అంటూ చురకలు అంటించారు. అనంతరం సోషల్ మీడియాలో ట్రంప్ జోకులపై మిశ్రమ స్పందన వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment