అమెరికాతో పాక్‌ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరు ప్రతిపాదన | Pakistan Nominates Donald Trump For 2026 Nobel Peace Prize For Pivotal Leadership, Check Tweets Inside | Sakshi
Sakshi News home page

అమెరికాతో పాక్‌ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరు ప్రతిపాదన

Jun 21 2025 7:57 AM | Updated on Jun 21 2025 11:55 AM

Pak nominates Donald Trump for 2026 Nobel Peace Prize

ఇస్లామాబాద్‌: అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం పాకిస్తాన్‌ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బహిర్గతమైంది. ట్రంప్‌ విషయంలో పాకిస్తాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్‌ పేరు పాక్‌ ప్రతిపాదించింది. దీంతో, ఈ విషయంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

వివరాల ప్రకారం.. 2026 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరును పాకిస్తాన్‌ ప్రతిపాదించింది. ఈ సందర్బంగా పాకిస్తాన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్‌ కుదిర్చారని తెలిపింది. ఆయన వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రశంసలు కురిపించింది. భారత్‌ మాత్రం పాకిస్తాన్‌పై దాడికి పాల్పడి ప్రాణ నష్టానికి కారణమైందని ఆరోపించింది. ట్రంప్‌ దౌత్యం వల్లే యుద్దం ముగిసిందని చెప్పుకొచ్చింది.

రెండు దేశాల మధ్య జోక్యం నిజమైన శాంతి స్థాపకుడిగా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను స్పష్టం చేసింది. చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించాలనే ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం అని కీర్తించింది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ పదే పదే చేసిన ప్రతిపాదనలకు ఇస్లామాబాద్ కూడా ప్రశంసించింది. ఆయన ప్రమేయంతో దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని పేర్కొంది. చివరగా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండా.. ఈ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి నెలకొనదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే, ట్రంప్‌ పేరును ప్రతిపాదించిన సందర్భంగా భారత్‌ విషయాలు, కశ్మీర్‌ అంశంపై ప్రస్తావించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ట్రంప్‌.. కశ్మీర్‌ అంశమై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాక్‌ మధ్య కశ్మీర్‌ వివాదంపై తాను మధ్యవర్తిత్వం కూడా తీసుకుంటాని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు, తాజాగా పాక్‌ సైతం ఇదే ప్రస్తావన తేవడంతో కొత్త ప్లాన్‌ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కశ్మీర్‌, పీఓకే విషయంలో భారత్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

ట్రంప్‌కు నోబెల్‌ అంటే ఎంత ఇష్టమంటే.. 
అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్‌ అవార్డుపై ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నారు. పలుమార్లు తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్‌ అధినేత నెతన్యాహుతో సమావేశం సందర్భంగా వాళ్లు నాకు ఎప్పటికీ నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వరు. అది ఏమాత్రం బాగోలేదు. నేను అర్హుడను అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ఒబామాకు దీనిని ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే సంధి కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీనిని పాక్‌ బాగానే గమనించింది. ఇటీవల ఫీల్డ్‌ మార్షల్‌ అసిం మునీర్‌ మాట్లాడుతూ భారత్‌-పాక్‌ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్‌ నోబెల్‌ ప్రైజ్‌కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement