Navvintha
-
పడగనీడ పట్టు... నక్కతోక తొక్కు!
నవ్వింత: ఎప్పుడైనా సరే... పిల్లలు... పెద్దలు చెప్పే కథలు వింటూ పెరగాలనేది నా ఉద్దేశం. నా ధోరణి మా బుజ్జిగాడికి చాదస్తంగా అనిపించినా సరే... నేను మాత్రం వాడికి నిద్రపోయే ముందు ఏవో కథలు చెబుతూనే ఉంటా. అందులో భాగంగానే ఓ మహానుభావుడి గురించి చెబుతూ... ‘ఆయన చిన్నప్పుడు పాకుతూ పారాడుతూ ఎండలోకి వెళ్లి ఆడుకుంటూ ఉన్నాట్ట. అంతలో ఎండ వేడికి తట్టుకోలేక క్యారుక్యారుమని ఏడుస్తూ ఉండగా అటు వైపుగా వెళ్తున్న ఓ నాగుపాము తన పడగ పట్టి నీడనిచ్చిందట’ అని చెప్పా. ఈ దృశ్యం చూసిన అక్కడి వాళ్లు - ‘భవిష్యత్తులో ఆ పిల్లాడు ఓ మహానుభావుడవుతాడు’ అంటూ నిర్ధారణ చేశారంటూ చెప్పా. ఈ మాట చెబుతూ ఉండగానే మా బుజ్జిగాడు వేయనే వేశాడు ఒక ప్రశ్న: ‘‘నాన్నా... నాగుపాము పడగపడితే వాళ్లు గొప్పాళ్లు అవుతారా?’’ అంటూ. ‘‘అవున్రా. ఎవరో మహర్జాతకులకు గానీ అలా జరగదు. మన కథల్లో అలా పాము పడగ నీడ పట్టినవాళ్లందరూ చాలా గొప్పవాళ్లయ్యారు’’ అన్నా. తీరిక దొరికినప్పుడల్లా నేనూ మా బుజ్జిగాడితో కలిసి టీవీ చూస్తుంటా. ఆ టైమ్‌లో వాడు చూసే కార్టూన్ ఛానెళ్లకు తాత్కాలికంగా బ్రేక్ ఇప్పించి ఏ యానిమల్ ప్లానెటో, ఏ డిస్కవరీ ఛానెలో కలిసి చూస్తుంటాం. ఇలాంటి షో చూస్తున్న ఓ క్షణాన మావాడు అడిగిన ఓ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేసింది. ‘‘నాన్నా... ఈ పాముల్ని ఇలా చులాగ్గా పట్టేసే ఈ బ్రాడీబార్లూ, ఈ ఆస్టిన్ స్టీవెన్స్లూ... వాటిని ఇలా పట్టి కాసేపు వివరించి అలా వదిలేస్తుంటారు. మరికొందరైతే... విషానికి విరుగుడు తయారు చేసే కంపెనీలకు ఇచ్చేస్తుంటారు. మన బేర్‌గ్రిల్స్‌కు బుద్ధిలేదు నాన్నా... అతగాడైతే... ఎప్పుడెప్పుడు పాము కనిపిస్తుందా... ఎప్పుడెప్పుడు దాన్ని తినేద్దామా అని చూస్తుంటాడు. నాకో ఆలోచన వచ్చింది నాన్నా. ఇలా విషానికి విరుగుడు తయారు చేసే యాంటీవీనమ్ కంపెనీలు... కేవలం ఆ ఒక్క పనే కాకుండా మరో పని కూడా చేయవచ్చు కదా’’ అన్నాడు. ‘‘ఏంట్రా అదీ?’’ అడిగాను ఆసక్తిగా. ‘‘ఏం లేదు... వాళ్లు రోజూ ఉదయం పూటా, సాయంత్రం పూటా కాసేపు నాగుపాముల్ని బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలకు పడగ పట్టిస్తే బాగుంటుంది. డబ్బులిచ్చి మోటారు సైకిల్ చక్రాలకు గాలి పట్టించుకున్నట్లుగానే... తమ పిల్లలందరూ భవిష్యత్తులో గొప్పవాళ్లైపోవాలనుకునేవారు పడగ నీడ పట్టించుకుంటారు కదా. అలా ఐదు నిమిషాలకు యాభై, పదినిమిషాలకు వందా రేటు పెట్టొచ్చు. ఏకంగా అరగంటసేపు పట్టించుకుంటే కొంత డిస్కౌంటు కూడా ఇవ్వచ్చు’’ అన్నాడు వాడు. ‘‘బానే ఉంది కానీ... ఈ ఉదయం, సాయంత్రం గొడవేమిట్రా? ఆ టైమ్‌లో ఎందుకు పట్టాలి పడగ?’’ అని అడిగా. ‘‘ఉదయం, సాయంత్రం ఎండ ఏటవాలుగా పడుతుంది కదా నాన్నా. పామును దూరంగా ఉంచే పడగ నీడ సరిగ్గా పాపాయి తల మీద పడేలా పామును అడ్జెస్ట్ చేయవచ్చు. దాంతో పిల్లాడూ సేఫ్... మన బిజినెస్సూ సేఫ్’’ అంటూ ఓ ఐడియా ఇచ్చాడు. వాడి ఆ ఆలోచనకే అద్దిరిపోతుండగా మరో ఐడియా కూడా ఇచ్చాడు. ‘‘నాన్నా... ఈ డిస్కవరీ ఛానెల్ వాళ్లతో కలిసి మాట్లాడి, మనం ఓ నక్కల కంపెనీ పెడదాం. అందులో కొన్ని నక్కల్ని మనం ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటామన్నమాట. ఈ ఐఐటీ పరీక్షలకూ, ఈ ఎంసెట్ ఎగ్జామ్స్కూ వెళ్లబోయే ముందు రోజు మనం ‘నక్క తోక తొక్కు... ఐఐటీ మెట్లు ఎక్కు’ అంటూ ఓ ఆఫర్ ఇస్తామన్నమాట. మరి ఇంతమంది తొక్కితే నక్క తోకకు గాయం అవుతుంది కదా. అందుకే నక్కను కేజ్‌లోనే ఉంచి తోక మాత్రమే బయట ఉండేలా చూస్తాం. కాకపోతే తోక సేఫ్‌గా ఉండేలా నేల మీద ఓ గ్రూవ్ తవ్విస్తాం. తోక ఆ గ్రూవ్లో ఉంటుంది. ఆ గ్రూవ్ మీద పాదం పెడితే నక్క తోక పైభాగం పాదానికి టచ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా నక్క తోక తొక్కి వచ్చిన వాళ్లలో కొంతమందికి ఆ ఐఐటీలూ, ఈ ఎంసెట్లూ వచ్చినా... చుక్కా రామయ్య గారికంటే మనకే పేరు ఎక్కువొస్తుంది. ఎలావుంది నా ఐడియా?’’ అన్నాడు వాడు. భవిష్యత్తులో వాడు ఏ టాటానో, అంబానీయో అవుతాడేమో అనే ఆలోచనలో అవాక్కుడనై అచేతనావస్థలో ఉన్నా. ఇంతలో నాకూ ఓ ఆలోచన వచ్చింది. దాంతో వాణ్ణి ఓ ప్రశ్న అడిగా. ‘‘ఒరేయ్... మనమే ఈ బిజినెస్ పెడుతున్నప్పుడూ... కాసేపూ నీకూ పడగ పట్టిస్తే పోలా. భవిష్యత్తులో నువ్వూ గొప్పవాడివి కావచ్చు కదా’’ అన్నాను. ‘‘వద్దు నాన్నా... అప్పుడు నేను గొప్పవాడినైపోతే... మనం ఇలా బిజినెస్ చేయ్యలేం కదా. అప్పుడు మరింత మందిని గొప్పవాళ్లను చేసే ఛాన్స్ పోతుంది కదా. అందుకే దానికంటే ఇదే బెటర్’’ అన్నాడు వాడు. - యాసీన్ -
చతుష్చక్రే... పేషంటే...!
నవ్వింత: మా రాంబాబు దగ్గరికి వెళ్లే సమయానికి వాడు తన టేబుల్ వెనక ఛైర్లో గిర్రున తిరుగుతూ, ‘రా రా... రా’ అంటూ ఆహ్వానించాడు. ‘కొత్తగా రివాల్వింగ్ ఛైర్ కొన్నా. చూశావా?’ అన్నాడు. వేగంగా అక్కణ్నుంచి తప్పుకోడానికి ప్రయత్నించా. కానీ ఆలస్యమైంది. మామూలు ఛైర్కూ రివాల్వింగ్ ఛైర్కూ మధ్య తేడా మొదలుకొని కుర్చీల పరిణామక్రమం గురించి స్పీచ్ మొదలుపెట్టాడు వాడు. వాడి బ్రహ్మాండోపన్యాసం ప్రకారం... ధర్మం కంటే కుర్చీయే ఘనమైనదట. కృతయుగం నుంచి ధర్మం యుగానికి ఒక్కటి చొప్పున కాళ్లను వదులుకొని, కలియుగానికి ఒంటికాలిపై కుంటుతోందట. కానీ కుర్చీ అప్పట్నుంచీ నాలుగు పాదాలనే కలిగి ఉందట. ఆధునిక కుర్చీలు మరికొన్ని అదనపు పాదాలను సంతరించుకుని, వాటికింద చక్రాలను మొలిపించుకుని, ధర్మాన్ని మించిన ప్రగతి సాధించాయట. అక్కడితో ఆగకుండా కుర్చీ చక్రాల గురించీ ఏకరవు పెట్టాడు. ‘‘ఏకచక్రే మహాభోగే, ద్విచక్రే రాజభోగే అని ఏదో అంటుంటారు గానీ... కుర్చీ కింద ఐదు చక్రాలున్నాయంటే అది గొప్ప పోస్టేరా. కాకపోతే... నాలుగు చక్రాలుండి అందులో రెండు పెద్దవీ, రెండు చిన్నవీ ఉంటే మాత్రం చతుష్చక్రే పేషంటే... అప్పడది వీల్‌ఛైర్ అవుతుంది కదా!’’ ‘‘సరేరా... ఇవ్వాళ్ల బయటేదో ధర్నా ఉంది. త్వరగా వెళ్తా. లేదంటే అందులో చిక్కుబడిపోతా’’ అంటూ తప్పించుకోడానికి మళ్లీ ప్రయత్నం చేశా. కానీ కుర్చీ గురించిన మరో గొప్పదనాన్ని చెప్పడానికి నేనే స్వయంగా ముడిసరుకు అందించానని నాకు అప్పటికిగానీ అర్థం కాలేదు. ‘‘ధర్నాలూ, ఊరేగింపులూ ఇత్యాది ఆగ్రహ ప్రదర్శనలకూ కుర్చీ యమ బాగా పనిచేస్తుందిరా. ఈ మధ్య ఏదైనా నిరసన చూపాలంటే ఆల్రెడీ కుర్చీలను ఎత్తికుదేస్తున్నారనుకో. దీన్ని చూసే నాకో ఆలోచన వచ్చింది. బంద్, ధర్నా, ఘెరావ్, జైల్‌భరో, దిష్టిబొమ్మ దగ్ధం... ఈ నిరసన కార్యక్రమాల జాబితాకు ‘కుర్సీ తోడో’ అనో ‘ఆసన్ ఫోడో’ అనో ఏదైనా కొత్త పేరు పెట్టి విజయవంతంగా అమలు పరచామనుకో... ఔట్‌డేటెడ్ నిరసనల స్థానంలో సరికొత్తది వచ్చి చేరుతుంది. దీనికి మరికాస్త టెక్నాలజీ జోడించి కుర్చీని విరగొట్టే కార్యకర్తలు అది ఏ బాణాసంచాలాగో పేలుతూ, నిప్పులు విరజిమ్ముతూ ఉండేలా తయారు చేయాలి. కాకపోతే ఈ పేలుళ్లు ఘనంగానూ, ఆ నిప్పులు నిరపాయకరంగానూ, ఎలాంటి ప్రమాదాలకూ తావివ్వకుండా ఉండి తీరాలి. అప్పుడీ కుర్చీలు అటు కూర్చోడానికీ, ఇటు విరగ్గొట్టుకోవడానికీ బహుళార్థకసాధకంగా పనికి వస్తాయి’’ అన్నాడు రాంబాబు. ‘‘ఏంట్రా నీవన్నీ డిస్ట్రక్టివ్ ఆలోచనలే! ఎప్పుడూ మంచిగా ఆలోచించవు కదా’’ అన్నా వాడిని ఈసడించుకుంటూ. ‘‘అరె... ఇదెంత గొప్ప ఆలోచనో తెలుసా! ఇలాంటి కుర్చీల తయారీ కంపెనీలకు సింగిల్‌విండోలో లెసైన్సులివ్వాలి. నిరుద్యోగులు ఈ యూనిట్లు పెట్టుకునేలా ప్రభుత్వ విధానాలు రూపొందాలి. వాళ్లకు స్వయం ఉపాధీ దక్కుతుంది, కొన్నాళ్లు కూర్చోడానికి పనికి వచ్చి, ఉద్యమాలకూ అక్కరకొస్తాయి. ఆ తర్వాత అవి ఒక ప్రయోజనం కోసం నాశనమవుతాయి. వాటి జన్మా సార్థకమవుతుంది. ఎప్పటికప్పుడు నశిస్తుంటాయి కాబట్టి కొత్త కుర్చీల తయారీకీ గిరాకి ఉంటుంది. కాకపోతే డిమాండూ-సప్లైలకు సరుకు సరిపోయేలా ఉద్యమాలు ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడూ మూసపోసిన పాత నిరసనలే కాకుండా ఇలా భళ్లున పేలేవీ... నిరపాయకరంగానే నిప్పులెగజిమ్మేవీ ఉద్యమ తీవ్రతకు అద్దం పడుతుంటాయి కాబట్టి ఉద్యమకారులకూ కాస్త ఉత్తేజకరంగా ఉంటుంది. పగలగొట్టుకోడానికి కుర్చీలున్నాయి కాబట్టి బస్సులూ, వాటి అద్దాల జోలికి వెళ్లకూడదంటూ ఒక జీవో పాస్ చేస్తే సర్వజనామోదయోగ్యమే. ఏమంటావ్?’’ అన్నాడు మా రాంబాబు. ‘‘ఒరే బాబూ... కుర్చీ అంటేనే రాజకీయం. ఇక నువ్వు రాజకీయాలు మొదలుపెడితే ఆగవు. ఇప్పటికే ఎక్కువైంది వస్తా’’ అంటూ బయటికి వెళ్లబోయా. ‘‘రాజకీయాలను అస్సలు టచ్ చేయకుండానే సాహిత్యంలోనూ కుర్చీ గొప్పదనం చెబుతా వినురా. నన్నయ్యను ‘ఆదికవి’ స్థానంలో కూర్చోబెట్టి మనం గౌరవిస్తున్నామా? ఠాట్ అదేం కాదు... నన్నయ్య కంటే ముందే నన్నెచోడుడు ఆ కుర్చీలో కూర్చోదగ్గ వ్యక్తి అంటూ మానవల్లి రామకృష్ణ కవి అనే పరిశోధక మహాశయుడు నన్నయ్య గార్ని సదరు ‘ఆదికవి’ కుర్చీలోంచి లాగి కిందపడేయడానికి ట్రై చేశారట. ఈ కుర్చీలతో వచ్చే చిక్కులవీ తెలుసుకాబట్టి కరుణశ్రీకి ఒళ్లుమండి ‘కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు’... కాబట్టి ఎవడేం లాగేసుకుంటాడో లాక్కోఫోం....డి, నన్నెవ్వడూ నా స్థానం లోంచి లాగేయలేడంటూ ధీమా వ్యక్తం చేశారు. కుర్చీల హైన్యం, అది లేనివాడి దైన్యం తెలిసి తెలివిగా ఎత్తు వేసిన కరుణశ్రీ గారి గొప్పదనమది...’’ అంటూ మా రాంబాబు గాడు ఏదో చెబుతున్నాడు. రాజకీయాలు చెప్పనంటూనే సాహిత్యంలోని రాజకీయాలు చెబుతున్నప్పుడు ఏదీ వినిపించడం లేదు గానీ... ఏదో ఒక మాట మాత్రం లీలగా వినిపించింది. ‘‘అదేంట్రా... నీ తల అచ్చం నా రివాల్వింగ్ ఛైర్లాగే తిరుగుతోంది’’ అని. - యాసీన్ -
నవ్వింత: నాన్నకు డబ్బులు వేస్ట్!
మా పాపకు ఎనిమిదేళ్లు. మేం చెన్నైలో ఉన్నప్పుడు తను ఫస్ట్ క్లాస్ చదువుతున్నది. ఒకరోజు నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, తను నన్ను ఒక డౌట్ అడిగింది- ‘అమ్మా నీకు నాన ఎలా వచ్చాడు’ అని. అప్పుడు నేను, ‘మీ నానని కొనుక్కున్నానమ్మా’ అని చెప్పా. ‘అరె నాన బ్యాడ్ నాన కదా. డబ్బులు వేస్ట్ చేసి ఎందుకు కొనుక్కున్నావ్’ అంది. ‘నా సెలక్షన్ కాదుమా, అమ్మమ్మవాళ్లు తెచ్చిచ్చారు’ అన్నా. ఇంతలో స్నానం చేసి, అప్పుడే మావారు హాల్లోకి వచ్చారు. జరిగింది చెప్పా. వాళ్ల నాన్న కోపంగా చూశారు తన వైపు. వెంటనే తను, ‘నాన నువ్వు వెరీ వెరీ గుడ్ నాన. జోక్‌గా చెప్పాను. నువ్వు మంచి నానవు’ అంటూ వాళ్ల నాన్నని పట్టుకుంది. అది తనలో ఒకవైపే. సెకెండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు తనకు బాగా ఫీవర్ వచ్చింది. చిల్డ్రన్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. ఫుల్ రష్‌గా ఉంది. టోకెన్ తీసుకొని తనని కూర్చోబెట్టేందుకు వెయిటింగ్ రూమ్‌కి తీసుకెళ్లా. అక్కడ ఒక సీట్ మాత్రమే ఉంది. కూర్చోమ్మా అన్నా. కానీ తను కూర్చోలేదు. ‘ఫరవాలేదుమా, నేను నిలబడే ఉంటా. నువ్వు కూర్చో’ అంది. తను వినలేదు, నన్నే కూర్చోమంది. అంత ఫీవర్‌లో కూడా నేను కూర్చొని, తనని నాపై కూర్చోబెట్టుకున్నా. ఆ టైమ్‌లో కూడా తనకి టెంపరేచర్ ఉన్నా, తనన్న మాటకు ఆనందంతో నా కళ్లు చెమ్మగిల్లాయి. - శైలజ మనోహర్ తిరుపతి ముఖచిత్ర లేఖనం: వాసు -
వేపాలే... నిభకలే... పమీలే!!
నవ్వింత: పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడన్నది లోకాన వాడు. అది అక్షరాలా నిజమే. అయితే ఎలా తప్పిస్తాడు? ఓరోజు నిద్రలేచే సమయానికి నా ఒంటిపై ఎర్రటి పెద్ద పెద్ద దద్దుర్లు కనిపించాయి. కాస్త పరిశీలనగా చూద్దును కదా... మా ఆవిడ ఒంటిపై కూడా. ‘‘పదపద హాస్పిటల్‌కు వెళ్దాం’’ అన్నాను. ‘‘అక్కర్లేదు’’ అంది మా ఆవిడ. ‘‘ఇంత పెద్దగా ఎర్రగా దద్దుర్లు వస్తే వద్దంటావ్?’’ ఆశ్చర్యంగా అడిగా. ‘‘ఇదంతా మన బుజ్జిగాడి ప్రతాపం. వాడు నరకంలో శిక్షలకు ట్రైనింగ్ క్లాసు ఇప్పిస్తున్నాడు. ఇది ‘మిక్రినజంభో’ శిక్ష’’ ‘‘ఇది అపరిచితుడు సినిమాలోని ఓ శిక్ష కదూ. దాన్ని వీడు మనకెలా వేశాడు? ఎందుకు వేశాడు?’’ మళ్లీ నా ఆశ్చర్యం. ‘‘వీడు పొద్దస్తమానం బెడ్‌పై కూర్చుని లేస్ అనీ, కుర్కురేలనీ, పిక్నిక్లనీ రకరకాలు తింటుంటాడు కదా. అలాగే కాస్త కాస్త పొడి రాలేలా ఆ చాక్లెట్లు, తీపి పదార్థాలు తింటాడు. దాంతో వాటికోసం చీమలు వచ్చేసి పనిలోపనిగా మనల్నీ కుడతాయి. అలా ‘క్రిమిభోజనం’ శిక్షను భరించగలిగేలా వీడు మనకిప్పుడు కోచింగ్ ఇస్తున్నాడన్నమాట. ఇదొక్కటే కాదు, ఇలాంటివెన్నో శిక్షలు వేస్తూ, అమలు పరుస్తూ ఉన్నాడూ, ఉంటాడు’’ ‘‘ఛ... ఊర్కో. వాడినంతలేసి మాటలెందుకంటావ్. వాడి చేష్టలను మనమెప్పుడైనా శిక్షగా ఫీలయ్యామా?’’ అన్నాను. ‘‘అదే వాడి గొప్పదనం’’ అంటూ... వాడి శిక్షాస్మృతుల్లో కొన్నింటిని వివరించింది మా ఆవిడ. (గమనిక: ఇక్కడ స్మృతి అంటే మా జ్ఞాపకం అని అర్థం. అనగా మావాడు విధించిన శిక్షల తాలూకు జ్ఞాపకాలని తాత్పర్యం). ‘‘వీడు అప్పుడే నా పొట్టలోంచి బయటకు వచ్చాడు కదా. అలా వచ్చినవాడు ఊరుకుంటాడా...? రాత్రి ఏ రెండింటికో, మూడింటికో మేల్కొని ఓ గంటా అరగంటా అడుకుని మళ్లీ పడుకుంటాడు. అమెరికాకు వెళ్లి ఇండియాకు వచ్చిన వారు ఇక్కడి రాత్రిని అక్కడి పగలుగా అనుకుని మెలకువతో ఉండటం, మళ్లీ పగటివేళ అక్కడి రాత్రి అలవాటుతో పడుకోవడం చేస్తుంటారు. వాళ్లకా జెట్లాగ్ ఉన్నట్టే... మన బుజ్జిగాడికి పొట్టలాగ్ ఉంటుందన్నమాట. వాడి మానాన వాడు నిద్రపోవడం లేదా వాడికిష్టమొచ్చినప్పుడు మళ్లీ నిద్రలేవడం చేస్తాడు. అది మనం నిద్రపోయేవేళా లేక మెలకువతో ఉండే వేళా అన్నది వాడికి అనవసరం కదా. అలా వాడెప్పుడు మేల్కొంటాడో అని మనం ఎదురుచూస్తూ... మీరూ, నేనూ వంతుల వారీ వాచ్‌మేన్ డ్యూటీలు చేసిన విషయం గుర్తులేదా? హు... ఈ లోకంలో ఒబామా అయినా ఒకటే. ఐరాస చీఫ్ అయినా అంతే. బిడ్డను కన్న తర్వాత వాచీతో నిమిత్తం లేకుండా కళ్లు వాచిపోయేలా డ్యూటీలు చేస్తారు కాబట్టి తల్లిదండ్రులందరినీ ‘వాచ్‌మేన్ విత్ గోల్డెన్ వాచీ విత్ కళ్లూ ఒళ్లూ వాచి’ అందాం’’ ‘‘దీనికి ఏదైనా పేరుపెట్టరాదూ?’’ ‘‘వేపాలే-నిభకలే-పమీలే అందాం’’ ‘‘అంటే?’’ ‘‘వేళాపాళాలేకుండా నిద్రాభంగం కలిగించేసి పక్కమీది నుంచి లేపేయడం’’ అని జవాబిచ్చింది మా ఆవిడ. ‘‘అన్నట్టు మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తూ వస్తూ ఉన్న ఆరోజు మీకు గుర్తుందా?’’ అడిగింది మా ఆవిడ. ‘‘అదెలా మరచిపోగలను చెప్పు. ఆ రోజే కదా మనవాడు నా మీద సూసూ పోశాడు. ఆ తడిసీట్లలోనే కూర్చుని, తడిబట్టలతోనే జర్నీ అంతా చేశాం. అంత తడితో వణుకుతూ పడుకుని మరీ వచ్చాం కదా’’ ‘‘చూశారా... నాకు తెలిసి నిశ్చింతగా నిద్రపోవడాన్ని మీ మగాళ్లంతా కాస్త మొరటుగా ‘తడిబట్టేసుకుని పడుకోవడం’ అంటుంటారు కదా. ఆ నానుడి ఇలాంటి అనుభవం నుంచే పుట్టుకొచ్చిందేమో?! ఇలా కొడుకులందరూ నరకం ఎలా ఉంటుందో తల్లిదండ్రులకు చూపిస్తారు. అక్కడి శిక్షల్ని ఇక్కడ కొద్ది డోసుల్లో అమలు చేస్తూ మనతో కాస్త రిహార్సల్స్ చేయిస్తారు. దాంతో మనం పున్నామ నరకాన్ని, అక్కడి శిక్షలనూ సులభంగా అధిగమించగలమన్నమాట’’ ఉపదేశించింది మా ఆవిడ. ‘‘అవున్నిజమే కదా’’ అనిపించింది. ఏదో సందర్భంలో ‘‘నరకము కూడా సుఖమే కదా... నీ శిక్షలతో, నీ టార్చర్లతో... నీ కోసమె నే జీవించునదీ’’ అంటూ పేరడీ పాడుతుంటే, ‘ఇదే పాటను మరోలా విన్నానే’ అన్నాడు మావాడు. ‘‘ఆ అసలు పాట నిజమో కాదో గానీ... బిడ్డలున్న ప్రతి తల్లిదండ్రులూ ఏకగ్రీవంగా, ఏకకంఠంతో ఒప్పుకునేది... ఇప్పుడు నేను పాడే పాటే’’ అంటూ బల్లగుద్ది చెప్పేశా. పైగా దీనికి మా ఆవిడ ఒత్తాసుకూడా ఉంది. ఇంక నాకేం భయ్యం? - యాసీన్ -
నవ్వింత: ఎంతపని చేశావురా... స్పీల్‌బర్గూ!
‘‘ఒరే స్పీల్‌బర్గూ!... నీ సినిమా ఐస్బర్గును ఢీకొట్ట. అన్నీ చూపించి ఆ ఒక్కటి చూపించకపోబట్టే కదా నాకీ తిప్పలు’’ అని తిట్టుకున్నాన్నేను. నేను స్పీల్బర్గును తిట్టడానికి కారణం... మా బుడ్డోడు. మా బుడ్డోడు నిద్ర పోబోయే ముందర వాడితో తప్పనిసరిగా ఒకసారీ, మళ్లీ సరిగ్గా గంట తర్వాత లేపి మరోసారీ ‘సూసూ’ పోయించాలి. లేకపోతే పక్క తడిపేస్తాడేమోనని భయం. అందుకే కొద్దిరోజులుగా మేమీ నియమాన్ని తప్పక ఫాలో అవుతూ వస్తున్నాం. ఈ క్రమంలో వాడు నన్ను అడిగిన ప్రశ్న నాకు దిమ్మతిరిగేలా చేసింది. అంతేకాదు... స్పీల్బర్గును విపరీతంగా తిట్టుకునేలా కూడా చేసింది. ఓ రాత్రి మా బుజ్జిగాడితో సూసూ పోయిస్తూ ఉండగా... వాడో విచిత్రమైన ప్రశ్న అడిగాడు నన్ను. అప్పటివరకూ అది కూడా అన్ని రాత్రుల్లాగా మామూలు రాత్రే అనుకున్నా. కానీ అది నా పాలిట కాళరాత్రి కాబోతోందని అప్పటికి నాకు తెలియదు. ‘‘నాన్నా... డైనోసార్ సూసూ చేస్తే అది ఒక లీటరో, ప్ఫది లీటర్లో ఉంటుంది కదా’’ అంటూ అడిగాడు మా బుజ్జిగాడు. అంతే... నాకు కాసేపు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇటీవల వాడు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడటం ఎక్కువైంది. పోన్లే అంతా మనమంచికే కదా అనుకున్నా. కానీ అది మన మెడకు ఇలా చుట్టుకుంటుందని అప్పటికి నాకు తెలియదు. ‘‘లెక్కప్రకారమైతే అలాగే ఉండాలి’’ అన్నా అయోమయంగా. ‘‘డైనోసార్ అంటే ఏమిటి? రాక్షసబల్లి. మరి... మామూలు బల్లి కూడా సూసూ పోస్తే మన గోడలన్నీ తడిచిపోవాలి కదా. కానీ అలా జరగడం లేదు కదా. అలాంటప్పుడు మన ఇంటి బల్లే పోయనప్పుడు మరి రాక్షసబల్లి సూసూ పోస్తుందంటావా?’’ అని అడిగాడు. ‘‘పక్షులన్నీ బల్లి జాతి తర్వాత వచ్చినవే. మరి అవి సూసూ పోయడం లేదు కదా. కేవలం టాయ్లెటుకు వెళ్తాయంతే. కాబట్టి దాని కంటే ఎంతో ముందు పుట్టిన డైనోసార్ కూడా సూసూ పోయదనుకుంటా’’ అన్నాను నేను. ‘‘నువ్వు ఇంత పెద్ద వాడివి. పైగా నాకంటే పెద్ద క్లాసులు చదువుకున్నావు. డైనోసార్ సూసూ పోస్తుందో, పోయదో నీకు తెలియదా?’’ అన్నాడు వాడు నన్ను హీనంగా చూస్తూ. బోల్డంత అవమానం అనిపించింది. పోన్లే ఓసారి స్టీవెన్ స్పీల్బర్గ్ను పలకరిద్దాం అనుకున్నా. వెంటనే జురాసిక్ పార్కులోకి ప్రవేశించి, డైనోసార్లను కాస్త పరికిద్దును కదా... అవి మరుగుదొడ్డికి వెళ్లిన అంశాన్ని ఇన్‌డెరైక్ట్‌గా చెప్పాడు. అంతే తప్ప అవి సూసూ పోశాయా, లేదా అన్న వివరం మాత్రం వివరంగా లేదు. ‘‘స్పీల్ బర్గ్ కూడా పెద్దగా ఏమీ చెప్పలేదురా. కాకపోతే దోమలూ డైనోసార్లనూ కుడతాయని తేలింది’’ అన్నాను. ‘‘అయ్యోపాపం... దోమల్ని తరిమేద్దామంటే డైనోసార్లకు ముందు చేతులు కూడా వీక్ కదా నాన్నా’’ అని జాలిపడుతూ అంతలోనే కోపం తెచ్చుకుని... ‘‘అయినా ఇంత చిన్న విషయాలు కూడా పెద్దలకు తెలియకపోవడం ఏమిటీ?’’ అంటూ కోప్పడ్డాడు వాడు. ఇక చివరకు చేసేదేం లేక ‘ఒరే... డైనోసార్లతో నాకు పెద్దగా పరిచయం లేదురా. నాకేమీ తెలియదు రా’ అంటూ వాడి దగ్గర సరండరైపోయా. అప్పుడు తీరా వాడో మాట అంటే నేను మళ్లీ అవాక్కైపోయా! ‘‘నానా... డైనోసార్ బిడ్డ కూడా రాత్రిపూట నాలాగే నిద్రలో పక్క గానీ తడిపిందంటే, దాని సూసూలో అదే మునిగిపోతుందేమో కదా నాన్నా’’ అన్నాడు ఆందోళనగా. అది మునగడం ఏమోగానీ... నేను మాత్రం నిండా మునిగిపోయా... ఆశ్చర్యంలో!! చివరకు స్పీల్బర్గుకు మెయిలిద్దాం అని నిర్ణయించుకున్నా. కానీ శతకోటి మెయిళ్లలో నాదీ మరొకటి అవుతుందేమో అనుకుని... పోస్టుమేనే నేరుగా వెళ్లి స్పీల్బర్గుకే అందించేలా... ‘ఒరేయ్ నాయనా ... మా బుజ్జిగాడి కోసమైనా మరో సినిమా తియ్రా’ అంటూ రేపు అతగాడికో ‘ఇంగ్లాండు లెటర్’ రాద్దామనుకుంటున్నా. అన్నట్టు ఇంగ్లాండు లెటర్ స్పీల్బర్గు వాళ్ల ఊరు అమెరికా వెళ్తుందో లేదో? - యాసీన్ -
నవ్వింత: మా బుడ్డోడూ... ఒక సైన్సు పాఠం!
మొన్నోరోజు మా ఆవిడనూ, బుడ్డోడినీ బయటకు తీసుకెళ్దామని బైక్ దగ్గరకు వెళ్తుంటే బండి తాళంచెవి కిందపడింది. ‘‘తాళం చెవి కిందపడితే సౌండ్ ఎందుకు వస్తుంది నాన్నా?’’ అని అడిగాడు మా బుడ్డోడు. శబ్దం, కంపనం, పౌనఃపున్యం అంటూ నాకు తెలిసిన భౌతిక శాస్త్రం చెప్పబోయా. కానీ భౌతిక శాస్త్రాన్ని మా సీనియర్లు బహుతిక్క శాస్త్రమని ఎందుకనేవారో నాకు అప్పుడర్థమైంది. మనసులో ఏవో ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయిగానీ చెప్పడంలో కష్టమయ్యేలోపే బుడ్డోడు నా శ్రమను తగ్గించాడు. ‘‘తాళం చేవి కింద పడితే సౌండొచ్చేది ఎందుకంటే... మనం తాళం చెవిని కింద పడేసుకున్న విషయం మనకు తెలియాలని దేవుడు చేసిన ఏర్పాటది’’. వెళ్లక వెళ్లక ఏదో ఓ పూట ఇలా బయల్దేరబోయే సమయానికి తాళంచెవి ఎక్కడో పారేసుకున్నందుకు మా ఆవిడ కోప్పడుతుందేమోనని భయపడ్డాను. అయితే పొలంలో పంట కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు అల్పపీడనం ఏర్పడ్డాక కూడా అది పెనుతుఫానుగా మారకపోతే రైతు ఎంతగా ఆనందిస్తాడో... అంతకు రెట్టింపు సంతోషంతో నేనూ మా బుడ్డోడి తెలివితేటలకు మురిసిపోయా. మావాడికి ఉన్న దైవభక్తికి మా ఆవిడ కూడా ముచ్చట పడటం కన్నా, మా ఆవిడకు కోపం రాలేదనే అంశమే నన్ను సంతోషపెట్టింది. దాంతో బహు తేలికమనస్కుడనై వెంటనే భగవంతుడికి గాల్లోనే దండం పెట్టుకున్నా. కానీ నా సంతోషం ఎంతో సేపు నిలవలేదు. ఆ రాత్రి అల్పపీడనం ఏర్పడకుండానే తుఫాను తీరం దాటేసింది. ఇలాక్కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోకండి! ఆ సాయంత్రం మా ఆవిడ కూల్‌డ్రింక్స్ పోసి గ్లాసు నా చేతికి ఇచ్చింది. అది కాస్తా జారి గ్లాసు భళ్లున మోగింది. గ్లాసు కింద పడగానే మావాడు తొలుత దిగ్భ్రాంతినీ, ఆ తర్వాత నాపట్ల సానుభూతినీ వ్యక్తం చేశాడు. అప్పుడు నాలోపల మళ్లీ పాఠం మొదలైంది. ‘శబ్దమూ... కంపనమూ’. కానీ ఆ యొక్క కంపనము ఏదైతే ఉందో అది నా గుండెది. దాని శబ్దం దడదడమని బయటకు వినిపిస్తూ నాలో మరింతగా ప్రతిధ్వనిస్తోంది. గ్లాసు పడేయడం ఎలా ఉన్నా, ఇంకా బింకంగానే దాన్నుంచి కూడా కనీసం ఏదో ఒకటి మా బుడ్డోడికి నేర్పుతున్నాను కదా అన్న విషయమైనా మా ఆవిడను సంతోషపెడుతుందేమో అన్నది నా స్వార్థం. ఫలితం లేకపోయింది. గత జన్మలో మొదలుకొని ఇలా గ్లాసును ఇప్పటివరకు నేనెన్నిసార్లు కింద పడేశాను అనే అంశంపై మా ఆవిడ ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. ‘‘తాళం చెవికి పెట్టిన రూల్‌నే దేవుడు గ్లాసుకూ పెట్టడం దురదృష్టకరం నాన్నా... తాళంచెవి కిందపడ్డ విషయం మనకు తెలిసేలా ఏర్పాటు చేసినట్టే, గ్లాసు కిందపడ్డ సంగతి అమ్మకు తెలియకుండా ఏర్పాటు చేసి ఉంటే దేవుడు మరింత గొప్పవాడయ్యేవాడు. అది చేసినవాడు నిజంగా దేవుడే నాన్నా’’ అని కండోలెన్స్ మెసేజ్ రూపంలో ఓ అనధికార ప్రకటనను (రహస్యంగా నా ఒక్కడి కోసమే) వెలువరించాడు మా బుడ్డోడు. గుండెజారినా గ్లాసు జారినంత శబ్దం వస్తుందనీ, అయితే ఆ శబ్దం నాకు మాత్రమే వినిపిస్తుందనీ నాకో కొత్త అభౌతికశాస్త్రపాఠం తెలిసింది. - యాసీన్ -
నవ్వింత: పేదకుటుంబం అంటే...
ఒక ధనవంతుడి కొడుకుని స్కూల్లో ‘పేదకుటుంబం’ అనే విషయం మీద వ్యాసం రాయ మన్నారు. అతడు ఇలా రాయసాగాడు. ‘‘అనగనగా ఓ బీద కుటుంబం. తండ్రి చాలా బీదవాడు. తల్లి కూడా ఎంతో పేదది. వాళ్ల పిల్లలు కూడా అంతే. పాపం వాళ్ల కారు డ్రైవరు, వంటమనిషి, తోటమాలి... అంతా పేదవాళ్లే. చివరకు వాళ్లింట్లో పనిచేసే వాచ్‌మేన్ కూడా బీదవాడే. ఒక రోజున వాళ్లు తినడానికి తిండిలేక, ఆహారం వెతుక్కంటూ కారులో బయలుదేరారు...’’ పెళ్లాడేదెవరిని? అతడు: ఇక మన పెళ్లి జరగదు రాధా... ఆమె: ఎందుకు గోపీ? అతడు: పొద్దున మీ ఇంటికి వెళ్లాను. ఆమె: మా నాన్నను కలిశావా? వద్దన్నాడా?! అతడు: కాదు మీ చెల్లిని చూశా! వార్నీ... ఏం చెప్పావ్! టీచర్: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? స్టూడెంట్: డాక్టర్నవుతా. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం, గణిత శాస్త్రం బాగా నేర్చుకొంటున్నా. టీచర్: డాక్టర్ అవ్వాలంటే జీవశాస్త్రం నేర్చుకొంటే చాలుగా, గణితం ఎందుకు? స్టూడెంట్: బిల్స్ రాసివ్వడానికి! నాకూ రాదులే! స్విమ్మింగ్‌పూల్‌లోకి దూసుకెళ్తున్న గణేష్‌ని అక్కడి గార్డ్ అడ్డుకొన్నాడు. గార్డ్: అందులో నీళ్లు లేవు సార్.. గ ణేష్: నాక్కూడా ఈత రాదు లేవయ్యా! -
నవ్వింత: అసలు ఇండియన్!
అమెరికా వాడు: ఇంట్లో కరెంటు పోతే పవర్ ఆఫీసుకు ఫోన్ చేస్తాడు. జపాన్ వాడు: ఇంట్లో కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేసుకుంటాడు. ఇండియన్: పక్కింటికెళ్లి కరెంటుందా లేదా అని చూస్తాడు. మరుపులో మరుపు రోగి: డాక్టరు గారు... నేను చెప్పింది వెంటనే మరిచిపోతాను. డాక్టరు: ఈ సమస్యను మీరు ఎప్పుడు గుర్తించారు? రోగి: ఏ సమస్య ??!!! కవలలైతేనో? విడాకుల కోసం వచ్చిన ఓ జంట కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. జడ్జి: విడాకులు ఇవ్వమంటున్నారు సరే. ఆస్తికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నాయా? భార్య: ఇద్దరం చెరిసగం పంచుకుందామనుకున్నాం సార్. జడ్జి: మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా. వారిని ఎలా పంచుకుంటారు? అమాయకుడైన భర్త: అయితే, మేము వచ్చే ఏడాది విడాకులకు అప్లై చేస్తాం!! -
నవ్వింత: పంచ్ పడింది!
పరీక్ష ఫెయిలైన కొడుకును తిడుతూ ఓ తండ్రి ‘‘ఇంకోసారి ఫెయిలైతే ఇక నువ్వు నన్ను మరిచిపోవాల్సిందే!’’ అన్నాడు కోపంగా. (ఏడాది తర్వాత) తండ్రి: ఏరా రిజల్ట్స్ వచ్చాయా? కొడుకు: ఎవరు నువ్వు? పచ్చి నిజం హిస్టరీ లెక్చరర్: మూడో ప్రపంచం యుద్ధం వస్తే ఏం జరుగుతుంది? స్టూడెంట్: ఇంకో చాప్టర్ పెరుగుతుంది!! ఏం చెప్పిందండీ! ఫ్రెండ్ 1: ఏరా కార్తీకను రెస్టారెంట్‌కు తీసుకెళ్లావు, ఏం మాట్లాడుకున్నారు. ఫ్రెండ్ 2: ఏం మాట్లాడుకోలేదు, కళ్లలోకి చూసుకుంటూ గడిపాం. ఫ్రెండ్ 1: తను కూడా ఏమీ మాట్లాడలేదా? ఫ్రెండ్ 2: మూడు పదాలు మాత్రం చెప్పింది! ఫ్రెండ్ 1: ఐ లవ్ యూ... అనా? ఫ్రెండ్ 2: కాదు... పే ద బిల్... అని