నవ్వింత: ఎంతపని చేశావురా... స్పీల్‌బర్గూ! | Joke of the week Spell burgh | Sakshi
Sakshi News home page

నవ్వింత: ఎంతపని చేశావురా... స్పీల్‌బర్గూ!

Published Sun, Apr 20 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

నవ్వింత: ఎంతపని చేశావురా... స్పీల్‌బర్గూ!

నవ్వింత: ఎంతపని చేశావురా... స్పీల్‌బర్గూ!

‘‘ఒరే స్పీల్‌బర్గూ!... నీ సినిమా ఐస్‌బర్గును ఢీకొట్ట. అన్నీ చూపించి ఆ ఒక్కటి చూపించకపోబట్టే కదా నాకీ తిప్పలు’’ అని తిట్టుకున్నాన్నేను.  నేను స్పీల్‌బర్గును తిట్టడానికి కారణం... మా బుడ్డోడు.  మా బుడ్డోడు నిద్ర పోబోయే ముందర వాడితో తప్పనిసరిగా ఒకసారీ, మళ్లీ సరిగ్గా గంట తర్వాత లేపి మరోసారీ ‘సూసూ’ పోయించాలి. లేకపోతే పక్క తడిపేస్తాడేమోనని భయం. అందుకే కొద్దిరోజులుగా మేమీ నియమాన్ని తప్పక ఫాలో అవుతూ వస్తున్నాం.  ఈ క్రమంలో వాడు నన్ను అడిగిన ప్రశ్న నాకు దిమ్మతిరిగేలా చేసింది. అంతేకాదు... స్పీల్‌బర్గును విపరీతంగా తిట్టుకునేలా కూడా చేసింది.
    
 ఓ రాత్రి మా బుజ్జిగాడితో సూసూ పోయిస్తూ ఉండగా... వాడో విచిత్రమైన ప్రశ్న అడిగాడు నన్ను.  అప్పటివరకూ అది కూడా అన్ని రాత్రుల్లాగా మామూలు రాత్రే అనుకున్నా. కానీ అది నా పాలిట కాళరాత్రి కాబోతోందని అప్పటికి నాకు తెలియదు. ‘‘నాన్నా... డైనోసార్ సూసూ చేస్తే అది ఒక లీటరో, ప్ఫది లీటర్లో ఉంటుంది కదా’’ అంటూ అడిగాడు మా బుజ్జిగాడు. అంతే... నాకు కాసేపు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇటీవల వాడు సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడటం ఎక్కువైంది. పోన్లే అంతా మనమంచికే కదా అనుకున్నా. కానీ అది మన మెడకు ఇలా చుట్టుకుంటుందని అప్పటికి నాకు తెలియదు. ‘‘లెక్కప్రకారమైతే అలాగే ఉండాలి’’ అన్నా అయోమయంగా. ‘‘డైనోసార్ అంటే ఏమిటి? రాక్షసబల్లి. మరి... మామూలు బల్లి కూడా సూసూ పోస్తే మన గోడలన్నీ తడిచిపోవాలి కదా. కానీ అలా జరగడం లేదు కదా. అలాంటప్పుడు మన ఇంటి బల్లే పోయనప్పుడు మరి రాక్షసబల్లి సూసూ పోస్తుందంటావా?’’ అని అడిగాడు.
 
 ‘‘పక్షులన్నీ బల్లి జాతి తర్వాత వచ్చినవే. మరి అవి సూసూ పోయడం లేదు కదా. కేవలం టాయ్‌లెటుకు వెళ్తాయంతే. కాబట్టి దాని కంటే ఎంతో ముందు పుట్టిన డైనోసార్ కూడా సూసూ పోయదనుకుంటా’’ అన్నాను నేను.
 ‘‘నువ్వు ఇంత పెద్ద వాడివి. పైగా నాకంటే పెద్ద క్లాసులు చదువుకున్నావు. డైనోసార్ సూసూ పోస్తుందో, పోయదో నీకు తెలియదా?’’ అన్నాడు వాడు నన్ను హీనంగా చూస్తూ.
 
 బోల్డంత అవమానం అనిపించింది. పోన్లే ఓసారి స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను పలకరిద్దాం అనుకున్నా. వెంటనే జురాసిక్ పార్కులోకి ప్రవేశించి, డైనోసార్లను కాస్త  పరికిద్దును కదా... అవి  మరుగుదొడ్డికి వెళ్లిన అంశాన్ని ఇన్‌డెరైక్ట్‌గా చెప్పాడు. అంతే తప్ప అవి  సూసూ పోశాయా, లేదా అన్న వివరం మాత్రం వివరంగా లేదు. ‘‘స్పీల్ బర్గ్ కూడా పెద్దగా ఏమీ చెప్పలేదురా. కాకపోతే దోమలూ డైనోసార్లనూ కుడతాయని తేలింది’’ అన్నాను.
 ‘‘అయ్యోపాపం... దోమల్ని తరిమేద్దామంటే డైనోసార్లకు ముందు  చేతులు కూడా వీక్ కదా నాన్నా’’ అని జాలిపడుతూ అంతలోనే కోపం తెచ్చుకుని... ‘‘అయినా ఇంత చిన్న విషయాలు కూడా పెద్దలకు తెలియకపోవడం ఏమిటీ?’’ అంటూ కోప్పడ్డాడు వాడు.
 
    
 ఇక చివరకు చేసేదేం లేక ‘ఒరే... డైనోసార్లతో నాకు పెద్దగా పరిచయం లేదురా.  నాకేమీ తెలియదు రా’ అంటూ వాడి దగ్గర సరండరైపోయా.
 అప్పుడు తీరా వాడో మాట అంటే నేను మళ్లీ అవాక్కైపోయా!
 ‘‘నానా... డైనోసార్ బిడ్డ కూడా రాత్రిపూట నాలాగే నిద్రలో పక్క గానీ తడిపిందంటే, దాని సూసూలో అదే మునిగిపోతుందేమో కదా నాన్నా’’ అన్నాడు ఆందోళనగా.
 అది మునగడం ఏమోగానీ... నేను మాత్రం నిండా మునిగిపోయా... ఆశ్చర్యంలో!!  
 చివరకు స్పీల్‌బర్గుకు మెయిలిద్దాం అని నిర్ణయించుకున్నా. కానీ శతకోటి మెయిళ్లలో నాదీ మరొకటి అవుతుందేమో అనుకుని... పోస్టుమేనే నేరుగా వెళ్లి స్పీల్‌బర్గుకే అందించేలా... ‘ఒరేయ్ నాయనా ... మా బుజ్జిగాడి కోసమైనా మరో సినిమా తియ్‌రా’ అంటూ రేపు అతగాడికో ‘ఇంగ్లాండు లెటర్’ రాద్దామనుకుంటున్నా. అన్నట్టు ఇంగ్లాండు లెటర్ స్పీల్‌బర్గు వాళ్ల ఊరు అమెరికా వెళ్తుందో లేదో?
 - యాసీన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement