ఒకప్పుడు అడవుల్లో వేట కామన్. నాడు రాజులు సరదాకి చేస్తే.. ఆదివాసీలు ఇప్పటికీ ఆహారం కోసం వేటాడుతుంటారు. ఏ జింకలో, అడవి పందులో అయితే సరే. మరీ పులిని వేటాడాలంటే కష్టం. అది నిషేధం కూడా. మరి ఏకంగా డైనోసార్‌నే వేటాడాలనుకుంటే.. అందుకు అఫీషియల్‌గా లైసెన్స్ కూడా ఇస్తే.. ఆశ్చర్యంగా అనిపిస్తోందా.. ఆ సంగతులేమిటో తెలుసుకుందామా..
అది డైనోసార్ ల్యాండ్..
ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల డైనోసార్ల అవశేషాలు బయటపడినా.. అమెరికా మాత్రం స్పెషల్. ఒకప్పుడు భారీ సంఖ్యలో డైనోసార్లు తిరుగాడిన నేల అది. అందులోనూ ఉటా రాష్ట్రంలోని వెర్నల్ ప్రాంతంలో వేలకొద్దీ డైనోసార్ల శిలాజాలను గుర్తించారు. మనం డైనోసార్లను వేటాడటానికి అధికారికంగా లైసెన్సులు ఇచ్చేది కూడా ఇక్కడే. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పర్యాటకులు అక్కడికి వెళ్లినప్పుడు దరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ ఇచ్చేస్తారు. కానీ వేటాడటానికి డైనోసార్లు దొరుకుతాయా అని మాత్రం అడగొద్దు సుమా.
పర్యాటకం కోసం.. శిలాజాల గుర్తింపు కోసం..
ఉటా ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచేందుకు, డైనోసార్ల శిలాజాల వెలికితీతకు ఊపునిచ్చేందుకు 1951లో ‘డైనోసార్ హంటింగ్ లైసెన్స్’లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రాంతానికి ‘డైనోసార్ కంట్రోల్ ఏరియా ఆఫ్ యూంటా కౌంటీ’ అని పేరు పెట్టారు. ఈ వినూత్న ఆలోచనతో పర్యాటకులు కూడా పెరిగారు. ఏటా 60 వేల మందికే లైసెన్స్‌లు ఇస్తారు. అంతేకాదు చాలా రూల్స్ కూడా పాటించాల్సి ఉంటుంది.
►లైసెన్స్ పొందినవారు టీ–రెక్స్ డైనోసార్లలో కేవలం ఒక పెద్ద మగదానిని మాత్రమే వేటాడాలి.
►ఒక డిప్లోడాకస్ గిగాంటికస్ (అతిభారీ శాఖాహార డైనోసార్)ను వేటాడొచ్చు. అయితే దాని బరువు 5 వేల పౌండ్లు (2,268 కేజీలు)కన్నా ఎక్కువగా ఉండాలి
►ఏవైనా రెండు మగ స్టెగోసార్ (వీపుపై ముళ్లలా ఉండేవి) డైనోసార్లను వేటాడొచ్చు.
►టెరోడాక్టిల్ (పక్షుల్లా ఎగిరేవి) డైనోసార్లను అయితే నాలుగింటిని వేటాడొచ్చు. అయితే ఇందులో పిల్ల డైనోసార్లు ఉండొద్దు.
కుప్పలు కుప్పలుగా డైనోసార్ల ఎముకలు
ఉటా స్టేట్‌లోని వెర్నల్ ప్రాంతంలో సుమారు రెండు లక్షల ఎకరాల ప్రాంతంలో ‘డైనోసార్ నేషనల్ మాన్యుమెంట్’ ఉంది. దీన్నే డైనోసార్ ల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతమంతా సుమారు 15 కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల శిలాజాలు ఉన్నాయి. కొన్నిచోట్ల పదుల కొద్దీ డైనోసార్ల శిలాజాలు కుప్పల్లా ఉండటంతో.. ‘డైనోసార్ ఎముకల క్వారీ’లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. పర్యాటకులు ఈ ప్రాంతంలో కలియదిరగవచ్చు. కొన్ని డైనోసార్లను ముట్టుకోవచ్చు కూడా.
..మరి పదండి.. డైనోసార్లను వేటాడుదాం..
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment