అసమానతలతో అనర్థం తథ్యం! | Anartham inequalities issues! | Sakshi
Sakshi News home page

అసమానతలతో అనర్థం తథ్యం!

Published Thu, Feb 12 2015 12:58 AM | Last Updated on Mon, Oct 8 2018 9:06 PM

అసమానతలతో అనర్థం తథ్యం! - Sakshi

అసమానతలతో అనర్థం తథ్యం!

శత కోటి డాలర్ల కుబేరుల సిరులన్నీ చట్టబద్ధమైన లాభాలతో పోగుచేసినవి మాత్రమే కావు. అంతకన్నా ఎక్కువగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా సమకూరే ప్రభుత్వ రాబడిలోని భారీ మొత్తాలను సబ్సిడీలుగా పొందడం ద్వారా, గనులు, భూములు, చమురు, అటవీ సంపదల వంటి దేశ సంపదను, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి ఆర్జించినవి  కూడా. మన దేశంలో ఇది మరింత విచ్చలవిడిగా సాగుతోంది. భారత బిలియనీర్ల సంపదతో దేశంలోని పేదరికాన్ని ఒకసారి కాదు, రెండుసార్లు నిర్మూలించవచ్చు.
 
అది విశాఖ తీరంలోని రామకృష్ణ బీచ్. ఉదయం ఎనిమిది గంటలు. నులివెచ్చని ఉషోదయాన్ని ఆస్వాదించేందుకు అప్పుడప్పుడే పర్యాటకులు బీచ్‌లోకి వస్తున్నారు. కొందరు యువకులు, మరికొందరు నడివయస్కులు, కొందరు అటూ ఇటూగా ఉన్నవారు అక్కడున్నారు. ఓ వ్యక్తి మాత్రం  భిన్నం గా కనిపించాడు. చెప్పులు చేతి సంచిలో వేసుకొని అలల్లో ఆదుర్దాగా దేనికోసమో వెతుకుతూ, వెతుకుతూ... అంతలోనే నిరాశగా వెనక్కి వస్తున్నాడు. సముద్రపుటలలపై నుంచి నా దృష్టి అతనివైపు మళ్లింది. వెళ్లి పలకరించాను, దేని కోసం వెతుకుతున్నావని అడిగాను. డబ్బుల కోసమని సమాధానం ఇచ్చాడు. నాకు మొదట అర్థం కాలేదు. ఎక్కడెక్కడో అలల్లో పడి కొట్టుకుపోయిన డబ్బులు ఏదో తీరానికి చేరతాయి. వాటి కోసమే ఈ వెతుకులాట.

అదృష్టం బావుంటే వెండి మట్టెలు, బంగారం కూడా దొరుకు తాయని చెబుతున్నప్పుడు అతని కళ్ళల్లో మెరుపు చూశాను. రోజుకి ఎన్ని నాణేలు దొరుకుతాయని ప్రశ్నిస్తే... పది నుంచి పదిహేను రూపాయలు దొర కొచ్చు లేదా అసలేమీ దొరకకపోనూవచ్చు అన్నాడు. అతని పేరు నొల్లి రాములు. మత్స్యకారుడైన రాములు హార్బర్‌లో పనిచేసేవాడు. ఇటీవలే మానేశాడు. ఇద్దరు కొడుకులూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ప్రమా దవశాత్తూ మరణించారు. ఆ తండ్రి కడుపు కూటికి సముద్రపుటలలు మోసు కొచ్చే చిల్లర కాసులే ఆధారం. ఎక్కడో ఎవరో పోగొట్టుకున్న లేదా గంగమ్మకు విసిరేసిన చిల్లర నాణేలను వెతుకులాడుతున్న రాములుని చూస్తే దిగులని పించింది.

రాములులాంటి కోట్లాది మంది భారతీయులు సముద్రమంత సంపదను సృష్టిస్తే, అందులో చిల్లర పైసలు కూడా వారికి దక్కని దుస్థితిని చూసి, ఇదేం అసమాన ప్రపంచమనిపించింది. ఎటువంటి శ్రమ చేయకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులను, అపార ధనరాశులను సొంతం చేసు కొని, విమానాలను, వందల కోట్ల రూపాయల బహుళ అంతస్తుల భవనా లను భార్యలకు ప్రేమ కానుకలుగా సమర్పించుకోగల భర్తలున్న సౌభాగ్య భారతావనిలోనే ఎంతటి వైరుధ్యం? బరువెక్కిన  మనసుతో అక్కడి నుంచి కదిలాను.
 
కొందరి చేతుల్లోనే సకల సంపదలు

మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా  ఆర్థిక అసమానతలు, వ్యత్యాసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పదేళ్ళ క్రితం కంటే ఇప్పుడు అంతరాలు మరింతగా పెరిగాయి. గత జనవరిలో దావోస్‌లో జరిగిన ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ సమావేశాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ‘ఆక్స్‌ఫామ్’ అనే సంస్థ ఒక పరిశోధనాత్మకమైన నివేదికను విడుదల చేసింది. 2009లో  ప్రపంచంలో కోటి మంది కోటీశ్వరులు (శత కోటి అమెరికన్ డాలర్ల ఆస్తిపరులు) ఉంటే, 2013 వరకు ఆ సంఖ్య 1.37 కోట్లకు పెరిగినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇక శత కోటి డాలర్ల కుబేరులు (బిలియనీర్లు) రెట్టింపై, వారి సంఖ్య 1,645కు పెరిగిందని కూడా తెలిపారు.

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సగం ప్రపంచ జనాభా దగ్గర ఉన్న మొత్తం సంపదకు ఇంచుమించు సరిపడా సంపద 85 మంది వ్యక్తుల వద్దే ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ జనాభా సుమారు 700 కోట్లు. అంటే, కేవలం 85 మంది కుబేరుల సంపద 350 కోట్ల మంది సంపదకు సమానం. ఇది వింటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన బిల్‌గేట్స్ సంపద గురించి ప్రస్తావిస్తూ, ప్రతిరోజూ పది లక్షల డాలర్లను (ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు) ఖర్చు చేసినా, 218 సంవత్సరాల వరకు అవి సరిపోతాయని ఆక్స్‌ఫామ్ వెల్లడించింది.   
 
ఇలా కొందరి వద్దే సంపదంతా కేంద్రీకృతం కావడం  కేవలం ధనిక దేశాలకే పరిమితం కాదని, భారత్ వంటి వృద్ధి చెందుతున్న వర్ధమాన దేశా ల్లో కూడా  సంపద ఇలాగే కొందరి దగ్గర పోగు పడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. 1990లో దేశంలో పదిమంది బిలియనీర్లు ఉంటే, 2014 వరకు వాళ్ళు 65 మందికి పెరిగారు. 2014 ‘ఫోర్బ్స్’ నివేదిక ప్రకారం. భారత దేశంలో ఉన్న మొదటి వంద మంది ధనికుల దగ్గర రూ. 22,49,600 కోట్ల సంపద పోగుబడి ఉన్నట్టుఆక్స్‌ఫామ్ నివేదిక బయటపెట్టింది. ఇది మన దేశ బడ్జెట్ కన్నా అధికం. 2013-14 కేంద్ర బడ్జెట్ మొత్తం రూ. 16 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఏడాది పాటు భారత ఆర్థిక వ్యవస్థకి సరిపడే డబ్బు కన్నా ఎక్కువ సంపద కేవలం వంద మంది దగ్గరే పోగుపడివుంది.
 
నిలువు దోపిడీతో సిరుల కులుకు

ప్రపంచ కుబేరుల సిరులన్నీ వారు తన వ్యాపారాలు, పరిశ్రమల న్యాయమైన, చట్టబద్ధమైన లాభాల నుంచి మాత్రమే పోగు చేసినవి కాదు. అంతకన్నా ఎక్కువగా ప్రభుత్వాలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల ద్వారా లభించే ప్రభుత్వ రాబడితో రూపొందించే బడ్జెట్‌లో పెద్ద మొత్తాలను  కొల్లగొట్టడం ద్వారా పోగుచేసినవి కూడా. ప్రభుత్వ సబ్సిడీలు, అక్రమంగా సంపాదించే గనులు, భూములు, చమురు, అటవీ సంపదల ద్వారా అతి తక్కువ కాలంలోనే దేశ సంపదను, ప్రభుత్వ ధనాన్ని వీరు కొల్లగొడు తున్నారు.

మన దేశంలో ఇది మరింత విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ కాంట్రాక్టులు, లెసైన్సులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, మౌలిక సదు పాయాల (రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రహదారులు) నిర్మాణం, గనులు, టెలి కమ్యూనికేషన్స్, పెట్రోకెమికల్స్ లాంటి రంగాల్లోని ప్రైవేటీకరణ ద్వారా జాతి సంపదను స్వాహా చేస్తున్నారు. భారత బిలియనీర్ల సంపదతో దేశంలోని పేదరికాన్ని ఒకసారి కాదు రెండుసార్లు నిర్మూలిం చవచ్చని ఆర్థిక వేత్తల అంచనా. వేలకోట్ల రూపాయల సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెబుతున్న ప్రభుత్వాలు కనీసం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బునైనా వారి సంక్షేమం కోసం ఖర్చు చేయడంలేదు. విద్యావైద్య రంగాల పట్ల కేంద్రంతోపాటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యమే అందుకు తిరుగులేని సాక్ష్యం.

మన దేశంలోని ధనికుల, నిరుపేదల రోజువారీ ఖర్చులో కూడా చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అవి వారి జీవనశైలి, ఆరోగ్యాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరాలలోని ధనికులు పెడుతున్న ఖర్చులో 12వ వంతు కూడా పేదలు ఖర్చు చేయడం లేదు. గ్రామాల్లో ఇది 9వ వంతు కంటే తక్కువ. 2012లో జరిగిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతంలోని పేద వాడు నెలకు రూ. 512 ఖర్చు పెడితే, ధనవంతుడు రూ. 2,084 వినియోగిస్తున్నాడు. అదే నగరాల్లో పేదవాడు రూ. 700 నెలకు ఖర్చు చేస్తే, ధనవంతుడు రూ. 10,282 ఖర్చు చేస్తున్నాడు. ఇవి సరాసరి లెక్కలు మాత్రమే.
 
అంతరాల పెంపునకు ఏలికల అండదండలు

ధనికుల ధన దాహానికి, రాజకీయ నాయకుల, ప్రభుత్వాధినేతల లాలూచీ తోడవుతుండటంతో ఈ వ్యత్యాసాలు మరింతగా పెరుగుతున్నాయి. ఆర్థిక, బీమా, మందుల తయారీ, ఆరోగ్యరక్షణ రంగాల కంపెనీలు ప్రభుత్వాధి నేతలను లోబర్చుకొని తమ దోపిడీకి మార్గం సుగమం చేసుకుంటున్నట్టు ఇటీవలి ఒక పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలోని ఫైనాన్స్ కంపెనీలు తమ నిలువుదోపిడీ సాగించుకోవడానికి గత ఏడాది 40 కోట్ల డాలర్లు లంచాలుగా ఖర్చు చేశాయి. యూరప్‌లో 15 కోట్ల డాలర్లను లంచాల రూపంలో పంచిపెట్టాయి.

అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కంపెనీలు అమెరికాలో 48.7 కోట్ల డాలర్లు, యూరప్‌లో 5 కోట్ల డాలర్లు ఏటా ఖర్చు చేస్తున్నాయి. ఇవి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. భారత దేశంలో కూడా రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులను కార్పొరేట్ రంగమే భరిస్తోందన్నది కఠోర వాస్తవం. నాయకులకు ఆస్తులను సమకూర్చి, కంపెనీలలో వాటాలు ఇచ్చి రాజకీయ అధికార వ్యవస్థను లోబరచుకొని కార్పొరేట్లు తమ వ్యాపారాలను, లాభాలను పెంపొందించుకుంటున్నాయి.

ఇలా ప్రభుత్వాల ప్రోత్సాహంతోనే ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. ప్రజలు నిత్య దారిద్య్రంతో కునారిల్లుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ సముద్రపు అలల్లో చిల్లర డబ్బులు ఏరుకుంటున్న రాములే రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, అసమానతలు భవిష్యత్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రపం చ ఆర్థిక వేదిక జనవరిలో దావోస్‌లో జరిగిన సమావేశంలో కొన్ని హెచ్చరి కలు చేసింది. ఆ సమావేశంలో పాల్గొన్న కొందరు నిపుణులు మరింత తీవ్రంగా తమ నిరసనను తెలియజేశారు.

ఈ వ్యత్యాసాల వల్ల  ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నామనే నిరాశలో యువతరం కొట్టుమిట్టాడు తున్నదని వారు అభిప్రాయపడ్డారు. తమకిక భవిత లేదని యువత భావిస్తే, ఆ అసంతృప్తి క్రమంగా సమాజ విచ్ఛిన్నానికి దారితీయగలదని ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్త జెన్నీఫర్ బ్లాంకే ఆందోళన వ్యక్తం చేశారు. మరొక ఆర్థిక వేత్త డేవిడ్ కోలే తీవ్ర స్వరంతో ఇలా హెచ్చరించారు: ‘‘నేను పెట్టుబడిదారీ విధానానికి గట్టి మద్దతుదారుడిని, అయితే ఈ ఆర్థిక అంతరాలు, అసమా నతలు కొనసాగితే పెట్టుబడిదారీ విధానం తగు మూల్యం చెల్లించుకోక తప్పదు.’’  

(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్ నం: 9705566213)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement