![National Snow and Ice Data Center: Antarctica sea ice is at its lowest extent ever recorded - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/31/52415.jpg.webp?itok=RdimF0hd)
వాషింగ్టన్: ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వాస్తవానికి అంటార్కికాలో వేసవి కాలంలో మంచు కరిగి, శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు.
గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో హిమం ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్‌ఎస్‌ఐడీసీ) గణాంకాల ప్రకారం.. అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది. అలాగే 1981–2010 మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం.
అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలరాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటికాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతోంది. ఇది చాలా అసా«ధారణ పరిణామమని, 10 లక్షల ఏళ్లకోసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను మరింతగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment