Ice Mountains
-
National Snow and Ice Data Center: అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచు
వాషింగ్టన్: ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాలులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికా ఖండంలో పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. ఈసారి అక్కడ రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరిగినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వాస్తవానికి అంటార్కికాలో వేసవి కాలంలో మంచు కరిగి, శీతాకాలంలో మళ్లీ భారీ మంచు ఫలకలు ఏర్పడుతుంటాయి. కానీ, ఈసారి అలా జరగలేదు. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో హిమం ఉంది. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) గణాంకాల ప్రకారం.. అంటార్కిటికాలో 2022 శీతాకాలంతో పోలిస్తే ఇప్పుడు 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగిపోయింది. అలాగే 1981–2010 మధ్య సగటు విస్తీర్ణం కంటే ఈ ఏడాది జూలై మధ్యలో 26 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర మంచు తక్కువగా ఉంది. ఇది అర్జెంటీనా దేశ విస్తీర్ణంతో సమానం. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూమెక్సికో, అరిజోనా, నెవడా, ఉతాహ్, కొలరాడో రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణంతో సమానం. అంటార్కిటికాలో సముద్రపు మంచు కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతోంది. ఇది చాలా అసా«ధారణ పరిణామమని, 10 లక్షల ఏళ్లకోసారి ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం, వాతావరణ మార్పులు అంటార్కిటికాను మరింతగా ప్రభావితం చేస్తాయని అంటున్నారు. -
ఈ మిస్టరీ ప్లానెట్‌పై కొత్త ఆశలు!
కొన్నాళ్లు నవగ్రహాల్లో ఒకటన్నారు! మరికొన్నాళ్లు అసలు గ్రహానివే కాదు పొమ్మన్నారు! తాజాగా మళ్లీ గ్రహం హోదా పరిశీలిస్తామంటున్నారు! ఈ మిస్టరీ ప్లానెట్‌పై ఐస్ వోల్కనోలు గుర్తించడంతో ప్లూటోకు పునరుజ్జీవం పోస్తున్నారు సైంటిస్టులు. సౌరకుటుంబంలోని చిన్నారి గ్రహం (?) ప్లూటో మనిషికి అంతుచిక్కడం లేదు. సూర్యుడికి సుదూరంగా ఉండే ప్లూటోను కనుగొని 92 సంవత్సరాలవుతోంది. దీన్ని కనుగొన్న తర్వాత చాలా సంవత్సరాలు నవగ్రహాల్లో ఒకటిగా లెక్కించారు. 16ఏళ్ల క్రితం కొత్త లెక్కలేసి దీని గ్రహహోదాను తీసిపారేశారు. ఇప్పుడు అదే సైంటిస్టులు ప్లూటో ఉపరితలంపై మంచు పర్వతాల జాడలున్నాయని చెబుతున్నారు. సౌర కుటుంబంలో మరే ఇతర గ్రహంలో కూడా ఇలాంటి మంచు వోల్కనోలు లేవు. దీంతో ఒక్కమారుగా ఖగోళ పరిశోధకుల దృష్టి ప్లూటోపైకి మరలింది. న్యూహారిజాన్స్ మిషన్ పంపిన చిత్రాలను విశ్లేషించిన సైంటిస్టుల బృందం ప్లూటోపై కొండలు, గుట్టలు మరియు పెద్ద గోపురాల్లాంటి ఆకారాలున్న ప్రాంతాన్ని గుర్తించింది. ఇవన్నీ ప్లూటో ఉపరితల అంతర్భాగం నుంచి విరజిమ్మిన మంచు తదితర పదార్ధాలతో ఏర్పడ్డాయని గమనించింది. ఇలాంటి భారీ నిర్మితీయ ప్రాంతాలు ఏర్పడాలంటే పలుమార్లు మంచు పర్వతాల విస్ఫోటనం జరిగి ఉండాలని అంచనా వేసింది. తమ తాజా పరిశోధన వివరాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించింది. ప్లూటో ఉపరితలానికి కింద దాదాపు 100– 200 కిలోమీటర్ల దిగువన నీటితో నిండిన సముద్రం ఉండి ఉండొచ్చని పరిశోధనలో పేర్కొన్నారు. ఉపరితలంపై ఉన్న పర్వతాల ఏర్పాటుకు అవసరమైన మంచుకు ఈ సముద్రమే ఆధారమని అంచనా వేస్తున్నారు. క్రయో వోల్కనోలు సాధారణంగా లావా వెదజల్లే అగ్నిపర్వతాన్ని వోల్కనో అంటారు. కానీ మంచును వెదజల్లే పర్వతాలను క్రయో వోల్కనోలు లేదా ఐస్ వోల్కనోలంటారు. రైట్ మోన్స్ మరియు పిక్కార్డ్ మోన్ అనే రెండు అతిపెద్ద మట్టి దిబ్బల ప్రాంతాన్ని ప్లూటోపై న్యూహారిజన్స్ మిషన్ ఫొటో తీసింది. ఈ మట్టి దిబ్బలు క్రయోవోల్కనోలని పరిశోధక బృందం ప్రస్తుతం నమ్ముతోంది. అలాగే ప్లూటో నైరుతి ప్రాంతంలో కనిపించే ప్రకాశవంతమైన ప్రాంతాన్ని (స్పుత్నిక్ ప్లానిటియా అంటారు) బృందం విశ్లేషించింది. ఇక్కడ 1–7 కిలోమీటర్ల ఎత్తున 30– 100 కిలోమీటర్ల వెడల్పున వ్యాపించిన భారీ దిబ్బలున్నాయని తెలిపింది. ఇవి కేవలం ప్లూటోపైనే కనిపించాయని, ఇవి క్రయో వోల్కనోలు వెదజల్లిన మంచుతో ఏర్పడి ఉంటాయని శాస్త్రవేత్త డాక్టర్ కెల్సి సింగర్ చెప్పారు. ఇలాంటి దిబ్బల్లో కొన్నింటి వయసు తక్కువ కావడంతో ఇటీవల కాలం (అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం) వరకు కూడా ప్లూటోలో ఐస్ వోల్కనోలు పేలి మంచు వెదజల్లడం జరిగి ఉండొచ్చన్నారు. అయితే ఈ వోల్కనోలు పేలడానికి అవసరమైన వేడి ప్లూటోకి ఎక్కడినుంచి వచ్చిందనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. అలాగే ఈ వాతావరణం జీవి పుట్టుకకు కొంతమేర అనువుగానే ఉన్నట్లు సైంటిస్టులు భావిస్తున్నారు. ప్లూటో పరిశోధనకు న్యూహారిజన్స్ మిషన్‌ను నాసా 2006లో ప్రయోగించింది. అదే సంవత్సరం ప్లూటోకు గ్రహహోదా తీసివేశారు. 2015లో ఈ మిషన్ ప్లూటోను చేరింది. అప్పటినుంచి ప్లూటోకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని పంపుతోంది. తాజా పరిశోధనలకు మరిన్ని ఆధారాలు లభిస్తే తిరిగి సౌర కుటుంబంలో ప్లూటోకు గ్రహ హోదా కల్పించే అవకాశాలున్నాయి. మరిన్ని విశేషాలు.. ► 1930లో కుపర్ బెల్ట్ (నెప్ట్యూన్ చుట్టూ ఉండే శకలాలు)లో ప్లూటోను కనుగొన్నారు. అప్పుడే దీన్ని తొమ్మిదో గ్రహంగా ప్రకటించారు. ► 1990ల్లో తొలిసారి ప్లూటో గ్రహ హోదాపై ప్రశ్నలు తలెత్తాయి. ► 2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రనాటికల్ యూనియన్ ప్లూటో గ్రహం కాదని, డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం) అని ప్రకటించింది. ► భూమి చుట్టూ తిరిగే చంద్రుడిలో మూడోవంతుండే ప్లూటో ఉపరితలం మీద ఐస్, రాళ్లు ఉన్నాయి. ► ప్లూటోకి ఐదు చందమామలున్నాయి. ► సూర్యుడికి దూరంగా ఉండడంతో దీనిపై ఉష్ణోగ్రత దాదాపు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
కరిగిన నీటితో కొండలు
చుట్టూ గడ్డి మొక్క కూడా లేదుగానీ... మధ్యలో భారీ మంచు పర్వతమా? ఎలాగబ్బా? ఫొటోలు చూడగానే చాలామందికి వచ్చే డౌట్లు ఇవే. ఎలా అన్న విషయాన్ని కాసేపు పక్కనపెడదాం. ఐస్స్తూపాలుగా పిలుస్తున్న ఈ మంచు పర్వతాల గురించి ముందు తెలుసుకుందాం. మనదేశానికి ఉత్తరాన మంచుకొండల కింద లడాఖ్ అనే ప్రాంతముందికదా... అక్కడిదీ ఈ మంచుస్తూపం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎడారి ప్రాంతంగా దీనికి పేరుంది. అయితే నిన్నమొన్నటి వరకూ పక్కనున్న మంచుకొండల్లోని హిమనదాలు (గ్లేషియర్స్) కరిగి లడాఖ్ ప్రాంతంలో ఉండేవారికి కొద్దోగొప్పో నీళ్లు అందించేవి. వాతావరణ మార్పుల పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితి మరీ కనాకష్టంగా మారిపోయింది. ఈ చిక్కులకు చెక్‌పెట్టేందుకు సోనమ్ వాంగ్‌ఛుక్ అనే ఇంజనీరుకు తట్టిన ఐడియా వాస్తవ రూపమే ఈ మంచుస్తూపాలు. కరిగిపోతున్న హిమనదాల నీరు పల్లానికి వస్తుంది కదా.. అక్కడ కొన్ని పైపులను నిలువుగా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా పైకి ఎగజిమ్మే నీరు... పరిసరాల్లో ఉండే మైనస్ 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ప్రభావంతో గడ్డకట్టిపోతుంది. చలి తగ్గి... ఎండలు పెరిగే వరకు ఇలాగే అక్కడే ఉండిపోయే నీరు ఆ తరువాత ప్రజల అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతోంది. సోనమ్ వాంగ్‌ఛుక్ ఇప్పటికే ఇలాంటి మంచుస్తూపాలు కొన్నింటిని ఏర్పాటు చేయడమే కాకుండా... వాటి ఆధారంగా కొన్ని వేల మొక్కలను పెంచుతున్నారు కూడా. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని కొద్దిమేరకైనా పంటలు పండించుకునేందుకు, తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు ఇవి సాయపడతాయని, భవిష్యత్తులో కనీసం 50 వరకూ భారీ మంచుస్తూపాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు సోనమ్. ఇంకో విషయం...ఈ సోనమ్ వాంగ్‌ఛుక్ స్ఫూర్తితోనే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమాలో రంఛోడ్దాస్ శ్యామల్‌దాస్ ఛాంఛడ్ ఉరఫ్ రాంచో పాత్ర రూపుదిద్దుకుంది. -
మానవాళిని రక్షిస్తున్న ఐస్ పర్వతాలు
ముంచుకొస్తున్న గ్లోబల్ వార్మింగ్ ముప్పు నుంచి మానవాళిని రక్షించడంలో మహాసముద్రాల్లోని ఐస్ పర్వతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తాజాగా జరిపిన అధ్యయనంలో తేలింది. భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణమైన కర్బన ఉద్గారాలను ఇవి తమలో నిక్షిప్తం చేసుకుంటున్నాయి. ఒక్కోటి సుమారు 18 కిలోమీటర్ల పొడవుండే ఈ ఐస్ పర్వతాలు నీటిలో తేలయాడుతూ తమ గమనంలో వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను శోషించుకుంటున్నాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్‌కి చెందిన పరిశోధకులు నిర్ధారించారు. భూగోళంపై ఉన్న మొత్తం కార్బన్లో సుమారు 20 శాతం హిందూమహాసముద్రంలోని ఐస్ పర్వతాలు గ్రహించి నిల్వ చేశాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ బిగ్గ్ వెల్లడించారు.