కరిగిన నీటితో కొండలు
చుట్టూ గడ్డి మొక్క కూడా లేదుగానీ... మధ్యలో భారీ మంచు పర్వతమా? ఎలాగబ్బా? ఫొటోలు చూడగానే చాలామందికి వచ్చే డౌట్లు ఇవే. ఎలా అన్న విషయాన్ని కాసేపు పక్కనపెడదాం. ఐస్‌స్తూపాలుగా పిలుస్తున్న ఈ మంచు పర్వతాల గురించి ముందు తెలుసుకుందాం. మనదేశానికి ఉత్తరాన మంచుకొండల కింద లడాఖ్ అనే ప్రాంతముందికదా... అక్కడిదీ ఈ మంచుస్తూపం. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎడారి ప్రాంతంగా దీనికి పేరుంది. అయితే నిన్నమొన్నటి వరకూ పక్కనున్న మంచుకొండల్లోని హిమనదాలు (గ్లేషియర్స్) కరిగి లడాఖ్ ప్రాంతంలో ఉండేవారికి కొద్దోగొప్పో నీళ్లు అందించేవి. వాతావరణ మార్పుల పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితి మరీ కనాకష్టంగా మారిపోయింది.
ఈ చిక్కులకు చెక్‌పెట్టేందుకు సోనమ్ వాంగ్‌ఛుక్ అనే ఇంజనీరుకు తట్టిన ఐడియా వాస్తవ రూపమే ఈ మంచుస్తూపాలు. కరిగిపోతున్న హిమనదాల నీరు పల్లానికి వస్తుంది కదా.. అక్కడ కొన్ని పైపులను నిలువుగా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా పైకి ఎగజిమ్మే నీరు... పరిసరాల్లో ఉండే మైనస్ 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత ప్రభావంతో గడ్డకట్టిపోతుంది. చలి తగ్గి... ఎండలు పెరిగే వరకు ఇలాగే అక్కడే ఉండిపోయే నీరు ఆ తరువాత ప్రజల అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతోంది. సోనమ్ వాంగ్‌ఛుక్ ఇప్పటికే ఇలాంటి మంచుస్తూపాలు కొన్నింటిని ఏర్పాటు చేయడమే కాకుండా... వాటి ఆధారంగా కొన్ని వేల మొక్కలను పెంచుతున్నారు కూడా. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని కొద్దిమేరకైనా పంటలు పండించుకునేందుకు, తాగునీటి అవసరాలను తీర్చుకునేందుకు ఇవి సాయపడతాయని, భవిష్యత్తులో కనీసం 50 వరకూ భారీ మంచుస్తూపాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అంటున్నారు సోనమ్. ఇంకో విషయం...ఈ సోనమ్ వాంగ్‌ఛుక్ స్ఫూర్తితోనే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ త్రీ ఇడియట్స్ సినిమాలో రంఛోడ్‌దాస్ శ్యామల్‌దాస్ ఛాంఛడ్ ఉరఫ్ రాంచో పాత్ర రూపుదిద్దుకుంది.