ఆమిర్‌ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చాలామందికి తెలుసు. కానీ, అందులో ఆమిర్ పోషించిన ఫున్‌సుఖ్ వాంగ్దూ పాత్రకు స్ఫూర్తినిచ్చిన ఇంజనీర్, విద్యాసంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌ఛుక్ గురించి బహుశా కొందరికే తెలుసుంటుంది. ఇటీవల చేసిన నిరవధిక నిరాహార దీక్ష పుణ్యమా అని ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. ప్రపంచమంతటా మారుమోగి పోయింది.
హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్‌లో శరీరం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆయన సాగించిన నిరశన ఉద్యమానికి మద్దతుగా వేలాది జనం ముందుకు రావడం విశేషం. 21 రోజుల అనంతరం మంగళవారం ఆయన నిరాహార దీక్ష ముగిసినప్పటికీ, లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి నుంచి అలవిమీరిన అభివృద్ధితో అపాయంలో పడుతున్న ఆ ప్రాంత జీవావరణం దాకా అనేక అంశాలు చర్చలోకి రాగలిగాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకున్నా, ప్రస్తుతానికైతే లద్దాఖ్ ప్రజలు తమ డిమాండ్లను పాలకుల ముందు మరోసారి ఉంచి, ఒత్తిడి తేగలిగారు.
నిజానికి, దాదాపు 3 లక్షల జనాభా గల లద్దాఖ్‌లో మొత్తం 8 తెగల వాళ్ళుంటారు. 2019 ఆగస్ట్ 5న మునుపటి జమ్మూ – కశ్మీర్ నుంచి విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే ఈ ప్రాంత ప్రజలు లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలనీ, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనీ, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలనీ, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలనీ డిమాండ్ చేస్తున్నారు.
2020 నుంచి వారు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠ – తాజా ఉద్యమం. లద్దాఖ్ ప్రాంతపు ఉన్నత ప్రాతినిధ్య సంస్థ, అలాగే కార్గిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్’ (కేడీయే) మద్దతుతో నెలన్నర క్రితమే ఫిబ్రవరి మొదట్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో కూర్చొని లద్దాఖ్‌ను ఆడించాలనుకుంటే కుదరదంటూ ప్రజల్లోని అసమ్మతిని ఆ ప్రదర్శన తేటతెల్లం చేసింది. కీలకమైన విధాన నిర్ణయాలలో తమ స్థానిక స్వరాలకు చోటులేకపోవడమే ఈ నిరసనలకు ప్రధాన ప్రేరకమైంది.
ఒకప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జమ్మూ–కశ్మీర్ విధాన పరిషత్‌కు స్పీకర్,ఎంపీ... ఇంతమంది ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతానికి ఉండేవారు. అలాంటిది ప్రస్తుతం అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికార గణపాలన. లద్దాఖ్‌కు మిగిలింది ఇప్పుడు పోర్ట్ ఫోలియో లేని ఒకే ఒక్క ఎంపీ. జిల్లాకు ఒకటి వంతున రెండు స్వతంత్ర పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళు ఉన్నప్పటికీ, అధికారాల పంపిణీపై స్పష్టత లేదు.
ఇక, ఆర్టికల్ 370 రద్దు అనంతరం తీసు కున్న ప్రశ్నార్హమైన పాలనాపరమైన నిర్ణయాలు అనేకం. దానికి తోడు ఆకాశాన్ని అంటుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో జనం గగ్గోలు పెడుతున్నారు. భూ హక్కులలో మార్పులు, అలాగే స్థానిక ప్రయోజనాలకు విరుద్ధమైన పారిశ్రామిక విధాన రూపకల్పన లాంటివి ప్రజాగ్రహాన్ని పెంచాయి. లద్దాఖీ ఉద్యమకారుడు వాంగ్‌ఛుక్ దీక్షకు అంతటి స్పందన రావడానికి అదే కారణం.
సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున దాదాపు మంచు ఎడారిలా జనావాసాలు తక్కువగా ఉండే లద్దాఖ్ పర్యావరణ రీత్యా సున్నిత ప్రాంతం. అక్కడ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన అజెండా పైనా విమర్శలున్నాయి. పర్యాటకం ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థలో కీలకమే కానీ, దాన్ని అంతకు అంత పెంచాలని పర్యావరణానికి హాని కలిగిస్తే మొదటికే మోసం.
లే ప్రాంతంలో మెగా ఎయిర్‌పోర్ట్,ఛంగ్‌థాంగ్ బయళ్ళలో 20 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సోలార్ పార్క్ లాంటి ప్రణాళికలపై ప్రభుత్వం పునరాలోచించాలని వాంగ్‌ఛుక్ లాంటివారు కోరుతున్నది అందుకే. పర్యావరణానికీ, స్థానికుల ప్రయోజనాలకూ అనుగుణంగానే అభివృద్ధి ఉంటే మేలు.
లద్దాఖ్ సాంఘిక, సాంస్కృతిక ప్రత్యేకతల్ని పరిరక్షించేలా ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌నూ పాలకులు గుర్తించాలి. లద్దాఖ్, కార్గిల్‌లు రెండూ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, ఒకే ఎంపీ ప్రాతినిధ్యానికి తగ్గిపోవడమూ చిక్కే. ఈ రెండు విభిన్న ప్రాంతాలకు చెరొక పార్లమెంటరీ స్థానంపై ఆలోచించాలి.
చైనాతో సరిహద్దులో నెలకొన్న లద్దాఖ్ కీలకమైనది. అందులోనూ హిమాలయ ప్రాంతంలో తన పరిధిని విస్తరించుకోవాలని డ్రాగన్ తహతహలాడుతున్న వేళ వ్యూహాత్మకంగానూ విలువైనది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకొనే భయాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. లద్దాఖ్ ప్రజల నమ్మకాన్ని చూరగొని, వారిని కలుపుకొని ముందుకు సాగడం ముఖ్యం. గతంలో శ్రీనగర్ నుంచి, ఇప్పుడేమో ఢిల్లీ నుంచి పాలిస్తున్నారే తప్ప స్వపరిపాలన సాగనివ్వడం లేదనే భావనను వారి నుంచి పోగొట్టడం ముఖ్యం.
ఈ ఏడాది జనవరి మొదట్లో కేంద్ర హోమ్ శాఖ ఉన్నతాధికార సంఘాన్ని (హెచ్‌పీసీ) వేసింది. గత శనివారంతో కలిపి 3 భేటీలు జరిగినా పురోగతి లేదు. హెచ్‌పీసీ హోమ్ మంత్రి లేకపోగా, తాజా భేటీకి సహాయ మంత్రి సైతం గైర్హాజరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు వారికి చిత్తశుద్ధి ఉందా అన్నది అనుమానాలు రేపుతోంది.
గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ పాలనలోని పలు వైఫల్యాలను సహించి, భరించిన లద్దాఖ్ ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిర సన తెలిపారు. స్థానిక ఆకాంక్షలకు తగ్గట్టు న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఢిల్లీ పాలకులు సైతం ప్రజాభీష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం మేలు. లద్దాఖ్ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాటల్లోనే కాదు... చేతల్లోనూ చూపడం అవసరం. లేదంటే, మున్ముందు వాంగ్‌ఛుక్ దీక్షల లాంటివి మరిన్ని తలెత్తక తప్పదు.
మంచు ఎడారిలో నిరసన మంట
Published Fri, Mar 29 2024 12:06 AM | Last Updated on Fri, Mar 29 2024 12:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment