himalayan region
-
మంచు ఎడారిలో నిరసన మంట
ఆమిర్‌ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చాలామందికి తెలుసు. కానీ, అందులో ఆమిర్ పోషించిన ఫున్సుఖ్ వాంగ్దూ పాత్రకు స్ఫూర్తినిచ్చిన ఇంజనీర్, విద్యాసంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌ఛుక్ గురించి బహుశా కొందరికే తెలుసుంటుంది. ఇటీవల చేసిన నిరవధిక నిరాహార దీక్ష పుణ్యమా అని ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. ప్రపంచమంతటా మారుమోగి పోయింది. హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్‌లో శరీరం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆయన సాగించిన నిరశన ఉద్యమానికి మద్దతుగా వేలాది జనం ముందుకు రావడం విశేషం. 21 రోజుల అనంతరం మంగళవారం ఆయన నిరాహార దీక్ష ముగిసినప్పటికీ, లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి నుంచి అలవిమీరిన అభివృద్ధితో అపాయంలో పడుతున్న ఆ ప్రాంత జీవావరణం దాకా అనేక అంశాలు చర్చలోకి రాగలిగాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకున్నా, ప్రస్తుతానికైతే లద్దాఖ్ ప్రజలు తమ డిమాండ్లను పాలకుల ముందు మరోసారి ఉంచి, ఒత్తిడి తేగలిగారు. నిజానికి, దాదాపు 3 లక్షల జనాభా గల లద్దాఖ్‌లో మొత్తం 8 తెగల వాళ్ళుంటారు. 2019 ఆగస్ట్ 5న మునుపటి జమ్మూ – కశ్మీర్ నుంచి విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే ఈ ప్రాంత ప్రజలు లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలనీ, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనీ, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలనీ, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలనీ డిమాండ్ చేస్తున్నారు. 2020 నుంచి వారు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠ – తాజా ఉద్యమం. లద్దాఖ్ ప్రాంతపు ఉన్నత ప్రాతినిధ్య సంస్థ, అలాగే కార్గిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్’ (కేడీయే) మద్దతుతో నెలన్నర క్రితమే ఫిబ్రవరి మొదట్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో కూర్చొని లద్దాఖ్‌ను ఆడించాలనుకుంటే కుదరదంటూ ప్రజల్లోని అసమ్మతిని ఆ ప్రదర్శన తేటతెల్లం చేసింది. కీలకమైన విధాన నిర్ణయాలలో తమ స్థానిక స్వరాలకు చోటులేకపోవడమే ఈ నిరసనలకు ప్రధాన ప్రేరకమైంది. ఒకప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జమ్మూ–కశ్మీర్ విధాన పరిషత్‌కు స్పీకర్,ఎంపీ... ఇంతమంది ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతానికి ఉండేవారు. అలాంటిది ప్రస్తుతం అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికార గణపాలన. లద్దాఖ్‌కు మిగిలింది ఇప్పుడు పోర్ట్ ఫోలియో లేని ఒకే ఒక్క ఎంపీ. జిల్లాకు ఒకటి వంతున రెండు స్వతంత్ర పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళు ఉన్నప్పటికీ, అధికారాల పంపిణీపై స్పష్టత లేదు. ఇక, ఆర్టికల్ 370 రద్దు అనంతరం తీసు కున్న ప్రశ్నార్హమైన పాలనాపరమైన నిర్ణయాలు అనేకం. దానికి తోడు ఆకాశాన్ని అంటుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో జనం గగ్గోలు పెడుతున్నారు. భూ హక్కులలో మార్పులు, అలాగే స్థానిక ప్రయోజనాలకు విరుద్ధమైన పారిశ్రామిక విధాన రూపకల్పన లాంటివి ప్రజాగ్రహాన్ని పెంచాయి. లద్దాఖీ ఉద్యమకారుడు వాంగ్‌ఛుక్ దీక్షకు అంతటి స్పందన రావడానికి అదే కారణం. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున దాదాపు మంచు ఎడారిలా జనావాసాలు తక్కువగా ఉండే లద్దాఖ్ పర్యావరణ రీత్యా సున్నిత ప్రాంతం. అక్కడ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన అజెండా పైనా విమర్శలున్నాయి. పర్యాటకం ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థలో కీలకమే కానీ, దాన్ని అంతకు అంత పెంచాలని పర్యావరణానికి హాని కలిగిస్తే మొదటికే మోసం. లే ప్రాంతంలో మెగా ఎయిర్పోర్ట్,ఛంగ్థాంగ్ బయళ్ళలో 20 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సోలార్ పార్క్ లాంటి ప్రణాళికలపై ప్రభుత్వం పునరాలోచించాలని వాంగ్‌ఛుక్ లాంటివారు కోరుతున్నది అందుకే. పర్యావరణానికీ, స్థానికుల ప్రయోజనాలకూ అనుగుణంగానే అభివృద్ధి ఉంటే మేలు. లద్దాఖ్ సాంఘిక, సాంస్కృతిక ప్రత్యేకతల్ని పరిరక్షించేలా ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌నూ పాలకులు గుర్తించాలి. లద్దాఖ్, కార్గిల్‌లు రెండూ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, ఒకే ఎంపీ ప్రాతినిధ్యానికి తగ్గిపోవడమూ చిక్కే. ఈ రెండు విభిన్న ప్రాంతాలకు చెరొక పార్లమెంటరీ స్థానంపై ఆలోచించాలి. చైనాతో సరిహద్దులో నెలకొన్న లద్దాఖ్ కీలకమైనది. అందులోనూ హిమాలయ ప్రాంతంలో తన పరిధిని విస్తరించుకోవాలని డ్రాగన్ తహతహలాడుతున్న వేళ వ్యూహాత్మకంగానూ విలువైనది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకొనే భయాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. లద్దాఖ్ ప్రజల నమ్మకాన్ని చూరగొని, వారిని కలుపుకొని ముందుకు సాగడం ముఖ్యం. గతంలో శ్రీనగర్ నుంచి, ఇప్పుడేమో ఢిల్లీ నుంచి పాలిస్తున్నారే తప్ప స్వపరిపాలన సాగనివ్వడం లేదనే భావనను వారి నుంచి పోగొట్టడం ముఖ్యం. ఈ ఏడాది జనవరి మొదట్లో కేంద్ర హోమ్ శాఖ ఉన్నతాధికార సంఘాన్ని (హెచ్పీసీ) వేసింది. గత శనివారంతో కలిపి 3 భేటీలు జరిగినా పురోగతి లేదు. హెచ్పీసీ హోమ్ మంత్రి లేకపోగా, తాజా భేటీకి సహాయ మంత్రి సైతం గైర్హాజరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు వారికి చిత్తశుద్ధి ఉందా అన్నది అనుమానాలు రేపుతోంది. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ పాలనలోని పలు వైఫల్యాలను సహించి, భరించిన లద్దాఖ్ ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిర సన తెలిపారు. స్థానిక ఆకాంక్షలకు తగ్గట్టు న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఢిల్లీ పాలకులు సైతం ప్రజాభీష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం మేలు. లద్దాఖ్ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాటల్లోనే కాదు... చేతల్లోనూ చూపడం అవసరం. లేదంటే, మున్ముందు వాంగ్‌ఛుక్ దీక్షల లాంటివి మరిన్ని తలెత్తక తప్పదు. -
పర్వతాలు పిలిచాయి
‘అదిగో పర్వతాలు పిలుస్తున్నాయి. నేను తప్పక వెళ్లాలి’ అంటాడు ప్రకృతి ప్రేమికుడు, తత్వవేత్త జాన్ మ్యూర్. ఒకానొక సమయంలో శాలిని సింగ్‌కు కూడా పర్వతాల పిలుపు వినిపించింది. పర్వతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సాహసాలు చేయమంటాయి. అనురక్తి ఉన్నచోట ధైర్యం ఉంటుంది. ఆ రెండు ఉన్నచోట అపురూపమైన సాహసం ఆవిష్కారం అవుతుంది. ఉత్తరఖండ్‌లోని హిమాలయప్రాంతం ఉత్తరకాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది లక్నోకు చెందిన శాలిని సింగ్.... లక్నోకు చెందిన బప్పశ్రీ నారాయణ్ పీజీ కాలేజీలో శాలిని సింగ్ బీఏ స్టూడెంట్. పాఠాలే కాదు పర్వతారోహకుల గురించి ఎన్నో విషయాలు విన్నది శాలిని. 19 శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నది. బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, అరునిమ సిన్హా, శివాంగి పాఠక్, మాలావత్ పూర్ణ....వరకు ఎంతో మంది సాహసికులు తనలో ఉత్తేజం నింపారు. ఎన్సీసీలో చేరిన తరువాత శాలిని సింగ్ ప్రపంచం విస్తృతం అయింది. కొత్త దారులు ఎన్నో కనిపించాయి. యూపీ బెటాలియన్‌లో శాలిని సింగ్ సీనియర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్. అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి సత్తా నిరూపించుకోవాలనేది ఎంతోమంది కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. దానికి ముందు బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జమ్ములోని పహల్గామ్లో గత సంవత్సరం బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన శాలిని అడ్వాన్స్డ్ కోర్సుకు అర్హత సంపాదించింది. మౌంటెనీరింగ్ కోర్సులో భాగంగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది శాలిని. అవి తన జీవితంలో విలువైన అనుభవాలు. మరిన్ని సాహసాలకు దారి చూపే అరుదైన పాఠాలు. దట్టమైన మంచుతో ఉండే హుర్రా శిఖరాన్ని అధిరోహించడం అనేది సాధారణ విషయం కాదు. కోర్సులో భాగంగా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్రింజ్ వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తయిన హుర్రాను అధిరోహించింది శాలిని. ఉత్సాహం, అంకితభావం, సాహసాలను మేళవించి ఎన్నో సవాళ్లతో కూడిన అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి, తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది శాలిని సింగ్. ‘నువ్వు చేయగలవు. కచ్చితంగా చేస్తావు’ అంటూ శాలినిలో ఉత్సాహాన్ని నింపాడు కల్నల్ పునీత్ శ్రీవాస్తవ. ‘శాలిని విజయం ఎన్సీసీకి మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఆమెలా కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చే విజయం’ అంటున్నాడు పునీత్ శ్రీవాస్తవ. ‘నా విజయం ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తే అంతగా సంతోషిస్తాను’ అంటుంది శాలిని సింగ్. ‘మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, జీవనోత్సాహంతో ఉన్నామా అనే దానికి సాహసాలే ప్రమాణం అనే మాట ఎన్నో సార్లు విన్నది శాలిని. ఆ మాటలే సాహస బాటను ఎంచుకోవడానికి తనకు ప్రేరణ ఇచ్చాయి. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది శాలిని సింగ్ కల. అయితే అంతకంటే బలమైన కల.... ప్రపంచంలోని ప్రతి శిఖరాన్ని అధిరోహించాలని! -
చైనాతో పరిస్థితి డేంజర్‌గానే ఉంది! జైశంకర్
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా-భారత్‌ల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సమస్య పరిష్కారమైతే గానీ భారత్, చైనా మధ్య సంబంధాలు యధాస్థితికి రాలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఇరు దేశాలు బలగాలు ఉపసంహరణ విషయంలో కాస్త పురోగతి సాధించాయి. ఘర్షణ ప్రాంతాల్లో సైన్యాన్ని తగ్గించేందుకు కూడా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ లడఖ్‌లోని పశ్చిమ హిమాలయ ప్రాంతంలో భారత్ చైనాల మద్య పరిస్థితి చాలా పెళుసుగా, ప్రమాదకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నా దృష్టిలో చైనాతో పరిస్థితి ఇప్పటికి ముప్పుగానే ఉందని, ఎందుకంటే మోహరింపులు చాలా దగ్గరగా ఉన్నాయని అన్నారు. సైనిక అంచనాల ప్రకారం ఇంకా కొన్ని ప్రదేశాల వద్ద పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది అని అన్నారు. పైగా ఆయా ప్రాంతాల్లో సైనిక బలగాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పారు. అందువల్ల ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధం అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు ఈ ప్రాంతాల్లో దేశం కోసం 20 మంది భారతీయ సైనికులు మరణించగా, సుమారు 40 మందికి పైగా చైనీస్ సైనికులు మరణించడం లేదా గాయపడటం జరిగింది. అంతేగాదు 2020 మధ్యలో ఈప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడూ దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిస్థితి సద్ధుమణిగింది. అలాగే డిసెంబర్లో గుర్తింపులేని సరిహద్దులోని తూర్పు సెక్టార్లో హింస చెలరేగింది. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదు. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..) -
మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి
పార్లమెంటరీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు నేపాల్‌లోని గుర్ఖా ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు టికా దత్ పోఖారెల్. వయసు 100 ఏళ్లు. నేడు(సోమవారం) వందవ ఒడిలోకి అడుగుపెట్టాడు. దేశ రాజకీయాలపై విసుగుచెంది తాను కూడా పోటీ సిద్ధమయ్యాడు. అది కూడా నేపాల్ మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి గెలిచి, హిమలయ దేశాన్ని మళ్లీ హిందూ దేశంగా మార్చాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు పోఖారెల్ తెలిపారు. ఇక్కడ చట్టం, న్యాయం లేదని, కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారని పోఖారెల్ ఆరోపించారు. సరైన నాయకుడే నేపాల్‌లో లేడని, అందుకే తాను పోటీకి సిద్ధమైనట్లు తెలిపారు. అంతేగాదు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవడం, మాట్లాడటమే గాకుండా రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉంటారని నేపాలీ కాంగ్రెస్(బీపీ) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి పెద్ద అభ్యర్థి ఆయనే. అంతేకాదు నేపాల్‌లో ఫెడరల్ పార్లమెంట్‌కి, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోఖారెల్ మాట్లాడుతూ....ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని పోఖారెల్ ధీమాగా చెబుతున్నాడు. గుర్ఖా నేలకు తానెంటో తెలుసునని అన్నారు. ఈ దేశ నాయకులు విధానాలు, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దోచుకున్నారని చెప్పారు. తాను ప్రజలకు హక్కులను కల్పించడమే కాకుండా మళ్లీ హిందూ దేశంగా మార్చేందుకే తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని వివరించారు. 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థుల తోపాటు గుర్ఖా రెండు నియోజకవర్గాల నుంచి తన అభ్యర్థిత్వాన్ని పోఖారెల్ దాఖలు చేసినట్లు సెర్చన్ తెలిపారు. (చదవండి: పుతిన్ ప్లాన్ అట్టర్ ప్లాప్...71 వేల మంది రష్యా సైనికులు మృతి) -
40 శవాల వెలికితీత.. ఇంకా దొరకని 164 మంది
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల్లో గల్లంతైన వారికోసం జరుగుతున్న వెతుకులాట కొనసాగుతోంది. ఎన్టీపీసీకి చెందిన తపోవన్–విష్ణుగాద్ హైడల్ ప్రాజెక్టు సొరంగంలో దాదాపు 30 మంది చిక్కుకొని ఉన్నారన్న సమాచారం మేరకు, వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు జనరల్ మేనేజర్ ఆర్పీ అహిర్వాల్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. ‘సొరంగంలో చిక్కుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు మూడంచెల వ్యూహాన్ని రచించాం. లోపల ఉన్నవారి స్థానాన్ని గుర్తించేందుకు, లోపలి నీటిని బయటకు తోడేసేందుకు అంగులం వెడల్పైన రంధ్రాన్ని చేశాం. ఈ రంధ్రం గుండా కెమెరాను పంపి వారిని గుర్తించే ప్రయత్నం చేస్తాం. లోపల ఒకవేళ నీరు ఉంటే వాటిని బయటకు తోడేసేందుకు అవసరమైన యంత్రాలను కూడా తీసుకొచ్చాం. సొరంగంలోకి బురద నీరు వెళ్లే మార్గాన్ని పెద్ద యంత్రాల ద్వారా దారి మళ్లించాం. లోపల ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా 100 మంది సైంటిస్టులను రంగంలోకి దించాం’ అని తెలిపారు. నిర్విరామంగా.. తపోవన్ సొరంగంలో ఉన్న వారిని రక్షించేందుకు పలు రకాల యంత్రాలను సొరంగం వద్దకు చేర్చినట్లు జనరల్ మేనేజర్ అహిర్వాల్ చెప్పారు. అందులో ఏక కాలంలో కొన్ని యంత్రాలను మాత్రమే వాడుతున్నట్లు చెప్పారు. తద్వారా యంత్రాల్లో ఏవైనా సమస్యలు ఎదురైనా మిగిలిన వాటితో పనిని నిర్విరామంగా పూర్తి చేయవచ్చన్నది నిపుణులు ఇచ్చిన సూచన అని వెల్లడించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు సంబంధించిన పలువురు అనుభవజ్ఞులైన కార్మికులు వరదల్లో గల్లంతయ్యారని, కొత్త కార్మికులతో ఈ చర్యలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పై ప్రాంతం నుంచి సొరంగం వైపు వస్తున్న వరద నీరు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, అయితే పూర్తి స్థాయిలో నిలిచిపోవట్లేదని చెప్పారు. ధౌలిగంగ నదిని అసలైన దారిలో వెళ్లేలా చేయడమే తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 40 మంది మృతదేహాలను వెలికి తీశామని, ఇంకా 164 మంది గల్లంతై ఉన్నారని తెలిపారు. డీఎన్ఏ శాంపిళ్లతో.. సహాయక చర్యలు, వెలికతీతల వ్యవహారంపై డీఐజీ నీలేశ్ ఆనంద్ భార్నే మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను గుర్తించామని తెలిపారు. 18 మందికి చెందిన శరీర భాగాలు లభ్యమయ్యాయని, వాటిని డీఎన్ఏ పరీక్షలకు పంపినట్లు చెప్పారు. వాటిలో పదింటికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రమాదంలో 385 ఉత్తరాఖండ్ గ్రామాలు డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో తీవ్రమైన మెరుపు వరదలు సంభవించే గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 385 గ్రామాలు ఈ ప్రమాద జోన్లో ఉండగా, వాటిలో 5 గ్రామాలను తరలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గురువారం రూ. 2.38 కోట్లను విడుదల చేశారు. 385 గ్రామాల తరలింపునకు దాదాపు రూ. 10 వేల కోట్లు ఖర్చు అవ్వచ్చని అధికారులు అంచనా వేశారు. జిల్లాలవారీ గ్రామాలివే.. మెరుపు వరదలు సంభవించే గ్రామాల్లో పితోర్ గఢ్ జిల్లాలో 129 గ్రామాలు, ఉత్తరకాశిలో 62, చమోలిలో 61, బగేశ్వర్‌లో 42, తెహ్రీలో 33, పౌరిలో 26, రుద్రప్రయాగ్‌లో 14, చంపావత్‌లో 10, అల్మోరాలో 9, నైనిటాల్లో 6, డెహ్రాడూన్ లో 2, ఉదమ్ సింగ్ నగర్లో 1 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో తెహ్రీ, చమోలి, ఉత్తరకాశీ, బగేశ్వర్‌లోని అయిదు గ్రామాలను తరలించేందుకు తాజాగా నిధులు జారీ అయ్యాయి. -
హిమాలయాల్లో కింగ్ కోబ్రా.. అసాధారణ విషయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అటవీ శాఖ అధికారులు మొట్టమొదటి సారి ఓ సంచలన విషయాన్ని గుర్తించారు. హిమాలయాల్లో సుమారు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా సంచారాన్ని గుర్తించారు. మంచు వాతావరణంలో ఇంత ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో దీని గురించి పూర్తి స్థాయిలో శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ అటవి శాఖ అధికారులు ఓ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం పాములు వంటి శీతల రక్త జీవులు టెరాయి ప్రాంతంలో 400 మీటర్ల ఎత్తులో కనిపించగా.. కొండ ప్రాంతాల్లో 2400 మీటర్ల ఎత్తులో కనిపిస్తాయి. కానీ హిమాలయాల వంటి మంచు ప్రాంతంలో ఇంత ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారం కనిపించడం ఇదే ప్రథమం కాక అసాధరణ విషయం అని నివేదిక తెలిపింది. దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరగాలని సూచించింది. (చదవండి: వైరల్: కింగ్ కోబ్రాతో ఆట అదుర్స్!) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌లో భాగంగా ఉత్తరాఖండ్ అటవిశాఖ అధికారులు నైనిటాల్ జిల్లాలోని ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు తొమ్మిది నెలల పాటు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వీరు అనేక చోట్ల కింగ్ కోబ్రా నివాసాలను గుర్తించారు. సాధారణంగా పాములు వంటి శీతర రక్తం కల జీవులు బయటి వేడి మీద ఆధారపడతాయి. ఈ క్రమంలో అవి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలను తమ ఆవాసాలుగా చేసుకుంటాయి. ఈ సందర్భంగా సంజీవ్ చతుర్వేది అనే అధికారి మాట్లాడుతూ.. ‘ముక్తేశ్వర్ పర్వత ప్రాంతంలో దాదాపు 2400 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రా గూళ్లను(పుట్టలు) చూశాం. ఇంత ఎత్తులో మంచు ప్రాంతంలో ఇవి కనిపించడం నిజంగా రికార్డే. గతంలో డెహ్రాడూన్‌లో 2,303 మీటర్ల ఎత్తులో, సిక్కింలో 1088 మీటర్ల ఎత్తులో, మిజోరాంలో 1170 మీటర్ల ఎత్తులో.. నీలగిరిలో 1830 మీటర్ల ఎత్తులో కింగ్ కోబ్రాల సంచారాన్ని గుర్తించాము. ప్రస్తుతం నైనిటాల్లో గుర్తించిన కింగ్ కోబ్రా తన ఆవాసంగా పైన్ చెట్ల ఆకులను వినియోగించుకుంది. వీటికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. మంటలు వ్యాపించడంలో ప్రతి ఏటా ఈ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి’ అన్నారు. (చదవండి: ‘ఉస్సెన్ బోల్ట్ కూడా నన్ను పట్టుకోలేడు’) సాధారణంగా కింగ్ కోబ్రాలు ఎక్కువగా పశ్చిమ, తూర్పు కనుమల ప్రాంతంలో, సుందర్బన్స్ మాంగ్రూవ్స్, ఒడిశాలో కనిపిస్తాయి. అయితే కోబ్రాలు ఏ వాతావరణంలో అయినా త్వరగా కలిసిపోతాయని.. అక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు తమను తాము మార్చుకుంటాయంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితులకు గ్లోబల్ వార్మింగ్ కూడా కారణం అంటున్నారు నిపుణులు. దీని కారణంగా చల్లని ప్రదేశాలు కూడా వేడిగా మారుతున్నాయని.. ఫలితంగా పాములు మంచు ప్రాంతాల్లో కూడా నివసించగల్గుతున్నాయన్నారు. అంతేకాక ఇంత ఎత్తు ప్రాంతంలో జనసంచారం పెరగడం.. ఫలితంగా చెత్తా చెదారం పెరుకుపోవడంతో ఎలుకలు ఇక్కడ ఉంటున్నాయని.. ఇవి పాములను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఏది ఏమైనా ఈ అరుదైన విషయంపై సమగ్ర శాస్త్రీయ పరిశోధన జరగాలంటున్నారు. -
హిమాలయాల్లో త్వరలో భారీ భూకంపం?
హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు 8.2 తీవ్రత ఉండే ప్రమాదం టెక్టోనిక్ షిఫ్ట్ వల్లే ఈ పరిస్థితి న్యూఢిల్లీ హిమాలయ ప్రాంతంలో త్వరలో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందట. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు తెలిపారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 వరకు ఉండే ప్రమాదముంది. మణిపూర్ ప్రాంతంలో సోమవారం సంభవించిన లాంటి భూకంపాలు మరిన్ని వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. టెక్టోనిక్ షిఫ్ట్ కారణంగా ఇటీవల మణిపూర్, నేపాల్, సిక్కిం ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. అది ఇప్పుడు మళ్లీ పాడైందని, దానివల్లే 8.0కు పైగా తీవ్రతతో భూకంపాలు సంభవించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఉత్తరభారతంలో, ముఖ్యంగా పర్వత ప్రాంతాలు అన్నింటా భూకంపం సంభవించే ప్రమాదాలు చాలా స్పష్టంగా ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో కేంద్రం ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో కూడా ఈ విషయాన్ని తెలిపారు. భారత్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల మధ్య అనుసంధానం అయి ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల చాలా ప్రమాదం ఉందని ఎన్ఐడీఎం డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. బిహార్, యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా త్వరలోనే భారీ భూకంపం రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు అంతర్జాతీయ భూకంప నిపుణులు కూడా రాబోయే భూకంపం గురించి హెచ్చరిస్తున్నారు. ఇది ప్రకృతి సిద్ధమైన టైమ్ బాంబ్ అని, దీనిపై ప్రభుత్వ వర్గాలు జాగ్రత్త పడాలని కుమార్ తెలిపారు.