హిమాలయాల్లో త్వరలో భారీ భూకంపం?
హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
8.2 తీవ్రత ఉండే ప్రమాదం
టెక్టోనిక్ షిఫ్ట్ వల్లే ఈ పరిస్థితి
న్యూఢిల్లీ
హిమాలయ ప్రాంతంలో త్వరలో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందట. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిపుణులు తెలిపారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 వరకు ఉండే ప్రమాదముంది. మణిపూర్ ప్రాంతంలో సోమవారం సంభవించిన లాంటి భూకంపాలు మరిన్ని వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. టెక్టోనిక్ షిఫ్ట్ కారణంగా ఇటీవల మణిపూర్, నేపాల్, సిక్కిం ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. అది ఇప్పుడు మళ్లీ పాడైందని, దానివల్లే 8.0కు పైగా తీవ్రతతో భూకంపాలు సంభవించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.
ఉత్తరభారతంలో, ముఖ్యంగా పర్వత ప్రాంతాలు అన్నింటా భూకంపం సంభవించే ప్రమాదాలు చాలా స్పష్టంగా ఉన్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో కేంద్రం ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో కూడా ఈ విషయాన్ని తెలిపారు. భారత్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల మధ్య అనుసంధానం అయి ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల చాలా ప్రమాదం ఉందని ఎన్ఐడీఎం డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. బిహార్, యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా త్వరలోనే భారీ భూకంపం రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు అంతర్జాతీయ భూకంప నిపుణులు కూడా రాబోయే భూకంపం గురించి హెచ్చరిస్తున్నారు. ఇది ప్రకృతి సిద్ధమైన టైమ్ బాంబ్ అని, దీనిపై ప్రభుత్వ వర్గాలు జాగ్రత్త పడాలని కుమార్ తెలిపారు.