heavy earthquake
-
శవాల దిబ్బగా మొరాకో
మర్రకేశ్: భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణనష్టం మొరాకో వాసులను షాక్‌కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోని మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజూ చీకట్లోనే జాగారం చేశారు. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి, కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సుదూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు సహాయక బృందాలు చేరడం కష్టంగా మారింది. అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ విలయానికి తీవ్రంగా ప్రభావితమైన అల్ హౌజ్ ప్రావిన్స్‌లో మరణాలు అత్యధికంగా 1,293 నమోదయ్యాయి. ఆ తర్వాత టరౌడంట్ ప్రావిన్స్‌లో 452 మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాలతోపాటు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు చేయూత అందించేందుకు ముందుకు వచ్చాయి. కళతప్పిన పర్యాటక పట్టణం అట్లాస్ పర్వతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతం మౌలే బ్రహీం భూకంపం ధాటికి విలవిల్లాడింది. మూడువేల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణవాసుల ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. ఇక్కడి వందల ఏళ్లనాటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు పర్యాటకులను ఆకట్టుకునేవి. భూకంపం తీవ్రతకు ఈ ఇళ్లు చాలా వరకు నామరూపాలు కోల్పోగా మిగిలినవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో, జనం ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పట్టణంలోని కూడలిలోనే భారీ టెంట్ వేసుకుని, అందులోనే ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఇల్లంతా ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపించడంతో తమ కుటుంబసభ్యులంతా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశామని మౌలే బ్రహీంకు చెందిన హంజా లంఘానీ చెప్పాడు. బయటికి వెళ్లాక చూడగా తమ ఇంటితోపాటు పొరుగిల్లు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయన్నాడు. పొరుగింట్లో ఉండే తన చిన్ననాటి స్నేహితులు అయిదుగురూ ఆ శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయారని నిర్వేదంతో చెప్పాడు. భారతీయులంతా సురక్షితం భూకంపం నేపథ్యంలో మొరాకోలోని భారత దౌత్యకార్యాలయం స్పందించింది. దేశంలోని భారత పౌరులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం లేదన్నారు. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాల్సిందిగా సలహా ఇచ్చింది. అవసరమైన పక్షంలో తమ హెల్ప్‌లైన్ నంబర్ 212661297491కు కాల్ చేయాల్సిందిగా కోరింది. -
Morocco earthquake: వణికిన మొరాకో
మర్రకేశ్: మొరాకోను భారీ భూకంపం వణికించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వీధుల్లోకి పరుగులు తీశారు. అట్లాస్ పర్వతాల్లోని గ్రామాలు మొదలుకొని చార్రితక మర్రకేశ్ నగరం వరకు వందలాదిగా భవనాలు ధ్వంసం కాగా 1,000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. సుమారు 45 లక్షల మంది నివసించే మర్రకేశ్–సఫి ప్రాంతంలోనే భూకంప నష్టం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. సుదూర ప్రాంతాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మర్రకేశ్లోని 12వ శతాబ్దం నాటి చారిత్రక కౌటౌబియా మసీదు భూకంప ధాటికి దెబ్బతింది. ఈ మసీదులోని 226 అడుగుల ఎత్తైన మినారెట్ ‘రూఫ్ ఆఫ్ మర్రకేశ్’గా ప్రసిద్ధి. అదేవిధంగా, నగరం చుట్టూతా ఉన్న ఎర్రటి గోడ అక్కడక్కడా దెబ్బతిన్న దృశ్యాలు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గోడను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. భూకంప కేంద్రానికి చుట్టుపక్కలున్న మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మరో 672 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొరాకో ప్రభుత్వం తెలిపింది. భూకంప కేంద్రం సమీపంలోని ఓ పట్టణంలో చాలా వరకు ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికుడొకరు వెల్లడించారు. అట్లాస్ పర్వతప్రాంతంలోని అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని తలత్ ఎన్ యాకూబ్ పట్టణంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పర్యాటకులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రహదారులు దెబ్బతినడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యవసర బృందాలు భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా అరుదు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భూకంపాలు చాలా అరుదు. మొరాకోలోని పర్వత ప్రాంతంలో ఇంతటి అత్యంత తీవ్ర భూకంపం గతంలో ఎన్నడూ సంభవించలేదని నిపుణులు చెబుతున్నారు. 1960లో 5.8 తీవ్రతతో మొరాకోలోని అగడిర్ నగరంలో సంభవించిన భూకంపంలో వేలాదిగా జనం చనిపోయారు. 2004లో తీరప్రాంత నగరం అల్ హొసైమాలో భూకంపంతో 600 మంది చనిపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నగరాలు, పట్టణాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా భవనాల నిర్మాణం జరిగింది. అయితే, పల్లెల్లో మాత్రం ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాజా భూకంపం ప్రభావం పోర్చుగల్, అల్జీరియా వరకు ఉంది. ప్రమాదకర భూకంపం భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచదేశాల ఆపన్న హస్తం సాయం కోసం మొరాకో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి విజ్ఞాపన చేయనప్పటికీ..ఈ ఘోర ప్రకృతి విపత్తుపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్‌తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. సాధ్యమైనంత సాయం అందజేస్తాం: మోదీ మొరాకోలో భూకంపంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు భారత్ సాధ్యమైనంత మేర ఆదుకుంటుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం మొదలైన జీ20 భేటీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం మొరాకోకు మద్దతుగా నిలవాలనీ, సాధ్యమైనంత మేర సాయం అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
మంచుకొండల్లో మహావిలయం!
బెంగళూరు: హిమాలయ ప్రాంతానికి మరో భారీ భూకంపం ముప్పు పొంచి ఉందా? అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. ఈ పర్వతాల భూపొరల్లో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉందనీ, అది ఏ క్షణమైనా వెలువడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌లో భూకంప శాస్త్రవేత్తగా ఉన్న సిపీ రాజేంద్రన్ బృందం ఓ నివేదికను విడుదల చేసింది. మధ్య హిమాలయాల ప్రాంతంలో ఎప్పుడైనా 8.5 తీవ్రతతో భూకంపం రావచ్చని రాజేంద్రన్ అన్నారు. భూపొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా ఈ ప్రాంతంలో విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. పశ్చిమ నేపాల్‌లోని మోహనఖోలా, ఉత్తరాఖండ్‌లోని ఛోర్‌గలియా ప్రాంతంలో భూప్రకంపనలతో పాటు ఇతర డేటాబేస్లు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, ఇస్రో పంపిన కార్టోశాట్–1 చిత్రాలు, గూగుల్ ఎర్త్ ఆధారంగా తాము ఈ నిర్ధారణకు వచ్చారు. 2004లో సునామీ రాకను కచ్చితంగా అంచనా వేసిన పుణెకు చెందిన భూకంప శాస్త్రవేత్త అరుణ్ బాపట్ స్పందిస్తూ.. ఈ ఏడాది చివర్లో లేదా 2019 ఆరంభంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పక్కకు జరిగిన హిమాలయాలు.. క్రీ.శ.1315–1440 మధ్యకాలంలో మధ్య హిమాలయాల ప్రాంతంలో 8.5 తీవ్రతతో భీకరమైన భూకంపం సంభవించిందని తమ పరిశోధనలో తేలినట్లు రాజేంద్రన్ తెలిపారు. దీని కారణంగా ఈ ప్రాంతంలో 600 కి.మీ పొడవైన పగులు ఏర్పడిందన్నారు. ప్రకంపనల వల్ల పర్వతాలు 15 మీటర్లు పక్కకు జరిగాయన్నారు. హిమాలయాల్లో 2015, ఏప్రిల్‌లో వచ్చిన భూకంపం దెబ్బకు దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయినా, దాని తీవ్రత 7.8గానే ఉందని రాజేంద్రన్ అన్నారు. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8.5, అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించి 600 నుంచి 700 సంవత్సరాలు గడిచిపోయాయని వ్యాఖ్యానించారు. పొరల్లో విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎప్పుడైనా భూకంపం రావచ్చని చెప్పారు. పెనువిధ్వంసమే.. ఈ ప్రాంతంలో జనసాంద్రత క్రమంగా పెరుగుతున్నందున ఇలాంటి ప్రకృతి విపత్తు సంభవిస్తే నష్టం ఊహకు అలందదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పెనుభూకంపాన్ని తట్టుకునేవిధంగా కట్టడాలు నిర్మించకపోవడం, ప్రజలను అధికారులు సంసిద్ధులను చేయకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్త రాజేంద్రన్ అన్నారు. ఇప్పుడు హిమాలయాల ప్రాంతంలో 8.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే నేపాల్‌తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై పరిశోధనలు జరుపుతున్న అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరడోకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త రోజర్ బిల్హమ్ ఈ విషయమై స్పందిస్తూ.. హిమాలయాల్లోని తూర్పు అల్మోరా నుంచి నేపాల్‌లోని పోకరా ప్రాంతం మధ్యలో భూపొరల్లో తీవ్రమైన ఒత్తిడి నెలకొందన్నారు. ఈ అధ్యయనం కోసం 36 జీపీఎస్ స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించామని తెలిపారు. తమ పరిశోధనను బట్టి వాయవ్య హిమాలయాల్లోని ఘర్వాల్–కుమౌన్(ఉత్తరాఖండ్) సెగ్మెంట్‌ను త్వరలో భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని వెల్లడించారు. -
దీవులను చేరువ చేసిన భూకంపం!
వెల్లింగ్టన్: రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంపంతో న్యూజిలాండ్‌లో స్వల్పంగా భౌగోళిక మార్పులు చోటుచేసుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఉత్తర, దక్షిణ దీవుల మధ్య దూరం 35 సెంటీమీటర్లు తగ్గగా, దక్షిణ దీవికి పైభాగాన ఉన్న నెల్సన్ పట్టణం 20 మిల్లీ మీటర్లు కుంగిందని తెలిపారు. 2016 నవంబర్ 14వ తేదీన 7.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంప ప్రభావానికి లోనై ఈ రెండు ప్రధాన దీవులు ఒకదానికొకటి చేరువగా వచ్చాయని, చీలికలు దక్షిణ దీవిని ఉత్తరం వైపునకు నెట్టివేశాయని వివరించారు. మరోవైపు, దక్షిణ దీవిలో ప్రధాన చీలిక సంభవించిన కేప్ క్యాంప్‌బెల్, ఉత్తర దీవికి దిగువన ఉన్న రాజధాని వెల్లింగ్టన్ మధ్య దూరం 50 కిలోమీటర్లకు పైగానే ఉందని వారు తెలిపారు. ఆనాటి భూకంపంలో సుమారు 25 చోట్ల చీలికలు ఏర్పడ్డాయని గుర్తించారు. ప్రపంచంలో సంభవించిన అత్యంత సంక్లిష్టమైన భూకంపాల్లో ఇది కూడా ఒకటని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. -
జపాన్‌లో భూకంపం.. ముగ్గురు మృతి
టోక్యో: భారీ భూకంపంతో జపాన్ వణికింది. జపాన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఒసాకాలో సోమవారం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తీవ్రత తక్కువే అయినప్పటికీ శక్తిమంతమైన ప్రకంపనల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. 9 ఏళ్ల బాలిక సహా ముగ్గురు మరణించారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 20 లక్షల మంది నివసించే ఒసాకా నగరంలో ఉదయం 8 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. భవనాలు ఊగడం, పైపులు పగిలిపోయి నీళ్లు విరజిమ్మడం వీడియోల్లో కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు రోడ్లపైనే నిలిచిపోగా.. చాలాచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఉత్తర ఒసాకాలోని టకట్సుకీలో భూకంపం కారణంగా పాఠశాల గోడ కూలి 9 ఏళ్ల బాలిక మరణించింది. ఓ వృద్ధుడు (80) కూడా గోడ కూలి మృతి చెందగా, ఇంటిలోని బుక్ షెల్ఫ్ మీద పడటంతో మరో 84 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత తీవ్రతతో కూడిన ప్రకంపనలు సంభవించే ప్రమాదముందని ప్రభుత్వ అధికార ప్రతినిధి యోషిహిడే సుగా హెచ్చరించారు. కాగా, జపాన్ ప్రభుత్వం ఎలాంటి సునామీ హెచ్చరికలూ జారీ చేయలేదు. -
పెనుభూకంపం ముందుందా?
డెహ్రాడూన్: హిమాలయాలకు సమీపంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పెనుభూకంపం అతలాకుతలం చేయనుందా? రాష్ట్రంలో గత రెండేళ్లుగా స్వల్పస్థాయిలో సంభవిస్తున్న భూకంపాలు దీన్నే హెచ్చరిస్తున్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో త్వరలోనే అత్యంత భారీ భూకంపం విధ్వంసం సృష్టించనుందని ఆ రాష్ట్ర విపత్తు ఉపశమనం, నిర్వహణా కేంద్రం (డీఎంఎంసీ) చీఫ్ పీయూష్ రౌతేలా తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8 కిపైగానే నమోదవ్వొచ్చని చెప్పారు. 2015, జనవరి 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 51 సార్లు భూమి స్వల్పంగా కంపించిందనీ, వీటిని హెచ్చరికలుగానే పరిగణించాల్సి ఉంటుం దన్నారు. ఉత్తరాఖండ్‌లో గత 200 ఏళ్లుగా ఒక్క భారీ భూకంపం కూడా రాలేదన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్–5లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 1803లో చివరిసారిగా సంభవించిన భారీ భూకంపంతో ఉత్తరాఖండ్ అతలాకుతలమైందన్నారు. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వస్తే ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన ముస్సోరీలో 18 శాతం, నైనిటాల్లో 14 శాతం భవనాలు నేలమట్టమవుతాయని స్పష్టం చేశారు. ఇక్కడి భవనాల్లో చాలావరకూ 1951కి ముందే నిర్మితమమైనవే. -
టిబెట్‌లో భారీ భూకంపం
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని టిబెట్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల అదృష్టవశాత్తూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. పలు గ్రామాల్లో రోడ్లు, ఆస్తులు ధ్వంసం అయ్యాయి. భూకంపం వల్ల కొండచరియలు విరిగిపడి నీంగ్చి–తాంగ్మై రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భూకంపానికి గురైన ప్రాంతంలో వంతెనల పటిష్టతను పరీక్షించేందుకు రహదారుల మంత్రిత్వ శాఖ ఓ బృందాన్ని అక్కడకు పంపింది. మొబైల్ నెట్‌వర్క్‌లు చాలావరకు అంతరాయాలు లేకుండా సవ్యంగానే పనిచేస్తున్నాయి. ఇటు భారత్‌లోని రాజస్తాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.3 నుంచి 4.2 మధ్య ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ముందుగా జోధ్‌పూర్‌లో మధ్యాహ్నం 3.21 గంటలకు భూమి కంపించింది. తర్వాత ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్లో సాయంత్రం స్వల్పంగా భూకంపం వచ్చింది. -
ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం
-
ఇరాన్ సరిహద్దులో భూ విలయం
టెహ్రాన్: రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్–ఇరాన్ సరిహద్దుల్లో భారీ విధ్వంసం సృష్టించింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టవడంతో రెండు దేశాల్లో మొత్తం 407 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 వేల మంది గాయపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. రాత్రివేళ కావడంతో చాలా మంది తప్పించుకునే వీల్లేక శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూ పరిశీలన సంస్థ తెలిపింది. ఇరాన్, ఇరాక్ స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9.48 గంటల (భారత కాలమానం ఆదివారం రాత్రి 11.48 గంటలు) సమయంలో భూప్రకంపనలు మొదలయ్యాయి. కొద్ది క్షణాల్లో ఇరాన్ పశ్చిమ ప్రాంతంలోని కెర్మన్షా ప్రావిన్సు, ఇరాక్ ఉత్తర భాగంలోని కుర్దిష్ ప్రావిన్సుల్లో పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బగా మారిపోయాయి. ఒక్క ఇరాన్‌లోనే 401 మంది మృత్యువాతపడగా, మరో 6,603 మంది క్షతగాత్రులయ్యారు. ఇరాక్‌లో ఆరుగురు మరణించగా 535 మంది గాయపడ్డారు. భూకంపం అనంతరం దాదాపు 100 స్వల్ప ప్రకంపనాలు నమోదయ్యాయి. తీవ్రంగా దెబ్బతిన్న సర్పోలే జహాబ్ సిటీ ఇరాన్, ఇరాక్ సరిహద్దుల్లో జర్గోస్ పర్వతాల మధ్య ఉన్న సర్పోలే జహాబ్ పట్టణం(ఇరాన్) భూకంపం తీవ్రతకు బాగా దెబ్బతింది. జహాబ్‌లో విద్యుత్తు, నీటి సరఫరా వ్యవస్థలు పూర్తిగా నాశనం కాగా.. టెలిఫోన్, సెల్‌ఫోన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇరాన్లో 14 ప్రావిన్సులపై భూకంప ప్రభావం ఉందని స్థానిక వార్తాసంస్థ తెలిపింది. ఇరాన్ అగ్రనేత అయతుల్లా ఖొమైనీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. భూకంప బాధితులకు పూర్తి స్థాయిలో సాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భూకంప ప్రభావిత ప్రాంతాల్ని మంగళవారం పరిశీలించనున్నారు. పలు నగరాల్లో భవనాలు కంపించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఇరాక్ ప్రధాన మంత్రి హైదర్ అల్ అబాదీ అధికారులను ఆదేశించారు. ఇరాన్, ఇరాక్‌ల్లో సంభవించిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని... భూకంపానికి ఎక్కువగా నష్టపోయిన సర్పోలే జహాబ్ ప్రావిన్స్‌లో 300 మంది మరణించినట్లు ప్రాథమిక అంచనా. ‘మా అపార్ట్మెంటు భవనం కూలింది. అదృష్టవశాత్తూ ప్రకంపనలు మొదలవగానే వస్తువులన్నీ ఇంట్లో వదిలేసి బయటకు పరుగెత్తడంతో ప్రాణాలు కాపాడుకున్నాం’ స్థానిక మహిళ చెప్పింది. మరో వ్యక్తి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘భూమి కంపించగానే ఇంటిల్లిపాదీ వీధిలోకి పరుగెత్తాం. భూమి రెండోసారి కంపించగానే మొత్తం భవనం కూలిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్లో భూప్రకంపనలు సాధారణం. 2003లో 6.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి చారిత్రక నగరం బామ్‌లో 26 వేలమంది మృత్యువాత పడ్డారు. -
మెక్సికోలో భూకంప విధ్వంసం
-
మెక్సికోలో భూకంప విధ్వంసం
శిథిలాల కింద 225 మంది సమాధి.. మరింత పెరగనున్న మృతుల సంఖ్య ► పాఠశాల భవనం కూలి 21 మంది చిన్నారుల దుర్మరణం ► శిథిల నగరంగా మెక్సికో సిటీ ► కొనసాగుతున్న సహాయక చర్యలు ► వివిధ దేశాధినేతల దిగ్భ్రాంతి.. సాయం చేస్తామని ప్రకటన మెక్సికో సిటీ: పక్షం రోజుల క్రితంనాటి భూకంప బీభత్సాన్ని మరవకముందే మెక్సికోలో మరో భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం) రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం 225 మంది ప్రాణాలను బలిగొంది. రాజధాని మెక్సికో సిటీలోని ఓ ఎలిమెంటరీ పాఠశాల కుప్ప కూలిపోవటంతో అందులోని 21 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. మెక్సికో సిటీతోపాటు ప్యూబ్లా, మెర్లోస్, గ్యురేరో నగరాల్లోనూ పరిస్థితి భీతావహంగా మారింది. చాలాచోట్ల భవనాలు పూర్తిగా కుప్పకూలటంతో బాధితుల సంఖ్య మరింత పెరగనుంది. సైనికులు, పోలీసులు, వాలంటీర్లు, రెస్క్యూ డాగ్స్‌తో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారికి ట్యూబుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. వివిధ దేశాధినేతలు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెక్సికోకు అవసరమైన సాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎటుచూసినా భయానక దృశ్యాలే! సెప్టెంబర్ 7న మెక్సికోలో ఓ భూకంపం సృష్టించిన బీభత్సంలో 100 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను మరవకముందే మంగళవారం మధ్యాహ్నం మరోసారి ప్రకృతి ఆ దేశంపై ప్రకోపించింది. 1985లోనూ ఇదేరోజు (సెప్టెంబర్ 19) మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. పదివేల మంది ప్రాణాలు బలిగొంది. దీన్ని గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తుండగానే మళ్లీ విరుచుకుపడిన భూకంపం మెక్సికో సిటీని కోలుకోలేని దెబ్బకొట్టింది. తాజా దుర్ఘటనలోనూ భవనాలు ఎక్కడికక్కడ కూలిపోయాయి. ఎత్తైన భవనాలు కాంక్రీటు కుప్పలుగా మిగిలిపోయాయి. మెక్సికో సిటీలోని ఎన్రిక్ రెబాస్మెన్ ప్రైమరీ స్కూలో మూడు అంతస్తులు కూలిపోయాయి. ఈ ఘటనలో 21 మంది చిన్నారులతోపాటు ఐదుగురు టీచర్లు సమాధి అయ్యారు. ఓ టీచర్, ఓ చిన్నారి ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించిన రెస్క్యూ టీమ్ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశాధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ‘భూకంప ఘటన దురదృష్టకరం. చిన్నారులు సహా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. పాఠశాలలు, ఇళ్లు, కార్యాలయాలు కుప్పకూలిపోయాయి’ అని నీటో ఆవేదన వ్యక్తం చేశారు. తమవారి కోసం వెతుకులాట మెక్సికో సిటీ జనాభా 2 కోట్లు. భూకంపంతో చాలా భవనాలు కుప్పకూలటంతో.. చాలా మంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. మెక్సికో సిటీ మధ్య భాగంలోనే భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీంతో నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. దీంతో తమవారి వివరాలు తెలుసుకునేందుకు కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం. ట్రాఫిక్ స్తంభించిపోవటంతో.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించటం కూడా కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. కాగా, మంగళవారం ఉదయమే మెక్సికో సిటీ అధికారులు భూకంపం వస్తే ప్రాణాలు కాపాడుకోవటంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అది జరిగి కొన్ని గంటలైనా గడవకముందే.. భూకంపం విరుచుకుపడింది. మెక్సికో సిటీలోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును మూడు గంటలకు పైగా మూసేశారు. స్టాక్ మార్కెట్‌ను కూడా మూసేఉంచారు. స్థానికులు రాత్రంతా ఇళ్లకు వెళ్లకుండా రోడ్లపై, పార్కుల్లోనే గడిపారు. క్షణక్షణం భయం భయం ‘ఇది 1985 నాటి పీడకల లాంటిదే. అప్పటి తీవ్రత నాకు గుర్తుంది. అచ్చం ఈ పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలా భయమేస్తోంది’ అని 52 ఏళ్ల బాధితుడొకరు ఏడుస్తూ చెప్పారు. ‘ఇళ్లు కూలుతుండగానే.. ప్రాణాలు కాపాడుకునేందుకు అరుస్తూ ప్రజలు పరిగెడుతున్న దృశ్యాలింకా కళ్లముందే కదలాడుతున్నాయి. ఆ భయానక దృశ్యాలను ఇంకా మరిచిపోలేకున్నా’ అని మరో బాధితురాలు తెలిపింది. మళ్లీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో చాలాచోట్ల ఆసుపత్రుల్లోని రోగులను ఖాళీ చేయించారు. అండగా ఉంటాం భూకంప విధ్వంసం గురించి తెలియగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలు దేశాధినేతలు విచారం వ్యక్తం చేశారు. మెక్సికో తిరిగి కోలుకునేలా తమవంతు సాయం చేస్తామని ప్రకటించారు. మెక్సికోకు అన్నివిధాలా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీటర్లో పేర్కొన్నారు. చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో కూడా ‘మా మిత్రుడికి అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు. భూకంపం గురించి తెలియగానే.. సహాయ కార్యక్రమాల కోసం ‘36–స్ట్రాంగ్ రెస్క్యూ టీం’ను హొండూరస్ పంపింది. కాగా, ఈ ఘటనలో మెక్సికోలో ఉన్న భారతీయులంతా క్షేమంగానే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. ఇక్కడ భూకంపాలు ఎక్కువే! సాక్షి, నేషనల్ డెస్క్: రెండు వారాల్లోనే మెక్సికోను రెండు భారీ భూకంపాలు వణికించాయి. సాధారణంగా తీవ్రత ఎక్కువ ఉన్న భూకంపాలు ఒకే ప్రాంతంలో కొన్ని రోజుల వ్యవధిలోనే సంభవించవు. అయితే మెక్సికోలో మాత్రం ఇలా ఎందుకు జరిగిందంటే కారణాన్ని భూభౌతిక శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. మామూలుగానే మెక్సికో దేశం ఉన్న ప్రాంతంలో భూమి కంపించే అవకాశం ఎక్కువ. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో మెక్సికో ఒకటి. అందుకు కారణం ఈ దేశం కోకస్, పసిఫిక్, ఉత్తర అమెరికా అనే మూడు భూ ఫలకాల ఉమ్మడి అంచుల్లో ఉండటమే. ఈ భూ ఫలకాలు ఒకదానికొకటి ఢీ కొన్నప్పుడు, ఒకదానితో మరొకటి సర్దుబాటు చేసుకున్నప్పుడు వివిధ తీవ్రతల్లో భూకంపాలు వస్తుంటాయి. పైగా ఇప్పుడు మెక్సికో నగరం ఉన్న ప్రాంతం ఒకప్పుడు సరస్సు. అక్కడ మట్టి చాలా మృదువుగా ఉంటుంది. అందువల్ల చిన్నపాటి భూకంపాలు వచ్చినా, వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంగళవారం వచ్చిన భూకంపం కోకస్, ఉత్తర అమెరికా భూ ఫలకాలు ఢీ కొనడం వల్ల సంభవించింది. 32 ఏళ్ల క్రితం, 1985లో కూడా మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చి దాదాపు 10 వేల మంది చనిపోయారు. అనంతరం చేసిన ఓ పరిశోధనలో తేలిందేంటంటే...అక్కడున్న మృదువైన మట్టి కారణంగా భూకంప తీవ్రత సాధారణం కన్నా ఏకంగా 500 శాతం పెరిగింది. అప్పటినుంచి భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఇక్కడ కొన్నిసార్లు అగ్ని పర్వతాలు బద్దలవటం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి. -
భారీ భూకంపం.. సునామీ ప్రమాదం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. ఇండోనేషియాకు నైరుతి దిశగా ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. పడాంగ్ నగరానికి 808 కిలోమీటర్ల నైరుతి దిశలో భూకంప కేంద్రం ఉందని, ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పింది. ఇండోనేషియా ప్రభుత్వం ఇప్పటికే సునామీ హెచ్చరికను కూడా జారీచేసింది. పశ్చిమ సుమత్రా, ఉత్తర సుమత్రా, అచె తదితర ప్రాంతాలకు ఈ సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఇండోనేషియాలో ప్రధానంగా సుమత్రా, అచె ప్రాంతాలు 2004 నాటి సునామీలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతానికి కూడా సునామీ ముప్పు పొంచి ఉన్నట్లు తొలుత హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే కొంతసేపటి తర్వాత ఆస్ట్రేలియా ఆ సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. ఇండోనేషియా పశ్చిమతీరంలోని మెంటవాయ్ ప్రాంతంలో కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. రేడియో ద్వారా అక్కడి అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం ఏమీ లేదని ఇండోనేషియా అధికారులు చెబుతున్నారు. తాజా భూకంపం వల్ల సంభవించిన ఆస్తినష్టం, ప్రాణనష్టాలకు సంబంధించిన సమాచారం ఏదీ ఇంతవరకు అందలేదు గానీ.. నష్టం ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. 2004లో వచ్చిన స్థాయిలో సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. కాగా, ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో సంభవించిన ఈ భారీ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు ఇంతవరకు రిపోర్టులేవీ రాలేదని నేషనల్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. -
హిమాలయాల్లో త్వరలో భారీ భూకంపం?
హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు 8.2 తీవ్రత ఉండే ప్రమాదం టెక్టోనిక్ షిఫ్ట్ వల్లే ఈ పరిస్థితి న్యూఢిల్లీ హిమాలయ ప్రాంతంలో త్వరలో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందట. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులు తెలిపారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.2 వరకు ఉండే ప్రమాదముంది. మణిపూర్ ప్రాంతంలో సోమవారం సంభవించిన లాంటి భూకంపాలు మరిన్ని వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. టెక్టోనిక్ షిఫ్ట్ కారణంగా ఇటీవల మణిపూర్, నేపాల్, సిక్కిం ప్రాంతాల్లో భూకంపాలు సంభవించాయి. అది ఇప్పుడు మళ్లీ పాడైందని, దానివల్లే 8.0కు పైగా తీవ్రతతో భూకంపాలు సంభవించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఉత్తరభారతంలో, ముఖ్యంగా పర్వత ప్రాంతాలు అన్నింటా భూకంపం సంభవించే ప్రమాదాలు చాలా స్పష్టంగా ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్‌లో కేంద్రం ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో కూడా ఈ విషయాన్ని తెలిపారు. భారత్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల మధ్య అనుసంధానం అయి ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల వల్ల చాలా ప్రమాదం ఉందని ఎన్ఐడీఎం డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. బిహార్, యూపీ, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా త్వరలోనే భారీ భూకంపం రావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు అంతర్జాతీయ భూకంప నిపుణులు కూడా రాబోయే భూకంపం గురించి హెచ్చరిస్తున్నారు. ఇది ప్రకృతి సిద్ధమైన టైమ్ బాంబ్ అని, దీనిపై ప్రభుత్వ వర్గాలు జాగ్రత్త పడాలని కుమార్ తెలిపారు.