
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని టిబెట్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం వల్ల అదృష్టవశాత్తూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. పలు గ్రామాల్లో రోడ్లు, ఆస్తులు ధ్వంసం అయ్యాయి. భూకంపం వల్ల కొండచరియలు విరిగిపడి నీంగ్చి–తాంగ్‌మై రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భూకంపానికి గురైన ప్రాంతంలో వంతెనల పటిష్టతను పరీక్షించేందుకు రహదారుల మంత్రిత్వ శాఖ ఓ బృందాన్ని అక్కడకు పంపింది.
మొబైల్ నెట్‌వర్క్‌లు చాలావరకు అంతరాయాలు లేకుండా సవ్యంగానే పనిచేస్తున్నాయి. ఇటు భారత్‌లోని రాజస్తాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.3 నుంచి 4.2 మధ్య ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ముందుగా జోధ్‌పూర్‌లో మధ్యాహ్నం 3.21 గంటలకు భూమి కంపించింది. తర్వాత ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లో సాయంత్రం స్వల్పంగా భూకంపం వచ్చింది.