రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు
126 మంది మృతి, 188 మందికి గాయాలు
పొరుగునున్న నేపాల్‌లోనూ ప్రకంపనలు
బీజింగ్: చైనాలోని అటానమస్ ప్రాంతం టిబెట్‌లో మంగళవారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.05 గంటల సమయంలో చోటుచేసుకున్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. దీని తీవ్రత డింగ్రీ కౌంటీలోని జిగాజెపై ఎక్కువగా పడింది. అక్కడ నివాస భవనాలు కూలడం వంటి ఘటనల్లో కనీసం 126 మంది ప్రాణాలు కోల్పోగా మరో 188 మంది క్షతగాత్రులయ్యారు. అయితే, భూకంప తీవ్రత 7.1 వరకు ఉందని అమెరికా జియోలాజికల్ విభాగం అంటోంది.
ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో, అధికారులు ఆహార పదార్థాలు, మంచినీరుతోపాటు కాటన్ టెంట్లు, కాటన్ కోట్లు, కిల్టులు, బెడ్లు తదితరాలను హుటాహుటిన పంపించారు. జిగాజె ప్రాంతాన్ని షిగస్తె అని కూడా పిలుస్తారు. ఇది భారత్‌తో సరిహద్దులకు సమీపంలోనే ఉంటుంది. టిబెట్‌లోని పవిత్ర నగరాల్లో షిగస్తె ఒకటి. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా తర్వాతి స్థానంగా భావించే పంచన్ లామా ఉండేది షిగస్తెలోనే. భూకంప కేంద్రం డింగ్రి కౌంటీలోని త్సొగోలో ఉంది.
భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం నేపాల్‌లోని లొబుట్సెకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భూ ప్రకంపనల ప్రభావంతో నేపాల్‌లోని కవ్‌రెపలన్‌చౌక్, సింధుపలన్‌చౌక్ ధడింగ్, సొలుకుంభు జిల్లాలతోపాటు రాజధాని కఠ్మాండులోనూ కరెంటు స్తంభాలు, చెట్లు, భవనాలు కదిలాయి. ఇళ్లలో వస్తువులు శబ్దాలు చేస్తూ పడిపోవడంతో జనం భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment