యార్లంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతం. (చైనా ఇక్కడ నిర్మించబోతున్న అతి పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల భారత్ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది).
విశ్లేషణ
టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్పో నది దిగువ ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత అతి పెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దిగువన ఉన్న నదీ తీర దేశమైన భారత్‌కి తెలియజేయకుండా చైనా ప్రభుత్వం ఈ తీర్మానం చేసింది! మనకు ఉత్తరాన ఉన్న పొరుగు దేశంతో సంబంధాలను నెలకొల్పుకోవడంలో ఉన్న సంక్లిష్టతను ఈ పరిణామం మరోసారి గుర్తు చేసినట్లయింది. పర్యావరణపరంగా దుర్బలమైన, భూకంపాలకు గురయ్యే భౌగోళిక ప్రాంతంలో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుతో విపత్తుల ప్రమాదం అనుక్షణం పొంచి ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. భారత్ తన నిశ్శబ్ద దౌత్యాన్ని వీడి, చైనాతో అధికారిక మార్గాలలో తన ఆందోళనలను బలంగా నమోదు చేయాలి.
చాలా సంవత్సరాలుగా సన్నాహక దశలో ఉన్న చైనా ప్రతిపాదిత యార్లుంగ్ త్సాంగ్పో ప్రాజెక్టును భారతదేశం నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే ఇది భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఎగువ నదీ తీర దేశంగా ఉంటున్న చైనాకు ఇతర దేశాలతో సహకరించడానికి, నదికి దిగువన ఉన్న దేశాల ప్రయోజనాలను కాపాడటానికి ఇష్టపడని దురదృష్టకరమైన చరిత్ర ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనాతో సంబంధాలు క్లిష్టంగా ఉన్న భారతదేశానికి ఈ ప్రాజెక్టు ద్వారా మరో ప్రధానమైన చీకాకు తలెత్తుతోంది.
జిన్హువా వార్తా సంస్థ వివరాలను అందించకుండానే ఈ వెంచ ర్‌ను ‘గ్రీన్ ప్రాజెక్ట్’గా ప్రశంసించింది. హాంకాంగ్‌కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఈ డ్యామ్ నిర్మాణంలో మొత్తం పెట్టుబడి 1 ట్రిలియన్ యువాన్లు అంటే 137 బిలియన్ డాలర్లను దాటవచ్చు. ప్రతి సంవత్సరం ఈ ప్రాజెక్టు దాదాపు 300 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా.
ప్రస్తుతం చైనాలో ఉన్న, ప్రపంచంలోనే అతిపెద్ద త్రీ గోర్జెస్ ఆన కట్టలోని 88.2 బిలియన్ కిలోవాట్ గంటల విద్యుత్ తయారీ డిజైన్ సామర్థ్యంతో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కానుంది. దీంట్లో భాగంగా నాలుగు నుండి ఆరు వరకు 20 కిలోమీటర్ల సొరంగాలను తవ్వుతారు. నది ప్రవాహంలో సగాన్ని వీటి ద్వారా మళ్లిస్తారు. అయినప్పటికీ, ఇది దిగువ దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపదని ఉవాచ!
ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ యార్లుంగ్ త్సాంగ్పో నదికి చెందిన పెద్ద మలుపు ప్రాంతంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. అక్కడ నది యూటర్న్ తీసుకొని 20 కి.మీ కంటే కొంచెం దిగువన భారతదేశంలో ప్రవేశిస్తుంది. ఈ ప్రాజెక్ట్ తీవ్ర పర్యవసానాలు మనకు అనేక విధాలుగా గ్రహింపునకు వస్తున్నాయి. మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈ నది సియాంగ్ పేరుతో చలామణి అవుతుంది. నీటి ప్రవాహానికి ఇది తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. ఇది బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థకు చెందిన ప్రధాన వాహిక.
అస్సాం ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతం టిబెట్‌లో 2,93,000 చదరపు కిలోమీటర్లు. భారతదేశం, భూటాన్‌లలో 2,40,000 చదరపు కిలోమీటర్లు. బంగ్లాదేశ్‌లో 47,000 చదరపు కిలోమీటర్ల మేరకు బ్రహ్మపుత్ర విస్తరించి ఉంది. ఈ నది నీటిలో ఎక్కువ భాగం మన భూభాగంలోనే ప్రవహిస్తుంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్... నదీ ప్రవా హాలను, తత్ఫలితంగా దిగువ నివాసితుల జీవనోపాధిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది.
ప్రధాన ప్రాజెక్టుకు అనుసంధానంగా మెకాంగ్ ఎగువ ప్రాంతా లలో చైనా చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం,కృత్రిమ జలపాతాలను సృష్టిస్తుండటం కూడా క్రమవిరుద్ధమైన హెచ్చుతగ్గులకు దారితీయనుంది. దీంతో కొన్ని ప్రాంతాలు ఎండిపోనున్నాయి. చేపల లభ్యత తగ్గుతుంది.
దిగువ మెకాంగ్ బేసిన్ లో సారవంతమైన ఒండ్రు నిక్షేపాలకు చోటు లేకుండా పోతుంది. ఇది మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాంలలోని నదీ తీర ప్రాంత ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మొత్తంగా – ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ భారతదేశం, బంగ్లాదేశ్‌లకు అనూహ్య ప్రతికూల పరిణామాలను కలిగించనుంది.
2004లో టిబెట్‌లోని సట్లెజ్ ఉపనది అయిన పరేచు నదిపై ఒక కృత్రిమ సరస్సు ఏర్పడినప్పుడు క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని ఒక బృందం చేసిన అత్యవసర కసరత్తు ఈ వ్యాసకర్తకు గుర్తుంది. ఆ సమయంలో చైనాతో మనకు సాపేక్షంగా మంచి సంబంధాలు ఉన్నందున, మన భౌగోళిక వనరులు, ఇతర మార్గాల ద్వారా పోగుపడిన సమాచారం ద్వారా మనకు ముందస్తు నోటీసు, డేటా లభించాయి.
సరస్సు ఘనీభవించే ముందు ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. పైగా నివారణ చర్యల కారణంగా తదుపరి సంవత్సరం భారత దేశంలో దిగువన పరిమిత నష్టం మాత్రమే జరిగింది. కానీ, తాజాగా ప్రతిపాదించిన ప్రాజెక్ట్ నుండి పుట్టుకొచ్చే ప్రమాదాలు తీవ్రాతి తీవ్రంగా ఉంటాయి.
ఎంతో సహనంతో కూడిన దౌత్యంతోనే మనం బీజింగ్‌తో పరి మిత సహకారాలను ఏర్పాటు చేసుకోగలిగాం. వాటిలో బ్రహ్మపుత్ర నదికి చైనా రుతుపవనాల సీజన్ డేటాను అందించడంపై మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం, సట్లెజ్ నదికి రుతుపవ నాల సీజన్ డేటా పంచుకోవడం, ‘ట్రాన్ ్స–బోర్డర్ నదులపై సహకా రాన్ని బలోపేతం చేయడం’ ఉన్నాయి. మొదటి రెండు ఎంఓయూ లను ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరించడం జరుగుతుంది. వీటికి ఇప్పుడు గడువు ముగిసిపోయింది.
అంతర్జాతీయ జలమార్గాల నౌకాయానేతర ఉపయోగాల చట్టం– 1997 నాటి ఐక్యరాజ్యసమితి సమావేశం తీర్మానాలపై చైనా కానీ, భారత్ కానీ సంతకం చేయలేదు. అయితే, ఈ సమావేశం చేపట్టిన రెండు కీలక సూత్రాలు... భాగస్వామ్య జలాల ‘సమాన మైన, సహేతుకమైన వినియోగం’, దిగువ రాష్ట్రాలకు ‘హాని కలిగించకూడ దనే బాధ్యత’ అనేవాటికి పూర్తి ఔచిత్యం ఉంది.
భారత్ బాధ్యతా యుతమైన ఎగువ నదీ తీర దేశంగా ఉంది. పాక్‌తో ద్వైపాక్షిక సంబంధాలు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కు ఉదారమైన ప్రయోజనాలను కూడా భారత్ అందిస్తోంది. దురదృష్టవశాత్తూ, చైనా గురించి అలా చెప్పలేం.
జనవరి 3న భారత విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ : ‘‘నదీ జలాలపై స్థిరమైన వినియోగదారు హక్కులు భారత్‌కు ఉన్నాయి. దిగువ నదీ తీర దేశంగా, నిపుణుల స్థాయి, దౌత్య మార్గాల ద్వారా, చైనా భూభాగంలోని నదులపై నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టులపై మా అభిప్రాయాలను, ఆందోళనలను వ్యక్తం చేశాం. తాజా నివేదిక తర్వాత దిగువ ప్రాంతాల దేశాలతో సంప్రదింపుల అవసరంతో పాటు వీటిని కూడా మళ్లీ పునరుద్ఘాటించాం’’ అన్నారు.
భారతదేశం ఇప్పటివరకు నిశ్శబ్ద దౌత్యాన్ని ఎంచుకుంది. అయితే, టిబెట్‌లో ప్రస్తుతం ఉన్న నదీ ప్రవాహ ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా, భారీ నీటి మళ్లింపు, నిల్వను కలిగి ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్ట్ భారీ పరిమాణం, దానిలోని చిక్కుల దృష్ట్యా, మనం ఇప్పుడు కొత్త ఆందోళనలో ఉన్నాం. ప్రాజెక్టుకు చెందిన సాంకేతిక పరామి తులు, పర్యావరణ ప్రభావ అధ్యయనాలపై మనం వివరణలు కోరాలి.
దిగువ ప్రాంతాలకు, ‘సమానమైన, సహేతుకమైన విని యోగం’, ‘గణనీయమైన హాని కలిగించకూడదనే బాధ్యత’ వంటి సూత్రాలను గౌరవించాలని చైనాను కోరాలి. వాస్తవానికి, ప్రాజెక్ట్‌పై పూర్తి సంప్రదింపులు, పరస్పర అవగాహన వచ్చే వరకు తదుపరి పనులను నిలిపివేయాలని మనం అధికారికంగా అడగాలి.
నిశ్శబ్ద దౌత్యానికి కూడా తనదైన పరిమితులు ఉంటాయి. చైనాతో అధికారిక మార్గాలలో, ప్రజాక్షేత్రంలో కూడా మన ఆందో ళనలను బలంగా చెప్పాలి. పర్యావరణ నిబంధనలు, స్థానిక జనాభా ప్రయోజనాలపై రాజీ పడకుండా, జలవిద్యుత్, ఇతర ప్రాజెక్టులను మరింత అత్యవసరంగా అమలు చేయాలి.
తద్వారా బ్రహ్మపుత్ర జలాలపై భారతదేశ ప్రస్తుత వినియోగదారు హక్కులను పెంచు కోవాలి. నిజానికి, భారీ నీటి నిల్వ ప్రాజెక్టులపై అత్యంత జాగ రూకతతో ముందుకు సాగడంపై గతంలో పంచుకున్న ఆలోచనలకు ఈ మెగా ప్రాజెక్ట్ విరుద్ధంగా ఉంది.
అశోక్ కె కంథా
వ్యాసకర్త చైనాలో భారత మాజీ రాయబారి
Comments
Please login to add a commentAdd a comment