భూకంపం ధాటికి మౌలా ఇబ్రహీం గ్రామంలో దెబ్బతిన్న మసీదు మినార్; సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది; భూకంపం భయాలతో ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న స్థానికులు
మర్రకేశ్: మొరాకోను భారీ భూకంపం వణికించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వీధుల్లోకి పరుగులు తీశారు. అట్లాస్ పర్వతాల్లోని గ్రామాలు మొదలుకొని చార్రితక మర్రకేశ్ నగరం వరకు వందలాదిగా భవనాలు ధ్వంసం కాగా 1,000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. సుమారు 45 లక్షల మంది నివసించే మర్రకేశ్–సఫి ప్రాంతంలోనే భూకంప నష్టం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. సుదూర ప్రాంతాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మర్రకేశ్‌లోని 12వ శతాబ్దం నాటి చారిత్రక కౌటౌబియా మసీదు భూకంప ధాటికి దెబ్బతింది. ఈ మసీదులోని 226 అడుగుల ఎత్తైన మినారెట్ ‘రూఫ్ ఆఫ్ మర్రకేశ్’గా ప్రసిద్ధి. అదేవిధంగా, నగరం చుట్టూతా ఉన్న ఎర్రటి గోడ అక్కడక్కడా దెబ్బతిన్న దృశ్యాలు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గోడను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. భూకంప కేంద్రానికి చుట్టుపక్కలున్న మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మరో 672 మంది గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొరాకో ప్రభుత్వం తెలిపింది.
భూకంప కేంద్రం సమీపంలోని ఓ పట్టణంలో చాలా వరకు ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికుడొకరు వెల్లడించారు. అట్లాస్ పర్వతప్రాంతంలోని అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని తలత్ ఎన్ యాకూబ్ పట్టణంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పర్యాటకులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రహదారులు దెబ్బతినడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యవసర బృందాలు భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
ఈ ప్రాంతంలో చాలా అరుదు
ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భూకంపాలు చాలా అరుదు. మొరాకోలోని పర్వత ప్రాంతంలో ఇంతటి అత్యంత తీవ్ర భూకంపం గతంలో ఎన్నడూ సంభవించలేదని నిపుణులు చెబుతున్నారు. 1960లో 5.8 తీవ్రతతో మొరాకోలోని అగడిర్ నగరంలో సంభవించిన భూకంపంలో వేలాదిగా జనం చనిపోయారు. 2004లో తీరప్రాంత నగరం అల్ హొసైమాలో భూకంపంతో 600 మంది చనిపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నగరాలు, పట్టణాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా భవనాల నిర్మాణం జరిగింది. అయితే, పల్లెల్లో మాత్రం ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాజా భూకంపం ప్రభావం పోర్చుగల్, అల్జీరియా వరకు ఉంది.
ప్రమాదకర భూకంపం
భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది.
ప్రపంచదేశాల ఆపన్న హస్తం
సాయం కోసం మొరాకో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి విజ్ఞాపన చేయనప్పటికీ..ఈ ఘోర ప్రకృతి విపత్తుపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్‌తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి.
సాధ్యమైనంత సాయం అందజేస్తాం: మోదీ
మొరాకోలో భూకంపంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు భారత్ సాధ్యమైనంత మేర ఆదుకుంటుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం మొదలైన జీ20 భేటీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం మొరాకోకు మద్దతుగా నిలవాలనీ, సాధ్యమైనంత మేర సాయం అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment