వలసపక్షుల రాకపోకలు, జీవ వైవిధ్యంపై దృష్టి
700 మంది పక్షి ప్రేమికుల భాగస్వామ్యం
ఏడాది పొడవునా సీజన్ల వారీగా సాగనున్న మ్యాపింగ్
రూపుదిద్దుకోనున్న వినూత్న తరహా ‘బర్డ్ అట్లాస్’
బైనాక్యులర్స్, కెమెరాలతో బర్డ్ లవర్స్ సిద్ధమవుతున్నారు. ఆకాశానికి ఎక్కుపెట్టిన చూపులతో విహంగాలను తీక్షణంగా వీక్షించనున్నారు. అరుదైన అందాలను కెమెరాలతో బంధించనున్నారు. బర్డ్ అట్లాస్ పేరిట సమగ్ర విహంగ విశేషవాహిని రూపకల్పనలో మేము సైతం అంటూ పాలు పంచుకోనున్నారు నగరంలోని పలువురు పక్షి ప్రేమికులు.
నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోయిన పరిస్థితుల్లో జీవవైవిధ్యం కనుమరుగవుతోంది. అదే క్రమంలో ఎన్నెన్నో అరుదైన పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రేమికుల ఆలోచనల్లో నుంచే బర్డ్ అట్లాస్ ఊపిరిపోసుకుంది. నగరాల్లో పక్షుల సంచారాన్ని గుర్తించడం, సమగ్ర వివరాలతో డేటాను మ్యాప్ రూపంలో తయారు చేయడం తద్వారా వాటి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడం వంటి లక్ష్యాలతో రూపొందేదే బర్డ్ అట్లాస్. మొదట ఈ తరహా రాష్ట్ర వ్యాప్త బర్డ్ అట్లాస్‌ను రూపొందించిన ఘనత కేరళ సొంతం చేసుకోగా.. నగరాలకు సంబంధించి కొయంబత్తూర్, మైసూర్ మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేశాయి. వాటి తర్వాత హైదరాబాద్ కూడా సిద్ధమై వాటి సరసన నిలిచేందుకుప్రయత్నిస్తోంది..
700 మంది వాలంటీర్లు..
నగర జీవవైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం, పరిరక్షించడంలో భాగంగా పక్షుల విశేషాలను ఒడిసిపట్టుకునేందుకు బర్డ్ అట్లాస్ రూపకల్పనలో నగరానికి చెందిన వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, హైదరాబాద్ బర్డ్ పాల్స్, డెక్కన్ బర్డర్స్ సంస్థలు చేతులు కలిపాయి. నగరం, చుట్టుపక్కల లేక్స్, పార్క్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్‌లోని అడవులు, గడ్డి భూములు, చిత్తడి నేలలతో పాటు 180 సెల్స్ (పక్షుల జాడ కనిపించే ప్రాంతాలను) గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సర్వేలో పాల్గొనే వాలంటీర్ల రిజి్రస్టేషన్ ప్రక్రియ నవంబర్‌లో ప్రారంభం కాగా, గత డిసెంబర్‌లో పూర్తయ్యింది. ఇప్పటికి 700 మంది వాలంటీర్లుగా నమోదయ్యారు. వీరిని 90 లేదా 45 బృందాలుగా విభజించనున్నారు. జనవరి నెల మొత్తం ఈ వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
పక్షులపై పట్టణీకరణ ప్రభావం..
‘బర్డ్ అట్లాస్‌లు శాస్త్రవేత్తలు, పర్యావరణ పరిరక్షకులు, విధాన నిర్ణేతలకు అమూల్యమైన సాధనాలు. అవి పక్షుల జనాభాలో మార్పులను విశ్లేషించడంలో సంతానోత్పత్తి స్థలాలు, వలసలను నిలిపివేసే ప్రదేశాలు తదితర కీలకమైన విషయాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఈ డేటా పక్షి జనాభా క్షీణత లేదా మార్పులు వంటి ముఖ్యమైన పోకడలను వెల్లడిస్తుంది. తద్వారా జీవవైవిధ్యానికి హాని చేయకుండా నగరాభివృద్ధి, విస్తరణ జరిపేందుకు సహకరిస్తాయి అని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్‌కు చెందిన ఫరీదా తంపాల్, హైదరాబాద్ బర్డ్ పాల్స్ ప్రతినిధి, ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శ్రీరామ్‌రెడ్డి, డెక్కన్ బర్డర్స్‌కు చెందిన సు«దీర్‌మూర్తి అంటున్నారు. ‘పక్షి జాతులను పట్టణీకరణ ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై అట్లాస్ అవగాహన అందిస్తుంది. భవిష్యత్తులో మానవ కార్యకలాపాలు, వాటిని ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది’ అని వీరు స్పష్టం చేస్తున్నారు. నగర పర్యావరణ పరిరక్షణకు వీలు కలిగేలా వీరు చేపట్టిన బృహత్తర యత్నం విజయవంతం కావాలని.. ఆకాశహార్మ్యాలతో పాటు ఆకాశంలో విహరించే పక్షులు కూడా పెద్ద సంఖ్యలో మనకి కనువిందు చేయాలని కోరుకుందాం.
మూడేళ్ల పాటు సాగనున్న వేట..
సంవత్సరానికి రెండు సార్లు–శీతాకాలంలో (ఫిబ్రవరి) వేసవిలో (జూలై) ఒకసారి.. ఇలా మూడు సంవత్సరాల పాటు పక్షుల సర్వేలను నిర్వహిస్తారు. తొలిగా వచ్చే ఫిబ్రవరిలో సర్వే ప్రారంభం అవుతుంది. టీమ్స్, వాలంటీర్ల వెసులుబాటును బట్టి ఆ నెల మొత్తం సర్వే కొనసాగుతుంది. అనంతరం మ్యాప్ తయారు చేస్తారు. ఇదే విధంగా మూడేళ్ల పాటు ఈ క్రతువు కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment