
ఐదేళ్లుగా విభిన్న రకాల పక్షుల గుర్తింపు
ఇప్పటి వరకూ 550పైగా జాతుల గుర్తింపుతో రికార్డ్
ఇంటికి గెస్ట్‌గా పొన్నంకి పిట్ట రావడం విశేషం
పక్షుల ప్రపంచంలో విహరిస్తున్న గృహిణి శ్యామల
విద్యార్థులకు ఆమె గణితం నేర్పాలనుకున్నారు. కానీ విధి లిఖితం ఆమెకు కొత్త రెక్కలు తొడిగింది. పక్షుల ప్రేమలో వేలమైళ్లు ప్రయాణించేలా చేసింది. ఐదేళ్లుగా విభిన్న రకాల పక్షులను గుర్తించారు. కాగా ఇప్పటి వరకూ 550కు పైగా జాతులను కెమెరాలో బంధించి రికార్డు సృష్టించారు. ఆమే హైదరాబాద్ (Hyderabad) నగరంలోని అమీన్‌పూర్ (Ameenpur) సమీపంలోని హెచ్‌ఎమ్‌టీ కాలనీలో నివసించే శ్యామల రూపాకుల (Syamala Rupakula).. పక్షి ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఆ ప్రేమ ఆమెకు అనారోగ్యాలను దూరం చేయడం మాత్రమే కాదు.. కొత్త రికార్డులకు దగ్గర చేస్తోంది.
– సాక్షి, సిటీబ్యూరో
‘ఆన్‌లైన్‌లో మ్యాథ్స్ ట్యూటర్‌గా పనిచేసేదాన్ని. కొన్ని ఆరోగ్య సమస్యలు నన్ను బాధించాయి. దీంతో ఆ పని వదిలేయాల్సి వచ్చింది. అనుకోకుండా బర్డ్ వాచర్‌గా మారాను’ అంటూ ఏడేళ్ల నాటి గతం గుర్తు చేసుకున్నారు శ్యామల. దాదాపు రికార్డు స్థాయిలో 550 పక్షులను గుర్తించి నగర బర్డ్ వాచర్స్ (Bird Watchers) ప్రపంచంలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఐటీ ఉద్యోగి అయిన భర్త బాలసుబ్రహ్మణ్యకుమార్ సహకారంతోనే తన హాబీని ఇంతగా ఆస్వాదించగలిగానని చెబుతున్నారు. ఆమె ప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే..
బీజం పడింది అక్కడే..
తొలుత జంతువుల పట్ల ఆసక్తితో వన్యప్రాణుల సంరక్షణా కేంద్రాలకు (వైల్డ్‌లైఫ్ శాంక్చురీ) వెళ్లేదాన్ని. బర్డ్ వాచింగ్ చేసినా మా ఇంటి దగ్గర్లో ఉన్న అమీన్‌పూర్ లేక్ వరకు మాత్రమే పరిమితమయ్యేదాన్ని. అయితే పక్షులపై వీరాభిమానానికి తొలిసారి బీజం పడింది మంజీరా వన్య ప్రాణుల సంరక్షణా కేంద్రానికి వెళ్లినప్పుడు. అక్కడ నాకు పరిచయమైన షివాన్ మాధురి దంపతులు.. నా బర్డ్ వాచింగ్ ఆసక్తిని గమనించి హైదరాబాద్ పాల్స్ గ్రూప్ గురించి చెప్పి నన్ను కూడా జాయిన్ చేశారు.
అక్కడి నుంచి బర్డింగ్ కమ్యూనిటీలో స్నేహితుల మార్గదర్శకత్వంలో సీరియస్ బర్డ్ వాచింగ్ ప్రయాణం ప్రారంభమైంది. తమిళనాడు వెళ్లా. నవంబరు నుంచి ఫిబ్రవరి మధ్యలో నెలకు ఒకటైనా సరే కాస్త దూరంగా ఉండే ప్రాంతాలకు వెళ్తా. కేరళ రెండు సార్లు, ఉత్తరాఖండ్ మూడు సార్లు, కర్ణాటకకు ప్రతి యేటా వెళుతుంటాను. ఇక వారాంతాల్లో నరసాపూర్, క్రిష్ణారెడ్డి లేక్, అనంతగిరి హిల్స్, ఉమామహేశ్వరం.. ఇలా ఎక్కడో ఒక ప్రాంతానికి వెళతాం. మన దేశంలో 1300లకుపైగా జాతులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 550కి పైగా పక్షులను గుర్తించాను. మొత్తం అన్నీ గుర్తించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.

రావోయీ అభిమాన అతిథీ..
మా ఇంట్లోనే ఒక చిన్న తోట పెంచుతున్నాం. పక్షుల రాక కోసమే ఇంట్లో డ్రిప్ సిస్టమ్ ఉంది. నీళ్ల కోసం దాదాపు 12 రకాల పక్షులు వస్తాయి. రోజూ పొద్దున్న, సాయంత్రం వాటిని చూస్తుంటే మనసు నిండిపోతుంది. గత సీజన్‌లో బర్డర్స్ ఫేవరెట్‌గా పేర్కొనే పొన్నంకి పిట్ట (ఇండియన్ పిట్ట) మా ఇంటికి వచ్చి ఏకంగా 4 రోజుల పాటు ఉండడం మరచిపోలేని, మధుర జ్ఞాపకం. ఇవి సాధారణంగా హిమాలయాల నుంచి వస్తాయని చెబుతారు. యేటా అక్టోబరు, నవంబర్ నెల్లో వచ్చి ఎండలు ముదిరినప్పుడు వెళ్లిపోతాయి. అలాంటి పక్షి.. మా ఇంటి పెరట్లో కొన్ని రోజుల పాటు ఉండడం గొప్ప జ్ఞాపకం. ప్రతి పక్షికీ ఓ పేరుంటుంది. ఒక్క జాతిలోనే అరడజను రకాలు ఉంటాయి. వాటి రెక్కల రంగు, పరిమాణం.. వంటి వాటిని బట్టి మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా గుర్తు పెట్టుకోవడం మొదట్లో చాలా కష్టం అనిపించేది. ఇప్పుడు అలవాటైంది.
చదవండి: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్
ఎంతో సంతృప్తినిస్తోంది..
ప్రస్తుతం నగరంలో చాలా మంది బర్డ్ వాచర్స్‌గా మారుతున్నారు. పలువురు నాకు కాల్ చేసి పక్షుల రాకపోకల గురించి సమాచారం అడుగుతుంటే.. వాళ్లకి సమాధానం ఇస్తుండడం నాకెంత సంతృప్తిని అందిస్తుందో.. అభిరుచులను పంచుకోడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? పైగా పక్షులను ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే.. నీటి నుంచి నింగి వరకూ ప్రతి చోటా ప్రత్యక్షమయే పక్షుల ద్వారా.. ప్రకృతిలోని అనువణువూ బర్డ్ వాచింగ్ మనకు పరిచయం చేస్తుంది. మరచిపోలేని జ్ఞాపకాలను అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment