Bird lovers
-
Purnima Devi Barman: ఆ కళ్లకు వెన్నెల తెచ్చింది
పక్షి ప్రేమికులకు సుపరిచితమైన పేరు పూర్ణిమా దేవి బర్మన్. చిన్నప్పుడు తాత తనను పొలానికి తీసుకువెళ్లి ఆకాశంలోని పక్షులను చూపిస్తూ ‘అవి స్వర్గం నుంచి వస్తున్నాయి తెలుసా’ అనేవాడు. పెద్దయ్యాక పూర్ణిమకు అర్థమైంది ఏమిటంటే భూమి మీద వాటి పరిస్థితి నరకప్రాయంగా ఉంది అని. ఈ నేపథ్యంలో పక్షుల సంరక్షణ కోసం ‘హర్గిల ఆర్మీ’ అనే సైన్యం తయారు చేసింది. ‘ఆశావాదం మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్న పూర్ణిమ ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక అవార్డ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్‌కు’ ఎంపికైన వారిలో ఒకరు... అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలో పెరిగింది పూర్ణిమ. అక్కడ పక్షుల సందడి నేత్రపర్వంగా ఉండేది. తాత తనను పొలానికి తీసుకువెళుతూ ఎన్నో పక్షులను చూపిస్తూ వాటి గురించి ఎంతో మురిపెంగా చెప్పేవాడు. అలా తనకు చిన్నప్పటి నుంచి పక్షులను అభిమానించడం మొదలైంది. జంతుశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న పూర్ణిమ గ్రేటర్ ఆజిటెంట్ స్టార్క్ (కొంగల) గురించి పీహెచ్డీ చేసే సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకుంది. అరుదైన జాతికి చెందిన గ్రేటర్ ఆజిటెంట్ జాతి కొంగలు ప్రమాదం అంచున ఉన్నాయనే విషయం తనను భయపెట్టింది. వాటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీన్ని నివారించడానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. పరిశోధనకు విరామం ఇచ్చి గ్రేటర్ ఆజిటెంట్ రక్షణకు నడుం బిగించింది. పట్టణీకరణ, బిల్డింగ్లు, రోడ్లు, మొబైల్ టవర్లు... మొదలైన ఎన్నో కారణాల వల్ల పక్షుల సంఖ్య తగ్గుతూ పోతుంది. దీనికి తోడు అసోంలోని చాలాగ్రామాల్లో పక్షులను దుశ్శకునంగా భావిస్తారు. వ్యాధులను సంక్రమింపజేస్తాయని భయపడుతుంటారు. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకురావాలనుకుంది పూర్ణిమ. ఎన్నో గ్రామాలకు తిరిగి, మహిళలను సమీకరించి పక్షులపై ఉన్న మూఢనమ్మకాలు పోయేలా వాటి విలువ గురించి ఓపిగ్గా చెప్పేది. చిన్నగా మార్పు మొదలైంది. అలా గ్రామీణ మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారుచేసింది. అస్సామీయులు కొంగను ‘హర్గిల’ అని పిలుస్తారు. తమ కార్యాచరణలో భాగంగా ఈ ఆర్మీలోని సభ్యులు ఎల్తైన వెదురు బొంగులపై గూళ్లు నిర్మించారు. మెల్లమెల్లగా ఈ గూళ్లలోనికి కొంగలు రావడం మొదలైంది. గుడ్లు పెట్టేవి. గూళ్లు నిర్మించి పక్షులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, నదులు, చిత్తడి నేలల శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేది ఆర్మీ. తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లపై పక్షిగూడు నిర్మించేవారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. ‘హర్గిల లెర్నింగ్ సెంటర్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పక్షుల విలువ తెలియజేస్తున్నారు. ‘పక్షుల వల్ల జరిగే మేలు ఏమిటో అర్థమయ్యేలా చెప్పారు. అవి ప్రమాదంలో ఉన్నాయనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించింది. నా వంతుగా ఏదైనా చేయాలనిపించి హర్గిల ఆర్మీలో చేరాను’ అంటుంది దాదర గ్రామానికి చెందిన వింధ్య. ‘ఇల్లుదాటి బయటికి రాగానే పక్షిని చూడడం అరిష్టమని నేను కూడా నమ్మేదాన్ని. కానీ అది ఎంత తప్పో తరువాత తెలిసింది’ అంటుంది ‘హర్గిల ఆర్మీ’ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే పచారియా గ్రామానికి చెందిన గంగ. ఒకప్పుడు ‘హర్గిల ఆర్మీ’లో తక్కువ మందు ఉండేవారు. ఇప్పుడు పదివేల మందికి పైగా ఉన్నారు! ‘నేను స్వాభావికంగా ఆశావాదిని. అలాంటి నేను కొన్ని సందర్భాలలో నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని. దీనికి కారణం పట్టణీకరణ వల్ల చెట్లను కొట్టి వేయడం. ఒకచోట ఇల్లు కడుతున్నారంటే చెట్లు కొట్టేసేవారు. వారి దృష్టిలో చెట్లకు విలువ లేదు. అయితే విస్తృత ప్రచారం వల్ల పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. చెట్లను నరికివేయడానికి చాలామంది విముఖంగా ఉన్నారు. ఇవి మా భవిష్యత్ తరానికి మేము ఇచ్చే ఆస్తి... అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పక్షులకు అనువైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుకుంటే వాటికి మేలు చేసినట్లవుతుంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మన్. -
అరుదైన బాతు.. 119 ఏళ్లకు ప్రత్యక్షం
డిస్పూర్: అరుదైన బాతు.. సప్తవర్ణాలతో హరివిల్లు అంతా తన ఒంటిపై పూసుకుని కనిపించే మాండరిన్ బాతు భారతదేశంలో 119 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. అస్సోంలో ఆ అరుదైన బాతు కనిపించడంతో పక్షుల ప్రేమికులు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టిన్సుకియా జిల్లాలోని మాగురి బిల్ సరస్సులో ఈ బాతు ప్రత్యక్షమై సందడి చేస్తోంది. అన్ని రంగులతో అందంగా ఉండే ఈ పొట్టి బాతు పేరు మాండరిన్. దీని శాస్త్రీయ నామం అయెక్స్ గలెరికులాట. నిర్దేశిత కాలాల్లో కొన్ని పక్షులు వలసకు వెళ్తుంటాయి. మనదేశంలో కూడా కొన్ని పక్షులు ఇక్కడకు వస్తుంటాయి.. ఇక్కడి పక్షులు మరో చోటకు వెళ్తుంటాయి. అలా ఈ మాండరిన్ బాతు కూడా శతాబ్దం తర్వాత భారతదేశంలో కనిపించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. డిబ్రూ నదికి ఒడ్డున బిల్ సరస్సు ప్రాంతం అరుదైన పక్షులు.. జంతుజాతులకు నిలయంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో కనిపిస్తున్న ఈ బాతు ప్రస్తుతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. మనదేశంలో 1902లో కనిపించిన ఈ బాతు మళ్లీ ఇన్నేళ్లకు కనిపించిందని పక్షి ప్రేమికుడు బినంద హతిబోరియా తెలిపారు. ఈ బాతు 10 అందమైన పక్షుల్లో ఒకటిగా పేర్కొంటారు. అయితే ఈ బాతు చైనాకు సంబంధించినది తెలుస్తోంది. చైనా సంస్కృతి చిహ్నంలో ఈ పక్షి ఓ భాగం. ఆ దేశంలో చాలా విషయాల్లో ఈ బాతు ప్రస్తావన ఉంటుందంట. రష్యా, కొరియా, జపాన్, చైనా దేశాల్లో ఈ బాతు ఎక్కువగా కనిపిస్తుంటుంది. Morning! The most handsome duck in our local pond has got to be this gorgeous mandarin duck! With his colourful plumage and gorgeous bright red beak he really does stand out from the crowd like a floating jewel! Happy Wednesday!#WednesdayMotivation pic.twitter.com/11TbBba6qz — Dr Amir Khan GP 💙 (@DrAmirKhanGP) February 17, 2021 -
ఇలా అయితే పక్షులు బతకడం కష్టం
నల్లగండ్ల చెరువు.. నగర శివారు ప్రాంతం.. చుట్టూ జనావాసాలు తక్కువే. ఉదయం ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులకు చెరువు మధ్యలోని ఓ వెదురుచెట్టుపై ఓ కొంగ వేలాడుతూ కనిపించింది. వెంటనే నెట్లో వెతికి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి ఫోన్ చేసి సమాచారామిచ్చారు. ఆ సంస్థకు చెందిన సంజీవ్ వర్మ, బాలాజీలు వచ్చి థర్మాకోల్ తెప్ప సాయంతో నీటిలో ప్రయాణించారు. పొడవాటి ముళ్లతో ఉన్న ఆ చెట్టుకొమ్మపై అతి కష్టమ్మీద నిలబడి గాయాలను లెక్కచేయకుండా ఐదు గంటలు యత్నించి కొంగను కాపాడారు. జనావాసాలకు దూరంగా ఉన్నప్పటికీ దారం గాలికి కొట్టుకొచ్చి చెట్టుకు చిక్కుకుంది. అది ఆ కొమ్మమీదకు వచ్చే పక్షుల ప్రాణాలను హరిస్తోంది. ఇలా ఇప్పటికే నగరం, శివారు ప్రాంతాల్లో వందల సంఖ్యలో పక్షులు చనిపోగా, పక్షి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరో రెండు మూడు వందల పక్షులను కాపాడారు. సాక్షి, హైదరాబాద్: జనవరి సమీపిస్తోందంటే చాలు వినీలాకాశం మరిన్ని రంగులనద్దుకుంటుంది. రంగురంగుల పతంగులతో కొత్త శోభను సంతరించుకుంటుంది. గాలిపటాలు ఎగరేయటం సరదానే. కానీ, పక్షులకు మాత్రం ప్రాణసంకటంగా మారింది. ఎదుటివారి గాలిపటాన్ని తెంపే ఉద్దేశంతో దానికి కొంతమేర వరకు మాంజా కడుతున్నారు. పతంగి తెగినప్పుడు గాలివాటానికి కొట్టుకుపోయి ఏ చెట్టు కొమ్మకో, సెల్టవర్కో చిక్కుకుంటోంది. ఆ విషయం గుర్తించని పక్షులు దానికి చేరువగా ఎగిరినప్పుడు వాటి రెక్కలకు దారం చుట్టుకుపోతోంది. విడిపించుకునే తొందరలో అటు, ఇటు ఎగిరేసరికి రెక్కలు తెగిపోయో, శరీరం కోసుకుపోయో పక్షులు చనిపోతున్నాయి. కొన్ని దారాలకే వేలాడుతూ తిండిలేక మరణిస్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో పక్షులు చనిపోతుండటంతో ప్రభుత్వం మాంజాను నిషేధించింది. కానీ, దాన్ని పట్టించుకోకుండా చాలామంది మాంజాను వాడుతూ పక్షుల మృతికి కారణమవుతున్నారు. ఏ చెట్టుకు చూసినా... ప్రస్తుతం నగరంలో ఏ చెట్టుకు చూసినా మాంజా దారపు పోగులు వేలాడుతున్నాయి. నిత్యం వాటికి పక్షులు చిక్కి విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాంజా ఫ్రీ నగరం చేసేందుకు యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ కార్యాచరణ చేపడుతోంది. జీహెచ్ఎంసీ, అగ్నిమాపక విభాగం, డిజాస్టర్ రెస్పాన్స్ టీంల చేయూతతో పక్షి ప్రేమికులను ఏకం చేస్తోంది. ఇందుకోసం సామాజిక వేదికల ద్వారా ప్రచారం ప్రారంభించింది. వారి వారి ఇళ్ల వద్ద ఉన్న చెట్లకు వేలాడుతున్న దారాలను తొలగించాలని కోరుతోంది. చెట్టు ఎక్కలేని పరిస్థితి ఉన్నా, సెల్‌టవర్లకు దారాలున్నా తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ సమాచారం ఇచ్చేందుకు కూడా సామాజిక మాధ్యమం ద్వారా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉంది. దారం వేలాడుతున్న ప్రాంతాల వివరాలు, ఫొటోలు అందులో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. త్వరలో ఇది ప్రారంభం కానుంది. డిజాస్టర్ రెస్పాన్స్ టీం, అగ్నిమాపక విభాగం సహకారం చాలా ప్రాంతాల్లో ఎత్తుగా ఉన్న చెట్లపైన పక్షులు దారాలకు చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. చిటారు కొమ్మల వరకు చేరుకోవటం కష్టంగా ఉండటంతో డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్, అగ్నిమాపక విభాగం బృందాలు నిచ్చెనల సాయంతో రక్షిస్తున్నారు. ఈ విషయంలో ఆ రెండు విభాగాలు చాలా సహకరిస్తున్నాయని యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీకి చెందిన అమర్నాథ్ పేర్కొన్నారు. -
గుండె గూటిలో నిండు ప్రేమ!
వేకువజామునే పిట్టలకిలకిలారావాలు. కోకిలమ్మల కుహుకుహూ గానాలు. ఊర పిచ్చుకల కిచకిచలు ఆ ఇంట్లో సరికొత్త సంగీతాన్ని సృష్టిస్తాయి. అతిథి గృహాల్లాంటి గూళ్లలో ఒదిగిపోతాయి.ఆ ఇంటి ఆతిథ్యాన్ని ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాయి. వివిధ రకాల పక్షులు కాలానుగుణంగా ఆ ఇంటికి వచ్చి వెళ్తాయి. హస్మత్‌పేట్ అబ్రార్‌నగర్‌లో నివాసం ఉండే వెంకటేశ్వరరావు, హైమవతి దంపతులు తమ ఇంటి ఆవరణలో పక్షుల కోసం 22 గూళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో గింజలు, నీరు నిరంతరం అందుబాటులో ఉంచుతారు. ఏ పక్షి ఎప్పుడైనా రావచ్చు. కావాల్సినన్ని గింజలుతిని వెళ్లవచ్చు. ఇలా రకరకాల పక్షుల రాకతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. 20 ఏళ్లుగా పక్షుల సంరక్షణే లక్ష్యంగా ఆ దంపతులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తమ ఇంటిని బుల్లి పిట్టలకు నిలయంగా మార్చారు. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం. ’మాది వరంగల్. మావారు వెంకటేశ్వరరావు విశ్రాంత ఉద్యోగి. మా చిన్న కూతురు షర్మిలతో కలిసి ఇక్కడ ఉంటున్నాం. అప్పట్లో ఆకాశంలోకి చూస్తే రకరకాల పక్షుల గుంపులు కనిపించేవి. కొన్ని ఒంటరిగా వెళ్లేవి. ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు. చెట్ల కొమ్మలపై వాలి సందడి చేసేవి. ఇప్పుడు ఆ పక్షుల గుంపులు అరుదైన దృశ్యాలే. ఆవులు, కోళ్లు, మేకలు, కాకులు, పిచ్చుకలు, కోయిలలతో కూడిన సహజమైన వాతావరణంలో పుట్టి పెరిగిన మేము ముప్పై ఏళ్ల క్రితమే నగరానికి వచ్చి స్థిరపడ్డాం. హైదరాబాద్ విస్తరిస్తున్న కొద్దీ పక్షుల జాడ కనిపించకుండా పోతోంది. వాటిని కాపాడుకొనేందుకు ఒక సహజమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనిపించింది. 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన మా ప్రయత్నానికి క్రమంగా ఆదరణ లభించింద’ని చెబుతున్నారు హైమవతి. ఇక్కడికి ఎక్కువగా పిచ్చుకలు వస్తుంటాయి. చిన్ని కొంగలు, తోకపిట్టలు, ఏడాదికి ఒకసారి వచ్చి వెళ్లే వడ్రంగి పిట్టలు, మైనాలు, బుల్లిపిట్టలు, కాకులు, గువ్వలు ఈ ఇంట్లో సందడి చేస్తాయి. వేసవి తాపం నుంచి రక్షణ.. నిప్పులు చెరుగుతున్న ఎండల తాకిడికి పక్షులు విలవిల్లాడుతున్నాయి. గుక్కెడు నీళ్ల కోసం తపిస్తున్నాయి. కొద్దిగా నీడ కోసం పరుగులు పెడుతున్నాయి. ఆహారం, నీళ్లు లభించక ఎన్నో పక్షులు విగతజీవులవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటి చుట్టూ 22 గూళ్లను, నీటి తొట్టీలను ఏర్పాటు చేసి పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు హైమవతి. పక్షుల కోసం కిలోల కొద్దీ నూకలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలు సిద్ధంగా ఉంచుతారు. ప్రతి నిత్యం వచ్చి వెళ్లే పక్షులతో ఆ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇంటి ఆవరణలోని గూటి వద్ద పిచ్చుక అమ్మ స్ఫూర్తితో.. తల్లి హైమవతి స్ఫూర్తితో ఆమె కూతురు డాక్టర్ శశికళ సైతం కొంపల్లిలోని తమ ఇంటి ఆవరణలో ప్రత్యేకంగా పక్షుల కోసం బాక్సులను ఏర్పాటు చేశారు. ‘వడ్రంగి పిట్టలు, మేఘదూత్ వంటి పక్షులు చాలా తరచూ వస్తుంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పక్షులు ఆకస్మాత్తుగా గూళ్లలోకి వచ్చినప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి’ అని ఆనందం వ్యక్తం చేశారామె. పక్షులు, పర్యావరణాన్ని సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని, అప్పుడే జీవవైవిధ్యాన్ని కాపాడుకోగలమని చెప్పారు. -
ముంబైలో ప్రేమికుల దినోత్సవానికి ఆటవిడుపు
ఈసారి ముంబైలో ప్రేమికుల దినోత్సవానికి ఆటవిడుపు కలిగేటట్టు ఉంది. అంటే శివసేనకి కొంచెం నిరాశే మరి. ఎందుకంటే ఇండియా బర్డ్ రేస్ కార్యక్రమంలో భాగంగా ఇవాళే ముంబైలో బర్డ్ రేస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బర్డ్ రేస్ అంటే పక్షులు గుర్రాల్లా పోటీ పడవు. పందెం కోళ్లలాగా పోట్లాడుకోవు. పక్షి ప్రేమికులే ముంబైకి అరవై కిలోమీటర్ల పరిధిలో అనేక జాతుల పక్షులను గుర్తించ డంలో పోటీ పడతారు. ముంబై 12వ బర్డ్ రేస్‌లో 14 నగరాల నుంచి పర్యావరణ, పక్షి ప్రేమికులు పాల్గొంటున్నారు. వీరంతా బృందాలుగా విడిపోయి అన్వేషణ ఆరంభిస్తారు. ఈసారి 350 రకాల పక్షులను అక్కడ వదులుతున్నారు. 11వ ముంబై బర్డ్ రేస్‌లో వీటి సంఖ్య 150 మాత్రమే. అయితే అప్పుడు ఓ అపురూప ఘటన జరిగింది. విజయాబాలన్ అనే 72 ఏళ్ల మహిళ తన కుమార్తె సాయంతో 70 వరకు పక్షి జాతులను గుర్తించి అగ్రస్థానంలో నిలిచింది. ఇంతకీ ఆమె కేన్సర్ వ్యాధిగ్రస్తురాలు. ఆ పక్షులని ఆమె పామ్ బీచ్‌లోని మామిడితోటల్లోనే కనుగొంది. పర్యావరణ, జీవకారుణ్యం పట్ల మరింత అవగాహన పెంచడానికే దేశంలోని వివిధ నగరాల్లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలతో విచిత్రమైన ఫలితాలు రావడం విశేషం.