పక్షుల కోసం గూడు; ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్: పూర్ణిమా దేవి బర్మన్
పక్షి ప్రేమికులకు సుపరిచితమైన పేరు పూర్ణిమా దేవి బర్మన్. చిన్నప్పుడు తాత తనను పొలానికి తీసుకువెళ్లి ఆకాశంలోని పక్షులను చూపిస్తూ ‘అవి స్వర్గం నుంచి వస్తున్నాయి తెలుసా’ అనేవాడు. పెద్దయ్యాక పూర్ణిమకు అర్థమైంది ఏమిటంటే భూమి మీద వాటి పరిస్థితి నరకప్రాయంగా ఉంది అని. ఈ నేపథ్యంలో పక్షుల సంరక్షణ కోసం ‘హర్గిల ఆర్మీ’ అనే సైన్యం తయారు చేసింది. ‘ఆశావాదం మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్న పూర్ణిమ ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక అవార్డ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్‌కు’ ఎంపికైన వారిలో ఒకరు...
అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలో పెరిగింది పూర్ణిమ. అక్కడ పక్షుల సందడి నేత్రపర్వంగా ఉండేది. తాత తనను పొలానికి తీసుకువెళుతూ ఎన్నో పక్షులను చూపిస్తూ వాటి గురించి ఎంతో మురిపెంగా చెప్పేవాడు. అలా తనకు చిన్నప్పటి నుంచి పక్షులను అభిమానించడం మొదలైంది.
జంతుశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న పూర్ణిమ గ్రేటర్ ఆజిటెంట్ స్టార్క్ (కొంగల) గురించి పీహెచ్‌డీ చేసే సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకుంది. అరుదైన జాతికి చెందిన గ్రేటర్ ఆజిటెంట్ జాతి కొంగలు ప్రమాదం అంచున ఉన్నాయనే విషయం తనను భయపెట్టింది. వాటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీన్ని నివారించడానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. పరిశోధనకు విరామం ఇచ్చి గ్రేటర్ ఆజిటెంట్ రక్షణకు నడుం బిగించింది.
పట్టణీకరణ, బిల్డింగ్‌లు, రోడ్లు, మొబైల్ టవర్లు... మొదలైన ఎన్నో కారణాల వల్ల పక్షుల సంఖ్య తగ్గుతూ పోతుంది. దీనికి తోడు అసోంలోని చాలాగ్రామాల్లో పక్షులను దుశ్శకునంగా భావిస్తారు. వ్యాధులను సంక్రమింపజేస్తాయని భయపడుతుంటారు.
ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకురావాలనుకుంది పూర్ణిమ. ఎన్నో గ్రామాలకు తిరిగి, మహిళలను సమీకరించి పక్షులపై ఉన్న మూఢనమ్మకాలు పోయేలా వాటి విలువ గురించి ఓపిగ్గా చెప్పేది. చిన్నగా మార్పు మొదలైంది. అలా గ్రామీణ మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారుచేసింది. అస్సామీయులు కొంగను ‘హర్గిల’ అని పిలుస్తారు. తమ కార్యాచరణలో భాగంగా ఈ ఆర్మీలోని సభ్యులు ఎల్తైన వెదురు బొంగులపై గూళ్లు నిర్మించారు. మెల్లమెల్లగా ఈ గూళ్లలోనికి కొంగలు రావడం మొదలైంది. గుడ్లు పెట్టేవి.
గూళ్లు నిర్మించి పక్షులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, నదులు, చిత్తడి నేలల శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేది ఆర్మీ.
తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లపై పక్షిగూడు నిర్మించేవారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. ‘హర్గిల లెర్నింగ్ సెంటర్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పక్షుల విలువ తెలియజేస్తున్నారు.
‘పక్షుల వల్ల జరిగే మేలు ఏమిటో అర్థమయ్యేలా చెప్పారు. అవి ప్రమాదంలో ఉన్నాయనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించింది. నా వంతుగా ఏదైనా చేయాలనిపించి హర్గిల ఆర్మీలో చేరాను’ అంటుంది దాదర గ్రామానికి చెందిన వింధ్య.
‘ఇల్లుదాటి బయటికి రాగానే పక్షిని చూడడం అరిష్టమని నేను కూడా నమ్మేదాన్ని. కానీ అది ఎంత తప్పో తరువాత తెలిసింది’ అంటుంది ‘హర్గిల ఆర్మీ’ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే పచారియా గ్రామానికి చెందిన గంగ.
ఒకప్పుడు ‘హర్గిల ఆర్మీ’లో తక్కువ మందు ఉండేవారు. ఇప్పుడు పదివేల మందికి పైగా ఉన్నారు!
‘నేను స్వాభావికంగా ఆశావాదిని. అలాంటి నేను కొన్ని సందర్భాలలో నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని. దీనికి కారణం పట్టణీకరణ వల్ల చెట్లను కొట్టి వేయడం. ఒకచోట ఇల్లు కడుతున్నారంటే చెట్లు కొట్టేసేవారు. వారి దృష్టిలో చెట్లకు విలువ లేదు. అయితే విస్తృత ప్రచారం వల్ల పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. చెట్లను నరికివేయడానికి చాలామంది విముఖంగా ఉన్నారు. ఇవి మా భవిష్యత్ తరానికి మేము ఇచ్చే ఆస్తి... అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పక్షులకు అనువైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుకుంటే వాటికి మేలు చేసినట్లవుతుంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మన్.
Comments
Please login to add a commentAdd a comment