Purnima Barman
-
గూడు కట్టుకున్న పక్షి ప్రేమ
‘హర్గిలా కొంగలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని మనమే రక్షించుకోవాలి’ అని ఊరూరు తిరుగుతూ ప్రచారం చేసేది పూర్ణిమాదేవి. ‘అలాగే’ అన్నవారి కంటే ‘మాకేమీ పనిలేదనుకుంటున్నావా’ అని ముఖం మీద చెప్పిన వాళ్లే ఎక్కువ. తాను భుజానికెత్తుకున్న పని ఎంత ముఖ్యమైనదో కాలక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించడంలో పూర్ణిమాదేవి విజయవంతం అయింది. తాజా విషయానికి వస్తే,,, అస్సాంకు చెందిన జీవశాస్త్రవేత్త, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషనిస్ట్ పూర్ణిమాదేవి బర్మాన్ ‘టైమ్’ మ్యాగజైన్ ‘విమెన్ ఆఫ్ ది ఇయర్’ జాబితాలో చోటు సాధించింది. ఈ జాబితా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 13 మంది మహిళలలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక మహిళ పూర్ణిమాదేవి బర్మాన్...బ్రహ్మపుత్ర నదికి దగ్గర్లోని అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పెరిగింది పూర్ణిమ. ‘ఈరోజు నీ స్నేహితులను చూపిస్తాను వస్తావా?’ అని నవ్వుతూ అడిగింది అమ్మమ్మ.‘పద వెళదాం’ అంటూ రెడీ అయిపోయింది పూర్ణిమ. అది తన జీవితాన్ని మార్చిన రోజు. పక్షుల ప్రపంచాన్ని పరిచయం చేసిన రోజు. ఆరోజు మొదలు ప్రతిరోజూ అమ్మమ్మతోపాటు పంట పొలాల్లోకి వెళ్లి పక్షులతో మాట్లాడడం నుంచి వాటి మధుర గానాన్ని వినడం వరకు ఎన్నో చేసేది.జువాలజీలో మాస్టర్స్ చేసిన పూర్ణిమ గ్రేటర్ అడ్జటంట్ జాతికి చెందిన హర్గిలా కొంగలపై పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు అవి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయనే చేదునిజం తెలిసొచ్చింది. ఆ సమయంలో తనకు అకాడమిక్ ఆలోచనల కంటే ఉద్యమ స్థాయిలో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది.‘పక్షులను రక్షించడం కోసం ఇప్పుడు ఒక సైన్యం కావాలి’ అనుకుంది. ఎవరి ప్రపంచం వారిది అయిపోయిన ఈ ప్రపంచంలో తన కలల సైన్యంలోకి ఎవరు మాత్రం వస్తారు? అయితే.. మనం ఒక మంచిపనికి నడుం బిగిస్తే అది విజయవంతం అయ్యేలా ప్రకృతి ఆశీర్వదిస్తుందట. అది నిజమేనేమో... ఒక్కరొక్కరుగా ఎంతోమంది మహిళలు ‘హర్గిలా’ సైన్యంలో చేరడం మొదలైంది. హర్గిలా ఆర్మీలో ఇప్పుడు ఇరవై వేల మంది మహిళా సైనికులు ఉన్నారు.హర్గిలా పక్షిని ‘స్కావెంజర్’ అని పిలుస్తారు. నీటికాలుష్యాన్ని నివారించడం నుంచి పరిసరాల శుభ్రత వరకు అవి ఎన్నో రకాలుగా మానవాళికి మేలు చేస్తాయి. ‘హర్గిలాను రక్షించుకోవడం అంటే ప్రకృతిని రక్షించుకోవడమే’ అనే నినాదంతో హర్గిలా ఆర్మీ ప్రజల్లోకి వెళ్లింది. గాయపడిన కొంగలకు చికిత్స చేయడం, గూడును ఏర్పాటు చేయడం, రకరకాల ఉత్సవాలు నిర్వహించడం... ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలలో మార్పు తీసుకువచ్చింది. మూడు పదులు దాటని కొంగల సంఖ్య ఇప్పుడు నాలుగు వందలు దాటేలా చేసింది.‘కొంగలకు సోదరి’ అంటూ పూర్ణిమాదేవిని ప్రజలు ప్రేమగా పిలుచుకుంటారు. అస్సాం సంప్రదాయ దుస్తులపై హర్గిలా బొమ్మలు వేస్తూ పర్యాటకులకు విక్రయించడం అనేది స్థానిక మహిళలకు జీవనోపాధిగా మారింది. ‘హర్గిలా’ ఆర్మీ అస్సాంకే పరిమితం కాలేదు. దేశంలోని ఎన్నోప్రాంతాలకు విస్తరించింది.కంబోడియా, ఫ్రాన్స్ పాఠశాలల్లో పూర్ణిమ చేసిన విశేష కృషి గురించి పాఠాలుగా చెబుతున్నారు. ‘సమాజంలో మార్పు తీసుకు వచ్చే శక్తి మహిళల్లో ఉంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మాన్. పురుషుల నుంచి అవమానాలు, తిట్లు, వెటకారాలు ఎదురైనప్పుడు ఆమెకు అండగా నిలబడింది మహిళలే. ‘హర్గిలా’ రూపంలో తన అసాధారణ కలను సాకారం చేసింది మహిళలే! ఆరోజు ఎంతగా అవమానించారో!ఆరోజు ఒక గ్రామానికి వెళ్లాను. ఒక వ్యక్తి తొమ్మిది గూళ్లు ఉన్న చెట్టును నరికివేయడం, పక్షి పిల్లలు చనిపోవడం చూశాను. నాకు చాలా బాధగా అనిపించింది. ఆ గ్రామస్థుడితో మాట్లాడే సాహసం చేశాను. అప్పుడు చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అంతమంది మగవాళ్ల మధ్య నేను ఒంటరి అయ్యాను. చెట్టు నరికిన వ్యక్తి తాను చేసింది తప్పు అనుకోలేదు. పైగా నాతో కోపంగా మాట్లాడాడు. నీకు పక్షులపై అంత ప్రేమ ఉంటే మా ఇంట్లో పనిమనిషిగా చేరు. పక్షుల మలమూత్రాలు శుభ్రం చేయడం లాంటి పనులు చెయ్యి అని అరిచాడు. అక్కడ ఉన్న వాళ్లు కూడా తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు వచ్చింది హర్గిలాను రక్షించడానికి కాదు వాటి మాంసాన్ని తినడానికి అని ఒకరు తిట్టారు. హర్గిలాను రక్షించుకోవాలంటే ప్రయోగశాలలో శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే సరిపోవు అనే విషయం అప్పుడు నాకు అర్థమైంది. ముందు ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావాలి అనిపించింది. ఆ ఆలోచనే హర్గిలా ఆర్మీకి బీజం వేసింది.– పూర్ణిమాదేవి బర్మాన్ -
Purnima Devi Barman: ఆ కళ్లకు వెన్నెల తెచ్చింది
పక్షి ప్రేమికులకు సుపరిచితమైన పేరు పూర్ణిమా దేవి బర్మన్. చిన్నప్పుడు తాత తనను పొలానికి తీసుకువెళ్లి ఆకాశంలోని పక్షులను చూపిస్తూ ‘అవి స్వర్గం నుంచి వస్తున్నాయి తెలుసా’ అనేవాడు. పెద్దయ్యాక పూర్ణిమకు అర్థమైంది ఏమిటంటే భూమి మీద వాటి పరిస్థితి నరకప్రాయంగా ఉంది అని. ఈ నేపథ్యంలో పక్షుల సంరక్షణ కోసం ‘హర్గిల ఆర్మీ’ అనే సైన్యం తయారు చేసింది. ‘ఆశావాదం మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది’ అంటున్న పూర్ణిమ ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక అవార్డ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్‌కు’ ఎంపికైన వారిలో ఒకరు... అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గ్రామంలో పెరిగింది పూర్ణిమ. అక్కడ పక్షుల సందడి నేత్రపర్వంగా ఉండేది. తాత తనను పొలానికి తీసుకువెళుతూ ఎన్నో పక్షులను చూపిస్తూ వాటి గురించి ఎంతో మురిపెంగా చెప్పేవాడు. అలా తనకు చిన్నప్పటి నుంచి పక్షులను అభిమానించడం మొదలైంది. జంతుశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న పూర్ణిమ గ్రేటర్ ఆజిటెంట్ స్టార్క్ (కొంగల) గురించి పీహెచ్డీ చేసే సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకుంది. అరుదైన జాతికి చెందిన గ్రేటర్ ఆజిటెంట్ జాతి కొంగలు ప్రమాదం అంచున ఉన్నాయనే విషయం తనను భయపెట్టింది. వాటి సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీన్ని నివారించడానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. పరిశోధనకు విరామం ఇచ్చి గ్రేటర్ ఆజిటెంట్ రక్షణకు నడుం బిగించింది. పట్టణీకరణ, బిల్డింగ్లు, రోడ్లు, మొబైల్ టవర్లు... మొదలైన ఎన్నో కారణాల వల్ల పక్షుల సంఖ్య తగ్గుతూ పోతుంది. దీనికి తోడు అసోంలోని చాలాగ్రామాల్లో పక్షులను దుశ్శకునంగా భావిస్తారు. వ్యాధులను సంక్రమింపజేస్తాయని భయపడుతుంటారు. ముందు వారి ఆలోచన తీరులో మార్పు తీసుకురావాలనుకుంది పూర్ణిమ. ఎన్నో గ్రామాలకు తిరిగి, మహిళలను సమీకరించి పక్షులపై ఉన్న మూఢనమ్మకాలు పోయేలా వాటి విలువ గురించి ఓపిగ్గా చెప్పేది. చిన్నగా మార్పు మొదలైంది. అలా గ్రామీణ మహిళలతో ‘హర్గిల ఆర్మీ’ని తయారుచేసింది. అస్సామీయులు కొంగను ‘హర్గిల’ అని పిలుస్తారు. తమ కార్యాచరణలో భాగంగా ఈ ఆర్మీలోని సభ్యులు ఎల్తైన వెదురు బొంగులపై గూళ్లు నిర్మించారు. మెల్లమెల్లగా ఈ గూళ్లలోనికి కొంగలు రావడం మొదలైంది. గుడ్లు పెట్టేవి. గూళ్లు నిర్మించి పక్షులకు అనువైన వాతావరణం కల్పించడంతో పాటు, నదులు, చిత్తడి నేలల శుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించేది ఆర్మీ. తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెట్లపై పక్షిగూడు నిర్మించేవారికి డబ్బులు కూడా ఇచ్చేవారు. ‘హర్గిల లెర్నింగ్ సెంటర్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పక్షుల విలువ తెలియజేస్తున్నారు. ‘పక్షుల వల్ల జరిగే మేలు ఏమిటో అర్థమయ్యేలా చెప్పారు. అవి ప్రమాదంలో ఉన్నాయనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించింది. నా వంతుగా ఏదైనా చేయాలనిపించి హర్గిల ఆర్మీలో చేరాను’ అంటుంది దాదర గ్రామానికి చెందిన వింధ్య. ‘ఇల్లుదాటి బయటికి రాగానే పక్షిని చూడడం అరిష్టమని నేను కూడా నమ్మేదాన్ని. కానీ అది ఎంత తప్పో తరువాత తెలిసింది’ అంటుంది ‘హర్గిల ఆర్మీ’ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే పచారియా గ్రామానికి చెందిన గంగ. ఒకప్పుడు ‘హర్గిల ఆర్మీ’లో తక్కువ మందు ఉండేవారు. ఇప్పుడు పదివేల మందికి పైగా ఉన్నారు! ‘నేను స్వాభావికంగా ఆశావాదిని. అలాంటి నేను కొన్ని సందర్భాలలో నిద్రలేని రాత్రులు గడిపేదాన్ని. దీనికి కారణం పట్టణీకరణ వల్ల చెట్లను కొట్టి వేయడం. ఒకచోట ఇల్లు కడుతున్నారంటే చెట్లు కొట్టేసేవారు. వారి దృష్టిలో చెట్లకు విలువ లేదు. అయితే విస్తృత ప్రచారం వల్ల పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. చెట్లను నరికివేయడానికి చాలామంది విముఖంగా ఉన్నారు. ఇవి మా భవిష్యత్ తరానికి మేము ఇచ్చే ఆస్తి... అంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పక్షులకు అనువైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుకుంటే వాటికి మేలు చేసినట్లవుతుంది’ అంటుంది పూర్ణిమాదేవి బర్మన్. -
World Earth Day 2022: వరల్డ్ ఎర్త్ డే.. పక్షులకు సేనాపతి
పక్షుల కోసం ఒక సైన్యం ఉంటుందా? అదీ మహిళా సైన్యం. ఉంటుంది. అస్సాంలో ఉంది. అక్కడి అరుదైన కొంగలు అంతరించిపోతున్నాయని గ్రామాల్లో మహిళలతో సైన్యాన్ని తయారు చేసింది వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమ బర్మన్. ఈ సైన్యం కొంగలను రక్షిస్తుంది. ఈ నేల, ఆకాశం, జీవజాలం ఎంత విలువైనవో చైతన్యపరుస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ ఎర్త్ డే సందర్భంగా ‘వన్ ఫర్ చేంజ్’ పేరుతో మన దేశంలో పర్యావరణ మార్పుకోసం విశేషంగా కృషి చేసిన పది మందిపై షార్ట్ ఫిల్మ్స్ ప్రసారం చేయనుంది. వారిలో ఒకరు పూర్ణిమ బర్మన్. ఆమె పరిచయం. ఈ భూమిని అందరూ ఉపయోగించుకుంటారు. కొందరే భూమి కోసం తిరిగి పని చేస్తారు. మనల్ని కాపాడే భూమిని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసే వాళ్ల వల్లే మనం ఈ మాత్రం గాలిని పీల్చి, ఈ మాత్రం రుతువులను అనుభవిస్తున్నాం. అడవులని చూస్తున్నాం. కలుషితం కాని నదుల ప్రవాహంలో పాదాలు ముంచగలుగుతున్నాం. పిట్టలు, పొదలు మనవే అనుకుంటున్నాం. వీటి కాపలాకు ఉన్నది ఎవరు? పూర్ణిమ బర్మన్ ఒకరు. స్టూడెంట్ నుంచి యాక్టివిస్టుగా పూర్ణిమ దేవి బర్మన్‌ది గౌహటి. వైల్డ్‌లైఫ్ బయాలజీని ముఖ్యాంశంగా తీసుకుని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది. 2007లో గ్రేటర్ అడ్జటంట్ స్టార్క్స్(పారిశుద్ధ్య కొంగలు) మీద పిహెచ్డి చేయడానికి కామరూప జిల్లాలోని దాదర గ్రామానికి వెళ్లింది. ఒకప్పుడు ఆగ్నేయాసియా లో ఉండే ఆ కొంగలు అంతరించిపోయే స్థితికి వచ్చి కేవలం అస్సాం, బిహార్లలో కనిపిస్తున్నాయి. ఇవి పారిశుద్ధ్య కొంగలు. అంటే మృతకళేబరాలను తిని శుభ్రం చేస్తాయి. పర్యావరణ వృత్తంలో వీటి పాత్ర కీలకం. ఐదడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉండవు. చెట్ల పైన గూళ్లు పెడతాయి. తేమ అడవులు వీటికి ఇష్టమైనా ఆ అడవుల స్థానంలో ఊళ్లు వెలుస్తూ రావడం వల్ల ఇవి గ్రామాల్లోనే చెట్ల మీద గూళ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతాయి. అయితే పూర్ణిమ వచ్చేంత వరకూ పరిస్థితి వేరుగా ఉండేది. వీటిని గ్రామస్తులు బతకనిచ్చేవారు కాదు. ఇవి గూళ్లు పెట్టిన చెట్లను నరికేసేవారు. దాంతో అవి దిక్కులేనివి అయ్యేవి. అప్పుడే పూర్ణిమ ఆ గ్రామానికి వెళ్లింది. పీహెచ్‌డి ఏం చేసుకోవాలి? పూర్ణిమ వెళ్లేసరికి ఒక గ్రామంలో ఈ పారిశుద్ధ్య కొంగల గూళ్లు ఉన్న చెట్లను కూల్చేస్తున్నారు. అక్కడ ఆ కొంగలను ‘హార్గిల్లా’ అంటారు. ‘ఎందుకు కూలగొడుతున్నారు?’ అని పూర్ణిమ పోట్లాటకు వెళ్లింది. అప్పుడు వాళ్లు చెప్పిన జవాబు ఏమిటంటే– పెంట దిబ్బల మీద మృతకళేబరాలను తాను తిని పిల్లల కోసం కొంత ముక్కున పట్టి తెస్తుంది తల్లి. అలా తెచ్చేప్పుడు ఇళ్ల ముంగిళ్లలో డాబాల మీద కొంత జారి పడుతుంటుంది. అది నీçచుకంపు. పైగా దీని ఆకారం బాగుండదు కనుక దుశ్శకునంగా భావించేవారు. అందుకని వాటిని రాళ్లతో కొట్టి తరిమేస్తారు. ‘అదంతా విన్న తర్వాత జనాన్ని ముందు మార్చాలి... అదే అసలైన పిహెచ్డి అనుకున్నాను’ అంటుంది పూర్ణిమ. ఇక పిహెచ్‌డిని పక్కన పెట్టి హార్గిల్లాల సంరక్షణకు సంకల్పించుకుంది. విప్పారిన రెక్కలు 2007లో మొత్తం వెతగ్గా 27 హాగ్రిల్లా గూళ్లు కనిపించాయి పూర్ణిమకు. ఇవాళ 200 గూళ్లుగా అవి కళకళలాడుతున్నాయి. ఒక పక్షిజాతికి ఆ విధంగా పూర్ణిమ జీవం పోసింది. అందుకే ఆమెకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు లభిస్తూనే ఉన్నాయి. చైతన్యం కలిగించి సరిగ్గా పని చేయాలేగాని ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రజలు ముందుకొస్తారని ఈ ఉదంతం చెబుతోంది. పక్షులు వాలే చెట్టు ఉంటే భూమి బతికి ఉన్నట్టు అర్థం. భూమిని బతికించుదాం. హార్గిల్లా ఆర్మీ ఊళ్లలో మగవారు పనికిపోతారు. ఇళ్లలో ఉండేది... చెట్ల ౖపైన ఉండే కొంగలను కనిపెట్టుకోవాల్సింది స్త్రీలే అని గ్రహించింది పూర్ణిమ. హార్గిల్లాలు దుశ్శకునం కాదని– బా» ర్ చక్రవర్తి ఆ కొంగలు సంచరించే చోట నాగమణి దొరుకుతుందని నమ్మేవాడని చెప్పింది. ఊరు శుభ్రంగా ఉండాలంటే రోగాలు రాకుండా ఈ కొంగలే చేయగలవని చైతన్యం తెచ్చింది. ‘అరణ్యక్’ పేరుతో గౌహతిలో ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ కింద దాదర, పచర్సా గ్రామాల్లోని 400 మంది స్త్రీలతో హార్గిల్లా ఆర్మీని తయారు చేసింది. తను ఆ ఆర్మీకి సేనానిగా మారింది. వీరి పని ఈ కొంగలను సంరక్షించడమే. అయితే వీరు బతికేది ఎలా? అందుకని మగ్గం పనిలో ఉపాధి కల్పించింది. ఆ మగ్గం వస్త్రాల మీద కూడా హాగ్రిల్లా కొంగల బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ చీరలు బాగా అమ్ముడుపోతున్నాయి. -
మనోళ్లకు గ్రీన్ ఆస్కార్ అవార్డులు
లండన్: భారతదేశంలో జంతువులు, పక్షుల పరిరక్షణకు విశేష కృషికి గాను సంజయ్ గుబ్బి, పూర్ణిమ బర్మన్కు ప్రతిష్టాత్మక విట్లే అవార్డులు(గ్రీన్ ఆస్కార్స్) దక్కాయి. 2012 నుంచి కర్ణాటక ప్రభుత్వంతో కలసి పులుల రక్షణకు సంజయ్ పాటుపడుతుండగా, స్థానిక మహిళలతో కలసి అస్సాంలోని చిత్తడి నేలల్లో నివసించే బెగ్గురు కొంగను పూర్ణిమ కాపాడుతున్నారు. ఈ అవార్డు కింద విజేతలిద్దరికి రూ.29 లక్షలు దక్కనున్నాయి. ఈ అవార్డు గెలుచుకోవటం ప్రతి జంతు పరిరక్షకుల కలని, గెల్చుకున్న ప్రైజ్‌మనీతో తమ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని పూర్ణిమ అన్నారు. అలాగే సంజయ్ మాట్లాడుతూ రెండు పులుల కారిడార్లలో చెట్లను పెంచేందుకు గాను, స్థానిక మహిళలకు గ్యాస్ స్టవ్‌లు ఇచ్చేందుకు ప్రైజ్‌మనీని వినియోగిస్తామని తెలిపారు. ఈ అవార్డును లండన్‌లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీలో గురువారం బహూకరించనున్నారు. ఈ అవార్డును 1994 నుంచి విట్లే ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ఇస్తుంది.