గతం ఎక్కడికో పోదు. వర్తమానమై పలకరిస్తుంది. భవిష్యత్ ఆశాకిరణమై మెరుస్తుంది. ఘనంగా చెప్పుకోవడానికి గతంలో ఎన్నో ఉన్నాయి. ‘ఇది మా ఇల్లు మాత్రమే కాదు... పక్షులది కూడా’ అనుకోవడం అందులో ఒకటి. పిచ్చుకలకు ఇంట్లో చోటివ్వడంతోపాటు వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంత సీన్ ఉందా?
పక్షుల ప్రపంచం, మన ప్రపంచం వేరైపోయాయి. ఇప్పుడు పక్షుల నుంచి చుట్టపు చూపు పలకరింపు కూడా లేదు. ఎప్పుడో ఒకసారి పిట్ట కనిపించినా వాటిని పలకరించే ఓపిక మనకు లేదు. ఇలాంటి నేపథ్యంలో విజయలక్ష్మిలాంటి పక్షిప్రేమికులు ఆశాదీపాలను వెలిగిస్తున్నారు. ఆ వెలుగును చూడగలిగితే మరెన్నో దీపాలు వరుస కడతాయి. పక్షులతో చెలిమి చేయడానికి స్వాగత తోరణాలు అవుతాయి.
తమ ఇంటి పిట్టగోడపై వాలిన ఆ పిట్టను చూడగానే నిర్మల్‌కు చెందిన విజయలక్ష్మికి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ‘‘మా ఊళ్లో.. మా ఇంట్లో.. మా నాన్నగారు ఇలాంటి పిచ్చుకల కోసం ఏదో చేసేవారే..! దానికోసం గూడు కట్టడంతో పాటు తినడానికి ఏదో పెట్టేవారే..!’ అని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసింది.
బంధువులకు ఫోన్లు కలిపింది. నానమ్మ తరపువాళ్లు ‘దాన్ని వరికుచ్చు అంటారే..’ అని చెప్పడంతోనే ‘హమ్మయ్యా.. తెలిసింది..’ అని అనుకుని ఊరుకోలేదు.
‘ఇక ఇప్పుడు కుచ్చులు కట్టడమెలా..!?’ అంటూ ఆలోచనల్లో పడింది. యూట్యూబ్‌లో ‘వరికుచ్చుల తయారీ’ గురించి సెర్చ్ చేసింది. ఆ వీడియోలను చూస్తూ ప్రాక్టీస్ చేసి నేర్చేసుకుంది.
నిర్మల్ జిల్లాలో డీఆర్‌డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి)గా పనిచేస్తున్న విజయలక్ష్మి తన సిబ్బందికి కూడా వరి కుచ్చులు తయారు చేయడం ఎలాగో నేర్పించింది. వీరు చేసిన వరికుచ్చులు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సామాన్యుల నుంచి మంత్రుల వరకు ఈ వరికుచ్చులపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇళ్లల్లో వేలాడదీస్తున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో మనుషులు మాత్రమే కాదు... అందమైన పిచ్చుకలు కూడా కనిపిస్తున్నాయి.
ఎన్నో ఎన్నెన్నో!
పచ్చదనమన్నా, పల్లెవాసులతో కలిసిపోవడమన్నా ఇష్టపడే విజయలక్ష్మి డీఆర్‌డీవోగా నిర్మల్ జిల్లాలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది...
→ గ్రామీణ, ఆదివాసీ మహిళలు రుతుక్రమ సమయంలో ఇంటికి దూరంగా ఉండటాన్ని చూసి చలించిన విజయలక్ష్మి వారికి అవగాహన కలిగించేందుకు షార్ట్‌ఫిలిమ్ తీసింది. తక్కువ ధరలోనే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడానికి కుంటాల మండల మహిళ సమాఖ్య ద్వారా రేలా (రూరల్ వుమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆక్టివేషన్) పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్నిప్రారంభించారు
→ నిర్మల్ కొయ్యబొమ్మల కోసం మూడుచోట్ల పొనికిచెట్లను పెంచుతున్నారు
→ మండల మహిళల ద్వారా సమీకృత సాగుప్రారంభించి అందులో వరితో పాటు కూరగాయలు, బీట్‌రూట్, క్యారట్, వట్టివేరు, కర్రపెండలం పండిస్తున్నారు. చేపలు, నాటుకోళ్లు పెంచుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడే ‘ప్యాషన్’ఫ్రూట్‌నూ ఇక్కడ పండిస్తున్నారు
→ ఉపాధిహామీ పథకంలో కూలీలు, పనుల సంఖ్యను పెంచి తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్‌ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలిపారు. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలో, వసూలు చేయడంలోనూ నిర్మల్‌ను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లా సంక్షేమాధికారి ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్నప్పుడు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకుకూరల సాగు చేపట్టారు. ‘మన వంట–అంగన్‌వాడీ ఇంట’ ‘న్యూట్రిబౌల్’లాంటి కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు.
వరికుచ్చుల సరిగమలు
పాతకాలపు లోగిళ్లు మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ చోటిచ్చేవి. చిలుకచెక్కతో ఉండే ఇళ్ల స్లాబుల్లోనే పిచ్చుకల కోసమూ గూళ్లను కట్టించేవారు. వాటిలో కాపురం పెట్టే జంటల కోసం తమ పంటల్లో నుంచి భాగాన్ని పంచేవారు. ధాన్యం ఇంటికొచ్చే వేళ పిచ్చుకల కోసం ప్రత్యేకంగా వరికుచ్చులను తయారు చేసిపెట్టేవారు. అలా చేసిన కుచ్చులను పిచ్చుకల గూళ్లకు దగ్గరగా వేలాడదీసేవారు. పొద్దుపొద్దున్నే వాటిపై వాలే పిచ్చుకలు ఒక్కో వడ్లగింజను నోటితో ఒలుస్తూ ఆరగిస్తూ, కిచకిచమంటూ ఇంటిల్లిపాదిని మేలుకొల్పేవి.
ఆ మంత్రదండం మన దగ్గరే ఉంది!
భవిష్యత్ గురించి మాత్రమే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. గతంలోకి కూడా తొంగిచూస్తే... విలువైన జ్ఞాపకాలే కాదు విలువైన సంప్రదాయాలు కనిపిస్తాయి. వాటికి మళ్లీ ఊపిరి పోస్తే విలువైన గతాన్ని వర్తమానంలోకి ఆవిష్కరించినట్లే. ప్రతిప్రాంతానికి తనదైన విలువైన గతం ఉంటుంది. విలువైన సంప్రదాయాలు, కళలకు ఊపిరిపోస్తే ‘ఇప్పుడా రోజులెక్కడివి!’ అని నిట్టూర్చే పరిస్థితి రాదు. గతాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చే మంత్రదండం మన దగ్గరే ఉంది.
– విజయలక్ష్మి
– రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment