Rice fields
-
పిచ్చుకలకు కుచ్చులు
గతం ఎక్కడికో పోదు. వర్తమానమై పలకరిస్తుంది. భవిష్యత్ ఆశాకిరణమై మెరుస్తుంది. ఘనంగా చెప్పుకోవడానికి గతంలో ఎన్నో ఉన్నాయి. ‘ఇది మా ఇల్లు మాత్రమే కాదు... పక్షులది కూడా’ అనుకోవడం అందులో ఒకటి. పిచ్చుకలకు ఇంట్లో చోటివ్వడంతోపాటు వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంత సీన్ ఉందా?పక్షుల ప్రపంచం, మన ప్రపంచం వేరైపోయాయి. ఇప్పుడు పక్షుల నుంచి చుట్టపు చూపు పలకరింపు కూడా లేదు. ఎప్పుడో ఒకసారి పిట్ట కనిపించినా వాటిని పలకరించే ఓపిక మనకు లేదు. ఇలాంటి నేపథ్యంలో విజయలక్ష్మిలాంటి పక్షిప్రేమికులు ఆశాదీపాలను వెలిగిస్తున్నారు. ఆ వెలుగును చూడగలిగితే మరెన్నో దీపాలు వరుస కడతాయి. పక్షులతో చెలిమి చేయడానికి స్వాగత తోరణాలు అవుతాయి.తమ ఇంటి పిట్టగోడపై వాలిన ఆ పిట్టను చూడగానే నిర్మల్‌కు చెందిన విజయలక్ష్మికి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. ‘‘మా ఊళ్లో.. మా ఇంట్లో.. మా నాన్నగారు ఇలాంటి పిచ్చుకల కోసం ఏదో చేసేవారే..! దానికోసం గూడు కట్టడంతో పాటు తినడానికి ఏదో పెట్టేవారే..!’ అని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసింది. బంధువులకు ఫోన్లు కలిపింది. నానమ్మ తరపువాళ్లు ‘దాన్ని వరికుచ్చు అంటారే..’ అని చెప్పడంతోనే ‘హమ్మయ్యా.. తెలిసింది..’ అని అనుకుని ఊరుకోలేదు.‘ఇక ఇప్పుడు కుచ్చులు కట్టడమెలా..!?’ అంటూ ఆలోచనల్లో పడింది. యూట్యూబ్‌లో ‘వరికుచ్చుల తయారీ’ గురించి సెర్చ్ చేసింది. ఆ వీడియోలను చూస్తూ ప్రాక్టీస్ చేసి నేర్చేసుకుంది. నిర్మల్ జిల్లాలో డీఆర్డీవో (జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి)గా పనిచేస్తున్న విజయలక్ష్మి తన సిబ్బందికి కూడా వరి కుచ్చులు తయారు చేయడం ఎలాగో నేర్పించింది. వీరు చేసిన వరికుచ్చులు ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సామాన్యుల నుంచి మంత్రుల వరకు ఈ వరికుచ్చులపై ఆసక్తి చూపుతున్నారు. తమ ఇళ్లల్లో వేలాడదీస్తున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో మనుషులు మాత్రమే కాదు... అందమైన పిచ్చుకలు కూడా కనిపిస్తున్నాయి.ఎన్నో ఎన్నెన్నో!పచ్చదనమన్నా, పల్లెవాసులతో కలిసిపోవడమన్నా ఇష్టపడే విజయలక్ష్మి డీఆర్డీవోగా నిర్మల్ జిల్లాలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది...→ గ్రామీణ, ఆదివాసీ మహిళలు రుతుక్రమ సమయంలో ఇంటికి దూరంగా ఉండటాన్ని చూసి చలించిన విజయలక్ష్మి వారికి అవగాహన కలిగించేందుకు షార్ట్ఫిలిమ్ తీసింది. తక్కువ ధరలోనే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడానికి కుంటాల మండల మహిళ సమాఖ్య ద్వారా రేలా (రూరల్ వుమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆక్టివేషన్) పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారీ కేంద్రాన్నిప్రారంభించారు → నిర్మల్ కొయ్యబొమ్మల కోసం మూడుచోట్ల పొనికిచెట్లను పెంచుతున్నారు → మండల మహిళల ద్వారా సమీకృత సాగుప్రారంభించి అందులో వరితో పాటు కూరగాయలు, బీట్రూట్, క్యారట్, వట్టివేరు, కర్రపెండలం పండిస్తున్నారు. చేపలు, నాటుకోళ్లు పెంచుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లకు ఉపయోగపడే ‘ప్యాషన్’ఫ్రూట్నూ ఇక్కడ పండిస్తున్నారు→ ఉపాధిహామీ పథకంలో కూలీలు, పనుల సంఖ్యను పెంచి తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్‌ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలిపారు. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడంలో, వసూలు చేయడంలోనూ నిర్మల్‌ను అగ్రస్థానంలో నిలిపారు. జిల్లా సంక్షేమాధికారి ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్నప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ఆకుకూరల సాగు చేపట్టారు. ‘మన వంట–అంగన్వాడీ ఇంట’ ‘న్యూట్రిబౌల్’లాంటి కార్యక్రమాలతో ప్రశంసలు అందుకున్నారు.వరికుచ్చుల సరిగమలుపాతకాలపు లోగిళ్లు మనుషులకే కాదు పశుపక్ష్యాదులకూ చోటిచ్చేవి. చిలుకచెక్కతో ఉండే ఇళ్ల స్లాబుల్లోనే పిచ్చుకల కోసమూ గూళ్లను కట్టించేవారు. వాటిలో కాపురం పెట్టే జంటల కోసం తమ పంటల్లో నుంచి భాగాన్ని పంచేవారు. ధాన్యం ఇంటికొచ్చే వేళ పిచ్చుకల కోసం ప్రత్యేకంగా వరికుచ్చులను తయారు చేసిపెట్టేవారు. అలా చేసిన కుచ్చులను పిచ్చుకల గూళ్లకు దగ్గరగా వేలాడదీసేవారు. పొద్దుపొద్దున్నే వాటిపై వాలే పిచ్చుకలు ఒక్కో వడ్లగింజను నోటితో ఒలుస్తూ ఆరగిస్తూ, కిచకిచమంటూ ఇంటిల్లిపాదిని మేలుకొల్పేవి.ఆ మంత్రదండం మన దగ్గరే ఉంది!భవిష్యత్ గురించి మాత్రమే మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. గతంలోకి కూడా తొంగిచూస్తే... విలువైన జ్ఞాపకాలే కాదు విలువైన సంప్రదాయాలు కనిపిస్తాయి. వాటికి మళ్లీ ఊపిరి పోస్తే విలువైన గతాన్ని వర్తమానంలోకి ఆవిష్కరించినట్లే. ప్రతిప్రాంతానికి తనదైన విలువైన గతం ఉంటుంది. విలువైన సంప్రదాయాలు, కళలకు ఊపిరిపోస్తే ‘ఇప్పుడా రోజులెక్కడివి!’ అని నిట్టూర్చే పరిస్థితి రాదు. గతాన్ని వర్తమానంలోకి తీసుకువచ్చే మంత్రదండం మన దగ్గరే ఉంది.– విజయలక్ష్మి – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
వరికి ఆకుముడత, లద్దెపురుగు
అనకాపల్లి: వరిపై పురుగు, తెగుళ్ల దాడి మొదలైంది. జిల్లాలో ఉన్న అధిక శాతం వరిలో భాగంగా సాంబమసూరి, ఆర్జీల్ 2537 రకాలపై ఆకుముడత, లద్దెపురుగు, గోదుమరంగు మచ్చ తెగులు విజృంభిస్తున్నాయి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. జమున, డాక్టర్ ఎన్. రాజ్‌కుమార్‌లు బుధవారం అనకాపల్లి, మునగపాక మండలాల సరిహద్దుల్లోని వరి పొలాలను పరిశీలించి ఈ తెగుళ్లను గుర్తించారు. ప్రస్తుత వరి పొలాలు ఈనిక దశ నుంచి పాలు దశలో ఉన్నాయి. కాండం తొలుచు పురుగు యొక్క తల్లి రెక్కలు పురుగులు ఎక్కువుగా తిరగడం వల్ల వరికి నష్టం వాటిల్లితున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి గుడ్లు పెట్టి లార్వాలుగా మారిన వెంటనే వరి పంటపై తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ కారణంగానే తెల్ల కంకులు ఏర్పడుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గమనించి వాటి సంతతి వృద్ధి చెందకుండా ముందు జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనిక దశలో ఉన్న వరి పొలాల్లో ఆకుముడత, లద్దెపురుగు, గోదమ రంగు మచ్చ తెగుళ్లు ఆశిస్తున్నందువల్ల ఆకుముడత పురుగు ఆకులను ముడత చేసుకొని లోపల దాగి ఉండి ఆకుల పత్రహరితాన్ని గోకి తింటుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆకులు ఈ కారణంగా చారలు చారలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. లద్దె పురుగు వల్ల ఆకులు కత్తిరించబడడం, ఆకులు తినివేయడం తరువాత గింజగట్టి పడే దశలో వెన్నెలు కొరికి నష్టాన్ని కలుగు జేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు రకాల పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, ఒక మిల్లీలీటరు నువాన్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. లద్దె పురుగులు దుబ్బుల అడుగున దాగి వుండడం వల్ల పొలం నీరు నిలబెట్టి పిచికారీ చేసినట్లయితే దాగి వున్న పురుగులు పైకి వచ్చి చనిపోతాయి. గోదమ మచ్చ తెగులు ఎక్కువుగా ఉన్నచోట లీటరు నీటికి ఒక గ్రాము కార్బన్డిజం కలిపి పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. ఇదిలావుండగా తుపాను నేపధ్యంలో ఎలుకలు వాటి సంతతిని ఎక్కువుగా చేసుకొని పాలు పోసుకున్న కంకులను కొరికివేయడం వల్ల ఎక్కువుగా నష్టం వాటిల్లుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు విషపు ఎరలను పెట్టాలని సూచించారు. 96 పాళ్ల బియ్యపు నూకను, రెండుపాళ్ల నూనె, రెండుపాళ్ల గ్రోమోర్ డయోలిన్ చొప్పున కలిపి విషపు ఎరను తయారు చేసినట్లయితే ఎలుకుల నివారణకు సాధ్యపడుతుందని తెలిపారు. ఇలా తయారైన మిశ్రమాన్ని 20 గ్రాములు చొప్పున చిన్న చిన్న పొట్లాలను కలిపి పొలం గట్ల మీద ఉన్న ఎలక కన్నాలలో వేస్తే వాటి నివారణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మినుము, పెసర సాగులో మెలకువలు యలమంచిలి : సాధారణంగా ఎర్రనేలల్లో మినుము, పెసర రబీ పంటగా చేపట్టవచ్చని, అడపాదడపా కురుస్తున్న వర్షాలు అనుకూలమని వ్యవసాయాధికారులు తెలిపారు. మురుగునీరు నిలవని ఎర్ర, నల్ల రేగడి నేలల్లో ఈ పంట సాగు లాభదాయకంగా ఉంటుందని వివరించారు. రకాలు: మినుము సాగుకు ఎల్.బి.జి. 752, 709 (పంటకాలం 75-85 రోజులు) రకాలను ఎంపిక చేసుకోవచ్చు. పెసర సాగుకు ఎల్.జి.జి 407 ఎం.ఎల్ - 267 (పంటకాలం 60-70 రోజులు) రకాలను విత్తుకోవచ్చు. విత్తే విధానం: ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు విత్తనాలను మూడు రకాలుగా శుద్ధి చేయడం ద్వారా తొలి దశలో పైరుకు చీడపీడల బెడద ఉండదు. కీటకాల నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ కలిపి ఆరబెట్టాలి. అనంతరం తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెట్ కలపాలి. భూమిలోని నత్రజనిని మొక్కలు సులువుగా తీసుకునేందుకు వీలుగా 200 గ్రాముల రైజోబియం కల్చరును చల్లార్చిన బెల్లం పాకంలో కలిపి ఎనిమిది కిలోల విత్తనాలకు పట్టించాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా విత్తుకోవాలి. రాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేలల్లో వెదజల్లే పద్ధతిని విశాఖజిల్లా రైతులు పాటిస్తున్నారు. మినుము, పెసర చేలకు చుట్టూ కంచె పంటగా జొన్న, ఆవాలు, బంతిమొక్కలను పెంచితే కాయతొలిచే పురుగు, పచ్చపురుగు తెల్లదోమ వ్యాప్తి తగ్గుతుంది. ఎరువుల యాజమాన్యం: ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువుతో పాటు ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అందించే ఎరువులను విత్తడానికి ముందుగా భూమిలో వేయాలి. కలుపు నివారణకు పప్పుధాన్యపు పైర్లను విత్తిన 24 గంటల్లోపు 500 మిల్లీలీటర్లు పెండిమిథాలిన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా తడినేలపై పిచికారీ చేస్తే నెలరోజుల పాటు కలుపు బెడద ఉండదు. సస్యరక్షణ: ఆకులను జల్లెడలా మార్చే చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున క్లోరిపైరిఫాస్ కలిపి మొక్కలు తడిచేలా చల్లాలి. పల్లాకు తెగులు సోకితే, ఈ తెగులును వ్యాప్తిచేసే తెల్లదోమ నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున థయోఫానేట్ మిథైల్ కలిపిన ద్రావణాన్ని మొక్కలు తడిచేలా చల్లాలి. చేలో పల్లాకు తెగులు మొక్కలు ఎక్కువగా ఉంటే, వాటిని పీకి పొలానికి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. కాయతొలిచే మచ్చల పురుగు నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్, ఒక మిల్లీలీటర్లు డైక్లోరోవాస్ కలిపి పిచికారీ చేయాలి. చోడవరం : సుడిదోమ బెడద నుంచి వరి పంటను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. హుద్‌హుద్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో వరికి వివిధ చీడపీడలు ఆశించాయి. వేలాధి ఎకరాల్లో పంట నాశనమవుతోంది. దోమ కారణంగా పంట పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్న పంటను రక్షించుకునేందుకు నానా యాతన పడుతున్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచన మేరకు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. చోడవరం,మాడుగుల నియోజకవర్గాల్లో సుమారు 80వేల ఎకరాల్లో వరి సాగులో ఉంది. ఇందులో సుమారు 30వేల ఎకరాలకు దోమ సోకింది. పక్కపొలాలకు విస్తరిస్తోంది. ఆకుల ఆడుగు భాగాన ఆశించడంతో అవి ఎండిపోయి పంట మాడిపోతోంది. సందట్లో సడేమియాలా నివారణకు వినియోగించే మందుల్లో నకిలీలు ఉంటున్నాయి. కొన్ని రకాల మందులు పనిచేయడం లేదని వ్యవసాయాధికారులే చెబుతున్నప్పటికీ వాటి విక్రయాలను నిలిపివేయకపోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారు. పంటల పరిరక్షణకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఏడీ బి.మోహనరావు సూచించారు. వరిపంటను ఆవరించిన సుడిదోమ తెగుళు నివారణకు మోనోక్రోటోపాస్ రె ండు గ్రాములు, నివానోక్రాన్ ఒక గ్రాము కలిపి లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇలా కలిపిన ద్రావణాన్ని ఎకరాకు 200లీటరు మందును ఆకు తడిసే వరకు పిచికారీ చేయాలని సూచించారు. -
అల్ప‘పీడ’నం
జిల్లాలో రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నను దెబ్బతీశాయి. పంట చేతికొచ్చే సమయంలో అన్నదాత ఆశలను నీట ముంచాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం అంతా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వరి, మిరప పంట ఉత్పత్తులు తడిచిపోయాయి. మరోవైపు నిన్నటి వరకు ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: వర్షం కారణంగా కోవెలకుంట్ల - నంద్యాల ఆర్అండ్బీ రహదారిలో శుక్రవారం వాహనాల రాకపోకలు స్తంభించి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నంద్యాల, ఆళ్లగడ్డ రహదారుల్లో పట్టణ శివారులో, జోళదరాశి, రేవనూరు, భీమునిపాడు సమీపాల్లో కల్వర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయడంలో ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో పక్కనే ఉన్న పొలాల్లో వాహనాలు రాకపోకలు సాగించేవి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కోవెలకుంట్ల మండలంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. పొలాల్లోని దారి మొత్తం బురదమయంగా మారడంతో వాహనాలు ఇరుక్కుపోయాయి. నంద్యాల రహదారి స్తంభించిపోవడంతో ఆర్టీసీ అధికారులు లింగాల మీదుగా బస్సులను మళ్లించారు. ఆళ్లగడ్డ రహదారిలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. తర్వాత పొలాల రస్తాలో బురద ఆరిపోవడంతో రాకపోకలను పునరుద్ధరించారు. మిరపరైతు కన్నీరు పెద్దకడబూరు, న్యూస్‌లైన్: గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాలు మిరప రైతుకు కన్నీటిని మిగిల్చాయి. మండలంలో మిరప సాగు చేసిన రైతులు దిగుబడులను ఆర బెట్టుకున్నారు. ఆ సమయంలో వర్షం రావడంతో దిగుబడులు తడిసిపోయాయి. అసలే గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతులకు ఇది శాపంగా మారింది. వర్షంలో తడవడంతో క్వాలిటీ దెబ్బతింటోందని, దీంతో రేటు మరింత పడిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోసిగిలో భారీ వర్షం కోసిగి,న్యూస్‌లైన్: కోసిగిలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లాయి. కోసిగిలోని చింతలగేరి వీధి, కడపాళెం ఎస్సీ కాలనీ, ఆంజనేయ స్వామి, బీరప్ప దేవాలయాల ప్రాంతాల్లో కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారాయి. ఇళ్ల ఎదుట చెత్తా చెదారం పేరుకుపోయింది. బస్టాండ్ పరిసరాలు నీటిని నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. వర్షంతోపాటు గాలులు వీయడంతో దుద్ది గ్రామంలో చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో చిర్తనకల్లు, మూగలదొడ్డి గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిచిపోయింది. గ్రామ ప్రజలు రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టును తొలగించారు. పొంగిపొర్లిన వాగులు కోసిగిరూరల్, న్యూస్‌లైన్: గురువారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో వాహన దారులు, రైతులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డి.బెళగల్- పల్లెపాడుకు వెళ్లే వంక, కోసిగి నుంచి సజ్జలగుడ్డం వైపు వెళ్లే సజ్జలగుడ్డం వంక, కోసిగి నుంచి ఎల్లెల్సీ మెయిన్ కాలువకు వెళ్లే ప్రాంతంలోని ఈత వంకలు నీటి ప్రవాహంతో నిండిపోయాయి. కల్వర్టులపైన అడుగున్నర మేర నీళ్లు పారాయి. డి.బెళగల్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణం నీటి కుంటగా మారింది. చిన్నభూంపల్లి గ్రామంలోని నారాయణప్పతాత మఠం సమీపంలోని బీసీ కాలనీ వాసులు తమ ఇళ్లకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మునిగిన వరి రైతు మంత్రాలయం, న్యూస్‌లైన్: మండలంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో వరి పొలాలు నీట మునిగాయి. అప్పటికే కుప్పలుగా పోసిన ధాన్యం మొత్తం తడిసి ముద్దయ్యింది. పట్టణంలోని బస్టాండ్, తహశీల్దార్ కార్యాలయ పరిసరాలు నీటితో నిండిపోయాయి. వాన రాకతో మాధవరం, చెట్నెహళ్లి గ్రామాల్లో వరి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. మాధవ రానికి చెందిన రైతు నారాయణ వరికోతలు కోసి ధాన్యపు గడ్డిని పొలంలోనే ఉంచాడు. వర్షపునీటితో ఆ ధాన్యం తడిసిపోవడంతో దాదాపు రూ.40 వేలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోతున్నాడు. మాధవరం, కల్లుదేవకుంట, చెట్నెహళ్లి, రచ్చుమర్రి వాగులు పొంగిపొర్లాయి.